భారత పైరవీస్వామ్యం గురించి రాడియా నిజాలు

ఈభూమి జనవరి 2011 సంచిక కోసం

ప్రపంచంలోకెల్లా పెద్ద ప్రజాస్వామ్య దేశం మనదేనని ఇంతకాలమూ అలవాటు పడిన గప్పాలు కొట్టడం ఇకనైనా ఆపాలి. ఒంటిమీద నూలుపోగు లేని చక్రవర్తి ధరించిన దేవతావస్త్రాలు “బాగున్నాయం”టే “మహా బాగున్నాయ”ని అరవై సంవత్సరాలుగా సాగుతున్న వందిమాగధ అబద్ధ స్తోత్రాలు ఇప్పటికైనా కట్టిపెట్టాలి. ఈ దేశంలో పాలన ఎలా సాగుతున్నదో అక్షరాలా చెప్పి, ఆ గప్పాల గాలి తీసినందుకు, ఆ స్తోత్రాల గుట్టు రట్టు చేసినందుకు నీరా రాడియా సంభాషణలను అభినందించాలి. అంగీకరించాలి. ఆ మాటల వెనుక దాగిన అర్థాల్ని అన్వేషించడానికి ప్రయత్నించాలి.

ఎవరీ నీరా రాడియా? ఆమె సంభాషణల ప్రాముఖ్యత ఏమిటి?

“మహా ఘనత వహించిన భారత దేశంలో ఒక రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్య పాలన సాగుతున్నది. ప్రజల సర్వసత్తాక అధికారం నడుస్తున్నది. ప్రజలు తమ సార్వభౌమాధికారంతో ఎన్నికలలో పాల్గొని తమకు ఇష్టం వచ్చిన ప్రతినిధిని ఎన్నుకుని ప్రజాప్రతినిధుల సభకు పంపుతారు. అలా ఎన్నికైన ప్రజాప్రతినిధులలో అత్యధిక సంఖ్యాకులు ఉన్న రాజకీయ పక్షం, లేదా రాజకీయ పక్షాల కూటమి నాయకుడిని ప్రభుత్వం స్థాపించడానికి ఆహ్వానిస్తారు. ఆ సభానాయకుడు తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఆ మంత్రులకు వారివారి నైపుణ్యాన్ని బట్టీ, అనుభవాన్ని బట్టీ మంత్రిత్వ శాఖల నిర్వహణ బాధ్యత అప్పగిస్తారు. మొత్తంగా ప్రతినిధుల సభ  ప్రజలకు అవసరమైన శాసనాలు చేయగా, మంత్రివర్గం ఆ శాసనాలకు అనుగుణంగా పాలిస్తుంది. ఈ పాలనలో ప్రధాన పాత్ర వహించే మంత్రులు ‘శాసనము ద్వారా స్థాపితమై యున్న భారత సంవిధానము పట్ల శ్రద్ధానిష్ఠలను’ కలిగి ఉంటారు. ‘భయ, పక్షపాత, రాగ, ద్వేష రహితముగా…సకల జనులకు న్యాయం చేకూరు’స్తారు. ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే తీసుకోబడే భారత ప్రజాస్వామిక ప్రభుత్వ నిర్ణయాలన్నీ ప్రజలకొరకు, ప్రజలచేత అమలవుతాయి” – ఈ అందమైన కలను రాజనీతి శాస్త్రమూ ప్రభుత్వ పాలనా శాస్త్రమూ చదువుకోవలసి వచ్చిన అమాయకులు పాఠ్యపుస్తకాలలో ఎక్కడో ఒకచోట కనే ఉంటారు. లేదా అవి చదువుకోకుండా కూడ ప్రచార సాధనాల ద్వారా ప్రభుత్వ పాలన గురించి బోలెడంత జ్ఞానం సంపాదించుకున్న మేధావులు వినే ఉంటారు.

కాని అదంతా కల మాత్రమే, వాస్తవానికీ ఆ కలకూ ఏమీ సంబంధం లేదు, నిజం చెప్పాలంటే అదంతా పచ్చి అబద్ధం అని కొరడాతో – క్షమించాలి, దొంగచాటుగా విని రికార్డు చేసిన సంభాషణలతో – కొట్టి మరీ మన కళ్లు తెరిపించినందుకు నీరా రాడియా అనే మహానుభావురాలికి మనం ఎల్లవేళలా కృతజ్ఞులమై ఉండాలి. ఏ శాఖ ఏ మంత్రికి కేటాయించాలనేది నిర్ణయం కావడానికి నైపుణ్యం తోనూ, అనుభవం తోనూ ఏమీ సంబంధం లేదని, కేవలం సంకీర్ణ ప్రభుత్వపు మనుగడకు అవసరమైనవారెవరు, ఏ మంత్రిత్వశాఖలో ఎక్కువ ముడుపులు దొరుకుతాయి, ఆయా రాజకీయ పక్షాలు కొన్ని మంత్రిత్వశాఖలు సంపాదించడానికి ఎటువంటి బేరసారాలు ఆడుతాయి, ఎటువంటి అక్రమాలకు సిద్ధపడతాయి అనే ప్రమాణాల మీదనే ఈ సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర ప్రభుత్వం నిర్మాణమవుతున్నదని రాడియా సంభాషణలు తెలుపుతున్నాయి. ఈ మహా నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలు కోట్లాది ప్రజలు కాదు, వోటర్లు కాదు, ఎన్నికైన ప్రజాప్రతినిధులు కారు, చివరికి ప్రభుత్వం స్థాపించడానికి ఆహ్వానం వచ్చిన సభానాయకుడు కూడ కాదు. పిడికెడు మంది వ్యాపారవేత్తలు, రాజకీయనాయకులు తమ ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల కోసం ఈ నిర్ణయాలు చేస్తున్నారు. ఈ పనిలో వాళ్లకు అటు మాట ఇటు, ఇటు మాట అటు మోసేందుకు జర్నలిస్టులు సహకరిస్తున్నారు. ఈ పనినంతా లాబీయిస్టులు అనే గౌరవనీయమైన పేరు పెట్టుకున్న మధ్యవర్తులు, దళారీలు, బ్రోకర్లు, పైరవీకార్లు సాధించి పెడుతున్నారు. నీరా రాడియా ఇటువంటి లాబీయిస్టులలో ఒకరు. రాడియా టేపుల్లో ఇప్పటికి బయటపడినవి మాత్రమే విన్నా ఈ దేశం అమలవుతున్నది ప్రజాస్వామ్యం కాదనీ, పైరవీస్వామ్యమనీ, ఆర్థిక లావాదేవీల స్వామ్యమనీ అర్థమవుతుంది. నిజానికి ఈ దేశంలో పాలనకు సంబంధించి సాగుతున్న వ్యవహారాలలో రాడియా సంభాషణల్లో బయటపడినది సముద్రంలో కాకిరెట్టకన్న తక్కువ.

ఇంతకూ వాస్తవం ఏమిటి? మన కళ్లు కప్పి ఈ దేశంలో ప్రజాస్వామ్యం అమలవుతున్న విశిష్ట పద్ధతి ఏమిటి? మన కేంద్ర ప్రభుత్వంలో మంత్రిత్వశాఖలు ఎవరెవరికి ఎలా దక్కుతున్నాయి? పాలనా నిర్ణయాలను ఏ ప్రాతిపదికలమీద తీసుకుంటున్నారు? ఏ పద్ధతుల ప్రకారం అమలు చేస్తున్నారు? ఈ మొత్తం పాలనా క్రమంలో ప్రజలకు, ప్రజాభిప్రాయాలకు, ప్రజాప్రయోజనాలకు వీసమెత్తయినా విలువ ఉన్నదా లేదా? పదకొండు లక్షలకోట్ల రూపాయల వార్షిక బడ్జెట్ తో నడిచే కేంద్రప్రభుత్వంలో కొన్ని వేల కోట్ల రూపాయల నుంచి కొన్ని లక్షల కోట్ల రూపాయల దాకా ఖర్చుపెట్టే ఒక్కొక్క మంత్రిత్వశాఖకు అధిపతిగా ఎవరిని నియమించాలనడానికి ప్రాతిపదిక ఏమిటి? ఆయా మంత్రులు తమ శాఖకు కేటాయించిన ప్రజాధనాన్ని ప్రజోపయోగం కోసమే వెచ్చిస్తున్నారా లేక తమ బొక్కసాలు నింపుకుంటున్నారా? తమ పదవి వల్ల వచ్చిన నిర్ణయాధికారాన్ని ప్రజాప్రయోజన నిర్ణయాల కోసం వాడుతున్నారా, వ్యాపారవేత్తలకు, ఆశ్రితులకు లాభాలు చేకూర్చిపెట్టి అందులో వాటాలూ ముడుపులూ పొందుతున్నారా? ఇలాంటి అనేక భేతాళ ప్రశ్నలకు నిజమైన సమాధానాలు కావాలంటే నీరా రాడియా టేపుల వృత్తాంతం పైపైన అయినా తెలుసుకోవాలి.

ఒక మహిళ వ్యక్తిగత వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించడం సభ్యత కాదు గాని, ఇవాళ బయటపడుతున్న కుంభకోణానికి అవసరమైనంత కనీసంగానయినా నీరా రాడియా వివరాలు తెలుసుకోవాలి. కెన్యాలో పెరిగిన, బ్రిటిష్ పౌరసత్వం ఉన్న నీరా రాడియా తండ్రి కెన్యాలో విమానయాన రంగంలో పనిచేసే వారు. అందువల్ల ఆమెకు చిన్ననాటినుంచే విమానయాన సంస్థలతో, విమానయానంతో సంబంధం ఉండే కార్పొరేట్ సంస్థలన్నిటితో సన్నిహిత సంబంధం ఏర్పడింది. చదువుకోసం బ్రిటన్ వెళ్ళి అక్కడే స్థిరపడిన నీరా రాడియాకు భారతదేశం మీద ఆసక్తి 1990ల మొదట్లో ప్రారంభమయింది. దేశంలో 1991లో ప్రారంభమైన నూతన ఆర్థిక విధానాలలో భాగంగా వైమానిక రంగంలో కూడ సంస్కరణలు మొదలయ్యాయి. ఈ కొత్త మార్కెట్ అవకాశాలతో దేశీయ, అంతర్జాతీయ విమానయాన సంస్థల లోహ విహంగాలు భారతదేశం మీద వాలడం ప్రారంభించాయి. విదేశీ కంపెనీలను నేరుగా అనుమతించనప్పటికీ, దేశీయ ప్రైవేటు విమానయాన సంస్థలు పెరిగాయి.

అప్పుడే ప్రారంభమైన సహారా ఎయిర్ లైన్స్ లో లయజాన్ ఆఫీసర్ గా నీరా రాడియా భారతదేశంలో 1995 ప్రాంతాలలో ప్రవేశించారు. ఒక కార్పొరేట్ కంపెనీకి లయజాన్ ఆఫీసర్ అంటే ఆ కంపెనీకి అవసరమైన అనుమతులను ప్రభుత్వం నుంచి సంపాదించడానికీ, ఆ కంపెనీకి అనుకూలమైన వార్తలూ కథనాలూ వచ్చేలా పత్రికలతో, ప్రసార సాధనాలతో వ్యవహరించడానికీ ఉండే మధ్యవర్తి. అదే క్రమంలో ఆమె సింగపూర్ ఎయిర్ లైన్స్, కె ఎల్ ఎమ్ (రాయల్ డచ్ ఎయిర్ లైన్స్, నెదర్లాండ్స్), యు కె ఎయిర్ వంటి బహుళజాతి విమానయాన సంస్థలకూ, ఎయిర్ బస్ వంటి విమానాల తయారీ బహుళజాతిసంస్థకూ, విమానాలను అద్దెకు ఇచ్చే ఐ ఎల్ ఎఫ్ సి, ఎ ఎ ఆర్ వంటి కంపెనీలకూ భారతీయ ప్రతినిధిగా కూడ వ్యవహరించారు. మరో మాటల్లో చెప్పాలంటే ఆయా కంపెనీలకు రాయితీలు, మినహాయింపులు, లాభాలు సమకూర్చిపెట్టడానికి ప్రభుత్వాధికారులతో మాట్లాడుతూ, విధానాలు మార్పిస్తూ వచ్చారు.

అలాగే ఆమె ఎన్ డి ఎ ప్రభుత్వంలో విమానయాన మంత్రిగా పనిచేసిన భారతీయ జనతా పార్టీ నాయకుడు అనంతకుమార్ కు సన్నిహితమై ఆయన ద్వారా ప్రధాని అటల్ బిహారీ వాజపాయికి, అంతకన్న ఎక్కువగా వాజపాయి అల్లుడు రంజన్ భట్టాచార్యకు సన్నిహితులయ్యారు. ఆమె ప్రారంభించిన సంస్థలకు ఎల్ కె అద్వానీ ప్రారంభోత్సవాలు చేయడమూ, వాజపాయి మతాధిపతులతో ఉన్నప్పుడు ఆమె పక్కన ఉండి ఫొటోలు దిగడమూ కూడ జరిగాయి. ఈ పరిచయాలను ఉపయోగించుకుని క్రౌన్ ఎయిర్ అనే సొంత విమానయాన సంస్థను ఏర్పాటు చేయడానికి ఆమె 2000లో ప్రయత్నించారు. వందకోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు సంపాదించడానికి ఎఫ్ ఐ పి బి అనుమతి కూడ దొరికింది గాని సాంకేతిక కారణాలతో ఈ పథకం ముందుకు సాగలేదు.

ఆ ప్రయత్నం విఫలమయిన తర్వాత ఆమె సొంతంగా వైష్ణవి కమ్యూనికేషన్స్ అనే పబ్లిక్ రిలేషన్స్ సంస్థను స్థాపించారు. నోసిస్ స్ట్రాటెజిక్ కన్సల్టింగ్ సర్వీసెస్, విక్టామ్ కన్సల్టింగ్, న్యూకామ్ అనే అనుబంధ సంస్థలద్వారా కూడ నీరా రాడియా పబ్లిక్ రిలేషన్స్ కార్యకలాపాలు సాగుతుంటాయి. టాటా గ్రూప్ లోని 90 కంపెనీలకు, రిలయన్స్ కంపెనీలకు,  న్యూ ఢిల్లీ టెలివిజన్ (ఎన్ డి టి వి) కు సంబంధించిన పబ్లిక్ రిలేషన్స్ వ్యవహారాలను ఈ సంస్థలు నడుపుతున్నాయి. ఆ రెండు వ్యాపార గృహాలే నీరా రాడియా సేవలకు సాలీనా చెరొక రు. 30 కోట్లు ఇస్తున్నాయని అంచనా. ఇలా పబ్లిక్ రిలేషన్స్ దిగ్గజాల వంటి సంస్థలను నడుపుతూనే విమానయాన రంగంలో ఆసక్తి వదులుకోని నీరా రాడియా 2005లో, కొత్తగా వచ్చిన యు పి ఎ ప్రభుత్వంలో విమానయాన మంత్రిగా ఉన్న ప్రఫుల్ పటేల్ కు దగ్గరై, మాజిక్ ఎయిర్ అనే విమానయాన కంపెనీని స్థాపించడానికి ప్రయత్నించారు. ఈ సారి ఆమె బ్రిటిష్ పౌరురాలు అనే సాంకేతిక కారణం వల్ల ఆ ప్రయత్నం విఫలమైంది.

టాటా కంపెనీల పబ్లిక్ రిలేషన్స్ నిర్వాహకురాలిగా ఆమె పశ్చిమ బెంగాల్ లోని సింగూర్ లో నానో కారు తయారీ కర్మాగార ప్రతిపాదన ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించారు. చివరికి ఆ కర్మాగారం గుజరాత్ కు మారడంలో కూడ ప్రధాన పాత్ర వహించారు.

నిజానికి నీరా రాడియా పేరు మీద విమానయాన సంస్థ పెట్టడానికి జరిగిన ప్రయత్నాలన్నీ సింగపూర్ ఎయిర్ లైన్స్, టాటాలు కలిసి పెట్టదలచుకున్న కంపెనీకి ముసుగులు మాత్రమేనని పత్రికలు రాస్తున్నాయి. తాను ఒక విమానయాన సంస్థ పెట్టదలిచానని, కాని ఒక మంత్రి రు. 15 కోట్లు లంచం అడిగినందువల్ల ఆ పని చేయలేదని, ఒక వ్యక్తి తన ప్రయత్నాలకు అడ్డు తగిలాడని రతన్ టాటా ఇటీవల డెహ్రాడూన్ లో ఒక ఉపన్యాసంలో అన్నారు. లంచం అడిగిన మాట నిజమే కావచ్చు గాని, లంచాలు ఇవ్వగూడదనే పవిత్రతా ప్రమాణం వల్లనే టాటాలు వెనక్కి పోయారనడం నిజంకాదు. టాటాల కంపెనీలు సాగించిన అవినీతి గురించి ఎన్నెన్నో వివరాలు బయటపడుతూనే ఉన్నాయి. నీరా రాడియా ద్వారా సాగించిన పైరవీలు ఒక ఎత్తయితే, వి ఎస్ ఎన్ ఎల్ లో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ, టాటాల కొనుగోలు ఉదంతంలో వేలాది ఎకరాల భూమి ఆక్రమించడం కోసమే టాటాలు ఆ పని ఎలా చేశారో వికీలీక్స్ పత్రాలు బయటపెట్టాయి. ఇక్కడ అడ్డుపడిన వ్యక్తి అని టాటా ప్రస్తావించినది కూడ లంచం అడిగిన మంత్రి కన్న ఎక్కువగా జెట్ ఎయిర్ వేస్ యజమాని నరేష్ గోయల్ అని పత్రికలు రాస్తున్నాయి. వ్యాపార లావాదేవీలలో, లాభాల వేటలో, ప్రజల వనరులను దోచుకోవడంలో బడాపారిశ్రామిక, వ్యాపారవేత్తల మధ్య నడుస్తున్న పోటీ, కుత్తుకలు తెగకోసుకునే ఘర్షణలే ఇవాళ ప్రభుత్వ విధాన నిర్ణయాలకు, పత్రికలలో, ప్రచార సాధనాలలో యుద్ధాలకు దారితీస్తున్నాయని స్పష్టంగా బయటపడుతోంది.

సరే, మొత్తంగా నీరా రాడియా వ్యవహార సరళి మీద, ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల మీద ఆర్థిక మంత్రిత్వ శాఖలోని పన్నుల విభాగానికి 2007 నవంబర్ లో ఇద్దరు వ్యక్తులు చేసిన ఫిర్యాదు ఆధారంగా, హోం మంత్రిత్వ శాఖ అనుమతితో ఆదాయ పన్నుల విభాగం ఆమె టెలిఫోన్ సంభాషణలను రికార్డ్ చేయడం ప్రారంభించింది. నిజానికి ఈ గూఢచారం మొదలయినది ఆమె సంస్థల అక్రమ ఆర్థిక కార్యకలాపాల వివరాలు తెలుసుకోవడానికి మాత్రమే, పన్ను ఎగవేత గురించి కనిపెట్టడానికి మాత్రమే. మొత్తంగా 2008-09లో 300 రోజుల్లో సాగిన ఈ రికార్డింగులలో దాదాపు ఆరువేల సంభాషణలు నమోదయ్యాయి.

ఇలా వ్యక్తిగత టెలిఫోన్ సంభాషణలను ప్రభుత్వం రహస్యంగా వినవచ్చునా, రికార్డ్ చేయవచ్చునా అనే వివాదం ఉంది. కాని ఆ సంభాషణల్లోని వ్యక్తిగత, సాన్నిహిత్య వ్యవహారాలను దుర్వినియోగం చేయకుండా, కేవలం బహిరంగ, ప్రజా, పాలనా వ్యవహారాలకు సంబంధించినంతవరకు వాడుకుంటే తప్పులేదని, అది ఒక పెద్ద తప్పును కనిపెట్టడానికి చేసే చిన్న తప్పు వంటిదని వాదన కూడ ఉంది. ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ, ఒకటి వెతకడానికి వెళితే అంతకన్న ముఖ్యమైన మరొకటి దొరికినట్టు, ఆమెకూ రాజకీయ, వ్యాపార, మీడియా ప్రముఖులకూ సాగిన సంభాషణలలో చెప్పలేనన్ని ఆశ్చర్యకరమైన సంగతులు బయటపడ్డాయి. సరిగ్గా ఆ సమయంలోనే జరిగిన, దేశంలోని అవినీతి కుంభకోణాలన్నిటిలోకీ అతి పెద్దదీ, దేశ ఖజానాకు ఒక లక్షా డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయల నష్టం తెచ్చినదీ అయిన 2జి స్పెక్ట్రం అమ్మకాల గురించీ, దానికి మూలమైన టెలికాం మంత్రిత్వశాఖ పనితీరు గురించీ వాస్తవాలు బయటపడ్డాయి. అసలు సంకీర్ణ మంత్రివర్గంలో భాగస్వాములైన కొన్ని రాజకీయ పక్షాలు, లేదా ఆ రాజకీయ పక్షాలలో కొందరు వ్యక్తులు లాభసాటి అయిన మంత్రిత్వశాఖలు సంపాదించడానికి ఎటువంటి అవినీతికరమైన బేరసారాలు ఆడుతున్నారో, అత్యున్నత అధికార పీఠాలకు దగ్గరగా ఉన్న జర్నలిస్టులు ఈ బేరసారాలలో ఎటువంటి పాత్ర నిర్వహిస్తున్నారో కూడ ఈ సంభాషణల్లో బయటపడింది. న్యాయమూర్తులు ఎట్లా తీర్పులకోసం లంచాలు తీసుకుంటున్నారో, తీర్పు వెలువరించడానికి నెల రోజుల ముందరే ఆ తీర్పు ప్రతి తొమ్మిది కోట్ల రూపాయలు ఇచ్చి రాయించుకున్న పైరవీకారు చేతికి ఎలా వచ్చిందో ఈ సంభాషణల్లో బయటపడ్డాయి. దేశంలోని ప్రధాన పత్రికలు, ప్రసార సాధనాలు ఈ సంభాషణలను తొక్కిపట్టడానికి ప్రయత్నించినప్పటికీ కొన్ని పత్రికలలోనయినా ఆ వివరాలు వచ్చాయి.

ఎవరికి ఏ మంత్రిత్వశాఖ అప్పగించాలనేది నెహ్రూ, ఇందిరల కాలంలో వాళ్లు శక్తిమంతులుగా ఉండేవారు గనుకనేమో వాళ్ల చేతుల్లోనే ఉండేది గాని, ఐక్య సంఘటనల, సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడడం మొదలయిన తర్వాత విభిన్న రాజకీయపక్షాలు మంత్రిత్వశాఖల కోసం పోటీలు పడడం జరుగుతూ వస్తోంది. ఎక్కువ నిధులు ఉండే, ఎక్కువ ముడుపులు దొరికే, ఎక్కువ ప్రాముఖ్యత దొరికే, తమ తమ ప్రాంతాలకూ, సామాజిక వర్గాలకూ ఉపయోగపడే, తమ భావజాలం ప్రచారం చేయడానికి వీలుకలిగించే మంత్రిత్వశాఖలు కావాలని రాజకీయపక్షాలు పోటీ పడడం మొదలయింది. 1977లో తొలి సంకీర్ణ ప్రభుత్వంగా జనతా ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచీ, విద్యా, సాంస్కృతిక, ప్రసార, సమాచార మంత్రిత్వశాఖలు మాత్రమే కావాలని సంఘపరివార మంత్రులు ఎలా పట్టుబట్టారో ఇదివరకే చాలమంది విశ్లేషించారు. ఇక ప్రపంచీకరణ, నూతన ఆర్థిక విధానాలు మొదలయిన తర్వాత ఏ మంత్రిత్వశాఖ ఎవరికి దక్కాలనేది పూర్తిగా బహుళజాతి సంస్థల, కార్పొరేట్ల ఇష్టారాజ్యం అయిపోయింది. రాజకీయపక్షాలు కూడ ఆయా కార్పొరేట్ల ప్రయోజనాలకూ ఆదేశాలకూ లోబడి బేరసారాలు ఆడడం మొదలయింది. ఈ కొత్త ధోరణికి కొట్టవచ్చినట్టు కనబడే ఉదాహరణ 1991లో కేంద్ర ఆర్థిక మంత్రిగా డా. మన్మోహన్ సింగ్ నియామకం. ఆ మంత్రివర్గం ఏర్పడేనాటికి మన్మోహన్ సింగ్ పార్లమెంటు సభ్యుడు కూడ కాదు. అంటే మంత్రి కావడానికి కనీస, ప్రాథమిక అర్హత లేదు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలోనూ, సౌత్ కమిషన్ లోనూ పని చేస్తూ అప్పటికి కొన్ని నెలల కిందనే భారత ప్రభుత్వ ఆర్థిక సలహాదారుగా వచ్చి ఉన్న మన్మోహన్ సింగ్ ను ఆ పదవినుంచి ఆర్థికమంత్రి పదవికి మార్చారు. మైనారిటీలో ఉండిన పి వి నరసింహారావు ప్రభుత్వం తరఫున మొట్టమొదటి ప్రకటనలు చేసినదీ, ఏయే ఆర్థిక సంస్కరణలు జరపబోతున్నామో ప్రకటించినదీ ఈ ప్రజాప్రతినిధి కాని ఆర్థికమంత్రే. జూన్ చివరి వారంలో ప్రారంభించి జూలై మొదటి వారం వరకూ వరుసగా రోజుకొక మార్పు చొప్పున రూపాయి విలువ తగ్గింపు, నూతన ఆర్థిక, పారిశ్రామిక, వాణిజ్య విధానాల ప్రకటనలూ చేసినది ఈ మంత్రే.

ఈ పద్ధతి ఈ ఇరవై సంవత్సరాలలో ఎంత దూరం వచ్చిందంటే తాము చేస్తున్న వ్యాపారానికి అవసరమైన విధానాలు ప్రకటించడానికి, తమ వ్యాపారాలలో ఇతోధిక లాభాలు వచ్చే ఏర్పాట్లు చేయడానికి ఏ మంత్రిత్వ శాఖను ఏ వ్యక్తి నిర్వహించాలో, ఏ వ్యక్తి నిర్వహించగూడదో, ఆ మంత్రిత్వశాఖను ఒక రాజకీయ పక్షానికి ఇవ్వదలచినప్పటికీ, ఆ పార్టీలో కూడ ఎవరయితే తమకు అనుకూలమో, ఎవరిని తాము కోరుకోవడం లేదో కార్పొరేట్ సంస్థలు నిర్ణయించడం ప్రారంభించాయి.

ఈ నేపథ్యంలో టెలికాం మంత్రిత్వశాఖ అనేది ఈ దేశ ప్రజలకు టెలికమ్యూనికేషన్ సౌకర్యాలు ఎలా కల్పించాలని నిర్ణయించే సంస్థగా కాకుండా, ఆ టెలికాం వ్యాపారంలోని బడా వ్యాపార సంస్థల వ్యాపారక్రీడాస్థలి అయిపోయింది. టెలికాం మంత్రిగా ఎవరు ఉండాలో నిర్ణయించేది ప్రజలు కాదు, ప్రజా ప్రతినిధులు కారు, ప్రధాన రాజకీయ పార్టీ కాదు, రాజకీయ పక్షాల ఐక్య సంఘటన కాదు, ప్రధాన మంత్రి కాదు. ఆ మంత్రి ఎవరుంటే బాగుంటుందో ఆ వ్యాపారంలో ఉన్న రతన్ టాటా (టాటా), ముఖేశ్ అంబానీ (రిలయన్స్), సునిల్ భారతి మిత్తల్ (ఎయిర్ టెల్) వంటి బడా వ్యాపారవేత్తలు నిర్ణయిస్తారు. లేదా వారు బేరాలాడి, వేలం పాడి, ఘర్షణ పడి ఆ పదవిలో తమ అభ్యర్థిని (క్షమించాలి, నిజానికి తమ తైనాతీని, దళారీని అని అనాలి, కాని గౌరవనీయ సర్వసత్తాక భారత ప్రభుత్వ కేంద్ర మంత్రిని అలా అనడం కుదరదు!) కూచోబెడతారు.

ఇటువంటి వివరాలన్నీ నీరా రాడియా సంభాషణల రికార్డింగులో బయటపడి, అవన్నీ సుప్రీంకోర్టు ముందుకు వచ్చాయి. మరొకవైపు ఈ రికార్డింగ్ జరుగుతున్నదనీ, ఆ సంభాషణల్లో  టెలికాం మంత్రి రాజాకు 2జి స్పెక్ట్రం అమ్మకాల కుంభకోణంతో సంబంధం ఉన్నదనే విషయం బయటపడుతున్నదనీ పయనీర్ పత్రికలో పరిశోధనాత్మక కథనాలు 2010 ఏప్రిల్ నుంచే రావడం మొదలయింది. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన మధు కోడా ఒక ప్రఖ్యాత గనుల కంపెనీకి జార్ఖండ్ లో గనుల తవ్వకం అనుమతి ఇవ్వడంకోసం రు. 180 కోట్ల ముడుపులు అడిగాడనీ, ఆ మధ్యవర్తిత్వాన్ని నీరా రాడియా నడిపిందనీ ఈ సంభాషణల్లోనే బయటపడింది.

ఇదంతా దొంగల దోపిడీయేగాని, ఈ దొంగల దోపిడీ ఇంత బహిరంగంగా సాగడానికి వీలు లేదు గనుక, ప్రజాస్వామ్యం అనే ముసుగు, ప్రజా ప్రాతినిధ్య పాలన అనే సిగ్గుబిళ్ల ఇంకా ఉన్నాయి గనుక, ఆయా కార్పొరేట్ సంస్థలు తమ చేతులకు మట్టి అంటకుండా, మరొకరి చేత ఈ బేరసారాలు, బెదిరింపులు, అమ్మకాలు, కొనుగోళ్లు జరుపుతుంటారు. దాన్నే లాబీయింగ్ అని పిలుస్తారు. కావాలంటే బ్రిటన్, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలలో కూడ లాబీయింగ్ ఉన్నదని, మనం కూడ ఆ స్థాయిలో లాబీయింగ్ జరిపితేనే అభివృద్ధి సాధించగలమని నమ్మబలుకుతారు. ఆ లాబీయింగ్ లో రాజకీయనాయకులు, వారి కుటుంబ సభ్యులు, వారికి సన్నిహితంగా మెలిగే జర్నలిస్టులు సహకరిస్తారు. ఇదంతా రాడియా సంభాషణల్లో తెటతెల్లమవుతోంది.

అంటే అన్నం ఉడికిందా లేదా చూడడానికి మెతుకు పట్టి చూసినట్టుగా రాడియా సంభాషణల ద్వారా మన పాలన ఎలా సాగుతోందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ పాలనను అంగీకరించవచ్చునా లేదా, గౌరవించవచ్చునా లేదా తేల్చుకోవలసింది ఎవరికి వారే.

రాడియాతో సంభాషించిన ప్రముఖులలో కొందరు

డి ఎం కె నాయకుడు, మాజీ టెలికమ్యూనికేషన్స్ ఐటి శాఖల మంత్రి ఎ. రాజా

డి ఎం కె కు చెందిన రాజ్యసభ సభ్యురాలు కనిమొళి

జనతా దళ్ (యు) నాయకుడు, మాజీ ఐ ఎ ఎస్ అధికారి, రాజ్యసభ సభ్యులు ఎన్ కె సింగ్

కాంగ్రెస్ నాయకురాలు, లోకసభ సభ్యులు అను టాండన్

మాజీ ప్రధాని వాజపాయి అల్లుడు, వ్యాపారవేత్త రంజన్ భట్టాచార్య

బడా పారిశ్రామిక, వ్యాపారవేత్త రతన్ టాటా

బడా పారిశ్రామిక, వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ

పారిశ్రామిక వేత్తల మండలి మాజీ అధిపతి తరుణ్ దాస్

పారిశ్రామిక, వ్యాపారవేత్త నోయెల్ టాటా

పారిశ్రామిక, వ్యాపారవేత్త మనోజ్ మోడీ

ప్రముఖ జర్నలిస్టు వీర్ సంఘ్వి

ప్రముఖ జర్నలిస్టు బర్ఖా దత్

ప్రముఖ జర్నలిస్టు ప్రభు చావ్లా

ప్రముఖ జర్నలిస్టు శంకర్ అయ్యర్

ప్రముఖ జర్నలిస్టు జి గణపతి సుబ్రహ్మణ్యం

ప్రముఖ జర్నలిస్టు ఎం కె వేణు

ప్రముఖ జర్నలిస్టు రాజదీప్ సర్దేశాయి

ప్రముఖ జర్నలిస్టు జహంగీర్ పోచా

ప్రభుత్వాధికారి సునీల్ అరోరా

మరెందరో అధికారులు

 

 

About ఎన్.వేణుగోపాల్ N Venugopal

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues.
This entry was posted in వ్యాసాలు, Ee Bhoomi. Bookmark the permalink.

2 Responses to భారత పైరవీస్వామ్యం గురించి రాడియా నిజాలు

 1. నీరా రాడియా బ్యాక్ గ్రవుండ్ మీద మీ పరిశోధన కి నా జోహార్లు!

  రతన్ టాటా కూడా పత్తిత్తు కాదు అని చెప్పిన మీ వ్యాఖ్య బాగుంది.

  న్యాయమూర్తులూ, తీర్పు ప్రతులూ….వాహ్!

  1991 లో రూపాయి విలువ తగ్గింపా? వినలేదే! సరిదిద్దుకోండి.

  “లాబీయింగు ద్వారానే అభివృధ్ధి” అంటే గన్, రక్షణ ఎక్విప్మెంట్ లాబీలు కూడా!

 2. sagar says:

  Excellent information. Every one must read and understand the consequences.

  Quote from Marcus Tullius Cicero:

  “A nation can survive its fools, and even the ambitious. But it cannot survive treason from within. An enemy at the gates is less formidable, for he is known and carries his banner openly. But the traitor moves amongst those within the gate freely, his sly whispers rustling through all the alleys, heard in the very halls of government itself. For the traitor appears not a traitor; he speaks in accents familiar to his victims, and he wears their face and their arguments, he appeals to the baseness that lies deep in the hearts of all men. He rots the soul of a nation, he works secretly and unknown in the night to undermine the pillars of the city, he infects the body politic so that it can no longer resist. A murderer is less to fear. The traitor is the plague.”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s