కథలో ఒదిగిన కొత్తతరం జీవన దృశ్యాలు

కథావార్షిక 2009 సింహావలోకనం

ఎన్ వేణుగోపాల్

‘మధురాంతకం రాజారాం సాహిత్య సంస్థ’ పది సంవత్సరాలుగా సాగిస్తున్న వార్షిక కృషిలో భాగంగా 2009లో వెలువడిన కథలనుంచి ఎంపిక చేసిన కథల సంకలనం ఇది. గత కొన్ని సంవత్సరాలుగా ఇలా ఆ సంవత్సరంలో ఎంపిక చేసిన కథలను ఒకచోట సంకలనం చేస్తూ, మొత్తంగా ఆ సంవత్సరపు కథల గురించి ‘సింహావలోకనం’ రూపంలో ఒకరితోనో, చర్చగా ఇద్దరు ముగ్గురితోనో విశ్లేషణను కూడ జతచేస్తున్నారు. ఈ సంవత్సరం అలా ‘సింహావలోకనం’ రాసే పనిని నాకు అప్పగించినందుకు ప్రచురణకర్తలకు ధన్యవాదాలు. అయితే ఇక్కడ నేను చేయబోయే పనికి ఉన్నపరిమితుల గురించి ముందే చెప్పుకోవాలి.

ఒక సంవత్సరం వెలువడిన కథలను, ప్రత్యేకించి తెలుగు కథలను, సింహావలోకనం చేయడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి.

ఒకటి, వాసికి సంబంధించిన ఇబ్బంది. తెలుగులో కథా ప్రక్రియ చాలా విస్తరిస్తూ ఉన్న, లోతు పెరుగుతూ ఉన్న ప్రక్రియ. జీవనదృశ్యాల చిత్రణ, జీవిత సత్యాల ఆవిష్కరణ, జీవితాకాంక్షల స్ఫురణ, జీవన వైఫల్యాల గ్రహింపు, జీవన విశ్లేషణలు, జీవితాచరణల వివరణ అద్భుతంగా సాగుతున్న ప్రక్రియలలో కథ అగ్రభాగాన ఉంది. ఎప్పటికప్పుడు కొత్త కథకులు, కొత్త ఇతివృత్తాలు, కొత్త కథన పద్ధతులు, కొత్త నుడికారం వంటి అనేక వినూత్న అంశాలతో ఈ ప్రక్రియ విస్తరిస్తోంది. ఈ విస్తృతినంతా గ్రహించడం, ఆ గ్రహించినదాన్ని విశ్లేషించి  ఒక వ్యాసంలో ఇమడ్చడం ఎవరికైనా కష్టసాధ్యమైన పని.

రెండు, రాశికి సంబంధించిన ఇబ్బంది. తెలుగులో ప్రతి ఏటా కనీసం పన్నెండు వందల నుంచి పదిహేను వందల దాకా కథలు అచ్చవుతున్నాయని ఒక అంచనా. వీటన్నిటినీ చదివి గుణదోషాలు ఎంచి సింహావలోకనం చేయడం కథల మీద ఎంత అభిమానం ఉన్నా, తీరిక ఉన్నా ఏ ఒక్కరికైనా సాధ్యమవుతుందని తోచదు. కనుక ఈ వ్యాసానికి భారీగా సింహావలోకనం అని పేరు పెట్టుకున్నప్పటికీ, ఇది ఈ చదువరి చదవగలిగిన దాదాపు పదోవంతు  కథల మీద ఆధారపడి చేస్తున్న కొన్ని ప్రతిపాదనలు మాత్రమే అవుతాయి గాని, విహంగ వీక్షణమే అవుతుంది గాని నిజమైన అర్థంలో సింహావలోకనం కాజాలదు. ఈ విహంగ వీక్షణంలోని ప్రతిపాదనలకు ప్రధానమైన మినహాయింపులూ ఉండవచ్చు. ఈ ప్రతిపాదనలను బలోపేతం చేసే ఉదాహరణలు కూడ ఉండవచ్చు.

అట్లాగే మరొక వివరణ కూడ ఇవ్వాలి: ఒక సంవత్సరంలో వెలువడిన కథలు అని మన పరిశీలనా సౌలభ్యం కోసం చెప్పుకుంటున్నాము గాని నిరంతర ధారగా ఉండే సమాజ సాహిత్య ప్రవాహంలో ఒక సంవత్సరాన్ని వేరుచేయడం సాధ్యమేనా అనే ప్రశ్న ఉండనే ఉంటుంది. ఆ సంవత్సరంలో జరిగిన సంఘటనలను, పరిణామాలను గాని, వాటి ప్రతిఫలనంగా వచ్చిన సాహిత్యాన్ని గాని, ఆ సాహిత్యంలోని గుణదోషాలను గాని చర్చించడం సంపూర్ణంగా సాధ్యం కాదనిపిస్తుంది. ఎప్పుడో జరిగిన సామాజిక ఇతివృత్తం, సామూహిక, వయ్యక్తిక జ్ఞాపకం ఈ సంవత్సరం కథలో రావచ్చు. లేదా అప్పటికప్పుడు కథారచయితనో, చుట్టూ ఉన్న సమాజాన్నో ఉద్రేక పరచిన సందర్భం ఈ సంవత్సరం కథలో రావచ్చు. కథారచయిత మనసులో దశాబ్దాలుగానో, సంవత్సరాలుగానో సుళ్లు తిరుగుతున్న తాత్విక ఆలోచనా ధార నుంచి ఒక సన్నివేశం రూపు కట్టవచ్చు. దానికి ఈ సంవత్సరం అనే కాల పరిమితి ఉండకపోవచ్చు. అందువల్ల కాల్పనిక రచనలకు కాలాన్ని అన్వయించడం స్థూలంగానే జరుగుతుంది తప్ప సూక్ష్మస్థాయిలో అది సాధ్యం కాదనిపిస్తుంది. కొన్ని ఇతివృత్తాలు ఒక నిర్దిష్టకాలంలో తప్ప జరగడానికి వీలులేనివిగా ఉంటాయి, మరికొన్ని ఇతివృత్తాలు ఏ కాలంలోనయినా జరగడానికి సంభావ్యత ఉన్నవవుతాయి. బహుశా సాహిత్యం సార్వకాలికం అని అన్నప్పుడు ఆ ఇతివృత్తపు సంభావ్యత విస్తృతమైనదనడానికి సూచికే కావచ్చు.

ఈ చర్చ ఎందుకంటే 2009 కథను సింహావలోకనం చేసేటప్పుడు అసలు 2009 కథ అని ప్రత్యేకంగా చెప్పగల కథ ఏది? 2009లో అచ్చయిన కథ అనా, 2009 అనే కాలాన్ని ప్రతిఫలించిన కథ అనా? పాత్రలు 2009లో అనుభవించిన జీవితాన్ని చిత్రించిన కథ అనా? 2009లో రచయితల సాధారణ ఆలోచనా ధోరణులను చిత్రించిన కథ అనా? అన్నీ కావచ్చు, ఏ ఒకటో కావచ్చు. స్పష్టంగా చెప్పలేం. 2009లో జరిగిన ఒక ఘటనకు చాల దీర్ఘకాలిక చారిత్రక ప్రాధాన్యత వచ్చి, దాని మీద ఏ పది సంవత్సరాల తర్వాతనో ఒక కథ వెలువడితే అది 2009 కథ అవుతుందా, 2019 కథ అవుతుందా?

అలాగే ఈ సింహావలోకనానికి ఒక తాత్విక సమస్య కూడ ఉంది. ఏదయినా ఒక స్థూల నిర్ధారణకు పరిమితులు, మినహాయింపులు ఉంటాయి. సాధారణీకరణలకు భిన్నమైన నిర్దిష్టతలు, ప్రత్యేకతలు  ఎక్కడయినా ఉంటాయి. అసాధారణమైన సంక్లిష్టతలు, విశిష్టతలు, అంతరాలు ఉన్న మన సమాజంలో ఇవి మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మామూలుగా శాస్త్ర విషయాలలో ఒక ప్రతిపాదన, నిర్ధారణ చేసేటప్పుడు, దానికి భిన్నంగా ఉండే దృష్టాంతాలను అది ఎలా వివరించగలుగుతుంది అని చర్చిస్తారు. ఎప్పుడైనా ఒక నిర్ధారణ సంభావ్యత దానికి భిన్నమైన ఉదాహరణలను అది ఎంత శక్తిమంతంగా, ఆమోదయోగ్యంగా వివరించగలుగుతుంది అనేదానిమీదనే ఆధారపడుతుంది. నూటికి 99 ఉదాహరణలు ఈ పరికల్పనను సమర్థిస్తున్నాయి గనుక ఈ నిర్ధారణ సరయినదే అనడంలో ఘనత ఏమీ లేదు, భిన్నంగా ఉన్న ఒకేఒక్క ఉదాహరణ ఎందుకలా ఉన్నదో చెప్పడంలోనే సైద్ధాంతిక పటుత్వం రుజువవుతుంది. ఒక సంవత్సరపు తెలుగు కథలను తీసుకుని కొన్ని సాధారణీకరణలు, నిర్ధారణలు చేయబోతే, ఆ నిర్ధారణలకు భిన్నమైన దృష్టాంతాలను ఏమి చేయగలం అనేది పెద్ద ప్రశ్న. తెలుగు సమాజ సాహిత్యాల వంటి విస్తారమైన క్షేత్రం, అద్భుతమైన చలనశీలత ఉన్న చోట తప్పనిసరిగా భిన్నమైన దృష్టాంతాలు ఎన్నో ఉంటాయి. కనుక ఇక్కడి నిర్ధారణలకు మినహాయింపులు ఉండే అవకాశమే ఈ వ్యాసానికి ఉన్న పరిమితి.

ఈ పరిమితులూ ప్రశ్నలూ ఉన్నప్పటికీ, 2009 జనవరి నుంచి డిసెంబర్ దాకా పత్రికలలోనూ, సంకలనాలలోనూ అచ్చయిన ఓ వంద కథల దాకా చదివి, అది మొత్తం రాశి స్వభావాన్ని పట్టి ఇవ్వగలిగిన మెతుకే, తగిన ప్రాతినిధ్య నమూనానే అనుకుని ఆ సంవత్సరం కథల సాధారణ స్వభావాలను గ్రహించడానికి ప్రయత్నిస్తున్నాను.

ఈ ముందస్తు వివరణలతో మొదట 2009లో తెలుగు సమాజంలో కనిపిస్తున్న దృశ్యంలోకి వెళ్లదలిచాను. ఆ దృశ్యాన్ని పట్టుకోవడానికి, ప్రతిఫలించడానికి, విశ్లేషించడానికి, మన అవగాహనలను ఉన్నతీకరించడానికి కథలు ఎంత ప్రయత్నించాయో వివరించడానికి ప్రయత్నించదలిచాను.

**

కాల్పనిక సాహిత్యం స్థూలంగా మనుషుల మీద, మనుషుల మధ్య సంబంధాల మీద, ఆ సంబంధాల మార్పుల మీద, ఆ సంబంధాలవల్ల కలిగే ఉద్వేగాల మీద ఆధారపడుతుంది. అందువల్ల మనుషులు ఏయే అనుభవాలకు లోనయ్యారో తెలుసుకోవడం, ఆయా అనుభవాలు కాల్పనిక సాహిత్యంలోకి ప్రవహించాయా లేదా తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. 2009లో తెలుగు సమాజం అనుభవించిన ఆనంద విషాదాలు అసంఖ్యాకంగా ఉండి ఉంటాయి. వాటిలో కొన్ని అంతకు చాల ముందు నుంచి సాగుతున్నవి కావచ్చు. శతాబ్దాలుగానో, దశాబ్దాలుగానో సాగుతూ సాంస్కృతిక చిహ్నాలుగానో, సామాజిక రుగ్మతలుగానో బలపడిపోయిన అంశాలు కావచ్చు. వర్తమానం మీద అసంతృప్తి వల్ల ఆ సాంస్కృతిక చిహ్నానికి నిన్నటివరకూ లేని గౌరవం, ప్రాచుర్యం వచ్చి ఉండవచ్చు. ఆ సామాజిక రుగ్మతల చిహ్నాలు కొన్ని హఠాత్తుగా 2009లో బయటపడి ఉండవచ్చు. లేదా 2009లోనే తెలుగు సమాజం కొత్తగా ఆ ఆనందాన్నో, విషాదాన్నో అనుభవించి ఉండవచ్చు. లేదా అంతకుముందు నుంచీ తెలిసిన సామాజిక వ్యవహారమే ఈ సంవత్సరం ప్రాధాన్యత సంతరించుకుని ఉండవచ్చు. ఎన్నాళ్లనుంచో నలుగుతున్నదే అయినా కథగా మలచాలని రచయితకు ఇప్పుడే అనిపించి ఉండవచ్చు.

ఆయా పరిణామాల గురించి వివరాలు ఇక్కడ అవసరం లేదుగాని, కథలలోకి వెళ్లేముందు, కనీసం ఆ సామాజిక పరిణామాల జాబితా అయినా చెప్పుకోవడం అవసరం. తెలుగు సమాజంలోనే లేచి నిలిచి, ఎన్నో మధ్యతరగతి కుటుంబాలకు ఒక ఆదర్శంగా కనబడిన సత్యం కంప్యూటర్ అనే సంస్థ ఒక పెద్ద కుంభకోణం అనీ, అబద్ధాల, అక్రమాల పుట్ట అనీ తెలుసుకోవడంతో ఈ సంవత్సరం ప్రారంభమయింది. గత పదిహేను సంవత్సరాలకు పైగా ఆ సంస్థకు మన ప్రచార సాధనాలలో, ప్రభుత్వంలో, సామాజిక జీవనంలో దొరికిన ప్రాధాన్యతను బట్టి చూస్తే ఈ కుంభకోణం తెలుగు సమాజాన్ని ఒక పెద్ద కుదుపు కుదిపిన దిగ్భ్రాంతి. అలాగే ఈ సంవత్సరం ఎన్నికలు జరిగి రాజకీయ సమీకరణాలు సంపూర్ణంగా మారిపోయాయి. అంతకు ముందరి ఎన్నికలలో మిత్రులుగా ఉన్నవాళ్లు ప్రత్యర్థులుగా మారిపోయారు. ఆ క్రమంలోనే ఈ సంవత్సరం తెలుగుసీమలో ప్రాంతీయ ఉద్యమాల ఉధృతి కనబడింది. రాష్ట్ర విభజనను కోరిన తెలంగాణ నుంచి, తమ తమ ప్రాంతాలకు కూడ సమస్యలున్నాయని గుర్తించి ఎత్తిచూపిన రాయలసీమ, ఉత్తరాంధ్ర, పల్నాడుల దాకా మొత్తానికి తెలుగు సమాజం భౌగోళికంగా కూడ ఒకటిగా లేదనే ఆలోచనలు పైకి వచ్చాయి.

ధరల పెరుగుదల, అవినీతి, ప్రత్యేకించి జలయజ్ఞం పేరిట సాగిన అవినీతి, ప్రైవేటీకరణ, సహకార వ్యవసాయం, ఖనిజ దొంగల ముఠాల అక్రమాలు, పాలనలో అస్తవ్యస్తత, అధికార వర్గాల అక్రమాలు వంటి సమస్యలు యథాతథంగా ఉన్నాయి. కుల అణచివేత, అసమానతలు, పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, విద్యా వైద్య అవకాశాలు అందనంత ఎత్తుకు ఎగిరిపోవడం వంటి సమస్యలు అలాగే ఉన్నాయి. డబ్బు ప్రాధాన్యత పెరిగిపోయి అన్ని మానవసంబంధాలూ డబ్బు చుట్టూనే తిరగడం మరింతగా పెరిగింది. పర్యావరణ సమస్యలు, మంచినీటి కొరత, సాగునీటి కొరత, కాలుష్యం, రవాణా సౌకర్యాల కొరత, విద్యుత్ రంగ సమస్యలు, వర్షాలు, వరదలు, జాతీయ ఉపాధి హామీ పథకంతో రైతులకూ కూలీలకూ మధ్య అనవసర వైరుధ్యం వంటి సమస్యలూ పెరిగాయి. అట్టడుగు అభాగ్యుల జీవితం మరింత దుర్బరమయింది. ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు, చదువు ఒత్తిడితో ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు, ప్రేమ పేరుతో అమ్మాయిల మీద హింస, హత్యలు, మొత్తంగా అశాంతి పెరిగాయి. సమాజం అంతకంతకూ ఎక్కువగా నేరమయం, హింసాపూరితం కావడం మొదలయింది.

ఇవన్నీ పాత సమస్యలే అనుకున్నా పాలకవిధానాలవల్ల మొదలయిన, పెరిగిపోయిన కొత్త సమస్యలు కొన్ని ఉన్నాయి. అభివృద్ధి పేరు మీద పాలకులు తీసుకువస్తున్న పథకాలు, నిర్మాణాలు, ప్రతిపాదనలు నిజమైన అభివృద్ధిని సాధిస్తాయో లేదో, సాధిస్తే ఎప్పటికి సాధిస్తాయో, ఆ అభివృద్ధి బాధితుల దాకా అందుతుందో లేదో తెలియదు గాని ఈ లోగా చాల విధ్వంసం జరిగిపోతోంది.  పెద్ద ఎత్తున ప్రజల విస్థాపన జరుగుతోంది. ప్రజలు తమ భూములనుంచీ, జీవనోపాధులనుంచీ తొలగించబడి పొట్ట చేత పట్టుకుని కాందిశీకులై వెళ్లవలసి వస్తోంది. ఈ క్రమంలో వేలాది మంది మరణిస్తున్నారు, లక్షలాది మంది బతుకులు దిగజారుతున్నాయి. ఈ దుస్థితి దేశవ్యాప్తమయినది కాగా ప్రత్యేకించి తెలుగుసీమలో ఇది విస్తృతంగా సాగింది. ప్రత్యేక ఆర్థిక మండలాలు, కోస్తా కారిడార్, ఓడరేవులు, విద్యుదుత్పత్తి కేంద్రాలు, గనులు, పరిశ్రమల పేరుతో భూఆక్రమణ, రోడ్ల విస్తరణ వంటి అనేక రూపాలలో ఈ విస్థాపన జరిగింది. పాలకవిధానాల వల్ల రగుల్కొంటున్న ప్రజా అసంతృప్తి అనేక రూపాలలో వ్యక్తమయింది. అది వ్యవస్థను కూలదోయదలచిన ప్రత్యామ్నాయ ప్రజా ఉద్యమ రూపం కావచ్చు. లేదా రిజర్వేషన్ల వర్గీకరణ వంటి వ్యవస్థలోనే దొరికే అవకాశాలలో తమ వాటా తమకు దక్కాలనే ఆకాంక్ష రూపంలో కావచ్చు. పాలకులు మరింత మెరుగైన పాలన ఇస్తే చాలుననే కనీస ఆకాంక్ష రూపంలో కావచ్చు.

తెలుగు సమాజంలోనే ఉత్తర కొసన ఉన్న ఆదివాసి సమూహాలలో, వారి పొరుగున ఉన్న రాష్ట్రాల ఆదివాసి సమూహాలలో విప్లవోద్యమ ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల, ఆ నేలలోనే ఉన్న ఖనిజ వనరులను బహుళజాతిసంస్థలకు కట్టబెట్టాలని పాలకులు కంకణం కట్టుకున్నందువల్ల ఆపరేషన్ గ్రీన్ హంట్ అనే దాడి మొదలయింది. అది ఆదివాసి సమూహాలను అల్లకల్లోలానికి గురిచేసింది. అట్లాగే లాల్ ఘడ్ ఆదివాసుల పోరాటాలు, దేశవ్యాప్తంగా సెజ్ వ్యతిరేక ఆందోళనలు, భోపాల్ తీర్పు, శ్రీలంకలో సింహళ జాత్యహంకారాన్ని ఎదిరిస్తూ తమిళ ఈలం ప్రజలు చేసిన పోరాటాలు, వైఫల్యం వంటి ఇతర, సుదూర ప్రజా సమూహాలు అనుభవించిన సమస్యలతో కూడ తెలుగు సమాజం ఏదో ఒక స్థాయిలో సహానుభూతి పొందింది.

2009 అనే ఆ సంవత్సరానికి మొదటా చివరా ఉన్న ఘటనలు చూస్తే తెలుగు సమాజపు ఉత్థానపతనాలు, ఐక్యతా ఘర్షణలు అర్థమవుతాయి. తమ కంపెనీలో ఇంతకాలంగా ప్రకటిస్తూ వచ్చిన అంకెలు అబద్ధపు అంకెలనీ, ఏడువేల కోట్ల రూపాయల పైన అంకెల గారడీ జరిపామనీ జనవరి 7న సత్యం కంప్యూటర్ అధిపతి రామలింగరాజు చేసిన ప్రకటనతో ప్రారంభమైన సంవత్సరం రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రారంభమవుతున్నదని డిసెంబర్ 9న, ఆ నిర్ణయాన్ని వాయిదా వేసి విస్తృత సమాలోచనలు జరపవలసి ఉన్నదని డిసెంబర్ 23న కేంద్రప్రభుత్వం చేసిన ప్రకటనలతో, ఆ తర్వాతి ఉద్రిక్తతలతో ముగిసింది. అంటే ఆ సంవత్సరం, పదిహేను సంవత్సరాలకు పైగా బలపడుతున్న బుడగ పేలిపోవడంతో మొదలై, యాభైనాలుగు సంవత్సరాల ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తూ ముగిసిందన్నమాట. ఈ మధ్యలో జరిగిన ఘటనలూ, పరిణామాలూ, అవి తెలుగు సమాజం మీదా, సాహిత్యం మీదా, సాహిత్యకారుల మీదా చూపిన ప్రభావాలూ చాల లోతయినవి.

ఇంత సంక్లిష్టమైన, సంక్షుభితమైన సామాజిక వర్తమానం అందులో భాగమైన  మనుషులనూ వాళ్ల మధ్య సంబంధాలనూ తప్పనిసరిగా అతలాకుతలం చేస్తుంది. ఈ వర్తమానానికన్న ముందరి మనుషులూ తర్వాతి మనుషులూ ఒకరు కాదు. వారి మధ్య సంబంధాలు యథాతథంగా ఉండడానికి అవకాశాలు తక్కువ. ఈ కల్లోల భరితమైన జీవితమే కాల్పనిక సాహిత్యానికి గొప్ప ముడిసరుకును అందజేస్తుంది. అందువల్ల నేరుగా ఈ ఘటనలలో, పరిణామాలలో ఏదో ఒకదాన్ని తీసుకుని రాసిన కథలూ ఉన్నాయి, ఒకటి రెండు పరస్పరాధారిత పరిణామాల మీద రాసినవీ ఉన్నాయి. పైన వివరించిన అన్ని పరిణామాలూ కనీసం సూచన మాత్రంగానైనా తెలుగు కథలోకి ప్రవహించాయి.

**

ఈ కాలపు కథలలో నేను చదవగలిగిన కొన్ని డజన్ల కథలను బట్టి అర్థమవుతున్నదేమంటే ఈ కథలు స్థూలంగా మనుషులలోనూ, మానవసంబంధాలలోనూ వస్తున్న మార్పుల గురించి; గత కాలపు మానవసంబంధాల ఉదాత్తతకు సంబంధించిన పురాస్మృతుల గురించి; సామాజిక దురన్యాయాల గురించి; అభివృద్ధి పేరిట జరుగుతున్న ప్రజల విస్థాపన గురించి;  సాగుతున్న అవ్యవస్థను అధిగమించి మనుషులు ఒక కొత్త ప్రత్యామ్నాయ వ్యవస్థను నెలకొల్పుకుంటారనే ఆశ గురించి;  ఇంతవరకూ సాహిత్యంలోకి ఎక్కని కొత్త జీవన రంగాల, జీవన దృశ్యాల గురించి; ప్రత్యక్షంగా సమకాలీన ఘటనల గురించి ప్రస్తావించకపోయినా ఆ పునాదిపైననే దీర్ఘకాలిక అమూర్త భావనల గురించి మాట్లాడుతున్నాయి.

మొట్టమొదట మనుషులలో మార్పుల గురించి కథలు ఎందుకు మాట్లాడతాయి? ఇన్నివేల ఏళ్ళుగా చూస్తున్నా, అనుభవిస్తున్నా, అనేకానేక తాత్విక విశ్లేషణలు చేసుకున్నా మనిషికి ఇంకా అర్థం కాని విషయం మనిషిలో మార్పు. పైగా మార్పు అనేదొక్కటే మారనిది. అందువల్ల దాని గురించి తెలుసుకోవాలనీ, దాని అంతు కనుక్కోవాలనీ, వీలయితే దాన్ని నడిపే సూత్రాలు తెలుసుకుని ఆ మార్పును తమకు అనుకూలంగా మార్చుకోవాలనీ మనుషులు వేల సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నారు. సాహిత్యంలో, కళలలో జరిగే ప్రయత్నంలో అత్యధిక భాగం ఈ మనుషుల మార్పు రహస్యపు అన్వేషణే.

అసలు మనుషులు ఎందుకు మారతారు? మార్పంటే ఏమిటి? వయసు పెరగడమా, స్థలం మారడమా, జీవిక మారడమా, ఆరోగ్యం మారడమా – ఇవన్నీ మార్పులే కాని, వీటితో కలగలిసిన, వీటిని మించిన మార్పు మనిషికి తన గురించీ, ఇతరుల గురించీ ఉండే అభిప్రాయాలలో మార్పు రావడం. ఈ మార్పు బలవత్తరమైన సామాజిక పరిణామాలవల్ల జరుగుతుంది. తాత్విక దృష్టికోణం మారడం వల్ల జరుగుతుంది. మానవసంబంధాలలోని మార్పులవల్ల జరుగుతుంది. అప్పటిదాకా తానే సమాజాన్ని నడుపుతున్నాననీ, అన్నదాతననీ, తన సృజనాత్మక, శారీరక కృషి వల్లనే సమాజానికి అన్నం పెడుతున్నాననీ అనుకునే వ్యవసాయదారు హఠాత్తుగా తన శ్రమకూ, సృజనకూ, అసలు తన భూమికీ విలువే లేదనీ, తాను ఇతరుల దయాదాక్షిణ్యాలమీద ఆధారపడి ఉన్నాననీ, అసలు తన బతుకే వ్యర్థమనీ అనుకునే మార్పు. అప్పటిదాకా తానే తన తల్లిదండ్రుల కంటిపాపననీ, ఇంటి మహాలక్ష్మిననీ, వారసుడిననీ అనుకునే మనిషి హఠాత్తుగా తన బతుకుకు విలువా సార్థకతా లేవనీ మరణం తప్ప గత్యంతరం లేదనీ అనుకునే మార్పు. అప్పటిదాకా ఒకరిని విడిచి ఒకరు ఉండలేమనీ, ప్రపంచంలోకెల్లా అత్యంత అన్యోన్యమైన జంట తమదేననీ అనుకునే ఇద్దరు మనుషులు ఒకరినొకరు బద్ధ శత్రువులుగా, అవతలి మనిషిని రద్దు చేయడమే ఏకైక పరిష్కారంగా భావించే మార్పు. అప్పటిదాకా ఆదానప్రదానాలతో ఒకటిగా ఉన్న ఊరు హఠాత్తుగా రెండుగా చీలి కత్తులూ కటార్లూ బరిసెలూ బాంబులూ పట్టుకుని అవతలి మనిషిని తుడిచిపెట్టే క్రౌర్యాన్ని ధరించే మార్పు. ఇంతటి మార్పు ఎలా వస్తుంది?

మనుషులు మారడమంటే వారి దృక్పథాలు మారడం మాత్రమే కాదు, అదే సమస్తమయితే ఎవరంతట వారు మారిన దృక్పథాన్ని పట్టుకుని తమతమ నెలవులలో ఉండిపోవచ్చు. కాని మనిషి ప్రధానంగా సంఘజీవి. ఇతర మనుషులతో సంబంధంవల్లనే మనుషులు వ్యక్తమవుతారు, వ్యక్తులు అవుతారు. అంటే మనిషిలో మార్పు తప్పనిసరిగా మానవసంబంధాలలో మార్పుగా వ్యక్తమవుతుంది. మానవసంబంధాలలో మార్పులతోనే మనుషులలో మార్పును గుర్తించగలుగుతాం. ఇలా మనుషులలో జరుగుతున్న మార్పులను, మానవసంబంధాలలో వ్యక్తమవుతున్న మార్పులను చిత్రించిన, వివరించిన కథలు ఈ సంవత్సరం ఎన్నో ఉన్నాయి.

ఈ కథలలోని మనుషులు ఎక్కువభాగం పాతమనుషులే గాని మారుతున్న కాలం వల్ల రూపొందుతున్న ఒక కొత్త జీవనశకలానికి ప్రతినిధులు. ఆ జీవనశకలం మన సమాజంలో నూతన ఆర్థిక విధానాలతో పుట్టుకొచ్చిన కొత్త మధ్య తరగతి. సాఫ్ట్ వేర్, మేనేజిమెంట్ ఉద్యోగాలు, అమెరికాకూ ఇతర దేశాలకూ పెద్ద ఎత్తున వలసలు, రియల్ ఎస్టేట్ రంగానికి అదివరకెన్నడూ లేనంత ప్రాధాన్యత, వ్యవసాయ భూములను వ్యవసాయేతర వినియోగానికి బదిలీ చేయడం, తద్వారా వ్యవసాయం మీద ఆధారపడిన జీవితాలకు నిలువనీడ లేకుండా పోవడం, జీవితంలో డబ్బు పాత్ర విపరీతంగా పెరిగిపోవడం, డబ్బే మానవ సంబంధాలను శాసిస్తూ ఉండడం, విద్యారంగంలో వ్యాపారధోరణులు పెరిగిపోవడం, స్త్రీపురుష సంబంధం, కులాల మధ్య సంబంధం కొత్త ఘర్షణలను చవిచూస్తూ ఉండడం ఈ కొత్త మధ్య తరగతి అనుభవిస్తున్న పరిణామాలు. ఈ పరిణామాలన్నిటికీ మూలం ఈ కొత్త మధ్యతరగతి పుట్టుకురావడానికి కారణమూ ప్రోద్బలమూ అయిన కొత్త పాలనా విధానాలలో, గత రెండు దశాబ్దాలుగా సాగుతున్న ప్రపంచీకరణ విధానాలలో, సాఫ్ట్ వేర్ రంగంలో, కొత్త సాంకేతిక పరిజ్ఞానంలో, కొత్త విలువలలో ఉన్నదని కూడ అనుకోవచ్చు.

ప్రపంచీకరణకూ కొత్త సాంకేతిక పరిజ్ఞానాలకూ మధ్య సన్నిహిత సంబంధం ఉంది. సరిగ్గా ప్రపంచీకరణ క్రమం ప్రారంభమయినప్పుడే ఆ సాంకేతిక పరిజ్ఞానాల ప్రాధాన్యతా పెరిగింది, ఆ సాంకేతిక పరిజ్ఞానం వల్ల ప్రపంచీకరణ విస్తరణా సులభమయింది. అందులో భాగంగా తామరతంపరగా పుట్టుకొచ్చిన ఇంజనీరింగ్, టెక్నాలజీ, మేనేజిమెంట్ కాలేజీలలో చదివి, అమెరికాకు వెళ్లి డాలర్లు సంపాదించడం ఈ కొత్త మధ్యతరగతి యువతరానికి లక్ష్యంగా మారింది. అమెరికా కాకపోతే యూరప్, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా దేశాలయినా సరే. పది పన్నెండు కాలేజీలు ఉన్నప్పుడు ఆ చదువు చదవడానికీ, ఆరువందలకు పైగా కాలేజీలు ఉన్నపుడు ఆ చదువు చదవడానికీ తేడా ఉంది. ఇప్పుడు ఆ చదువు చదవడం సులభం. ఆ చదువు చూపి డాలర్లు సంపాదించడం సులభం. ఒక డాలర్ కు భారత రూపాయల్లో లెక్కవేసినపుడు నలభై రెట్లో, యాభై రెట్లో విలువ ఉండడం అసలు ఆకర్షణ.

ఈ పరిణామాన్ని మరొక మాటల్లో చెప్పాలంటే, మొత్తంగా సమాజంలోకీ, మానవజీవితంలోకీ తక్కువ శ్రమతోనూ, సులభంగానూ ఎక్కువ ఆదాయాన్ని సంపాదించగల ఒక కొత్త వర్గం ప్రవేశించింది. అలాగే శ్రమకూ, ఆ శ్రమ చేసే మనిషికీ విలువ తగ్గడం ఒకవైపూ, డబ్బుకూ, డబ్బు తెచ్చే విలాసాలకూ, డబ్బు కూడబెట్టడానికీ విలువ పెరగడం మరొకవైపూ ఉండే కొత్త విలువల చట్రం కూడ ప్రవేశించింది. మన దేశపు మధ్యతరగతిలో బ్రిటిష్ వ్యతిరేక జాతీయోద్యమ కాలం నుంచీ అప్పటిదాకా కొనసాగుతుండిన విలువల చట్రం మారిపోవడం ప్రారంభమయింది. త్యాగం స్థానాన్ని స్వార్థం, సమాజ శ్రేయస్సు స్థానాన్ని వ్యక్తిగత ప్రయోజనం, నిరాడంబరత్వం స్థానాన్ని బహిరంగ ప్రదర్శన ఆక్రమించాయి. పొదుపు స్థానాన్ని విచ్చలవిడి ఖర్చు, భోగలాలస ఆక్రమించాయి. అవసరమైన వస్తువులు కొనడానికైనా ఒకటికి రెండు సార్లు ఆలోచించే మధ్యతరగతి మానసిక స్థితి తరిగిపోతూ, అవసరం ఉన్నా లేకపోయినా సరుకులు కొనడం ప్రవేశించింది. నిజానికి మనుషులు తమ ఉపయోగం కోసం సరుకులు కొనడం తగ్గిపోయి, సరుకులు తమ మారకం కోసం మనుషులచేత కొనిపించుకోవడం ప్రారంభించాయి. మార్కెటేతర, సహజ మానవసంబంధాలను తోసిరాజని మార్కెట్ సంబంధాలు విస్తరించాయి. ‘సరుకుల ఆరాధన’ అని మార్క్స్ చేసిన సూత్రీకరణ నిజానికి ఆయన అది ప్రతిపాదించిన 1860లలో ఎంత నిజమో గాని, ప్రపంచీకరణ దశలో ఇవాళ అక్షర సత్యంగా మారిపోయింది. ఈ మధ్యతరగతిలో మారుతున్న విలువలకు ఉన్న దర్శనీయత వల్ల, ప్రాచుర్యం వల్ల, ప్రచారసాధనాలలో స్థానం వల్ల ఈ విలువలే అనుసరణీయమైనవనే ఆలోచనలూ పెరుగుతున్నాయి.

సమాజంలో, మార్కెట్ లో ఈ మార్పులు జరుగుతున్నాయంటే అవి కేవలం సరుకుల్లోనో, అమ్మకాలలోనో, కొనుగోళ్లలోనో మాత్రమే జరగడంలేదు. మనుషుల్లో జరుగుతున్నాయన్నమాట, మనసుల్లో జరుగుతున్నాయన్నమాట. మానవసంబంధాల్లో జరుగుతున్నాయన్నమాట. మనుషులు రక్తమాంసాల, ఉద్వేగాల, మానవసంబంధాల మనుషులుగా ఉండగూడదని, కేవలం కొనుగోలుదార్లుగా, అమ్మకందార్లుగా మాత్రమే ఉండాలని మార్కెట్ కోరుకుంటుంది, శాసిస్తుంది, మారుస్తుంది. మారనివాళ్లను తొక్కేయడానికి ప్రయత్నిస్తుంది. మార్కెట్ మౌలికంగా మానవతకు, సంఘజీవితం అనే మానవసారానికి వ్యతిరేకమయినది.

అందుకే సాఫ్ట్ వేర్ ఉద్యోగుల పైన ఒత్తిడి గురించి మాట్లాడిన ముదిగంటి సుజాతారెడ్డి ‘మరో మార్క్స్ పుట్టాలె’ “ఆధునిక మానేజిమెంట్ లో మానవ మనోభావాలకు స్థానం లేదు మరి!… పని! పని! పని ఏవిధంగా ఆగకూడదు. రాక్షసత్వానికి మరో పేరు పని సంస్కృతి” అంటుంది. సత్యం కంప్యూటర్ కుంభకోణం గురించి పరోక్ష ప్రస్తావనతో “పాడు కంపెనీ! – ఆ పాడు కంపెనీ మునిగిన కాన్నుంచి అన్ని కంపెనీలల్ల పని గంటలెక్కువయినయి! అందరికి టెన్షన్ పెరిగింది. సాఫ్ట్ వేర్ అంటె ఉన్న గౌరవం తగ్గింది” అని ప్రధాన పాత్ర రమ అనుకుంటుంది. “ఈ సాఫ్ట్ వేర్ కార్మికుల కష్టాలు ఎవరు తీరుస్తారు! వాళ్ల పనిగంటల గురించి ఎవరు నిరసనలు, నిరశన వ్రతాలు చేయడం లేదు. ఎందుకింత నిశ్శబ్దంగా శోషణను, దోపిడీని భరిస్తున్నారు వాళ్లు. ఎవరైనా మరో మార్క్స్ వంటివాడు వస్తే తప్ప వాళ్ల కష్టాలు, శ్రమ దోపిడులు, అన్యాయాలు తీరవా? ఆ మరో మార్క్స్ వచ్చేదెప్పుడు?” అని నిట్టూరుస్తుంది ఆ పాత్ర.

ఇంత అమానుషమైన మార్కెట్ అన్ని రంగాలలోకీ విస్తరిస్తోంది. తన భావజాలాన్ని ప్రవేశపెడుతోంది. అది సమాజ గమనానికి అత్యవసరమైన, ఉదాత్తంగా ఉండవలసిన విద్యారంగంలోకి కూడ ప్రవేశిస్తే ఏం జరుగుతుందో ఇప్పటికే చాల అనుభవాలూ విశ్లేషణలూ ఉన్నాయి. ఇప్పటికే వందలాది మంది ముక్కుపచ్చలారని పిల్లలు తమ ఆత్మహత్యలతో ఈ విద్యావ్యాపార దుర్మార్గాన్ని వేనోళ్ల చాటారు.  “ఇంజనీరింగ్ చదివి కేంపస్ సెలక్షన్ తో ఉద్యోగంలో చేరి, కంపెనీ వాళ్లు పంపిస్తే విదేశం ఎగిరిపోయి, లేదూ విదేశాల్లో ఎం ఎస్ చేసి అక్కడే ఉద్యోగం సంపాదించేసుకుని డబ్బులు దండిగా సంపాదిస్తున్నవాళ్లే యువతకి అరాధ్య దైవాలుగా మారిపోయినవేళ – విద్య వ్యాపార వస్తువుగా మారిపోవడానికి ప్రభుత్వాలు చక్కగా సహకరిస్తున్నవేళ, ఆటపాటల్ని, పిల్లల్లో సృజనాత్మకతని తొక్కిపెట్టి వాళ్లని వస్తు ప్రపంచంవైపు తల్లిదండ్రులు తరుముతున్నవేళ – ఈ బలహీనతల్ని సొమ్ము చేసుకోవడంలో కార్పొరేట్ కళాశాలలు కొత్త పుంతలు తొక్కుతున్నవేళ ఒక సగటు తండ్రి రామారావుకథ విందాం రండి” అంటూ అనిసెట్టి శ్రీధర్ ‘గద్దలు’ ఈ కార్పొరేట్ విద్యావ్యాపార గండభేరుండాల రెక్కలచప్పుడు ఎంత భీకరంగా ఉన్నదో చూపింది.

మానవ సంబంధాలలో వస్తున్న ఈ కొత్త, దుస్సహమైన, అమానవీయమైన పరిణామాలను చూసే భావుకులలో సహజంగానే తాము గతంలో అనుభవించిన, తమకు తెలిసిన ఉదాత్త మానవ సంబంధాల గురించిన జ్ఞాపకాలు మెదులుతాయి. ఈ పురాస్మృతులు నిజానికి వెనుకచూపు కాదు, అది వర్తమానం మీద ఒక నిరసన. గతం ఆగతమవుతుందా అనే ఆకాంక్ష. నిజానికి 2009 కథల్లో ఎక్కువ భాగం ఈ పురాస్మృతి ఇతివృత్తంతో ఉన్నాయి. వర్తమానం ఎంత దుస్సహంగా ఉంటే గత జ్ఞాపకం అంత ఎక్కువగా ఉంటుందని చాల మంది విశ్లేషకులు ఇప్పటికే చెప్పి ఉన్నారు. పారిశ్రామిక విప్లవం తొలిరోజుల్లో ఆ వర్తమానం మీద అసహనంతో గ్రామీణ నైసర్గిక సౌందర్యం గురించీ, ప్రకృతిలోకి నిర్గమనం గురించీ, పరవశంతో గానం చేసిన వాళ్లున్నారు. ఆ కాల్పనిక సాహిత్య, తాత్విక ధోరణులలోనైనా ఏ కొంచెమైనా అభివృద్ధి నిరోధక ఛాయ ఉన్నదేమో గాని, ఇవాళ్టి తెలుగు కథకుల పురాస్మృతి పూర్తిగా వర్తమానం మీద నిరసన మాత్రమే.

తండ్రి మరణం తర్వాత కొడుకు ఆలోచనలతో నడిచిన పి. రామకృష్ణ ‘పరిష్వంగం’ లో ప్రధాన పాత్ర “ఇప్పుడందరూ ఎవరిదారిన వాళ్లు వెళ్లిపోయాక, ఏడ్పులూ ఓదార్పులూ ఉపశమించాక నాయన లేడన్నది స్పృహలోకొస్తోందేమో! ఏడ్చేటప్పటికన్నా ఆగిన తర్వాత జ్ఞాపకంగా ఉండేదే ఎక్కువ విషాదమేమో! ఏడ్పుకు నోరుంటుంది. విషాదానికి నోరుండదు. అందువల్ల ఇంకా బరువుగా, బాధాకరంగా వుంటుందా? నలభై ఏళ్ళుగా తనకు ఉండిన నాయన, ఇక కనిపించని వొట్టి జ్ఞాపకం!” అని ఈ పురాస్మృతిలోని సాంద్రతను ప్రకటిస్తాడు. తండ్రీబిడ్డల బంధంలోని ఆప్యాయతను, పుత్రగాత్ర పరిష్వంగ అనుభూతిని చాల హృద్యంగా చెప్పిన ఈ కథ నిజానికి గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్ అనిపించడానికి కాదు, ఆ ఆత్మీయ బంధాలు ఏమయిపోయాయి, ఎందుకు పోయాయి అని ఆలోచనకు దారి తీస్తుంది.

పురాస్మృతిలో మరొక ముఖ్యమైన అంశం గడిచిపోయిన సమాజం గురించి కొత్త అవగాహన కలగడం. క్రయోజెనిక్ బూస్టర్ ఇంజన్ల పనితీరును పరిశోధించే అత్యాధునిక వ్యోమ శాస్త్రవేత్త హఠాత్తుగా ఒక శిథిలాలయ ఆవరణలో తన తాత తండ్రుల కుమ్మరి వృత్తిని గుర్తు తెచ్చుకుంటాడు రామా చంద్రమౌళి ‘నిరంతరమూ అనంతమూ…’లో. తానూ కుమ్మరి అయిపోతాడు. తన సహచరి, స్పేస్ సైంటిస్ట్ లీల ఒక పురాతన సాలె స్త్రీలా పడుగు పోస్తూ కనబడుతుంది. “తాము జీవిస్తున్న జీవితం పూర్తిగా తమకు నచ్చింది కాదు…తమకు చెంది, తాము జీవించలేకపోతున్న జీవితం ఇంకేదో ఎక్కడో ఉంది. ఆ వెలితిని పూరించేందుకు…ఆత్మలోని ఆ ఖాళీని, వెలితిని పూరించేందుకు…” ఇది మనిషి మూలాలలోకి ప్రయాణం. ఇటీవలి కథలో, కవితలో చాల ఎక్కువగా కనబడుతున్న పురాస్మృతి వైపు పయనమిది. “కాపు మనిషినై పుట్టి మొగుడి పొలంలో  వంగమొక్కలకూ,  మిరపమొక్కలకూ దోహదం చేస్తే” బాగుండునని మధురవాణి అనుకున్నదీ ఈ మానసిక స్థితిలోనే.

పురాస్మృతికి మరొకకోణమే కనుమరుగవుతున్న, చెదిరిపోతున్న సాంస్కృతిక అస్తిత్వాన్ని గుర్తు తెచ్చుకోవడం. ఇవాళ్టి యువకులు మద్యపానం వంటి వ్యసనాలకు ఎలా బానిసలవుతున్నారో,  యువతులు వారిని పెళ్లిపీటల మీద ఎలా ఎదిరిస్తున్నారో చెప్పడం ప్రధాన ఇతివృత్తంగా ఉంటూనే పెళ్లికి సంబంధించిన ఒక ప్రత్యేక ప్రాంత, సామాజిక వర్గ ఆచార వ్యవహారాలను చిత్రించారు డా. వి ఆర్ రాసాని ‘తెల్ల గుర్రం’ కథలో. కథను ఒక కొసమెరుపుతో ముగించడం వంటి పాత కథన శైలిని పునరాలోచించవలసిందేమో అనే అసంతృప్తి ఉన్నప్పటికీ, సాంస్కృతిక అంశాల వివరణ, వర్ణన చాల అవసరమైన, ప్రశంసనీయమైన పద్ధతిలో సాగాయి.

మానవ సంబంధాలు సక్రమంగా లేని స్థితిని వ్యక్తీకరించడం అనే నాణానికి పురాస్మృతి ఒక ముఖమైతే, గత వర్తమానాల పోలిక మరొక ముఖం. బహుశా బయటి సమాజంలో తడి తగ్గిపోయినకొద్దీ కాల్పనిక సాహిత్యం ఆ తడి గురించి ఆలోచనలు పెంచుతూ, ఇవాళ తడి లేకపోవడాన్ని, నిన్ననో మొన్ననో తడి ఉండడంతో పోలుస్తూ ఉంటుందేమో. ఇది పోయినదాన్ని వెతుక్కోవడమూ, ఉన్నచోటినుంచి పలాయనమూ, గత వైభవ పునరన్వేషణా అన్నీ కావచ్చు. ప్రేమ వివాహంతో ఒకటయిన యువతీ యువకులు కొంతకాలపు గానుగెద్దు జీవితాన్ని అనుభవించిన తర్వాత తమ ఆప్త స్పర్శను కోల్పోతారా? చనువూ, సాన్నిహిత్యమూ ఆత్మీయతను పెంచే బదులు తగ్గిస్తాయా? ఇద్దరిమధ్యా అప్రకటిత యుద్ధం ఎందుకు మొదలవుతుంది? ఇద్దరిలో ఒకరో, ఇద్దరికిద్దరూనో “ఛ…వెధవ జీవితం. సుఖం, సంతోషం లేని జీవితం. ఇంత నిస్సారమైన బతుకు బతికే కంటే చస్తే మేలు” అని అనుకునే పరిస్థితి ఎందుకు వస్తుంది? “ఆ పద్మకు జీవితం రుచి తెలుసు. కాలం, జీవితం విలువైనవని తెలుసు. కాలంతోపాటు ప్రవహించటం తెలుసు. ఇప్పుడున్నది ఆ పద్మకాదు. తన పద్మ కానే కాదు” అని ఒకరూ, “అవును నరేంద్ర ఇదివరకటి నరేంద్ర కాదు. ఇప్పటి నరేంద్ర కొత్తగా వున్నాడు. ఏదో సినిమాలో మాదిరి, జానపద కథలో మాదిరి నరేంద్ర రూపంలోకి మరెవరో పరకాయ ప్రవేశం చేసినట్లే వుంది. తనకు తెలిసిన నరేంద్ర కానే కాదు” అని మరొకరూ అనుకునే స్థితి ఎందుకు వస్తుంది? పలమనేరు బాలాజీ ‘స్పర్శ’లో ఈ సమస్యపై వెలుగు ప్రసరించారు.

ఈ సమస్యనే వాడ్రేవు వీరలక్ష్మీదేవి ‘తెలుసుకొనవె! యువతా…’ లో మరొకవైపు నుంచి చూశారు. రెండు కథలూ మానవసంబంధాల ఉదాత్తతను ఆకాంక్షించేవే. ఒక కథ బహుశా కొత్త తరం సృష్టితో, కోల్పోయిన స్పర్శతో ఆ ఆత్మీయత పునరాగమిస్తుందని అనుకుంటే, మరొక కథ ఈ తరం తన అవగాహనలను మార్చుకోగలిగితే ఆ మార్పు సాధ్యమని చెపుతుంది. “ఉద్యోగం, స్నేహితులు, పార్టీలు అన్నీ అయ్యేకే నేను. నాకు అలా కాదు. నాకు మొదటి ప్రాధాన్యత తనే. నాకూ అవన్నీ ఉన్నాయి. అయినా సరే. నేనెలా తనని కోరుతున్నానో తనూ నన్ను అలా కోరుకోవద్దా? నాకర్థమయిందేమిటంటే తనకి నామీద ఆ ప్రేమ, అంత ప్రేమ లేదని…” అని సమీర అంటుంది. “సమీరకి ప్రేమంటే తెలీదు. ప్రేమ మాటల్లోకి వస్తే తేలికై పోతుంది. గుండెలోనే ఉండాలి. తనకి నామీద అటువంటి ప్రేమ లేదు” అని ప్రమోద్ నిట్టూరుస్తాడు. ఇది ప్రేమనూ ప్రేమ ప్రకటననూ సమానం చేసే ధోరణి. అందుకే కథ చెపుతున్న కనకాంబరం పూలమొక్క చివరికి “సమీరకు ప్రమోద్ ప్రేమ ఎప్పటికైనా తెలుస్తుందా? పోనీ ప్రమోద్ కి? గొడవంతా వాళ్ల భావ ప్రకటనల్లో ఉందని వాళ్లకేమిటి ఎంతో మందికి తెలీడం లేదు. కదా మరి. ఇన్నివేల రంగుల ఈ ప్రపంచంలో ఈ జీవితం అందుకే ఇంత మిస్టీరియస్. లేకపోతే యానిమేషన్ ఫిల్మ్ లా ఎంత రొటీన్!” అని ముగిస్తుంది.

మానవసంబంధాల దుస్థితి వల్ల వ్యక్తిగత స్థాయిలో కలిగే వేదనను చిత్రించే కథలు కొన్ని అయితే, ఆ దుస్థితే సామాజిక దురన్యాయాలకు దారి తీస్తున్నదని, లేదా కొనసాగుతున్న సామాజిక దురన్యాయాలను బలోపేతం చేస్తున్నదని గుర్తించి, చిత్రించి, వ్యవస్థమీద పాఠకుల అవగాహనను పెంచే కథలు మరికొన్ని.

దళిత క్రైస్తవ జీవిత నేపథ్యంలో పేదరికాన్నీ, ఆకలినీ ఒక చిన్నారి పాప ఎలా అనుభవిస్తుందో హృదయవిదారకంగా చిత్రించిన కథ డా. వినోదిని ‘బాలేదు…జెరమొచ్చింది!’ అనేక స్థాయిలలో వ్యవహరించే ఈ కథ చిన్న పిల్లల మనస్తత్వం దగ్గరినుంచి తల్లిదండ్రుల నిస్సహాయత దాకా, క్రైస్తవం నేర్పే ఔదార్యం, సోదరత్వం నుంచి ఆశలు ఈడేరని యువతి కోర్కెల వ్యక్తీకరణ దాకా ఎన్నెన్నో అంశాలను చాల బిగువుతో చిత్రించింది. వస్తుశిల్పాల ఐక్యతకు, తెలుగు కథారచయితల శిల్ప నైపుణ్యానికి నిదర్శనంగా ఈ సంవత్సరం నిలిచే పది పన్నెండు కథలలో ఇది ఒకటి.

ఇక ఇప్పటికే కథనశిల్పంలో చేయి తిరిగిన స్వామి వంటి రచయిత ఒక సామాజిక దురన్యాయాన్ని కథావస్తువుగా తీసుకుంటే, దానిలో వస్తువుకన్నా శిల్పానిది పైచేయి కావడంలో ఆశ్చర్యం లేదు. తెలుగు సీమలో విపరీతంగా జరిగిపోయిన రైతుల ఆత్మహత్య ఇతివృత్తంగా తీసుకుని, ఆ ఆత్మహత్య దగ్గర ప్రారంభించి ఒక సామాజిక అభూతకల్పనా కథగా సాగి ఎన్నెన్నో సామాజిక దురన్యాయాల గురించి చెప్పిన కథ స్వామి రాసిన ‘రంకె.’

చిన్నారి ఆడపిల్లలమీద అత్యాచారం జరపడం కన్న నీచమైన, హేయమైన నేరం మరొకటి ఉండదు. కాని అటువంటి నేరాలు మనచుట్టూ జరిగిపోతూనే ఉన్నాయి. డబ్బు, అధికారం ఉన్న పెద్ద ఇళ్లవాళ్లు అటువంటి నేరాలు చేసినప్పుడు అధికార యంత్రాంగం వారిని కాపాడడానికి ఎలా ప్రయత్నిస్తుందో, చట్టాన్ని ఎలా తారుమారు చేస్తుందో, ఎక్కడైనా ఒక అధికారి ఆ నేరస్తుల మీద చర్య తీసుకోవడానికి ప్రయత్నించినా ఆ ప్రయత్నం ఎట్లా విఫలమవుతుందో వివరిస్తుంది జి. వెంకటకృష్ణ కథ ‘క్రీడ.’

సమాజంలో సొంత ఆస్తి అనేది ఉన్ననాటినుంచీ, సామాజిక ఉత్పత్తి అయిన ఆస్తి కొందరి హక్కుభుక్తమయిన నాటినుంచీ, దొంగతనం అనేది ఉంది. ‘ఆస్తే దొంగతనం’ గనుక ఆ ఆస్తి మరొకరు చేజిక్కించుకుంటారేమో అని మరొకరి మీద దొంగతనాన్ని ఆపాదించడానికి, ఆరోపించడానికి ఆస్తిపరులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఇతివృత్తం రీత్యా కొంచెం పాతకథే అనిపించినా వేలమైళ్ల దూరం నుంచి వచ్చి, స్థాన బలం లేకుండా పనిచేస్తున్న కొత్త వలస కార్మికుల నేపథ్యంలో మధురాంతకం నరేంద్ర రాసిన ‘దొంగతనం’ ప్రధాన ఇతివృత్తానికి తగిన వాతావరణాన్ని, సున్నితమైన వాదనలను చిత్రించింది.

సమాజంలో స్త్రీ అనుభవిస్తున్న వివక్ష గురించి, ఆమెకు జరుగుతున్న అన్యాయం గురించి, ఎన్ని కథలు వచ్చినా ఇంకా చెప్పవలసింది మిగిలిపోతూనే ఉంటుంది. ఆ సమస్య అంత విస్తృతమైనదీ, అనంతమైనదీ గనుక దాదాపు ప్రతి ఒక్క అనుభవమూ విశిష్టతను సంతరించుకుని కొత్త కథ అవుతుంది. సుంకోజి దేవేంద్రాచారి ఒక ప్రత్యేక నిర్మాణతో రాసిన ‘వట్టిమనిషి’ కథ ‘తను ఆడమనిషి’, ‘తను ఇంటిమనిషి’, ‘తను వంటమనిషి’, ‘తను వట్టి మనిషి’ అనే నాలుగు అధ్యాయాలలో స్త్రీ సమస్యలు ఉన్న అనేక కోణాలను చిత్రించింది.

అలాగే కుల వివక్ష గురించి అవగాహన, చైతన్యం, కుల అణచివేతపట్ల వ్యతిరేకత, తరతరాలుగా అణచివేతకూ దోపిడీకీ గురయిన కులాలలో సంఘటిత కార్యాచరణ పెరుగుతున్న ప్రస్తుత వాతావరణంలో ఆ విషయాలు కథలలోకి రావడం చాల సహజం. అందుకే ఈ సంవత్సరం చాల కథలలో కుల ప్రస్తావనలు, కుల చైతన్యం, కుల వివక్షకు వ్యతిరేక వాదనలు ఉన్నాయి. అయితే ఇదంతా ఏకశిలా సదృశంగా ఒకే దిశగా ఉన్నదని చెప్పడానికి వీలులేదు. మన సమాజ సంక్లిష్టతకు అనుగుణంగానే ఈ సమస్య మీద ఉండగల అనేక అవగాహనలు కథలలోకి కూడ ప్రవహించాయి. మధురాంతకం నరేంద్ర కథ ‘న్యాయం’ ఈ దృక్పథాల మధ్య ఘర్షణను పట్టుకోవడానికి ప్రయత్నించింది. ఒక దృక్పథం సంక్షుభిత వర్తమానం కన్న గతమే బాగుందేమో అని తలపోస్తుంది. “అందుకే యీ వాచ్ మేను పనీ బేల్ దారీ కూలీల పనీ వొద్దు. గుట్టుగా వూర్లో కులవృత్తి చేసుకుందామని చిలక్కు చెప్పినట్టు చెప్పినా…” అంటుంది. మరొక దృక్పథం “ఆ పల్లె కొంపల్లో యెంతగా వొంగొంగి బతికినా గుణం లేదు…చాకలోళ్లు చాకలోళ్ళని కడగొట్టోళ్లుగా చూస్తారుగానీ నలుగురితో సమానంగా యెంచరు…” అంటుంది. రెండూ నిజమే, సమాజం సంధి దశలో ఉన్నప్పుడు, పాత సమాజపు నిచ్చెనమెట్ల ఆధిపత్య సంస్కృతి ఇంకా పూర్తిగా విచ్చిపోనప్పుడు ఈ విచికిత్స తప్పదు.

ఒక అణచివేతను గుర్తించి తొలగించడానికి ప్రయత్నిస్తున్న వాళ్లు మరొక అణచివేత పట్ల మౌనంగానో, తామే దాన్ని అమలుచేస్తూనో ఎలా ఉండగలరు? ఇది హేతురహితమని అనిపిస్తుంది గాని, మన సమాజంలో ఇది సాధ్యమేనని ఎన్నో ఉదాహరణలున్నాయి. ఒక అణచివేత పట్ల వ్యతిరేకత మొత్తం అన్ని అణచివేతల పట్ల వ్యతిరేకత కానక్కరలేదు. మన సామాజిక స్థితిలోని ఈ విషాద వాస్తవాన్ని స్కైబాబ కథ ‘ఓడిందెవరు?’ చిత్రించింది. ప్రాంతీయత పునాదిగా సాగే కొత్త ఆకాంక్షలకు, కులం పునాదిగా ఎప్పటినుంచో ఉన్న కరుడుగట్టిన ఆధిపత్య, అంతరాల భావాలకు పోటీవస్తే ఏం జరుగుతుందో, కుల అసమానత ప్రభావం మన సమాజం మీద ఇంకా ఎంత బలంగా ఉన్నదో, అది ఉధృతమైన తెలంగాణ ప్రాంతీయ ఆకాంక్షల్ని కూడ ఎలా తోసి రాజనగలుగుతుందో ఈ కథ చూపింది.

అలాగే మన సమాజంలో ఎక్కడికి వెళ్లినా సార్వత్రికంగా కనబడే కులం గురించి, దాని వాస్తవికత గురించీ, దానిపట్ల అవగాహనల గురించీ పసునూరి రవీందర్ రాసిన ‘వేరెవర్ యూ గో’ కథ కొద్దిగా అతిశయోక్తిలో సాగినట్టనిపిస్తుంది గాని, ఒక్కొక్కసారి ఇలా కొరడాతో చరిచినట్టు చెప్పవలసిన కఠిన వాస్తవాల పట్ల పాఠకుల దృష్టిని మరల్చడానికి ఇటువంటి కథనశైలి తప్పదేమో. ఆ మాట ఒప్పుకుంటూనే స్త్రీ శరీరాన్ని సరుకుగా చూసే భావజాల పునాది ఉన్న దళిత్ మిస్ వరల్డ్ కావాలనే ఆలోచనను ఈ కథ ప్రోత్సహించడం ఆశ్చర్యకరమనిపిస్తుంది. “నాలో ఆలోచన మొదలైంది. అందాలపోటీలా..? దళితులకా? కనీసం మనిషిగా చూడని లోకంలో అందాల పోటీల కలలెలా వస్తాయి? అవమానాలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు తప్ప ఇక్కడ మాకేం మిగిలిందని? లోపలెక్కడో నా మనసు మూగగా రోదించింది” అని దళిత చైతన్యం ఉన్న పాత్ర అనడం తప్పనిసరిగా అతిశయోక్తి మాత్రమే కాక, ఒక కొసన ఉన్న తప్పును సవరించే క్రమంలో మరొక కొసకు చేరడం అని చెప్పకతప్పదు.

ఇక ఈ సంవత్సరం కథలలో ఎక్కువభాగాన్ని ఆక్రమించినవి అభివృద్ధి పేరిట జరుగుతున్న ప్రజల విస్థాపన గురించిన కథలు. అభివృద్ధి అంటే ఏమిటనే చర్చ చాల కాలంగా జరుగుతున్న అవసరమైన చర్చ. ఏ మనుషుల అభివృద్ధి పేరుతో పథకాలు వస్తున్నాయో, ఆ పథకాలు ఆ మనుషుల జీవనాన్నీ, జీవనోపాధినీ కొల్లగొడుతుంటే ఇక అభివృద్ధికి అర్థం ఏమిటి, మనుషులను ఏమార్చేది అభివృద్ధా, వారి జీవన ప్రమాణాన్ని పెంచేది అభివృద్ధా, అసలు జీవన ప్రమాణాన్ని పెంచడమంటే కూడ ఏమిటి, నిత్యజీవితావసరాల కొరత లేకుండా చూసి ఆ తర్వాత విజ్ఞాన, వినోద అవసరాలు తీర్చడమా, లేక బహుళజాతిసంస్థల సరుకుల వినియోగదారులుగా మార్చడమా లాంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఈ సంవత్సరం తెలుగు సమాజంలోకి ఈ అభివృద్ధి చర్చ పెద్ద ఎత్తునే వచ్చింది గనుక అనివార్యంగా కథలు కూడ ఈ చర్చకు చోటు కల్పించక తప్పలేదు.

“డబ్బు… డబ్బుంటే అభివృద్ధి ఉంటుంది. డబ్బు కావాలంటే కొండలేంటి… నదులేంటి… సముద్రాలేంటి… పాతాళంలో ఉన్న గనుల్ని కూడా తవ్విపారేయాల్సిందే… తవ్వుతాం… చెట్ల గురించీ పిట్టల గురించీ… పాముల గురించీ ఆలోచిస్తూ కూర్చుంటే అభివృద్ధి ఉండదు. మీలా దరిద్రుల్లా ఉంటాం. దాన్నించి బయటపడండి. డబ్బు గురించి ఆలోచించండి… బాగుపడతారు” అని ప్రభు రాసిన ‘నాగులకొండ’ కథలో గని యజమాని పాత్ర అంటుంది.

“అయినా ఈ రోడ్డు సైడు ఎంత డెవలప్పయిపోయిందిరా… అల్లటు పాండవుల మెట్ట సెంటరు కాణ్నించి ఇల్లిటు రాజానగరం వరకూ యేడన్నా కాసింత జాగా మిగిలిందా… నా సిన్నప్పుడు చాగల్నాట్లో అంబలి తాగిన రోజులు తెల్సు… మీకసలు తెల్నే తెల్దు. యిప్పుడు? రొండు వింజనీరింగ్ కాలేజీలు… కోళ్ల ఫారాలు… కరెంటు ఫాక్టరీ… అట్టల ఫాక్టరీ… నూని మిల్లు… ఒకటేటి?… ఈ ఏడీబీ రోడ్డంతా డెవలప్మెంటే… డెవలప్మెంటు” అన్న సుబ్బరాజు ఇవాళ ప్రచలితంగా ఉన్న అభివృద్ధి భావనను ప్రతిధ్వనిస్తాడు. అభివృద్ధంటే మనుషుల జీవితాలలో మెరుగుదల కాదు, మిరుమిట్లు గొలిపే, కంటికి కనబడే నిర్మాణాలూ చిహ్నాలూ – అంతే. అయినా రోజూ తన చుట్టూ చూస్తున్న మనుషుల బతుకులలో మెరుగుదల కాదు గదా విధ్వంసం చూస్తున్నాడు గనుక, “డెవలప్మెంటు” గురించి అంత చెప్పీ, ఆ వరుసలోనే “కలికాలం కాపోతే ఏటంటావ్…” అంటాడు. అది డెవలప్మెంటో కలికాలమో తేల్చుకోలేకపోయినా ఆ పనిలో భాగమయినందుకు “నీలాంటోడు ఊరికొక్కడుంటే మనదేశం అమెరికా అయిపోదయ్యా” అని గని యజమానుల ప్రశంస కూడ పొందుతాడు.

ఖనిజాల కోసం భూములపై జరుగుతున్న దాడిని, ఆ క్రమంలో కేవలం భూమిపై మాత్రమే కాక, మనుషులమీద, వారి నమ్మకాల వ్యవస్థమీద, సామూహిక జీవనం మీద పాలకవర్గాలు, సంపన్నవర్గాలు చేస్తున్న దాడిని చిత్రించిన నాగులకొండ ఈ సంవత్సరపు మంచి కథలలో ఒకటి.

రాష్ట్రంలో గ్రామీణ ప్రజల విస్థాపన సమస్యను పెచ్చరిల్లజేసిన పరిణామం పేరు సెజ్ – స్పెషల్ ఎకనామిక్ జోన్ – ప్రత్యేక ఆర్థిక మండలం. రాష్ట్రంలో ఏర్పాటయిన, ఏర్పడనున్న వందకు పైగా సెజ్ ల వల్ల కనీసం నాలుగైదు వందల గ్రామాలు, అంటే కనీసం మూడు నాలుగు లక్షల మంది ప్రజలు ప్రభావితమై ఉంటారు. వీరిలో కొందరి జీవితాలు పూర్తిగా ధ్వంసమై పోయి ఉంటాయి. కొందరి జీవితాలలో అనూహ్యమైన, గణనీయమైన మార్పులు వచ్చి ఉంటాయి. కొందరు తరతరాలుగా సాగిస్తున్న రైతు జీవితం నుంచీ, వివిధ వృత్తుల నుంచీ దూరమై పట్టణాలకో, ఇతర ప్రాంతాలకో వలస వెళ్లి ఉంటారు. పట్టణాలలో రోజువారీ అడ్డా కూలీలుగానో, భవన నిర్మాణ కార్మికులుగానో, చిల్లర వృత్తులలోనో బతుకు ఈడుస్తూ ఉండి ఉంటారు. ఒకప్పుడు వ్యవసాయంలోనూ, చేతివృత్తులలోనూ అద్భుతమైన పంటలకూ వస్తువులకూ సృష్టికర్తలయిన ఎంతో మంది ఇవాళ బిచ్చగాళ్లుగానో, ఇతరుల దయ మీద ఆధారపడేవాళ్లు గానో మారిపోయి ఉంటారు. గ్రామంలో ఏదో ఒకరకమైన ఆస్తి ఉండిన వారికి ఎంతో కొంత నష్టపరిహారం అనబడేది అందినా అది ఈ పాటికి  కరిగిపోయి వారి జీవితాలు కూడ శిథిలమైపోయి ఉంటాయి. బహుశా అతి కొద్ది మందికి జీవితం బాగుపడి కూడ ఉండవచ్చు. ఏమైనా ఎంతో కాలంగా తెలిసిన పరిసరాల నుంచీ, పరిచయస్తుల నుంచీ, గ్రామీణ ప్రాంతాలలో ఉండే ఆత్మీయ అనుబంధాల నుంచీ దూరమై పట్టణాలలో అనామకమైన, చాలీచాలని బతుకులు గడుపుతూ ఉన్న వాళ్లెందరో.  సెజ్ మాత్రమే కాక ఇతర రూపాలలో కూడ భూసేకరణ జరిగింది.

మానవ జీవితంలో వచ్చిన ఇంత విస్తృతమైన, లోతయిన మార్పులు కథా ప్రక్రియలో ప్రతిఫలించక తప్పదు. ఈ సంవత్సరం కథలలో కనీసం డజను కథలు సెజ్ ఇతివృత్తాన్ని, సెజ్ వల్ల జరిగిన విధ్వంసాన్ని నేరుగానో, పరోక్షంగానో తీసుకున్నాయి. కాట్రగడ్డ దయానంద్ రాసిన ‘పెద్ద పండగ’ భూసేకరణ వల్ల పండుగ వాతావరణం ఎలా విధ్వంసం అయిందో చిత్రించింది. హైదరాబాద్ పరిసరాల్లోని పోలేపల్లిలో ఏర్పాటయిన సెజ్ దీర్ఘకాలంపాటు స్థానిక ప్రజల ప్రతిఘటనను, పోరాటాన్ని చూసి కనీసం నాలుగైదు కథలకు ముడిసరుకయింది. గీతాంజలి రాసిన ‘నేను పోలేపల్లి పీనుగని మాట్లాడుతున్న’, ఇక్బాల్ రాసిన ‘కఫన’, ఉదయమిత్ర రాసిన ‘గుప్పిటమట్టి’ నల్లూరి రుక్మిణి ‘ఆగిసాగిన అడుగులు’ సెజ్ ల ఏర్పాటు వల్ల జరిగిన విధ్వంసాన్ని చిత్రించిన కథలలో కొన్ని.

పెన్మెత్స శ్రీకాంత్ రాజు ‘బాబోయ్ డబ్బు’ కథ పట్టణ పరిసరాల వ్యవసాయ భూములు రియల్ ఎస్టేట్ గా మారిపోతున్న తీరు గురించి చెపుతూ రైతుకు భూమి మీద మమకారం తరిగిపోయే పరిస్థితి ఎలా బలపడుతున్నదో, డబ్బు ప్రభావం వల్ల కుటుంబ బంధాలు ఎట్లా తెగిపోతున్నాయో వివరిస్తుంది.

ఇటువంటి అభివృద్ధి ఫలితమైన విస్థాపన వల్ల జరుగుతున్న వలసలు ఉన్నాయి. ప్రజలకు ఉపాధి అవకాశాలను, జీవిత ప్రమాణాల మెరుగుదల అవకాశాలను కల్పించే నిజమైన అభివృద్ధి జరగకపోవడం వల్ల జరుగుతున్న వలసలు ఉన్నాయి. రాజస్తాన్ నుంచి తిరుపతి దాకా కేవలం గృహ నిర్మాణాలకోసం, ఇళ్లలో చలువరాతి బండలు పరవడం కోసం వలస వచ్చి సొంత ఊరికి వెళ్లాలని తపిస్తూ ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడి కథ మధురాంతకం నరేంద్ర రాసిన ‘మేరా గావ్ కో జానా!’

ఇటీవలి కాలంలో అభివృద్ధి చెందిన మార్కెట్లలో పెద్దఎత్తున ఆర్థిక సంక్షోభాలు చెలరేగి ప్రపంచీకరణ విషఫలితాల్లో ఒకటిగా చర్చలోకొచ్చాయి. 2008లో అమెరికా, యూరప్ దేశాలలో వెల్లువలా సాగిన ఈ సంక్షోభాల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థమీద కూడ బలంగానే పడింది. ఆ ఆర్థిక మాంద్యం వల్ల జరిగిన పరిణామాలను, కోల్పోయిన ఉద్యోగాలను, తరిగిపోయిన సౌభాగ్యాన్ని, మానవసంబంధాల మార్పులను చిత్రించడానికి కొన్ని కథలు ప్రయత్నించాయి. జాన్ సన్ చోరగుడి ‘లోయలో కూలిన శిఖరం’, బల్లెడ నారాయణమూర్తి ‘ఉజ్జిడి’ అటువంటి కథలు. ‘లోయలో కూలిన శిఖరం’ ప్రకృతికీ, సామాజిక ఆర్థికపరిణామాలకూ పోలిక కుదర్చడానికి మేధోస్థాయిలో ప్రయత్నించగా, ‘ఉజ్జిడి’ ఉత్తరాంధ్ర ప్రత్యేక సాంస్కృతిక చిహ్నాల నుంచి, వెనుకబడిన సమాజపు ప్రతిస్పందనలనుంచి ఆర్థిక సంక్షోభాన్ని పట్టుకోవడానికి అద్భుతంగా ప్రయత్నించింది.

పాలకవిధానాల వల్ల జరుగుతున్న విస్థాపన, విధ్వంసం, బీభత్సం సాధారణ కథావస్తువుగా ఉండగానే, 2009లో కురిసిన అతి వర్షాల వల్ల, తుంగభద్ర, కృష్ణ వరదల వల్ల మహబూబ్ నగర్, కర్నూలు జిల్లా జనజీవితంలో భయానక విషాదం వ్యాపించింది. ఆ విషాదాన్ని కథలుగా మలచి గొప్ప సాహిత్య, సామాజిక సేవ చేశారు కర్నూలు రచయితలు. ఆ ఒక్క విషాదం పైననే డా. ఎం హరికిషన్, జి. వెంకటకృష్ణ, ఇనాయతుల్లా, జి. ఉమామహేశ్వర్ వంటి పన్నెండు మంది కథకులు పదమూడు కథలు రాసి సంకలనం తేవడం మన రచయితల సామాజిక స్పందనకు నిదర్శనం. ఆ విషాదాన్ని అక్షరీకరించి ఈ సంకలనం లోకి రాని కథలు కూడ ఉన్నాయి.

ఇటీవలి కాలంలో తెలుగు కథా సాహిత్యంలోకి కొత్తగా ప్రవేశించిన పాయ ప్రవాసకథ. డయాస్పోరా సాహిత్యం అని దేశదేశాల సాహిత్యంలో ఇప్పటికే ఒక ప్రధాన ప్రవాహంగా ఉన్న ఈ సాహిత్య ధోరణి తెలుగులో ఇప్పుడిప్పుడే బలపడుతోంది. ఉద్యోగకారణంతోనో, ఇతర కారణాలతోనో తమ సమాజానికీ, తమ సాహిత్యానికీ దూరంగా పరదేశంలో జీవించవలసి వచ్చిన సాహిత్యకారులు, పాఠకులు తమ వేదనలకు, అనుభవాలకు అక్షరరూపం ఇస్తున్నారు. చాలమంది తాము విడిచివచ్చిన జీవితం గురించిన జ్ఞాపకాలే రాస్తున్నప్పటికీ, వారు పొందిన విదేశీ అనుభవాలు, విస్తృత జీవితానుభవం, విశాలమైన అవగాహనలు వాటిని కొత్తగా చూడడానికి ఉపయోగపడుతున్నాయి. అలాంటి కథలలో ఈ సంవత్సరం సాయిబ్రహ్మానందం గొర్తి రాసిన ‘అతను’, ఆరి సీతారామయ్య రాసిన ‘పరివర్తన’ చెప్పుకోదగినవి. ప్రత్యేకంగా ‘పరివర్తన’ చాల ఆలోచనా స్ఫోరకమైన కథ. ఇది ప్రధానంగా మానవసంబంధాలను గురించి, స్త్రీల లైంగికత గురించి, అమెరికాలో అమలవుతున్న చట్టాలలోని అమానుషత్వం గురించి, న్యాయవిచారణ అనేదానిలోని అన్యాయం, క్రౌర్యం గురించి గురించి మాట్లాడుతుంది. కాని అదే సమయంలో తెలుగుసీమ జీవనం గురించి, జీవితదృక్పథంలో తెలుగు సాంస్కృతిక చిహ్నాల గురించి మాట్లాడుతుంది.   అసలు మనిషిలో పరివర్తన అంటే ఏమిటి, పరివర్తన రావలసింది ఎవరిలో అనే మౌలిక విషయాలు చర్చిస్తుంది. “సత్యం నన్నెప్పుడూ తన సుఖం కోసం తాకలేదు. రామారావు నన్నెప్పుడూ నా సుఖం కోసం తాకలేదు… ఎప్పుడూ ఏదో అడవి మృగం తాకినట్లుండేది అతని స్పర్శ… అది తప్పో కాదో తెలియని అమాయకపు రోజులు. ఆరోజుల్లోనే ఎప్పుడో గర్భం అయి ఉంటుంది. ఏమైనా, ఇది మాత్రం నిజం. సత్యం నన్నెప్పుడూ బలవంతం చెయ్యలేదు. రామారావు నన్ను ప్రతిరాత్రీ బలవంతం చేశాడు. కాని అటార్నీ జనరల్ దృష్టిలో రామారావుకి నామీద అధికారం ఉంది. సత్యానికి  లేదు. నేను సత్యంతో చేసింది తప్పు” అని దీపికారావు అన్నమాటలు లోతుగా ఆలోచించవలసినవి.

అలాగే స్నేహం, ప్రేమ, సెక్స్, స్త్రీ పురుషుల పరిణతి, ఆత్మగౌరవం, వ్యక్తిత్వాలను గుర్తించడం, సమానత్వం వంటి అనేక విషయాలను లోతైన చర్చతో, అవసరమైన అవగాహనలతో నడిపిన కథ దగ్గుమాటి పద్మాకర్ ‘ఈస్తటిక్ స్పేస్’.

పరిశీలనా, విశ్లేషణా సౌలభ్యం కొరకు మాత్రమే ఈ సామాజిక సందర్భాలను ఇలా వింగడించ గలుగుతున్నాం గాని నిజానికి ఇవన్నీ ఒకదానితో ఒకటి, ఒకదానిలో ఒకటి, పరస్పర ప్రతిచర్యలతో కలగలిసి ఉండేవే. కథా రచనలో సౌలభ్యం కోసం వీటిలో ఏ ఒక్కదాన్నో విడదీసి రాయడం జరిగి ఉండవచ్చు. కాని ఏదో ఒక దాన్ని ప్రధానం చేసినప్పటికీ, ఆ అంశానికి ఇతర అంశాలతో ఉన్న, ఉండగల అన్యోన్య సంబంధాన్ని కనీసం సూచన మాత్రంగా చెప్పడం, పొరలుపొరలుగా ఉండే సమాజ దృశ్యాన్ని పాఠకుల ఊహకైనా అందించగలగడం చాల అవసరం, ఉపయోగకరం. ఈ సంవత్సరం కనీసం కొందరు కథకులయినా అటువంటి సమగ్ర, సమ్యగ్ దృక్పథంతో తమ ఇతివృత్తాలను దర్శించారనేది చాల ఆహ్వానించదగిన విషయం. తెలుగు కథకుల పరిశీలనా, వివరణా శక్తి పట్ల గర్వపడవలసిన, సంతృప్తి పడవలసిన అంశం. ఈ రచయితలు తెలుగుకథ భవిష్యత్తుకు హామీ ఇస్తున్నారనాలి.

అటువంటి కథలలో ఒకటి వి. ప్రతిమ ‘నాయన కూతురు’. ఈ కథ చనిపోయిన ఒక గ్రామీణ పెద్దమనిషి గురించీ, ఆయన కూతురు గురించీ ప్రధానంగా రాసిన కథ. అంటే కరిగిపోయిన మానవసంబంధాల ఉదాత్తత గురించిన పురాస్మృతి కథ. కాని దానిలోనే మారిన మనుషులు ఉన్నారు. వ్యవసాయ సంక్షోభం ఉన్నది. పాత దాతృత్వ ఔదార్య విలువలకూ కొత్త స్వార్థపు డబ్బు విలువలకూ ఘర్షణ ఉన్నది. వ్యవసాయ రంగంలో పెరిగిపోతున్న వ్యాపార విలువల గురించిన ప్రస్తావన ఉన్నది. భార్యాభర్తల మధ్య విలువల ఘర్షణ ఉన్నది. రాబోతున్న సహకార వ్యవసాయం అనే మహమ్మారి ప్రస్తావన ఉన్నది. ఇలా సామాజిక చిత్రాన్ని వీలయినంత విశాలంగా చిత్రిస్తూనే, దానిలో పాఠకులు మనసు పెట్టవలసిన బిందువు మీద కేంద్రీకరించడం మంచి కథన శైలికి గుర్తు.

అలాగే పెద్దింటి అశోక్ కుమార్ ‘ఇగ వీడు తొవ్వకురాడు’ కూడ ప్రధానంగా రైతు ఆత్మహత్య, యువతరం ధిక్కార స్వభావం ఇతివృత్తంగా ఉన్నప్పటికీ, అంతర్గతంగా అనేక సామాజిక ఘర్షణలకు, పరిణామాలకు చోటునిచ్చింది.

మధురాంతకం నరేంద్ర రాసిన ‘న్యాయం’, ‘మూలకారణం’ కథలు కూడ ఏకకాలంలో ఒక బిందువునూ, దానిచుట్టూ ఉన్న విశాల చిత్రాన్నీ చూపాయి. ‘న్యాయం’ సహజ న్యాయం గురించిన ఒక నైసర్గికమైన, అమాయకమైన స్త్రీ దృక్పథాన్ని ప్రధాన ఇతివృత్తంగా చేసుకున్నప్పటికీ అనేక విషయాలను అంతర్గత పాయలుగా, పొరలుగా నడిపింది. ఈ సంవత్సరం వచ్చిన మంచి కథల్లో ఒకటిగా నిలిచే ‘మూలకారణం’ ఒక మామూలు కథావస్తువులో కూడ ఎంత సంక్లిష్ట ఇతివృత్తం ఇమిడిఉంటుందో చూపుతూ దానిమీద చాల నేర్పుతో అల్లిన కథ. ఒక పులి చంపిన మృతదేహాన్ని చూసి అది ఎవరిదో తేల్చుకోకుండానే, ఒకరిదని అనుకోవడంతో మొదలయిన కథ ఆ మనిషి చనిపోలేదని తెలియడంతో ముగుస్తుంది. నిజానికి ఈ రెండు ఘటనల మధ్య గడిచిన కాలం చాల తక్కువ. కాని జీవిత పర్యంతం అనుభవించగలిగిన క్లేశాలూ ఉద్వేగాలూ ఆ మధ్యలోకి వచ్చి చేరాయి. తిరుపతి కొండల్లో, అడవిలో పులి తిరగడం, అక్కడికి కట్టెపుల్లలకోసం వెళ్లే బడుగు మనుషులు దేవస్థానం ఫారెస్టు గార్డుల చేతిలో పడవలసిన బాధలు, చనిపోయాడనుకున్న మనిషి భార్య దైన్యం, పోలీసుల దౌర్జన్యం, జిత్తులమారితనం, అవకాశానికి తగిన అబద్ధాలు, చనిపోయాడనుకున్న మనిషి గురించి భిన్నకథనాలు, రాబోయే ఇన్సూరెన్సు డబ్బు గురించి ఊహాగానాలు, ఆశలు, ఆ రాబోయేదాని పంపకపు ఘర్షణలు, దానిలో తానే ఎక్కువ వాటా సంపాదించాలని ప్రతిఒక్కరూ పడే పాట్లు… మానవ సంబంధాలలో ఆధిపత్యం-లొంగుబాటుతనం, సాధారణత్వం-ప్రత్యేకత, పురుషుడు-స్త్రీ, అధికారం-దైన్యం, ఆశ- నిరాశ ఏ పాత్ర వహిస్తాయో, ఆ సంబంధాలలోకి డబ్బు ప్రవేశం వాటికి ఎంత మురికి అంటిస్తుందో పొరలుపొరలుగా ప్రకటిస్తుందీ కథ.

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘సుడిగాలి’ కూడ ఈ సంవత్సరపు మంచికథల్లో ఒకటి. ఈ కథ ఎత్తుగడ నుంచి ముగింపు దాకా పకడ్బందీ నిర్మాణంతో, చాల మెళకువతో చెప్పదలచుకున్న విషయాన్ని చెప్పింది.  సుడిగాలితో మొదలయిన కథ, సుడిగాలిని మించిన బీభత్సాన్ని జీవితాల్లో నింపే మనుషులు ఉన్నారని చూపింది. వ్యవసాయంలోని నష్టాల గురించీ, కౌలుదార్ల కష్టాల గురించీ చెప్పింది. అనుపస్థిత భూస్వామ్యం కనబడకుండానే ఎంత పెద్ద ఎత్తున దోపిడీ సాగిస్తున్నదో చూపింది. కౌలుదారు మీద అజమాయిషీ, దోపిడీ చేస్తూనే ఉన్నా కనీసం పాతతరం అనుపస్థిత భూస్వామ్యానికి వ్యవసాయం మీద ప్రేమ, దాతృత్వం, భూమి మీద మమకారం అయినా ఉండేవనీ, కొత్తతరం సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల అనుపస్థిత భూస్వామ్యానికి డబ్బుల లెక్కలు తప్ప మరే మానవ విలువలూ తెలియవనీ ఈ కథ చూపింది.

అలాగే సుంకోజి దేవేంద్రాచారి ‘పిడికెడు మెతుకులు’ భారత వ్యవసాయరంగ చరిత్రను, సంక్షోభాన్ని చాల ఆర్ద్రంగా చిత్రించింది.

గంటేడ గౌరునాయుడు ‘పొద్దు ములిగిపోయింది’ కథ విస్థాపన సమస్య దగ్గర మొదలై అనేక కళాత్మక, సున్నిత అంశాలను చిత్రించింది. “నాగావళి నదికి ఇరువేపులా వున్న తీర గ్రామాలు మావి. నాగావళి ఇసుకదిబ్బ మా కళాసృజనకు వేదిక. అందరూ సంపాదనలో చూసుకునే సౌందర్యం, సంతోషం మేము నాగావళి అలల తీగలు మీటే వెన్నెల వేళ్లలోను, రెల్లుపూల కెరటాల మీద తేలియాడే పిల్లగాలి తరగల్లోనూ చూసుకునే వాళ్లం. ఆ అందాలను అక్షరాల్లో, గీతల్లో పట్టుకుని పొంగి పోయేవాళ్ళం… అదే గొప్ప భాగ్యం మాకు… ఏ నదిని మేం మా ప్రాణాధికంగా ప్రేమించామో ఏ నదిని మా జీవితంలోనించి వేరు చేయలేని భాగమనుకున్నామో ఆ నది మాకు కాకుండా పోయింది. మాకు కాకపోవడం కాదు. మమ్మల్ని ముంచింది” అని ఆ విషాద గాథను వినిపిస్తుందీ కథ.

బా రహమతుల్లా రాసిన ‘మా’ ప్రధానంగా ముస్లిం జీవిత దృశ్యాన్నే చిత్రించినా తల్లీ బిడ్డల బంధాన్నీ, మాతృస్పర్శలోని మమకారాన్నీ హృద్యంగా వర్ణించింది. రహమతుల్లా మా ఒక ముస్లిం మాతృమూర్తి హృదయాన్ని ఆవిష్కరిస్తే, వేంపల్లె షరీఫ్ రాసిన ‘పర్దా’ మరొక ముస్లిం వృద్ధ స్త్రీ హృదయాన్ని చూపడంతో పాటు తెలుగునాట ముస్లింల ఇళ్లలో కొత్తగా పెరుగుతున్న ఛాందసానికి మూలాలు చూపడానికి ప్రయత్నించింది. చుట్టూ ఉన్న సమాజం వాళ్ల అస్తిత్వాన్ని ప్రశ్నిస్తూ, వ్యతిరేకిస్తూ, అనుమానిస్తూ, అవమానిస్తూ,  భయపెడుతూ ఉన్నప్పుడు, ఆ అస్తిత్వాన్ని మరింత గట్టిగా అంటిపెట్టుకోవడమే రక్షణనిస్తుందేమో అనుకుని ముడుచుకుపోయే తత్వం ఉంటుంది. ఇలా మెజారిటీ మతోన్మాదం వల్ల మైనారిటీ మతస్తుల అభద్రతా భావం మత ఛాందసానికి ఎలా పాదు అవుతున్నదో చెప్పడానికి ఈ కథ ప్రయత్నం ప్రారంభించి ఎందువల్లనో మధ్యలో ఆగిపోయింది. వృద్ధాప్యంలో స్త్రీలు అనుభవించే వేదనను, ముస్లిం ఇళ్లలో ఆచారవ్యవహారాలను బాగా పట్టుకుంది గాని, పర్దా అనే శీర్షికకు న్యాయం చేయడానికి మరొక అడుగు వేయవలసి ఉండింది.

తాయమ్మ కరుణ రాసిన ‘జీవితం’ మరొక కోణం నుంచి అటువంటి వృద్ధ స్త్రీ జీవితాన్ని చిత్రించింది. ఎనిమిది మంది పిల్లల్ని కని కూడ ముసలితనాన ఒంటరితనాన్ని అనుభవిస్తున్న ఆ స్త్రీ తన జీవితానుభవాల్ని చెప్పుకోవడానికి, పంచుకోవడానికి,  తన మాట వినే తోడు కోసం ఎంత తపిస్తుందో వివరించింది.

ఎప్పుడైనా ఆ స్థల కాలాల్లో కచ్చితంగా ఇమడ్చడానికి వీలులేని కథలు కొన్ని ఉంటాయి. అవి ఆయా రచయితల అధ్యయనం నుంచో, తాత్విక దృక్పథం నుంచో, అనుభూతులనుంచో వెలువడవచ్చు. నేరుగా సామాజిక ఇతివృత్తంగా కనిపించకపోయినా, సామాజిక స్పర్శ లేకుండా రచన ఉండే అవకాశమే లేదు. ఈ సంవత్సరం వచ్చిన కథల్లో కేవలం ఊహలుగానో, అభూత కల్పనలుగానో కనిపిస్తూనే తాత్విక దృక్పథాన్ని ప్రతిఫలించే కథలు కొన్ని ఉన్నాయి. బి. అజయ్ ప్రసాద్ ‘జాగరణ’, వాడ్రేవు చినవీరభద్రుడు ‘ఆండాళ్ ప్రేమకథ’, కాశీభట్ల వేణుగోపాల్ ‘సగం మనుషులు’, రమణజీవి ‘ఎగిరేపాప’, పసుపులేటి గీత ‘లాటిట్యూడ్’  అటువంటి కథలు. ‘ఆండాళ్ ప్రేమకథ’ వందల సంవత్సరాలుగా తెలిసిన కథే అయినా ఆ సున్నితమైన ప్రేమగాథ చెప్పిన పద్ధతి వల్ల ఆకర్షణీయంగా మారింది. నిర్బంధం గురించీ స్వేచ్చ గురించీ తాత్విక ఆలోచనలు ప్రేరేపించేలా ప్రతీకాత్మకంగా రాసిన కథ ‘జాగరణ’. ఈ కథలో లాగ “మనుషులు తమ తెలిసినా తెలియకున్నా మంచిపనీ చేస్తారు. చెడూ చేస్తారు. కార్యం కంటి ముందున్నంతవరకే. చేతులు దాటాక అన్నీ మనమనుకున్నట్టే జరగవు. దేని దిశ దానికే ఉంటది. రెక్కలిప్పుకున్న పావురం ఎగిరినట్టు దేని దిక్కు అది ఎగిరిపోద్ది. గాలికి పుట్టిన అల సముద్రంలో కనిపించనంతదూరం కొట్టుకుపోయినట్టు అది ఎటో ఎళ్లిపోద్ది” వంటి జీవిత సత్యాల్ని తమకు తెలిసిన జీవన దృశ్యాల ద్వారా చెప్పడానికి ప్రయత్నించడం ద్వారా తెలుగు కథకులు పాఠకుల అవగాహనలను ఉన్నతీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. ‘ఎగిరే పాప’ వాస్తవానికీ కల్పనకూ మధ్య, నిజానికీ సందేహానికీ మధ్య విచికిత్స ద్వారా ఒక అంశం మీద భిన్న దృక్పథాలు ఎలా ఏర్పడతాయో వివరించడానికి ప్రయత్నిస్తుంది.

‘సగం మనుషులు’ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవలసిన ఒక ఆర్ద్రమైన విషయాన్ని చాల విశ్వసనీయంగా చిత్రించింది. మనుషులమధ్య ఎప్పటికీ ముగియని అపరిచితత్వమేదో ఉంటుందనీ, దాన్ని గుర్తించడం ఎప్పటికైనా సాధ్యమవుతుందా అనీ అడుగుతుంది. “నిజానికి ‘తను’ ఎప్పుడో ఎక్కడో పూర్తి కాకుండానే ఆగిపోయింది. ఇన్నేళ్ల నా ప్రయాణంలో నేను మోస్తూ వున్నది ఓ తియ్యటి జ్ఞాపకాన్ని… నాకు ‘తను’ పూర్తిగా ఎప్పటికీ అవగతం కాదు… నిజానికి ఎవ్వరూ ఎవరికీ పూర్తిగా తెలియదు… మన మన అవసరాలకోసం… అవసరమైన మేరా మనల్ని మనం వ్యక్తపరుచుకుంటాం… అంతేనా? మన ప్రమేయం లేకుండా మనల్ని మనం వ్యక్తపరుచుకునే క్షణాలూ వుంటాయి…” అని ఒక తాత్విక దృక్పథాన్ని ఈ కథ అందిస్తుంది.

పసుపులేటి గీత ‘లాటిట్యూడ్’ ఈ సంవత్సరం చెప్పుకోదగిన మంచి కథల్లో ఒకటి. అది వాస్తవికతకూ కల్పనకూ, విజ్ఞానశాస్త్ర కల్పనకూ సామాజిక కల్పనకూ మధ్య గీతలు చెరిపేసింది. మనిషికి ఒక గుర్తింపును ఇచ్చే ముఖం ఎట్లా మారిపోతుంది, మనిషి ఏయే సందర్భాలలో తన ముఖాన్ని తానే కోల్పోయే స్థితి వస్తుంది, ఇవాళ మనకు కనబడుతున్న ముఖాలు అసలు ముఖాలా, అసలు ముఖం కోల్పోయి కొత్తగా వచ్చి చేరిన ముసుగులా? “ఎదిగిన వయసుతో పాటు నేను కూడా చదువులూ, ఉద్యోగాలూ, కెరీర్, పెళ్లీ, పిల్లలంటూ నా ముఖాన్ని పోగొట్టుకున్నాను. ఏ రోజున ఆ ముఖాన్ని పోగొట్టుకున్నానో గుర్తులేదు కానీ, ఆ రోజున అమ్మ నన్ను ముఖం వాచేలా చెడతిట్టింది. ‘ఉద్యమాలూ, వంకాయలూ అంటూ నా పరువు బజారుకీడిస్తే ఊరుకోను. నోరు మూసుకుని చదువుకో, లేదంటే కాళ్లు విరిచి, మూల కూచోబెడతా!’ అన్న నాన్న బెదిరింపుతో విద్యార్థి ఉద్యమం నుంచి నిశ్శబ్దంగా తప్పుకున్న రోజునా… ‘మన కులమే…’నంటూ ప్రొఫెసర్ అర్హతకు మించి నాకు మార్కులు వేసినప్పుడు, దాన్నొక విజయంగా నేను అంగీకరించిన క్షణంలోనా… ఉద్యోగంలో ముందుకెళ్లడం కోసం లేని వినయాన్ని రాని నవ్వుని ముఖానికి బలవంతాన పులుముకున్నప్పుడా… ఇంటి పరువుకు నా ప్రేమను, ప్రేమించినవాడిని బలిచ్చి, అరేంజ్ డ్ మ్యారేజ్ కి ఒప్పుకున్నప్పుడా… నా స్నేహితుల్లో వ్యభిచారులెవరో, సంసారులెవరో లెక్కలు చెబుతూ నా భర్త చేసిన హెచ్చరికతో స్నేహాల్ని వదులుకుని పూర్తి స్థాయి సంసారిగా మారిన నాడా… ఏమో, సరిగ్గా గుర్తులేదు కానీ, నా ముఖాన్ని కోల్పోయి చాలా కాలమే అయింది” అని ఉత్తమపురుషలో సాగిన కథలో కథకురాలు చెపుతుంది. అమ్మకానికి ముఖాలు, అవయవాలు, రీసైక్లింగ్ అవయవాలు అంటూ మార్కెటీకరణ సహజ, నైసర్గిక అంశాల్లోకి కూడ ఎంతగా ప్రవేశించిందో ఈ కథ వివరించింది. “సహజమైనదేదైనా అదిప్పుడు మనుషుల్ని భయపెడుతోంది. అనుమానాల్ని రేపుతోంది. సొంత ముఖమన్నది ఇప్పుడిక్కడ నేరమైంది” అని అద్భుతమైన విశ్లేషణను అందిస్తుంది.

ఇన్ని ఇన్ని సమూహాల, రంగాల, కోణాల, స్థాయిల జీవితానుభవం నిజానికి అనుభవ మాత్రంగానే ఆగిపోవడం లేదు. ఈ అనుభవంలోని దుస్సహ స్థితి మారాలని కూడ జీవితం పెనుగులాడుతున్నది. జీవితం ఇలా ఉండనక్కరలేదని, ఇది గతమూ ఆగతమూ ఉన్న ఒకానొక సామాజికార్థిక ధర్మమని, ఈ ధర్మాన్ని మార్చవచ్చునని ఆలోచనలూ ఆచరణలూ వ్యాపిస్తూనే ఉన్నాయి. మొత్తంగా సామాజిక ఆర్థిక వ్యవస్థనే మార్చినప్పుడే ఈ దుస్థితి మారుతుందనే మౌలిక ప్రత్యామ్నాయ ఆలోచనలు కావచ్చు, లేదా ఏదో ఒకటో రెండో ఇబ్బందికర పరిస్థితులు మారితే చాలుననుకునే తక్షణ, స్వల్పమైన ఆలోచనలు కూడ కావచ్చు. ఆ ఆలోచనలన్నీ సమాజంలోనూ ఉన్నాయి, సాహిత్యంలోకీ ప్రవేశిస్తున్నాయి.

ప్రత్యామ్నాయ వ్యవస్థా నిర్మాణంలో భాగంగా విప్లవోద్యమ నిర్మాణం, సాయుధపోరాటం, వాటిని అక్షరీకరించే విప్లవ సాహిత్యం తెలుగు సాహిత్యరంగంలోనూ, ప్రత్యేకించి కథా ప్రక్రియలోనూ నాలుగు దశాబ్దాలుగా సాగుతున్న, స్థిరంగా, దృఢంగా నెలకొని ఉన్న సంప్రదాయం. ఈ ధోరణిలో కూడ ఈ సంవత్సరం వచ్చిన కథలు తక్కువేమీ కావు. మిడ్కో రాసిన ‘నడక ముందుకే’, ‘పూలతోట’; షంషేర్ రాసిన ‘శాంతికోసం’, ‘ఇద్దరు వీరవనితలు’;  ఎన్.డి. రాసిన ‘ఇలాంటిదీ ఒక వేకువ’, ‘ఈరోజును గెలుచుకున్నవాడు’, ‘దిమాగ్ తోని…దైర్నంతోని…’; తాయమ్మ కరుణ రాసిన ‘గొడ్డుని కాను’; కార్మిక రాసిన ‘మర్కలొద్ది’; జి. వెంకటకృష్ణ రాసిన ‘వేకువప్రశ్న’ వంటి కథలెన్నో ఈ సంప్రదాయంలో వచ్చాయి.

**

మొత్తంగా కథలన్నీ చూసినప్పుడు రచయితలు స్థూలంగా ఉపయోగించిన భాషా సౌందర్యం గురించీ, సామెతలు, నుడికారాల గురించీ, ప్రకృతి వర్ణనల గురించీ, కథన శైలుల గురించీ ఒకటి రెండు మాటలు చెప్పాలి. ఈ సంవత్సరం కథల్లో చాల మంది రచయితలు తమ ప్రాంతానికీ, తమ సామాజిక వర్గానికీ ప్రత్యేకమైన భాషను అద్భుతంగా వినియోగించుకున్నారు. ప్రత్యేకించి కర్నూలు, కడప, చిత్తూరు, ఉత్తరాంధ్ర, మహబూబ్ నగర్, కరీం నగర్ గుంటూరు – ప్రకాశం ప్రాంతాల భాషా ప్రయోగాలు వాటి సొగసుతోనూ, అర్థస్ఫోరకంగానూ వచ్చాయి. ఈ సంవత్సరం కథలు చదవకపోతే తెలుగు సమాజంలో ఒకప్రాంతంలో సుడిగుండాన్ని తిరుగుడు గుమ్మి అంటారనీ, ఒక ప్రాంతంలో ఉజ్జిడి అనే ప్రత్యేక గ్రామీణ ఆచారం ఉందనీ, చిత్తూరు ప్రాంతంలో పెళ్లి తంతులో కొన్ని ప్రత్యేకతలున్నాయనీ నాకు తెలిసేది కాదు.

అలాగే ఈ సంవత్సరం కథల్లో బహుశా కథకులు మూలాల్లోకి పయనించాలని ప్రయత్నించినందువల్ల ఎన్నో మంచి సామెతలు, నానుడులు వచ్చి చేరాయి. గుర్తించినవాటిలో కొన్ని: ‘మిన్ను కురవక చేను పండదు, కన్ను కురవక బతుకు పండదు’. ‘ఉరికిన శాలోడు గదే అంగడి, ఉరకని శాలోడు గదే అంగడి.’ ‘చెప్పితె ఇననోన్ని చెడంగ జూడాలె.’ ‘పేరు పెద్దీర్కం, ఇల్లు జలజంత్రం.’ ‘కొంచెపోని కొంగు పడితె మంచోని మానం పోయిందట.’ ‘నూనెవోసి అలుక్కున్నట్టే.’ ‘అయ్యోడు గాదు అవ్వోడు గాదు జంగమోన్ని పట్టుకుని జామేడ్సినట్టు.’ ఎంత విస్తృతమైన జీవితానుభవం నుంచి, ప్రాచీన వివేకం నుంచి ఈ నానుడులు వచ్చి ఉంటాయి!

**

అట్లాగే ఈ సంవత్సరం కథలలో జరిగిన కొన్ని పొరపాట్లు కూడ చెప్పాలి. జీవిత దృశ్యాల చిత్రణ ఉన్నప్పటికీ పాత పద్ధతి కథన శైలితో ఉట్టి చిత్రం మాత్రమే, లేదా ఉట్టి చమత్కారం, కొస మెరుపు మాత్రమే కథ అనుకునే ధోరణి ఇంకా ఉంది. ఇతరంగా మంచి కథలు రాసిన కథకులు, నిశిత దృష్టి ఉన్న కథకులు కూడ ఈ పొరపాటు చేసినట్టు కనబడుతున్నది.

ఈ సంవత్సరం వచ్చిన కథలలో రెండిటి గురించి మాత్రం నా విమర్శను కూడ నమోదు చేయవలసి ఉంది. డా. వి చంద్రశేఖరరావు రాసిన ‘ఎచ్ నరసింహం ఆత్మహత్య’ (నిజానికి ఇది జనవరి 2010 లో అచ్చయింది గనుక కచ్చితంగా చెప్పాలంటే ఈ సింహావలోకనం పరిధిలోకి రాదు) నిర్దిష్ట స్థాయిలో అవాస్తవమేమో అనిపించే ఒక సాధారణ వాస్తవాన్ని వెటకరించడానికి, చిన్నచూపు చూడడానికి ప్రయత్నించింది. ఎప్పుడయినా సాధారణ స్థాయిలో వాస్తవమయినది ప్రత్యేక, నిర్దిష్ట స్థాయిలో నిజం కాకపోయే అవకాశం ఉంటుంది. కొంత వైవిధ్యం, తేడా ఉంటుంది. కాని ఆ ఒక్క ఉదాహరణ వల్ల సాధారణ వాస్తవం, వాస్తవం కాకుండాపోదు. ఈ కథ చెప్పే ప్రధాన పాత్ర హైదరాబాదును ప్రేమించే,  తనను తాను హైదరాబాదీనే అనుకునే ఒక సుకుమార యువతి పి. కృష్ణవేణి. ఆమె కుటుంబం ముప్పై ఏళ్లకిందనే ఇతర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడింది. ఆమె ప్రేమించిన మనిషి ఎచ్ నరసింహం. మొరటుగా ప్రేమిస్తాడు. రెండురోజులపాటు మంటపుట్టేలా ముద్దు పెట్టుకుంటాడు. గేదె పాల వ్యాపారం చేసే కుటుంబం నుంచి వచ్చాడు. ఆ యువకుడు ఏ కారణం వల్లనో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఆత్మహత్యను ప్రాంతీయవాదులు కైవసం చేసుకుని అతనికి కొత్త చరిత్ర కల్పిస్తారు. ప్రతి ఆత్మహత్య వెనుకా సంక్లిష్టమైన కారణాలు ఉంటాయి. ఏదో ఒక కారణాన్ని ఆపాదించడం బతికి ఉన్నవాళ్ల ప్రయోజనాలకోసమే అనేది కూడ నిజమే. ఆత్మహత్యలను ఎంతమాత్రం సమర్థించనక్కరలేదు. కాని ఒక సంక్షుభిత వర్తమాన ఘటన మీద ఇంతగా వెటకరించడం కూడ సాహిత్యకారులకు తగదేమో. అలాగే సెజ్ మీద తుమ్మేటి రఘోత్తమరెడ్డి రాసిన కథ సెజ్ లను విమర్శించేవారిని వెటకరించింది. సెజ్ అనే విధానం వల్ల విమర్శకులు చెపుతున్న కీడు జరగదనీ, మేలే జరుగుతుందనీ అనుకునే అవకాశం, అధికారం ఎవరికైనా ఉన్నాయి. ఆ పని ప్రభుత్వం చేస్తూనే ఉంది. ఆ మేలును చిత్రిస్తూ కథ కూడ రాయవచ్చు. కాని ఆ విధానం వల్ల బాధితులైనవారి పక్షం తీసుకున్నట్టు కనబడుతూ, విధానాన్ని విమర్శించే వారి పట్ల వెక్కిరింతతో, విమర్శతో రాయడం చేయదగిన పని కాదు.

పరభాషా పదాల, ముఖ్యంగా ఇంగ్లిష్ పదాల, అక్షరక్రమాన్ని తప్పుగా రాయడం కూడ తెలుగు కథకుల్లో కనబడుతున్నది. నిజానికి ఆయా స్థలాలలో పరభాషా పదాల అవసరం లేకపోవడం ఒక ఎత్తయితే, వాటిని సరిగా వాడకపోవడం మరొక ఎత్తు. ఇది వారి నేర్పు మీద, అవగాహనా స్థాయి మీద వ్యాఖ్య కాదు గాని, అజాగ్రత్త ఫలితం కావచ్చు. రచయిత అజాగ్రత్త పాఠకులలో ఆ రచయిత మీద గౌరవాన్నీ విశ్వాసాన్నీ తగ్గిస్తుంది, రచయిత ఎంత గొప్ప విషయం చెప్పినా ఇలా గౌరవాన్నీ, విశ్వాసాన్నీ కోల్పోతే, చెప్పే విషయానికి విలువ తగ్గుతుంది. అలాగే విరామ చిహ్నాల వాడకంలో కూడ తెలుగు కథకులలో అత్యధికులు అవసరమైన, తగిన శ్రద్ధ తీసుకోవడం లేదనిపిస్తున్నది. ఒక్క ఫుల్ స్టాప్ మినహాయిస్తే, మిగిలిన అన్ని విరామ చిహ్నాలనూ అనవసరంగానో, తప్పుగానో వాడుతున్నారు.

**

ఈ చిన్న పొరపాట్లను అలా ఉంచి తెలుగు కథ తప్పనిసరిగా 2009లో నడవవలసిన దారిలోనే నడిచింది. సమాజాన్ని అర్థం చేసుకోవలసిన పద్ధతిలోనే అర్థం చేసుకున్నది, సరిగానే చిత్రించింది, విశ్లేషించింది. వంద సంవత్సరాలకు పైగా సమాజ సాహిత్య సంబంధాల అన్యోన్యతకు ప్రతీకగా ఉన్న తెలుగు కథ తన ఘనమైన వారసత్వాన్ని కొనసాగించింది. ఉజ్వల భవిష్యత్తుకు హామీగా నిలిచింది.

 

ప్రచురణ: కథావార్షిక 2009 – సంపాదకులు: డా. వి ఆర్ రాసాని, మధురాంతకం నరేంద్ర – మధురాంతకం రాజారాం సాహిత్య సంస్థ, తిరుపతి – అక్టోబర్ 2010

 

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Telugu. Bookmark the permalink.

One Response to కథలో ఒదిగిన కొత్తతరం జీవన దృశ్యాలు

  1. gajula says:

    mee vishleshana chaalaa bhaagundi.madhuraantakam rajaramgaari chivari rojulalo nenu aayanaku vaidya parangaa seva chesE bhaagyam kaligindhi,e vidhamgaa aayananu marosaari gurthuchesaaru.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s