పాండే మావోయిస్టట! చంపడం ఒప్పట!

భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) అధికార ప్రతినిధి ఆజాద్ (చెరుకూరి రాజకుమార్) తో పాటు జూన్ 30న నాగపూర్ లో పోలీసుల చేత చిక్కి, హత్యకు గురయి, జూలై 2 తెల్లవారు జామున ఆదిలాబాద్ అడవుల్లో మృతదేహంగా తేలిన ఢిల్లీ జర్నలిస్టు హేమచంద్ర పాండే మావోయిస్టేనని తేల్చడానికి ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. హత్యనూ, ఎన్ కౌంటర్ కట్టుకథనూ సమర్థించుకోవడానికి మరిన్ని కట్టుకథలు ప్రచారంలోకి వస్తున్నాయి.

ఆ ఎన్ కౌంటర్ ఘటన మీద శాఖాపరమైన విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం హేమచంద్ర పాండే సహచరి బబిత ఇచ్చిన చిరునామా ప్రకారం ఇల్లు వెతుకుతూ వెళ్లి, ఆ చిరునామా తప్పు అని తెలుసుకుని, మరింత పరిశోధన చేసి అసలు ఇల్లు కనుక్కుందట. ఆ ఇంటి తాళం బద్దలుకొడితే అక్కడ ఒక బైనాక్యులర్, కేంద్ర కమిటీ సభ్యుల ఉత్తరాలు, విప్లవ సాహిత్యం, కంప్యూటర్, లాప్ టాప్, ఫాక్స్ మెషిన్ వంటి సామాన్లు దొరికాయట. అందువల్ల హేమచంద్ర పాండే మావోయిస్టేనని స్పష్టమయిందట. రెండు రోజులుగా ఈ వార్తను పోలీసులు అనేక విధాలుగా ప్రకటిస్తున్నారు.

ఎన్ కౌంటర్ ఘటన నిజమా అబద్ధమా అని తేల్చవలసిన దర్యాప్తు అధికారులు హతుడి జీవిత వివరాలు ఎందుకు దర్యాప్తు చేయవలసి వచ్చింది? తప్పు చిరునామా ఇచ్చిందని చెప్పడం ద్వారా ఒక స్త్రీపట్ల, అదీ సహచరుడిని కోల్పోయి దుఃఖంలో ఉన్న స్త్రీపట్ల, ఏ అభిప్రాయం కల్పించాలని పోలీసులు కోరుకుంటున్నారు? హతుడు నివసించిన ఇంటి తలుపులు, కుటుంబ సభ్యులు పక్కన లేనప్పుడు, ఎందుకు బద్దలు కొట్టవలసి వచ్చింది? జర్నలిస్టు ఇంట్లో పుస్తకాలు ఉండడం ఎప్పటినుంచి నేరంగా పరిగణిస్తున్నారు? ఎన్ కౌంటర్ నిజమా అబద్ధమా అని తేల్చడానికీ, హతుడు మావోయిస్టా కాదా తేల్చడానికీ సంబంధం ఏమిటి? హేమచంద్ర పాండే జర్నలిస్టు కాదనీ మావోయిస్టేననీ తేల్చినంతమాత్రాన ఆయనను చంపడానికి పోలీసులకు లైసెన్స్ దొరుకుతుందా? ఇవన్నీ సాంకేతికమైన ప్రశ్నలుగా ధ్వనించవచ్చు గాని అసలు దర్యాప్తు పేరు మీద ఈ వ్యవహారమంతా ఎందుకు జరుగుతున్నదో అర్థం చేసుకోవలసి ఉంది.

ఆజాద్, పాండేల ‘ఎన్ కౌంటర్’ గురించి పోలీసుల కట్టుకథలోని లొసుగులు బయటపడుతున్నప్పుడు, “సరిగ్గా పరిశోధిస్తే ఇది సోహ్రాబుద్దీన్ కేసు కన్న బలమైన కేసు అవుతుంది” అని హైదరాబాదు లోని ఒక సీనియర్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు అన్నారు. సోహ్రాబుద్దీన్ – కౌసర్ బీ లను బూటకపు ఎన్ కౌంటర్ లో హత్య చేసిన కేసులో నేరస్తులు బోను ఎక్కవలసి వచ్చింది. చట్టబద్ధ పాలన మీద పట్టింపు గల గీతా జోహ్రీ వంటి విచారణాధికారుల వల్ల సిబిఐ విచారణ జరిగింది. డిఐజి వంజారా తో సహా కొందరు పోలీసు అధికారులను, చివరికి గుజరాత్ హోం మంత్రి అమిత్ షాను హత్యా నేరం కింద అరెస్టు చేయడం జరిగింది.

నిజంగానే సోహ్రాబుద్దీన్ – కౌసర్ బీ విషయంలో కన్నా ఆజాద్ – పాండేల విషయంలో అది బూటకపు ఎన్ కౌంటర్ అనడానికి ఎక్కువ ఆధారాలు ఉన్నాయి. ఆజాద్, పాండేలను నాగపూర్ లో అరెస్టు చేసి ఉంటారనడానికి స్పష్టమైన సందర్భ సాక్ష్యం ఉంది. ఆరోజు ఆజాద్ గాని, పాండే గాని ఆదిలాబాద్ జిల్లా వాంకిడి అడవుల్లోకి వచ్చి ఉండే అవకాశం లేదనే ఆధారం ఉంది. ఆ ప్రాంతంలో నిజంగా ఎదురుకాల్పులు జరిగి ఉంటే పోలీసుల కన్న మావోయిస్టులకే ఎక్కువ ప్రాదేశిక సానుకూలత ఉందని, అందువల్ల వాళ్లకన్న పోలీసులకే ఎక్కువ నష్టం జరిగి ఉండేదని తెలుస్తోంది. ఎదురుకాల్పులు జరిగాయని చెపుతున్న స్థలంలోనూ, పరిసర గ్రామాలలోనూ ఆ మాట అబద్ధమని చెప్పే సాక్ష్యాలున్నాయి. పోలీసు కథనంలోని పొంతనలేని, అసమంజసమైన, అనుమానాస్పదమైన వాదనలే ఆ కథనపు అబద్ధాన్ని రుజువు చేస్తున్నాయి.

చిట్టచివరికి ఆజాద్ మృతదేహపు పోస్ట్ మార్టం నివేదిక రెండు తిరుగులేని సాక్ష్యాలను సమకూర్చింది. చీకట్లో దూరాన ఉన్న నక్సలైట్లు తమ మీద కాల్పులు జరపగా ఆత్మరక్షణార్థం తాము కాల్పులు జరిపి, మర్నాడు ఉదయం వెతికితే రెండు మృతదేహాలు కనిపించాయని పోలీసులు చెపుతుండగా, శవం మీద కాల్పుల గాయం ఏడున్నర సెంటీమీటర్ల కన్న తక్కువ దూరం నుంచి కాల్చగా ఏర్పడిందేనని పోస్ట్ మార్టం నివేదిక చెప్పింది. తాము కొండకిందినుంచి కాల్చామని, నక్సలైట్లు కొండమీద ఉన్నారని పోలీసుల కథనం చెపుతుండగా, మృతదేహంలో బుల్లెట్ మాత్రం ప్రవేశించిన స్థలం నుంచి దిగువకు ప్రయాణించి రెండు అంగుళాల కింద బయటికి వచ్చిందని పోస్ట్ మార్టం నివేదిక చెప్పింది. “ఈ పోలీసుల బుల్లెట్ కింది నుంచి పైకి కాలిస్తే, పైనుంచి కిందికి దిగి గురుత్వాకర్షణ శక్తిని జయించినట్టుంది” అని నిజనిర్ధారణ బృందం సభ్యుడు, ప్రముఖ ఆర్థికశాస్త్రవేత్త అమిత్ భాదురి వ్యంగ్యంగా అన్నారు!

మావోయిస్టులు, వారి సానుభూతిపరులు మాత్రమే కాదు, స్వామి అగ్నివేష్, అరుంధతీ రాయ్ ల నుంచి మమతా బెనర్జీ దాకా ఎందరో కోరినట్టుగా నిష్పాక్షికమైన, సక్రమమైన న్యాయవిచారణ జరిపితే ఆజాద్ – పాండేలది బూటకపు ఎన్ కౌంటర్ అని కచ్చితంగా తేలిపోతుంది. 1969 నుంచీ ఇప్పటిదాకా నాలుగు వేల మంది విప్లవ కార్యకర్తలను, సాధారణ ప్రజలను చట్టవిరుద్ధంగా చంపి, ఎన్ కౌంటర్ కట్టుకథలు అల్లిన, అన్ని రకాల న్యాయవిచారణలను అడ్డుకున్న మన రాష్ట్రపు వంజారాలకు, అమిత్ షాలకు, కేరళ లక్ష్మణన్ లాగ బూటకపు ఎన్ కౌంటర్ కు నలభై ఏళ్ల తర్వాతయినా శిక్ష పొందగల పోలీసు అధికారులకు ఒకానొక బెదురు కలిగే అవకాశం వస్తుంది. అందువల్లనే ఈ కేసు విచారణకు ఆటంకాలు కల్పించడానికి, పక్కదారి పట్టించడానికి, అసలంటూ విచారణ జరపవలసి వచ్చినా సాక్ష్యాధారాలకు మసిపూసి మారేడుకాయచేసి మాయం చేయడానికి పెద్దఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఈ ప్రయత్నాలలో భాగంగానే అప్పటి డిజిపి ఒకటికి రెండు సార్లు అది నిజమైన ఎన్ కౌంటరేనని అన్నారు. తనకు సంబంధంలేని, తాను జోక్యం చేసుకోనవసరం లేని విషయం మీద వ్యాఖ్యానిస్తూ రాష్ట్ర గవర్నర్ అది నిజమైన ఎన్ కౌంటరే అన్నారు. కొత్త డిజిపి ‘అక్కడ ఏం జరిగిందో మీరూ చూడలేదు, నేనూ చూడలేదు’ అంటూనే అది నిజమైన ఎన్ కౌంటర్ అని చెప్పేశారు. శవపరీక్ష జరిపిన వైద్య నిపుణులు ఇచ్చిన నివేదికను ఖండిస్తూ మరొక నివేదికను తయారు చేసి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఢిల్లీలో విడుదల చేశారు. ‘అది నిజమైన ఎన్ కౌంటరే’ అని ప్రజాభిప్రాయాన్ని తయారు చేయడానికి ఒకపక్క ఇన్నిరకాలుగా ప్రయత్నిస్తూనే, మరొకపక్క శాఖాపరమైన దర్యాప్తు కోసం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ దర్యాప్తు ఎలా ఉండబోతోందో ఢిల్లీలో పాండే ఇంటి సోదా ద్వారా సూచన వస్తోంది. నేరం చేసినవారికే దర్యాప్తుచేసే, విచారణ జరిపే, తీర్పు చెప్పే అధికారం ఇవ్వడం మధ్యయుగాల న్యాయసూత్రమని, దానికి భిన్నంగా ఆధునిక యుగంలో అధికారాల విభజన తయారయిందని కూడ ఏలినవారు మరచిపోయినట్టున్నారు.

ఇప్పుడు హేమచంద్ర పాండే ఇంట్లో ఏవేవో జప్తు చేశామని చెప్పడం ఈ ప్రయత్నాలలో భాగమే. అక్కడ దొరికాయని చెపుతున్నవన్నీ ఆ ఇంట్లో ఉన్నవేనో, అక్కడికి వెళ్లిన పోలీసులే పెట్టినవో తేల్చిచెప్పే స్వతంత్ర పరిశీలకులు లేరు. ఆ సోదా, జప్తు అనేవి ఇంటి వాళ్ల ముందర జరగలేదు. ఆ సోదా పత్రం మీద అంగీకారంగా ఇంటివాళ్ల సంతకం లేదు. అజ్ఞాత నాయకుల ఉత్తరాలు మినహా మిగిలిన పుస్తకాలు, కంప్యూటర్, లాప్ టాప్, ఫాక్స్ మెషిన్ వంటివన్నీ జర్నలిస్టుల ఇళ్లలో ఉండేవే. పోలీసులు చెపుతున్నవన్నీ నిజంగానే ఆయన ఇంట్లో దొరికాయనీ, పెద్ద ఎత్తున నిషిద్ధ సాహిత్యం దొరికిందనీ, అందువల్ల ఆయన మావోయిస్టని రుజువవుతున్నదనీ అనుకున్నా, అది ఒక నిషిద్ధ సంస్థకు సహకరించిన నేరం మాత్రమే అవుతుంది. దానికి అరెస్టు చేసి విచారణ జరపవచ్చు. రుజువయితే చట్టప్రకారమే మూడు సంవత్సరాలకు మించి జైలు శిక్ష లేదు. మరణ శిక్ష అసలే లేదు. మరి, ఎన్ కౌంటర్ అనే విచారణ లేని మరణశిక్ష విధించే, మామూలు మాటల్లో చెప్పాలంటే హత్య చేసే, అధికారం పోలీసులకు ఎక్కడినుంచి వచ్చింది? హేమచంద్ర పాండే మావోయిస్టేనని రుజువు చేసినంత మాత్రాన ఆయనను చంపడం సక్రమమవుతుందా?

జర్నలిస్టు గులాం రసూల్ ను చంపి, సాక్షిని మాయం చేయడం కోసం ఆయన పక్కన ఉన్న విజయప్రసాదరావును కూడ చంపి, ఎన్ కౌంటర్ కథ అల్లిన రాష్ట్రం మనది. ఆ హత్య మీద పాత్రికేయుల నుంచి పెద్దఎత్తున నిరసన చెలరేగితే, ప్రభుత్వం జస్టిస్ టి ఎల్ ఎన్ రెడ్డి న్యాయవిచారణ కమిషన్ వేసింది. గులాం రసూల్ నక్సలైటా కాదా తేల్చడం ఆ విచారణాంశాలలో ఒకటిగా చేర్చారు. ఆ ఎన్ కౌంటర్ పూర్తిగా పోలీసులు చెప్పినట్టే జరిగిందనీ, గులాం రసూల్, విజయప్రసాద రావు ఇద్దరూ నక్సలైట్లేననీ ఆ కమిషన్ తేల్చింది. ఆ నివేదిక మీద ‘న్యాయమూ లేదు, విచారణా లేదు – రెండోసారి రసూల్ హత్య’ అని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్, ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం కలిసి విమర్శను ప్రకటించాయి. ఇరవై సంవత్సరాలు గడిచినా అదే పరిస్థితి కొనసాగుతోంది. న్యాయమూ లేదు, విచారణా లేదు – హతులు మళ్లీ మళ్లీ హత్యకు గురవుతూనే ఉన్నారు.

 

 

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Andhra Jyothy, వ్యాసాలు. Bookmark the permalink.

4 Responses to పాండే మావోయిస్టట! చంపడం ఒప్పట!

 1. Rakesh says:

  chala mandiki teliyani Nizalu bayata pettaru.. alane puttaparti satya sai baba meeda kuda oka post rayandi.. rashtrapathi kuda akkadiki velladamento protocals pakkana pettadamento.. BTW youtube lo saibaba gari video lu chudandi post ki chala baga panikostay.. notlonchi lingam tiyyadam.. chetilo vibudhi puttinchadam.. ennenno magic lu ela chesaro clear ga chuipicharu…

 2. Sravya Vattikuti says:

  బాగుంది మీ బాధ ని చక్కగా వ్యక్తపరిచారు .

  కాని నాకొక విషయం అర్ధం కాదు పాండే లాంటి ప్రాణాలకి మావో సానుభూతి పరుల ప్రాణాలకి తప్ప , మావో ల చేతి లో ప్రాణాలు కోల్పోయిన పోలీసులు, వాళ్ళ కుటుంబసభ్యులు , ఇంకా మామూలు సామాన్య జనాల ప్రాణాలంటే మీకెందుకు విలువుండదు . ఆయా సమయాల్లో మీ గొంతులు సడెన్ గా ఎందుకు మూగపోతాయి . కనీసం ఒక్క సానుభూతి మాట కూడా రాదెందుకు ? పాండే గారి సహచరి గారి లాగ వాళ్ళ కుటుంబ సభ్యులు గుండె కోత మీకెందుకు పట్టదు . మీలాంటి వాళ్ళు మీ రాయగలిగే శక్తిని , ఆ రాతల ద్వారా జన్నాన్ని ఉద్రేకపరచే శక్తి ఎందుకు కేవలం ఒక గ్రూప్ ని సపోర్ట్ చేయటానికి వాడతారు ?

 3. gajula says:

  pande emi karma Repu vattikooti sravyanu maoistani champinaa e samaajamlo maatlaade vaallu evaroo vundaremo….vokka meeru thappa ..

 4. Sravya Vattikuti says:

  ఆహా గాజుల గారు బాగా చెప్పారు . నన్ను చంపినా మాట్లాడమని నేను ఏడవను కాని కొద్ది గా మీ జాగ్రత్త చూసుకోండి .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s