ఇంద్రవెల్లి నెత్తుటి మరకకు ముప్పై ఏళ్లు

అదంతా నిన్ననో మొన్ననో జరిగినట్టుంది. ఎన్నెన్నో సన్నిహితమైనవీ, వ్యక్తిగతమైనవీ, సామాజికమైనవీ అనుభవాలు, జ్ఞాపకాలు, తలపోతలు కలగలిసిన ఆ నెత్తుటి మరక హృదయం మీద ఇంకా పచ్చి పచ్చిగానే ఉంది. ప్రతి అనుభవంలోనూ మోసులెత్తే పురాస్మృతిగా ఆ ముప్పై ఏళ్ల కింది దృశ్యం కళ్ల ముందర మళ్లీ మళ్లీ కదలాడుతూనే ఉంది. ఆమాటకొస్తే అక్షరంలో, కళారూపాలలో, చరిత్రలో నిక్షిప్తమైన ఆ సామూహిక విషాద జ్ఞాపకం ఎన్నడూ మరపుకు రానేలేదు. 

ఛార్లెస్ డికెన్స్ రెండు మహానగరాల కథ ప్రారంభంలో చెప్పినలాంటి కాలం అది. అదంతా ఒక విషాద కాలం. అత్యవసర పరిస్థితిలో మధ్యతరగతి బుద్ధిజీవుల సురక్షిత స్థితి కూడ భగ్నమయిన తర్వాత, సుప్రసిద్ధమైన ‘అర్ధరాత్రి తలుపు చప్పుడు’తో పోలీసు రాజ్యం ఎవరి ఇంట్లోనయినా ప్రవేశించి బెగ్గంపాడు చేయవచ్చునని తెలిసిన తర్వాత మధ్యతరగతిలో ప్రజాస్వామిక స్ఫూర్తి మేలుకొన్న కాలం అది. ఎమర్జెన్సీ అనంతర ప్రజాస్వామిక వెల్లువ చెలరేగిన కాలం అది. నిరంకుశ పాలనకు రోజులు చెల్లిపోతూ, ప్రత్యామ్నాయాలు బలపడని సందిగ్ధ స్థితి అది. ఆ ఉత్తేజకరమైన రోజులు త్వరలోనే అంతమైపోయి మళ్లీ నిరంకుశాధికారం గద్దెనెక్కి జాతీయ భద్రతా చట్టాన్నీ, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అప్పునూ తీసుకొచ్చిన కాలం అది. రానున్న గడ్డురోజుల సూచనలు వెలువడుతున్న రోజులు అవి.

అదంతా ఒక ఉజ్వల కాలం కూడ. ఆదిలాబాద్ జిల్లా అడవి అంటుకున్న అద్భుత కాలం కూడ అదే. ఎమర్జెన్సీలోనే పొరుగున ఉన్న జగిత్యాల, సిరిసిల్లలలో నిప్పురవ్వలు పడి అవి దావానలంగా మారడానికి గోదావరి ఆవలి ఒడ్డుకు పయనిస్తున్న కాలం అది. ఏటికి ఎదురీదుతున్న సమయం అది. అప్పటికి ఆరు సంవత్సరాలుగా తెలుగుసీమలో విప్లవోద్యమాన్ని నిర్మిస్తున్న పార్టీ ఇతర రాష్ట్రాల విప్లవకారులను ఆకర్షిస్తూ ఆ రాష్ట్రాలకు విస్తరిస్తూ ఉన్న కాలం అది. ఆ విస్తరణలో భాగంగానే సరిగ్గా ఒక సంవత్సరానికి ముందే పీపుల్స్ వార్ పార్టీ ఏర్పడింది. ఆ పార్టీ నాయకత్వంలో ఆదివాసులు సంఘటితమవుతూ గిరిజన రైతుకూలి సంఘం ఏర్పాటు చేసుకుని ఇంద్రవెల్లిలో ఆ సంఘం సభ ఏర్పాటు చేసుకున్నారు.

ఆ సభ జరగవలసిన 1981 ఏప్రిల్ 20 సాయంత్రం ఇంద్రవెల్లిలో పారిన గోండుల, కోలాముల, పరధానుల నెత్తుటి మరక ఇవాళ్టికీ చెరగలేదు. నూరేళ్ల కింది రాంజీ గోండునూ, నలభై ఏళ్ల కింది కొమురం భీంనూ తలచుకుంటూ ఆ వారసత్వాన్ని కొనసాగించడానికి ఆదిలాబాద్ ఆదివాసుల రగల్ జెండా ఎరుపును అద్దుకున్న కాలం అది. రాంజీ గోండును ఉరితీసిన బ్రిటిష్ వలసపాలననూ, కొమురం భీంను కాల్చి చంపిన నిజాం భూస్వామ్య పాలననూ కొనసాగిస్తూ, మరపిస్తూ అంజయ్య-ప్రభాకరరెడ్డి ప్రభుత్వం అరవై మంది ఆదివాసులను బలితీసుకున్న సమయం అది.

అప్పటికి మూడు సంవత్సరాలుగా ఆదిలాబాద్ ఆదివాసులలో జరుగుతున్న కృషికి నిర్మాణ రూపంగా ఉట్నూరు తాలూకా ఇంద్రవెల్లి గ్రామంలో సోమవారం అంగడితో కలిసి వచ్చేలా ఏప్రిల్ 20న బహిరంగ సభ జరపాలని గిరిజన రైతు కూలీ సంఘం నిర్ణయించింది. ఆ సభలో బొంబాయి కమిటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమొక్రటిక్ రైట్స్ ప్రతినిధి కోబడ్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం ప్రతినిధి ఎం. రంగనాథం, విరసం ప్రతినిధి హిమజ్వాల, రాడికల్ విద్యార్థి సంఘం రాశ్ట్ర ఉపాధ్యక్షుడు జి. లింగమూర్తి మాట్లాడతారని ఒక నెల ముందునుంచే ప్రచారం జరిగింది. తగిన అనుమతుల కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. గిరిజనేతర సంఘం ఒకదాన్ని సృష్టించి సరిగ్గా ఆ రోజే సభ జరుపుతామని వారితో ఒక దరఖాస్తు పెట్టించి అది సాకుగా చూపి అనుమతులు నిరాకరించడానికి పోలీసులు ప్రయత్నించారు. రహదారులు లేని ఆ అడవిలో వందలాది కి.మీ. దూరం నుంచి కాలినడకన ఎన్నో రోజులు ముందు బయల్దేరిన ఆదివాసులకు ఈ అనుమతులూ, అనుమతి నిరాకరణలూ ఏమీ తెలియవు. సభకు వచ్చేవాళ్లే కాక, వారపు అంగడికోసం ఇంద్రవెల్లి వచ్చిన ఆదివాసులు కూడ ఎందరో ఉన్నారు. ఆ రోజంతా అలా వస్తున్నవాళ్ల మీద విచ్చలవిడిగా లాఠీచార్జిలూ అరెస్టులూ జరిపిన పోలీసులు చివరికి సాయంత్రానికి సభకు వస్తున్న ఊరేగింపుల మీద కాల్పులు జరిపారు. జలియన్ వాలా బాగ్ ను మరపించే దుర్మార్గమైన దాడిలో దాదాపు అరవైమంది ఆదివాసుల ప్రాణాలు బలిగొన్నారు. ఆ ఉద్విగ్న భరిత వాతావరణంలో ఆ లాఠీచార్జిల గురించి, అరెస్టుల గురించి, కాల్పుల గురించి వింటూ అక్కడ పోలీసు నిర్బంధంలో గడపడం ఎన్నటికీ మరవలేని అనుభవం.

* * *

హనుమకొండనుంచి ఇంద్రవెల్లి 220 కి.మీ. లోపే గాని అప్పటికింకా హనుమకొండ – కరీంనగర్ రోడ్డు, కరీంనగర్ నుంచి ఉట్నూరు మీదుగా ఆదిలాబాద్ వెళ్లే రోడ్డు ఇప్పటిలా “అభివృద్ధి” చెందలేదు. ఇప్పుడు నాలుగు గంటలలోపే వెళ్లవచ్చునేమో గాని అప్పుడు అది ఆరు గంటలపైనే పట్టే దూరం. ఆరోజు ఉదయం ఐదింటికే బి. జనార్దన రావు, కె. సీతారామరావు, జి. లింగమూర్తి, నేను హనుమకొండలో ఆదిలాబాద్ బస్సెక్కాం. జనార్దన్ అప్పటికి కాకతీయ విశ్వవిద్యాలయ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో పరిశోధక విద్యార్థి. సీతారామరావు అదే శాఖలో అధ్యాపకుడు. లింగమూర్తి రాడికల్ విద్యార్థి సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. తెలుగు ఎంఎలో గోల్డ్ మెడల్ సంపాదించి కాళీపట్నం రామారావు కథల మీద పి ఎచ్ డి చేయబోతున్నాడు. జనార్దన్, సీతారామరావులకు అప్పటికే ఆదివాసుల అధ్యయనం పట్ల ఆసక్తి ఉంది గనుక ఆ సభ చూడడానికి వస్తున్నారు. లింగమూర్తి ఆ సభలో వక్త. నేను ఆ రోజుల్లో సృజన, విరసం, విప్లవ పుస్తకాలు అమ్మే పనిమీద అన్ని సభలకూ వెళ్లేవాణ్ని. నాదగ్గర అమ్మే పుస్తకాలు మాత్రమే కాక, సభలో ఉపన్యాసాలు, ముఖ్యంగా గోండి పాటలు రికార్డ్ చేయడానికి కాసెట్ రికార్డర్ కూడ ఉంది. కరీంనగర్ లో మా బస్సులోనే అలిశెట్టి ప్రభాకర్ ఎక్కుతాడని, సభలో ఫొటోలు తీయడానికి ఆయన వస్తున్నాడని సమాచారం. ఏ ఫొటోలు తీయాలో సూచిస్తూ ఆయనకు రాసిన ఉత్తరం కూడ నాదగ్గర ఉంది.

దాదాపు పదకొండు గంటలకు మా బస్సు ఇంద్రవెల్లికి ఒక కి.మీ. దూరంలో ఉండగానే అడ్డంగా పోలీసు వ్యాన్లు, జీపులు ఉన్నాయి. అక్కడ బస్సు ఆపి అందరినీ దించి ఒక్కొక్కరినీ ఎక్కడికి వెళ్తున్నారో అడుగుతున్నారు. మేం నలుగురం ఇంద్రవెల్లి సభకు వెళ్తున్నామని తెలియగానే మమ్మల్ని పక్కన నిలబెట్టి బస్సును పంపించేశారు. మా నలుగురి మీద లాఠీలు ఝళిపించారు. ఎందుకు ఆపారని, కొడుతున్నారని ప్రశ్నించినందుకు, ఇంగ్లిషులో మాట్లాడినందుకు, ప్యాంటు జేబుల్లో చేతులు పెట్తుకున్నందుకు జనార్దన్ మీద, ముఖ్యంగా జేబులో పెట్టుకున్న చెయ్యి మణికట్టు మీద మరిన్ని లాఠీ దెబ్బలు పడ్డాయి. ఆ జేబులోంచి బాంబులు తీయడానికి జేబులో చెయ్యి పెట్టుకున్నాడని అనుకున్నారట!!

అక్కడ మా నలుగురినీ ఒక జీపులో పడేసి ఇంద్రవెల్లిలో పోలీసు క్యాంపు ఉన్న అప్పర్ ప్రైమరీ స్కూల్ కి తీసుకుపోయారు. మా దగ్గర ఉన్న సామాన్లన్నీ, మా జేబుల్లో ఉన్న కాగితాలు, డబ్బులు అన్నీ లాక్కున్నారు. ఎస్ ఐ, సిఐ, డిఎస్పీ లదాకా ఎందరో మా వివరాలు అడుగుతూ తిడుతూ వచ్చారు. అప్పటికే మేం సీతారామరావు, జనార్దన్ లు కేవలం ఆదివాసులమీద పరిశోధన కోసం వచ్చారని, టేప్ రికార్డర్ వాళ్లదే అని చెప్పాలని, మాకూ వాళ్లకూ ఏమీ సంబంధం లేదని చెప్పాలని అనుకున్నాం. వక్తగా లింగమూర్తి, పుస్తకాల దుకాణంగా నేను కలిసి వచ్చామని చెప్పాలనుకున్నాం.

దాదాపు మూడింటికి అప్పటి ఆదిలాబాద్ ఎస్పీ ఎంవి కృష్ణారావు వచ్చాడు. మా దగ్గర లాక్కొన్న కాగితాలన్నీ చూసి, అప్పటికే మా దగ్గర సేకరించిన సమాచారం విని ఇక ఆయన ప్రశ్నించడం మొదలు పెట్టాడు. వస్తూవస్తూనే మేం చెప్పేది వినకుండానే, మా దగ్గర అలిశెట్టి ప్రభాకర్ పేరు మీద ఉన్న ఉత్తరం పార్టీ రాష్ట్ర కమిటీ సెక్రటరీ రాశాడని, మా అందరినీ వరవరరావు పంపించాడని అన్నాడు. టేప్ రికార్డర్ సీతారామరావుదని మేం చెప్పిన కథను పరీక్షించడానికన్నట్టు, దాని మీటలు అటూ ఇటూ నొక్కి, “మిస్టర్ సీతారాం రావ్, అయమ్ అనేబుల్ టు ఆపరేట్ దిస్, ప్లీజ్ హెల్ప్ మి” అన్నాడు. అదేమంత గొప్ప హైటెక్ వస్తువు కాకపోయినా, సీతారామరావు ఆ టేప్ రికార్డర్ ను ఎన్నడూ చూడలేదు. (నిజానికి అప్పటికి హైటెక్ వస్తువులనేవే లేవు). నేను అనాలోచితంగా, తెలివితక్కువగా గబాలున లేచి దాని మీటలు నొక్కాను. దానికోసమే ఎదురుచూస్తున్నవాడిలా “ఐ నో. ఐ నో. దిస్ డజ్ నాంట్ బిలాంగ్ టు సీతారాం రావ్. దిస్ బిలాంగ్స్ టు వరవరరావ్ ఆర్ పార్టీ. డోంట్ బ్లఫ్ మి” అన్నాడు.

అప్పటికే సభాస్థలం దగ్గరినుంచి గొడవలు జరుగుతున్నాయని, అన్ని దిక్కులనుంచీ గోండులు వస్తున్నారని, లాఠీచార్జిలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. కానిస్టేబుళ్ల, అధికారుల, జీపుల హడావుడి వినబడుతోంది, కనబడుతోంది.  ఎస్పీ మమ్మల్ని ఇంటరాగేట్ చేస్తున్నప్పుడే ఒక గోండును పోలీసులు తీసుకువచ్చారు. ఆయన చేతిలో పెద్ద కమ్మకత్తి ఉంది. ఎస్పీ మమ్మల్ని వదిలి ఆయనను ప్రశ్నించడం మొదలుపెట్టాడు. అతని పేరు మారు అని, అతనిది దాదాపు వంద కి.మీ. దూరంలోని టాన్ర అనే గ్రామమని తెలిసింది. ‘”అంత హత్యారా పట్టుకుని ఎందుకు తిరుగుతున్నావు” అని ఎస్పీ ప్రశ్నిస్తే, “అడవిలో తిరిగేటప్పుడు చేతిలో ఇసిరె లేకపోతే ఎట్లా” అని ఆయన ఎదురు ప్రశ్నించాడు.

అప్పుడే సభాస్థలి దగ్గర గోండులు ఊరేగింపుగా ముందుకు పరుగెత్తుకొస్తున్నారనీ, రాళ్లూ కత్తులూ విసురుతున్నారనీ, ఒక డీఎస్పీకి కాలికి కత్తి తగిలిందనీ వైర్ లెస్ మెసేజిలు వస్తున్నాయి. ఇది వినగానే ఎస్పీ సభాస్థలానికి వెళ్లడానికి లేచాడు. మా ఇద్దరినీ నిర్బంధంలో ఉంచుకున్నా, కనీసం పరిశోధకులిద్దరినైనా వదిలేయాలని మేం అడిగాం. ఆయన కాసేపు ఆలోచించి, ఆలోచించే వ్యవధి కూడ లేక, “ఆదిలాబాద్ నుంచి వచ్చే బస్సాపి ఈ నలుగురినీ ఎక్కించి, హనుమకొండ దాకా టికెట్లు తీయించి, మధ్యలో ఎక్కడా దిగకుండా కరీంనగర్ దాకా కాపలాగా జవాన్లను పంపించండి” అని ఆర్డరేసి వెళ్లి పోయాడు. అలా ఏ ఆరింటికో బస్సెక్కించబడి, టికెట్లిప్పించబడి, కరీంనగర్ దాకా కాపలా కాయబడి అర్ధరాత్రి దాటాక హనుమకొండకు చేరాం.

మర్నాడు ఉదయానికల్లా ఇంద్రవెల్లిలో కాల్పుల వార్త, అరవై మంది దాకా చనిపోయి ఉంటారని వార్త. చనిపోయింది పదమూడు మందేనని ప్రభుత్వం బుకాయించింది. ఆ సభకు వంద మైళ్ల అవతలి నుంచి కూడ ఎన్నో గ్రామాల నుంచి ఆదివాసులు వచ్చారు గనుక కచ్చితంగా చనిపోయినది ఎంతమందో ఎవరూ చెప్పలేకపోయారు. ఇంద్రవెల్లిలో మృతదేహాలను లారీలకు ఎత్తినవాళ్లు, పోలీసులు జరిపిన సామూహిక దహనాలకు కట్టెలు పేర్చినవాళ్లు చెప్పిన మాటలను బట్టి అరవై మంది దాకా చనిపోయి ఉంటారని అందరూ భావించారు.

ఆ కాల్పుల మీద రాష్ట్రంలోని ప్రజాసంఘాలన్నీ పెద్ద ఎత్తున నిరసన తెలిపాయి. రాడికల్ విద్యార్థి, యువజన సంఘాలు రాష్ట్రవ్యాపిత ప్రచార, నిరసన కార్యక్రమాలు తీసుకున్నాయి. ‘రగల్ జెండా ఇంత ఎరుపేమిటని అడుగ, గిరిజనుల రక్తంలో తడిసెనని చెప్పాలి’ అని కరపత్రం రాశాను. అప్పటికే ఆదిలాబాద్ ఆదివాసుల మధ్య పనిచేస్తూ సాహు పంపించిన నోట్స్ ఆధారంగా సృజన ఇంద్రవెల్లి కాల్పుల ప్రత్యేక సంచికలో పెద్ద వ్యాసం రాశాను. ఆ సంచికలోనే సాహు రాసిన కథలు, ఎంతో మంది కవుల స్పందనలు అచ్చు వేశాం. ఆ తర్వాత ఢిల్లీనుంచి ప్రొఫెసర్ మనోరంజన్ మహంతీ నాయకత్వాన పియుడిఆర్ నిజనిర్ధారణ సంఘంతో సహా, రెండు మూడు నిజనిర్ధారణ సంఘాలు, సంఘీభావ కమిటీ తరఫున ఆదిలాబాద్ గిరిజన సహాయనిధి, సభల సమయానికి క్రాంతి ప్రచురణలుగా వెలువడిన గోండి, కోలాం పాటల సంకలనం ‘రగల్ జెండా’, కాల్పుల తర్వాత సృజన ప్రత్యేక సంచిక, సృజన ప్రచురణ ‘ఇంద్రవెల్లి’ కవితా సంకలనం, ఇంద్రవెల్లిపై విరసం కవితా సంకలనం ‘తుడుం’…అదంతా చరిత్ర. కాలగమనం ఎంత వేగంగా సాగినట్టనిపించినా, మారినట్టనిపించినా మరచిపోలేని చరిత్ర.

* * *

ఈ సామాజిక నెత్తుటి మరకలో నా వ్యక్తిగత జ్ఞాపకమూ, హృదయానికి అత్యంత సన్నిహితమైన జ్ఞాపకమూ ఉంది. వయ్యక్తికత లేని సామాజికతా లేదు. సామాజికత లేని వయ్యక్తికతా లేదు.

ఈ ఇంద్రవెల్లి నిర్బంధంలో నాతోపాటు ఉండిన నలుగురిలో ఇద్దరు అకాలంగా మరణించారు. జనార్దన్ గుండెపోటుతో మరణించాడు. లింగమూర్తి కృష్ణానదిలో పుట్టి మునిగిన ప్రమాదంలో మరణించాడు.

ఇంద్రవెల్లి కాల్పులతో, స్వయంగా తాను అనుభవించిన నిర్బంధంతో ఆదివాసుల అధ్యయనం గురించి మరింత ఆసక్తి పెరిగి జనార్దన్ ఆ విషయం మీదనే ఎం ఫిల్, పిఎచ్ డి కూడ చేసి, ఆదివాసి అధ్యయనాల కోసం ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశాడు. తాను పనిచేసిన కాకతీయ విశ్వవిద్యాలయంలో మాత్రమే కాక, దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలలోనూ, జర్మనీ లోని హీడెల్ బర్గ్ విశ్వవిద్యాలయంలోనూ ఆదివాసుల అధ్యయనానికి విలువైన కానుకలు అందించాడు. ఫిబ్రవరి 2002లో అకాలమరణం చెందడానికి ఐదారు సంవత్సరాల ముందు నుంచీ తెలంగాణ ఆకాంక్షల ప్రచారం కోసం కాలికి బలపం కట్టుకుని తిరిగాడు.

ఇక లింగమూర్తి స్మృతి అరుణారుణమైనది. అప్పటికి డిగ్రీ విద్యార్థిగా ఒకవైపు రాడికల్ విద్యార్థి సంఘంలో, మరొకవైపు సృజన సాహితీమిత్రులలో తలమునకలుగా ఉన్న ఆ కాలంలోనే జీవితంలో అతిపెద్ద విషాదాన్ని అనుభవించాను. మా అమ్మ 1981 మార్చ్ 14 న తన 55 ఏళ్ల వయసులో అకాలంగా మరణించింది. ఆ దుఃఖాన్ని తట్టుకుని లేచినిలుస్తానా బతుకుతానా అనుకున్నాను. ఆ వ్యక్తిగత విషాదం నుంచి నన్ను బయటపడవేసినది విప్లవోద్యమం. ముఖ్యంగా లింగమూర్తి. అంతకు ముందు రెండు సంవత్సరాలుగా మిత్రుడిగానే ఉన్నా, అమ్మ మరణం తర్వాత నన్ను ప్రతిరోజూ కలిశాడు. నన్ను ఆ దుఃఖం నుంచి మరల్చడానికి ఎన్నెన్నో చదివే పనులూ రాసే పనులూ, మాట్లాడే పనులూ పెట్టాడు. ఎక్కడెక్కడికో తిప్పాడు. అందులో భాగమే తాను వక్తగా వెళుతూ నన్ను కూడ ఇంద్రవెల్లికి తీసుకుపోవడం. లింగమూర్తి ఆ తర్వాత ఒకటి రెండు సంవత్సరాలలోనే పూర్తికాలం విప్లవోద్యమ కార్యకర్తగా అజ్ఞాత జీవితాన్ని ఎంచుకుని మొదట కర్నూలు మైదాన ప్రాంతాలలోనూ, ఆ తర్వాత నల్లమల అడవిలో ఆదివాసుల మధ్య పనిచేశాడు. అక్కడే కృష్ణానదిలో పుట్టిలో ప్రయాణిస్తూ అది మునిగి అమరుడయ్యాడు.

ఆదివాసులు తమ ఊళ్లో తాము సభ పెట్టుకుంటే, సంఘటితమైతే సహించక కాల్పులు జరిపిన స్థితి నుంచి రాజ్యం చాల ముందుకు వచ్చింది. వాళ్ల ఊళ్లలో వాళ్లను ఉండనివ్వబోమని, వాళ్ల కాళ్లకింది నేలలో బహుళజాతిసంస్థలకు అవసరమైన ఖనిజాలు ఉన్నాయని, అందువల్ల ఆపరేషన్ గ్రీన్ హంట్ చేసి, ఊళ్లను తగులబెట్టి,  ఆదివాసుల జీవితాలను ధ్వంసం చేసి ఆదివాసి ప్రాంతాలను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తామని అంటున్నది. బుద్దిజీవులుగా మనం ఏం చేస్తున్నామన్నదే ప్రశ్న.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Telugu. Bookmark the permalink.

2 Responses to ఇంద్రవెల్లి నెత్తుటి మరకకు ముప్పై ఏళ్లు

  1. తాపసి says:

    ఇంద్రవెల్లి గురించి వినటమే గానీ పూర్తి వివరాలు మీ టపా చూసేంతవరకు తెలియవు. ఇకపోతే బలహీనుణ్ణి బలవంతుడు దోచుకోవడం అనాదిగా సాగుతూనే ఉంది. ఆపరేషన్ గ్రీన్ హంట్ లాంటివి నాయకుల జేబులు నింపుకోవడానికన్నది అందరికీ తెలిసిందే. ఆదివాసులనైతే సులువుగా మోసం చెయవచ్హన్నది నాయకుల అభిప్రాయం.

  2. తెల్ల దొరల పాలన పోయి నల్ల దొరల పాలన వచ్చిన తరువాత తయారైన మరో జలియాన్వాలా బాఘ్ ఈ ఇంద్రవెల్లి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s