ఈ భూమి మే 2011 సంచిక కోసం
ఏప్రిల్ మొదటివారంలో దేశ రాజధాని ఢిల్లీలో సాధారణంగా ప్రజా నిరసన ప్రదర్శనలు జరిగే జంతర్ మంతర్ దగ్గర ఒక చరిత్రాత్మక సన్నివేశం ప్రారంభమైంది. ఆ సన్నివేశానికి ప్రతిస్పందనగా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంఘీభావం ప్రకటితమైంది. దేశ రాజకీయాలను ఒక కుదుపు కుదపగలంత శక్తివంతమైన ఈ పరిణామం నాలుగో రోజుకే “విజయం” సాధించాననుకుని చప్పబడి క్రమక్రమంగా అధికారిక చిక్కుముడులలోకి, వ్యక్తిగత వివాదాలలోకి జారిపోయింది. ఈ సన్నివేశం ఇవాళ దేశంలో, దేశ రాజకీయాలలో నెలకొని ఉన్న దుస్థితికీ, గందరగోళానికీ, ఆలోచనాపరులలో కూడ ఉన్న అస్పష్టతకూ అద్దం పడుతోంది. ప్రజల అవినీతి ఆకాంక్షల ప్రతిఫలనంగా, సూచికగా గొప్ప ఆశను రేకెత్తించిన ఈ పరిణామమే, మరొకవైపు ఆ ఆశలనూ, ఆకాంక్షలనూ ఎలా పక్కదారి పట్టించవచ్చునో చూపించింది. అనవసరమైన విషయాలను ముందుకు తెచ్చి అత్యవసరమైన విషయాలమీద మేలి ముసుగులు ఎలా కప్పవచ్చునో చూపించింది. ప్రజాజీవితంలో అత్యంత నిజాయితీపరులుగా పేరుపడినవారి మీద కూడ ఎలా బురద చల్లవచ్చునో, అత్యంత దుర్మార్గులుగా పేరుపడినవారిని కూడ ఏదో ఒక కారణంతో ఎలా సమర్థించవచ్చునో కూడ ఈ సన్నివేశం చూపింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సన్నివేశం దేశంలో ఇవాళ రాజుకుంటున్న నిప్పుకు నిదర్శనంగా ఉంది. ఆ నిప్పుమీద వేరువేరు పేర్లతో నీళ్లు చల్లుతున్న పాలకవర్గ కౌటిల్యానికి నిదర్శనంగానూ ఉంది.
ఈ సన్నివేశానికి ఉన్న సంక్లిష్టతను, బహుముఖ అంతరార్థాలను సంపూర్ణంగా అర్థం చేసుకుంటే గాని అత్యంత సానుకూలమైన, ప్రజానుకూలమైన అంశాలూ, అత్యంత ప్రతికూలమైన, ప్రజావ్యతిరేకమైన, ప్రజలను మోసం చేసే అంశాలూ ఏకకాలంలో దానిలోకి ఎలా వచ్చి చేరాయో తెలుసుకోలేం.
ఈ దేశంలో అవినీతి కథ ఎన్ని శతాబ్దాల కింద మొదలయిందో ఎవరూ చెప్పలేరు. రామాయణ, మహాభారతాల్లోనూ, జాతక కథల్లోనూ, కౌటిల్యుని అర్థశాస్త్రం, కల్హణుడి రాజతరంగిణి, మనుస్మృతి వంటి గ్రంథాల్లోనూ అవినీతి ప్రస్తావనలున్నాయి. అప్పటినుంచి ఇప్పటిదాకా సాగిన అన్ని పాలనల కిందా అవినీతి ఏదో ఒక స్థాయిలో ఉంటూనే ఉంది. సమష్టి శ్రేయస్సుకోసం చేతికి అందిన అధికారాన్ని, అవకాశాలను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడడం, సమాజ శ్రేయస్సుకు భిన్నంగా వ్యక్తిగత ఆస్తి పోగు చేసుకోవడం, బాధ్యత, జవాబుదారీతనం లేని అధికారం, ఇతరుల ఉపాధిని, జీవితాలను ధ్వంసం చేసేలా వారి వనరులను తమ హక్కుభుక్తం చేసుకోవడం అనే అర్థంలో అవినీతి అన్ని అధికార వ్యవస్థలలోనూ ఏదో ఒక స్థాయిలో ఉంది. ఎక్కడైనా ఒకరిద్దరు వ్యక్తులు వారి విలువల వల్ల భిన్నమైన ఆచరణలో ఉన్నారేమో గాని మొత్తంగా అన్నిరకాల అధికార వ్యవస్థల సాధారణ స్వభావం ఇటువంటి అవినీతే.
అలా అధికార వ్యవస్థలను ఆక్రమించిన అవినీతి అక్కడినుంచి సామాజిక వ్యవస్థలలోకీ సంస్కృతిలోకీ ప్రవహించి మన సామాజిక జీవనాన్నే కలుషితం చేసేసింది. ‘తెలుగునాట భక్తిరసం తెప్పలుగా పారుతోంది, డ్రైనేజీ స్కీము లేక డేంజరుగా మారుతోంది’ అన్న గజ్జెల మల్లారెడ్డి మాటల్లో తెలుగునాట బదులు దేశమంతా అనీ, భక్తిరసం బదులు అవినీతి అనీ మార్చుకుంటే ఇవాళ్టి స్థితి సరిగ్గా అర్థమవుతుంది.
ఈ అవినీతి బ్రిటిష్ వలసవాదం నుంచి అధికారమార్పిడి జరిగిన తర్వాత మరింత ఎక్కువయింది. ఆనాటి స్వాతంత్ర్యోద్యమ, జాతీయోద్యమ, నవభారత స్వప్నాలు కూడ మన నాయకుల అవినీతిని, లేదా అవినీతి పట్ల ఉపేక్షను అడ్డుకోలేకపోయాయి. ఇందుకు జవహర్ లాల్ నెహ్రూ, వి కె కృష్ణ మీనన్, టి టి కృష్ణమాచారి, జగ్జీవన్ రామ్ లాంటి మహా నాయకులే మినహాయింపు కానప్పుడు ఇవాళ్టి మరుగుజ్జు నాయకుల గురించి మాట్లాడనవసరం లేదు. ఇక ఆ తర్వాత జరిగిన చరిత్రలో ఇందిరాగాంధీ హయాంలోని నగర్వాలా కుంభకోణం, రాజీవ్ గాంధీ స్వయంగా పాలుపంచుకున్న బోఫోర్స్ కుంభకోణం అందరికీ తెలిసినవే. పి వి నరసింహారావు హయాంలో నోటుకు వోటు కుంభకోణం మాత్రమే కాక బహుళజాతి సంస్థల మార్కెట్ల కోసం, వారి ముడి సరుకుల అవసరాల కోసం దేశాన్ని బార్లా తెరవడమే ఒక పెద్ద కుంభకోణం. హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ కుంభకోణంలోనూ, సుఖ్ రాం టెలికాం మంత్రిత్వశాఖ కుంభకోణంలోనూ ఇవి బహిరంగమయ్యాయి. ఈ ప్రపంచీకరణ కుంభకోణంలో ఆ తర్వాత గడిచిన ఇరవై సంవత్సరాలలో వచ్చిన ప్రతి ప్రభుత్వమూ తనవంతు చేర్చింది గాని, ఆ అవినీతి దిగజారుడును అడ్డుకోవడానికి ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు.
ప్రపంచీకరణ విధానాల తర్వాత దేశంలో అవినీతి వనరులు, మార్గాలు, అవకాశాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ దేశపు ఖనిజ నిలువలు, సహజ వనరులు అవసరమైన బహుళ జాతి సంస్థలు ఆ వనరులను తమకు అప్పనంగా అందించే విధానాలు తయారు చేసిన మంత్రులకు, అధికారులకు ముడుపులు ఇస్తాయి. ఈ దేశపు సువిశాల మార్కెట్ లో పది శాతమో, ఐదు శాతమో ఆక్రమించగలిగినా వందల కోట్ల డాలర్ల లాభం చేసుకోగలమని ఆశ ఉన్న బహుళ జాతి సంస్థలు ఆయా సరుకుల, సేవల మార్కెట్లలోకి తమ ప్రవేశానికి వీలు కలిగించే విధానాల రూపకర్తలకు లంచాలు ముట్టజెపుతాయి. అలా మారుమూల ప్రాంతాల రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు ఎన్నడూ లేని విధంగా కొత్త లంచాల అవకాశాలను, మార్గాలను చూడడం మొదలుపెట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థలోకి ఇలా మురుగునీటి ప్రవాహంలాగ విపరీతంగా వచ్చిపడిన డబ్బు బహుళ జాతి సంస్థల దళారీలనూ పెంచింది, నిర్ణయాధికారం ఉండే రాజకీయ నాయకులనూ వందల, వేల కోట్ల రూపాయల ఆస్తిపరులను చేసింది. అలా రాజకీయం, వ్యాపారం, మాఫియా కలగలసిన ఒక నేరసామ్రాజ్యం నేరుగా పాలనాధికారంలోకి వచ్చింది. ఆ అవినీతి మహా సముద్రం మీద బయటకు తేలిన రెండు మూడు తిప్పలు కామన్ వెల్త్ క్రీడలు, ఆదర్శ్ హౌజింగ్ సొసైటీ, 2జి స్పెక్ట్రం అమ్మకాలు.
అప్పటిదాకా అవినీతిని చూసీ చూడనట్టు సాగిపోతున్న మధ్యతరగతి హఠాత్తుగా అవినీతి ఇప్పుడే ప్రారంభమైనట్టు గగ్గోలు పెట్టడం ప్రారంభించింది. ఈ అవినీతిని రద్దు చేయవలసిందే అని నినదించడం మొదలుపెట్టింది. 1947 నుంచీ జరుగుతున్న అవినీతిని, వ్యవస్థలో సాగుతున్న దోపిడీ, పీడనలలోని అవినీతిని, ప్రపంచీకరణ క్రమంలో పెరిగిపోయిన అవినీతిని, కార్పొరేట్ ప్రపంచపు అవినీతిమయ పెట్టుబడిదారీ నేరసామ్రాజ్యాలను చాల సులువుగా మరచిపోయి, రాజకీయ అవినీతి మీద మాత్రమే కేంద్రీకరించడం మొదలుపెట్టింది. కొందరు రాజకీయ నాయకుల అవినీతి వల్లనే మొత్తం అవినీతి సాగుతున్నదన్నట్టు, వారిని కట్టడి చేసే, విచారించే, శిక్షలు విధించే పకడ్బందీ చట్టాలు ఉంటే అవినీతి సమసిపోతుందన్నట్టు అమాయక ప్రకటనలు చేయడం మొదలు పెట్టింది.
సరిగ్గా ఇదే సమయంలో టునీషియాలో, ఈజిప్ట్ లో, పశ్చిమాసియా దేశాలలో ప్రభుత్వాల మీద లక్షలాది మంది ప్రజల తిరుగుబాటుల వెల్లువ ప్రారంభమయింది. ఆ ప్రజావెల్లువలలో ఎక్కువగా ఆయా దేశాధిపతుల నిరంకుశత్వం మీద ఎక్కుపెట్టినవే అయినా, అవినీతి, కుంభకోణాలు, విదేశాల్లో సంపద పోగు చేసుకోవడం, ప్రజల ఆర్థిక స్థితిలో తీవ్రమైన అసమానతలు, నిరుద్యోగం వంటి సమస్యలు కూడ వినిపించాయి. భారతదేశంలో కూడ అవే సమస్యలు ఉన్నాయని, అవకాశం వస్తే ఇక్కడ కూడ అటువంటి ప్రజా వెల్లువలు జరగవచ్చునని కొంతమంది పత్రికారచయితలు, విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ఔట్ లుక్ వారపత్రిక సంపాదకులు వినోద్ మెహతా ఈజిప్ట్ రాజధాని కైరోలో తహ్రీర్ స్క్వేర్ లో లక్షలాది మందితో జరిగిన ప్రజాప్రదర్శనల గురించి రాస్తూ, భారతదేశంలో అంతకన్న ఘోరమైన పరిస్థితులున్నాయని, వాటిని నిరసిస్తూ రాజధానిలో జంతర్ మంతర్ దగ్గర రెండు లక్షల మంది ప్రదర్శన ప్రారంభిస్తే ఏం జరుగుతుందని వ్యాఖ్యానించారు. “వెలిగిపోతున్న భారతదేశం తాను బతుకుతున్న నేలమీద వీథుల్లో వ్యక్తమవుతున్న ఘర్షణలను పట్టించుకోనవసరం లేదేమో. కాని, నిద్రమత్తు వదలకపోతే అరబ్ పరిస్థితి మన దేశాన్నీ చాల వేగంగా కమ్ముకొస్తుంది. రెండు లక్షలమంది పౌరులు జంతర్ మంతర్ లోకి కవాతుగా వచ్చి, పాలకుల మార్పు, తమ సమస్యల తక్షణ పరిష్కారం అనే డిమాండ్ చేస్తే భారత పాలకవర్గాలు ఎలా స్పందిస్తాయో?” అని ఆయన రాశారు.
సరిగ్గా ఆ ఊహకు ప్రతిస్పందనా అన్నట్టుగా ఏప్రిల్ 5 నుంచి నాలుగు రోజుల పాటు జంతర్ మంతర్ దగ్గర కొన్ని వేల మందితో ప్రదర్శన జరిగింది. దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ఈ ప్రదర్శనకు తమ తమ ప్రాంతాలలో సంఘీభావం ప్రదర్శించారు. తహ్రీర్ స్క్వేర్ ప్రదర్శన, జంతర్ మంతర్ ప్రదర్శన ఒకేలాంటివి కావు, ఒకే లక్ష్యంతో జరిగినవి కావు, ఒకేరకమైన ఫలితాలు సాధించినవీ కావు. కాని పోలికలున్నాయి.
జంతర్ మంతర్ ప్రజా ప్రదర్శనకు, కామన్ వెల్త్ క్రీడల, ఆదర్శ్ హౌజింగ్ సొసైటీ, 2జి స్పెక్ట్రం అమ్మకాల కుంభకోణాలు మాత్రమే కాక మరి కొంత పూర్వరంగం కూడ ఉంది. అది అత్యున్నత అధికార పీఠాలలో జరిగే అవినీతిని అడ్డుకోవడం, విచారణ జరపడం, శిక్షలు విధించడం, అటువంటి అవినీతి పునరావృతం కాకుండా చూడడం ఎలా అనే ఆలోచన. ఈ పనులన్నీ ఒక చట్టం ద్వారా సాధ్యమవుతాయనే ఆలోచన. ప్రధానమంత్రితో సహా రాజకీయ నాయకులందరినీ కూడ విచారించగల, శిక్షించగల ఒక స్వతంత్ర వ్యవస్థకు రూపకల్పన చేయాలనే ఆలోచన ఆ చట్టానికి ప్రాతిపదిక.
అటువంటి చట్టాన్ని తేవాలనే ప్రయత్నం దేశంలో 1968 నుంచీ జరుగుతోంది. ఏడురాష్ట్రాల ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోయి, మొదటిసారి కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడిన 1967 ఎన్నికల తర్వాత, కాంగ్రెస్ లో చీలికలు రావడం మొదలైన తర్వాత, ఇంటా బయటా ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు ఇందిరాగాంధీ చూపిన ప్రగతిశీల ముఖంలో భాగం ఈ లోక్ పాల్ ఆలోచన. గరీబీ హటావో, రోటీ కపడా ఔర్ మకాన్, భూసంస్కరణలు, బ్యాంకుల జాతీయకరణ, గుత్తాధిపత్య సంస్థల నియంత్రణ వంటి అనేక “ప్రగతిశీల” చర్యలలో భాగమే అది. ఆ వ్యక్తీకరణల్లో ఒకటే రాజకీయ నాయకత్వాన్ని కూడ అవినీతి వ్యతిరేక చట్టపరిధిలోకి తీసుకురాదలచిన లోక్ పాల్ బిల్లు.
కాని కాంగ్రెసేతర రాజకీయ నాయకులను, తనను వ్యతిరేకించే కాంగ్రెస్ రాజకీయ నాయకులను ఇబ్బందులపాలు చేసేందుకు మాత్రమే ఇందిరా గాంధీ ఈ లోక్ పాల్ వ్యవస్థను సృష్టిస్తున్నదని సకారణంగానే అనుమానించిన ప్రతిపక్షాలు, కాంగ్రెస్ లోని ఇందిర వ్యతిరేక వర్గాలు ఆ చట్ట ప్రతిపాదనను అడ్డుకున్నాయి. అప్పటినుంచి గడిచిన నలభై సంవత్సరాలలో అరడజనుసార్లు పునరుత్థానం చెందబోయి, ఆగిపోయిన ఆ బిల్లును ఇప్పుడు యుపిఎ ప్రభుత్వం ఇటీవలి భారీ కుంభకోణాల నేపథ్యంలో బయటికి తీసి దుమ్ము దులిపింది. కాని రాజకీయ ఆర్థిక ప్రయోజనాలను అనుసరించి ఆ బిల్లును అవకతవకలమయంగా తయారు చేసింది.
ఈ బిల్లు తయారీ లోపభూయిష్టంగా ఉన్నదని, దాన్ని మార్చకపోతే, మార్చడంలో పౌరసమాజ ప్రతినిధులకు స్థానం కల్పించకపోతే ఆమరణ నిరాహారదీక్షకు దిగుతానని మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్ధి లో తన ప్రత్యామ్నాయ గ్రామీణాభివృద్ధి నమూనా ద్వారా ప్రముఖుడైన ప్రముఖ గాంధేయవాది అన్నా హజారే ఫిబ్రవరి 26న ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. జన లోక్ పాల్ బిల్లు అని ఒక ప్రత్యామ్నాయ బిల్లు ముసాయిదా కూడ రాసుకుని, ఇండియా అగెనెస్ట్ కరప్షన్ సహచరులతో కలిసి అన్నాహజారే మార్చ్ 7 న ప్రధాని డా. మన్మోహన్ సింగ్ ను కలిశారు. ప్రధాని వారి ఆందోళనలను అర్థం చేసుకుంటున్నానని అంటూ, వారితో సంప్రదింపులు జరపడానికి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. ఈ రెండు బృందాల మధ్య మూడు వారాలపాటు చర్చలు జరిగాయి గాని అంగీకారం కుదరలేదు. బిల్లు తయారు చేసేపనిలో ప్రభుత్వ ప్రతినిధులు, పౌరసమాజ ప్రతినిధులు చెరి సగం ఉండాలని అన్నా హజారే పట్టుబట్టారు. చివరికి అన్నాహజారే హెచ్చరించిన ఏప్రిల్ 4 నాటికి కూడ ప్రభుత్వం దిగిరాలేదు సరిగదా, అన్నాహజారే మొండి పట్టుతో ఉన్నారని, అన్నాహజారే పట్ల వ్యక్తిగానూ, ఆయన ఆశయం పట్లా తమకు గౌరవం ఉన్నదని ప్రధానమంత్రి కార్యాలయం ఏప్రిల్ 4న ప్రకటించింది.
ఆ మర్నాడు ఏప్రిల్ 5న అన్నా హజారే 300 మంది స్వచ్చంద కార్యకర్తలతో కలిసి జంతర్ మంతర్ దగ్గర నిరాహారదీక్ష ప్రారంభించారు. ఏప్రిల్ 6 నాటికి దేశంలోని ప్రధాన నగరాలన్నిటిలో అన్నాహజారే దీక్షకు మద్దతుగా దీక్షలు, ప్రదర్శనలు మొదలయ్యాయి. మంత్రివర్గ ఉపసంఘంలో శరద్ పవార్ వంటి అవినీతి మయ మంత్రి ఉండడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నాహజారే చేసిన వ్యంగ్య వ్యాఖ్యకు ప్రతిస్పందనగా శరద్ పవార్ ఏప్రిల్ 6న ఉపసంఘం నుంచి వైదొలిగారు. అటూ ఇటూ చాల చర్చలు జరిగిన తర్వాత ఏప్రిల్ 7 సాయంత్రం స్వయంగా సోనియా గాంధీ దీక్ష విరమించవలసిందిగా అన్నాహజారేకు విజ్ఞప్తి చేశారు. మళ్లీ చర్చలు జరిగిన తర్వాత ఏప్రిల్ 8 సాయంత్రానికి ఇండియా అగెనెస్ట్ కరప్షన్ సంస్థ ఒకమెట్టు దిగి, ప్రభుత్వం ఒక మెట్టు దిగి రాజీకి వచ్చారు. ప్రభుత్వం తరఫున ప్రణబ్ ముఖర్జీ, పౌరసమాజం తరఫున శాంతి భూషణ్ సహ అధ్యక్షులుగా బిల్లు రచనా కమిటీ ఏర్పడేట్టు, దానిలో రెండు వైపులనుంచీ చెరి సగం సభ్యులు ఉండేట్టు ఒప్పందం కుదిరింది. అందుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు ఏప్రిల్ 9 ఉదయం తన చేతికి అందిన తర్వాతనే అన్నా హజారే తన దీక్ష విరమించారు. అంటే దాదాపు తొంబై గంటల సమయంలోనే ఇంతటి మహత్తరమైన ఆకాంక్ష పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించేలా అన్నా హజారే దీక్ష పని చేసిందన్నమాట.
కొత్తగా ఏర్పడిన లోక్ పాల్ బిల్లు రచనా కమిటీలో ఇద్దరు అధ్యక్షులు కాక ప్రభుత్వం తరఫున మంత్రులు వీరప్ప మొయిలీ, పి. చిదంబరం, కపిల్ సిబాల్, సల్మాన్ ఖుర్షీద్, పౌరసమాజం తరఫున అన్నా హజారే, జస్టిస్ సంతోష్ హెగ్డే, ప్రశాంత్ భూషణ్, అరవింద్ కేజ్రీవాల్ ఉంటారు. ఈ కమిటీ ఏప్రిల్ 16 న తొలిసారిగా సమావేశమై బిల్లు రచనా ప్రక్రియ ప్రారంభించింది. రానున్న లోక సభ సమావేశాల నాటికి బిల్లు ముసాయిదా పూర్తి కావాలని ఆశిస్తున్నారు.
ఆ తర్వాత అన్నాహజారే మీద, శాంతి భూషణ్ మీద, ప్రశాంత భూషణ్ మీద కాంగ్రెస్ ప్రతినిధులుగాని, సమాజ్ వాది పార్టీ నేత అమర్ సింగ్ గాని చేసిన వ్యాఖ్యలు, వాద వివాదాలు ఎలా ఉన్నా ఈ మొత్తం సన్నివేశంలోని అనుకూల అంశాలను, ప్రతికూల అంశాలను గుర్తించవలసి ఉంది. లేకపోతే ఇది అవినీతి వ్యతిరేక ఆకాంక్షలకు పూర్తి విజయమనే భ్రమాజనిత ఆనందానికో, ఇది పూర్తిగా పనికిమాలినదనే నిరాశావాదానికో బలి అయిపోవలసి వస్తుంది.
అవినీతికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ప్రజలలో ఉన్న ఆకాంక్షలను పెద్ద ఎత్తున ప్రతిఫలించగలగడం, ఒక సామాజిక సమస్యకు అపూర్వ స్థాయిలో దేశవ్యాపిత సంఘీభావం సాధించడం, చాలకాలంగా ఎటువంటి ఆదర్శవాదానికీ, విలువలకూ సిద్ధంగాలేని పట్టణ మధ్యతరగతి వీథుల్లోకి వచ్చి దీక్షలకో, కొవ్వొత్తుల ప్రదర్శనకో దిగడం, నాలుగు రోజుల నిరాహారదీక్షకే ప్రభుత్వం దిగివచ్చి, ఆందోళనకారుల డిమాండ్లు అంగీకరించడం, చట్టతయారీలో మంత్రులు, ప్రజాప్రతినిధులతో పాటు పౌరసమాజ ప్రతినిధులను భాగస్వాములను చేయడం, ఎన్నికల రాజకీయాలను విమర్శించడం వంటి అనుకూల అంశాలు కొన్ని ఈ ఉదంతంలో బయటపడ్డాయి.
అయితే పైకి చూడడానికి అనుకూల అంశాలుగా కనబడుతున్నప్పటికీ వీటిలో కూడ కొన్ని సమస్యలున్నాయి. దేశ ప్రజలలో అవినీతి పట్ల వ్యతిరేకత పెద్దఎత్తున ఉన్నదనీ, అది ఇప్పుడు వ్యక్తమయిందనీ అనడంలో ఎవరికీ సందేహం లేదు. ఈ అవినీతి జరగకపోతే దేశాభివృద్ధి జరిగి, ప్రజలకు “సుజలాం, సుఫలాం, సస్యశ్యామలాం” అయిన దేశం దొరికి ఉండేదని భావించే వాళ్లనుంచి, జరుగుతున్న అవినీతిలో తమకు రావలసినంత వాటా రావడం లేదనే ఫిర్యాదు ఉన్న వాళ్ల వరకూ, ఎంత కఠిన చర్యలు తీసుకుని అయినా అవినీతిని అరికట్టవలసిందే అనేవాళ్ల నుంచి, అవినీతిని అరికట్టడం అసాధ్యమనీ, దాన్ని భరించగలిగిన స్థాయికి తెచ్చి చట్టబద్ధం చేయాలనీ అనే వాళ్లవరకూ అవినీతి వ్యతిరేక ఆలోచనలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. అందువల్ల అనేక రకాల ప్రజలు ఈ అవినీతి వ్యతిరేక ఆందోళనలో పాల్గొని ఉంటారు.
ఇన్నిరకాల ఆలోచనలు ఉన్నాయంటేనే అవినీతి గురించి తెలియవలసిన విషయాలు తెలియవలసిన పద్ధతిలో తెలియడం లేదని అర్థం. బస్సు కండక్టర్ చిల్లర లేదని పదిపైసలో, పావలానో మిగుల్చుకోవడం, పెట్రోలు బంకులో ఒకపాయింటో, రెండు పాయింట్లో తక్కువ కొట్టడం, ప్రభుత్వ కార్యాలయంలో, ఆస్పత్రిలో పదిరూపాయల నుంచి వందరూపాయల వరకు ముడుపు అడగడం మధ్యతరగతికి కళ్లముందర కనబడి అనుభవంలోకి వస్తున్నది గనుక వారికి అవినీతి అనగానే అదే కనబడుతుంది. కాని ఒక లైసెన్స్ విధానాన్ని మార్చడం ద్వారా టెలికాం మంత్రి ప్రభుత్వ ఖజానాకు పొడిచిన ఒక లక్షా డెబ్బై ఆరువేల కోట్ల రూపాయల చిల్లు, కుటుంబ సభ్యులు మంత్రులో, ముఖ్యమంత్రులో కావడాన్ని చూపి, బడా పెట్టుబడిదారులకు సెజ్ ల పేరుమీద భూములు, లైసెన్సులు అప్పగించి వేలాది కోట్ల రూపాయలు పోగేసుకోవడం వంటి వాటితో పోలిస్తే వంద కోట్ల మంది కండక్టర్లు, గుమస్తాలు, అటెండర్లు, పెట్రోల్ బాయ్స్ కలిసి కూడ అంత అవినీతి చేయలేరు. సాధారణంగా మధ్యతరగతికి ఈ అధికారపీఠాల అవినీతి కనబడనూ కనబడదు. కనబడినా దాన్ని ఎదిరించే ధైర్యమూ ఉండదు. ఆ ఎదిరించే పని ఏదో లోక్ పాల్ వ్యవస్థ అనేది చేస్తుందట, ఆ వ్యవస్థను ఈ హజారే అన్న పెద్దమనిషి తీసుకొస్తున్నాడట. మనం ఒకరోజు కొవ్వొత్తి పట్టుకుని నిలబడితే చాలు, అదంతా చూమంతర్ అని జరిగిపోతుందట అనుకుని ప్రదర్శనల్లో పాల్గొన్నవాళ్లే ఎక్కువ. వారిలోని అవినీతి వ్యతిరేక ఆకాంక్షలను సంపూర్ణంగా గౌరవిస్తూనే, ఇవాళ దేశంలో జడలు విప్పిన మహమ్మారి అవినీతిని ఎదిరించడానికి ఈ అమాయకత్వం సరిపోదని చెప్పవలసి ఉంది.
ఇక నాలుగురోజుల్లోనే ప్రభుత్వం దిగివచ్చి ఆందోళనకారుల డిమాండ్లను అంగీకరించడం కుట్ర అనేవాళ్ల నుంచి, ఇదంతా నాటకం అనేవాళ్ల వరకు అనేక మంది విమర్శకులున్నారు. మణిపూర్ లో వేలాది మంది యువకులను చంపిన, వందలాది మంది మహిళలపై అత్యాచారం చేసిన, భయంకరమైన దమననీతి సాగించడానికి అవకాశం ఇచ్చిన సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయమని కోరుతూ ఇరామ్ షర్మిలా గత పది సంవత్సరాలుగా నిరాహార దీక్ష చేస్తున్నది. దేశ వ్యాప్తంగా మరెన్నో నిజమైన, తీవ్రమైన సమస్యల మీద వ్యక్తులు, ప్రజాసమూహాలు, ప్రజాసంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. నిరాహార దీక్షలు చేస్తున్నాయి. ఈ సందర్భాలలో తనకూ మానవత్వం ఉన్నదని, సున్నితమైన స్పందనలు ఉన్నాయని, మానవ వేదనకు తాను సానుభూతి తెలిపి పరిష్కారమార్గాలు ఆలోచించగలనని ఏ ఒక్క సందర్భంలోనూ చూపని ప్రభుత్వం అన్నా హజారే దీక్ష విషయంలో మాత్రం తొంబై గంటలలోనే ఎలా దిగివచ్చిందనేది నిజంగా ప్రశ్నే.
కాగా ఇంత తీవ్రమైన సామాజిక సమస్య మీద జరుగుతున్న ప్రజాందోళనను రాజకీయాలనుంచి దూరంగా ఉంచడమే తన లక్ష్యం అనడం, పేరుమోసిన అవినీతిపరులు కూడ ఈ అవినీతి వ్యతిరేక బృందగానంలో చేరుతుంటే మౌనంగా ఉండడం, చట్టం ద్వారా మార్పు సాధ్యమేనని, అవినీతిని తొలగించవచ్చునని భ్రమలు పెంచడం, వ్యవస్థ విశ్వసనీయత పట్ల పోతున్న నమ్మకాలను పునరుద్ధరించడం, అసలైన అవినీతి మూలాలను ప్రశ్నించకపోవడం, మతోన్మాద, ప్రజావ్యతిరేక రాజకీయాలకు మద్దతు ఇస్తూ, మరొకపక్క రాజకీయాల పట్ల ఏవగింపు కలిగించడం లాంటి ప్రతికూల అంశాలు కూడ ఈ ఉద్యమంలో ఉన్నాయి.
రాజకీయాల పట్ల ప్రజలలో నెలకొన్న చిన్నచూపు, అవిశ్వాసం వల్ల రాజకీయాలు వద్దు అనే మాటకు చప్పట్లు వినిపించవచ్చు. రాజకీయాలు ఇవాళ కొనసాగుతున్న పద్ధతి తప్పు, రాజకీయాలే తప్పు కాదు. ఇవాళ్టి రాజకీయాలు నిజమైన రాజకీయాలు కాదని, నిజమైన రాజకీయాలంటే ప్రజా సమస్యలకు సృజనాత్మకమైన పరిష్కారాలు వెతికే ప్రక్రియ అని, అటువంటి రాజకీయాల ఆవిష్కరణ కోసమే ఈ ఆందోళన అని చెప్పవలసిన బాధ్యత అన్నా హజారే వంటి సామాజిక కార్యకర్తలదే. రాజకీయేతర సంస్థలను నిర్మించడం ద్వారా వారు మరింత నిరంకుశ, జవాబుదారీ తనం లేని నిర్మాణాలనే సాధించగలుగుతారు. ఒకవైపు రాజకీయ వాదులను తనదగ్గరికి రానివ్వనని అంటూనే గుజరాత్ మారణకాండకు ప్రధానబాధ్యుడు, ప్రధానంగా మతతత్వ రాజకీయవేత్త అయిన నరేంద్ర మోడీని ప్రశంసించడం, ఇన్నాళ్లూ రాజకీయాలకు దూరంగా ఆధ్యాత్మిక, యోగ శిక్షణలో ఉండి ఇప్పుడు రాజకీయ రంగప్రవేశం చేస్తున్న బాబా రాందేవ్ ను చేరదీయడం అన్నా హజారే అనుసరించదలచుకున్న రాజకీయాలేమిటో చెప్పకనే చెపుతున్నాయి.
ఇంతకన్న ఇంకా తీవ్రమైన సమస్య, ఆయనకు ఢిల్లీలోనూ, దేశ వ్యాప్తంగానూ మద్దతు తెలిపినవారిలో, ఆయన కూడ సాదరంగా మద్దతును స్వీకరించిన వారిలో పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, మాజీ అధికారులు ఎందరో ఉన్నారు. వారి పనులలో ఏ ఒక్కటీ అవినీతి రహితంగా జరిగినవి కావు. పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు తమ సామ్రాజ్యాలను అవినీతి పునాదులపైనే నిర్మించారు. ఆ మాజీ అధికారులందరూ తమ అధికారకాలంలో అవినీతికర వ్యాపారాలకు, రాజకీయాలకు మద్దతు ఇచ్చారు. ఈ సమర్థకులలో ఒకరైతే ఈ దేశంలో బ్యాంకింగ్ సంస్కరణల నివేదికలు రాసి, ప్రజాధనం లక్షల కోట్ల రూపాయలు దేశం బైటికి తరలి పోవడానికి కారణమయ్యారు. ఇంకా ఘోరంగా దీక్ష సందర్భంగా అన్నా హజారేకు పూలదండ వేసిన ఒక వ్యక్తి పది వేళ్లకు పది ఉంగరాలు, మెడలోనుంచి కనీసం డజను గొలుసులు వేలాడుతూ కనిపించాడు. అదంతా అవినీతి రహిత సంపాదనే అంటే నమ్మశక్యం కాదు.
ఈ వ్యవస్థ కొనసాగుతున్నదే దోపిడీ పీడనల పునాది మీద. పిడికెడు మంది అధికారం కోసం, అనుభవం కోసం కోట్లాది మంది ఆరుగాలం శ్రమిస్తున్న రాజకీయార్థిక పునాది అది. ఈ పునాదిని ఇంకా విస్తరించినది ప్రపంచీకరణ క్రమం. అవినీతికి నిజమైన మూలాలు ఈ సామాజిక, రాజకీయార్థిక విధానాలలో ఉన్నాయి. వాటి ప్రస్తావనైనా లేకుండా అవినీతి వ్యతిరేక ఆందోళన ఎక్కడ ప్రారంభమై ఎక్కడికి చేరుతుంది?
ఇవన్నీ పెద్ద, వ్యవస్థాగత అంశాలు, వాటితో మాకు నిమిత్తం లేదు, మా పని కేవలం అధికారపీఠాలలో అవినీతిని విచారించగల లోక్ పాల్ వ్యవస్థను తయారు చేయడమే అని వాదన రావచ్చు. ఇది చాల అమాయకమైన వాదన. చట్టాన్ని ఎంత పకడ్బందీగా తయారు చేసినా, దాన్ని అమలు చేయడంలో లోపాలుంటాయి. దాన్ని అమలు చేయవలసిన వాళ్లు సరిగా అమలు చేయరు. ఇంతకూ ఇన్నాళ్లూ అటువంటి చట్టం లేకపోవడం వల్లనేనా అవినీతి చెలరేగుతున్నది? వడ్డీ వ్యాపారాన్ని, వరకట్న దురాచారాన్ని, రాగింగ్ ను, ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాలను, అటువంటి అనేక సామాజిక అకృత్యాలను నిషేధించే చట్టాలెన్నో ఉన్నాయి. అవి ఎంతమేరకు అమలవుతున్నాయో అందరికీ తెలుసు. చట్టం సాయంతో అవినీతిని మొత్తంగానో, చాలావరకో అడ్డుకోవచ్చునని భ్రమలు కల్పించడం ‘ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూసేలా’ ప్రజలను జోకొట్టడానికి తప్ప మరెందుకూ ఉపయోగపడదు. నిజానికి ప్రజలు కొనసాగుతున్న వ్యవస్థలోపల తమ జీవితాలు మారబోవని, పాలన మారబోదని అంతకంతకూ ఎక్కువగా గుర్తిస్తూ ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నప్పుడు, మరికొంతకాలం వారిలో వ్యవస్థపట్ల విశ్వాసం కలిగించడానికే, మరికొంతకాలం వారిని మోసగించడానికే ఈ ప్రయత్నాలు ఉపయోగపడతాయి. ఈ వ్యవస్థే అవినీతి మీద కొనసాగుతున్నప్పుడు, అవినీతిని అడ్డుకోవడం ఈ వ్యవస్థా నిర్వాహకులకు సాధ్యమేనా, ఆ కోరిక వారికి ఉందా అనేది మౌలిక ప్రశ్న. ఆ ప్రశ్న వేయకుండా అవినీతి గురించి ఎన్ని మాటలు చెప్పినా మాటలు గానే మిగిలిపోతాయి. రాజుకుంటున్న నిప్పు మీద చల్లే నీళ్లుగానే మిగిలిపోతాయి. నీళ్లు మంచివే, అవసరమైనవే కాని, అత్యవసరమైన నిప్పును ఆర్పే నీళ్ల గురించి జాగ్రత్త పడక తప్పదు.
– ఎన్ వేణుగోపాల్