అరబ్ ప్రజల కదలిక నేర్పుతున్నదేమిటి?

వీక్షణం మార్చి 2011 సంచిక కోసం

ఉత్తర ఆఫ్రికాలోని చిన్న దేశం టునీషియాలో డిసెంబర్ 18న మొదలై, జనవరి 14న అక్కడి ప్రభుత్వాన్ని కూల్చివేసిన ప్రజాగ్రహపు నిప్పురవ్వ నిజంగా దావానలంగా మారింది. టునీషియాను ఇరవై మూడు సంవత్సరాలు నిరంకుశంగా పాలించిన ఏలిక పారిపోక తప్పలేదు. టునీషియా జాతీయ పుష్పం పేరు మీద “మల్లెల విప్లవం” గా ప్రఖ్యాతమైన ఈ ప్రజాసంచలనపు మల్లెల పరిమళం ఇప్పటికి కనీసం పది దేశాలలో వీస్తున్నది. ఆ ప్రభావంతోనే ఈజిప్ట్ లో జనవరి 25న మొదలైన ప్రజా అసంతృప్తి ప్రదర్శనలు ఫిబ్రవరి 11న అధ్యక్షుడి పతనానికి దారితీశాయి. అమెరికా అండతో ముప్పై సంవత్సరాలుగా తిరుగులేని అధికారాన్ని చలాయిస్తుండిన ఆ అధ్యక్షుడు ఇవాళ తలదాచుకోవలసిన స్థితిలో ఉన్నాడు. ఇది రాస్తున్న సమయానికి యెమెన్ లో, బహ్రెయిన్ లో, లిబియాలో పెద్ద ఎత్తున ప్రజాప్రదర్శనలు జరుగుతున్నాయి. ప్రతిచోటా పాలకులు దిగిపోవాలనే నినాదాలు మార్మోగుతున్నాయి. తమ దౌర్జన్య పాలనకు అడ్డులేదని నిన్నటిదాకా విర్రవీగిన నరహంతక ధరాధిపతులందరూ పేకమేడల్లా కూలిపోతున్నారు. వెయ్యి గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు సఫా అన్నట్టు ప్రజాశక్తి ముందు రాబందులు రాలిపోతున్నాయి.

ఒక కోటి జనాభా గల టునీషియాలో, ఎనిమిది కోట్ల జనాభా గల ఈజిప్ట్ లో జరిగిన పరిణామాలను చూసి, ప్రస్తుతం లిబియాలో జరుగుతున్న ఆందోళనలను చూసి ఆయా దేశాలలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగానే పాలకవర్గాలు, నిరంకుశ, ఆధిపత్యశక్తులు వణికిపోతున్నాయి. ఈ కార్చిచ్చు తమ దేశానికి అంటుకుంటుందేమోనని భయపడుతున్నాయి. ఈ పాలకుల భయాలను ప్రతిబింబిస్తూ సామ్రాజ్యవాద ప్రచార సాధనాలు గగ్గోలు పెడుతున్నాయి. అరాచకం ప్రబలుతున్నదని అంటున్నాయి. తమ ప్రయోజనాలను కొనసాగించగల ప్రత్యామ్నాయ పాలకుల కోసం అన్వేషిస్తున్నాయి. ఈ ప్రజా ఆగ్రహాన్ని ముందుగా పసిగట్టలేకపోయిన తమ గూఢచార సంస్థల మీద విరుచుకు పడుతున్నాయి.  “ఆర్తనాదములు శ్రవణానందకరముగనున్నవి” అనే ఎస్ వి రంగారావు సినిమా వ్యాఖ్యలాగ, నియంతల, వారి ప్రచారసాధనాల ఆర్తనాదాలు ప్రజరాశులకు ఆసక్తికరంగా, వీనులవిందుగా ఉన్నాయి. ఆ గగ్గోలును బట్టే ఆ పరిణామాల తీవ్రతను, ప్రభావాన్ని, ఇతర దేశాలకు వ్యాపించే స్వభావాన్ని అర్థం చేసుకోవచ్చు.

ఈ జనాగ్రహ సంచలనాలను పాలకవర్గాలు ఎంత తీవ్రంగా పట్టించుకుంటున్నాయో, ప్రజలు, ప్రగతిశీల శక్తులు, ప్రజాప్రయోజనాల కోసం పనిచేస్తున్న శక్తులు అంతకన్న ఎక్కువగా పట్టించుకోవలసి ఉంది. ప్రజాశక్తులు ఈ సంచలనాలను చాల లోతుగా అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. అక్కడ ఏం జరుగుతున్నదో, ఆ పరిణామాలు ఎటు దారితీయనున్నాయో, ఆ పరిణామాలు ఇతర దేశాల ప్రజలకు ఎటువంటి పాఠాలు అందిస్తాయో జాగ్రత్తగా గమనించవలసి ఉంది. నాలుగైదు దశాబ్దాలుగా ప్రజలలో పెరుగుతూ వస్తున్న అసంతృప్తి, పాలక విధానాల పట్ల వ్యతిరేకత ఒక్కుమ్మడిగా ఎట్లా వీథి పోరాటాలకు దారితీశాయో, అందుకు నాయకత్వం వహించిన శక్తులు ఎటువంటి సన్నాహాలు చేశాయో, ఆ పోరాటాల విస్తృతి అంతిమంగా పాలకులను ఎలా కూల్చివేయగలిగిందో, ఇంకా అధికారపీఠాలను అంటిపెట్టుకుని ఉన్న పాలకులకు ఎలా గంగవెర్రులెత్తిస్తున్నదో నిశితంగా అర్థం చేసుకోవలసి ఉంది.

ఈ పరిణామాలు అరబ్ ప్రపంచానికి మాత్రమే కాదు, మొత్తం ప్రపంచానికే 1960ల తర్వాత అంతకంటే తీవ్రమైన ప్రజా సంచలనాల దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నాయని వ్యాఖ్యాతలు అంటున్నారు. 1968 విద్యార్థుల తిరుగుబాటు నాయకుడు, న్యూలెఫ్ట్ రివ్యూ సంపాదకుడు తారిఖ్ అలీ ఈ అరబ్ సంచలనాలను 1848 యూరప్ విప్లవాల వెల్లువతో పోలుస్తున్నారు. ఈ మహా ప్రజా వెల్లువలన్నీ ప్రపంచీకరణకు వ్యతిరేకమైనవేనని, ఆ విధానాలను అమలు చేస్తున్న పాలకులను కూలదోయడానికేనని అంటున్నారు ఈజిప్ట్ కే చెందిన ప్రపంచ ప్రఖ్యాత మార్క్సిస్టు అర్థశాస్త్రవేత్త సమీర్ అమీన్. “విప్లవం పురోగమించినకొద్దీ అనివార్యమైన వర్గవిభజన జరుగుతుంది. అందుకోసం మనం జాగరూకతతో ఉండాలి. ఇక్కడే ఆగిపోగూడదు. ఒక్క ఈజిప్ట్ కే కాదు, మొత్తం అరబ్ ప్రాంతపు విముక్తికే తాళపుచేతులు మనదగ్గర ఉన్నాయి…” అంటున్నారు ఈజిప్షియన్ సోషలిస్టు, జర్నలిస్టు హొసామ్ ఎల్ హమలవి.

“టునీషియా తర్వాత ఈజిప్ట్ ప్రజా విజయం అరబ్, ముస్లిం దేశాలలో నూతన ప్రజాస్వామిక, భూస్వామ్య వ్యతిరేక, సామ్రాజ్యవాద వ్యతిరేక విప్లవానికి మరొక ముందడుగు. సామ్రాజ్యవాదానికీ, జియోనిజానికీ వ్యతిరేక పోరాటం టునీషియా నుంచి ఈజిప్ట్ కు, ఇరాక్ కు, అఫ్ఘనిస్తాన్ కు, పాలస్తీనాకు, లెబనాన్ కు వ్యాపించింది. ఇక ఇతర దేశాలు కూడ అంటుకుంటాయి. మనం గెలవగలం. మనం గెలవాలి. గెలుపు మనమీదే ఆధారపడి ఉంది” అంటున్నది నవ ఇటాలియన్ కమ్యూనిస్టు పార్టీ.  “ఈ అరబ్ ప్రజల తిరుగుబాటు నూతన ప్రపంచ వేకువకు మేల్కొలుపు గీతం పాడాలి” అంటోంది ఇటలీ, బ్రిటన్ లకు చెందిన ఏడు మావోయిస్టు సంస్థల సంయుక్త ప్రకటన. “ఈ ప్రజాప్రజ్వలనాల ద్వారా ప్రజలు తమ సర్వ సత్తాక అధికారాన్ని ప్రకటించుకుంటున్నారు, అమలు చేస్తున్నారు. జాతీయ విముక్తి, ప్రజాస్వామ్యం, అభివృద్ధి, సామాజిక న్యాయం లక్ష్యాలుగా సాగే పోరాటం మరింత పురోగతి సాధించేందుకు, మరిన్ని అవకాశాలు సాధించేందుకు వాళ్లు మార్గాలు తెరుస్తున్నారు. ఈ ప్రజ్వలనాల వల్ల విప్లవశక్తులు తమ బలాన్ని విస్తరించుకోవడానికి, సంఘటితం చేసుకోవడానికి అవకాశం వస్తుంది” అంటున్నారు ప్రజా పోరాటాల అంతర్జాతీయ వేదిక (ఇంటర్నేషనల్ లీగ్ ఫర్ పీపుల్స్ స్ట్రగుల్స్) అధ్యక్షుడు జోస్ మారియా సిజాన్.

అరబ్ దేశాల పరిణామాలు ఇంత ఆశావహమైనవే, ప్రపంచవ్యాప్తంగా పీడిత ప్రజారాశులకు భవిష్యత్తుపట్ల ఆశను కలిగించగలిగినవే. నిజంగానే ఈ పరిణామాలు కేవలం ఆ ప్రాంతంలోని కొన్ని దేశాలకు మాత్రమే పరిమితమైనవి కావు. కావడానికి అవి చిన్న దేశాలే కావచ్చుగాని, అక్కడ జరిగిన పరిణామాలలో ప్రజాశక్తి రుజువు అవుతున్నది. పాలకులు ఎంత బలవంతులుగా కనబడినప్పటికీ, ఎంత దమననీతిని అమలుచేసి ఎంతకాలం గద్దె మీద కూచున్నప్పటికీ ప్రజలు తలచుకుంటే కూలిపోక, రాలిపోక తప్పదని ఆ దేశాల ప్రజలు రుజువు చేస్తున్నారు. ఆ దేశాల పాలకులకు అమెరికా అండ ఉన్నప్పటికీ పతనం తప్పదని ప్రజలు రుజువు చేస్తున్నారు. ఆ దేశాలన్నిటిలోనూ ప్రపంచీకరణ విధానాలు, దేశ వనరులను బహుళజాతిసంస్థలకు దోచిపెట్టే విధానాలు, ప్రజలమీద దారుణమైన అణచివేత సాగుతున్నప్పటికీ సమయం ఆసన్నమైనప్పుడు ప్రజలు లేచినిలిచారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ దేశాలలో జరిగిన పరిణామాలకు ప్రపంచవ్యాప్త ప్రాధాన్యత ఉంది. గత రెండు దశాబ్దాలుగా ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ అమలవుతున్న పాలక రాజకీయార్థిక విధానాలే ఆ దేశాలలో కూడ అమలవుతున్నాయి. కనుక ఆ దేశాలు ప్రపంచంలోని అన్ని దేశాల భవిష్యత్ చిత్రపటాన్ని చూపుతున్నాయి.

మరీ ముఖ్యంగా ఆ దేశాల ప్రజల స్థితి, పాలనా విధానాలు భారతదేశంలో లాగానే ఉన్నాయి. టునీషియాలోనూ, ఈజిప్ట్ లోనూ, ఇతరదేశాలలోనూ ఉన్న ప్రజాజీవన దుస్ఠితికీ, భారతదేశంలోని దుస్థితికీ పెద్ద తేడాలేదు. పేదరికం, ఉపాధి అవకాశాల కొరత, నిరుద్యోగం, అవిద్య, అనారోగ్యం, సామాజిక అసమానతలు, ప్రజలమీద మతం ప్రభావం ఒకవైపు, దేశంలోని అపార సంపదలన్నీ పిడికెడు మంది హక్కు భుక్తమైపోవడం, సామ్రాజ్యవాదుల దళారీలూ, స్థానిక పాలకులూ, వ్యాపారులూ తోడుదొంగలుగా దేశాన్ని దోచుకోవడం, వారి అవినీతి కుంభకోణాలు, విదేశీఖాతాలు, దేశ వనరుల దుర్వినియోగం, వనరులనూ మార్కెట్లనూ బహుళజాతి సంస్థలకు దోచిపెట్టడం ఆ దేశాలలోనూ, భారతదేశంలోనూ ఒక్కలాగే ఉన్నాయి. టునీషియా, ఈజిప్ట్ ల గురించి ఇటీవల వెలువడుతున్న ఏ వార్తనూ, వ్యాసాన్నీ చూసినా, అక్కడ ప్రస్తావించిన అరబ్ పేర్లు తీసి, భారత పేర్లు పెడితే ఏమాత్రం తేడాలేని స్థితి ఉంది. మరి అటువంటి పరిస్థితులే ఉన్నప్పుడు, భారతదేశంలో అటువంటి ప్రజా సంచలనాలే ఎందుకు జరగడం లేదు అనే ప్రశ్న ప్రజల అభ్యున్నతి పట్ల ఆసక్తి ఉన్న ఎవరైనా వేసుకోవలసిన ప్రశ్న.

ప్రజా సంచలనాల గురించి, ఉద్యమాల గురించి మార్క్సిస్టు విశ్లేషణలో భౌతిక పరిస్థితులు, స్వీయ మానసిక శక్తులు అనే రెండు కీలకమైన మాటలు ఉన్నాయి. భౌతిక పరిస్థితులు అంటే స్థూలంగా సామాజిక, రాజకీయార్థిక పరిస్థితులు, పాలనా పద్ధతి, కొనసాగుతున్న వ్యవస్థ అనుకోవచ్చు. స్వీయ మానసిక శక్తులంటే ఈ యథాస్థితిని మార్చాలనే ఆలోచనను ఆచరణగా రూపుదిద్ది, నిర్వహించే శక్తులు,  అందుకు అవసరమైన సన్నాహాలు చేసే శక్తులు, అవసరమైన వనరులను సమీకరించి ఉపయోగించే శక్తులు. మార్పు సాధ్యమేనని నమ్మి, మార్పు తేవడానికి అవసరమైన వ్యూహాన్ని, ఎత్తుగడలను రచించి, నిర్వహించే సంఘటిత శక్తులనే స్వీయమానసిక శక్తులు అనే పారిభాషిక పదంతో గుర్తిస్తున్నారు. మొదట ఇది ఒక అగ్రగామి సంఘం, పార్టీ, నిర్మాణం కావచ్చు.

భౌతిక పరిస్థితులు మార్పుకు అనుకూలంగా ఉన్నప్పుడు, ఆ మార్పుకు నాయకత్వం వహించి, ఆ మార్పు దిశను నిర్దేశించగల స్వీయ మానసిక శక్తులు కూడ ఉంటేనే, ఈ భౌతిక పరిస్థితుల, స్వీయ మానసిన శక్తుల సమన్వయం కుదిరితేనే అర్థవంతమైన మార్పు సాధ్యమవుతుందని మార్క్సిస్టు విశ్లేషణ చెపుతుంది. వర్గ వ్యవస్థ సాగినంత కాలం దోపిడీ పీడనలు ఉంటాయి గనుక, మనుషులు తాము అనుభవిస్తున్న దోపిడీ పీడనలు రద్దు కావాలని కోరుకుంటారు గనుక, ఎప్పుడైనా భౌతిక పరిస్థితులు ఏదో ఒక స్థాయిలో అనుకూలంగానే ఉంటాయి. పాలనావిధానాల వల్ల ఒక్కోసారి ఆ భౌతిక పరిస్థితి పరిపక్వమవుతూ ఉంటుంది. అప్పుడు ప్రజలు తమమీద అమలయ్యే దోపిడీ పీడనలు రద్దు కావాలని మరింత ఎక్కువగా కోరుకుంటారు. స్వీయ మానసిక శక్తుల పని ఆ దోపిడీ పీడనలు రద్దయ్యే మార్గం చూపడం. నిజానికి ఇది నాయకత్వం పని మాత్రమే కాదు. స్వీయ మానసిక శక్తులు అన్నప్పుడు అందులో ఆ దోపిడీ పీడనలను అనుభవిస్తున్న మనుషులందరూ కూడ భాగమే. కాని ఆ మనుషులందరికీ తాము ఉన్న భౌతిక పరిస్థితులను కూలదోయడం, మార్చడం సాధ్యమేనని తెలియకపోవచ్చు. తెలిసినా విశ్వాసం కుదరకపోవచ్చు. అటువంటి పని మొదలయితే తాము దానికి నాయకత్వం వహించగలమనే ఆత్మవిశ్వాసం రాకపోవచ్చు. కాని పరిస్థితుల ఒత్తిడి వల్ల యథాస్థితి దుర్భరమని మాత్రం తెలుస్తుంది. అప్పుడే స్వీయ మానసిక శక్తులు తమ అగ్రగామి చైతన్యంతో, అవగాహనలతో, నిర్మాణాలతో ప్రజారాశులకు మార్గదర్శకత్వం వహించవలసి ఉంటుంది. నాయకత్వం అందించవలసి ఉంటుంది. క్రమక్రమంగా ఆ చైతన్యం, నిర్మాణం విస్తరిస్తూ అశేష ప్రజాసామాన్యం స్వీయ మానసిక శక్తులుగా మారుతారు. అనుకూలంగా ఉన్న భౌతిక పరిస్థితులను తమ చేతులలోకి తీసుకుని మారుస్తారు.

సాధారణంగా ప్రజా విప్లవానికి వర్తించే ఈ సూత్రీకరణను అరబ్ ప్రజా సంచలనాలకు అన్వయించేటప్పుడు ఒకటి రెండు పరిమితులు కూడ గుర్తుంచుకోవాలి. ఈ అరబ్ ప్రజా సంచలనాలు పూర్తి అర్థంలో శ్రామికవర్గ విప్లవాలు కావు. పూర్తిగా శ్రామికవర్గ నాయకత్వంలో జరిగినవి కావు. వీటి ధ్యేయం తక్షణమే సమసమాజాన్ని స్థాపించడం కాదు. కాని ఆయా దేశాలలో కొనసాగుతున్న ఆధిపత్య, నిరంకుశ, సామ్రాజ్యవాద దళారీ పాలనల నేపథ్యంలో, అరబ్ సమాజాల మత ఛాందసత్వం గురించి ఉన్న అభిప్రాయాల, అపోహల నేపథ్యంలో చూసినప్పుడు ఈ సంచలనాల నుంచి గ్రహించవలసినదీ, మార్క్సిస్టు విశ్లేషణ సాగించవలసిందీ ఎంతో ఉంది.

అక్కడి భౌతిక పరిస్థితులు భారత సమాజంలోని భౌతిక పరిస్థితులకన్న భిన్నమైనవి కావు. అక్కడ రాచరికాల పేరుతో, సైనిక నియంతృత్వాల పేరుతో, ప్రజాస్వామిక ప్రభుత్వాల పేరుతో ఉన్న పాలనలన్నీ కూడ మన పాలనలాగనే ఉన్నాయి. పార్లమెంటరీ ఎన్నికల ప్రజాస్వామ్యం ఉన్న చోట మనలాగనే ఎన్నికల అక్రమాలు, దొంగ వోట్లు, డబ్బు సంచులను బట్టే ప్రజాప్రతినిధులు గెలవడం, ఆశ్రిత పక్షపాతం, పాలక కుటుంబాల అక్రమ ఆస్తులు వంటి లక్షణాలన్నీ ఉన్నాయి. టునీషియాలోనూ, ఈజిప్ట్ లోనూ జరిగిన ఎన్నికలలో అక్కడి పాలక పార్టీలకు అత్యధిక శాతం ప్రజలు వోట్లు వేసినట్టు, అంటే ప్రజలే వారికి పాలనాధికారం ఇచ్చినట్టు నిన్నటివరకూ చెప్పుకున్నారు. ఆ ప్రజాప్రాతినిధ్యం ఎంత అబద్ధమైనదో టునిస్ నగరవీథుల్లో జనవరి 5 నుంచి 14 వరకూ, కైరో నగరవీథుల్లో జనవరి 25 నుంచి ఫిబ్రవరి 11 వరకూ బయటపడింది.

కాబట్టి ఎన్నికలే ప్రజాస్వామ్యం కాదు. క్రమబద్ధంగా ఎన్నికలు జరగడం, ఎన్నికైన ప్రభుత్వాలు ప్రజాస్వామ్యానికి తామే గుత్తేదారులమని, తామే ప్రజాప్రతినిధులమని చెప్పుకోవడం నిజంగా ప్రజలు లేచి నిలిచే వరకు మాత్రమే చెల్లుతుంది. ఒక్కసారి ప్రజలు లేచి నిలిచి, భయం వదిలి, తమ శక్తి మీద తాము విశ్వాసం తెచ్చుకుంటే, మార్పు సాధ్యమేననీ, సాధించగమనీ అనుకుంటే వారిని ఆపగల శక్తి ఏదీ ఈ ప్రపంచంలో ఇంతవరకూ పుట్టలేదు. బానిస యజమానుల దౌష్ట్యాన్ని ధ్వంసించిన స్పార్టకస్ తిరుగుబాటు నాటి నుంచి ఇవాళో రేపో కర్నల్ గడ్డాఫీని మట్టి కరిపించనున్న లిబియన్ ప్రజల దాకా ఈ చారిత్రక సత్యం అనేక సార్లు రుజువైంది.

ఐతే ఇది ఎంత చారిత్రక సత్యమైనా, చారిత్రక అనివార్యత ఐనా, అది దానంతట అదే జరిగిపోయేది కాదు. ముఖ్యంగా అధికారంలో ఉన్న శక్తులు తమ అధికారాన్ని కాపాడుకోవడానికి సకల ప్రయత్నాలూ చేస్తాయి. ప్రజలను చీలుస్తాయి, అబద్ధాలు ప్రచారం చేస్తాయి, ప్రజలకు తప్పుడు చైతన్యపు, మాదకద్రవ్యాల మత్తెక్కిస్తాయి. సైనికదళాలను ఉసిగొల్పి, ప్రజల తిరుగుబాటు మీద భయంకరమైన నిర్బంధాన్ని ప్రయోగించి, తిరుగుబాటు చేయడానికి భయపడే పరిస్థితి కల్పిస్తాయి. అంటే ప్రజలు ఏకం కాకుండా, తమ శక్తిని గుర్తించకుండా అనేక అవరోధాలను కల్పిస్తాయి. ఆ అవరోధాలను అధిగమించడంలోనే, ప్రజల చేత అధిగమింపజేయడంలోనే స్వీయ మానసిక శక్తుల పాత్ర ఉంటుంది. రకరకాల కారణాల వల్ల చీలిపోయి ఉన్న ప్రజల మధ్య ఐక్యత సాధించాలి. నిరంతర అధ్యయనం, పరిశీలన, బోధన, శిక్షణల ద్వారా ప్రజల మనసులలోంచి అబద్ధాలనూ మత్తునూ తప్పుడు భావజాలాన్నీ తొలగించాలి. ప్రజల శక్తి మీద ప్రజలకు విశ్వాసం కలిగించాలి. ఆ కృషిలో అవి తమను తాము నిరంతరం పదును పెట్టుకోవలసి ఉంటుంది. తమ అవగాహనలను, చైతన్యాన్ని, పరికరాలను, ఆచరణను నిరంతరం అభివృద్ధి చేసుకోవలసి ఉంటుంది. తమ పాత్ర ఉన్నా లేకపోయినా, ఏదో ఒక కారణం మీద ప్రజలు కదిలినప్పుడు ఆ ప్రజాందోళనలలో చేరి, వాటికి దిశానిర్దేశనం చేయవలసి ఉంటుంది. అటువంటి ప్రజావెల్లువ ఎప్పుడు వస్తుందో తెలియదు గనుక ఆ అవకాశం అందుకోవడానికి స్వీయమానసిక శక్తులు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి.

నిజానికి అరబ్ సంచలనాలలో ప్రధానమైన అంశాలలో ఒకటి స్వీయ మానసిక శక్తులు తమ స్థాయిని, నైపుణ్యాన్ని, సమయోచిత భాగస్వామ్యాన్ని పెంచుకున్న తీరు. ఈజిప్ట్ లో జనవరి 25న జరిగిన మహాప్రదర్శనకు ప్రజలను సమీకరించేందుకు వివిధ బృందాలు సాంకేతిక నైపుణ్యాన్ని ఎలా ఉపయోగించుకున్నాయో ఇప్పటికే ఎంతో మంది రాశారు. అతి భయంకరమైన దమననీతి అమలవుతున్న చోట ప్రదర్శనకారులకు సలహాలిస్తూ ‘హౌ టు ప్రొటెస్ట్ ఇంటిలిజెంట్లీ’ అని నాయకులు తయారుచేసిన 26 పేజీల కరపత్రం చూస్తే వారి నైపుణ్యం అర్థమవుతుంది.

నిజానికి ఈ పనులు ఏ ఒక్కరో, ఏ ఒక్క సంస్థో చేయగలిగినవీ, చేసినవీ కావు. అశేష ప్రజారాశులలో ఈ పనులు సాగించాలంటే అనేక రకాల, అనేక స్థాయిల, అనేక రంగాల కృషి అవసరమవుతుంది. ఆ అన్ని రంగాల కృషిని సమన్వయం చేయగలిగినప్పుడే స్వీయ మానసిక శక్తులు విజయం సాధించగలుగుతాయి. ఇవాళ అరబ్ సంచలనాలలో ప్రధానమైనది ఈ సమన్వయమే. అక్కడ ప్రజా సంచలనాలలో పాల్గొన్న శక్తులను చూస్తే ఎప్పటికైనా వీళ్ల మధ్య ఐక్యత సాధ్యమా అని ఆశ్చర్యం కలుగుతుంది. ప్రధానంగా నిరుద్యోగ యువతరం పాల్గొన్న ఈ తిరుగుబాట్లకు కార్మికవర్గం పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చింది. ముస్లిం బ్రదర్ హుడ్ వంటి అనేక లౌకికమైన, మతపరమైన ఇస్లామిక్ భావజాల సంస్థలు, ఉదార ప్రజాస్వామ్య సంస్థలు, ట్రాట్స్కీ వాదుల నుంచి మావోయిస్టుల వరకు అన్నిరకాల మార్క్సిస్టులు, మొత్తంగా సామ్రాజ్యవాద వ్యతిరేకులు ఈ తిరుగుబాట్లలో పాల్గొన్నారు. నావల్ ఎల్ సాదవి వంటి ఎనభై సంవత్సరాల సుప్రసిద్ధ నవలారచయిత్రి దగ్గరి నుంచి ప్రాథమిక పాఠశాల విద్యార్థుల వరకూ ఆ పద్దెనిమిది రోజులు తహ్రీర్ స్క్వేర్ లో ప్రదర్శనలలో పాల్గొన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ అరబ్ సంచలనాలలో విశాల ప్రజా రాశులు పాల్గొన్నాయి.

‘పెట్టుబడిదారీ విధానం తప్ప మరోదారి లేదు’ అని సామ్రాజ్యవాదులు ప్రచారం చేస్తున్న దశలో సామ్రాజ్యవాద కీలుబొమ్మల మీద తిరుగుబాటు చేయడం, వారిని కూలదోయడం సాధ్యమేననీ, విప్లవం అవసరమనీ, సాధ్యమేననీ వాళ్లు రుజువు చేశారు. లక్షలాది మంది పాల్గొన్నప్పటికీ ఎవరి ఇష్టారాజ్యంగా వారు కాక, ఒక సంఘటిత నిర్మాణ కృషిగా ఆ ఆందోళన సాగింది. ఇటువంటి సమన్వయ, సంఘటిత కృషి లేకపోతే ఎంత పెద్ద ప్రజా తిరుగుబాట్లనయినా అణచడానికి, బలహీనపరచడానికి ఆధిపత్యశక్తులు ప్రయత్నిస్తాయి. టునీషియా గురించి కన్న ఈజిప్ట్ గురించి ఎక్కువ సమాచారం అందుబాటులో ఉంది. దాని ప్రకారం అక్కడ కనీసం పది సంవత్సరాలుగా కార్మిక వర్గంలో నిర్మాణ కృషి సాగుతున్నది. కార్మిక సంఘాలు, ‘ఏప్రిల్ 6 యువజనోద్యమం’, ‘మేమందరమూ ఖలీద్ సయీద్ లమే’, ‘ముబారక్ వ్యతిరేక కూటమి’ వంటి మార్క్సిస్టు సంస్థలు, ముస్లిం బ్రదర్ హుడ్, నేషనల్ అసోసియేషన్ ఫర్ చేంజ్, వఫద్ పార్టీ వంటి ప్రతిపక్షాలు, విద్యార్థులు, న్యాయవాదులు, మేధావులు, సోషలిస్టులు, ఇస్లామిక్ వాదులు, ప్రజాస్వామిక వాదులు అందరూ వేరువేరుగా చేస్తూ వచ్చిన కృషి అంతా, వారు తయారు చేసిన నిర్మాణాలన్నీ ప్రజా వెల్లువకు ఉపయోగపడ్డాయి.

అంటే ప్రజావెల్లువకు, తిరుగుబాటుకు, విప్లవానికి అవసరమైన రెండు అంశాలూ – ప్రజల సంసిద్ధత, నాయకత్వపు సన్నాహక కృషి – సమపాళ్లలో సమకూరినప్పుడు అద్భుతమైన, సంభ్రమాశ్చర్య భరితమైన ఫలితాలు వస్తాయని ఇవాళ అరబ్ ప్రపంచం నేర్పుతున్నది. కొనసాగుతున్న దోపిడీ పీడనల పాలనవల్ల, పాలకుల దుర్మార్గాలు రోజురోజుకూ పెచ్చరిల్లిపోతుండడం వల్ల, ప్రజల ఆకాంక్షలను అణచడానికి పాలకులు తీవ్రమైన దమననీతిని ప్రయోగిస్తుండడం వల్ల ప్రజలలో లోలోపల అసంతృప్తి, వ్యతిరేకత గూడు కట్టుకుంటూ ఉంటాయి. లోలోపల వారి ఆగ్రహం పెరిగిపోతూ, పైకి చూడడానికి మాత్రం నివురు కప్పుకుంటూ ఉంటుంది. లోపల నిప్పు మాత్రం సంసిద్ధంగా ఉంటుంది. నాయకత్వపు సన్నాహక కృషి చేయవలసిందల్లా ఆ నివురును ఊది మంట రాజేయడం, ఒక నిప్పురవ్వ ఎగసినప్పుడు దాన్ని మంటగా మార్చడం, ఆ మంట వ్యాపించడానికి తగిన పరిస్థితిని ఏర్పరచడం, ఒక నిప్పురవ్వను దేశవ్యాపిత దావానలంగా విస్తరించగల నిర్మాణాలను తయారు చేసిపెట్టడం. అరబ్ ప్రపంచంలో, ప్రత్యేకించి ఈజిప్ట్ లో ఈ పనులు జరిగాయి. భారతదేశంలో ప్రజావెల్లువను కలగనేవారు ఇటువంటి నిర్మాణాత్మక కృషి గురించి ఆలోచించాలి.

అయితే ఒక హెచ్చరిక కూడ ఉంది. ఈ అరబ్ ప్రజా సంచలనాలను చూసి పొంగిపోయి విజయోత్సవాలు జరుపుకుంటే ఫలితం లేదు. ఈ విజయంలో దాగి ఉండే అపజయాలను కూడ గుర్తించవలసి ఉంది. ఆ అపజయాల అవరోధాలను దాటుకుని ఈ సంచలనాలు నిజంగా ప్రజా విజయంగా మారుతాయా, లేదా మరొక రూపంలోని దోపిడీ శక్తుల చేతుల్లోకి పోతాయా అనేది ఇవాళ పెద్ద ప్రశ్న.

ఇటువంటి ప్రజా ఉద్యమాలలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనే అవకాశం ఉంటుంది గనుక ప్రతి వర్గమూ తన ప్రయోజనాల సాధన కొరకు ప్రయత్నించే అవకాశం కూడ ఉంటుంది. నిరంకుశ పాలకులను, ప్రభుత్వాన్ని పడగొట్టడం వరకూ భిన్న వర్గాల మధ్య, భిన్న ప్రయోజనాల మధ్య కనబడిన ఐక్యత, ఒకసారి విజయం చేకూరగానే ఘర్షణగా మారుతుంది. నిన్నటిదాకా కలిసి పోరాడిన శక్తులే ఇవాళ తమ భిన్న ప్రయోజనాల సాధన కొరకు ఎదురుబొదురుగా నిలబడతాయి. ప్రత్యర్థిని పడదోసి, ఓడించి తామే గెలవడానికి ప్రయత్నిస్తాయి. ఇవాళ అరబ్ దేశాల ప్రజా సంచలనాలకు నాయకత్వం వహిస్తున్న, ఆ ప్రజా సంచలనాలలో పాల్గొంటున్న శక్తుల వైవిధ్యం చూస్తే రానున్న రోజులలో ఈ శక్తుల మధ్య తీవ్రమైన ఘర్షణ జరగవచ్చునని స్పష్టమవుతుంది.

మామూలుగానే ఈ శక్తుల మధ్య వైవిధ్యం, వైరుధ్యాలు ఉండగా ఈ చమురు నిక్షేపాల భూభాగం తన పట్టు నుంచి జారిపోకుండా కాపాడుకోవాలని ప్రయత్నించే అమెరికన్ పాలకవర్గాల పాత్ర కూడ గణనీయంగా ఉంది. పోరాటశక్తులలో కొందరిని ఆకట్టుకోవడానికి, కొనివేయడానికి, తన తైనాతీలను పోరాటంలోకి ప్రవేశపెట్టడానికి, పోరాటశక్తులుగా చూపడానికి అమెరికన్ పాలకవర్గాలు, ప్రచారసాధనాలు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈజిప్ట్ ప్రజా ఉద్యమం తమ వల్లనే సాధ్యమైందని, తమ సాంకేతిక నైపుణ్యం వల్లనే సాధ్యమైందని, తమ ఉదార ప్రజాస్వామిక నమూనానే ఈజిప్ట్ ఆందోళనకారులు ఆమోదిస్తున్నారని అమెరికన్ పాలకవర్గాల ప్రతినిధులు ప్రకటిస్తున్నారు.

అలాగే ఈ దేశాలన్నిటిలోనూ సైన్యం పాత్ర ప్రధానమైనది. గత మూడు నాలుగు దశాబ్దాలుగా ఈ దేశాల ప్రభుత్వాలన్నీ ప్రజలను అణచి ఉంచడంలో భాగంగా సైన్యానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చాయి. ఆ సైన్యంలో పై అధికారులందరికీ అటు అమెరికన్ సిఐఎ, ఇటు ఇజ్రాయెలీ మొసాద్ శిక్షణనిచ్చాయి. ఆ సైన్యపు ఆధునీకరణకు అమెరికా విపరీతంగా నిధులు, అత్యాధునిక ఆయుధాలు అందజేసింది. కనుక ఇప్పుడు సైన్యంలోని కిందిస్థాయి అధికారులు, సాధారణ సైనికులు ప్రజలవైపు నిలబడడానికి ప్రయత్నించినా, పైస్థాయి అధికారులు, విధాన నిర్ణేతలు అమెరికన్ పాలకవర్గాలకో, స్థానిక పాలకవర్గాలకో మద్దతు తెలిపే అవకాశం ఉంది. అదే జరిగితే ఈ వెల్లువలో సాధించిన విజయాలన్నీ రద్దయిపోతాయి. నిజానికి 1986లో ఫిలిప్పైన్స్ ప్రజావెల్లువ అనుభవం, 1998 ఇండోనేషియా ప్రజావెల్లువ అనుభవం ఈ ప్రమాదాన్ని చూపుతున్నాయి. ఆ రెండు దేశాలలో ప్రజాగ్రహం వెల్లువెత్తినప్పుడు, దానికి నాయకత్వం వహించి ప్రజానుకూల మార్గ నిర్దేశనం చేయవలసిన స్వీయ మానసిక శక్తులు సంసిద్ధంగా లేకపోవడంతో, ఆ రెండు చోట్లా ప్రజల చేతికి అధికారం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది.

మొత్తంగా చూస్తే భారత దేశంలో కొనసాగుతున్న యథాస్థితిని మార్చాలని, నిజమైన ప్రజారాజ్యం రావాలని కోరుకునే వారందరూ అరబ్ ప్రజావెల్లువను అధ్యయనం చేసి గ్రహించవలసింది ఎంతో ఉంది. భారత ప్రజా ఆగ్రహం వెల్లువలా ముంచెత్తే సమయం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని జారవిడుచుకోకుండా ఉండడానికి ఏమి చేయవలసి ఉందో ప్రగతిశీల శక్తులు ఆలోచించాలి.

 

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Telugu, Veekshanam. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s