తెలంగాణ సాంస్కృతిక వికాసం

గడిచిన పదిహేను – పదహారు నెలలలో తెలంగాణ ఉద్యమం వెంట నడిచిన కలం కవాతు గురించి సంకలనం తెస్తున్న వరంగల్ జర్నలిస్టు మిత్రులు, ఆ సంకలనం కోసం నా అనుభవాలు కూడ రాయమని అడిగినప్పుడు ఎన్నెన్నో పాతవీ  కొత్తవీ జ్ఞాపకాలూ, ఉద్వేగాలూ తోసుకొచ్చాయి.

ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష నా జీవితంలోని ఈ నలభై తొమ్మిది ఏళ్లలో నలభై ఏళ్లకు మించినది. బాల్యంలో మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నుంచి ప్రయాణంలోనూ, హైదరాబాదులోనూ, హనుమకొండలోనూ 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని కళ్లారా చూశాను. ప్రత్యేకించి హనుమకొండ జూనియర్ కాలేజి పక్కనుంచి బాలసముద్రానికి వెళ్లే రోడ్డుమీద (అప్పటికింకా అక్కడ కొత్త బస్ స్టాండ్ గాని, స్టేడియం గాని రాలేదు) పోలీసు స్టేషన్ వైపు జూనియర్ కాలేజి భవనాలలో “చిప్పటోపీల” (సి ఆర్ పి బలగాలకు ప్రజలు పెట్టుకున్న పేరది) క్యాంపు, హడావుడి, కోహినూర్ హోటల్ పక్కన పాపులర్ షూ మార్ట్ పై దాడి నాకు ఇప్పటికీ కళ్లముందు కదలాడే దృశ్యాలు. ఆ తర్వాత 1972 ఉద్యమంలో చిన్నపెండ్యాలలో ఆరోతరగతిలో పాఠశాల బహిష్కరించి, రాజారం దాకా నడిచివెళ్ళి ‘జై తెలంగాణ’ అని అక్కడ బడికూడ మూసేయించడం, అప్పటికి ఒక్క గుడిసె కూడ లేని బర్సనగడ్డ దగ్గర, హైదరాబాద్ – హనుమకొండ రహదారి మీద, నిరాహార దీక్షా శిబిరంలో కూచోవడం నిన్ననో మొన్ననో జరిగినట్టుంటాయి.

కాలం అప్పటినుంచి చాల ముందుకు నడిచింది. నాలుగు అక్షరాలు నేర్చుకుని, జర్నలిస్టునూ, రచయితనూ, ఉపన్యాసకుడినీ అయి పదిహేను సంవత్సరాలుగా తెలంగాణ ఆకాంక్షల గురించి అధ్యయనం చేస్తున్నాను, రాస్తున్నాను, మాట్లాడుతున్నాను. తెలంగాణ చరిత్ర గురించీ, ఉద్యమ తీరుతెన్నులను గురించీ తెలంగాణలోని అన్ని జిల్లాలలోనూ ఎన్నో చోట్ల మాట్లాడాను, రచనలు చేశాను. తెలంగాణ హిస్టరీ సొసైటీ, తెలంగాణ జర్నలిస్ట్స్ ఫోరం వంటి నిర్మాణాలలో నావంతు బాధ్యత పంచుకున్నాను.

2009 తొలిరోజుల నుంచీ కూడ పత్రికలలో, టెలివిజన్ ఛానళ్లలో తెలంగాణ ప్రధాన చర్చనీయాంశంగా ఉంటున్నది. ఏదో ఒక ఛానల్ లో చర్చకో, వార్తాపత్రికల విశ్లేషణకో వెళుతుండేవాణ్ని గనుక ఆ సంవత్సరం పొడుగునా తెలంగాణ గురించి మాట్లాడుతూనే ఉన్నాను. అక్టోబర్ లో సుప్రీం కోర్టు ఫ్రీ జోన్ తీర్పు ఇచ్చిన తర్వాత తెలంగాణకు రావలసిన హక్కులను కొల్లగొట్టడానికి, రాజ్యాంగ రక్షణలను కూడ ఉల్లంఘించడానికి ప్రయత్నం పెద్ద ఎత్తునే జరగబోతున్నదని అర్థమైంది. ఆ వేడి క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. నవంబర్ 29 ఉదయం వార్తా పత్రికల విశ్లేషణ కోసం ఎన్ టివి లో ఉన్నాను. ఎనిమిదికల్లా అయిపోవలసిన విశ్లేషణా కార్యక్రమం కరీంనగర్ లోని ఉద్రిక్త పరిస్థితి వల్ల, అలుగునూరు దగ్గర కె. చంద్రశేఖర రావును అరెస్టు చేయడం వల్ల తొమ్మిదిన్నర దాకా కొనసాగింది. కెసిఆర్ దీక్ష భగ్నం చేయడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలను, ఆ సమయంలో పాలకులు సాగిస్తున్న దివాళాకోరు, కుట్రపూరిత విధానాలను లైవ్ లో చూసే, అప్పటికప్పుడు వ్యాఖ్యానించే వీలు కలిగింది.

ఎన్ టివి లో ఆ వార్తా విశ్లేషణ కార్యక్రమం నడుపుతుండిన కొమ్మినేని శ్రీనివాసరావు తెలంగాణ వ్యతిరేకత, సమైక్యాంధ్ర అనుకూలత అందరికీ తెలిసినవే. కెసిఆర్ అరెస్టుతో, కరీంనగర్ లోనూ, సిద్దిపేటలోనూ పోలీసులు ప్రదర్శించిన దమననీతితో తెలంగాణ ఉద్యమం వెనుకపట్టు పట్టవచ్చునని కొమ్మినేని చేసిన వ్యాఖ్యకు ఒక చైనీస్ కవితను ఉటంకించి జవాబు చెప్పాను: ‘చంద్రుడిని మూసెయ్యాలని ఒక మేఘం అడ్డువచ్చిందట. కాని అదే ముక్కలై, కురిసి నేలంతా నీటి మడుగులుగా మారిందట. వేలాది చంద్రబింబాలను ప్రతిఫలించిందట.’ తెలంగాణ ఉద్యమం అలా నిర్బంధంతో ఉవ్వెత్తున ఎగసిపడేదే కాని ఆగిపోయేది కాదన్నాను.

స్టుడియో నుంచి బయటికి వస్తుండగా కెబిఆర్ పార్క్ ముందర బ్రహ్మానందరెడ్డి విగ్రహానికి తారుపూసి ధ్వంసంచేసే ప్రయత్నం జరిగిందని తెలిసి అటు పరుగు. ఆ రోజే తెలంగాణ ఉద్యమ పరిణామాల మీద మరొక రెండు ఛానళ్లలో విశ్లేషణ. శ్రీకాంత్ చారి ఆత్మహనన వార్తలు, మరణ వార్తలు, గన్ పార్క్ దగ్గర మృతదేహంతో ప్రదర్శన. ఖమ్మం జైలు నుంచీ, ఆస్పత్రి నుంచీ ఆందోళనకరమైన, ఉద్విగ్నమైన వార్తలు… అలా ఆ తర్వాత గడిచిన ఐదు రోజులూ ప్రతిక్షణం ఉద్వేగమే, ఏదో ఒక ఉద్రేకభరితమైన వార్తే.

డిసెంబర్ 4 రాత్రి పని మీద జార్ఖండ్ వెళ్లవలసి ఉండింది. బయల్దేరడానికి గంట ముందు తెలంగాణ రచయితల, కళాకారుల బృందంతో పాటు హైదరాబాద్ సిటీ సెంట్రల్ లైబ్రరీ, త్యాగరాయ గానసభల దగ్గరికి వెళ్లాను. సిటీ సెంట్రల్ లైబ్రరీ మీద ‘వట్టికోట ఆళ్వారుస్వామి స్మారక గ్రంథాలయం’ అని పోస్టర్ అతికించి, ఉపన్యాసం ఇచ్చి జార్ఖండ్ వెళ్లిపోయాను. తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 9 సాయంత్రం విజయవాడలో రైలు దిగాను. ఆ మర్నాడు నెల్లూరు జిల్లా కావలి జవహర్ భారతి లో అంతర్జాతీయ మానవహక్కుల దినం సందర్భంగా మాట్లాడవలసి ఉండింది. ఆ రాత్రి పదకొండున్నరకు హఠాత్తుగా నా ఫోన్ హడావిడి పెరిగింది. చిదంబరం ప్రకటన, దానిమీద మిత్రుల వ్యాఖ్యలు, సంభాషణలు అలా ఆ రాత్రి జాగారమే అయింది. చెప్పలేని సంతోషం, ఒకింత అపనమ్మకం. ఉద్వేగం. ఏ కొత్త మోసాలు జరగనున్నాయో అని ఆందోళన.

నుడికారంలో చెప్పాలంటే, ‘ఆ తర్వాత గడిచిందంతా చరిత్రే’. ఈ పదహారు నెలలు నా వరకు నాకు అత్యంత ఉద్వేగభరితంగా, నిండా పనిలో, ఆలోచనలో, రచనలో, ఉపన్యాసంలో, తెలంగాణ బాధ్యతలో గడిచిన రోజులు.

ముప్పై సంవత్సరాలుగా ఉపన్యాసకుడిగా రాష్ట్రమంతా తిరిగిన వాణ్నే అయినా, ఈ పదహారు నెలల్లో కొత్త ఊళ్లెన్నో చూశాను. కొత్త అనుభవాలు, కొత్త పరిచయాలు పొందాను. మారుమూల పల్లెటూళ్లలో మైమరపించే తెలంగాణ కళాకారుల కళాప్రదర్శనల మధ్య ఉపన్యాసాలు ఇచ్చాను. తెలంగాణలోని అన్ని జిల్లాల జర్నలిస్టులతో మాట్లాడాను. అంతకు ముందునుంచే ఉన్నా, డిసెంబర్ 9 తర్వాత పెరిగిన తెలంగాణ వ్యతిరేక, సమైక్యాంధ్రవాద అబద్ధాలను వివరిస్తూ వాస్తవాలను తెలియజెపుతూ నేను రాసిన చిన్న పుస్తకం ‘తెలంగాణ – సమైక్యాంధ్ర: భ్రమలు, అబద్ధాలు, వాస్తవాలు’ జనవరి 3 అపూర్వమైన ఉస్మానియా విద్యార్థి సభ నాటికి తెలంగాణ బిడ్డల చేతికి అందించగలిగాను. పద్నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ గురించి చేస్తున్న ఆలోచనలు, రాస్తున్న వ్యాసాలు ఒక్కచోటికి తెచ్చి ‘లేచినిలిచిన తెలంగాణ’ ప్రచురించాను. ఎచ్ ఎం టివి ‘ఆంధ్రప్రదేశ్ దశ – దిశ’ శీర్షికతో రాష్ట్రవ్యాప్తంగా నడిపిన లైవ్ చర్చా కార్యక్రమంలో విజయవాడలో తెలంగాణ తరఫున పాల్గొని మాట్లాడి అక్కడ పాలకవర్గాల ప్రతినిధుల ఆగ్రహావేశాలనూ, సాధారణ ప్రజల సహకారాన్నీ అనుభవించాను. తెలంగాణకు కోస్తాంధ్ర, రాయలసీమ పాలకవర్గాలు, కేంద్రప్రభుత్వం చేసిన అన్యాయాల, వాగ్దాన భంగాల జాబితా తయారుచేసి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి సమర్పించే పనిలో ఆరు దశాబ్దాల విషాద చరిత్ర మళ్లీ ఒకసారి చదివి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను సమర్థించడం ఎంత ప్రజాస్వామికమో, న్యాయమో మరొకసారి గుర్తించాను.

నా ఈ వ్యక్తిగత అనుభవాలను అలా ఉంచి, ఈ పదిహేను నెలల తెలంగాణ ఉద్యమం తెలంగాణ పాత్రికేయులకు ఎంత మేలు చేసిందో, పాత్రికేయులు భూమిపుత్రులుగా ఆ భూమి తండ్లాటలో ఎలా భాగమయ్యారో తలచుకుంటేనే ఒళ్లు పులకించిపోతుంది. ఒక వెనుకబడిన సమాజంలో, సగం మంది నిరక్షరాస్యులూ, ముప్పాతిక మంది ఆరుగాలం కష్టం చేసుకు బతకవలసిన, ఆలోచించడానికి తీరికలేని మనుషులూ ఉన్న సమాజంలో చదువుకున్నవాళ్ల, ఆలోచించగలవాళ్ల, రాయగలవాళ్ల, మాట్లాడగలవాళ్ల బాధ్యతా నిర్వహణ ఎంత అవసరమైనదో ప్రపంచచరిత్ర ఎన్నోసార్లు ఎన్నోతీర్ల చూపింది. ఆ మహోజ్వల కర్తవ్యాన్ని నా తెలంగాణ జర్నలిస్టు సోదరులు సంపూర్ణంగా నిర్వహించారు. తమ కళ్ల ముందర ప్రజలు అనుభవిస్తున్న కడగండ్లను లోకానికి తెలియజెప్పడం, ఆ ప్రజల ఆరాటపోరాటాలకు అక్షరాలద్దడం, దృశ్యరూపంలో చూపడం మాత్రమే కాదు, అటువంటి సంక్షుభిత సమయాల్లో తటస్థంగా ఉండడం సాధ్యం కాదనీ, ఉచితం కాదనీ కూడ తెలంగాణ జర్నలిస్టులు చూపారు. ప్రజల ఉద్యమాన్ని నివేదించడంతో తమ పని అయిపోయిందనుకోలేదు. ఆ ఉద్యమంలో భాగమయ్యారు, అనేకచోట్ల ఆ ఉద్యమానికి నాయకత్వం అందించారు, పోరాటశక్తులను సమన్వయం చేశారు, దిశానిర్దేశం చేశారు. నిప్పుమీద నివురు కప్పకుండా తమ కలాలతో, గళాలతో, ఆలోచనలతో ఊది ఊది మండించారు.

తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షల ఉద్యమం జయాపజయాలు, నాయకత్వ వైఫల్యాలు ఎలా ఉన్నా, అది సాధించిన ఒక అద్భుతమైన విజయం తెలంగాణ ప్రజల సృజనాత్మకతకూ, చొరవకూ అసాధారణమైన వికాసానికి అవకాశం ఇవ్వడం. ఈ దశ ఉద్యమాన్ని పైపైన చూసినా అది కొన్ని వేల కళారూపాల ప్రదర్శనకూ, కొన్ని వందల మంది గాయకులకూ, కళాకారులకూ, కొన్ని డజన్ల మంది కవులకూ, ఉపన్యాసకులకూ, వందలాది రచనలకూ, లక్షలాది గ్రామీణ ప్రజల అభిప్రాయాల ప్రకటనకూ అవకాశం ఇచ్చిందని కనబడుతుంది. ఇది అపూర్వమైన, గొప్ప సాంస్కృతిక వికాసం. ఈ ఉజ్వలమైన సాంస్కృతిక వికాసాన్ని తమ నివేదికలలో ప్రతిఫలించడంలోనూ, తాము స్వయంగా ఆ వికాసంలో భాగం కావడంలోనూ అతి ముఖ్యమైన పాత్ర జర్నలిస్టులది. ఇది ఒక రాజకీయ లక్ష్యంతో ముడిబడిన సాంస్కృతిక వికాసమే అయినప్పటికీ, దాన్ని కేవలం ఆ రాజకీయ లక్ష్యానికే పరిమితం చేయగూడదు. సమ్మక్క సారలమ్మల నుంచి పాలకుర్తి ఐలమ్మ దాకా సాగివచ్చిన అద్భుతమైన తెలంగాణ ధిక్కార సంస్కృతిలో అనివార్యమైన భాగమే ఈ సాంస్కృతిక వికాసం. ఆ వారసత్వ ఫలితమే ఈ సాంస్కృతిక వికాసం. దాన్ని ముందుకు తీసుకుపోవడమే తెలంగాణ బుద్ధిజీవుల, జర్నలిస్టుల కర్తవ్యం.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Telugu. Bookmark the permalink.

One Response to తెలంగాణ సాంస్కృతిక వికాసం

  1. Dr.Rajendra Prasad Chimata says:

    Very Positive,objective and encouraging the artists and journalists

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s