ఇన్ని సమస్యలతో రాష్ట్ర పయనం ఎటు?

వీక్షణం – మార్చ్ 2011  సంపాదకీయం

ఆంధ్రప్రదేశ్ సమస్యల ప్రదేశ్ గా అట్టుడికిపోతున్నది. దాదాపు అన్ని వర్గాల ప్రజలు, ప్రజాసంఘాలు, రాజకీయ పక్షాలు ఏదో ఒక సమస్యపై ఏదో ఒక స్థాయిలో తమ అసంతృప్తిని, ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నాయి. ప్రభుత్వం వైపు నుంచి, అధికారవర్గాల వైపు నుంచి మాత్రం ఈ సమస్యలను పరిష్కరించడానికి వీసమెత్తు ప్రయత్నం కనబడడం లేదు. ప్రజాసమస్యలను సామరస్యపూర్వకంగా, శాంతియుతంగా, ప్రజాస్వామికంగా, చట్టబద్ధంగా పరిష్కరించే ఆలోచనే కనబడడం లేదు. పైగా, ఆ సమస్యల ప్రకటనలను, వ్యక్తీకరణలను, ప్రజా ఆకాంక్షలను పశుబలంతో అణచివేయగలమని పాలకులు పగటికలలు కంటున్నారు. సమస్య పెద్దదైనా, చిన్నదైనా పోలీసు, పారామిలిటరీ బలగాలను విపరీతంగా మోహరించడం, ప్రజల ప్రశ్నలను లాఠీలతో, రబ్బర్ బులెట్లతో, తుపాకి తూటాలతో, అక్రమ కేసులతో ఎదుర్కోవడం పాలకులకు తెలిసిన ఏకైక విద్య అయింది. నిజానికి ఈ ప్రజాసమస్యలన్నీ పాలకులు కల్పించినవే. పాలకవిధానాల వల్ల ఏర్పడినవే. వీటిలో పాలకుల అలక్ష్యం వల్ల సుదీర్ఘ కాలంగా నానుతున్న సమస్యలూ ఉన్నాయి, ఏరోజుకారోజు పాలకులు అమలు చేస్తున్న చర్యలవల్ల తలెత్తుతున్న సమస్యలూ ఉన్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షల విషయంలో కేంద్రప్రభుత్వమే 2009 డిసెంబర్ 9న చేసిన ప్రకటననుంచి వెనక్కి వెళ్లినందువల్ల ఏడాదికి పైగా సాగుతున్న ఆందోళనలు జనవరి 6న శ్రీకృష్ణ కమిటీ నివేదిక వెలువడిన తర్వాత మరింత వేడెక్కాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన రచ్చబండ కార్యక్రమం తెలంగాణలో రసాభాసగా మారింది. ప్రజాసమస్యల పరిష్కారవేదికగా చెప్పుకున్న రచ్చబండ కొత్త సమస్యలకు దారి తీసింది. ఎన్నో చోట్ల పాలకపార్టీ శాసనసభ్యులు, మంత్రులు, ముఖ్యమంత్రి కూడ పలాయనం చిత్తగించవలసి వచ్చింది. ఈలోగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఈ పార్లమెంటు సమావేశాలలోనే ప్రవేశపెట్టాలని కోరుతూ సహాయనిరాకరణ కార్యక్రమం మొదలయింది. తెలంగాణ అంతటా ప్రభుత్వం స్తంభించింది. అందులో భాగంగా సాగిన రెండురోజుల బంద్ విజయవంతమయింది. బడ్జెట్ సమావేశాలను ప్రారంభించిన పాలకపక్షం శృంగభంగాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. ఆనవాయితీ ప్రకారం ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యులు, కొందరు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అడ్డుకున్నారు. సభాగౌరవానికి భంగంగా చెపుతున్న ఆ ఘటన ఏడాదిగా జరుగుతున్న ప్రభుత్వ సాచివేత ధోరణికి ప్రతిఘటనగా, నిరసనగా, ప్రతిచర్యగా కూడ కనబడుతున్నది. శాసనసభ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా గవర్నర్ కుర్చీని, పోడియంను పడదోసి, మైకులు లాగేస్తే, మార్షల్స్ రక్షణ మధ్య, అక్కడక్కడా కొన్ని పేజీలు గబగబా చదివేసి గవర్నర్ ప్రసంగం అయిపోయిందని అనిపించవలసి వచ్చింది. ఒకవైపు తెలంగాణ జిల్లాలన్నిటా ఈ ఆందోళన సాగుతుండగానే ఇంజనీరింగ్, మెడికల్ తదితర ఉన్నత విద్యల విద్యార్థులకు ప్రభుత్వ ఫీజు రియింబర్స్ మెంట్ పథకాన్ని అవకతవకలతో అమలుచేయడాన్ని నిరసిస్తూ కళాశాలల యాజమాన్యాలు ఆందోళన ప్రారంభించాయి. కళాశాలలు మూసివేస్తామని హెచ్చరించాయి. ఒక విద్యార్థిని ఆత్మహత్యతో ఈ సమస్య మరింత జటిలమయింది. కొత్త ప్రతిపక్షంగా మారిన మాజీ కాంగ్రెస్ ఎంపి నిరాహారదీక్షకు పూనుకున్నారు. ఉత్తరాంధ్రలో పెట్టుబడిదారుల, ఆశ్రితుల ప్రయోజనాల కోసం, వారికి భూమి కట్టబెట్టడం కోసం ప్రారంభమైన విద్యుదుత్పత్తి ప్రాజెక్టులను అక్కడి ప్రజలు ఎప్పటినుంచో వ్యతిరేకిస్తున్నారు. ఆ పరిణామం కొద్దినెలల కింద సోంపేటలో పోలీసు కాల్పులకు దారి తీయగా, ఫిబ్రవరి చివరి వారంలో కాకరాపల్లి విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా సాగిన ఆందోళనలో వడ్డితాండ్రలో కాల్పులు జరిగాయి. ప్రజలు తమ చేతికర్రలు తిరగేసి సాయుధపోలీసులను తరిమిన దృశ్యం కూడ కనబడింది. ఈ సమస్యలన్నిటిలోనూ రాష్ట్ర ప్రభుత్వం, పాలకవర్గాలు చిత్తశుద్ధితో, సంయమనంతో, ప్రజాస్వామికంగా వ్యవహరిస్తే పరిష్కారాలు కనుక్కోవచ్చు. సుదీర్ఘకాలంగా రగులుతున్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష రాజ్యాంగబద్ధమైన, న్యాయబద్ధమైన పరిష్కారానికి వీలయినదే. కేంద్రం అంగీకరించి కూడ మాట తప్పినదే. ప్రజల ఆకాంక్ష ఇంత పెద్ద ఎత్తున, ఇన్ని రూపాలలో, ఇంతకాలంపాటు వ్యక్తమయిన తర్వాత కూడ ఆ సమస్యను బలప్రయోగంతో అణచివేయగలమని అనుకోవడం మన పాలకుల తెలివిలేనితనానికో, మూర్ఖత్వానికో నిదర్శనం. ఇంతగా మనసులు విడిపోయిన తర్వాత బలవంతాన కలిపి ఉంచినా ఆ కలయిక ఎంతటి ఘర్షణకు, వైమనస్యానికి, నిరంతర సమస్యలకు దారితీస్తుందో ఎవరయినా ఊహించగలరు. అయితే తెలంగాణ ఏర్పాటు వల్ల తాము నష్టపోతామని భావించే, విడిపోవడం మంచిది కాదని భావించే వ్యక్తులు, ప్రజాసమూహాలు ఉన్నమాట నిజమే. అటువంటి వారితో కూడ సామరస్యపూర్వకంగా చర్చించి, ఒప్పించి, వారి ఫిర్యాదులను పరిష్కరించవలసిన బాధ్యత కూడ ప్రభుత్వం మీదనే ఉంటుంది. ఇక ఫీజు రియింబర్స్ మెంట్ సమస్యను సృష్టించుకున్నది పూర్తిగా ప్రభుత్వమే. ఇవాళ వెనుకబడిన వర్గాల విద్యార్థుల ప్రయోజనాలు కూడ అందులో ఇమిడి ఉన్నాయి గనుక, వారిని రెచ్చగొట్టడానికి ఎవరికైనా అవకాశం వస్తున్నదేమో గాని అసలు ఆ పథకం తయారయినది విద్యార్థులకోసం కాదు, కేవలం కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాల కోసం. ప్రభుత్వం వారికి రక్షిత నిధుల సరఫరా పథకంగా ఈ రియింబర్స్ మెంట్ ను ప్రవేశపెట్టింది. సరిగ్గా ఆరోగ్యశ్రీ కూడ ఇలాగే కార్పొరేట్ ఆస్పత్రుల కోసం తయారయింది. ప్రధాన లబ్ధిదార్లు పెట్టుబడిదారులే అయినా ఈ పథకాల వల్ల విద్యార్థులకు, ప్రజలకు కూడ ఎంతో కొంత మేలు జరుగుతూ ఉండిందని భావిస్తే, ఆ మాత్రం మేలును కూడ ఎగరగొట్టడానికి ఇప్పుడు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. అడిగినవారిమీద నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నది. ఇక సోంపేట కాల్పుల తర్వాత, అక్కడ విద్యుత్ కేంద్రపు ఆలోచనను వదులుకుంటున్నామని ఆ యాజమాన్యం ప్రకటించిన తర్వాత అయినా మిగిలిన ప్రాజెక్టుల గురించి ప్రభుత్వం పునరాలోచించవలసింది. కాని నెత్తురుటేర్లు పారించి అయినా సరే తన ఆశ్రితుల ప్రయోజనాలు కాపాడతానని పాలకులు ప్రతిజ్ఞ పూనినట్టున్నారు. ఇటువంటి పనులే చేసిన బెన్ అలీలు, హొస్ని ముబారక్ లు ఏమైపోయారో కళ్లముందరి చరిత్ర మన పాలకులకు మాత్రం కనబడుతున్నట్టులేదు.

 

సంపాదకీయ వ్యాఖ్యలు

దొంగల రాజ్యంలో మరొక స్పెక్ట్రమ్ కుంభకోణం

కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక వల్ల బయటపడి, విచారణ కోసం సంయుక్త పార్లమెంటరీ సంఘం వేయాలనే డిమాండ్ తో లోకసభ సమావేశాలు జరగని స్థితిని తెచ్చిన 2జి స్పెక్ట్రం అమ్మకాల కుంభకోణం సృష్టించిన ప్రకంపనాలు ఇంకా పూర్తిగా సమసిపోలేదు. అంతకన్న పెద్ద కుంభకోణం మరొకటి బయటపడుతున్నది. దేశం బందిపోటు దొంగల పాలనలో ఉన్నదని మరొక రుజువు వెల్లడవుతున్నది. 3జి స్పెక్ట్రం వేలం అమ్మకాల ధరలను ప్రమాణంగా తీసుకుని 2జి స్పెక్ట్రం అమ్మకాలలో జరిగిన అక్రమాలను లెక్కిస్తే ఒక లక్షా డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగిందని కాగ్ అంచనా వేసింది. ఇప్పుడు కొత్తగా బయటపడిన ఎస్ బాండ్ కేటాయింపులో ఆ నష్టం రెండు లక్షల కోట్ల రూపాయల పైనే అని ప్రాథమిక అంచనాలు వెలువడుతున్నాయి. మొదటి కుంభకోణంలో టెలికాం మంత్రిత్వశాఖ పాత్ర, మంత్రి రాజా పాత్ర ఉండగా, ఈ కొత్త కుంభకోణం జరిగినది స్వయంగా ప్రధానమంత్రి బాధ్యత వహించే అంతరిక్ష శాఖకు చెందిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో. ఆ కుంభకోణం ఆయనకు తెలిసి జరిగిందా తెలియకుండా జరిగిందా అనేది కేవలం సాంకేతికమైన ప్రశ్న. ప్రధానిగానో, తాను ప్రత్యక్షంగా పర్యవేక్షించే మంత్రిత్వశాఖ తరఫుననో ఈ కుంభకోణానికి పూర్తి బాధ్యత వహించవలసినది మన్మోహన్ సింగ్ మాత్రమే. ఎస్ బాండ్ లో ఉన్న 190 మెగా హెర్ట్ జ్ స్పెక్ట్రం లోనుంచి 150 మెగా హెర్ట్ జ్ ను మొబైల్, బ్రాడ్ కాస్ట్ ప్రసారాల సేవల కోసం అంతరిక్ష మంత్రిత్వశాఖకు కేటాయించారు. దేశ రక్షణ అవసరాల కోసం, సామాజిక అవసరాల కోసం ఈ మంత్రిత్వశాఖకు ఈ కేటాయింపు ఉచితంగానే జరిగింది. మరొకపక్క భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బి ఎస్ ఎన్ ఎల్), మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటిఎన్ ఎల్) వంటి ప్రజోపయోగ సంస్థలకు 20 మెగా హెర్ట్ జ్ స్పెక్ట్రం ను రు. 12,847 కోట్లకు అమ్మారు. దీన్ని బట్టే ఈ ఎస్ బాండ్ స్పెక్ట్రం ఎంత ఖరీదయినదో అర్థమవుతుంది. కాని ఇస్రో తనకు కేటాయించిన 150 మెగా హెర్ట్ జ్ లోనుంచి 70 మెగా హెర్ట్ జ్ స్పెక్ట్రం ను దేవాస్ మల్టీమీడియా అనే వ్యాపార సంస్థకు 20 సంవత్సరాల పాటు వాడుకోవడానికి వెయ్యి కోట్ల రూపాయలు మాత్రమే తీసుకుని అప్పజెప్పింది. పైగా ఆ స్పెక్ట్రంను దేవాస్ మల్టీమీడియా మరెవరికయినా అద్దెకు ఇచ్చుకోవచ్చుననీ, అందుకు ఎవరి అనుమతీ తీసుకోనక్కరలేదనీ రాసిచ్చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఇస్రోకు చెందిన రెండు ఉపగ్రహాల నమూనాలను, ఉపగ్రహాలను తయారు చేసి కక్ష్యలో ప్రవేశపెట్టే పని దేవాస్ ది. ఆ ఉపగ్రహాల సేవలను ఇటు ఇస్రో, అటు దేవాస్ కలిసి వాడుకోవచ్చు. ఈ ఒప్పందం ఇస్రోకు చెందిన వ్యాపార వ్యవహారాలు చూసే ఆంట్రిక్స్ కార్పొరేషన్ కు, దేవాస్ మల్టీమీడియాకు మధ్య 2005లో కుదిరింది. దేవాస్ మల్టీమీడియా వెనుక ఒక మాజీ ఇస్రో శాస్త్రవేత్త ఉన్నాడు. ఆ కంపెనీ యాజమాన్యంలో అమెరికాకు చెందిన మాజీ ప్రభుత్వాధికారులు, అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కూడ ఉన్నారు. ఆ కంపెనీ 2008లో తన యాజమాన్యంలో స్వల్పమైన వాటాను డాయిష్ టెలికాం కంపెనీకి రు. 317 కోట్లకు అమ్మేసింది. ఈ ఒప్పందం నష్టదాయకమైనదని, రద్దు చేసుకోవాలని న్యాయ మంత్రిత్వశాఖ 2009లో సలహా ఇచ్చింది. అంతరిక్ష మంత్రిత్వశాఖ కూడ 2010 జూలైలో ఈ అదేమాట చెప్పింది. అయినా కొనసాగిన వ్యవహారం బయటపడిన తర్వాత మాత్రం తప్పుకోవడానికి, అబద్ధాలు చెప్పడానికి, తమకు సంబంధం లేదని చెప్పడానికి ప్రధాన మంత్రి, ఇస్రో అధికారులు ప్రయత్నించారు. రెండు వారాలు చర్చ చివరికి ఫిబ్రవరి రెండవవారంలో ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాని జరిగిన బందిపోటు దొంగతనం, బైటపడి ఉండకపోతే అమలయి ఉండే దొంగతనం ఎలాజరిగిందో మాత్రం ఇంతవరకూ వివరణ లేదు. ఈ దొంగ పాలకులను ఇంకా నమ్ముతున్నామంటే, గౌరవిస్తున్నామంటే మన సహనం ఎంత గొప్పదై ఉండాలి?!


ఈజిప్ట్, సిరియా, బహ్రెయిన్, లిబియా….

ఇవాళ అరబ్ దేశాల ప్రజలు గొప్ప ఆశను రేకెత్తిస్తున్నారు. ఈ యుగస్వభావాన్ని విశ్లేషిస్తూ 1970లలో “దేశాలు స్వాతంత్ర్యాన్ని కోరుతున్నాయి, జాతులు విముక్తిని కోరుతున్నాయి, ప్రజలు విప్లవాన్ని కోరుతున్నారు”  అన్నాడు మావో సే టుంగ్. ఆ దశాబ్దం తిరగకుండానే ఆయన మరణించాడు. ఆ దశాబ్దం చివరనే ఆయన మాటలు నిజం కావేమోననిపించే పరిణామాలు మొదలయ్యాయి. దేశాల స్వాతంత్ర్యాన్ని భగ్నం చేసే బహుళజాతిసంస్థల వ్యూహం ప్రపంచ బ్యాంకు-అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థల వ్యవస్థాత్మక సంస్కరణల రూపంలో అన్ని ప్రభుత్వాలనూ లోబరచుకుంది. 1975లో గెలిచిన వియత్నాం జాతీయ విముక్తి పోరాటం నాలుగేళ్ళు తిరగకుండానే పొరుగున సోషలిస్టు ప్రయోగాలు చేస్తున్న కంపూచియా మీద దురాక్రమణ జరిపి జాతీయ విముక్తి పోరాటాల విప్లవ స్వభావాన్ని అపహాస్యం చేసింది. స్వయంగా మావో నాయకత్వం వహించిన విప్లవం విద్రోహానికి గురయింది. మరొక దశాబ్దం తిరిగేసరికి తూర్పు యూరప్ ప్రభుత్వాలు, సోవియట్ యూనియన్ పతనం జరిగి, ప్రపంచానికి పెట్టుబడిదారీ విధానం తప్ప “మరొక గత్యంతరం లేదు” అని మార్గరెట్ థాచర్ బహిరంగంగా ప్రకటించే స్థితి వచ్చింది. భూగోళం మీదికి, స్వాతంత్ర్యాన్ని కోరే దేశాల మీదికి, విముక్తిని కోరే జాతుల మీదికి, విప్లవాన్ని కోరే మనుషుల మీదికి ప్రపంచీకరణ మహమ్మారి ముంచుకు వచ్చింది. ఆ తర్వాత రెండు దశాబ్దాలు అక్కడక్కడా ఆశ మిణుకుమంటున్నా, నెగళ్లు రాజుకుంటున్నా, మిణుగురు పురుగుల సంగీతం వినిపిస్తున్నా ప్రగతిశీల శక్తుల నిర్వేదం కూడ కొట్టవచ్చినట్టు కనబడుతూనే ఉంది. ఆ నిర్వేదాన్ని బద్దలు చేసినందుకు ఉత్తర ఆఫ్రికా, పశ్చిమాసియా ప్రజలకు జేజేలు చెప్పాలి. యుగ స్వభావం ధిక్కారం అని వాళ్లు ప్రకటిస్తున్నారు. యుగస్వభావం మార్పును కోరుకోవడం అని వాళ్లు చూపుతున్నారు. నిజానికి యుగం అనేది ఒక దశాబ్దంలోనో, రెండు దశాబ్దాలలోనో తేలిపోయేది కాదు. చరిత్ర పొడవునా ప్రతి దశకూ కొన్ని వందల సంవత్సరాలు, ఒక్కొక్కసారి వేల సంవత్సరాలు పట్టిన అనుభవం ఉంది. కనుక 1970లలో యుగస్వభావం గురించి చేసిన సూత్రీకరణ అతిశయోక్తి కాదని, అక్షరాలా సత్యమని ఇవాళ కనీసం పది దేశాలలో ప్రజలు రుజువు చేస్తున్నారు. వాళ్లు కోరుకుంటున్నది దేశాల స్వాతంత్ర్యం కాకపోవచ్చు, జాతుల విముక్తి కాకపోవచ్చు, ప్రజల విప్లవం కాకపోవచ్చు. అక్కడక్కడా ఆ ఆకాంక్షలు కూడ ఉండవచ్చు. కాని ప్రధానమైన అంశం వాళ్లు ఇంకెంతమాత్రమూ యథాస్థితిని అంగీకరించడం లేదు. యథాస్థితిని కూలదోయడం తప్ప గత్యంతరం లేదని ప్రకటిస్తున్నారు. వేలాదిగా, లక్షలాదిగా వీథుల్లోకి వచ్చి తమ ఆకాంక్షలను వ్యక్తం చేస్తున్నారు. మరీముఖ్యంగా ఇవాళ ప్రజాగ్రహం వెల్లివిరుస్తున్న అన్ని దేశాలలోనూ గత రెండు దశాబ్దాలకు పైగా ప్రపంచీకరణ విధానాలు అమలవుతున్నాయి గనుక, ఇవాళ్టి నిరసన, ప్రతిఘటన ప్రదర్శనలు ఆ విధానాల పట్ల వ్యతిరేకతలే. ఆ విధానాలను రద్దు చేయాలని ప్రజలు నినదిస్తున్నారు. సియాటిల్ ప్రదర్శనల నాటినుంచీ మేధో బృందాలలో, కార్యకర్తలలో, కొన్ని రాజకీయ పక్షాలలో ఉన్న ప్రపంచీకరణ వ్యతిరేకత ఇవాళ అట్టడుగు ప్రజలు తమ మాటలలో, చేతలలో వ్యక్తీకరిస్తున్నారు. అలా యుగస్వభావాన్ని మళ్లీ ఒకసారి వ్యక్తీకరిస్తున్నందుకూ సామ్రాజ్యవాద రాజకీయార్థిక విధానాలనూ, వారికి దళారీలుగా మారిన స్థానిక భూస్వామ్య, మతఛాందస, పెట్టుబడిదారీ వర్గాలనూ ధిక్కరిస్తున్నందుకూ ఈ ప్రజాగ్రహ ప్రకటనలను సాదరంగా ఆహ్వానించవలసి ఉంది. ఈ ప్రజావెల్లువను పైకెత్తి పట్టి దాని స్ఫూర్తిని దశదిశలా ప్రచారం చేయవలసి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజాశక్తులన్నీ ఈ అవకాశాన్ని తీసుకుని తమ పాలకులనూ, వారికి వత్తాసుగా నిలిచే సామ్రాజ్యవాద శక్తులనూ కూలదోయడానికి పూనుకోవలసి ఉంది.

 

 

 

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Veekshanam. Bookmark the permalink.

2 Responses to ఇన్ని సమస్యలతో రాష్ట్ర పయనం ఎటు?

  1. udaya says:

    “అయితే తెలంగాణా ఏర్పాటు వల్ల తాము నష్టపోతామని భావించే ,విడిపోవడం మంచిది కాదని భావించే వ్యక్తులు ,ప్రజా సమూహాలు ఉన్న మాట నిజమే .అటువంటి వారి తో కూడా సామరస్య పూర్వకంగా చర్చించి,ఒప్పించి…….”.ఇది అయ్యే విషయమేనా ?ఈ వ్యాఖ్యలు మీ నుంచి రావటం చాల ఆశ్చర్యాన్ని కలిగించింది .భావించే వ్యక్తులు నాయకులు అన్నాసరే కాని “ప్రజా సమూహాలు” అంటూ మొదలుపెడితే మా జీవిత కాలం లో తెలంగాణా ను చూడ గలమా ? మాకు తెలంగాణా ఉద్యమ స్ఫూర్తి కలగటానికి దోహదం చేసినవాటిలో మీ పుస్తకాలు ఉపన్యాసాలు చాల ముఖ్యమైనవి .మేము అందరి మాటలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నాము .తెలంగాణా ఉద్యమంలో విజయమో వీర స్వర్గమో అన్న దశ లో ఉన్నాము .మమ్మల్ని నిరాశ పరిచే వ్యాఖ్యలు చేయకండి .

  2. Srinivas says:

    ఏడుపుగొట్టు లొల్లి పెట్టేవాళ్ళకి వీర స్వర్గం ఎందుకొస్తుంది? తగలేసుకుని సచ్చేవాళ్ళకు స్వర్గం రాదు, బర్నాల్ రాసుకుని సర్కారీ దవాఖాన చిప్పకూడు తినే చావు వస్తుంది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s