వికీలీక్స్ గీటురాయి మీద మన పాలకులు

ఈభూమి ఏప్రిల్ 2011 సంచిక కోసం 

ఇతర దేశాలలో ఏం జరుగుతున్నదో, అక్కడ జరిగే పరిణామాలు తమ దేశం మీద ఎటువంటి ప్రభావం చూపుతాయో తెలుసుకోవాలని ప్రతి దేశపు ప్రభుత్వానికీ ఉంటుంది. అందుకోసం అన్ని దేశాల ప్రభుత్వాలూ ఇతర దేశాలలో వేగులను, గూఢచారులను, దళారీలను, సమాచార వనరులను ఏర్పాటు చేసుకుంటాయి. అదేమీ ఆశ్చర్యకరమైన విషయం కాదు. శతాబ్దాలుగా జరుగుతున్నదే. ఆధునిక కాలంలో అయితే ప్రతి దేశంలోనూ అధికారికంగానే అన్ని దేశాల రాయబార, దౌత్య కార్యాలయాలు ఉండడం, అక్కడి అధికారులు బహిరంగంగానూ ప్రచ్ఛన్నంగానూ ఈ వేగుల పని చేస్తూ ఉండడం మామూలే. రాజకీయ, ఆర్థిక, పారిశ్రామిక, సైనిక ప్రయోజనాల కోసం ఇతర దేశాల మీద అధికారం చలాయించ దలచుకున్న అగ్రరాజ్యాలకు ఇటువంటి సమాచారం సేకరించడం, దాని ఆధారంగా విధాన నిర్ణయాలు చేయడం అతి ముఖ్యమైన పని.

ఆయా దేశాలలోని రాయబార కార్యాలయాలు తమ సొంత దేశాలకు పంపించే సమాచారం అనేక రూపాలలో ఉంటుంది. ఆ సమాచారంలో తప్పులూ అబద్ధాలూ అతిథి దేశపు కీలక రహస్యాలూ ఉన్నప్పటికీ అవన్నీ దౌత్యపరమైన మినహాయింపు పేరుతో ఎవరి కంటా పడకుండా ఆయా దౌత్యాధికారుల సొంత దేశాలకు చేరిపోతాయి. డిప్లొమాటిక్ బ్యాగ్ అనబడేది ఒక పవిత్రమైన రక్షణ కవచం. 1961లో కుదిరిన వియన్నా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్స్ ప్రకారం చేత్తో ఇచ్చే కవర్ నయినా, పట్టుకుపోయే సూట్ కేసునయినా, నౌకలో పంపే పెద్ద కంటెయినర్ నయినా డిప్లొమాటిక్ బ్యాగ్ అని సూచిస్తే దాన్ని సోదా చేయడానికి, జప్తు చేయడానికి వీలులేదు. అందులో ఏమి ఉన్నా సరే దాన్ని పరీక్షించడానికి కూడ వీలు లేదు. డిప్లొమాటిక్ బ్యాగ్ ను పట్టుకుపోయే వ్యక్తిని (డిప్లొమాటిక్ కొరియర్ ను) ఆపడానికి, నిర్బంధించడానికి కూడ వీలు లేదు. ఉత్తరాలు, పత్రాలు, నివేదికలు, పుస్తకాలు, ఫొటోలు, రికార్డింగులు వగైరా ఈ బ్యాగుల్లోనే వెళతాయి. టెలిగ్రాములు, కేబుళ్ల రూపంలో కూడ సమాచారం వెళ్తూ ఉంటుంది. టెలిఫోన్ సంభాషణలు సరేసరి. ఇటీవలి ఈ జాబితాలో ఇ-మెయిల్, ఇంటర్నెట్ ఆధారిత సమాచార వినిమయం కూడ చేరాయి.

అలా వేగులు పంపిస్తున్న సమాచారంలో ఏం ఉన్నదో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. కాని అది సాధారణంగా బయటపడదు. కాని ఇటువంటి రహస్య సమాచారం ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చే చరిత్రాత్మకమైన సన్నివేశం 2010 నవంబర్ 28న మొదలయింది. అప్పటికే దేశదేశాల ప్రభుత్వాలు ప్రజల నుంచి దాచిపెడుతున్న సమాచారాన్ని, రహస్య పత్రాలను తవ్వితీసి బహిరంగ పరుస్తున్న వికీలీక్స్ మరొక కొత్త సంచలనానికి తెరలేపింది. అమెరికా ప్రభుత్వానికి ఆ దేశపు దౌత్య కార్యాలయాలు పంపిన కేబుళ్లను సంపాదించిన వికీలీక్స్ ఆ కేబుళ్లను బహిరంగపరచడం మొదలుపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా 274 అమెరికా రాయబార కార్యాలయాలు తమ ప్రభుత్వానికి 1966 డిసెంబర్ నుంచి 2010 ఫిబ్రవరి వరకు పంపించిన 2,51,287 కేబుళ్లు ఇలా బయటపడ్డాయి. ఈ కేబుళ్లలో 26 కోట్లకు పైగా పదాల సమాచారం ఉంది. ఈ కేబుళ్లలో దాదాపు పదహారువేల కేబుళ్లు “రహస్య సమాచారం” అనే వర్గీకరణ కింద, ఒక లక్షకు పైగా కేబుళ్లు “విశ్వసనీయం” అనే వర్గీకరణ కింద ఉన్నాయి. ఈ కేబుళ్ల ప్రధాన దృష్టి అమెరికా విదేశాంగ విధానం, అమెరికా ప్రయోజనాల పరిరక్షణ, ఇతర దేశాలనుంచి అమెరికాకు చేకూరబోయే ప్రయోజనాల మీదనే ఉన్నప్పటికీ, ఆ కేబుళ్లను నిశితంగా చూస్తే, ఆయా దేశాలలో పాలనలు సాగుతున్న తీరు, పాలకుల లాలూచీలు, అవినీతి కుంభకోణాలు, ఆయా దేశాల రాజకీయ నాయకుల, అధికారుల వ్యక్తిగత విశేషాలు కూడ బయటపడుతున్నాయి.

తన మిత్రుల మీదా, ఐక్యరాజ్య సమితి మీదా అమెరికా ప్రభుత్వం నడుపుతున్న గూఢచార చర్యల సమాచారం, తన ఆశ్రిత రాజ్యాల పాలకుల అవినీతి, మానవహక్కుల ఉల్లంఘనలను అమెరికా సమర్థిస్తున్న సమాచారం, తటస్థ దేశాలుగా పిలుచుకుంటున్న దేశాల పాలకులతో అమెరికా జరుపుతున్న లోపాయకారీ లావాదేవీలు, అమెరికా కంపెనీలకు అవసరమైన ముడి సరుకుల కోసం, ఆ కంపెనీల సరుకుల అమ్మకాల కోసం, లాభాల కోసం అమెరికా ప్రభుత్వం ఇతరదేశాల ప్రభుత్వాల మీద తెస్తున్న ఒత్తిళ్లు, ఆయా దేశాలలో తమకు సమాచారం అందిస్తున్న, తమ పనులు చేసిపెడుతున్న రాజకీయ నాయకులనూ, అధికారులనూ కాపాడడానికి అమెరికా ప్రభుత్వం తీసుకునే చర్యలు వంటి ఎన్నో విషయాలు ఈ కేబుళ్లలో ఉన్నాయి. ఆయా దేశాల రాజకీయ నాయకులు గాని, అధికారులు గాని బయటికి మాట్లాడే మాటలకూ, అమెరికా దౌత్యవేత్తలతో మాట్లాడే మాటలకూ ఎంత తేడా ఉంటుందో ఈ కేబుళ్లలో బయట పడుతున్నది. నిజానికి బయటి మాటలకూ లోపలి మాటలకూ తేడా అనేది చిన్న మాట, అవి పరస్పర వ్యతిరేకంగా ఉన్నాయి. బయట “కాదు, వద్దు” అన్న విషయాలలో దౌత్య అధికారుల దగ్గర “ఔను, కావాలి” అన్న రాజకీయ నాయకులు, అధికారులు కోకొల్లలుగా ఉన్నారు.

ఒక ఉదాహరణ చెప్పాలంటే, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని వ్యతిరేకిస్తూ పోరాటాలు చేస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్ అమెరికా రాయబార కార్యాలయంలో అధికారి రాబర్ట్ ఒ బ్లేక్ తో మాట్లాడుతూ తమ పార్టీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి వ్యతిరేకం కాదనీ, “కేస్ బై కేస్” పరిశీలించాలని మాత్రమే తాము కోరుతున్నామనీ అన్నారు. తాము “భారత పరిపాలనలో బాధ్యతాయుతమైన పాత్ర నిర్వహిస్తామ”నీ, “ఘర్షణకూ, కటువైన పదాడంబరానికీ తావు ఇవ్వబోమ”నీ వాగ్దానం చేశారు. అమెరికా వ్యతిరేక సిపిఐ-ఎం నాయకులే ఇలా మాట్లాడినప్పుడు ఇక ఇతర రాజకీయ నాయకులు ఎలా మాట్లాడి ఉంటారో చెప్పనవసరం లేదు.

ఈ అమెరికా దౌత్య కార్యాలయాల కేబుళ్ల కుంభకోణాన్ని ఇప్పుడు కేబుల్ గేట్ అని పిలుస్తున్నారు. ఈ కేబుల్ గేట్ ను బహిర్గతం చేయడానికి వికీలీక్స్ ఎల్ పయిస్ (స్పెయిన్), లి మోంద్ (ఫ్రాన్స్), దర్ స్పీగెల్ (జర్మనీ), ది గార్డియన్ (యునైటెడ్ కింగ్ డమ్), ది న్యూయార్క్ టైమ్స్ (అమెరికా) పత్రికలతో ఒప్పందం కుదుర్చుకుంది. బయట పడుతున్న సమాచారం విస్తృతమైనది గనుక ఆయా పత్రికలు ఆ సమాచారంలోనుంచి ఎంపిక చేసిన వాటిని మాత్రమే ప్రచురిస్తున్నాయి.

ఈ వ్యవహారంలో భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయాల నుంచి అమెరికా ప్రభుత్వానికి వెళ్లిన కేబుళ్లు కూడ ఉన్నాయి. అవి దాదాపు 5,100 ఉన్నాయని తెలుస్తున్నది. వాటిని ప్రచురించడానికి వికీలీక్స్ చెన్నై దినపత్రిక ది హిందూ కు అనుమతినిచ్చింది. ఈ వికీలీక్స్ ఇండియా కేబుళ్లలో ఎంపిక చేసిన కేబుళ్లను హిందూ మార్చ్ 15నుంచి ప్రచురించడం మొదలు పెట్టింది. భారతదేశంలో ఈ కేబుళ్లను ప్రచురించడానికి అనుమతి ఉన్న ఏకైక పత్రిక ఆ కేబుళ్లలో వేటిని ప్రచురిస్తున్నదో, వేటిని ప్రచురించకుండా ఆపుతున్నదో ఇంకా మనకు తెలియదు. అయినా  గడిచిన రెండు వారాలలో అచ్చయిన దాదాపు రెండు వందల కేబుళ్లను చూస్తేనే ఈ దేశ పాలకులు, అధికారులు ఎటువంటి సమాచారాన్ని అమెరికా రాయబార కార్యాలయ ఉద్యోగులకు, వేగులకు అందించారో స్పష్టమవుతున్నది.

మన పాలన ఎలా సాగుతున్నదో మన ప్రజలకు సమాచారం లేదు. సమాచార హక్కు చట్టం వచ్చిన తర్వాత కూడ కావలసిన సమాచారమంతా దొరకడం లేదు. ఎవరు, ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి సమాచారం కోరినా, ‘అధికారిక రహస్యమ’నో, ‘వర్గీకరించిన పత్రం’ అనో, ‘బయట పెట్టడం దేశ సమగ్రతకూ, భద్రతకూ భంగకరమ’నో జవాబు వస్తుంది. కాని అలా ఈ దేశ ప్రజలకు తెలియని ఈ దేశానికి సంబంధించిన విలువైన సమాచారమెంతో అమెరికాకు మాత్రం ఏరోజుకు ఆరోజు చేరిపోతుంది. ఆ సమాచారాన్ని మన పాలకులో, పాలకులకు సన్నిహితులో, అధికారులో అమెరికా రాయబార కార్యాలయాలకు అందిస్తున్నారు. లేదా ఆ అధికారులు మన రాజకీయ నాయకులతో, అధికారులతో ఇష్టాగోష్టి, పిచ్చాపాటి సంభాషణలు, భోజన, మద్యపాన సమావేశాలు జరిపి అలవోకగా సమాచారం సంపాదించి దాన్ని ఎప్పటికప్పుడు తమ ప్రభుత్వానికి కేబుల్ లో పంపుతున్నారు. అవన్నీ ఎప్పటికి బయటికి వస్తాయో తెలియదు గాని, వాటిలో శతాంశమో, సహస్రాంశమో బయటపడితేనే సంభ్రమాశ్చర్యకరమైన సంగతులున్నాయి.

మన బంగారం మంచిది కాక కంసాలిని తప్పు పడితే ఏం లాభం అని సామెత. మన బంగారం ఎంత కాదనుకున్నా మనది గదా అనే మమకారంతో, కాకి పిల్ల కాకికి ముద్దన్నట్టుగా ఇన్నాళ్లూ మనం ఎవరో పరాయి దేశాల వాళ్లు మన దేశాన్ని దోపిడీ చేస్తున్నారని, అణచివేస్తున్నారని గగ్గోలు పెడుతూ ఉండేవాళ్లం. పరాయి దేశాల వాళ్లకు వాళ్ల ప్రయోజనాలు లేవనీ, ఉండవనీ కాదు. కాని వాళ్ల పనులు చేసిపెట్టడానికి మన నాయకులే పోటీలు పడుతున్నారనీ, వెంపరలాడుతున్నారనీ, మన అధికారులు ఆ దేశాల వేగులుగా పనిచేస్తున్నారనీ స్పష్టంగా బయట పడుతుంటే, మన బంగారమే మంచిది కాదని తేటతెల్లమవుతుంటే పరాయిదేశాల కంసాలులను విమర్శించి ఏం లాభం?

ఇప్పుడు కొన్ని ప్రశ్నలు వేసుకుందాం. మన ప్రభుత్వాలను ఎవరు నడుపుతారు? మన ప్రభుత్వంలో మంత్రిత్వ శాఖలను ఎవరు కేటాయిస్తారు? ఏ మంత్రి ఎటువంటి వాడో, మంచివాడో చెడ్డవాడో ఎవరు నిర్ణయిస్తారు? ఎవరికి కోపం వస్తే మన ప్రభుత్వంలోని ఒక మంత్రి తన శాఖనూ, అసలు మంత్రి పదవినీ కోల్పోతాడు? రాజకీయ పక్షాలు బయట ప్రజలకు చెపుతున్న మాటలకు భిన్నమైన, తమ మనసులో మాటలను ఎక్కడ చెపుతాయి? పొరుగుదేశపు ప్రభుత్వాలతో మన ప్రభుత్వ సంబంధాలు ఎలా ఉండాలో ఎవరు నిర్ణయిస్తారు? అంతర్జాతీయ రాజకీయాలలో, సమావేశాలలో భారతదేశం తన ప్రయోజనాలకో, తన అలీన విధానానికో అనుగుణంగా కాక ఎవరు చెప్పినట్టు ప్రవర్తిస్తుంది? అగ్రరాజ్యపు అధినేత మన దేశ పర్యటనకు వచ్చే సందర్భంలో ఆ దేశపు బహుళజాతి సంస్థలనుంచి ఏయే యుద్ధ సామగ్రి, ఆయుధాలు, విమానాలు, సరుకులు కొనడానికి మన ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోవాలో జాబితాలు ఎవరు తయారు చేస్తారు?

ఈ ప్రశ్నలకూ, ఇటువంటి అనేక ప్రశ్నలకూ సర్వసత్తాక, ప్రజాస్వామిక భారత పౌరులుగా మీలో చాల మంది చాల గర్వంగా ఇవన్నీ భారత ప్రజల వోట్లతో ఎన్నికైన ప్రాతినిధ్య ప్రజాస్వామిక ప్రభుత్వం చేస్తుంది అని జవాబు చెపుతారేమో. కాని హిందూ దినపత్రిక ఇప్పటికి బయటపెట్టిన కేబుళ్ల ఆధారంగా చెప్పగల జవాబు మాత్రం ఒకటే. అమెరికా, అమెరికా, అమెరికా. అంతే.

ఇంకా మీకు అనుమానం ఉంటే మచ్చుకు ఈ ఉదాహరణలు చూడండి:

  • ఇరాన్ పైప్ లైన్ ను సమర్థిస్తూ వివాదాస్పదంగానూ, కుండబద్దలు కొడుతూనూ మాట్లాడుతున్న మంత్రి మణిశంకర్ అయ్యర్ ను తొలగించడం, “అమెరికా అనుకూల” మురళీ దేవ్ రా ను పెట్రోలియం మంత్రిగా నియమించడం “భారత – అమెరికా సంబంధాలు సజావుగా సాగేలా చూస్తామనే సంకల్పానికి ఉదాహరణ” అని అమెరికా రాయబారి డేవిడ్ మల్ ఫోర్డ్ 2006 జనవరిలో జరిగిన మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ తర్వాత కేబుల్ పంపారు. ఇండో – యుఎస్ పార్లమెంటరీ ఫోరం అనే అమెరికా అనుకూల కూటమికి చెందిన, అమెరికా రాయబార కార్యాలయంతో సన్నిహిత సంబంధాలలో ఉన్న ఏడుగురికి మంత్రివర్గంలో స్థానం దొరికిందని అదే కేబుల్ లో మల్ ఫోర్డ్ రాశారు. అలా అమెరికా అనుకూల మంత్రులుగా ఈ రాయబారి జాబితాలో చేరినవారిలో సైఫుద్దీన్ సోజ్, ఆనంద్ శర్మ, అశ్వనీ కుమార్, కపిల్ సిబాల్ కూడ ఉన్నారు.
  • యుపిఎ ప్రభుత్వం రెండో సారి అధికారానికి వచ్చి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత ఆర్థిక శాఖను మళ్లీ చిదంబరంకే ఇస్తారని, లేదా మోంటెక్ సింగ్ అహ్లువాలియాను నియమిస్తారని అమెరికా ఆశించింది. అలా కాక ప్రణబ్ ముఖర్జీని ఆర్థిక శాఖ మంత్రిగా నియమించగానే  విదేశాంగ శాఖ కార్యదర్శి (మన కాబినెట్ మంత్రితో సమానం) హిల్లరీ క్లింటన్ “ఆయన ఎవరు, ఆయన ఏ పారిశ్రామిక, వాణిజ్య గృహానికి అనుకూలంగా ఉంటారు? తన విధానాల ద్వారా ఆయన ఏ పారిశ్రామిక, వాణిజ్య వేత్తకు సహాయపడతారు? అహ్లువాలియాను కాక, ముఖర్జీని ఎందుకు అక్కడ పెట్టారు? ముఖర్జీకీ అహ్లువాలియాకూ సంబంధాలు ఎలా ఉంటాయి” అని ప్రశ్నిస్తూ కేబుల్ పంపారు. అలాగే మిగిలిన మంత్రుల ఇష్టాయిష్టాల గురించి, వారికి సన్నిహితంగా ఉండే వారి గురించి ప్రశ్నలు సంధించారు.
  • భారత అమెరికా అణు ఒప్పందం (2008) పార్లమెంటులో చర్చకు వచ్చి, విశ్వాస తీర్మానంపై వోటింగ్ జరగనున్న సందర్భంగా పార్లమెంటు సభ్యుల వోట్లు సంపాదించడానికి కాంగ్రెస్ పార్టీ రు. 50-60 కోట్లు ఖర్చు చేయదలచుకున్నదని చెపుతూ, ఆ నిధిలో భాగమైన రెండు డబ్బు పెట్టెలను కాంగ్రెస్ నాయకుడు సతీష్ శర్మకు రాజకీయ శిష్యుడయిన నచికేత కపూర్ అమెరికా రాయబార కార్యాలయ అధికారులకు చూపాడని అధికారి స్టీవెన్ వైట్ 2008 జూలై 17న పంపిన కేబుల్ లో రాశారు. నిజానికి ఈ కేబుల్ పంపినది వోటింగ్ కు ఐదు రోజుల ముందు. కాని “ఈ వోటింగ్ లో ప్రభుత్వం అతి స్వల్ప ఆధిక్యతతోనైనా గెలుస్తుంది. ప్రభుత్వానికి అనుకూలంగా 273, వ్యతిరేకంగా 251 వోట్లు పడతాయి. 19 మంది వోటింగ్ లో పాల్గొనకుండా ఉంటారు” అని ఆ కేబుల్ లో రాశారు. నిజంగానే ఐదు రోజుల తర్వాత జరిగిన వోటింగ్ లో 275 అనుకూలంగా, 256 వ్యతిరేకంగా పడగా, 10 మంది వోటింగ్ లో పాల్గొనలేదు. న్యూయార్క్ లో ప్రపంచ వాణిజ్య కేంద్రం విధ్వంసం గురించి ఆచూకీ పట్టలేకపోయిన అమెరికా, లాడెన్ ఆచూకీ పట్టలేకపోతున్న అమెరికా, మన పార్లమెంటు సభ్యుల వోటింగ్ సరళి మీద మాత్రం దాదాపు కచ్చితంగా చెప్పగలిగిందంటే, అర్థం చేసుకోవలసిందేమిటి?
  • రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక దగ్గరినుంచి, ప్రభుత్వ స్థాపన దాకా తాను అనుసరించబోయే వ్యూహమేమిటో భవిష్యత్తు ప్రధాని రాహుల్ గాంధీ అమెరికన్ రాయబార కార్యాలయ అధికారి పీటర్ బర్లీ తో తన రహస్యాలన్నీ 2009 మే 23న పంచుకున్నారు. మే 27న తన ప్రభుత్వానికి పంపిన కేబుల్ లో బర్లీ అవన్నీ వివరంగా రాశారు.
  • చెన్నైలోని అమెరికా రాయబార కార్యాలయంలో అధికారి ఫ్రెడరిక్ జె కాప్లాన్ 2009 మే 13న తన ప్రభుత్వానికి పంపిన కేబుల్ లో భారత దేశంలో ఎన్నికలలో ఎన్ని అక్రమాలు జరుగుతాయో తన అభిప్రాయాలు మాత్రమే కాక, తాను కలిసిన భారత జాతీయ కాంగ్రెస్, ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె), మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లమీన్ (ఎంఐఎం) నాయకుల మాటలు కూడ ఉటంకించి మరీ చెప్పారు. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో నోటుకు వోటు అనేది ఒక రాజకీయ జీవన వాస్తవం అయిందని కాప్లాన్ అన్నారు.
  • అంతర్జాతీయ అణు శక్తి సంస్థ 2005 సెప్టెంబర్ సమావేశంలో ఇరాన్ ను వ్యతిరేకించే తీర్మానానికి అనుకూలంగా భారత్ వోటు వేయడానికి అమెరికా ఒత్తిడే కారణమని కేబుళ్లలో మల్ ఫోర్డ్ రాశారు. నిజానికి ఆ వోటింగ్ జరగడానికి రెండు వారాల ముందు కూడ అప్పటి విదేశాంగ శాఖ కార్యదర్శి ఇరాన్ కు అనుకూలంగా వాదిస్తున్నారని ఆ కేబుళ్లలో ఉంది. ఆ సమావేశానికి కొద్ది ముందు అధ్యక్షుడు బుష్ కూ, ప్రధాని మన్మోహన్ సింగ్ కూ భేటీ జరిగింది. “భారత అధికారులు మొండిగా ఇరాన్ కు మద్దతు ఇస్తున్నారనీ, వారిని ఎలాగైనా దారికి తెమ్మనీ” ఆ భేటీకి ముందు అప్పటి విదేశాంగ కార్యదర్శి కాండోలీజా రైజ్ కు మల్ ఫోర్డ్ ఒక కేబుల్ పంపారు. తెరవెనుక ఏమి జరిగిందో తెలియదు గాని, బుష్ తో మన్మోహన్ సింగ్ భేటీ ముగిసే సరికల్లా భారత్ వైఖరి మారింది. భారత్ ఇరాన్ కు వ్యతిరేకంగా వోటు వేసింది.
  • పాకిస్తాన్ తో భారత సంబంధాల విషయంలో ప్రధాని ఒంటరి అనీ, ఆయన మాటను ఆమోదించేవారు ఆయన మంత్రివర్గంలో ఎవరూ లేరనీ అమెరికా రాయబారి టిమోతీ రోమర్ తో జాతీయ భద్రతా సలహాదారు ఎంకె నారాయణన్ చెప్పారు. ఎంకె నారాయణన్ టిమోతీ రోమర్ భారత ఆంతరంగిక, విదేశాంగ విధానాల గురించి ఎన్నో విషయాలు చాల సన్నిహితంగా మాట్లాడుకున్నారని చెప్పే కేబుళ్లు ఎన్నో ఉన్నాయి.
  • అమెరికా రక్షణ శాఖలో సహాయ కార్యదర్శి మిషెల్ ఫ్లోర్నోయ్ 2009 అక్టోబర్ లో భారత పర్యటనకు వస్తున్నప్పుడు, ఆ పర్యటనకు ముందే రాయబార కార్యాలయానికి ఒక కేబుల్ అందింది. ఈ పర్యటన సందర్భంగా భారత వైమానిక దళం చేత 22 బిలియన్ డాలర్ల (లక్ష కోట్ల రూపాయల) సామగ్రి, నౌకాదళం చేత 1.29 బిలియన్ డాలర్ల (ఏడు వేల కోట్ల రూపాయల) సామగ్రి, భారత సైన్యం చేత 4.3 బిలియన్ డాలర్ల (ఇరవై వేల కోట్ల రూపాయల) సామగ్రి కొనడానికి ఒప్పందాలు కుదర్చాలని ఆదేశించారు.

ఈ కేబుళ్ల తొలివిడత అచ్చు కాగానే, అప్పటికి కాంగ్రెస్ గురించి మాత్రమే ఆరోపణలు, ప్రస్తావనలు వచ్చాయి గనుక భారతీయ జనతా పార్టీ తీవ్రాతి తీవ్రంగా విరుచుకుపడింది. “భారత పాలనా విధానాల రచన వాషింగ్టన్ లో జరుగుతోందా” అనీ, “సిగ్గు సిగ్గు” అనీ భాజపా నాయకులు వ్యాఖ్యానించారు. ప్రభుత్వాధినేతగా ఉండే నైతిక హక్కు డా. మన్మోహన్ సింగ్ కు లేదని అన్నారు. ఈ కేబుళ్లలో బయటపడుతున్న విషయాల మీద ప్రభుత్వాధినేతలు, కాంగ్రెస్ నాయకులు వివరణ ఇవ్వాలని వామపక్షాల నాయకులు అన్నారు.

సహజంగానే కాంగ్రెస్ నాయకులు ఈ వికీలీక్స్ కు విశ్వసనీయతే లేదని, అవన్నీ అబద్ధాలని, ఎక్కువలో ఎక్కువ అవి అమెరికన్ అధికారుల అభిప్రాయాలని, దేశ పాలనా విధానాలపై అమెరికా ప్రభావం ఉన్నదని ఈ కేబుళ్లలో రుజువు కాలేదని వ్యాఖ్యానించారు. ఈ ఆరోపణలన్నీ ఆధారం లేనివనీ, అబద్ధాలనీ అన్నారు. ఈ ఆరోపణలు ఊహాజనితాలనీ, ధృవీకరించుకోవడం సాధ్యం కాదనీ డా. మన్మోహన్ సింగ్ అన్నారు. ఈ ఆరోపణలన్నీ గత లోక సభకు సంబంధించినవి గనుక నిర్ధారించనూలేం, ఖండించనూ లేం అని ప్రణబ్ ముఖర్జీ అన్నారు.

కాని భాజపా నాయకుడు ఎల్ కె అద్వానీ తో పీటర్ బర్లీ సమావేశమయ్యారనీ, ఆ చర్చా వివరాలను 2009 మే 13న కేబుల్ లో పంపాడనీ బయటపడడంతో భాజపా కూడ వికీలీక్స్ మీద అనుమానంగా మాట్లాడడం మొదలుపెట్టింది. భారత అమెరికా అణు ఒప్పందం పట్ల భాజపా వ్యతిరేకత అప్పుడు ఉండిన రాజకీయ పరిస్థితుల వల్ల తీసుకున్నదనీ, తాము అధికారంలోకి వస్తే ఆ వైఖరి మారుతుందనీ అద్వానీ చెప్పారని బర్లీ రాశారు. ఈ అభిప్రాయం ఇతర నాయకులతో మాట్లాడిన, ఇతర అధికారులు పంపిన కేబుళ్లలో కూడ వ్యక్తమయింది.

ఈ అద్వానీతో భేటీ చాలదన్నట్టు, ముంబై లోని అమెరికా రాయబార కార్యాలయంలోని కాన్సల్ జనరల్ మైకేల్ ఎస్ ఓవెన్ 2006 నవంబర్ 16న గాంధీనగర్ లో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ఆ సమావేశం గురించి నవంబర్ 27న పంపిన కేబుల్ లో మోడీ వాదనలను వివరంగా రాశారు. మోడీ 2002 మారణకాండను సమర్థించుకుంటూ, అది గుజరాత్ ఆంతరంగిక వ్యవహారం అనడాన్ని ఖండించినప్పటికీ, గుజరాత్ లో ఆయన నాయకత్వంలో సాగుతున్న ఆర్థిక వికాసం గురించి అమెరికా అధికారి ప్రశంసించారు.

మరొక కేబుల్ అమెరికన్ రాయబార కార్యాలయ అధికారి రాబర్ట్ బ్లేక్ భారతీయ జనతా పార్టీ నాయకుడు అరుణ్ జైట్లీతో 2005 మే 6 న జరిగిన సమావేశ వివరాలు తెలిపింది. ఆ సమావేశంలో జైట్లీ హిందూ జాతీయ వాదం తమకు ఒక అవకాశం మాత్రమేనని స్పష్టంగా చెప్పేశారు. “బంగ్లాదేశ్ నుంచి ముస్లింల వలస వల్ల ఈశాన్య ప్రాంతంలో హిందుత్వ నినదానికి మంచి ఆకర్షణ ఉంటుంది. ఇటీవల భారత – పాకిస్తాన్ సంబంధాలు మెరుగుపడ్డాయి గనుక ఉత్తరాదిన, ఢిల్లీలో హిందూ జాతీయవాదానికి పెద్ద ఆకర్షణ లేదు. కాని పార్లమెంటుపై దాడి లాంటి ఒక్క తీవ్రవాద చర్య జరిగితే మళ్లీ హిందుత్వకు బలం వస్తుంది” అనీ “రెండు మూడేళ్ళలో అద్వానీ యుగం అయిపోయి ఐదుగురు యువతరం నాయకులు భాజపా పగ్గాలు చేపడతారు” అనీ జైట్లీ అన్నారు. ఆ అయిదుగురిలో జైట్లీ ఒకరని చెప్పనక్కరలేదు.

ఈ కేబుళ్లు ఇలా మచ్చుకు చూసినా ఈ దేశ రాజకీయాలు నడుపుతున్న అన్ని రాజకీయ పక్షాలూ, ప్రభుత్వాలను నడుపుతున్న అధికారులలో ప్రధానమైన వాళ్లందరూ సామ్రాజ్యవాద అధికారవర్గాలకు, వారి వెనుక ఉన్న బహుళజాతి సంస్థలకు సేవ చేయడమే తమ ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్నారని అర్థమవుతుంది. వారి లక్ష్యం, వారి రోజువారీ పనితీరు స్పష్టంగానే ఉన్నాయి. వారు మన ప్రతినిధులూ, సేవకులూ అనుకుంటున్న ఈ జాతి భవిష్యత్తు ఏం కానున్నది?

About ఎన్.వేణుగోపాల్ N Venugopal

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues.
This entry was posted in వ్యాసాలు, Ee Bhoomi, Telugu. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s