వీక్షణం – ఫిబ్రవరి 2011

పరిష్కారానికేనా శ్రీకృష్ణ నివేదిక?

పదినెలలుగా రాష్ట్రం ఎదురుచూస్తున్న జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చిన గడువుకన్న ఒకరోజు ముందే వెలువడింది. ఆ ఒక్క ఘనత మినహా, ఈ కమిటీ ఏర్పాటు దగ్గరనుంచి నివేదిక వెల్లడి వరకూ మరే వ్యవహారమూ సక్రమంగా, హేతుబద్ధంగా, న్యాయబద్ధంగా జరగలేదు. 2009 డిసెంబర్ 9 ప్రకటన తర్వాత “పరిస్థితులు మారినందువల్ల” “విస్తృత సమాలోచనలు” అవసరమయ్యాయని డిసెంబర్ 23 ప్రకటన చెప్పింది. ఆ సమాలోచనలలో భాగంగానే 2010 జనవరి 5న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఆ సమావేశ ఫలితంగానే జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటయింది. అంటే ఈ కమిటీ డిసెంబర్ 9 తర్వాత “పరిస్థితులు ఎందుకు, ఎలా మారాయనే విషయం పైన విస్తృత సమాలోచనలు జరిపి ఉండవలసింది. కాని ఫిబ్రవరి 12న ఆ కమిటీ విధివిధానాలు, చర్చా ప్రాతిపదికలు ప్రకటించేనాటికి, కమిటీకి అసందర్భమైన, అనవసరమైన పనులెన్నో ఇవ్వడం జరిగింది. 2009 డిసెంబర్ 7న హైదరాబాదు అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలూ ఆమోదించిన విషయాన్ని మళ్లీ చర్చనీయాంశం చేసి, ఆ చర్చ పనిని కమిటీకి ఇవ్వడం జరిగింది. ప్రజా ఆకాంక్షల, ప్రజా ఉద్యమాల ఫలితంగా ఒప్పుకోక తప్పని అంశాలమీద కూడ పాలకవర్గాలు ఎటువంటి మాయోపాయాలు పన్నగలవో చూపడానికి ఇంతకన్న పెద్ద ఉదాహరణ అక్కరలేదు. అసలు సమస్యను పక్కదారి పట్టించడానికి, కాలయాపన చేయడానికి ఈ కమిటీ ఉపయోగ పడుతున్నదనే అభిప్రాయం వచ్చినా సరే, ఈ కమిటీ ద్వారానైనా సమస్య పరిష్కారమైతే చాలునని ప్రజలు అనుకున్నారు. అందుకే పది నెలల పాటు కమిటీ పర్యటనలకు, విచారణకు సహకరించారు. కాని ఇంతచేసి కమిటీ వెలువరించిన తిలకాష్టమహిషబంధనం సాధించినది సమస్య పరిష్కారం కాదు, సూచించినది సమస్యకు సామరస్యపూర్వక పరిష్కారాలు కాదు. కమిటీ అవలంబించిన దృక్పథం, వాస్తవాలను, చరిత్రను, రాజకీయార్థిక పరిణామాలను కమిటీ ఉపయోగించిన తీరు, కమిటీ చివరికి చేసిన సూచనలు అన్నీ కూడ వివాదాస్పదంగానూ, అభ్యంతరకరంగానూ ఉన్నాయి. నిజాయితీ పరుడిగా పేరుపొందిన న్యాయమూర్తి అధ్యక్షతన, ఒక న్యాయనిపుణుడు, ఒక అర్థశాస్త్రవేత్త, ఒక సామాజిక శాస్త్రవేత్త సభ్యులుగా ఉన్న ఈ కమిటీ నివేదిక ఆ నిపుణుల విజ్ఞతకు చిహ్నంగా మాత్రం మిగలలేదు. ఈ కమిటీకి కార్యదర్శిగా పనిచేసిన పోలీసు అధికారి ఎంత తెలివితో, ఏ దృక్పథంతో ప్రజా సమస్యలను చూడగలడో అందుకు చిహ్నంగా మాత్రమే ఉంది. కొత్తగూడెం రాయలసీమలో ఉందనడం, భీమా, నెట్టెంపాడు వగైరాలను గోదావరిపై చూపడం, తెలంగాణలో సాగునీటి సౌకర్యంగల భూమి వృద్ధిరేటు 713 శాతం అనడం (అది నిజమైతే తెలంగాణలో నీటిపారుదల సౌకర్యం లేని భూమి లేదన్నమాట!) — లాంటి అవాస్తవాలు, గణాంకాల  తప్పులు డజన్ల కొద్దీ ఉన్నాయంటే నివేదిక ఎంత నిర్లక్ష్యంగా, ఎంత మేధో దివాళాకోరుతనంతో తయారయిందో అర్థమవుతుంది. ఈ చిన్న తప్పులను పక్కనపెట్టినా, అసలు నివేదిక తయారీలో పనిచేసిన దృక్పథంలోనే రెండు ప్రధానమైన ప్రజావ్యతిరేక ప్రాతిపదికలు ఉన్నాయి. ఒకటి, నివేదిక ప్రజల సమస్యలను, ప్రజల ఆకాంక్షలను శాంతి భద్రతల కోణం నుంచి మాత్రమే చూసింది. యథాస్థితి వల్ల ప్రయోజనాలు పొందేవారు, యథాస్థితి వల్ల ప్రయోజనాలు లేకపోయినా భావజాలపరంగా మార్పును ఇష్టపడనివారు ప్రతి ప్రజా సంచలనాన్ని ఇలా శాంతిభద్రతల కోణం నుంచి చూస్తారు. శాంతి భద్రతలకు భంగం కలుగుతున్నదనే మాట నిజమే అనుకున్నా, ఆ పరిస్థితికి దారి తీసిన పరిణామాలను ఆలోచించవలసి ఉంటుంది. కమిటీ ఆ పని మాత్రం చేయకుండా, చేసినచోట అరకొరగా చేసి, మొత్తం వ్యవహారాన్ని శాంతిభద్రతల సమస్యగా చూసింది. అందుకే శాంతిభద్రతల మీద ప్రత్యేకంగా ఒక అధ్యాయం రాసి దాన్ని బహిరంగం కూడ చేయకుండా రహస్యంగా హోంమంత్రిత్వశాఖకు అందజేసింది. ప్రజాధనంతో విచారణ నిర్వహించిన కమిటీ, ప్రజలను ఏడాదిగా, ఆమాటకొస్తే దశాబ్దాలుగా, అతలాకుతలం చేస్తున్న సమస్యను విచారించిన కమిటీ, తన నివేదికలో ఒక ముఖ్యమైన భాగాన్ని ప్రజలకు, రాజకీయపార్టీలకు కూడ చెప్పగూడని రహస్యం అనుకున్నదంటే అది ఎంత ప్రజావ్యతిరేక ఆలోచనతో ఉన్నదో రుజువవుతున్నది. బహిరంగం చేసిన నివేదికలో కూడ చాలచోట్ల ఈ దృక్పథం వ్యక్తమయింది. ఇక రెండవ ప్రాతిపదిక, ప్రజలజీవితాలతో, ప్రజల ఆకాంక్షలతో సంబంధంలేని అంకెల, సగటుల, వృద్ధిరేటుల, భవనాల, ఫ్లై ఓవర్ల “అభివృద్ధి” దృక్పథం. హైదరాబాదు మీద ప్రత్యేకంగా రాసిన ఒక అధ్యాయంలోనూ, మొత్తంగా నివేదికలో కూడ ఈ దృక్పథం వ్యాపించింది. అంకెలు, సగటులు, వృద్ధిరేట్లు విశాల సామాజిక చిత్రాన్ని గ్రహించడానికి ఒకానొక సౌకర్యమే గాని, వాటిద్వారానే సామాజిక వాస్తవికతను గుర్తించగలమనుకోవడం అమాయకత్వమైనా కావాలి, దుర్మార్గమైనా కావాలి. ఒక్క అంబానీల కుటుంబాన్నో, అటువంటి వంద కుటుంబాలనో తీసేసి భారతదేశపు సగటు అంకెలను చూస్తే ఎంత తేడా ఉంటుందో అందరికీ తెలిసిందే. శ్రీకృష్ణ కమిటీ నివేదిక పూర్తిగా అటువంటి అవిశ్వసనీయమైన, తప్పుడు సూచనలు ఇచ్చే అంకెలమీద ఆధారపడింది. ఈ దృక్పథం వల్ల కమిటీ పరిష్కార మార్గాల సూచనలు కూడ గందరగోళంగా తయారయ్యాయి. తామే ఆరు సూచనలు చేసి, వాటిలో నాలుగు పనికిరానివని చెప్పడం కనీసమైన ఇంగితజ్ఞానం ఉన్నవారు కూడ చేసే పని కాదు. ఇక అత్యుత్తమ మార్గంగా చెప్పిన సూచన 1958 నుంచి 1973 వరకు అమలయినదే. రాజ్యాంగ రక్షణలు ఉన్నా విఫలమయినదే. ఇప్పుడు అదే సూచన చేస్తూ ఈసారి అమలవుతుందనే హామీ ఏమిటో చెప్పకపోవడం పరిష్కారం కాదు. ప్రజల సమస్యలు పరిష్కారమయ్యేది ప్రజల మధ్య మాత్రమే. పాలకవర్గాల ద్వారా, వారి కుతంత్రాలకు సాధికారత ఇచ్చే కమిటీల ద్వారా కాదు. ప్రజల సమస్యలు తీర్చడం ప్రస్తుత పాలకవర్గాలకు సాధ్యం కాదని, ఎక్కువలో ఎక్కువ అవి ప్రజలను మభ్యపెట్టే కాలయాపన పనులు మాత్రమే చేయగలవని ఈ ఉదంతం మరొకసారి రుజువు చేస్తున్నది.

 

సంపాదకీయ వ్యాఖ్యలు

దొంగల పేరు చెప్పాలా, ఎంతమాట?!

దేశ సంపదలను కొల్లగొట్టి విదేశీబ్యాంకుల రహస్యఖాతాలలో దాచుకున్న దొంగల గురించి రెండు సంవత్సరాలకు పైగా సాగుతున్న చర్చ ఇప్పుడు ఒక మలుపు తిరిగి అనేక అసలు వాస్తవాలు బయటపెడుతున్నది. ఇన్నాళ్లూ ఆ దొంగలు వేరు, ప్రభుత్వం వేరు అనుకున్న అమాయకులు ఎవరయినా ఉంటే, ఈ ప్రభుత్వం ఆ దొంగలదేనని, లేదా, ఆ దొంగలను కాపాడడమే తన కర్తవ్యమని ప్రభుత్వం అనుకుంటున్నదని రుజువవుతున్నది. ఈ ప్రభుత్వమేదో ఆ దొంగల గుట్టు బయటపెట్టి ఆ అక్రమసంపదను దేశానికి తిరిగి తెప్పించగలదని ఎవరయినా అమాయకంగా నమ్మిఉంటే, తాము ఆ పని చేయబోమని ప్రభుత్వాధినేతలు నిస్సిగ్గుగా కుండబద్దలు కొడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాల రహస్యపత్రాలు సేకరించి బహిరంగం చేస్తున్న వికీలీక్స్ కు ఒక మాజీ స్విస్ బ్యాంకు అధికారి అందజేసిన ఖాతాదార్ల జాబితాతో మరొకసారి ఈ వార్తలు పత్రికలకు ఎక్కాయి. ఆ జాబితాలో భారతీయుల పేర్లు ఉన్నాయని బయటపడింది. ఇంతకూ స్విట్జర్లాండ్ లో ఉన్న అనేక బ్యాంకులలో అది ఒకానొకటి మాత్రమే. ఒక్క స్విట్జర్లాండ్ లోనే కాక, అటువంటి దేశాలెన్నిటిలోనో ఉన్న వందలాది బ్యాంకులలో ఇటువంటి అక్రమనిధులు ఉన్నాయి. అంటే మిగిలిన ప్రపంచం సంగతి అలా ఉంచినా, భారతదేశం నుంచి కొల్లగొట్టుకుపోయిన సంపదలో ఇప్పుడు వికీలీక్స్ జాబితా ద్వారా బయటపడబోయేది సముద్రంలో కాకిరెట్టకన్న తక్కువ. ఆ కనీసమైన, అతిస్వల్పమైన జాబితాలోని పేర్లు కూడ బయటపెట్టలేమని, ఒక వేళ బయటపడినా ఆ డబ్బు తెప్పించలేమని, అందుకు  అంతర్జాతీయ ఒప్పందాలు అంగీకరించవని స్వయంగా ప్రధానమంత్రి ప్రవచిస్తున్నారు. దాన్నే ఆర్థికమంత్రి పునరుద్ఘాటిస్తున్నారు. దేశ ప్రయోజనాలకు భంగకరమైన ఒప్పందాలను ఎందుకు గౌరవించాలని ప్రతిపక్షాలని పేరు పెట్టుకున్నవి కూడ అడగడం లేదు. కోటి కోట్ల రూపాయల అక్రమ ధనం తిరిగి తెప్పించగల ప్రయోజనమే కలిగితే, అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించడంలో నష్టమేమీ లేదు. ఇంతకూ ఆ అంతర్జాతీయ ఒప్పందాలలోకి మనం ప్రవేశించినది దొంగలను కాపాడడానికా, దేశ ప్రయోజనాలను మరింతగా రక్షించుకోవడానికా? ప్రజలకు తెలియకుండా, ప్రజలకు సమాచారం లేకుండా గత అరవై సంవత్సరాలలో భారత ప్రభుత్వం ఏయే దేశాలతో ఏయే ఒప్పందాలు చేసుకున్నదో, ఆ ఒప్పందాలు ఇలా భారత ప్రజల సార్వభౌమాధికారానికి ముందరి కాళ్ల బంధం వేసేవేనా? అయితే, తనకు తాను భారత ప్రభుత్వం అని పేరు పెట్టుకున్నది భారత ప్రయోజనాలకోసం పనిచేసిందా? భారతదేశంలోని దొంగల కోసమూ, వారిని కాపాడే విదేశీ దొంగల కోసమూ పనిచేసిందా? దేశాన్ని మూడు వందల సంవత్సరలలో బ్రిటిష్ వలసవాదం ఎంత దోపిడీ చేసిందో అరవై సంవత్సరాలలో భారత ప్రభుత్వ ఆధ్వర్యం కింద అంతకన్న ఎక్కువ దోపిడీ జరిగిందనుకోవాలా? ఇప్పటికైనా ఈ ప్రశ్నలు అడగకపోతే ఈ దేశానికీ, ఈ దేశ ప్రజలకూ విముక్తి లేదు. ఏ పార్లమెంటరీ రాజకీయపక్షానికీ ఈ ప్రశ్నలు అడిగే ఆసక్తి లేదని ఈ ఆరుదశాబ్దాల చరిత్ర రుజువు చేసింది గనుక ఇక ఈ ప్రశ్నలు అడగవలసిన బాధ్యత, జవాబులు కనిపెట్టవలసిన బాధ్యత పూర్తిగా ప్రజలమీద, ప్రజా ఉద్యమాలమీద మాత్రమే ఉంది.


ప్రజాశక్తిని రుజువు చేస్తున్న టునీషియా, సూడాన్

ప్రజా ఆకాంక్షలకు విలువలేదనీ, ప్రజాపోరాటాలకు కాలం చెల్లిందనీ, పాలకవర్గాల దుర్మార్గాలు యథాతథంగా సాగిపోతూనే ఉంటాయనీ, వాటిని ఆపలేమనీ నడుస్తున్న అధికారిక ప్రవచనానికి గండిపదింది. ఆ మూల ఆఫ్రికా నుంచి రెండు చిన్న దేశాలు ప్రజాశక్తి ఎంత బలోపేతమైనదో రుజువు చేస్తున్నాయి. దోపిడీ పీడనల పెట్టుబడిదారీ విధానం తప్ప ‘ఇక మరో దారి లేదు’ అని రెండు దశాబ్దాల కింద మార్గరెట్ థాచర్ ప్రకటించిన తర్వాత, ప్రజాప్రయోజనాలను తాకట్టుపెట్టే పాలనలదే రాజ్యంగా కొనసాగుతున్న సందర్భంలో, ఉత్తర ఆఫ్రికాలోని టునీషియాలోనూ, సూడాన్ లోనూ ప్రజలు తలచుకుంటే ఏమి చేయగలరో, మరొకదారి ఉన్నదో లేదో చూపించారు. టునీషియాలో ఫ్రాన్స, అమెరికా ప్రభుత్వాల అండతో కొనసాగుతున్న ప్రభుత్వం అవినీతికి, ఆశ్రితపక్షపాతానికీ నిలయమయినప్పుడు, ప్రజలను దారిద్ర్యంలోకీ నిరుద్యోగంలోకీ నిర్బంధంలోకీ  నెట్టివేసినప్పుడు, ఒక చిన్న నిప్పురవ్వతో టునీషియా సమాజం మొత్తం అంటుకుని విస్ఫోటనం జరిగి జనవరి 14న నిరంకుశ అధ్యక్షుడు బెన్ అలీ దేశం వదిలి పారిపోవలసి వచ్చింది. ప్రజల ఆకాంక్షలు ఇంకా సంపూర్ణంగ నెరవేరకపోయి ఉండవచ్చు, అందుకు సమయం పట్టవచ్చు గాని నిరంకుశ పాలకులకు ఏ గతి పడుతుందో మాత్రం టునీషియన్ ప్రజలు తమ ఆచరణ ద్వారా చూపారు. మరొకపక్క ఈశాన్య ఆఫ్రికాలోని అరబ్ దేశం సూడాన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశం మారడానికి దక్షిణ సూడాన్ ప్రజలు యాభై సంవత్సరాలుగా సాగిస్తున్నపోరాటం జనవరి మొదటి రెండు వారాలలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలొ 99 శాతం వోట్లతో విజయం సాధించింది. వలసవాదం నుంచి విముక్తి అయిన వెంటనే సాగిన మొదటి అంతర్యుద్ధాన్ని (1955-72), రెండవ అంతర్యుద్ధాన్ని (1983) దాటి, భయంకరమైన నిర్బంధాన్నీ, ఊచకోతలనూ, సాయుధపోరాటాన్నీ దాటి చివరికి 2005లో ప్రభుత్వం దిగివచ్చి సూడానీస్ ప్రజా విముక్తి సైన్యంతో చేసుకున్న ఒప్పందం ఫలితంగా ఈ ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. మిగిలిన కార్యక్రమాలు కూడ సజావుగా సాగితే ఈ జూలై 9న నైల్ రిపబ్లిక్ లేదా దక్షిణ సూడాన్ ఒక కొత్త దేశంగా రూపొందనున్నది. ఎప్పటికైనా ప్రజా ఆకాంక్షలు విజయం సాధించకతప్పదని ఈ పరిణామం రుజువు చేస్తున్నది. ఇది రాస్తున్న సమయానికి అరబ్ ప్రపంచంలోనే అతి శక్తివంతమైన ఈజిప్ట్ లో కూడ ప్రజాగ్రహ జ్వాలలు రగుల్కొంటున్నాయనీ, అమెరికా తొత్తుగా ముప్పై సంవత్సరాలుగా పాలిస్తున్న అధ్యక్షుడు హొస్ని ముబారక్ కు వ్యతిరేకంగా రాజధాని కైరో లోనూ, దేశవ్యాప్తంగానూ వేలాది మంది యువకులు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. చాలమంది వ్యాఖ్యాతలు ఈ అరబ్ ప్రపంచ కదలికలను 1968 ప్రపంచవ్యాప్త కోపోద్రిక్త యువతరం ప్రదర్శనలతో పోలుస్తున్నారు. ఈజిప్ట్ లో ప్రదర్శనలు టునీషియా ప్రదర్శనలకన్న పెద్ద ఎత్తున సాగుతున్నాయని, ఇక్కడకూడ టునీషియాలో జరిగినట్టే జరగవచ్చునని వ్యాఖ్యాతలు అంటున్నారు. “ఈజిప్ట్ ఇవాళ అగ్గిపుల్ల గీస్తే పెలిపోయే మందుపాతర లాగ ఉంది” అని ప్రదర్శనకారుల నాయకుడు అమర్ అల్ హాసన్ అన్నాడు. ఆమాటకొస్తే ఇవాళ ప్రపంచంలో అత్యధిక దేశాలు అలాగే ఉన్నాయి. ఇరవైఒకటో శతాబ్ద ప్రజాగ్రహ ప్రజ్వలనాలు ‘నడుమ తడబడి కడలి మునుగక’ తీరం క్రమిస్తాయా? నిజంగానే మానవాళికి మంచికాలం రానున్నదా?

 

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Telugu, Veekshanam. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s