శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణ పట్ల పాలకుల అన్యాయాలకు మరొక నిదర్శనం

For Telangana NGO’s

జస్టిస్ బి ఎన్ శ్రీకృష్ణ నాయకత్వాన ఏర్పడిన కమిటీ నివేదిక తెలంగాణకు ఏదో ఒరగబెడుతుందని గాని, దాని ద్వారా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలకు బలం చేకూరుతుందని గాని ఎవరూ అనుకోలేదు. 2009 డిసెంబర్ 9 ప్రకటన తర్వాత పరిస్థితులు మారాయనీ, అందువల్ల “విస్తృత సమాలోచనలు అవసరమ”నీ డిసెంబర్ 23న చేసిన ప్రకటన తర్వాత జరిగిన 2010 జనవరి 5 అఖిలపక్ష సమావేశం ఫలితంగా ఫిబ్రవరి 3న ఈ కమిటీ ఏర్పడింది.

కాని ఫిబ్రవరి 12న ఈ కమిటీ విధావిధానాల ప్రకటన జరిగేటప్పటికే ఈ కమిటీకి డిసెంబర్ 9 ప్రకటన గురించిన విస్తృత సమాలోచనలు జరిపే కర్తవ్యం బదులు, తలకు మించిన పనులెన్నో పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ను యథాతథంగా కొనసాగించాలనే డిమాండ్ ను పరిశీలించడం కూడ దాని పనులలో చేర్చారు. అందువల్ల ఈ కమిటీ ఏర్పాటులోనే, దాని విధివిధానాల రూపకల్పనలోనే స్పష్టమైన దురుద్దేశాలు, కాలయాపన ఉద్దేశాలు ఉన్నాయి.

ఈ కమిటీని గుర్తించనేవద్దనీ, బహిష్కరించాలనీ కూడ పిలుపునిచ్చిన రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, నాయకులు ఉన్నారు. అయితే ఆ కమిటీ ఒక వాస్తవమై, దాని ముందు కేవలం సమైక్య, కోస్తాంధ్ర, రాయలసీమ వాదనలు మాత్రమే వినిపించడం జరిగితే, దాని నివేదిక వాస్తవాలను ప్రతిబింబించదు గనుక, తెలంగాణ వాదులు తమ వాదనలు వినిపించడానికి ఈ కమిటీని కూడ ఒక వేదికగా వినియోగించుకోవాలనే అభిప్రాయమూ వచ్చింది. అందువల్లనే అన్ని తెలంగాణ జిల్లాలలోనూ ప్రజలు, ప్రజాసంఘాలు, విశ్లేషకులు, రాజకీయపార్టీలు ఈ కమిటీ విచారణలకు సహకరించారు. ఇప్పటికే తెలంగాణకు అనుకూలంగా వచ్చిన ఏడెనిమిది కమిటీలకు తోడుగా వాస్తవాలను గుర్తించే, అవసరమైన పరిష్కారాలను సూచించే మరొక కమిటీగానైనా ఇది ఉంటుందని చాలమంది భావించారు. తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు వెలిబుచ్చిన ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను ఈ కమిటీ గుర్తిస్తుందని అనుకున్నారు. కమిటీ సభ్యులు తెలంగాణలో తిరిగి చూస్తే కళ్ల ఎదుట కనిపించే దోపిడీ, పీడన, అన్యాయం, వివక్ష గాథలను కమిటీ నమోదు చేయగలుగుతుందని అనుకున్నారు. కాని ఆ కనీసమైన ఆశలను కూడ వమ్ము చేస్తూ శ్రీకృష్ణ కమిటీ నివేదిక తిమ్మిని బమ్మిని చేసి, మసిపూసి మారేడుకాయ చేసి తెలంగాణ ప్రజల మీద, ప్రజల సమస్యల మీద, తెలంగాణ ప్రజల ఆకాంక్షల మీద చాల అన్యాయంగా, దుర్మార్గంగా దాడి చేసింది. ఒక న్యాయమూర్తి అధ్యక్షుడుగా, ఒక ఆర్థికశాస్త్రవేత్త, ఒక సామాజికశాస్త్రవేత్త, ఒక న్యాయనిపుణుడు సభ్యులుగా ఉన్న ఈ కమిటీ ఆ నిపుణులకు తగిన మేధోస్థాయిలో నివేదిక రాయలేదు. కమిటీకి కార్యదర్శిగా పనిచేసిన మాజీ హోంశాఖ కార్యదర్శికి సహజమైన పోలీసు బుద్ధితో, ప్రతి ప్రజాసమస్యనూ శాంతిభద్రతల సమస్యగా చూసే వైఖరితో నివేదిక తయారయింది.   సమైక్యాంధ్రవాదులూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వమూ ఎంతో కాలంగా చెపుతూ వస్తున్న అబద్ధాలనే ఈ కమిటీ నివేదిక యథాతథంగా స్వీకరించింది, చిలకపలుకుల్లా వల్లించింది. తెలంగాణ ప్రజా ఆకాంక్షలను వ్యతిరేకించడానికి ప్రత్యర్థులకు మరొక ఆయుధంగా నిలిచింది.

నిజానికి ఒకరకంగా చూస్తే శ్రీకృష్ణ కమిటీకి సాధికారతా లేదు, ప్రాధాన్యతా లేదు. అది చట్టబద్ధంగా ఏర్పడిన న్యాయవిచారణ కమిషన్ కాదు. అది కేవలం నిజనిర్ధారణ చేసి కేంద్ర హోం మంత్రిత్వశాఖకు సలహా ఇవ్వడానికి ఏర్పడిన కమిటీ మాత్రమే. అంతేకాదు, తెలంగాణ విషయంలో 1954నుంచి ఇప్పటివరకు ఏర్పడిన పది కమిషన్లు, కమిటీలలో ఇది ఒకానొకటి మాత్రమే. ఆ పది: 1. రాష్ట్రాల పునర్విభజన కమిషన్ (జస్టిస్ ఫజల్ అలీ కమిషన్ – 1955). 2. కుమార్ లలిత్ కమిటీ (1969). 3. జస్టిస్ వశిష్ట భార్గవ కమిటీ (1969). 4. కె జైభారత్ రెడ్డి నాయకత్వాన ఏర్పడిన ముగ్గురు అధికారుల కమిటీ (1984). 5. సుందరేశన్ కమిటీ (1985). 6. రేవూరి ప్రకాశరెడ్డి నాయకత్వాన ఏర్పడిన శాసనసభా సంఘం (2001). 7. జె ఎం గిర్ గ్లాని ఏకసభ్య కమిషన్ (2001). 8. ప్రణబ్ ముఖర్జీ కమిటీ (2004). 8. ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వాన ఏర్పడిన శాసన సభా సంఘం (2006). 9. కె. రోశయ్య కమిటీ (2009). 10. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ (2010). వీటిలో ప్రణబ్ ముఖర్జీ కమిటీ, రెండవ శాసనసభా సంఘం, రోశయ్య కమిటీ మాత్రమే తమకు అప్పగించిన పని చేయలేదు, నివేదికలూ ఇవ్వలేదు. ఇక మిగిలిన ఏడింటిలో, ప్రస్తుత శ్రీకృష్ణ కమిటీ మినహాయిస్తే, మిగిలినవన్నీ కూడ తెలంగాణకు అన్యాయం జరిగిందని, తెలంగాణలో తగినంతగా, హామీ ఇచ్చినంతగా నిధులు ఖర్చుపెట్టలేదని, ఉద్యోగాలలో తెలంగాణకు రావలసిన న్యాయమైన వాటా రాలేదని, తెలంగాణ వాసులకు రావలసిన ఉద్యోగాలలో ఇతరుల నియామకం జరిగిందని స్పష్టంగా చెప్పాయి. ఆ అన్యాయాలను సరిదిద్దాలని ఏదో ఒక స్థాయిలో సూచనలు, సిఫారసులు చేశాయి.

ఆ నివేదికలను, వాటి సిఫారసులను అన్నిటినీ కూడ చెత్తబుట్టకు దాఖలు చేసిన రాష్ట్ర, కేంద్ర పాలకులు, ఒకవేళ ఇప్పుడు శ్రీకృష్ణ కమిటీ తెలంగాణకు అనుకూలమైన నివేదిక ఇచ్చినా దాన్ని అమలు చేస్తారనే హామీ ఏమీలేదు. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన చర్యలు చేపట్టడం అనేవి నిజానికి రాజకీయ నిర్ణయాలే గాని, ఏదో ఒక కమిటీ చెపితే జరిగేవీ కావు, చెప్పకపోతే ఆగిపోయేవీ కావు.

అయినా కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖ అధికారికంగా వేసిన ఈ కమిటీ నివేదిక, సిఫార్సులు,  స్వయంగా కేంద్ర హోం మంత్రి పి చిదంబరం 2009 డిసెంబర్ 9న ప్రకటించిన, ఆ మర్నాడు పార్లమెంటులో కూడ పునరుద్ఘాటించిన రాజకీయ నిర్ణయాన్ని అమలుచేయడానికి ఉపయోగపడవచ్చునని కొంత ఆశ ఉండింది. ఆ రాజకీయ నిర్ణయాన్ని త్వరితం చేయడానికి, అటువంటి నిర్ణయం తీసుకునేలా ఒత్తిడి చేయడానికి ఇటువంటి విజ్ఞుల కమిటీల అధ్యయనాలు, సిఫారసులు పనికి వస్తాయనే ఆశతోనే ఈ కమిటీ విచారణకు తెలంగాణ ప్రజలు సహకరించారు. కాని ఆ సహకారాన్ని గుర్తించారో లేదో, తమకు అందిన లక్షకు పైగా అభ్యర్థనలను చదివారో లేదో, పది జిల్లాలలో ప్రజలు వినిపించిన గోడును విన్నారో లేదో తెలియని అయోమయ స్థితిలో తప్పులతడకగా శ్రీకృష్ణ కమిటీ నివేదిక తయారయింది.

నివేదిక సమర్పించడానికి 2010 డిసెంబర్ 31 వరకు గడువు ఉండగా, ఒకరోజు ముందే డిసెంబర్ 30న కమిటీ హోంమంత్రికి నివేదిక ఇచ్చింది. హోంమంత్రిత్వశాఖ 2011 జనవరి 6న నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక మొదటి సంపుటం 461 పేజీల్లో, తొమ్మిది అధ్యాయాలలో (1. ఆంధ్రప్రదేశ్ పరిణామాలు – ఒక చారిత్రక నేపథ్యం. 2. ప్రాంతీయ ఆర్థిక, సమానత్వ విశ్లేషణ. 3. విద్యా, ఆరోగ్య రంగాలు. 4. నీటి వనరులు, నీటిపారుదల, విద్యుత్ రంగాల అభివృద్ధి. 5. ప్రభుత్వ ఉద్యోగాల సమస్యలు. 6. హైదరాబాద్ మహానగరానికి సంబంధించిన సమస్యలు. 7. సామాజిక, సాంస్కృతిక సమస్యలు. 8. శాంతి భద్రతలు, ఆంతరంగిక భద్రతా కోణాలు. 9. ముందడుగు) సమస్యలను చర్చించి, సూచనలు చేసింది. రెండవ సంపుటంలో 174 పేజీలలో ఆంధ్రప్రదేశ్ చరిత్రకు, తెలంగాణ సమస్యలకు సంబంధించిన కీలకపత్రాలలో కొన్నిటిని అనుబంధంగా చేర్చారు.

నివేదిక మొత్తంగానే అనేక అసత్యాలతో, అర్ధసత్యాలతో, వక్రీకరణలతో, తప్పుడు వాదనలతో నిండి ఉంది. వాస్తవాల గురించి కనీసమైన శ్రద్ధ కూడ లేకుండా, క్షమించరాని నిర్లక్ష్యంతో అనేక అబద్ధాలను చారిత్రక, గణాంక వాస్తవాలుగా రాశారు. నివేదికలోని తప్పుల గురించి, వక్రీకరణల గురించి, తెలంగాణ వ్యతిరేక వాదనల గురించి, నివేదిక రచనలో వ్యక్తమయిన ప్రజావ్యతిరేక దృక్పథం గురించి మరొక సందర్భంలో మాట్లాడుకోవచ్చుగాని, ప్రస్తుతానికి ఉద్యోగుల గురించిన అధ్యాయాన్ని మాత్రం ఇక్కడ పరిశీలిద్దాం.

నివేదిక మొదటి రెండు అధ్యాయాలలోనూ, చివరి అధ్యాయంలోనూ ప్రభుత్వోద్యోగాల గురించి స్థూలంగా చర్చించడంతో పాటు ఐదవ అధ్యాయంలో యాభై పేజీలలో ప్రత్యేకంగా ప్రభుత్వోద్యోగుల సమస్యలు చర్చించారు. ప్రభుత్వోద్యోగాలలో, విద్యావకాశాలలో రిజర్వేషన్ అనే భావన ఎలా తలెత్తిందో అర్థం చేసుకోవడానికి కమిటీ ప్రత్యేకంగా సీనియర్ రిటైర్డ్ ఐఎఎస్ అధికారి, ఢిల్లీలోని ఇన్ స్టిట్యూట్ ఫర్ రెగ్యులేషన్ & కాంపిటీషన్ డైరెక్టర్ జనరల్ ముఖేష్ కక్కడ్ తో సాంకేతిక అధ్యయనం కూడ చేయించామని రాసుకున్నారు. కమిటీలో ఉన్న ఐదుగురు నిపుణులు, బయటి నుంచి సహకరించిన మరొక నిపుణుడు కలిసి వండిన ఈ బ్రహ్మ పదార్థం ఎంత రుచీపచీలేని వంటకంగా, ఇంగిత జ్ఞానం ఉన్నవారు నోట పెట్టలేని వంటకంగా తయారయిందో మచ్చు రుచిచూద్దాం.

మొదటి అధ్యాయంలోని ఒక మెతుకు పట్టి చూస్తేనే ఈ వంట సంగతి తేలిపోతుంది. ‘ఆంధ్రప్రదేశ్ పరిణామాలు – ఒక చారిత్రక నేపథ్యం’ అనే ఈ అధ్యాయంలో పే. 30 లో “పబ్లిక్ ఎంప్లాయిమెంట్ (రిక్వైర్ మెంట్ యాజ్ టు రెసిడెన్స్) యాక్ట్ 1967 ప్రవేశపెట్టడంతో ముల్కీ నిబంధనలు రద్దయిపోయాయి” అని రాశారు. ఈ మాట అబద్ధం మాత్రమే కాదు, రాజ్యాంగ విరుద్ధం, సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం. అధికారికంగా చూస్తే 1975 రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడేదాకా ముల్కీ నిబంధనలు రద్దు కావడానికి అవకాశం లేదు, రద్దు కాలేదు. నివేదికలోనే అనేక చోట్ల ఈ ప్రస్తావన ఉంది. చారిత్రకాంశాలను ఇంత అపసవ్యంగా అర్థం చేసుకున్న నివేదిక, మొదటి అధ్యాయంలో ఇరవై పేజీలు ఉద్యోగుల విషయాలు రాసి, ఆ తర్వాత పే. 48లో “ఈ సమస్య ఇవాళ్టికి కూడ చాల వివాదాస్పదంగా ఉంది. అందువల్ల, ఈ వ్యవహారాన్ని సమగ్రమైన పద్ధతిలో పరిశీలించడానికి ఒక ప్రత్యేక అధ్యాయం కేటాయించాం” అని రాసింది. ఆ “సమగ్రమైన పద్ధతి” ఎంత సమగ్రంగా సాగిందో చూద్దాం.

ఐదో అధ్యాయంలో పే. 246 లో ముల్కీ నిబంధనలు 1919-1959 అని రాసిన పరిచయ వాక్యాలలోనే “ఉర్దూ భాషలో ‘ముల్క్’ అంటే జాతి (నేషన్), అక్కడ నివాసం ఉండేవారిని ‘ముల్కీలు’ అంటారు. ప్రభుత్వోద్యోగాలలో ‘నివాసుల’ ప్రయోజనాలు పరిరక్షించే విధానంగా ముల్కీ నిబంధనలు వచ్చాయి” అని అర్థం పర్థం లేని వాక్యం రాశారు. ముల్క్ అంటే జాతి కాదు, ఆ మాటకు అర్థం దేశం, రాజ్యం, ప్రాంతం. ముల్కీ అంటే దేశీయులు, ప్రాంతీయులు, స్థానికులు, భూమిపుత్రులు అవుతుంది గాని ‘నివాసులు’ కాదు, అక్కడ నివాసం ఉండేవాళ్లందరూ కాదు. ఇది కేవలం భాషా సమస్య కాదు, అసలు హైదరాబాద్ రాజ్యంలో ముల్కీ నిబంధనలు ఏ మౌలిక ప్రాతిపదిక మీద వచ్చాయో అర్థం చేసుకోవడానికి కమిటీ ప్రయత్నించలేదనడానికి ఇది రుజువు. హైదరాబాద్ రాజ్యంలో ప్రభుత్వోద్యోగాలలో అటు ఇరానియన్లు, ఇతర ప్రభువర్గాల బంధువులు, ఇటు ఉత్తరాది నుంచి వచ్చిన కాయస్ఠులు వగైరాలు నిండిపోతున్నప్పుడు ప్రభుత్వోద్యోగాలలో దేశీయులకు, స్థానికులకు, భూమిపుత్రులకు ప్రాధాన్యత ఉండాలనే ఆకాంక్ష ఫలితంగా ముల్కీ నిబంధనలు వచ్చాయి. “నివాసులు” అనే మాట ద్వారా చూస్తే ఆ ఆకాంక్ష బలం ఏమిటో అర్థం కాదు.

పే. 250లో “విశాలాంధ్ర ఏర్పడాలనే తపనలో, ఆంధ్ర నాయకులు తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణకు హామీలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు” అని నివేదిక రాసింది. ఈ వాక్యంలో ఆంధ్ర నాయకులు ఏదో హృదయవైశాల్యంతో ఆ హామీలు ఇచ్చారనే ధ్వని, విశాలాంధ్ర ఏర్పరచడం అనే లక్ష్యం కోసం త్యాగం చేశారనే ధ్వని వినిపిస్తోంది. కాని 1953-56 చరిత్ర చూస్తే, విశాలాంధ్ర భావనను తెలంగాణ ప్రజలు అనుమానంతో చూసినప్పుడు, బుజ్జగించి, హామీ ఇచ్చి, ప్రలోభపెట్టి అయినా సరే, విశాలాంధ్ర ఏర్పరచాలనే కుటిల ఎత్తుగడగానే ఆ వాగ్దానాలు వచ్చాయి. ఆ తర్వాత గడిచిన ఐదు దశాబ్దాల చరిత్ర అది కుటిల ఎత్తుగడ అనీ, చిత్తశుద్ధిలేని వాగ్దానాలనీ రుజువు చేసింది.

పే. 251లో 1956 పెద్దమనుషుల ఒప్పందం గురించి రాస్తూ, “కిందిస్థాయి ఉద్యోగాల నియామకాల విషయంలో ఐదు సంవత్సరాల వరకు తాత్కాలికంగా తెలంగాణ ప్రాంతాన్ని ఒక ప్రత్యేక ప్రాంతంగా గుర్తించాలనుకున్నారు” అని శ్రీకృష్ణ కమిటీ నివేదిక రాసింది. ఇది పచ్చి అబద్ధం. తప్పు. ఇక్కడ కమిటీ చేసిన తప్పు గురించి మాత్రమే కాదు, చరిత్రలో జరిగిన మోసం గురించి కూడ చెప్పవలసి ఉంది. కొత్త ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్ లో 1956 ఫిబ్రవరి 20న జరిగిన సమావేశంలో ఎనిమిది మంది ‘పెద్దమనుషుల ఒప్పందం’ కుదిరింది. ఆ ఒప్పందంలో ఏడో అంశం “ఒక రకమైన స్థానికతా సూత్రాన్ని, ఉదాహరణకు 12 సంవత్సరాల స్థానిక నివాసాన్ని, ప్రాతిపదికగా తీసుకుని తెలంగాణలో ఉద్యోగ నియామకాలలో నిర్ణీత నిష్పత్తి సాధించాలి” అని చెపుతుంది. నిజానికి అప్పటివరకూ కొనసాగుతున్న ముల్కీ నిబంధనలలో పుట్టుక, వారసత్వంతో పాటు 15 సంవత్సరాల నివాసం అనే ప్రాతిపదికలు ఉండేవి. ప్రధానంగా తమిళ, కోస్తాంధ్ర అధికారులతో కూడిన సైనిక ప్రభుత్వం 1950, 51లలో తెచ్చిన నిబంధనలలో పుట్టుక, వారసత్వం అనే ప్రాతిపదికలు ఎగరగొట్టారు. ఆ తర్వాత 1956లో ‘పెద్దమనుషుల ఒప్పందం’లో 15 సంవత్సరాల ప్రాతిపదికను 12 సంవత్సరాలకు కుదించారు. అక్కడితో ఆగలేదు. ఫిబ్రవరిలో కుదిరిన 14 అంశాల ఒప్పందం, ఆగస్ట్ 10న లోక సభలో ప్రవేశపెట్టే సమయానికి దానిలో చాల మార్పులు చేశారు. వాక్యాలకు వాక్యాలే మారిపోయాయి. ఆగస్ట్ నాటికి అది 10 అంశాల నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్ (రక్షణల పత్రం) గా మారిపోయింది. మొదటి ఆరు అంశాలకు ఎ అని, తర్వాత అంశాలకు బి, సి, డి, ఇ అని పేర్లు పెట్టారు. అందులో ‘బి. స్థానికత నిబంధనలు’ కింద ‘ఐదు సంవత్సరాల కొరకు తాత్కాలిక సౌకర్యం’గా దీన్ని చేర్చారు. ఈ ఐదు సంవత్సరాల తాత్కాలిక సౌకర్యం అన్నమాట పెద్దమనుషుల ఒప్పందం కాదు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఈ గందరగోళాన్ని, మార్పులను, వక్రీకరణలను ప్రస్తావించనైనా ప్రస్తావించకుండా, “ఐదు సంవత్సరాల వరకు తాత్కాలికంగా” అని మాత్రం రాసిందంటే దాని దురుద్దేశం అర్థమవుతుంది.

సమగ్రపద్ధతిలో పరిశీలించడానికి ప్రత్యేకంగా కేటాయించిన అధ్యాయంలో పే. 271 లో రాష్ట్రపతి ఉత్తర్వుల తర్వాత హఠాత్తుగా గిర్ గ్లాని కమిషన్ ప్రస్తావన వస్తుంది. ఈ మధ్యలో గడిచిన ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర అదృశ్యమై పోతుంది. పోనీ గిర్ గ్లాని కమిషన్ గురించి అయినా సమగ్రంగా రాశారా అంటే అదీ లేదు. గిర్ గ్లాని పరిశీలనలో ఎదుర్కొన్న ఇబ్బందులను, కోస్తా, రాయలసీమ అధికారులు ఆ కమిషన్ కు చేసిన సహాయ నిరాకరణను కమిటీ ప్రస్తావించనే లేదు. నిజానికి ప్రభుత్వం నియమించిన అధికారిక కమిషన్ అయినప్పటికీ, గిర్ గ్లాని కమిషన్ కోరిన సమాచారాన్ని అనేక ప్రభుత్వ శాఖలు ఇవ్వకపోవడంతో అ కమిషన్ పూర్తి నివేదిక రాయలేకపోయానని చెప్పుకున్నది. ఎన్నో పనికిమాలిన విషయాలను చాల వివరంగా తు.చ. తప్పకుండా రాసిన శ్రీకృష్ణ కమిటీ గిర్ గ్లాని నిర్ధారణలను మాత్రం పైపైన రాసి వదిలేసింది. ఆ నిర్ధారణలను రాయకుండానే గిర్ గ్లాని నివేదికను ఆమోదించడంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు అని మళ్లీ సాగదీసింది.

గిర్ గ్లాని నివేదిక సిఫారసులను అమలు చేయడంలో ప్రభుత్వం చేసిన పనులు అని పే. 278-280 లలో ఇరవై అంశాలు రాసింది. దానిలో శాఖాధిపతుల సంఖ్యను 51 నుంచి 102కు పెంచడం జరిగిందని, స్థానికేతరుల సంఖ్యను జిల్లా స్థాయిలో 15 శాతానికి, జోన్ స్థాయిలో 25 శాతానికి పరిమితం చేస్తూ రాష్టపతి ఉత్తర్వులను పాటించడం జరిగిందని రాశారు. శాఖాధిపతుల సంఖ్యను పెంచడం రాష్ట్రపతి ఉత్తర్వులకు తూట్లు పొడవడానికేనని, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం అమలు కావలసిన స్థానిక రిజర్వేషన్ నుంచి మినహాయించడానికేనని ఇంగిత జ్ఞానం ఉన్నవారెవరికయినా అర్థమవుతుంది. కాని శ్రీకృష్ణ కమిటీ మాత్రం అదీ తెలంగాణ అనుకూల చర్య అన్నట్టుగా రాసింది. అలాగే, రాష్ట్రపతి ఉత్తర్వులలో ఎక్కడా స్థానికేతరుల సంఖ్య మీద పరిమితి లేదు, స్థానికులకు తప్పనిసరిగా ఉండవలసిన వాటా ఉంది. దాని అర్థం మిగిలినదంతా ఇతరుల వాటా అని కాదు. అటువంటి వ్యాఖ్యానం సరైనది కాదు. గిర్ గ్లాని ఎత్తిచూపిన 18 వక్రీకరణలలో 16 వక్రీకరణలను సరిదిద్దడం జరిగిందనీ, మొత్తంగా అదనంగా ఉన్న 18,856 ఉద్యోగులలో 14,784 మందిని స్వస్థలాలకు పంపించడం జరిగిందనీ శ్రీకృష్ణ కమిటీ రాసింది. ఇది ఎంత అబద్ధమో ఉద్యోగులందరికీ తెలిసిన సంగతే.

రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయకుండా గడిచిన 26 సంవత్సరాలలో దాన్ని ఎవరూ న్యాయస్థానాలలో సవాలు చేయకపోవడం గుర్తించవలసిన విషయం (పే. 281) అని శ్రీకృష్ణ కమిటీ ప్రత్యేకంగా రాసింది. అన్యాయం చేసిన ప్రభుత్వాన్ని, దాన్ని సాగనిచ్చిన అధికారవర్గాలను ప్రశ్నించడం లేదు. దాన్ని ప్రజలు గాని, బాధితులు గాని న్యాయస్థానాలలో ప్రశ్నించలేదు గనుక వారి మీదనే తప్పు నెట్టడానికి కమిటీ ప్రయత్నించింది. అహా, ఏమి తర్కం!

హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదుల నియామకంలో జరిగిన అన్యాయాల గురించి ఇటీవల జరిగిన ఆందోళన గురించి అవసరమైనదానికన్న ఎక్కువ వివరంగా రాసి, ఆ సమస్యను మంత్రుల కమిటీ ఎంత అద్భుతంగా పరిష్కరించిందో కితాబునిచ్చింది. ఆ 69 ఉద్యోగాలలో మూడు ప్రాంతాల మధ్య, సామాజిక వర్గాల మధ్య పంపిణీ ఎంత బాగా జరిగిందో అవసరం లేకపోయినా వివరంగా చెప్పి మరీ ప్రశంసించింది. 69 ఉద్యోగాల విషయంలో ఇంత జాగ్రత్త చూపిన కమిటీకి రాష్ట్రంలోని పన్నెండు లక్షల ఉద్యోగాల గురించీ, తెలంగాణ బిడ్డలు కోల్పోయిన రెండున్నర లక్షల ఉద్యోగాల గురించీ మాట్లాడడానికి మాత్రం నోరు పెకలలేదు.

ఇంకా హాస్యాస్పదమైన సంగతి: న్యాయమూర్తుల నియామకాలలో జరిగిన అన్యాయాల గురించి తెలంగాణ వాదుల సందేహాల నిజానిజాలు తెలుసుకోవడానికి కమిటీ ఇద్దరు మాజీ ప్రధాన న్యాయమూర్తులతో “పిచ్చాపాటిగా” మాట్లాడిందట. వాళ్లు ఆ దురభిప్రాయానికి తావు లేదన్నారట! (పే. 288).

చిట్టచివరికి, ఇకముందు ఏమైనా సవరణ చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందా అనీ, ప్రభుత్వోద్యోగాలలో రిజర్వేషన్ అవసరమనే డిమాండ్ సమంజసమైనదేనా అనీ రెండు ముఖ్యమైన ప్రశ్నలను తానే వేసుకుని కమిటీ జవాబు చెప్పింది. గత నాలుగు సంవత్సరాలలో ప్రభుత్వం చాల సవరణ చర్యలు తీసుకున్నది గనుక ఇకముందు సవరణ చర్యల అవసరమేమీ లేదట. ఇక రెండో ప్రశ్నకు జవాబుగా ప్రభుత్వోద్యోగులు మొత్తం రాష్ట్ర జనాభాలో1.7 శాతం మాత్రమేననీ, పనిచేసేవారి జనాభాలో 3.6 శాతం మాత్రమేననీ కనుక అది అంత పెద్ద సమస్య కాదనీ (పే. 291) కమిటీ తేల్చి చెప్పింది.

ప్రభుత్వోద్యోగాలలో స్థానికులకు రిజర్వేషన్ అవసరమా లేదా అనే చర్చను కూడ శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రారంభించింది. కనీస ప్రజాస్వామిక సూత్రాలకు, రక్షణ కోసం విచక్షణ (ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్) అనే రాజ్యాంగ ఆదర్శానికి తూట్లు పొడిచే ఈ చర్చను సాగించడానికి రాజ్యాంగంలోని రెండు అధికరణాల మధ్య పోటీ పెట్టి వాదించే కుటిలత్వానికి కూడ కమిటీ పాల్పడింది. అంతేకాదు, రాజ్యాంగ అధికరణం 16లో చెప్పిన ఉద్యోగావకాశాల సమానత్వం గురించి తన వాదనను బలపరచుకోవడానికి అసందర్భంగా కేంద్రప్రభుత్వ ఉద్యోగ, శిక్షణా శాఖకు ఒక ఉత్తరం రాసి, వారి జవాబును నివేదికలో భాగం చేసింది. (పే. 255-256)

దేశపౌరులు ఎక్కడికైనా వెళ్లి ఉద్యోగం చేసుకోవచ్చునని రాజ్యాంగంలోని అధికరణం 16 చెపుతుండగా, తెలంగాణలో ఉద్యోగాలు తెలంగాణ స్థానికులకే కేటాయించడం కష్టం కావచ్చుననే ఉద్దేశంతోనే ఏడవ రాజ్యాంగ సవరణ జరిగింది. కేంద్ర ప్రభుత్వమే 1957లో ప్రభుత్వోద్యోగాల (స్థానికతా అర్హతల) చట్టం తీసుకు వచ్చింది. ఈ చరిత్రను, తెలంగాణ ప్రత్యేకతను ప్రస్తావిస్తూ కూడ, ఆ ప్రత్యేకత ఆ తర్వాత ఎందుకు కొనసాగలేదనే ప్రశ్నను మాత్రం కమిటీ పక్కనపెట్టింది. ఆ ప్రత్యేక నిబంధనలను ఎప్పటికప్పుడు తొక్కి పడుతూ, ఉల్లంఘిస్తూ, వక్రీకరించి అమలుచేస్తూ వచ్చినందువల్ల, ఆ అన్యాయాలను ఎత్తిచూపుతూ ప్రాంతీయమండలి లేవనెత్తిన అభ్యంతరాలను కూడ తోసివేయడం వల్ల చివరికి 1969లో తెలంగాణ రక్షణల అమలు కోసం తెలంగాణ ఎన్ జీ వో లు ఉద్యమించవలసి వచ్చింది. ఆ ఉద్యమం వల్లనే వచ్చిన జీ ఓ నం 36 కూడ అమలుకు నోచుకోలేదు. ముల్కీ నిబంధనల ఉల్లంఘన ఎడాపెడా కొనసాగుతూనే వచ్చింది. చివరికి 1972 అక్టోబర్ 3న ముల్కీ నిబంధనలుచెల్లుతాయని, వాటిని అమలు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు వచ్చిన తర్వాత, దాన్ని పక్కదారి పట్టించడానికి ఆరు సూత్రాల పథకం తయారుచేశారు. దానిలో ఆరవ సూత్రంగా “పై ఐదు అమలయితే ముల్కీ నిబంధనలు అనవసరమవుతాయి” అని చేర్చి, అందువల్ల ముల్కీ నిబంధనల రద్దు చట్టం తెచ్చారు. ఆరు సూత్రాల పథకం కొనసాగింపుగా రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చారు. ఆ రాష్ట్రపతి ఉత్తర్వులలో రాష్ట్రాన్ని ఆరు జోన్లుగా విభజించి, అడగకుండానే తెలంగాణను రెండు జోన్లుగా విడగొట్టి, మిగిలిన రక్షణలనూ, రిజర్వేషన్లనూ వక్రీకరించి, తెలంగాణ బిడ్డలకు న్యాయంగా రావలసిన వాటాను దొంగిలించారు. ఆ దొంగతనాన్ని పది సంవత్సరాల పాటు సహించి, భరించి, చివరికి 1984లో టి ఎన్ జీ వో లు నిలదీస్తే జైభారత్ రెడ్డి కమిటీ వచ్చింది. సుందరేశన్ కమిటీ వచ్చింది. జీవో 610 వచ్చింది. మూడు నెలలలోగా అమలు కావలసిన ఆ జీవో పదిహేను సంవత్సరాలకు కూడ అమలు కాకపోతే మళ్లీ మొదలయిన ఆందోళనలతో శాసనసభా సంఘం, జె ఎం గిర్ గ్లాని కమిషన్ వచ్చాయి. ఆ నివేదికలకు కూడ అతీగతీ లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడానికి ఒక షరతుగా ఉన్న స్థానికులకు ఉద్యోగ రక్షణ అనే నిబంధన 1956లో మొదటిసారి కాగితం మీదికి ఎక్కి, ఆ తర్వాత కనీసం డజను సార్లు పునరుద్ఘాటన జరిగినా అమలుకు మాత్రం నోచుకోలేదు.

ఈ సుదీర్ఘ, విషాద చరిత్రంతా శ్రీకృష్ణ కమిటీకి పట్టనే లేదు. ఈ చరిత్రలో నుంచి తనకు అవసరమైన మేరకు తీసుకుంటూ, తెలంగాణ స్థానికుల ఆకాంక్షల గుర్తింపును నిరాకరిస్తూ నివేదిక రచన సాగింది. మొదటి అధ్యాయంలో రాసిన చరిత్ర లోనూ, ఐదవ అధ్యాయంలోనూ కూడ ఈ ధోరణే సాగింది. కమిటీ నివేదిక పరిష్కారాల విషయంలోనో, ఇతర విశ్లేషణల విషయంలోనో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఉండడం ఒక ఎత్తయితే, అసలు ఉద్యమానికి పునాదిగా ఉన్న నియామకాల విషయంలో అన్యాయాలను వాస్తవికంగా గుర్తించకపోవడం, న్యాయబద్ధమైన పరిష్కారాలు సూచించకపోవడం మరొక ఎత్తు. మొత్తానికి తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీయడంలో పాలకవర్గాలు గత ఆరు దశాబ్దాలుగా అనుసరిస్తున్న వైఖరికి మరొక నిదర్శనంగా నిలుస్తుంది జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక.

 

 

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Telangana. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s