టునీషియా ప్రజావిజయగాథ

వీక్షణం ఫిబ్రవరి 2011 సంచిక కోసం

తన శరీరం మీద తానే పెట్రోలు పోసుకుని తగులబెట్టుకుంటున్నప్పుడు ఆ ఇరవై ఆరేళ్ల యువకుడు ఏం ఆలోచించాడో తెలియదు. పద్దెనిమిది రోజుల పాటు మృత్యువుతో పోరాడుతూ ఆ గాయాల సలుపు తప్ప మరేదయినా అనుభవించాడో లేదో తెలియదు. కాని ఆ మృతదేహం మాత్రం అతని మాతృదేశాన్ని అల్లకల్లోలం చేసింది. ఆ శరీరపు మంటలు ఆ దేశపు యువతరాన్ని రగుల్కొలిపి వీథుల్లోకి లాక్కొచ్చాయి. ఆ యువకుడి మృతి ఎంత విషాదకరమైనదయినా, అది ప్రజాగ్రహాన్ని మేల్కొలిపింది. ప్రజల పేదరికం, యువతరం నిరుద్యోగం, నాయకుల అవినీతి, అధికారుల దుర్మార్గం కలగలిస్తే ఒక సమాజం ఎట్లా విస్ఫోటనం చెందగలదో ఆ దేశం చూపించింది. ఇరవై మూడేళ్ల నియంతృత్వ ప్రభుత్వాన్ని సరిగ్గా పది రోజుల్లో కూల్చేసింది. సామ్రాజ్యవాద దేశాల అండ ఉన్న దేశాధ్యక్షుడు తట్టాబుట్టా సర్దుకుని ప్రాణభయంతో విమానంలో పరుగులు పెట్టేలా చేసింది. ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడేలా చేసింది. ఆ ప్రభుత్వాన్ని కూడ ప్రజలు నిలదీసేలా చేసింది. తమ దేశాల ప్రజలలో కూడ ఇటువంటి నిద్రాణమైన ఆగ్రహం ఉండవచ్చుననీ, అది రగుల్కొంటే తమ ఉనికి కూడ ప్రశ్నార్థకం కావచ్చుననీ. తమ పాలనలు కూడ పేకమేడల్లా కూలిపోవచ్చుననీ పొరుగుదేశాల అధినేతలు భయపడడం మొదలుపెట్టారు. ప్రజాశక్తి అప్రతిహతమైనదనే చారిత్రక సత్యాన్ని అతని బలిదానమూ, దాని పర్యవసానాలూ రుజువు చేశాయి.

టునీషియా అనే చిన్నారి దేశం కథ ఇది. ప్రజలకూ పాలకులకూ కూడ పాఠం చెప్పగల గాథ. ఒక చిన్న నిప్పురవ్వ దావానలంగా ఎలా మారగలదో, పెరిగిపోతున్న ప్రజాగ్రహాన్ని ఎంతమాత్రం సంబంధం లేని ఒక చిన్న ఘటన కూడ ఎలా ముట్టించి విస్తరించగలదో ప్రజాపోరాట నాయకులకు కూడ విప్పిచెప్పగల గాథ ఇది.

అలా వంటికి నిప్పంటించుకుని మరణించిన యువకుడి పేరు మహమ్మద్ బొవజిజి. ఒకవైపు సకలసంపదలు ఉన్నా, ప్రజలు కటిక పేదరికంలో బతకవలసి వస్తున్న అన్ని దేశాల లాంటిదే టునీషియా. అటువంటి సగటు పేద కుటుంబమే బొవజిజిది కూడ. తండ్రి మరణించడం, పెద్ద చదువు లేకపోవడం, ఉన్న చదువుకైనా తగిన ఉద్యోగం దొరకకపోవడం, దేశంలో ఎటు చూసినా లంచగొండితనం, అధికారుల దౌర్జన్యం మహమ్మద్  సమస్యలు. అతను చిన్న వయసునుంచే వీథుల్లో చిన్నా చితకా సరుకులమ్మి కుటుంబాన్ని పోషించవలసిన దుస్థితిలో పడ్డాడు. ఆత్మహననం చేసుకునేనాటికి సిద్ బౌజిద్ అనే పట్టణంలో తోపుడు బండిమీద పళ్లూ కూరగాయలూ అమ్ముకుంటూ ఉండేవాడు. అన్ని చోట్ల లాగానే అక్కడకూడ పోలీసులకు, అధికారులకు పేదల మీద అధికారం చలాయించడం మాత్రమే తెలుసు. ఆ తోపుడు బండికి అనుమతి లేదని వాళ్లు మహమ్మద్ మీద విరుచుకుపడ్డారు. డిసెంబర్ 17న ఆ బండిని పడదోసి కూరగాయలూ పళ్లూ మట్టిపాలు చేశారు. త్రాసు ఇవ్వడానికి నిరాకరించాడని మహమ్మద్ పై  పురపాలక సంఘానికి చెందిన మహిళా  అధికారి చెయ్యి చేసుకుంది. తిట్లూ దుర్భాషలూ తన్నులూ సాగిన ఈ దాడి అంతా నిజానికి అనుమతి లేనందుకు కాదు. తోపుడు బండికి అనుమతి అక్కరలేదని స్థానిక చట్టాలు చెపుతాయి. కాని ఆ అధికారులు అడిగిన లంచం – మన భాషలో మామూలు – ఇవ్వడానికి మహమ్మద్ నిరాకరించాడు. అదీ అసలు సంగతి.

నడివీథిలో అందరిముందూ దెబ్బలుతిన్న మహమ్మద్ అవమానపడ్డాడు. ఏడ్చి మొత్తుకున్నాడు. పై అధికారుల దగ్గరయినా న్యాయం దొరుకుతుందేమోనని, తన పళ్లూ కూరగాయలూ త్రాసూ తిరిగి ఇప్పిస్తారేమోనని నగర అధికారుల దగ్గరికి పరుగెత్తాడు. ఉన్నతాధికారిని కలవబోతే పోలీసులు అడ్డగించారు. ఇక ఎక్కడా న్యాయం దొరకదని, అది దొంగల రాజ్యమని అర్థమయ్యాక మహమ్మద్ బొవజిజికి మిగిలినది మృత్యువు ఒక్కటేననిపించింది. ఏ ఇంటర్నెట్ కేఫ్ నుంచి పంపాడో తెలియదు గాని తల్లికి ఫేస్ బుక్ మీద ఒక సందేశం పంపాడు:

“అమ్మా, వెళిపోతున్నా. నన్ను కోప్పడకమ్మా. నేనెక్కడో దారి తప్పిపోయాను. కాని ఈ దారి నేను ఎంచుకున్నది కాదు. ఎప్పుడన్నా నేను నీ మాట వినకపోయి ఉంటే క్షమించు. నన్ను తప్పుపట్టకు. ఈ కాలాన్ని తప్పుపట్టు. నేనిక తిరిగి రాలేని చోటికి వెళుతున్నా. నేనివాళ చాల ఏడ్చానమ్మా, ఇంక నా కళ్లలో నీళ్లు లేవు. ఈ దిక్కులేని దేశంలో, ఈ వంచన నిండిన ప్రపంచంలో ఎవరినీ తప్పుపట్టలేమమ్మా. నేనింక అలసిపోయాను. అన్నిటినీ వదిలేసి వెళిపోతున్నాను. నా ప్రయాణం మొదలయింది. ఈ ప్రయాణంలోనయినా నేను అన్నీ మరచిపోతానో లేదో తెలియదు.” ఇదీ ఆ సందేశం.

ఆ తర్వాత గ్యాసోలిన్ సంపాదించి ఒక ప్రభుత్వ కార్యాలయం ముందుకు వెళ్లి పట్టపగలు అది మీద పోసుకుని అందరూ చూస్తుండగా నిప్పంటించుకున్నాడు. అధికారులు వెంటనే అతణ్ని ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మరిన్ని సౌకర్యాలున్న రెండు ఆస్పత్రులకు కూడ మార్చారు. ఈ మధ్యలో అతణ్ని వేధించిన అధికారులకు శిక్షలు కూడ విధించారు. స్వయంగా దేశాధ్యక్షుడే ఆస్పత్రికి వచ్చి చికిత్స పొందుతున్న మహమ్మద్ ను చూశాడు. కాని ఎవరేం చేసినా, పద్దెనిమిది రోజుల పాటు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడిన మహమ్మద్ బొవజిజి జనవరి 4న మరణించాడు. అతని అంతిమయాత్రలో ఐదువేలమంది ప్రజలు పాల్గొన్నారు. పోలీసులు ఆ అంతిమయాత్రమీద ఆంక్షలు విధించారు. అతను తగులబెట్టుకున్నచోటు మీదుగా అంతిమయాత్ర సాగడానికి వీలులేదన్నారు.

“స్వేచ్ఛ చాల ఖరీదయినది. నా సోదరుడు ఆ స్వేచ్ఛకు మూల్యం చెల్లించాడు. ఇప్పుడు అరబ్ ప్రతిఘటనకు చిహ్నంగా మారిపోయాడు” అని మహమ్మద్ సోదరుడు సలీమ్ అన్నట్టు జనవరి 4 సాయంత్రం అంత్యక్రియలు జరిగిన తర్వాతనే మహమ్మద్ బొవజిజి నిజమైన జీవితం ప్రారంభమయింది. టునీషియా దేశవ్యాప్తంగా పోలీసు అత్యాచారాలకు, అధికారుల లంచగొండితనానికి, ఈ అవ్యవస్థను కాపాడుతున్న నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడికక్కడ ప్రజాందోళనలు ప్రారంభమయ్యాయి. మహమ్మద్ నిలువెత్తు చిత్రపటాలు పట్టుకుని ప్రజాప్రదర్శనలు, ఊరేగింపులు మొదలయ్యాయి. దేశం అట్టుడికిపోయింది. అది కేవలం మహమ్మద్ బొవజిజికి నివాళి మాత్రమే కాదు. ఆ అనామక పళ్ల వ్యాపారి హఠాత్తుగా ఒక నియంతృత్వ వ్యతిరేక చిహ్నమయ్యాడు. నిరుద్యోగాన్ని ప్రశ్నించదలచిన, ప్రభుత్వాన్ని ప్రతిఘటించదలచిన ప్రతి ఒక్కరికీ ఆదర్శమయ్యాడు. దేశం మొత్తాన్నీ ఒక కుదుపు కుదిపిన అతని సంస్మరణ అనే నిప్పురవ్వ టునీషియన్ల స్వేచ్ఛాకాంక్ష, పోరాటస్ఫూర్తి ఎంత విస్తృతమైన కార్చిచ్చో రుజువు చేసింది. ప్రజలు తమ ఆగ్రహ ప్రదర్శనను తమ జాతీయ పుష్పం పేరు మీద మల్లె విప్లవం (జాస్మిన్ రెవల్యూషన్) అని పిలుచుకుంటున్నారు.

ఆ తర్వాత పది రోజుల పాటు సాగిన నిరసన ప్రదర్శనల మీద పోలీసులు, సైనికులు జరిపిన కాల్పుల్లో కనీసం వందమంది మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. కోట్ల డాలర్ల ఆస్తి ధ్వంసమయింది. మొదట అధ్యక్షుడు బెన్ అలీ ఈ నిరసనల మీద ఉక్కుపాదం మోపడానికి ప్రయత్నించాడు. నిరసనకారుల డిమాండ్లలో ఏఒక్కదానికీ తల ఒగ్గబోనని ప్రకటించాడు. వారం రోజులు గడిచినా ప్రజాప్రదర్శనలు ఆగలేదు సరిగదా ఇంకా పెరిగిపోయాయి. అప్పుడు అధ్యక్షుడే స్వయంగా టివి తెరలమీదికి వచ్చి ప్రజలు తనను అర్థం చేసుకోవాలనీ, తనకు మరొక అవకాశం ఇవ్వాలనీ కోరాడు. ప్రదర్శనకారుల మీద కాల్పుల ఆదేశాలను ఉపసంహరిస్తున్నానన్నాడు. అయినా ప్రజలు తమ ఆందోళన విరమించలేదు. మర్నాడు వేలాది మంది ప్రజలు ఆంతరంగిక భద్రతా మంత్రిత్వశాఖ కార్యాలయం మీద దండెత్తారు. నిజానికి టునీషియాలో ఈ గూఢచారశాఖ అంటే విపరీతమైన భయం ఉంది. రాజధాని టునిస్ నగరంలో టాక్సీ డ్రైవర్లలో ఎనబై శాతం మంది ఈ శాఖకు ఉప్పందించే వేగులేననీ, చీమ చిటుక్కుమన్నా, ఎక్కడ ఎవరు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు చేసినా వారి పని అంతేననీ గతంలో పుకార్లుండేవి. కాని ఆ భయానక, దుర్మార్గ శాఖ భవనం మీదనే ప్రజలు దాడి చేశారు. “మాకు రొట్టె కావాలి, నీళ్లు కావాలి. బెన్ అలీ వద్దు” అనే నినాదాలతో రాజధానీ నగరం మాత్రమే కాదు, దేశమే దద్దరిల్లిపోయింది.

తన అధికారం కాపాడుకునే కార్యక్రమంలో భాగంగా అధ్యక్షుడు మంత్రివర్గ సహచరులను ముగ్గురిని తొలగించాడు. రాజధానిలో ముఖ్యమైన ప్రభుత్వ భవనాలను కాపాడే బాధ్యతను సైన్యానికి అప్పగించాడు. ఆ మర్నాడు ఆంతరంగిక భద్రతా మంత్రిని కూడ తొలగించాడు. దేశమంతా రాత్రి కర్ఫ్యూ విధించాడు. చివరికి జనవరి 14న మంత్రివర్గాన్నీ, పార్లమెంటునూ రద్దుచేశాడు. ఆరు నెలల్లో మళ్లీ ఎన్నికలు జరుపుతానని వాగ్దానం చేశాడు. కొన్ని గంటలు గడవకముందే దేశంలో అత్యవసర పరిస్థితి విధించాడు. మరొక రెండు గంటల్లోనే కుటుంబంతో సహా దేశం వదిలి పారిపోయాడు. మొదట ఫ్రాన్స్ లో ఆశ్రయం తీసుకోవడానికి ప్రయత్నించగా, టునీషియా ప్రజల ఆగ్రహానికి జడిసి ఫ్రాన్స్ తిరస్కరించింది. ఆ తర్వాత బెన్ అలీ కుటుంబం సౌదీ అరేబియాలో ఆశ్రయం పొందింది.

వెంటనే అప్పటివరకూ ప్రధానిగా ఉన్న గన్నౌచీ అధ్యక్షుడిగా “జాతీయ ఐక్యతా” మధ్యంతర ప్రభుత్వం ఏర్పడింది. ఐనా ప్రజాగ్రహం చల్లారలేదు. బెన్ అలీ పారిపోయినంత మాత్రాన సరిపోదనీ, అతని పాలన అవశేషాలన్నీ రద్దు కావలసిందేననీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పాత బెన్ అలీ మంత్రివర్గంలో భాగస్తులే ఎక్కువ మంది ఉన్న కొత్త మంత్రివర్గం అనేక రాజకీయ సంస్కరణలను ప్రకటించింది. రాజకీయ పార్టీలు స్వేచ్ఛగా పనిచేసుకోవచ్చునని ప్రకటించింది. గత ప్రభుత్వం రాజకీయ, సామాజిక కార్యకర్తలపై విధించిన ఆంక్షలను రద్దుచేసింది. గత పాలకపార్టీకి చెందిన భవనాలను, ఆస్తులను జాతీయం చేసింది. మల్లె విప్లవపు అమరులందరికీ గౌరవసూచకంగా మూడు రోజుల విషాదదినాలు ప్రకటించింది. కాని ప్రజలు ఈ పైపై మెరుగులలో ఏ ఒక్కదాన్నీ అంగీకరించడం లేదు. ఆ అమరులను చంపినవారే మళ్లీ గద్దెనెక్కి ఆ అమరులకు నివాళి ప్రకటించడమేమిటని నిలదీస్తున్నారు. ఈ నిరసన ఆందోళన ఎంత విస్తృతమైనదంటే అందులో పాల్గొనని ప్రాంతం, వర్గం లేదు. చివరికి పోలీసులు కూడ తమ విధులను బహిష్కరిస్తున్నారు. తప్పనిసరిగా పనిచేయవలసిన ట్రాఫిక్ పోలీసులు మాత్రమే తమ విధులు నిర్వహిస్తున్నప్పటికీ, వారు కూడ అమరుల స్మృతి సూచకంగా భుజాలకు ఎర్రపట్టీలు కట్టుకుని పనిచేస్తున్నారు. కొత్త మధ్యంతర ప్రభుత్వాన్ని కూడ రద్దు చేయాలని ప్రదర్శకులందరూ డిమాండ్ చేస్తున్నారు. “దేశ సంపదను దోచుకుతిన్నది మీరే. మా ఈ విప్లవాన్ని మాత్రం మీరు దోచుకోవడానికి వీలు లేదు. ప్రభుత్వం వైదొలగవలసిందే. అమరుల నెత్తుటి ధారవోతకు మేం ద్రోహం చేయం” అని ప్రజలు నినదిస్తున్నారు.

ఎన్నో నగరాల్లో, ప్రాంతాల్లో తాత్కాలిక విప్లవ, ప్రజాస్వామిక పాలనా సమితులు ఏర్పడ్డాయి. దేశవ్యాప్తంగా పేరున్న నిజాయితీపరులతో, గత ప్రభుత్వంతో ఎటువంటి సంబంధం లేనివారితో ఒక మధ్యంతర ప్రభుత్వం ఏర్పడాలనీ, దాని నాయకత్వంలో కొత్త రాజ్యాంగ రచన, ఎన్నికల నియమావళి ఏర్పాటు జరగాలని ఒక రాష్ట్రంలో ఏర్పడిన “ప్రజా విప్లవ పరిరక్షణ సమితి” కోరింది. స్వేచ్ఛ కోసం, ఆత్మగౌరవం కోసం సాగిన ప్రజా విప్లవ క్రమంలో పాత ప్రభుత్వం, పాత ప్రజా ప్రతినిధుల సభ తమ సాధికారతను కోల్పోయాయని, కనుక వాటిని రద్దు చేయాలని ఆ సమితి కోరింది. గత ప్రభుత్వం అన్యాయం మీద, నిరంకుశత్వం మీద, అవినీతి మీద, నిరుద్యోగం మీద, అపార దేశ సంపదలను కొల్లగొట్టడం మీద ఆధారపడి ఒక చీకటి రాజ్యాన్ని నెలకొల్పిందనీ, ప్రజలను అన్ని రకాల అణచివేతలకు, దోపిడీకి గురిచేసిందనీ, అందువల్ల గత ప్రభుత్వంతో సంబంధం ఉన్నవాళ్లనెవరినీ మళ్ళీ ఎన్నికలలో పాల్గొనకుండా నిషేధించాలని కూడ ఆ సమితి కోరింది.

ప్రభుత్వరంగ ప్రచారసాధనం లా ప్రెస్ అనే పత్రిక కార్యాలయంలో పాత సంపాదకుడిని తొలగించి, రెండు కొత్త సంపాదక సమితులను ఎన్నుకున్నారు. రాజకీయ కారణాలతో గతంలో తొలగించిన జర్నలిస్టును జర్నలిస్టు సంఘపు నాయకుడిగా పునర్నియమించారు. పాత అధ్యక్షుడి బంధువులకు చెందిన కంపెనీలలో, మంత్రిత్వశాఖలలో సమ్మెలు, కార్మిక ప్రదర్శనలు మొదలయ్యాయి. దేశంలోని ప్రధాన బీమా సంస్థ నుంచీ, ప్రధాన చమురు పంపిణీ సంస్థ నుంచీ, బాంక్ డి టునీసి నుంచీ, పన్నుల శాఖ నుంచీ, జాతీయ వ్యవసాయ బ్యాంకు నుంచీ, టునీసీ టెలికాం సంస్థ నుంచీ ప్రధాన కార్యనిర్వహణాధికారులను వెళ్ళగొట్టారు. పాత అధ్యక్షుడి బంధువులయిన ఈ అధికారులు ఈ సంస్థలనుంచి ముఖ్యమైన కాగితాలు తీసుకుపోకుండా కార్మికులు, సిబ్బంది కాపలాలు కాస్తున్నారు.

పారిశ్రామిక, వ్యాపార సంస్థల మీద ఈ విప్లవ ప్రభావం ఎంతగా ఉన్నదంటే, టునీషియన్ వాణిజ్య పత్రికలు “చట్టం పట్ల గౌరవం లేకుండా పోతున్నద”ని వాపోతున్నాయి. “ఆంతరంగిక భద్రతా మంత్రిత్వశాఖ ఏం చేస్తున్నది” అని ప్రశ్నిస్తున్నాయి. “గౌరవనీయ వ్యాపారవేత్తలను ఇలా మోకరిల్లేలా చేస్తారా” అనీ, “క్రమశిక్షణ” అవసరమనీ రాస్తున్నాయి.

ఆకస్మిక ఘటనగా, గెంతుగా, గుణాత్మక మార్పుగా కనిపిస్తున్నప్పటికీ, ఈ పరిణామానికి సుదీర్ఘ గతం ఉంది. ఆఫ్రికా ఖండానికి ఉత్తర కొసన మధ్యధరా సముద్ర తీరంలో లిబియా, అల్జీరియాలు సరిహద్దుగా ఒక కోటికి పైగా జనాభాతో ఉన్న టునీషియాకు చమురు నిల్వలున్న దేశంగా, పర్యాటక కేంద్రంగా చాల ప్రాముఖ్యత ఉంది. పెట్రోలియం, సహజవాయువు, వ్యవసాయోత్పత్తులు ప్రధాన వనరులు కాగా, పదమూడు వందల కిలోమీటర్ల సముద్రతీరం వల్ల పర్యాటకరంగం కూడ ఆదాయవనరుగా ఉంది. పేరుకు ఆఫ్రికా దేశమైనా, ముస్లిం జనాభావల్ల, ప్రాంతీయ సాన్నిహిత్యం వల్ల అది పశ్చిమాసియాలోని అరబ్ దేశాలకే దగ్గర. అలాగే మధ్యధరా సముద్రం అవతలి ఒడ్డున ఉన్న యూరప్ దేశాల వల్ల, ముఖ్యంగా ఎంతోకాలం వలసగా పాలన సాగించి, ఇప్పటికీ రాజకీయాలను, ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్న ఫ్రాన్స్ వల్ల టునీషియాకు యూరపియన్ యూనియన్ తోనూ దగ్గరి సంబంధం ఉంది. ఫ్రాన్స్, అమెరికాలతో సహా ఎన్నో సామ్రాజ్యవాద ప్రభుత్వాలు బెన్ అలీకి ఈ రెండు దశాబ్దాలుగా మద్దతు ఇస్తూ ఉన్నాయి.

పేరుకు గణతంత్ర రాజ్యమైనా అధ్యక్షుడు జైన్ ఎల్ అబీదిన్ బెన్ అలీ ఇరవై మూడు సంవత్సరాలుగా నిరంకుశ పాలన సాగిస్తున్నాడు. అతని నాయకత్వంలోని కాన్ స్టిట్యూషనల్ డెమొక్రటిక్ రాలీ (ఆర్ సి డి) అనే పార్టీ పట్ల ప్రజలలో  ఎంతో అసంతృప్తి, వ్యతిరేకత ఉన్నప్పటికీ, అది దాదాపు ప్రతి ఎన్నికలలోనూ ఘన విజయాలు సాధిస్తూ వస్తోందంటే ఆ ఎన్నికల తతంగం ఎంత బూటకంగా జరుగుతోందో అర్థమవుతుంది. ఆ పార్టీకి 2009 సార్వత్రిక ఎన్నికలలో 89.6 శాతం వోట్లు వచ్చాయి. ఆ ఎన్నికలను పర్యవేక్షించడానికి వెళ్లిన స్వతంత్ర విదేశీ విలేకరులను విమానాశ్రయం నుంచే వెనక్కి పంపించేసిన ఘనత ఆ ప్రభుత్వానిది.

ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ ప్రజాస్వామ్యం ఎలా పనిచేస్తోందో 2008లో జాబితా తయారు చేసిన ఎకనమిస్ట్ పత్రిక ఆ 167 దేశాల జాబితాలో టునీషియాను 141వ స్థానంలో పెట్టింది. అదేసంవత్సరం పత్రికాస్వేచ్ఛ పరిస్థితి గురించి తయారయిన మరొక 173 దేశాల జాబితాలో టునీషియా 143వ స్థానంలో ఉంది. దేశంలో ఇంటర్నెట్ ప్రవేశం మీద ప్రభుత్వం తీవ్రమైన ఆంక్షలు విధించింది. రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ సంస్థ టునీషియాను ఇంటర్నెట్ శత్రువుల జాబితాలో చేర్చింది. గత ఇరవై సంవత్సరాలలో దేశంలో ప్రజల హక్కుల గురించి మాట్లాడిన ఎందరో వ్యక్తులు జైలుపాలయ్యారు. లేదా విదేశాలకు శరణార్థులుగా వెళ్లారు. దేశంలో ఒక్క పౌరహక్కుల సంస్థను కూడ ప్రభుత్వం పనిచేయనివ్వలేదు.

ఇలా కనీస మానవ హక్కులన్నిటిలోనూ అట్టడుగు స్థానాన ఉన్న టునీషియా అవినీతిలో, కుంభకోణాలలో, విదేశాలకు సంపద తరలింపులో మాత్రం అగ్రస్థానంలో ఉంది. దేశంలోని ప్రధాన పారిశ్రామిక, వ్యాపార సంస్థలన్నీ అధ్యక్షుడి భార్యకు సమీప బంధువుల చేతిలో ఉన్నాయి. అధ్యక్షుడి భార్య దేశదేశాలు తిరిగి విలాసవస్తువులు కొంటుందని ప్రతీతి. ప్రభుత్వానికి చెందిన ఒక విమానాన్ని ఇలా ఆమె తన సొంత సరదాలకోసం మిలాన్, పారిస్, జెనీవా లాంటి నగరాలకు తీసుకువెళ్లి కోట్ల డాలర్ల విలాస వస్తువులు కొనడం పత్రికలకెక్కింది. చివరికి దేశంనుంచి అధ్యక్ష కుటుంబం పారిపోవడానికి కొద్ది రోజుల ముందు, అంటే దేశంలో అల్లకల్లోల స్థితి ఉన్నప్పుడే ఆమె దేశ ఖజానా నుంచి ఒక టన్నున్నర (పదిహేనువందల కిలోల) బంగారాన్ని తన ఇంటికి తీసుకుపోయిందనీ, దేశం నుంచి పారిపోయేటప్పుడు ఆ బంగారాన్ని కూడ ఎత్తుకుపోయారనీ వార్తలు వస్తున్నాయి. టునీషియాలో ప్రజాస్వామ్యం పేరుతో దొంగలస్వామ్యం సాగుతున్నదనే విమర్శలు ఎంతో కాలంగా సాగుతున్నాయి.

ఇలా విపరీతమైన అవినీతితో, దేశ సంపదను కొల్లగొడుతూ, ఆ కొల్లగొట్టిన సంపదతో అతిభయంకరమైన నిర్బంధ పాలనను నడుపుతూ  ప్రజలను భయపెడుతూ బెన్ అలీ, అతని పార్టీ, అతని ఆశ్రితులు దేశాన్ని చీకటిరాజ్యంగా నడుపుతూ వచ్చారు. ఆ చీకటి రాజ్యాన్ని తుదముట్టించే ప్రయాణం మహమ్మద్ బొవజిజి అంతిమయాత్రతో మొదలయింది.

నిజానికి ఈ టునీషియా గత విషాద గాథ, వర్తమాన ప్రజావిజయగాథ చాల ఆసక్తికరమైన అంశాలను వెలికితీస్తున్నాయి. రెండో ప్రపంచయుద్ధం తర్వాత వలస పాలనలనుంచి స్వతంత్రమై, దేశీయ దోపిడీదారుల చేత చిక్కిన అన్ని దేశాలలోనూ కొద్దిగా అటూ ఇటూగా ఇటువంటి పరిణామాలే జరిగాయి, జరుగుతున్నాయి. అక్కడిలాగే అన్ని దేశాలలోనూ ప్రజలలో అసంతృప్తి, ఆగ్రహం పేరుకుపోతూనే ఉన్నాయి. పేదరికం, ఆకలి, దుఃఖం, నిరుద్యోగం, అవినీతి, దేశ సంపదలను పిడికెడు మంది పాలకులు దోపిడీ చేయడం, సొంత బొక్కసాలు నింపుకోవడం, ప్రశ్నించిన ప్రజల మీద దుర్మార్గమైన అణచివేతను అమలు జరపడం, ఆ పాలకులకు అగ్రరాజ్యాల మద్దతు ఉండడం – ఏ దేశంలో చూసినా ఇదే కథ. పేర్లు, అంకెలు, వివరాలు మాత్రం మారుతాయి తప్ప 1940ల తర్వాత వలస పాలన రద్దయిందని ప్రకటించుకున్న అన్ని దేశాలలోనూ కనబడుతున్న దృశ్యం ఇదే. మహమ్మద్ బొవజిజి ఆత్మహననంతో టునీషియా సమాజం రగుల్కొన్నట్టుగా దాదాపు ప్రతిదేశంలోనూ ఇటువంటి ఆకస్మిక, సంచలనాత్మక ఘటనలు, పరిణామాలు కూడ జరుగుతూనే ఉన్నాయి. టునీషియాతో పోలిస్తే ఆయా దేశాలు విస్తీర్ణంలోనూ, జనాభాలోనూ, ప్రజాసమూహాల వైవిధ్యంలోనూ భిన్నమైనవి కావచ్చు. అందువల్ల ఆ ప్రజా ఆగ్రహ ప్రకటనలు, వాటి విస్తృతి వేరువేరుగా ఉండవచ్చు. టునీషియాలో జరిగినట్టే ప్రతిచోటా జరగకపోవచ్చు.

కాని అన్నిచోట్లా ఇంత విస్తృతమైన ప్రజా అసంతృప్తి, ఆగ్రహం ఉన్నాయనేది వాస్తవం. సరైన నాయకత్వం ఉంటే, ఏదైనా ముట్టించే సంఘటన జరిగితే ఈ ఆగ్రహం ప్రభుత్వాలను కూలదోయగల మహాగ్ని జ్వాలలుగా ఎగుస్తుందనేది కూడ వాస్తవం. ఆ ప్రజా అసంతృప్తిని సమీకరించి, సంఘటితం చేసి, ప్రణాళిక ప్రకారం నడిపించి, వ్యవస్థను మార్చి, దోపిడీ పీడనలను అంతం చేసి, కొత్త సాంఘిక రాజకీయార్థిక వ్యవస్థను నెలకొల్పడం అన్ని దేశాల ప్రజల ముందర, ప్రజాస్వామిక, విప్లవ శక్తుల ముందర ఉన్న కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని నెరవేర్చడానికి ఒక నిర్మాణయుతమైన రాజకీయ శక్తి కావాలి. ఆ రాజకీయ శక్తి ఈ ప్రజాందోళనలను సృజనాత్మకంగా అర్థం చేసుకుని, వాటిలో ప్రవేశించి, నాయకత్వం వహించి, మార్గ నిర్దేశనం చేసి, యథాస్థితిని కూలదోసి, నూతన సమాజ నిర్మాణానికి ఉపయోగించుకోవాలి. ఇవాళ టునీషియాలో అటువంటి పరిణామం జరుగుతుందో లేదో తెలియదు. ప్రస్తుత సంధి దశలో ప్రజలు, వారికి నిజంగా నాయకత్వాన్ని అందించవలసిన శక్తులు చొరవను కోల్పోతే ఈ విప్లవం మధ్యలో దారి తప్పిపోతుంది. మరొక రూపంలో, కొత్త పేర్లతో దోపిడీ పీడనల రాజ్యం కొనసాగుతుంది. విప్లవంగా పేరు పెట్టుకుని మొదలయినది వ్యవస్థ మార్పుగా కాక, ప్రభుత్వం మార్పుగా ఆగిపోతుంది. ఇప్పటికే టునీషియా ప్రజాగ్రహజ్వాలల్లో తమ పేలాలు వేయించుకు తినడానికి సామ్రాజ్యవాదశక్తులు, మతఛాందసశక్తులు, కుహనా ఉదార ప్రజాస్వామిక వాదులు, పొరుగుదేశాల నేతలు, బహుళజాతిసంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఆ అవరోధాలన్నిటినీ దాటుకుని ఈ మల్లె విప్లవం నిజంగా ప్రజలకు సువాసనలు వెదజల్లగలుగుతుందా కాలమే చెప్పాలి.

టునీషియా పరిణామాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రజానుకూల శక్తులకు ఒక పాఠం నేర్పుతున్నాయి. ఆ పాఠం ఏమంటే, ఇవాళ ప్రజలు విప్లవానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ప్రజా అసంతృప్తి విస్ఫోటక స్థితిలో ఉన్నది. అది ఎంత చిన్న అగ్గిరవ్వకైనా అంటుకుని పేలిపోయేలా ఉన్నది. ఎంత బలహీనమైన గాలిపరకకైనా దావానలంలా విస్తరించడానికి సిద్ధంగా ఉన్నది. ఈ ప్రజాగ్రహపు జానకితాడును ముట్టించడం ఎట్లా, ఆ పేలుడును నిర్మాణయుతంగా, తక్కువ విధ్వంసకరంగా జరపడం ఎట్లా, విస్ఫోటన అనంతర నూతన సమాజ నిర్మాణానికి రంగం సిద్ధం చేయడం ఎట్లా అనేవే ఇవాళ ప్రపంచ ప్రజానుకూల శక్తుల ముందున్న ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు జవాబులను కనుక్కునే ఆచరణే ఇరవై ఒకటో శతాబ్ది ప్రజా సంచలనాలను సామాజిక పరివర్తనా విప్లవాలుగా మార్చగలుగుతుంది.

 

 

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Telugu. Bookmark the permalink.

2 Responses to టునీషియా ప్రజావిజయగాథ

  1. madabhushi sridhar says:

    it is a very scientific analysis of social dynamics. good language effectively used. will give lot of information. extra-ordinary.

  2. madabhushi sridhar says:

    It is a very good analysis given in effective language. at the same time very informative on a recent socio dynamic development.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s