ఆదర్శ్, 2జి స్పెక్ట్రమ్ కుంభకోణాలు

వీక్షణం డిసెంబర్ 2010 సంచిక కోసం

కామన్ వెల్త్ క్రీడల విషయంలో అధికార యంత్రాంగం, రాజకీయ నాయకులు ఎట్లా వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారో చిత్రవిచిత్రమైన కథలు చదవడం ఇంకా పూర్తి కాకముందే పత్రికా పాఠకులకు మరొక రెండు రసవత్తరమైన కథలు అందాయి. ఒకదాని పేరు ఆదర్శ దోపిడీ. మరొకదానిపేరు గాలి అమ్మకంలో అక్రమాలు. మొదటిదానికి ఒక ముఖ్యమంత్రి తల దొర్లింది, రెండో దానికి ఒక కేంద్ర మంత్రి తల దొర్లింది. నిజం చెప్పాలంటే తలలు దొర్లినట్టు నాటకం జరిగింది గాని ఆ రెండు కుంభకోణాలలో దోపిడీ – మొదటి దానిలో వెయ్యి కోట్ల రూపాయల పైన, రెండవదానిలో లక్షకోట్ల రూపాయల పైన – యథావిధిగా జరిగిపోయింది. ప్రజల వనరులను కొల్లగొట్టి కొద్దిమంది రాజకీయ నాయకులు, వ్యాపారులు పోగు చేసుకున్న సంపదలోంచి ఒక్క పైసా వెనక్కి రాలేదు, రప్పించాలనే ఆలోచనా లేదు. ఈ మహా అవినీతికి పాల్పడిన వారిలో ఒక్కరిని బోనెక్కించి శిక్షించిన, శిక్షించబోతున్న దాఖలా లేదు.

ఆదర్శ్ హౌజింగ్ సొసైటీ

తమ దోపిడీ ఎక్కడెక్కడి దొంగలకూ ఆదర్శవంతమైన నమూనాగా ఉండాలని కాబోలు, ముంబైలో ఈ దోపిడీకి పూనుకున్న పెద్దలు దానికి ఆదర్శ్ హౌజింగ్ సొసైటీ అని పేరు పెట్టుకున్నారు. ఈ వ్యవహారం మొదలయినది పది సంవత్సరాల కింద. పదవీ విరమణ చేసిన సైనికాధికారులకు, కార్గిల్ యుద్ధంతో సహా ఇతర యుద్ధాలలో మృతి చెందిన సైనికుల కుటుంబసభ్యులకు ముంబైలోని అత్యంత సంపన్నమైన కొలాబాలో చౌకధరలకు ఇళ్లు కట్టి ఇవ్వడానికి ఈ సొసైటీ 2000 ఏప్రిల్ లో ఏర్పడింది. ఈ సొసైటీలో సైనికులు కానివారికి, సాధారణ ప్రజలకు కూడ సభ్యత్వం ఇవ్వడానికి అనుమతించాలని 2000 జూన్ లో వచ్చిన ఒక అభ్యర్థనను అప్పటి రెవెన్యూ మంత్రి అశోక్ రావు చవాన్ ఆమోదించాడు. అప్పటి ముఖ్యమంత్రి విలాస్ రావు దేశముఖ్ నుంచి, ఆ తర్వాతి ముఖ్యమంత్రులు సుశీల్ కుమార్ షిండే, నారాయణ్ రాణె, అశోక్ రావు చవాన్ అనేక అక్రమమార్గాలలో, చట్ట నిబంధనలను అతిక్రమిస్తూ ఈ సొసైటీకి ఎన్నెన్నో రాయితీలు, తాయిలాలు, బహుమతులు ఇస్తూ వచ్చారు. వీరిలో రాణె శివసేనకు చెందిన నాయకుడు కాగా, మిగిలిన ముగ్గురూ కాంగ్రెస్ నాయకులుగా అవినీతికి పార్టీ భేదం లేదని ప్రకటించారు. 2001 అక్టోబర్ లో, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖను కూడ నిర్వహిస్తున్న అప్పటి ముఖ్యమంత్రి దేశముఖ్ ఈ సొసైటీకి ఇవ్వబోయే స్థలం పక్కనే ఉన్న రోడ్డు వెడల్పు తగ్గిస్తూ, ఆ స్థలాన్ని కూడ సొసైటీకి ఇవ్వడానికి మార్గం సుగమం చేశాడు. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నుంచి ఈ భవన నిర్మాణానికి అనుమతి రాకపోయినా, వచ్చిందని తప్పుడు ఆధారం సృష్టించి బొంబాయి మునిసిపల్ కార్పొరేషన్ ను తప్పుదారి పట్టించడంలో కూడ దేశముఖ్ చెయ్యి ఉంది. ఇందుకు ప్రతిఫలంగానే కావచ్చు, దేశముఖ్ చెప్పిన ముగ్గురు వ్యక్తులకు ఈ భవనంలో ఇళ్లు ఇచ్చారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన షిండే కూడ 2003 మార్చిలో ఈ భవనానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి వచ్చిందని తప్పుడు ప్రకటన చేశాడు. చివరికి ముఖ్యమంత్రిగా 2004 జూలైలో ఈ స్థలాన్ని సొసైటీకి కేటాయించాడు. దానికి ప్రతిగా షిండే సన్నిహితుడి తండ్రికి ఒక ఫ్లాట్ అందింది. ఆ తర్వాత 2007 ఆగస్ట్ లో సైనికేతర వ్యక్తులను సొసైటీ సభ్యులుగా తీసుకుంటున్నప్పుడు అప్పటి రెవెన్యూ మంత్రి రాణె బంధువు ఒకరు సభ్యులయ్యారు. ఇక చవాన్ భార్య సోదరుడు, సోదరి, తల్లి ముగ్గురూ కూడ ఈ సొసైటీలో సభ్యులే. వారు తన కుటుంబ సభ్యులు కారని, తన కుటుంబం అంటే తన భార్య, తన ఇద్దరు పిల్లలు మాత్రమేనని చవాన్ వాదిస్తున్నారు.

ఇంతమంది ముఖ్యమంత్రుల అండతో తయారయిన ఆదర్శ్ హౌజింగ్ సొసైటీ సాగించిన చట్ట అతిక్రమణలకు లెక్కలేదు: ఈ స్థలం సముద్రతీరానికి దగ్గరగా, కోస్టల్ రెగ్యులేషన్ జోన్ 2 లో ఉంది గనుక ఇక్కడ ఏ నిర్మాణం జరపాలన్నా, కోస్టల్ జోన్ మేనేజిమెంట్ అథారిటీ, కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ అనుమతులు కావాలి. కాని దీనికి ఏ అనుమతులూ లేవు. నిబంధనల ప్రకారం ఈ ప్రాంతంలో భవనాల ఎత్తు స్థల వైశాల్యానికి 1.33 రెట్లకు మించకూడదు. కాని ఆ నిబంధనలను అతిక్రమించి 103 మీటర్ల ఎత్తయిన భవనం నిర్మించారు. ఈ స్థలం పక్కనే మొదట ఒక బస్ డిపో కోసం స్థలం కేటాయించి, భవనం ఎత్తు పెంచడం కోసం ఆ స్థలాన్ని కూడ కలిపి లెక్కించారు. నిజానికి ఇక్కడ మొదట ఆరు అంతస్తుల భవనం కోసం మాత్రమే అనుమతి మంజూరయింది. ఆ తర్వాత దాన్ని ఎనిమిది అంతస్తులుగా మార్చారు. ఆ తర్వాత 14 అంతస్తులకు, 52 ఫ్లాట్స్ కు మార్చారు. చివరికి 31 అంతస్తులకు మార్చారు.

ఈ స్థలం మొత్తం వైశాల్యం 6,450 చదరపు మీటర్లు. ముంబాయిలో ఈ ప్రాంతంలో ఉన్న మార్కెట్ ధరలను బట్టి ఈ స్థలం ఖరీదు రు. 50-60 కోట్లు ఉంటుంది. కాని ప్రభుత్వానికి ఆదర్శ్ సొసైటీ రు. 16 కోట్లు మాత్రమే చెల్లించింది. సొసైటీలో మొదట 30 మంది సభ్యులే ఉండేవారు. కాని ఎడాపెడా సభ్యులను చేరుస్తూ వెళ్లి సభ్యుల సంఖ్య మొదట 70కి, ఆతర్వాత 103కు పెంచారు. 625 చదరపు అడుగులు, 1000 చదరపు అడుగులు ఉండే ఫ్లాట్లను ఒక్కొక్కటి రు. 50 నుంచి రు. 80 లక్షలకు అమ్మారు. కాని ఇక్కడ అటువంటి ఒక ఫ్లాట్ రు. 6 కోట్ల నుంచి రు. 9 కోట్ల వరకు ఖరీదు చేస్తుంది. అంటే ఒక్కొక్క రాజకీయ నాయకుడికి ఒక్క ఫ్లాట్ ఇచ్చినా రు. 5 నుంచి 8 కోట్లు ఇచ్చినట్టేనన్నమాట.

ప్రస్తుతం ఈ కుంభకోణం మీద కేంద్ర నేర పరిశోధక శాఖ దర్యాప్తు జరుగుతోంది. కేసులు నడుస్తున్నాయి. అశోక్ రావు చవాన్ తన పదవి నుంచి దిగిపోయాడు. కాని ఆ కుంభకోణానికి సంబంధించిన వాస్తవాలను బయటపెట్టే కీలకమైన ఫైళ్లు, కాగితాలు కనిపించడం లేదని వార్తలు వస్తున్నాయి.

కార్గిల్ మృతుల బంధువులు, మాజీ సైనికాధికారుల పేరు చెప్పి ముంబై సముద్రతీరంలో వెయ్యి కోట్ల రూపాయల పైన ఖరీదు చేసే భవనం ఇన్నిన్ని అక్రమాలతో నిర్మిస్తుంటే రెండు పార్టీలకు చెందిన నలుగురు ముఖ్యమంత్రులు, పది సంవత్సరాల కాలంలో పనిచేసిన వేరువేరు ప్రభుత్వాధికారులు ఈ అక్రమాల పరంపరకు వత్తాసు పలికారంటే, ఈ దేశం ఎట్లా దొంగల దోపిడీకి నిలయమయిపోతున్నదో తెలియడం లేదా? ఇప్పటికీ చట్టాలు పవిత్రమైనవని, చట్టాలను గౌరవించాలని, ముఖ్యమంత్రి, ప్రజాప్రతినిధులు అనే పదవులు ప్రజాస్వామికమైనవని, గౌరవించవలసినవని అనుకునేవాళ్ళు ఎంత అమాయకులయి ఉండాలి?

2జి స్పెక్ట్రం

ఇక 2 జి స్పెక్ట్రం అనేది మరొక విచిత్రమైన ఆలీబాబా నలభై దొంగలను మించిన బందిపోటు కథ. 2జి అంటే రెండవ జనరేషన్ – తరం. స్పెక్ట్రం అంటే విద్యుదయస్కాంత తరంగాల పరిధి. గాలిలో విద్యుదయస్కాంత తరంగాలు అత్యంత వేగంగా పయనిస్తూ క్షణాల్లో భూగోళాన్ని చుట్టిరాగలవు. ధ్వనిని ఏ స్థాయిలో విద్యుదయస్కాంత తరంగాలుగా మారిస్తే ఎంత సమర్థంగా, ఎంత వేగంగా ఆ తరంగాలు ప్రయాణించగలవు అనేదాన్ని బట్టి స్పెక్ట్రం నిర్ణయమవుతుంది. దాన్ని మెగాహెర్జ్ అనే ప్రమాణంతో కొలుస్తారు. గత రెండు దశాబ్దాలలో ఈ స్పెక్ట్రం విషయంలో జరిగిన పరిశోధనలవల్ల వైర్ లెస్ (సెల్ ఫోన్) సంభాషణలకు, వైర్ లెస్ లిఖిత సమాచార వినిమయానికి (ఎస్ ఎం ఎస్ – ఇంటర్నెట్) అవకాశం వచ్చింది. ఈ అవకాశాలను రెండవతరం అన్వేషణలు అంటారు. మూడవతరం అన్వేషణలు కూడ సాగి చిత్రాలను కూడ వైర్ లెస్ లో పంపే అవకాశం వచ్చింది.

ఈ రెండవతరం స్పెక్ట్రం అమ్మకాలలో జరిగిన అక్రమాల గురించి, దోపిడీ గురించి చెప్పుకోబోయే ముందు ఒక నవలను గుర్తు చేసుకోవాలి. కెన్యన్ రచయిత గూగీ వా థియోంగో నవల ‘డెవిల్ ఆన్ ది క్రాస్’ (మట్టికాళ్ల మహారాక్షసి)లో అంతర్జాతీయ దోపిడీ దొంగల సమావేశంలో ఒక్కొక బందిపోటూ వచ్చి తాను ఎంత తెలివైన దొంగతనం చేశాడో, ప్రజలను ఎట్లా మోసం చేసి ఎంత సంపాదించాడో చెపుతుంటాడు. భూమిని అమ్మినవాళ్లు, చదువును అమ్మినవాళ్లు, నీటిని అమ్మినవాళ్లు, తిండిని అమ్మినవాళ్లు, చివరికి ప్రాణవాయువును అమ్మినవాళ్లు ప్రజలకు అత్యవసరమైన వస్తువులమీద తమ ఆధిపత్యం సంపాదించుకుని, అమ్మి ఎట్లా ఇబ్బడిముబ్బడిగా డబ్బు సంపాదించారో చెపుతారు. 1970ల చివర రాసిన ఆ నవలలో గూగీ ప్రాణవాయువును పొట్లాలు కట్టి అమ్మే దొంగలు వస్తారని కూడ ఊహించారుగాని, ఆయన ఊహను కూడ మించి గాలిని కూడ అమ్మే దొంగలు ఇప్పుడు భారత రాజకీయాల్లో, వ్యాపారంలో తేలారు.

రెండవతరం స్పెక్ట్రం గురించి ఇంకా తెలియక ముందే భారత దేశంలో టెలికమ్యూనికేషన్స్ రంగంలో లాభార్జనకు చాల అవకాశాలున్నాయని దేశదేశాల సంపన్నుల, బహుళజాతి సంస్థల నోళ్లు ఊరడం మొదలయింది. నూతన ఆర్థిక విధానాలు మొదలైనప్పటినుంచీ టెలికాం రంగాన్ని ప్రైవేటీకరించమని, ప్రభుత్వరంగ పెట్టుబడుల ఉపసంహరణ జరపమని ఒత్తిడి పెరుగుతోంది. ప్రభుత్వాలు కూడ క్రమక్రమంగా ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడులు ఉపసంహరిస్తూ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిపై ఆంక్షలు ఎత్తివేస్తూ, సాంకేతిక పరిజ్ఞానం దిగుమతి ద్వారా ప్రజలకు హెచ్చు అవకాశాలు కల్పిస్తున్నామంటూ రాజమార్గంలోనూ, దొడ్డిదారిలోనూ టెలికాం రంగాన్ని బహుళజాతి సంస్థల చేతుల్లో పెట్టింది. అందుకే రెండు దశాబ్దాలలో ప్రభుత్వ రంగ సంస్థలయిన బి ఎస్ ఎన్ ఎల్, ఎం టి ఎన్ ఎల్, ఐటిఐ, హిందుస్తాన్ కేబుల్స్ లిమిటెడ్ వంటివి చితికిపోతుండగా దేశదేశాల టెలికాం కంపెనీలు ఇక్కడ తమ ప్రాబల్యాన్ని, మార్కెట్లను, లాభాలను పెంచుకుంటున్నాయి. ఈ క్రమంలో 1991 నుంచి 1996 దాకా పి వి నరసింహారావు మంత్రివర్గంలో టెలికాం మంత్రిగా పనిచేసిన సుఖ్ రాం హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కంపెనీ అనే పేరుతో నాణ్యతలేని టెలికాం యంత్రపరికరాల దిగుమతికి అనుమతించి ఆరోజుల్లోనే రు 3000 కోట్ల అవినీతికి తెరతీశారు. ప్రైవేటు కంపెనీలను అనుమతించే జాతీయ టెలికాం విధానం కూడ అప్పుడే అమలులోకి వచ్చింది.

ఆ తర్వాత సాంకేతిక పరిజ్ఞానంలో కూడ వేగవంతమైన మార్పులు వచ్చాయి. వైర్ లెస్ సాంకేతిక పరిజ్ఞానం విస్తరించి, సెల్ ఫోన్ వాడకందార్ల సంఖ్య పెరిగి, భారత మార్కెట్ ప్రపంచంలోనే పెద్ద మార్కెట్లలో ఒకటిగా లాభసాటిగా మారింది. అంతర్జాతీయ టెలికాం వ్యాపారులు, బహుళజాతిసంస్థలు, బ్రోకర్లు భారత మార్కెట్ లో ప్రవేశించడానికి మార్గాలు వెతకడం మొదలయింది. టెలికాం శాఖలో నిర్ణయాధికారంగల ఉన్నతోద్యోగాల కోసం, అత్యున్నతాధికారం గల కేంద్ర మంత్రి పదవి కోసం వెంపరలాట మొదలయింది. అలా 2004 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ను బలపరచి కేంద్ర మంత్రివర్గంలో చేరడానికి తనకు టెలికాం మంత్రిత్వశాఖ కావాలని డి ఎం కె బేరాలాడింది. ఆ పదవిలో మూడు సంవత్సరాలు ఉన్న దయానిధి మారన్ అవినీతి ఆరోపణలపై రాజీనామా చేసిన తర్వాత కూడ ఆ మంత్రిత్వశాఖ తనకే కావాలని అడిగిన డి ఎం కె ఎ. రాజాకు ఆ పదవి ఇచ్చింది.

టెలికాం మంత్రిగా రాజా 2008 జనవరిలో 2జి స్పెక్ట్రం కోరుతూ దరఖాస్తులు పెట్టుకున్న కంపెనీలలో అర్హులకు లైసెన్సులు ఇచ్చేందుకు అప్పటికే ఏర్పడి ఉన్న వేలం పద్ధతులకు, ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం అందజేసే వారికి లైసెన్సు ఇచ్చే పద్ధతులకు భిన్నంగా మొదట వచ్చిన వారికి మొదట లైసెన్సు అనే పద్ధతి ప్రవేశపెట్టారు. (నిజానికి ఇది కూడ రాజా ప్రారంభించినది కాదు, ఎన్ డి ఎ ప్రభుత్వ కాలంలో టెలికాం మంత్రిగా పనిచేసిన అరుణ్ శౌరి 2003లోనే ప్రారంభించాడు). ఆరకంగా కంపెనీల చరిత్ర, గత పనితీరు, ఆర్థిక సామర్థ్యం, సాంకేతిక సామర్థ్యం వంటివేవీ పరిగణనలోకి తీసుకోకుండా 122 లైసెన్సులను మంజూరు చేశారు. ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానం వల్ల రోజురోజుకూ ధరలు పెరుగుతుండగా, 2008లో ఇచ్చిన ఈ లైసెన్సుల మంజూరీ 2001 ధరల ప్రకారం జరిగింది.

ప్రభుత్వంలోని వివిధ విభాగాల పనితీరు మీద, ముఖ్యంగా ఆర్థిక నిర్వహణమీద చట్టబద్ధంగా పర్యవేక్షణ జరిపు, పార్లమెంటుకు నివేదిక సమర్పించే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (సి ఎ జి) ఈ లైసెన్సుల పంపిణీని పరిశీలించినప్పుడు లెక్కలేనన్ని అవకతవకలు కనబడ్డాయి. ఇచ్చిన 122 లైసెన్సులలో 85 లైసెన్సులు పొందిన కంపెనీలకు నిబంధనల ప్రకారం ఉండవలసిన అర్హతలు లేవని తేలింది. ఇటువంటి అనర్హ కంపెనీలలో యునిటెల్ గ్రూపు, వీడియోకాన్ ఉన్నాయి. అలాగే నిబంధనలు విరుద్ధంగా రిలయన్స్ గ్రూపు మరొక సంస్థలో హెచ్చు వాటా తీసుకుని ఆ కంపెనీ పేరుమీద లైసెన్సు పొందింది. ఇంకా ఘోరంగా, 2008 జనవరిలో ఇలా రు. 1,357 కోట్ల లైసెన్సు ఫీ చెల్లించి లైసెన్సు పొందిన కంపెనీ ఒకటి సెప్టెంబర్ లో తన కంపెనీలో 45 శాతం వాటాను ఒక దుబాయి కంపెనీకి రు. 4,500 కోట్లకు అమ్మింది. అలాగే మరొక కంపెనీ రు. 1,651 కోట్లకు సంపాదించిన లైసెన్సులో 60 శాతం వాటాను రు. 6,200 కోట్లకు అమ్మింది. ఈ మారుబేరం చేసిన దొంగ కంపెనీలకు తమిళనాడులో డి ఎం కె ప్రభుత్వంతో కూడ సత్సంబంధాలున్నాయని తేలింది. స్వయంగా రాజా భార్య ఈ దొంగ కంపెనీకి డైరెక్టర్ల బోర్డులో ఉన్నారు. మొత్తం మీద ఈ అక్రమ లైసెన్సుల వల్ల దేశ ఖజానాకు రావలసి ఉండిన రు. 1,76, 645 కోట్లు నష్టం వాటిల్లిందని కాగ్ నివేదిక తెలియజెప్పింది.

ఈ నివేదిక గురించి తర్జనభర్జనలు జరుగుతుండగానే, 3జి స్పెక్ట్రం వేలం జరిగింది. ఆ వేలం పాటలో ప్రభుత్వానికి ఒక లక్షా ఆరు వేల కోట్ల రూపాయల ఆదాయం రావడంతో, 2జి స్పెక్ట్రం వేలం జరిగి ఉంటే తప్పనిసరిగా ఎక్కువ ఆదాయం వచ్చి ఉండేదనే నిర్ధారణ జరిగింది. రాజా తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది.

ఈ కథ ఇంతటితో అయిపోలేదు. 2009 ఎన్నికల తర్వాత కూడ కేంద్ర ప్రభుత్వానికి డి ఎం కె మద్దతు అవసరమయింది గనుక మంత్రి పదవుల కోసం బేరంలో రాజా తనకు టెలికాం మంత్రిత్వపదవే కావాలని పట్టుపట్టాడు. ఆ పదవి ఆయనకు ఇప్పించడానికి అటు రిలయన్స్ అంబానీలకు, ఇటు టాటాలకు ప్రజాసంబంధాలు, పైరవీలు చేసిపెట్టే నీరా రాడియా అనే మహిళ వీర్ సంఘ్వీ, బర్ఖా దత్ వంటి జర్నలిస్టులతోనూ, భాజపా నాయకుడు వాజపేయి అల్లుడు రంజన్ భట్టాచార్యతోనూ జరిపిన సంభాషణల రికార్డులు సుప్రీం కోర్టు ముందుకు చేరాయి.

కామన్ వెల్త్ గేమ్స్ నిర్వహణలో జరిగిన కోట్ల రూపాయల కుంభకోణం వార్తలు ఇంకా చల్లారకముందే ఆదర్శ్ హౌజింగ్ సొసైటీ కుంభకోణం బయటపడి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవలసి వచ్చింది. ఆ కుంభకోణం వార్తలు అలా ఉండగానే 2జి స్పెక్ట్రం అమ్మకాలలో టెలికాం మంత్రిత్వశాఖ అక్రమాల గురించి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికలు, కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ సుప్రీంకోర్టుకు సమర్పించిన ఫోన్ సంభాషణల రికార్డులు బయటపడ్డాయి. టెలికాం మంత్రి ఎ రాజా రాజీనామా చేయవలసి వచ్చింది. ఈ కుంభకోణం మీద పూర్తి విచారణ కోసం సభాసంఘాన్ని వేయాలని డిమాండ్ మీద పార్లమెంటు సమావేశాలు అట్టుడుకుతుండగానే ఎల్ ఐ సి హౌజింగ్ ఫైనాన్స్, కొన్ని బ్యాంకులు, కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు కలిసి సాగించిన వేల కోట్ల రూపాయల గృహ రుణాల కుంభకోణం వార్తలు వస్తున్నాయి.

ఈ మూడు కుంభకోణాలు ఈ రెండునెలలవే కాగా యుపిఎ పాలన అంతా కుంభకోణాల రాజ్యమేనని పత్రికలు రాస్తున్నాయి. ఈ మూడు కుంభకోణాల కంటె ముందు ఐపిఎల్ కుంభకోణం, జలాంతర్గాముల కొనుగోలు కుంభకొణం, బియ్యం ఎగుమతుల కుంభకోణం, అణు ఒప్పందం సందర్భంగా పార్లమెంటు సభ్యులకు డబ్బు ఇవ్వజూపిన కుంభకోణం, ప్రసారభారతి కాంట్రాక్టుల కుంభకోణం వంటివి ఎన్నో రెండో సారి యుపిఎ అధికారానికి వచ్చిన తర్వాతనే జరిగాయి. ఇక మొదటి యుపిఎ పాలనాకాలంలో కూడ ఇటువంటి కుంభకోణాలకు, అవినీతికి తక్కువేమీలేదు.

ప్రపంచీకరణ మొదలయినతర్వాత దేశంలో అవినీతి, కుంభకోణాలు, చీకటి బజారు పెరిగిపోయాయంటూ 1999లో ‘బ్లాక్ ఎకానమీ ఇన్ ఇండియా’ రాసిన ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ అర్థశాస్త్ర అధ్యాపకులు అరుణ్ కుమార్ ప్రస్తుతం జాతీయాదాయంలో సగం ఇటువంటి అక్రమ ధనంతోనే నిండి ఉన్నదని అంటున్నారు. ఆర్థిక వ్యవస్థలోకి ఎక్కువ డబ్బు ప్రవహించడమంటే ఎక్కువ అవినీతికి తావు దొరకడమే అంటున్న అరుణ్ కుమార్ 1980లలో మొత్తం మీద పెద్ద అవినీతికుంభకోణాలు బోఫోర్స్ కుంభకోణంతో సహా 8 నమోదయ్యాయని, 1990లలో వాటి సంఖ్య 26కు పెరిగిందని, ఈ దశాబ్దంలో దాదాపు నెలకు ఒకటి చొప్పున బయటపడుతున్న కుంభకోణాలు మూడంకెల సంఖ్యలో ఉండవచ్చునని అన్నారు. నీతిమంతుడుగా, నిరాడంబరుడుగా పేరున్న డా. మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా, ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడే పరిస్థితి ఇలా ఉందంటే తన చుట్టూ జరుగుతున్న అవినీతి పట్ల ఆయన కళ్లు మూసుకుని ఉన్నారనుకోవాలి.

క్రీడలు, ఎగుమతులు, భూమి, సముద్ర తీరాలు, శవపేటికలు, రక్షణ సామగ్రి, ఖనిజాలు, కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న సైనిక కుటుంబాల పేరు మీది గృహాలు, ధ్వనితరంగాలను పంపే గాలి, లేని మనుషుల పేర్లమీద గృహ రుణాలు మంజూరు చేయడం…అవినీతికి ఆలవాలం కాని ఒక్కటంటే ఒక్క సామాజిక రంగం కూడ లేని స్థితి సూచిస్తున్నదొక్కటే. ఈ వ్యవస్థ యథాతథంగా కొనసాగడానికి వీలులేనంతగా కుళ్లిపోయిందని. అరవై సంవత్సరాలుగా రాజ్యాంగం హామీ ఇచ్చిన ఏ ఒక్క హక్కూ అందక, కూడూ గూడూ గుడ్డా వంటి కనీసావసరాలు తీరక, అవి తీర్చమని అడిగితే లాఠీలూ తూటాలూ చెరసాలలూ జవాబు చెపుతున్న జీవన వాస్తవం ఒకవైపు, అధికారం చేజిక్కించుకుని, ఆ అధికారాన్ని అడ్డుపెట్టుకుని వందల, వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కైంకర్యం చేస్తున్న పిడికెడు మంది సంపన్నులూ రాజకీయవేత్తలూ అధికారులూ ఒకవైపు ఉన్నప్పుడు మౌనంగా ఉండడం నేరం కాదా? ఆ అసహ్యకరమైన సంపద పోగుచేస్తున్న వారిమీద రాయయినా విసరడం కర్తవ్యం కాదా?

 

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Veekshanam. Bookmark the permalink.

2 Responses to ఆదర్శ్, 2జి స్పెక్ట్రమ్ కుంభకోణాలు

  1. gajula says:

    nEnu sagatu bhaarateeyunni,raayi visirithE-ayyo paapam anukuntaanu .evari karmaku vaallE bhaadyulu anukuntaanu .E dhevudainaa vachhi E dhesaanni kaapadithE bhaaguntundi anukuntaanu,anthE kaani raayi……ayyo paapam…

  2. A. Janardhan says:

    ఐటం చాలా బావుంది.. మంచి ఇన్షర్మేషన్ లభించింది

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s