పౌరహక్కుల అవగాహనలో, నిర్మాణంలో కన్నబిరాన్

తెలుగు సమాజంలో మాత్రమే కాక మొత్తం భారత దేశంలోనే తమ హక్కులకోసం పోరాడుతున్న ప్రజలందరూ తమ న్యాయవాదిగా, సమర్థకుడిగా, ఆపద్బంధువుగా గుర్తించి, గౌరవించిన కె. జి. కన్నబిరాన్ 2010 డిసెంబర్ 30 సాయంత్రం మరణించారు. పౌరహక్కుల కోసం కె జి కన్నబిరాన్ (1929 – 2010) చేసిన అపారమైన కృషిని ఒక వ్యాసంలో అంచనా కట్టడం చాల కష్టం. ఎనబై ఒక్క సంవత్సరాల జీవితంలో అరవై సంవత్సరాల న్యాయవాద వృత్తిలో, యాభై సంవత్సరాల పాటు ఆయన ప్రజాజీవనంలో ఉన్నారు, పౌరహక్కుల కృషి సాగించారు. ఆ పౌరహక్కుల కృషి కూడ వేరువేరు రంగాలలో, వేరువేరు స్థాయిలలో, వేరువేరు కోణాల నుంచి విస్తృతంగా సాగింది. స్థూలంగా చెప్పాలంటే ఆయన పనిచేసిన రంగాలు పౌరహక్కుల తాత్విక దృక్పథాన్ని అభివృద్ధి చేయడం, రాజ్యాంగాన్నీ, చట్టాలనూ పౌరహక్కుల దృక్పథం నుంచి అర్థం చేసుకోవడం, పౌరహక్కుల కొరకు న్యాయస్థానాలలో పోరాడడం, పౌరహక్కుల గురించి ప్రజాజీవన అవగాహనలను పెంచడం, పౌరహక్కుల ఉద్యమాన్ని నిర్మించడం, పౌరహక్కుల పరిరక్షణ కొరకు నిర్దిష్ట నిర్మాణాన్ని రూపొందించడం, పౌరహక్కుల కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం. వీటిలో ఏ ఒక్క రంగంలోనయినా ఆయన కృషి ఒక పుస్తకంగా రాయదగినంత విశాలమైనది. ఆయారంగాలలో ఆయన అందించిన కానుకలేవో, వాటిని ముందుకు తీసుకుపోవడానికి తర్వాతి తరాల న్యాయవాదులు, పౌరహక్కుల కార్యకర్తలు, బుద్ధిజీవులు ఏం చేయవలసి ఉంటుందో స్థూలంగా సూచించడం మాత్రమే ఈ వ్యాస పరిధి.

చిన్ననాటి నుంచీ కమ్యూనిస్టు రాజకీయాల, ఉద్యమాల ప్రభావం, అధ్యయనశీలిగా మార్క్సిస్టు తాత్విక దృక్పథంతో పరిచయం, ఎన్నో ప్రజాసమస్యల కేసులు వాదించిన న్యాయవాదిగా ప్రజాజీవితం గురించిన విస్తారమైన అనుభవం కన్నబిరాన్ పౌరహక్కుల దృక్పథం వికసించడానికి తగిన భూమికను కల్పించాయి. హైదరాబాద్ లో ఉండడం, హైదరాబాద్ వచ్చిన తొలిరోజుల నుంచీ సింగరేణి గని కార్మికుల కేసులు వాదించడం, ఆ తర్వాత క్రమక్రమంగా విప్లవోద్యమ కేసులు వాదించడం, పౌరహక్కుల ఉల్లంఘనల ఘటనలను ప్రత్యక్షంగా చూడడం వినడం, పౌరహక్కుల రక్షణ కొరకు ఉద్యమ నిర్మాణంలో భాగం కావడం ఆయన పౌరహక్కుల దృక్పథానికి పదును పెట్టాయి. 1964లో పౌరహక్కుల నిర్మాణ ప్రయత్నాలలో భాగమైనప్పటికీ, 1970 నుంచీ విప్లవోద్యమ కేసులు వాదిస్తూ డిఫెన్స్ కమిటీ నిర్మాణంలో ఉన్నప్పటికీ, 1973లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘంలో చేరినప్పటికీ, 1975లో దేశవ్యాప్తంగా విధించిన ఎమర్జెన్సీలో సాగిన చీకటి రాజ్యమే ఆయన పౌరహక్కుల దృక్పథం పటిష్టం కావడానికి ఎక్కువ ఉపయోగ పడిందనిపిస్తుంది. ఆయన రచనల్లోనూ, ఉపన్యాసాలలోనూ ఎమర్జెన్సీ గురించి, అప్పుడు న్యాయస్థానాల లోనూ, బయటా పొందిన అనుభవాల గురించి ఎన్నోసార్లు ప్రస్తావించారు.

ఆ సందర్భంలోనే ఎమర్జెన్సీ గురించిన చర్చలో ఒక న్యాయవాది “అసమ్మతి తెలిపే, భిన్నాభిప్రాయం ప్రకటించే హక్కు ఉండగూడదా” అని ప్రశ్నిస్తే అప్పటికి ఎమర్జెన్సీని సమర్థిస్తున్న సిపిఐ నాయకులు “ఆ హక్కు ఎవరికి” అని అడిగారని, అలా ప్రశ్నించడం తప్పుడు అవగాహన అని కన్నబిరాన్ అన్నారు. “అడగవలసిన ప్రశ్న ఎవరికి అని కాదు, ఎందుకు అని. భిన్నాభిప్రాయం ప్రకటించడం ఏ ప్రయోజనం కోసం అని’ అని నేనన్నాను. అట్లా ప్రశ్నించడం చాల అప్రజాస్వామికం అని నేనన్నాను” అని తనకు సిపిఐతో సంబంధం తెగిపోయిన ఉదంతం గురించి ఆయన రాశారు.

పౌరహక్కులు కొందరికి ఉండడం, కొందరికి ఉండకపోవడం అనేది ఒకచోట వర్తింపజేస్తే అది అంతిమంగా అప్రజాస్వామిక వర్తనకే దారితీస్తుందని ఆయన నిశ్చితాభిప్రాయం. అయితే ఏ తేడా లేకుండా అందరికీ హక్కులు సమానమే అనే శుష్క మానవతావాదాన్ని కూడ ఆయన ఎన్నడూ నమ్మలేదు. అందుకే హక్కుల విషయంలో ఎవరికి అనే ప్రశ్న కాకుండా “ఎందుకు, ఏ ప్రయోజనాల కోసం” అనే మౌలిక ప్రశ్న అడగాలని ఆయన వాదించారు.

ఎవరికి అనే చర్చతో ప్రారంభిస్తే న్యాయస్థానాలు ఒకే హక్కు విషయంలో సంపన్నుల పట్ల ఒక వైఖరి, పేదల పట్ల మరో వైఖరి తీసుకుంటాయని ఆయన అనేక తీర్పులు ఉదహరిస్తూ వివరించేవారు. కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు వంటి సుప్రసిద్ధమైన ఉదాహరణలలో కూడ ఈ ఎవరికి అనే దృక్పథం ఎలా పనిచేసిందో ఆయన విశ్లేషించేవారు. దాని బదులు ఏ హక్కు అయినా ఎందుకు, ఏ ప్రయోజనం కోసం అని అడగడం ప్రారంభిస్తే ప్రజాజీవన ప్రయోజనం, ప్రజాస్వామికత వెల్లివిరుస్తాయని ఆయన అనేవారు. అసమ్మతి ప్రకటించే హక్కును, భిన్నాభిప్రాయం తెలిపే హక్కును ప్రజల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం వాడడం అవసరమనీ, అప్పుడు ఆ హక్కు ఎవరు వాడుకుంటున్నారనే ప్రశ్నకు తావు లేదనీ ఆయన అభిప్రాయం. అలా కాక ఈ ప్రశ్నించే హక్కు ఒక బృందానికి ఎప్పుడూ ఉంటుందని, మరొక బృందానికి ఎప్పుడూ ఉండదని వాదించడం మొదలుపెడితే, ఆ ప్రశ్నించే హక్కు ఎందుకోసం అనే మౌలిక ఆలోచన ధ్వంసమవుతుందని ఆయన అనేవారు.

తనను పౌరహక్కుల ఉద్యమం వైపు నడిపించిన కారణాల గురించి చెపుతూ ఆయన “మనం మన రాజ్యాంగాన్ని పట్టించుకోవలసినంత తీవ్రంగా, గంభీరంగా పట్టించుకోలేదనుకుంటాను. ఆ నిర్లక్యానికి మనం మూల్యం చెల్లిస్తున్నాం. రాజ్యాంగం అనేది కేవలం ఒక చట్టపరమైన పత్రం కాదు. అది ఒక రాజకీయ ప్రకటన. దాని వెనుక ప్రజలు ఉన్నారు. ప్రజా ఉద్యమం ఉంది. ప్రజా ఆకాంక్షలున్నాయి. రాజ్యాంగాన్ని ఈ నేపథ్యంలో చూడకపోవడం వల్ల ఒక రాజకీయ ప్రకటనగా దానికి ఉండవలసిన శక్తిని, పటుత్వాన్ని మనం విస్మరించాం. రాజ్యాంగాన్ని అలా గుర్తించకపోవడం వల్లనే మన న్యాయస్థానాల తీర్పులు స్వాతంత్ర్యోద్యమంతో, ఆ విలువలతో ఏమీ సంబంధం లేకుండా వెలువడడం మొదలైంది…” అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ దృక్పథం వల్లనే ఆయన రాజ్యాంగంలోని అప్రజాస్వామిక అధికరణాలను తీవ్రంగా విమర్శిస్తూనే రాజ్యాంగ స్ఫూర్తిని ఎత్తిపట్టారు. రాజ్యాంగం అంటే ప్రవేశిక, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు భూమికగా ఉండే స్ఫూర్తి మాత్రమేనని ఆయన అనేవారు. ప్రవేశిక లోని సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయ భావనలకు ఆయన చాల ప్రాధాన్యత ఇచ్చేవారు. ప్రాథమిక హక్కులలో వాక్సభా స్వాతంత్ర్యాలకు, భావప్రకటనా స్వేచ్ఛకు హామీ ఇచ్చే అధికరణం 19ని, జీవించే హక్కుకు హామీ ఇచ్చే అధికరణం 21ని కాపాడడానికే ఆయన నిరంతరం కృషిచేశారు.

ఆదేశిక సూత్రాలన్నీ కూడ భారత జాతీయోద్యమ ఫలితాలు అని, అంటే వలసవాద వ్యతిరేక పోరాటంలోని ప్రజల ఆకాంక్షలు అని, అందువల్ల వాటిని గౌరవించాలని ఆయన అనేవారు. ఆదేశిక సూత్రాలను తప్పనిసరిగా అమలు చేయాలనే నిబంధన లేకపోవడం, అవి అమలు కాకపోతే న్యాయస్థానంలో సవాలు చేసే వీలు లేకపోవడం రాజ్యాంగంలోని లోపమేనని ఆయన అనేవారు. ముఖ్యంగా అధికరణం 39లో చెప్పినట్టుగా ప్రభుత్వ విధాన నిర్ణయాలు ఉండకపోవడం వల్ల ప్రజాజీవితం దుస్థితిలోకి పోతున్నదని ఆయన అనేవారు. పౌరులందరికీ తగిన జీవనోపాధి హక్కు కల్పించడం, సమాజపు భౌతిక వనరుల యాజమాన్యంగాని, నియంత్రణ గాని ప్రజలందరి శ్రేయస్సు కోసం ఉపయోగపడేలా చూడడం, ఆర్థిక వ్యవస్థ నిర్వహణ ఉమ్మడి ప్రయోజనాలకు హానిచేసే సంపద కేంద్రీకరణకు దారితీయకుండా చూడడం, స్త్రీ పురుషులందరికీ సమానపనికి సమాన వేతనం ఇవ్వడం, ఆర్థిక ఒత్తిడివల్ల తమ వయసుకూ, శక్తికీ తగని పని చేయవలసిన దుస్థితి ఎవరికీ రాకుండా చూడడం ప్రభుత్వ బాధ్యతలని ఈ అధికరణం 39 చెపుతుంది. ఇటువంటి ఆదేశిక సూత్రాలను అమలు చేయలేని పాలనకు సాధికారత లేనట్టేనని, అందువల్ల ఈ పాలనను కూలదోయాలని ప్రయత్నించే హక్కు ప్రజలకు ఉన్నదని ఆయన వాదించేవారు.

అందుకే రూల్ ఆఫ్ లా (చట్టబద్ధ పాలన) ఉండాలని అంటూనే, చట్టబద్ధపాలన కొరకు నిర్విరామంగా పోరాడుతూనే, అక్రమ చట్టాలు ఉండే అవకాశం కూడ ఉందనీ, వాటికి వ్యతిరేకంగా తిరగబడే హక్కు ప్రజలకు ఉంటుందనీ కూడ ఆయన అన్నారు. నిజానికి న్యాయవాదవృత్తి పొడవునా ఆయన చేసిన పని అటువంటి అక్రమ చట్టాలకు, అప్రజాస్వామిక చట్టాలకు వ్యతిరేకంగా పోరాడడమే. 1970లో ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కు వ్యతిరేకంగా పోరాడిన నాటి నుంచి 2009-10లలో చత్తీస్ గడ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ కు, అన్ లాఫుల్ యాక్టివిటీస్ (ప్రివెన్షన్) యాక్ట్ కు వ్యతిరేకంగా పోరాడినదాకా ఆయన విమర్శించని, వ్యతిరేకవాదనలు అభివృద్ధి చేయని అక్రమ చట్టం ఒక్కటి కూడ లేదు.

ఇవాళ పాలకులకు, అధికార వ్యవస్థలకు ఇంప్యునిటీ (శిక్షాతీత నేర ప్రవృత్తి) ఉన్నదని, దాన్ని అడ్డుకోవడమే పౌరుల బాధ్యత అని ఆయన ఎప్పుడూ చెపుతుండేవారు. ఎటువంటి నేరం, తప్పు చేసినా శిక్ష ఉండదు అని ఇవాళ పాలకులు, అధికార వ్యవస్థ, ముఖ్యంగా పోలీసులు అనుకుంటున్నారని, ఇటువంటి స్థితి ఉండడమే సమాజానికి హానికరమని అందువల్ల బుద్ధిజీవులు, ప్రజలు ఈ ఇంప్యునిటీని వ్యతిరేకించాలని ఆయన అనేవారు.

పౌరహక్కుల, మానవహక్కుల దృక్పథం దానికదిగా స్వతంత్రమైనది కాదని, అది మొత్తంగా సమాజాన్ని మార్చే ఆలోచనలో భాగమేనని, భాగం కావాలని కూడ ఆయన ఆలోచించారు.

 

ఈ విధంగా పౌరహక్కుల దృక్పథాన్ని అభివృద్ధి చేయడం వల్ల, రాజ్యాంగాన్నీ, చట్టాలనూ పౌరహక్కుల దృక్పథం నుంచి అర్థం చేసుకోవడం వల్ల, ఆయన తన న్యాయవాద నైపుణ్యాన్ని పౌరహక్కుల కొరకు న్యాయస్థానాలలో పోరాడడానికి వినియోగించారు. ఆయన వాదించిన, వాదనలకు సహకరించిన వేలాది కేసులలో అత్యధిక భాగం పౌరహక్కుల ఉల్లంఘనను సవాలు చేసినవే.

న్యాయస్థానాలలో చట్టాలను ప్రజల హక్కుల వైపునుంచి వ్యాఖ్యానించడంతోనే తనపని అయిపోయిందని  ఆయన అనుకోలేదు. న్యాయమూర్తులకూ సహన్యాయవాదులకూ ప్రజల హక్కుల గురించి తెలియజేసే బాధ్యతతో సమానంగానే ప్రజలకు చట్టం గురించీ, పౌరహక్కుల గురించీ చెప్పవలసిన బాధ్యత కూడ ఉందని అనుకున్నారు. నిజంగా ఎమర్జెన్సీకి ముందునుంచీ చనిపోవడానికి కొద్దినెలల ముందు హైదరాబాద్ లో పౌరహక్కుల సంఘం ఏర్పాటు చేసిన పురుషోత్తం సంస్మరణ సభ దాకా ముప్పై ఐదు సంవత్సరాలలో ఆయన పాల్గొని ప్రసంగించిన సభలు వందలాదిగా ఉంటాయి. తెలుగు సమాజంలో పౌరహక్కుల గురించి ప్రజాజీవన అవగాహనలను పెంచడానికి కృషి చేసిన వారిలో ఆయన అగ్రభాగాన నిలుస్తారు.

సమాజంలో పౌరహక్కుల అవగాహనలను పెంచడం అనేది ఒక ఉద్యమ నిర్మాణంగా మారకపోతే దానికి దీర్ఘకాలిక ప్రయోజనం ఉండదు. అలా రాష్ట్రంలో పౌరహక్కుల ఉద్యమాన్ని నిర్మించడంలో కూడ కన్నబిరాన్ కృషి విశిష్టమైనది. ఎమర్జెన్సీకి ముందే ఏర్పడిన రెండు సంస్థలూ, ఎమర్జెన్సీ తర్వాత కాలక్రమంలో ఏర్పడిన నాలుగైదు సంస్థలూ అవగాహనలలో చిన్న చిన్న తేడాలున్నా మొత్తంగా పౌర, ప్రజాస్వామిక హక్కుల ఉద్యమాన్ని విస్తరించాయి. 1990ల తర్వాత ప్రపంచీకరణ క్రమంలో ప్రజల హక్కుల మీద దాడి పెరిగిపోతున్న సందర్భంలో పౌరహక్కుల ఉద్యమం అనివార్యంగా విస్తరించవలసి వచ్చింది. తొలినాళ్లలో రాజ్యహింసకు వ్యతిరేకంగా ఇంకెవరూ మాట్లాడని స్థితిలో గళమెత్తిన పౌరహక్కుల ఉద్యమం క్రమక్రమంగా అన్ని హక్కుల ఉల్లంఘనలనూ, అన్ని ఆధిపత్య సంస్థలనూ ప్రశ్నించడం ప్రారంభించింది. మొత్తంగానే సమాజంలో పౌరహక్కుల చైతన్యం వెల్లివిరియడానికి పౌరహక్కుల ఉద్యమం కారణమైంది.  ఇవాళ ప్రతి లాకప్ మరణాన్నీ, ఎన్ కౌంటర్ ఘటననూ అనుమానంతో చూసే పరిస్థితి ఏర్పడిందన్నా, సమాజంలో వేరువేరు సమూహాలు తమ రాజ్యాంగబద్ధమైన, ప్రజాస్వామికమైన హక్కుల కోసం పోరాడుతున్నాయన్నా, సాధారణంగా ప్రచార సాధనాలన్నీ హక్కుల అవగాహనతోనే వార్తలూ వ్యాఖ్యలూ రాస్తున్నాయన్నా అది పూర్తిగా పౌరహక్కుల ఉద్యమ ప్రచార, ప్రభావ ఫలితమే. ఈ కృషిలో కొన్ని సార్లు ప్రత్యక్షంగానూ, మొత్తంగా అంతర్లీనంగానూ కన్నబిరాన్ కృషి ఉంది.

ఈ విశాలమైన పౌర, ప్రజాస్వామిక హక్కుల ఉద్యమానికి నిర్దిష్టంగా నిర్మాణం ఉండడం చాల అవసరం. ఆంధ్ర ప్రదేశ్ పౌరహక్కుల సంఘం రూపంలో 1973 డిసెంబర్ లో గుంటూరులో ఏర్పడిన సంస్థ గత నాలుగు దశాబ్దాల పౌరహక్కుల ఉద్యమానికి అగ్రభాగాన ఉన్నది. ఈ సంస్థానిర్మాణంలో మొదటినుంచీ ఉన్న కన్నబిరాన్ 1978లో అధ్యక్షస్థానం స్వీకరించారు. అనారోగ్య కారణాలవల్ల ఆ పదవి నుంచి తప్పుకుంటానని అంతకుముందే నుంచే ఆయన కోరుతున్నప్పటికీ చివరికి 1993లో సంస్థ ఆయన కోరికను మన్నించింది. ఆ పదిహేను సంవత్సరాల కాలంలో ఎన్నో నిర్బంధాలకు, భౌతిక దాడులకు, దుష్ప్రచారాలకు, కేసులకు గురయినప్పటికీ సంస్థ స్థిరంగా, దృఢంగా నిలబడడంలో, విస్తరించడంలో, రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది న్యాయవాదులను, ఇతర జీవనరంగాల బుద్ధిజీవులను ఆకర్షించడంలో, సంస్థకు రాష్ట్రంలో ఏకైక ప్రతిపక్షంగా ప్రతిష్ట ఏర్పడడంలో కన్నబిరాన్ పాత్ర ఎంతో ఉంది.

చివరిగా, పౌరహక్కుల ఉద్యమం స్థిరంగా, దృఢంగా సాగాలంటే పౌరహక్కుల అవగాహనలోనూ, కార్యాచరణలోనూ ఆసక్తి, నైపుణ్యం, చొరవ ఉండే క్రియాశీల కార్యకర్తలు కావాలి. పౌరహక్కుల కార్యకర్తలకు, ముఖ్యంగా న్యాయవాదులకు చట్టాల గురించి, పౌరహక్కుల అవగాహన గురించి శిక్షణ ఇవ్వడం. పరిజ్ఞానాన్నీ, నైపుణ్యాన్నీ, ప్రేరణనూ, స్ఫూర్తినీ అందించడం, వారి న్యాయవాద వృత్తికి అవసరమైన చట్టపరమైన, న్యాయశాస్త్రపరమైన సలహాలూ సూచనలూ ఇవ్వడంలో కన్నబిరాన్ చేసిన కృషి చిరకాలం గుర్తుంచుకోదగినది.

ఈ అన్ని రంగాలలో ఆయన చేసిన కృషి కన్న ఎక్కువ కృషి చేయవలసిన సామాజిక రాజకీయార్థిక పరిస్థితులు ఇవాళ మనచుట్టూ ఉన్నాయి. ఆయన స్ఫూర్తితో అటువంటి కృషి సాగించడమే, పౌర, ప్రజాస్వామిక హక్కుల ఉద్యమాన్ని బలోపేతం చేసి, మొత్తంగా సాగుతున్న ప్రజా ఉద్యమానికి అండదండలు అందించడమే కన్నబిరాన్ కు మనం ఇవ్వగల నివాళి.

 

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Telugu. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s