వీక్షణం – ఏప్రిల్ 2011 సంపాదకీయం

మిలియన్ మార్చ్, విధ్వంసం, ఎనిమిదో అధ్యాయం…  

రాష్ట్రంలో ప్రజల సమస్యలు నానాటికీ తీవ్రతరమవుతుంటే, పాలకులు, రాజకీయ వ్యవస్థ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్నాయి. పరిష్కరించగలిగిన సమస్యలను కూడ నానబెడుతున్నాయి. తమ సొంత ముఠా తగాదాలతో, ఆస్తుల లెక్కలలో మునిగితేలుతున్నాయి. ఇక్కడ సాగుతున్న పాలనకూ, పాలక విధానాలకూ, పాలకులకూ ప్రజల సమస్యలతో, ఆకాంక్షలతో, ఆందోళనలతో ఎంతమాత్రం సంబంధం లేదని ఇటీవలి సంఘటనలు మరొకసారి బయటపెడుతున్నాయి. మరో మాటల్లో చెప్పాలంటే ఇక్కడ సాగుతున్నది ప్రజాస్వామ్య పాలన కాదని, అధికారంలో ఉన్నవారి ఇష్టారాజ్యమని, దొంగల దోపిడీ అని మరొకసారి తేలుతున్నది. ప్రజలు ఎత్తిచూపుతున్న సమస్యలను న్యాయబద్ధంగా, ప్రజాస్వామికంగా పరిష్కరించడానికి ఈ పాలకులకు శక్తి సామర్థ్యాలు, ఆసక్తి లేవని రోజు రోజూ బయటపడుతున్నది. సమస్యలను పరిష్కరించి, ప్రజాజీవితం సాఫీగా సాగేలా చూసే బాధ్యత కోసమే అధికారం చేపట్టిన పాలకులు ఆ పనిని విస్మరించి, సంపద పోగేసుకోవడానికి, హింసా దౌర్జన్యాలు కొనసాగించడానికి మాత్రమే పని చేస్తున్నారు. అందువల్ల సామరస్య పూర్వకంగా పరిష్కారం కావలసిన ప్రజా సమస్యలు అనివార్యంగా ఘర్షణ రూపం ధరిస్తున్నాయి, హింసకూ విధ్వంసానికీ దారితీస్తున్నాయి. శాసనమండలి ఎన్నికలలో తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి అన్ని రాజకీయ పక్షాలూ అవలంబించిన అక్రమాలు, డబ్బు వినియోగం, ముఠాతత్వం, ఓటర్లను బందీలుగా పెట్టుకోవడం, ఒక పార్టీ మీద మరొక పార్టీ, ఒక పార్టీలోనే ఒక ముఠా మీద మరొక ముఠా చేసుకుంటున్న విమర్శలు, బయటపెడుతున్న నిజాలు చూస్తుంటే ఇది ప్రజాస్వామ్య పాలన కాదని స్పష్టమవుతున్నది. ప్రజాస్వామ్య భావనకు తగినట్టుగా పాలన జరగడంలేదని  చెప్పడానికి ఇటీవలి పెద్ద ఉదాహరణ మిలియన్ మార్చ్ పై సాగించిన నిరోధ, నిర్బంధ చర్యలు. తెలంగాణ వాదులు ఏడాదికి పైగా సాగుతున్న తమ ఆందోళనలో భాగంగా, కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబర్ 9 ప్రకటనకు కట్టుబడి, పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని కోరుతూ హైదరాబాద్ లో మార్చ్ 10న ప్రజాప్రదర్శన చేపట్టారు. జనవరిలో అరబ్ ప్రపంచంలో అట్టుడికిన ప్రజా ప్రదర్శనల నేపథ్యంలో, ముఖ్యంగా కైరో లో తహ్రీర్ స్క్వేర్ లో జరిగిన మిలియన్ మార్చ్ ప్రేరణగా హైదరాబాద్ లో కూడ అటువంటి ప్రదర్శనకు పిలుపు ఇచ్చారు. ఆ పిలుపు ఇచ్చినవారి అభిప్రాయాలతో, ఉద్దేశాలతో ఏకాభిప్రాయం లేనివారు కూడ సమర్థించవలసిన ప్రజాస్వామిక హక్కు అది. ఫ్రెంచి తత్వవేత్త వోల్టేర్ చెప్పినట్టు “నీ అభిప్రాయాలతో నాకు ఏకీభావం లేకపోవచ్చు. కాని నీ అభిప్రాయం చెప్పే హక్కును కాపాడడానికి నా ప్రాణమైనా ఇస్తాను” అనేది ప్రజాస్వామిక స్ఫూర్తి.  సమాజం, పాలన నిజంగా ప్రజాస్వామికంగా ఉంటే ఆ స్ఫూర్తి అమలయి ఉండవలసింది. కాని తెలంగాణలోని అన్ని జిల్లాలలోనూ రెండు రోజుల ముందు నుంచి తీవ్రమైన అణచివేత మొదలయింది. విచ్చలవిడిగా అరెస్టులు, రహదారుల మూసివేత, వాహనాల యజమానులకు బెదిరింపులు, హైదరాబాద్ లోకి ప్రవేశించే అన్ని వైపులా కాపలాలు, ప్రదర్శనకు వస్తున్నారని అనిపించిన వారి అరెస్టులు, హైదరాబాద్ లో నిషేధాజ్ఞలు, చివరికి మిలియన్ మార్చ్ జరిగే టాంక్ బండ్ కు ఉన్న దారులు మూసివేసి, ఇనుప ముళ్లకంచెల చుట్టలు వేసి, ఒక్కొక్క చోట వందలాది మంది పోలీసుల మోహరింపు… ఇదంతా దేనికి సూచన? పాలకులు అనుకుంటున్నట్టుగా తెలంగాణ వాదం తప్పుడు వాదమే అయితే, దానికి ప్రజలలో ఆదరణ లేకపోతే ఈ ఆటంకాలన్నీ కల్పించవలసిన అవసరమే లేదు, స్వేచ్చగా జరగనిచ్చినా అదే విఫలమవుతుంది. లేక, అది నిజంగా ప్రజలలో ఉన్నదే అయితే ఈ ఆటంకాలు కల్పించడం అప్రజాస్వామికం. అటువంటి ఆటంకాలతో అది ప్రతిఘటనకు, మరింత నిరసనకు దారితీసి మరింత ఉధృతమవుతుంది తప్ప సమసిపోదు. ఇన్ని ఆటంకాలు కల్పించవలసినంత బలమైనదని పాలకులే అనుకుంటే దాన్ని ఆమోదించడమే ప్రజాస్వామికమవుతుంది. ఇన్ని ఆటంకాలు కల్పించినా, అన్ని జిల్లాలలోనూ కలిపి దాదాపు నాలుగైదు లక్షల మందిని అడ్డుకుని, నిర్బంధించినా, టాంక్ బండ్ మీదికి అనుకున్న సమయానికి లక్ష మందికి పైగా చేరారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి నాలుగు గంటల వరకూ అక్కడ గొప్ప ప్రజా సందోహం చెలరేగింది. ఒక్క భావజాలానికి చెందినవారు కాదు, ఒక్క తెలంగాణ ఆకాంక్ష మినహా మరే ప్రమాణంతో చూసినా ఎన్నడూ పక్క పక్కన నిలబడేవాళ్లు కూడ కాదు. నిజంగా అది ఒక విస్తృత, బహుముఖ, బహుళవాద ప్రజాస్వామిక స్ఫూర్తి ప్రదర్శన. కాని అదంతా మరుగున పడిపోయింది. ఆ అణచివేత గురించి గాని, దాన్ని తోసిరాజని ప్రజలు చూపిన ప్రజాస్వామిక స్ఫూర్తి గురించి గాని ఎవరూ మాట్లాడడం లేదు. ఆ ప్రదర్శన చివరి ఘట్టంలో కొందరు ప్రదర్శనకారులు సాగించిన చర్యల మీదనే రెండు వారాలకు పైగా చర్చోపచర్చలు సాగుతున్నాయి. తప్పనిసరిగా ఆ పరిణామం చర్చించవలసిందే. కాని ఏ సామాజిక పరిణామం ఎంత చర్చకు అర్హమవుతుందనే కనీస స్పృహ ఉండాలి. ఏ పరిణామాన్నయినా, మామూలుగా నేరంగా, ఘోరంగా కనబడే పరిణామాన్నయినా దాని నేపథ్యంలో పెట్టి, కార్యకారణ సంబంధాలతో పరిశీలించాలని తెలిసిన వాళ్లు కూడ ఈ విగ్రహ విధ్వంసం గురించి ఆ ఘటన ఒక్కటే జరిగినట్టుగా చర్చిస్తున్నారు. ఆ ఘటన పట్ల ఏ అభిప్రాయాన్ని ప్రకటిస్తామనేదానికన్న ముఖ్యం, ఆ ఘటన ఏ పరిణామాల గొలుసులో భాగంగా జరిగిందో చూడడం. దాన్ని తప్పు అనుకున్నా, ఒప్పు అనుకున్నా ఆ పరిణామాల గొలుసు మారదు. అలాగే అది ఆ విగ్రహాల మీద దాడా, ఆ విగ్రహాలను మరేదానికో చిహ్నాలుగా చూడడం వల్ల దాడి జరిగిందా అనేది కూడ ప్రధానమే. ఈ దేశంలో అత్యున్నతాధికారంగల ప్రభుత్వం ఒక ప్రకటన చేసి దాన్ని పద్నాలుగు నెలల తర్వాత కూడ అమలు చేయనప్పుడు, తమ ప్రజాస్వామిక నిరసన హక్కును కాలరాస్తున్నప్పుడు, ప్రతి ఒక్క రాజకీయ పక్షమూ అవకాశవాదంలో మునిగిపోయినప్పుడు నిరాశా నిస్పృహలతో ఆరువందల మంది ఆత్మహత్యలకు బలి అయిపోయినప్పుడు పెల్లుబికే న్యాయమైన ప్రతిఘటన కూడ పక్కదారి తొక్కుతుంది. అలా పక్కదారి తొక్కడాన్ని విమర్శించేవాళ్లు దానికి కారణమైన అధికార వైఖరిని ముందు విమర్శించాలి. ఈ వివాదం సమసిపోకుండానే ఇంతకాలం శ్రీకృష్ణ కమిటీ రహస్యంగా దాచిపెట్టిన ఎనిమిదో అధ్యాయం బయట పడింది. ఆ అధ్యాయం చదివితే విగ్రహ విధ్వంసం లాంటి చర్యలకు పాల్పడేట్టుగా తెలంగాణ యువతను పాలకులే రెచ్చగొడుతున్నారని స్పష్టమవుతుంది. పాలన ఉన్నట్టుగానే ప్రజాస్పందన ఉంటుంది. పాలన గురించి మాట్లాడకుండా స్పందన గురించి మాట్లాడడం ఉచితం కాదు.

సంపాదకీయ వ్యాఖ్యలు

భారత పాలన గురించి వికీలీక్స్ నిజాలు

కొన్ని సంవత్సరాలుగా అనేక దేశాల ప్రభుత్వాలను, పాలకవర్గాలను వణికిస్తున్న వికీలీక్స్ పత్రాలు ఇప్పుడు భారత పాలన గురించి, భారత పార్లమెంటరీ రాజకీయాల అసలు స్వరూపం గురించి నిజాలు తెలియజేస్తున్నాయి. వివిధదేశాలలో అమెరికన్ రాయబార కార్యాలయాలు తమ ప్రభుత్వానికి పంపిన సమాచారానికి సంబంధించిన వేలాది కేబుల్స్ ను వికీలీక్స్ సంపాదించింది. వాటిలో భారత దేశంలోని అమెరికా రాయబార కార్యాలయాలు పంపిన కేబుల్స్ కూడ ఉన్నాయి. వాటిలో కొన్నిటిని సంపాదించిన హిందూ దినపత్రిక మార్చ్ 17 నుంచి రోజూ కొన్ని చొప్పున ప్రచురిస్తున్నది. గత రెండువారాలుగా వెలువడుతున్న ఈ సమాచారం, దానిమీద దేశంలో జరుగుతున్న చర్చ, వివిధ పార్లమెంటరీ రాజకీయ పక్షాల స్పందనలు చూస్తుంటే ఈ దేశం అర్ధవలస అనే సూత్రీకరణ అక్షరాలా ఎంత నిజమో బయట పడుతున్నది. ఇక్కడ రాజకీయాధికారం చేపట్టవలసిన వారెవరో అమెరికా ప్రభుత్వం నిర్ణయిస్తుంది. రాజకీయాధికారం చేపట్టినవారిలో కూడ ఏ శాఖను ఏ మంత్రి నిర్వహించాలో అమెరికా పాలకులు నిర్ణయిస్తారు. తమ ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నారని అనుకున్న మంత్రిని మార్చమని అమెరికా పాలకులు ఆదేశిస్తారు. ఆ ఆదేశం క్షణాల్లో అమలవుతుంది. భారత రక్షణ శాఖ ఎన్ని వేల కోట్ల రూపాయలతో ఏయే ఆయుధాలు కొనాలో అమెరికన్ బహుళజాతిసంస్థలు నిర్ణయిస్తాయి. ఇదంతా కేవలం అధికారంలో ఉన్నవారి దళారీతనం అనుకోవడానికి కూడ వీలు లేదు. ఆ అధికారాన్ని ప్రతిపక్షాలు అడ్డుకుంటాయని అనుకోవడానికి కూడ వీలు లేదు. ఆ ప్రతిపక్ష నాయకులు కూడ అమెరికన్ దౌత్య అధికారులతో నిరంతర సంబంధంలో, స్నేహపూర్వక సంభాషణలలో ఉంటారు. తమ పార్టీలు అధికారికంగా ప్రకటిస్తున్న విధానాలకు భిన్నంగా అమెరికన్ దౌత్యవేత్తలతో మాట్లాడతారు, హామీలు ఇస్తారు. మత భావజాలాన్ని స్థిరంగా అంటిపెట్టుకుని ఉండడం ‘ఎప్పటికెయ్యది అవసరమో’ అన్నట్టు మాత్రమేనని భారతీయ జనతాపార్టీ నాయకులు అమెరికా దౌత్యవేత్త చెవిలో చెపుతారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ప్రవేశం పట్ల తమ వ్యతిరేకత బయట ప్రజల కోసం చేసే ప్రకటన మాత్రమేనని, నిజానికి తాము విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి వ్యతిరేకం కాదని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ప్రధాన కార్యదర్శి అమెరికన్ దౌత్యవేత్తకు సవినయంగా మనవి చేస్తారు. పైగా ఆ దౌత్యవేత్త తన అభిప్రాయంగా మార్క్సిస్టు పార్టీ కార్యదర్శి ఎంత మెత్తని వాడో, ఎంత కార్యసాధకుడో తన సొంత ధృవీకరణ కూడ జతచేస్తాడు. పాలకపక్షం గురించి నిజాలు బయటపడినన్ని రోజులు ఇల్లెక్కి అరిచిన ప్రతిపక్షాలు, తమ గురించి నిజాలు బయటపడగానే వికీలీక్స్ విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నాయి. మొత్తానికి ఆ కేబుల్స్ లో ఉన్నవి నూటికి నూరుపాళ్లు నిజాలు కావనుకున్నా, అవి అమెరికన్ దౌత్యవేత్తల అభిప్రాయాలు మాత్రమేననుకున్నా, వాటిలో పదోవంతు నిజమైనా మన రాజకీయపక్షాలన్నీ అమెరికా పాలకుల దళారులుగా ఉన్నాయనేది స్పష్టమవుతున్నది. నూట పది కోట్ల ప్రజల ఈ ఘనమైన మాతృభూమికి ఏం జరుగుతున్నది? ఇప్పటికైనా మేలుకొని ఈ పిడికెడు మంది దళారీ పాలకవర్గాలను మట్టి కరిపించవలసిన అవసరం లేదా?


సామ్రాజ్యవాదమే అసలు ప్రజాశత్రువు

ప్రపంచ ప్రజలకు సామ్రాజ్యవాదం ఎంత భయంకరమైన, విధ్వంసకరమైన శత్రువుగా ఉన్నదో ఇవాళ జరిగిన, ఇంకా జరుగుతున్న రెండు పరిణామాలు చూపుతున్నాయి. ఒకటి జపాన్ లో భూకంపం అనే ప్రకృతి సహజమైన విపత్తుతో మొదలై, అణు విద్యుత్ కేంద్రాల విస్ఫోటనంతో అపార జననష్టానికీ, సంపద నష్టానికీ దారితీసిన పరిణామం. రెండవది, పొరుగుదేశాలలో ప్రజాస్వామిక ప్రజ్వలనాల ప్రేరణతో సొంతదేశపు నియంతకు వ్యతిరేకంగా లిబియా ప్రజలు ప్రారంభించిన న్యాయమైన ఆందోళనను సామ్రాజ్యవాద సైన్యాలు తమ చేతుల్లోకి తీసుకుని లిబియా సార్వభౌమాధికారం మీద దాడి చేసి వందలాది మంది ప్రజలను, సంపదను భస్మీపటలం చేస్తున్న పరిణామం. జపాన్ లో, తూర్పు ఆసియా ద్వీప సమూహాలలో భూకంపాలు సహజమైనవే కావచ్చు. ఎన్నో శతాబ్దాలుగా అవి నమోదయి ఉండవచ్చు. కాని ఇరవయో శతాబ్ది మధ్య భాగం నుంచీ సామ్రాజ్యవాదం ప్రారంభించిన అణు పరీక్షలు, కొత్త కొత్త అణ్వాయుధ ప్రయోగాలు అక్కడి భూగర్భంలో, భూఖండాల కదలికలలో గణనీయమైన మార్పులు తెచ్చి, ప్రకృతి సహజమైన వాటికన్న మించిన భూకంపాలకు కారణమవుతున్నాయి. అది ఒక ఎత్తయితే, ఆ భూకంపం సునామీకి దారితీసి, ఆ సునామీ వల్ల జపాన్ అల్లకల్లోలమైపోయి, కనీసం రెండు అణువిద్యుత్ కేంద్రాలలో జరిగిన విస్ఫోటన ప్రమాదాలు మరొక ఎత్తు. హిరోషిమా, నాగసాకిలలో కోట్లాది మంది మృత్యువాత పడిన అనుభవం తర్వాత, జపాన్ సమాజం తాను మరెన్నడూ యుద్ధాల జోలికి పోనని ప్రతిజ్ఞ తీసుకుంది. కాని పాలకులు, అంతర్జాతీయ అణువిద్యుత్ బహుళజాతి సంస్థలతో కలిసి జపాన్ ను ఈ పరోక్ష యుద్ధంలోకి నెట్టారు. అణువిద్యుత్ కేంద్రం అంటే పేరుకు పౌర విద్యుదుత్పాదనలో ఉన్నప్పటికీ, అది తయారు చేసే వ్యర్థపదార్థాలు అణ్వాయుధాల తయారీకి తప్ప మరెందుకూ పనికి రావు. ఆ వ్యర్థపదార్థాలను నాశనం చేయడం సాధ్యం కాదు, నిలువ ఉంచడం మంచిది కాదు. అలా కుప్పలుగా పోగుపడిన వ్యర్థపదార్థాలను ఇవాళ సునామీ జలాలు భూగోళమంతా విస్తరిస్తున్నాయి. ఈలోగా ఆ అణువిద్యుత్ కేంద్రాలలో సంభవించిన పేలుళ్ల వల్ల అణుధార్మికత గాలిలో వ్యాపిస్తోంది. అరవై ఏళ్ల కిందటి హిరోషిమా నాగసాకి అణుధార్మికత ప్రభావం వల్ల ఇప్పటికీ అనారోగ్యం పాలవుతున్న జపాన్ సమాజం మరొక కొత్త ముప్పును ఎదుర్కుంటున్నది. మరొకపక్క, అరబ్ ప్రపంచంలో నియంతల దుష్పరిపాలనకు వ్యతిరేకంగా వెల్లువెత్తిన ప్రజాగ్రహాన్ని పక్కదారి పట్టించడం కోసం సామ్రాజ్యవాదులు చేస్తున్న ప్రయత్నాలకు ఊతంగా దొరికింది లిబియా. అధ్యక్షుడు మహమ్మద్ గడాఫీ అమెరికా పాలకులను వ్యతిరేకిస్తున్నవాడే అయినప్పటికీ, కనీసం ముప్పై సంవత్సరాలుగా చిత్తశుద్ధితోనో, మూర్ఖత్వంతోనో సామ్రాజ్యవాద విధానాలను ఎదుర్కొంటున్నప్పటికీ దేశంలో ప్రజల మీద మాత్రం దుర్మార్గమైన నిరంకుశ పాలననే నడుపుతున్నాడు. పొరుగుదేశాలలో మొదలయిన ప్రజాస్వామిక ఆందోళనలతో ప్రోత్సాహం పొందిన లిబియన్లు ఇదే అదనుగా గడాఫీ వ్యతిరేక పోరాటాన్ని ఉధృతం చేశారు. గతంలో ఇటాలియన్ పాలకులకు వ్యతిరేకంగా ఒమర్ ముఖ్తార్ పోరాటం నడిపిన ప్రాంతాలన్నీ ఇప్పుడు మళ్లీ ప్రభుత్వ వ్యతిరేకతకు చిహ్నాలుగా నిలిచాయి. ఈ అవకాశం చూసుకుని, గడాఫీ మీద దాడి చేయడానికి ఐక్య రాజ్య సమితితో తీర్మానం చేయించిన అమెరికా నాయకత్వాన సైనిక దాడులు సాగుతున్నాయి. లిబియా ప్రజల న్యాయమైన పోరాటాలను సంపూర్ణంగా సమర్థిస్తూనే, లిబియా మీద ఈ సామ్రాజ్యవాద దాడులను ఖండించవలసి ఉంది. ఈ రెండు పరిణామాల నుంచీ సామ్రాజ్యవాద దుర్మార్గాన్ని అర్థం చేసుకోవలసి ఉంది.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Telugu, Veekshanam. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s