నిజమైన ప్రజల మనిషి కన్నబిరాన్

వీక్షణం ఫిబ్రవరి 2011 సంచిక కోసం

కె జి కన్నబిరాన్ లక్షలాది మంది ప్రజల ప్రేమనూ అభిమానాన్నీ చూరగొన్న నిజమైన ప్రజల మనిషి. ఆధునిక తెలుగు సామాజిక జీవితంలో ప్రజల మనిషి అనే విశేషణానికి సంపూర్ణంగా సరిపోయే అతి కొద్ది మందిలో ఆయన ఒకరు. నాలుగు దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో గాని, దేశవ్యాప్తంగా గాని ప్రాథమిక హక్కులు కోల్పోయిన ప్రతి మనిషీ, అధికారం చేతిలో, పోలీసుల చేతిలో దౌర్జన్యానికి గురయిన ప్రతి మనిషీ ఆయనను తలచుకుని ఉంటారు, ఆయన సహాయం కోరి ఉంటారు, న్యాయవాదిగానూ, ఉద్యమకార్యకర్తగానూ, మంచిమనిషిగానూ ఆయన అందించిన సహాయం పొంది ఉంటారు. ఎనబై రెండు సంవత్సరాల సంపన్నమైన, సార్థకమైన నిండు జీవితంలో అరవై సంవత్సరాలకు పైగా ఆయన ప్రజా ఉద్యమాలలో, ప్రజల హక్కుల పరిరక్షణలో, ప్రజాస్వామిక విలువలను పెంపొందించే కృషిలో నిరంతరం పాలుపంచుకున్నారు. సమాజంలో అణగారిన, అణచివేతకు గురవుతున్న, పోరాడుతున్న ప్రజలకూ వర్గాలకూ అలా పెద్దదిక్కుగా నిలబడిన కన్నబిరాన్ 2010 డిసెంబర్ 30న తుదిశ్వాస విడిచారు.

తెలుగు సమాజానికీ, పౌరహక్కుల ఉద్యమానికీ, మొత్తంగా భారత పీడిత ప్రజా ఉద్యమాలకూ కన్నబిరాన్ అందించిన కానుకలు అపారమైనవి, అద్భుతమైనవి. ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘానికి అత్యంత కీలకమైన, నిర్బంధ భరితమైన కాలంలో ఆయన 1978 నుంచి 1993 దాకా పదిహేను సంవత్సరాల పాటు అధ్యక్షుడిగా పనిచేశారు. రాష్ట్రంలోనూ, దేశంలోనూ ట్రేడ్ యూనియన్ల, ఉద్యోగుల, దళితుల, ఆదివాసుల, మత మైనారిటీల, జాతి విముక్తి పోరాటాల, విప్లవోద్యమాల హక్కులను పరిరక్షించే వందలాది కేసులలో 1960ల మధ్య నుంచీ కూడ ఆయన తన న్యాయశాస్త్ర నైపుణ్యాన్ని, వాదనా పటిమను అందజేస్తూవచ్చారు. నక్సలైట్ న్యాయవాదిగా పేరు తెచ్చుకునేంతగా నక్సలైట్ల కేసులు వాదించడం మాత్రమే కాక, నక్సలైట్ల మీద సాగిన, సాగుతున్న నిర్బంధకాండను ఎదిరించడంలో, ప్రపంచం దృష్టికి తేవడంలో ఆయన అనన్యసాధ్యమైన కృషి చేశారు. డజన్ల కొద్దీ బూటకపు ఎన్ కౌంటర్ ఘటనల మీద నిజనిర్ధారణ బృందాలలో పాల్గొని ఎన్ కౌంటర్ కట్టుకథల బూటకత్వాన్ని బహిర్గతం చేశారు. తార్కుండే కమిటీ, జస్టిస్ భార్గవా కమిషన్, జాతీయ మానవహక్కుల సంఘం, మెజస్టీరియల్ విచారణలు, న్యాయవిచారణలు, జిల్లా కోర్టులు, రాష్ట్రాల హైకోర్టులు, సుప్రీంకోర్టు – ప్రతి న్యాయ వేదిక మీదా ఆయన ఎన్ కౌంటర్ హత్యల కేసులు వాదించారు. ప్రతి ఎన్ కౌంటర్ ఘటననూ హత్యకేసుగా నమోదు చేయాలని, ఆత్మరక్షణార్థమే కాల్పులు జరిపామని రుజువు చేసుకునే బాధ్యత పోలీసులదేనని హైకోర్టు తీర్పు రావడానికి ప్రధాన కృషి కన్నబిరాన్ దే. ఎన్నో లాకప్ మరణాల కేసులను కూడ ఆయన చేపట్టి, పోలీసుల దుర్మార్గాన్ని ప్రజల దృష్టికి తెచ్చారు. ప్రజలమీద ప్రభుత్వాలు, పోలీసులు, పాలకవర్గాలు, ఆధిపత్యశక్తులు చేసే ప్రతి అక్రమాన్నీ, దౌర్జన్యాన్నీ ప్రశ్నించారు. బ్రిటిష్ వలసవాద పాలకులు తయారు చేసిన చట్టాలను 1947 తర్వాత, మరీ ముఖ్యంగా 1950 రాజ్యాంగం తర్వాత యథాతథంగా వాడుకోవడం అప్రజాస్వామికమని, ప్రజావ్యతిరేకమని ఆయన వాదించేవారు. ప్రభుత్వ వ్యతిరేకులందరినీ కుట్రదారులుగా, రాజద్రోహులుగా అభివర్ణించే వలసవాద రాజ్య హింసా విధానం ఇంకానా ఇకపై చెల్లదు అని ఆయన ప్రతిచోటా ఎలుగెత్తారు. భారత రాజ్యాంగం కేవలం పుస్తకం కాదనీ, అది భారత ప్రజలు సాగించిన వలసవాద వ్యతిరేక ఉద్యమ ఆకాంక్షల ఫలితమనీ ఆయన అనేవారు. ఆ ఆకాంక్షలు ప్రవేశికలో, ప్రాథమిక హక్కులలో, ఆదేశిక సూత్రాలలో ఉన్నాయనీ వాటిని కాపాడని ప్రభుత్వాలపై తిరగబడే హక్కు ప్రజలకు ఉందనీ ఆయన అనేవారు. రాజ్యాంగంలోని ప్రవేశికనూ, ప్రాథమిక హక్కులనూ, ఆదేశిక సూత్రాలనూ సంపూర్ణంగా అమలుజరపాలనీ, చట్టబద్ధ పాలనను నెలకొల్పాలనీ, ఏఒక్కరికీ, ముఖ్యంగా అధికారంలో ఉన్నవారికి, శిక్షాతీత హింసా ప్రవృత్తికి అవకాశం లేకుండా చేయాలనీ, ప్రభుత్వ విధానాలను విమర్శించే, ఎదిరించే హక్కు ప్రజలకు ఉన్నదని గుర్తించి గౌరవించాలనీ, వ్యక్తిగత ప్రవర్తనలో ప్రజాస్వామిక విలువలను పాటించాలనీ ఆయన జీవితాంతం మాట్లాడారు, వాదించారు, రాశారు, అక్షరాలా ఆ విలువలను పాటిస్తూ జీవించారు.

కన్నబిరాన్ జీవితం చాల వైవిధ్యభరితమైనది, ఎన్నెన్నో రంగాల జీవితానుభవాలు కలగలిసినది. మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి, తల్లి పోషణలో పేదరికం అనుభవించవలసి వచ్చి, చిన్ననాటనే కులాచారాల పట్ల ఏవగింపు కలిగి, సామాజిక న్యాయ ఆకాంక్షలను ఆకళింపు చేసుకున్న వ్యక్తిగా ఆయన జీవితంలో పాటించిన చాల విలువలకు పునాది బాల్య, కౌమార దశలలోనే పడింది. చదువరిగా, రచయితగా, వేలాది మంది క్లైంట్లకు న్యాయసహాయం అందించిన న్యాయవాదిగా, డజనుకుపైగా న్యాయవాదులకు నేరుగానూ, కొన్ని డజన్ల న్యాయవాదులకు పరోక్షంగానూ సీనియర్ గా, పౌరహక్కుల ఉద్యమకారుడిగా, వక్తగా, అధికారాన్ని ప్రతిఘటించిన సాహసిగా, ప్రజాఉద్యమాల సహచరుడిగా, తాత్వికస్థాయిలో మార్క్సిస్టుగా, ప్రతి అప్రజాస్వామిక ప్రవర్తననూ విమర్శించినవాడిగా ఆయనలో ఎన్ని కోణాల, పొరల విశాలమైన జీవితం ఉన్నదంటే, ఆ విస్తారమైన జీవితాన్ని ఒక వ్యాసంలో పట్టుకోవడం సాధ్యం కాదు. నిజానికి 500 పేజీలు సాగిన ఆయన ఆత్మకథాత్మక సామాజిక చిత్రం ’24 గంటలు’ గాని, ఆయన ఇంగ్లిషు వ్యాస సంకలనం ‘వేజెస్ ఆఫ్ ఇంప్యునిటీ’ గాని, ఆయన జీవితంలో పదో వంతును కూడ పట్టుకోలేకపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన జీవితం 1960 ల తర్వాత సామాజిక చరిత్రకు దర్పణం. తెలుగుసీమలో మొత్తంగానూ, దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమాల విషయంలోనూ సాగిన సామాజిక పరిణామాలన్నిటికీ ఆయన సాక్షి, భాగస్వామి, వ్యాఖ్యాత, విమర్శకుడు.

1929 నవంబర్ 9న మదురైలో జన్మించిన కన్నబిరాన్ బాల్యం సికిందరాబాదులోనూ, పాఠశాల విద్య సికిందరాబాదు, నెల్లూరులలోనూ గడిచాయి. ఇంటర్మీడియట్, బి ఎ (ఆనర్స్), ఎల్ ఎల్ బి మద్రాసులో చదువుకున్నారు. మద్రాసు హైకోర్టులో 1954 చివరిలో న్యాయవాదవృత్తిలో ప్రవేశించి 1960లో హైదరాబాద్ కు మారారు. చిన్ననాటి ప్రభావాలవల్ల, సోదరులిద్దరూ కమ్యూనిస్టు రాజకీయాల్లో, ట్రేడ్ యూనియన్ కార్యకలాపాలలో ఉండడంవల్ల ఆయన హైదరాబాదు న్యాయవాద జీవితం కార్మికవర్గపు కేసులతో, సింగరేణి బొగ్గుగని కార్మికుల కేసులతో ప్రారంభమయింది. భారత-చైనా యుద్ధ సమయంలో చైనాను సమర్థించారనే ఆరోపణతో 1964లో కమ్యూనిస్టు పార్టీ నాయకులలో కొందరిని అరెస్టు చేసినప్పుడు పౌరహక్కుల సంఘం ఏర్పాటు చేయడానికి జరిగిన ప్రయత్నాలో కన్నబిరాన్ భాగమయ్యారు. కాని కొద్దికాలానికే భారత కమ్యూనిస్టు పార్టీలో చీలిక రావడంతో అసలు ఆ ప్రయత్నాలే ఆగిపోయాయి. తర్వాత 1969-70లలో నక్సల్బరీ పంథాలో సాగుతున్న శ్రీకాకుళ గిరిజనోద్యమంపై భయంకరమైన అణచివేత, ఎన్ కౌంటర్లు, అరెస్టులు, చిత్రహింసలు మొదలయినప్పుడు, వెంపటాపు సత్యనారాయణ, ఆదిభట్ల కైలాసంతో సహా శ్రీకాకుళం విప్లవకారులమీద పార్వతీపురం కుట్రకేసు, తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వర రావు తదితరులపై హైదరాబాదు కుట్రకేసు ప్రారంభమయినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పడిన డిఫెన్స్ కమిటీల ప్రయత్నాలలో ఆయన భాగమయ్యారు.

ఆ క్రమంలోనే ఆయనే చెప్పుకున్నట్టు ఆయనను విప్లవోద్యమం వైపు నడిపించినవి విప్లవ సాహిత్యం మీద, విప్లవ సాహిత్యకారులమీద వచ్చిన రెండు కేసులు. విప్లవ రచయితల సంఘం ఏర్పడిన రోజున (4 జూలై 1970) వెలువడిన మార్చ్, విరసం మొదటి మహాసభల సందర్భంగా (9-10 అక్టోబర్ 1970) వెలువడిన ఝంఝ, లే కవితా సంకలనాలను ప్రభుత్వం నిషేధించినప్పుడు, కన్నబిరాన్ మార్చ్, లే ల నిషేధాన్ని సవాల్ చేస్తూ వాదించారు. రాష్ట్ర హైకోర్టు మార్చ్ పై నిషేధాన్ని ఆమోదిస్తూ, లే పై నిషేధాన్ని కొట్టివేసింది. అంతకు ముందే విరసం నాయకులు జ్వాలాముఖి, నిఖిలేశ్వర్, చెరబండరాజులను ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం కింద నిర్బంధించారు. కన్నబిరాన్ దగ్గర అప్పుడు జూనియర్ గా పనిచేస్తుండిన ఒక న్యాయవాదికి జ్వాలాముఖి బంధువు కావడం వల్ల ఆ కేసు కన్నబిరాన్ చేపట్టారు. అసలు ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, అందువల్ల దానికింద ఎవరినీ నిర్బంధించడానికి వీలులేదని కన్నబిరాన్ వాదించారు. ఆ వాదనల ఫలితంగా జస్టిస్ చిన్నప్ప రెడ్డి, జస్టిస్ ఎ డి వి రెడ్డి “రాజకీయ విశ్వాసాలు కలిగి ఉన్నందుకు, అవి ప్రకటించినందుకు ఎవరినీ నిర్బంధించడానికి వీలు లేదు” అని సుప్రసిద్ధమైన తీర్పు ఇచ్చారు. అసలు ఈ వాదనల వల్ల పి.డి. చట్టం రద్దయిపోవలసి వచ్చింది. ఆ తర్వాత వరుసలో వచ్చిన అన్ని దమన చట్టాలకూ — ఆంతరంగిక భద్రతా చట్టం, జాతీయ భద్రతా చట్టం, టెర్రరిస్ట్ అండ్ డిస్రప్టివ్ ఆక్టివిటీస్ (ప్రివెన్షన) యాక్ట్ (టాడా), ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ (పోటా), అన్ లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (ఊపా), కల్లోలిత ప్రాంతాల చట్టం, ప్రజా భద్రతా చట్టం, సాయుధదళాల ప్రత్యేక అధికారాల చట్టం, వగైరా అన్నిటికీ – వ్యతిరేకంగా న్యాయస్థానాలలో వాదించిన, సమాజంలో పోరాడిన అతి కొద్ది మందిలో కన్నబిరాన్ ఒకరు.

కౌమారదశ నుంచే విపరీతంగా అధ్యయనం చేసే అలవాటున్న కన్నబిరాన్ న్యాయశాస్త్రం, చట్టం మాత్రమే కాక, కవిత్వం, నవల, రాజకీయార్థశాస్త్రం, తత్వశాస్త్రం, రాజకీయాలు, చరిత్ర, మార్క్సిజం కూడ చదువుకున్నారు.   తన అధ్యయనం నుంచి ఆయన కేవలం జ్ఞాపకం మీదనే విపరీతంగా ఉటంకిస్తూ ఉండేవారు. అలాగే, విప్లవ సాహిత్య కేసులతో విప్లవసాహిత్యాన్ని, విప్లవోద్యమాన్ని కూడ సన్నిహితంగా నిశితంగా అధ్యయనం చేశారు. 1970-75 మధ్య చెరబండరాజు రాసి, కోర్టులలో పాడుతుండిన ఎన్నో పాటలను కన్నబిరాన్ చాల తరచుగా గుర్తు తెచ్చుకుంటూ ఉండేవారు. భూమయ్య, కిష్టాగౌడ్ ల ఉరిశిక్షకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలోనూ, రెండవసారి ఉరిశిక్ష అమలు ప్రయత్నాన్ని అడ్డుకోవడంలోనూ ఆయనకు వ్యక్తిగత పాత్ర ఉంది. దానితో తెలంగాణలో జరుగుతున్న రైతాంగ విప్లవోద్యమంతో ఆయన సంబంధం మరింత గాఢమయింది. రైతాంగ విప్లవోద్యమ కార్యకర్తలుగా ఉరికంబం ఎక్కవలసి వచ్చిన ఆ ఇద్దరితో ప్రత్యక్ష సంబంధం వల్ల, మరణశిక్ష అమానుషమైనదనే అవగాహన వల్ల ఆయన మరణశిక్షకు వ్యతిరేకంగా చాల కృషి చేశారు.

ఇక ఎమర్జెన్సీలో దేశమే చీకటి కొట్టుగా మారిపోయినప్పుడు, వేలాది మంది జైళ్లలో మగ్గిపోతున్నప్పుడు ఆ ఎమర్జెన్సీని సమర్థించిందన్న కారణంతో సిపిఐతో అప్పటివరకూ ఉన్న సంబంధాన్ని కూడ ఆయన తెంచుకున్నారు. ఒకవైపు రాజకీయ విశ్వాసాలలో అంత దృఢంగా ఉంటూనే, పౌరహక్కుల ఉల్లంఘనకు గురి అయినవారు ఎవరయినా సరే వారి పౌరహక్కులను పరిరక్షించడం తన బాధ్యత అని ఆయన చాల విశాల దృక్పథంతో అనుకున్నారు. అందుకే ఎమర్జెన్సీలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తల నుంచి మార్క్సిస్టు లెనినిస్టు పార్టీ కార్యకర్తలదాకా ప్రతి ఒక్కరూ తమ న్యాయవాది కన్నబిరాన్ అని చెప్పే పరిస్థితి వచ్చింది. ఎమర్జెన్సీలో ఆయన ఒంటి చేతిమీద వందలాది రిట్ పిటిషన్లు వేసి ఏదో ఒకస్థాయిలో ఖైదీల హక్కులను కాపాడడానికి ప్రయత్నించారు.

ఎమర్జెన్సీలో ఏకైక ప్రతిపక్ష న్యాయవాదిగా ఆయన చేసిన ఈ కృషి వల్లనే, ఎమర్జెన్సీ అనంతరం ఆయనకు దేశవ్యాప్తంగానే పౌరహక్కుల ఉద్యమ నాయకత్వ బాధ్యతలు వచ్చాయి. ఎమర్జెన్సీలో రాష్ట్రంలో జరిగిన ఎన్ కౌంటర్ హత్యల నిజానిజాలను నిర్ధారించడానికి జయప్రకాశ్ నారాయణ్ నియమించిన తార్కుండే కమిటీకి ఆయన కార్యదర్శిగా పనిచేశారు. తార్కుండే కమిటీ బూటకపు ఎన్ కౌంటర్లుగా నిర్ధారించిన కేసులలో నుంచి మూడు కేసులపై విచారణ జరపడానికి జస్టిస్ వశిష్ట భార్గవ నాయకత్వాన న్యాయవిచారణ కమిషన్ ఏర్పడినప్పుడు దాని ముందర వాదనలు వినిపించారు.

ఈలోగా 1978 ఏప్రిల్ లో వరంగల్ లో జరిగిన ఆంద్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం రెండవ మహాసభల్లో ఆయన అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత పదిహేను సంవత్సరాలలో ఒకవైపు ప్రజా ఉద్యమ విస్తరణనూ, దానిపై కాంగ్రెస్, తెలుగు దేశం ప్రభుత్వాలు సాగించిన భయంకరమైన అణచివేతనూ ఆయన దగ్గరి నుంచి చూశారు. ప్రజా ఉద్యమానికి అండగా నిలిచారు. ప్రజల హక్కులను కాపాడడానికి తన శక్తియుక్తులన్నిటినీ వెచ్చించారు. పాలకుల, పోలీసుల అత్యాచారాలను ఎదుర్కొన్నారు. ఒక దశలో రాష్ట్రంలో నిజమైన ప్రతిపక్షం ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం మాత్రమే అనే అభిప్రాయం కలిగేటంత పెద్ద ఎత్తున ఆయన పనిచేశారు, సంస్థ చేత పనిచేయించారు. గత పది, పదిహేను సంవత్సరాలుగా న్యాయవాద వృత్తిని, ఆఫీసును క్రమక్రమంగా తగ్గిస్తూ వచ్చినా, ఆరోగ్యం సహకరించకపోయినా, పౌరహక్కుల పరిరక్షణకోసం నిరంతరం తపన పడుతూ వచ్చారు. ప్రజాస్వామ్య విలువలకు ఎక్కడ భంగం వాటిల్లినా, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరిగినా తక్షణమే స్పందించేవారిలో ఆయన మొదట ఉండేవారు. అందువల్లనే దేశవ్యాప్తంగా కూడ ఎన్నో కేసుల్లో ఆయా ప్రజాసమూహాలు, ప్రజాసంస్థలు, ఉద్యమాలు ఆయన సహాయం కోరుతూ వచ్చాయి. ఈశాన్య భారత జాతుల పోరాటాలు, పశ్చిమ బెంగాల్ ఎన్ కౌంటర్లు, ఉత్తర ప్రదేశ్ లో మానవహక్కుల కమిషన్ ఏర్పాటు, కాశ్మీర్ ప్రజల మీద సైన్యం అత్యాచారాలు, పంజాబ్ యువకులపై ప్రభుత్వ దమనకాండ, ఢిల్లీలో సిక్కుల ఊచకోత, పార్లమెంటు దాడి కేసు పేరుతో అమాయకులపై వేధింపులు, గుజరాత్ మారణకాండ, బొంబాయిలో ముస్లింల మీద అత్యాచారాలు, కర్నాటకలో వీరప్పన్ అనుచరుల పేరుమీద ఆదివాసులపై దాడులు, తమిళనాడులో శ్రీలంక కాందిశీకులపై దాడులు, ఒడిషాలో క్రైస్తవులపై దాడులు – ఆయన స్పందించని పౌరహక్కుల ఉల్లంఘన ఘటనలు దాదాపు లేవనే చెప్పాలి. ఆరోగ్యం సహకరించినంతవరకూ,   చివరి నిమిషం దాక కూడ ఆయన పౌరహక్కుల పరిరక్షణ కృషిని సాగిస్తూనే వచ్చారు.

న్యాయవాదిగానైనా, పౌరహక్కుల ఉద్యమకారుడిగానైనా ఆయన సామాజిక జీవితపు మొదలూ తుదీ చూస్తే ఆయన హృదయం అవగతమవుతుంది. మద్రాసు హైకోర్టులో న్యాయవాద వృత్తిలో ప్రవేశించిన తొలిరోజుల్లో 1955-56ల్లోనే ఆయన చేసిన కేసులలో ఒకటి ఆసియా బేగం ది. దేశ విభజన తర్వాత పాకిస్తాన్ లో మంచి బతుకు ఉంటుందేమోననే ఆశతో వెళ్లి, ఆ ఆశ నిరాశ కాగా వెనక్కి వచ్చిన స్త్రీ ఆమె. తిరిగి వస్తున్నప్పుడు సరిహద్దు దగ్గర అధికారులు ఆమె చేతుల్లో ఒక కాగితం పెట్టారు. ఆ కాగితాన్ని పాస్ పోర్ట్ అంటారని, అది ఆ దేశ పౌరసత్వానికి చిహ్నమనీ ఆమెకు తెలియదు. కాని ఆ ఒక్క కాగితంతో ఆమె పాకిస్తాన్ పౌరురాలయిపోయింది. ఆమె పాకిస్తాన్ పౌరురాలు గనుక వెనక్కి తిప్పి పంపుతామని భారత అధికారులు అన్నారు. అప్పుడే అమలులోకి వచ్చిన భారత పౌరసత్వ చట్టం ప్రకారం ఏ వ్యక్తి దగ్గరయినా విదేశీ పాస్ పోర్టు ఉన్నట్టయితే వారు భారత పౌరులు కానట్టే. ఆ అభాగ్యమహిళ పక్షాన వాదించిన కన్నబిరాన్ ఆమెను వెళ్లగొట్టడానికి అధికారులు చేసిన ప్రయత్నాలను రద్దు చేయించారు. అలాగే, చనిపోవడానికి మూడు రోజుల ముందు, ఒక సెషన్స్ కోర్టు చట్టవ్యతిరేకంగా, రాజ్యాంగస్ఫూర్తికి భిన్నంగా పౌరహక్కుల నాయకుడు డా. బినాయక్ సేన్ కు యావజ్జీవ శిక్ష విధించినప్పుడు వెంటనే ఖండించారు. అటుకొసన ఒక పేద ముస్లిం మహిళ హక్కుల కోసం నిలబడిన సందర్భానికీ, ఇటు కొసన ఒక ఉన్నత మధ్యతరగతి వైద్యుడు, సామాజిక కార్యకర్త హక్కుల కోసం నిలబడిన సందర్భానికీ మధ్యన ఐదున్నర దశాబ్దాలు గడిచినా కన్నబిరాన్ అనుసరించిన స్ఫూర్తి ఒకటే, లక్ష్యం ఒకటే – మనిషి సగౌరవంగా, హక్కులతో, చట్టబద్ధ పాలనలో, సురక్షితంగా జీవించాలని. అధికారంలో ఉన్నవారు దాన్ని దౌర్జన్యానికీ, శిక్షాతీతమైన, విచారణాతీతమైన నేరస్వభావంతో వాడగూడదని. ప్రజలను హింసకూ, భయానికీ, అభద్రతకూ గురిచేయగూడదని.

నిజానికి ఈ మనిషి కోసం, మనిషి హక్కుల కోసం తపనే కన్నబిరాన్ తాత్విక దృక్పథం. “ఊరికే జడ్జి చెప్పిన, బెంచి గుమస్తా చెప్పిన వాయిదా తేదీలు, ఐపిసి, సి ఆర్ పిసి సెక్షన్లు ఆ కట్ట విప్పకుండా రాసుకోవడం కాదు. ఆ కట్టలు విప్పి చూడండి. నిలువుగా మలిచిన ఆ కోర్టుకాగితాల కట్ట విప్పిచూస్తే మనుషులు కనబడతారు, వేదనకు గురవుతున్న మనుషులు కనబడతారు, వాళ్లు మీ సహాయం అర్ధిస్తూ ఉంటారు” అని ఆయన సహ న్యాయవాదులతో, జూనియర్లతో అంటుండేవారు.

న్యాయస్థానాలకు, ముఖ్యంగా న్యాయమూర్తులకు మనుషుల గురించి, మనుషుల వేదన గురించి తెలియదని కూడ ఆయనకు చాల కోపంగా ఉండేది. కోర్టుధిక్కార నేరారోపణకు భయపడకుండా న్యాయమూర్తులను ఎడాపెడా వాయించిన అతి తక్కువమంది న్యాయవాదులలో ఆయన ఒకరు. ఆ న్యాయమూర్తులకు సమాజం గురించి, మనుషుల గురించి, మార్పు గురించి పాఠాలు చెప్పాలని ఆయన అనుకునేవారు. అందుకే ఆయన కోర్టు వాదనలు అద్భుతమైన, ఉద్వేగభరితమైన ఉపన్యాసాలలా ఉండేవి. బయట బహిరంగసభలలో ఉపన్యాసాలలో సాధారణ ప్రజలకు కోర్టుల గురించీ, చట్టాల గురించీ, మాయ గురించీ చెప్పాలనుకునేవారు గనుక అవి వాదనలలా ఉండేవి.

మొత్తంగా చెప్పాలంటే కె జి కన్నబిరాన్ (1929 – 2010) జీవితమే ఒక నమూనా, ఒక ఆదర్శం, ఒక పాఠం. నిరాడంబరత్వం, ఎన్ని కష్టాలు ఎదురయినా నమ్మిన విలువల కోసం కట్టుబడి ఉండడం, దౌర్జన్యాన్ని, అధికారాన్ని సాహసికంగా ప్రతిఘటించడం, చేయదలచుకున్న పని అత్యంత సమర్థంగా, నైపుణ్యంతో చేయడం – ఆయన నుంచి ఎవరయినా నేర్చుకోవలసిన పాఠాలు. ముఖ్యంగా ఈ దేశంలో అసంఖ్యాక పీడిత ప్రజానీకం అనుభవిస్తున్న దుర్భర దోపిడీ పీడనలు రద్దు కావాలని కోరుకునే వారందరూ కన్నబిరాన్ జీవితాదర్శాన్ని, జీవితాచరణను అధ్యయనం చేయాలి, అనుసరించాలి.

 

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Veekshanam. Bookmark the permalink.

2 Responses to నిజమైన ప్రజల మనిషి కన్నబిరాన్

  1. Dr.Rajendra Prasad says:

    Great information about a great man

  2. anonymous says:

    లక్ష్మి ని అమానుషంగా హత్య చేసిన మనోహర్ కు మానవహక్కులు అంటూ మాట్లాడిన కన్నభిరాన్ తన కూతురుని అదే విధంగా హత్య చేస్తే హంతకుడి తరపున వాదిస్తాడా?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s