వీక్షణం – మే 2011 సంపాదకీయం

దేవుడి క్షేమం కోరే భక్తులు, ఆస్తుల పంపకంలో దేవుడు!

పుట్టపర్తి సత్యసాయిబాబా ప్రశాంతి నిలయంలో మార్చ్ 28న మొదలైన అతి విచిత్రమైన, హాస్యాస్పదమైన నాటకం, చిట్టచివరికి, ఎట్టకేలకు ఏప్రిల్ 24 ఉదయం ముగిసింది. ఎప్పుడో మరణించిన మనిషి మరణవార్త ఆస్తుల లెక్కలు, పంపకాలు అన్నీ పూర్తయ్యాకనే బయటపడింది. తనను తాను భగవంతుడిగా, అవతారంగా అభివర్ణించుకున్న మనిషి ఆస్పత్రిలో ఆధునిక వైద్య పరికరాల మీద ఆధారపడి అపస్మారకంలో పడి ఉండగా, లెక్కలు తేల్చుకునేవాళ్లు ఆ బతుకును పొడిగించడానికి, మరణవార్తను వాయిదా వేయడానికి ప్రయత్నించారు. ఈ కొత్తభగవంతుడిని కాపాడమని భక్తులు పాత భగవంతుడికి పూజలూ పునస్కారాలూ చేశారు గాని వారి మొర ఎవరూ ఆలకించినట్టు లేరు. వెంటిలేటర్ల మీద బతుకును పొడిగిస్తున్నామని ఆస్పత్రి నుంచి రోజుకొక వార్త వచ్చింది గాని ఆ మనిషి బతికి ఉన్నాడని చెప్పే ఒక్క ఆధారమైనా బయటికి రాలేదు. స్వతంత్ర పరిశీలకులను లోపలికి వెళ్లనివ్వలేదు. ఆ మనిషి ఎప్పుడో చనిపోయాడని, ఆస్తుల లెక్కలు తేల్చుకోవడం కోసమే చావువార్త బయటపెట్టడానికి ఆలస్యం చేస్తున్నారని వదంతులు చెలరేగాయి. ఈలోగా బంగారం బిస్కెట్లు ఆశ్రమం నుంచి తరలిపోయాయనీ వార్తలు వచ్చాయి. మనిషి చనిపోయిన తర్వాత కూడ బతికే ఉన్నాడని, చికిత్సలు చేస్తున్నామని అబద్ధాలు చెపుతూ రావలసిన డబ్బులన్నీ వచ్చాకనే చావువార్త బయటపెట్టే ఐదు నక్షత్రాల ఆస్పత్రుల ఆనవాయితీ కొత్తదేమీ కాదు. ఇప్పుడు విచిత్రమల్లా చెల్లించవలసిన బిల్లు గురించి కాదు, రోగి దగ్గర దాచిపెట్టిన డబ్బు లెక్కలు, రోగి దగ్గర పోగయిన ఆస్తి పంపకాలు తేలేదాకా చావువార్త బయటికి రానివ్వలేదు. మొత్తానికి తాను 96 ఏళ్ల దాకా బతుకుతానని కొత్త భగవంతుడు చెప్పిన జోస్యం అబద్ధమని తేలిపోయింది. ఈ ఒక్క అబద్ధం మాత్రమే కాదు, సత్యసాయిబాబా జీవితకథ, మహిమల కథ మొత్తంగానే అబద్ధాల మయం. ఆ అబద్ధాలు సత్యనారాయణ రాజు అనే ఒకానొక వ్యక్తివి మాత్రమే కాదు. ఈ వ్యవస్థ సృష్టించకతప్పని అబద్ధశక్తి అతను. ప్రజల సమస్యలను పరిష్కరించలేని పాలకవర్గాలు అభూత శక్తులను సృష్టించి, అక్కడే పరిష్కారాలు ఉన్నాయని మాయను అల్లుతాయి. ఈ లౌకిక భారతదేశంలో, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే రాజ్యాంగ బాధ్యత ఉన్న ప్రభుత్వాధినేతలలో ప్రతిఒక్కరూ ఆ మాయాశక్తి పాదాల చెంత ఏదో ఒక సమయంలో సేదదీరినవారే. రాష్ట్రపతులు, అత్యున్నత న్యాయస్థానపు న్యాయమూర్తులనుంచి ప్రభుత్వ యంత్రాంగంలోని అతి చిన్న గుమస్తాల దాకా ఆయన భక్తులే. అరచేతిలో బూడిద సృష్టించడం, గాలిలోనుంచి ఉంగరాలు, గొలుసులు, శివలింగాలు సృష్టించడం వంటి గారడీ విద్యలతో ప్రారంభించి, ప్రజల అమాయకత్వమూ అజ్ఞానమూ పెట్టుబడిగా వేల కోట్ల రూపాయల సామ్రాజ్యం నిర్మించి, దాన్ని రాజ్యాంగేతర శక్తిగా మార్చడంలో ఆ వ్యక్తికి ఎంత పాత్ర ఉందో, ఈ వ్యవస్థకు, పాలకవర్గాలకు అంత పాత్ర ఉంది. సత్యసాయిబాబా పేరిట జరుగుతున్న ఈ మోసాలను వివరించడానికి గాంధేయవాది, బెంగళూరు విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ ఎచ్ నరసింహయ్య జీవితాంతం పోరాడారు. అవే గారడీలను చేసి చూపిస్తూ, బూడిద, ఉంగరాలు, గొలుసులు, శివలింగాలు సృష్టిస్తూ శ్రీలంక హేతువాది డా. అబ్రహాం కోవూర్ దేశమంతా కాలికి బలపం కట్టుకుని తిరిగారు. సత్యసాయిబాబా చేసేది కనికట్టు కాదని నిరూపిస్తే నష్ట పరిహారం చెల్లించి, తన ప్రచార కార్యక్రమం ఆపుతానని 1970లలోనే ప్రకటించారు. ఆ సవాలుకు సాయిబాబా నుంచి గాని, భక్తుల నుంచి గాని జవాబు లేదు. తమిళ హేతువాది ప్రేమానంద సాయిబాబా అక్రమాల మీద న్యాయస్థానాలలోనూ ప్రజలలోనూ ఎన్నో పోరాటాలు చేశారు. ‘సాయిబాబా, సొన్నాయి బాబా’ అంటూ గద్దర్ 1980ల మొదట్లో రాసిన సుప్రసిద్ధమైన పాట సాయిబాబా బండారాన్ని బయటపెట్టింది. ఈలోగా గారడీ బాబా దొంగనోట్ల వ్యాపారంలోకి కూడ దిగారని 1980లలో వార్తలు వచ్చాయి. రాజకీయ నాయకుల, అక్రమవ్యాపారుల లెక్కచూపని, పన్ను చెల్లించని సంపదను, నల్లడబ్బుగా పేరుపడిన అక్రమార్జనను తెల్లడబ్బుగా మార్చడమే సత్యసాయిబాబా పని అని ఎందరో వివరించారు. ఈ అక్రమాల ఆరోపణలు పెరుగుతున్నకొద్దీ సత్యసాయిబాబా, ఆయన భక్తులలోని పాలకవర్గశక్తులు రెండు కొత్త ఎత్తుగడలు పన్నారు. ఒకటి, అంతకంతకూ ఎక్కువగా దేశంలోని అత్యున్నత అధికార పీఠాల వ్యక్తులు, క్రీడా, సినీ, మేధోరంగ ప్రముఖులు, శాస్త్రవేత్తలు సాయిబాబా దగ్గరికి వచ్చి, ఆయన పాదాల దగ్గర కూచుని ఆయన ప్రాధాన్యతను పెంచారు. ఆయనను చట్టాతీత, సమాజాతీత శక్తిని చేశారు. రెండు, సాయిబాబా అక్రమాల మీద విమర్శలను ఎదుర్కోవడానికి ఆయన ఆశ్రమానికి సేవా కార్యక్రమాల మేలిముసుగు తొడిగారు. విద్యాలయాలు, ఆస్పత్రులు, అన్న, వస్త్ర దానాలు, దుర్భిక్ష ప్రాంతాలకు తాగునీటి సౌకర్యం కల్పించడం, ప్రకృతి ఉత్పాతాల సమయంలో అన్నార్తులను, నిరాశ్రితులను ఆదుకోవడం వంటి కార్యక్రమాలతో ఆయన మంచితనాన్ని, మానవత్వాన్ని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఎంత మానవత చూపినా ఆస్తే నేరం, ఆస్తే దొంగతనం అన్నట్టు ఆస్తి పెరిగినకొద్దీ ఆ ఆస్తి పంపకాలలో కొట్లాటలు, నేరాలు తలెత్తాయి. స్వయంగా బాబా పడకగదిలో 1993లో హత్యాకాండ జరిగి ఆరుగురు మరణించారు. ఆ హత్యాకాండ మీద కనీస విచారణ జరగని, ఎవరి ప్రాంగణంలో హత్యలు జరిగాయో వారిమీద దర్యాప్తు కూడ జరగని చట్టబద్ధ పాలన సాగుతున్న దేశం మనది! ప్రశాంతి నిలయంలో అశాంతి కార్యకలాపాల గురించి ప్రపంచానికి చాటి చెప్పిన ఆ హత్యాకాండ కేవలం ప్రమాద సూచన మాత్రమే. నిజమైన ప్రమాదం గత నాలుగు వారాలలో బయటపడింది. సత్యసాయి ఆశ్రమ ఆస్తులు నలభై వేల కోట్ల రూపాయలా, లక్ష కోట్ల రూపాయలా, లక్షానలభై వేల కోట్ల రూపాయలా అని పత్రికలు ఊహాగానాలు చేశాయి. ఇంత సంపద ఎలా పోగుపడి ఉంటుంది, అందులో భక్తుల విరాళాలు ఎన్ని, ఇంతకాలంగా ఆశ్రమ నిర్వహణకు అయిన వ్యయం పోగా ఆశ్రమానికి ఇంత మిగిలే అవకాశం ఉందా, ఇదంతా రాజకీయ నాయకులు, అధికారగణం దాచుకున్న అక్రమసంపద కావచ్చునా అనే ప్రశ్నలు రాలేదు. అలా ప్రశ్నించడమే భగవంతుని ఎడల అపచారంగా చూసే స్థితి ఉంది. గత మూడు వారాలలో కనీసం పద్నాలుగు, పదిహేను రోజులు అన్ని పత్రికల ప్రధాన పతాక శీర్షికలు బాబా ఆరోగ్యం గురించే మాట్లాడాయి గాని, ఇతర ప్రజాసమస్యలూ పట్టలేదు, ఈ ఆస్తుల మూలాలు కనిపెడదామనీ పట్టలేదు. ప్రజా అసంతృప్తిని పక్కదారులు పట్టించడానికి పాలకవర్గాలు ఇటువంటి మూఢనమ్మకాలను వాడుకుని ఆ జనాకర్షణలో తమ అక్రమాలను దాచుకోవడం కొత్తకాదు. ఇటువంటి శక్తులకు వ్యతిరేకంగా ప్రజలలో చైతన్యాన్ని రగిలించడం, ఈ శక్తులను నమ్మకతప్పని స్థితి కల్పిస్తున్న వ్యవస్థను మార్చడం తమ పనిగా భావిస్తున్న నిజమైన ప్రజాశక్తుల ముందున్న పని ఎంత గురుతరమైనదో ఇప్పటికైనా గుర్తించాలి. ఆ రంగంలో ఇతోధిక కృషి చేయడానికి ఈ ఉదాహరణను వాడుకోవాలి.

సంపాదకీయ వ్యాఖ్యలు

లోక్ పాల్ లేకనేనా అవినీతి సాగేది?!  

టునీషియా, ఈజిప్ట్ పరిణామాలు జరుగుతున్నప్పుడు “ఇటువంటి ప్రజాప్రదర్శనే జంతర్ మంతర్ లో జరిగితే, రెండు లక్షల మంది పోగైతే…” అని అని ఔట్ లుక్ పత్రిక సంపాదకుడు వినోద్ మెహతా ఒక ఊహాగానం చేశారు. రెండు నెలలు తిరగకుండానే జంతర్ మంతర్ లో ప్రదర్శన జరిగింది. అక్కడికి కొన్ని వందలమందో, వేలమందో వచ్చారేమో గాని, దేశవ్యాప్తంగా లక్షలాదిమంది అవినీతికి వ్యతిరేకంగా గొంతెత్తారు. కాని టునీషియాలో, ఈజిప్ట్ లో జరిగిన పరిణామాలతో పోలిస్తే వందో వంతు మార్పు అయినా జరగలేదు. అసలింతకీ జంతర్ మంతర్ ప్రదర్శన టునీషియా, ఈజిప్ట్ లలో ప్రజాసంచలనాలు ప్రకటించినలాంటి లక్ష్యాలతో జరగలేదు. అత్యున్నత అధికార పీఠాలలో అవినీతిని అరికట్టడానికి ఉపయోగపడే లోక్ పాల్ వ్యవస్థను సృష్టించాలని ప్రభుత్వం ప్రయత్నించినప్పుడు, ఆ బిల్లులో అవతవకలు ఉన్నాయని, అందుకు భిన్నమైన మరొక బిల్లు తయారు చేయాలని, ఆ బిల్లు తయారీలో పౌరసమాజ ప్రతినిధులకు భాగస్వామ్యం ఉండాలని అన్నా హజారే నిరాహార దీక్ష ప్రారంభించారు. దేశవ్యాప్తంగా మధ్యతరగతి ఆ దీక్షకు సంఘీభావం ప్రకటించింది. దేశ ప్రజానీకంలో రాజకీయ అవినీతి పట్ల ఉన్న వ్యతిరేకతకు ఈ సంఘీభావం ఒక వ్యక్తీకరణ. అయితే అవినీతికి కేంద్రస్థానంలో ఉన్న కార్పొరేట్ పారిశ్రామిక వ్యాపార మీడియా వర్గాలు కూడ ఈ “అవినీతి వ్యతిరేక” ఆందోళనలో ముందువరుసలో కనబడడానికి ప్రయత్నించడం ఆందోళనకరం. ఎన్ని సమస్యల మీద ఎన్ని కోట్లమంది ఎన్ని దశాబ్దాలుగా ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం మూడు రోజులలోపల “దిగి వచ్చి” అన్నా హజారే కోరినట్టుగా పౌరసమాజ సభ్యులకు బిల్లు తయారీలో ప్రాతినిధ్యం ఇచ్చింది. ఆ బిల్లు ఎప్పటికి తయారవుతుందో, తయారయినా అది ఎప్పటికి చట్టమవుతుందో, చట్టమయినా అది అమలులోకి వస్తుందో రాదో, అమలులోకి వచ్చినా పెద్దచేపలను, తిమింగిలాలను పట్టుకుంటుందో లేదో తెలియకపోయినా, ఈ మాత్రం విజయానికే దేశవ్యాప్త అవినీతి ఆందోళన విజయం సాధించిందని చెప్పుకుంటున్నారు. అన్నా హజారే మీద గాని, ఆయన ప్రతిపాదిస్తున్న పౌరసమాజ ప్రతినిధుల మీద గాని ఎటువంటి అగౌరవం లేకుండానే, ఈ మొత్తం నాటకం అమాయకంగా, అర్థరహితంగా, హాస్యాస్పదంగా సాగుతున్నదని చెప్పకతప్పదు. ఈ ఉద్యమంలో పాల్గొన్న, పాల్గొంటున్న ప్రజల న్యాయమైన అవినీతి వ్యతిరేక ఆకాంక్షలను నట్టేట ముంచడానికి అత్యున్నత స్థాయిలో కుట్ర జరుగుతున్నదని చెప్పకతప్పదు. అసలు అవినీతికి మూలమేమిటో, అవినీతిని పెంచి పోషిస్తున్నదెవరో తెలియని అమాయకత్వం, లేదా దాచిపెట్టదలచిన కుటిలత్వం ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నది. అవినీతికి మూలకారణమైన వ్యవస్థను యథాతథంగా ఉంచి, ఆ వ్యవస్థలోని దోపిడీ పీడనల గురించి, అంతరాల గురించి, అసమానతల గురించి మాట్లాడకుండా అవినీతి గురించి మాట్లాడడమంటే, ఆ అవినీతిని ఒక చట్టం ద్వారా రూపుమాపగలమని భ్రమలు కల్పించడమంటే అమాయకత్వమో, కుట్రో కాకతప్పదు. అది అమాయకత్వమయినా, కుట్ర అయినా బలి అయిపోయేది మాత్రం ప్రజల న్యాయమైన అవినీతి వ్యతిరేక ఆకాంక్షలు. కామన్ వెల్త్ గేమ్స్, ఆదర్శ్, 2జి వంటి కుంభకోణాలు వెల్లడయిన తర్వాత ప్రజలలో ఈ వ్యవస్థ పనితీరు పట్ల తీవ్రమైన అవిశ్వాసం పెరుగుతున్న తరుణంలో, ఈ వ్యవస్థలో మార్పు సాధ్యమే అని భ్రమలు కల్పించడానికి పాలకవర్గాలు వేసిన కొత్త ఎత్తుగడ లోక్ పాల్. ఆ చట్టం ఎవరు చేసినా, ఎంత ఆదర్శవంతంగా చేసినా, ఈ వ్యవస్థ ఇలా కొనసాగినంతకాలం, ఎన్ని అతుకులు, మాట్లు వేసినా, మలామాలు పూసినా అవినీతి రద్దు కాదు. ప్రజల అవినీతి వ్యతిరేక ఆకాంక్షలను బలంగా బయటపెట్టిన ఈ ఆందోళన అవినీతికి మూలమైన వ్యవస్థను రద్దు చేసే దిశగా సాగాలి.

 ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ ల ఆర్తనాదాలు

 ఇటీవల వాషింగ్టన్ లో జరిగిన  ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ల వార్షిక సమావేశాలలో ఆ సంస్థల అధిపతులు చేసిన ప్రకటనలు, హెచ్చరికలు సామ్రాజ్యవాద ప్రభుత్వాల, పాలకవర్గాల, బహుళజాతి సంస్థల భయాలకు అద్దం పడుతున్నాయి.  అంతర్జాతీయంగా పెరుగుతున్న ఆహారధరలు, విపరీతంగా పెరిగిపోతున్న నిరుద్యోగం, ఇటీవలి పశ్చిమాసియా ప్రజా సంచలనాలు, అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థల ఒడిదుడుకులు ప్రపంచవ్యాపిత ఆర్థిక సంక్షోభాన్ని తీవ్రతరం చేయనున్నాయని ఆ సమావేశాల్లో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు రాబర్ట్ జోలిక్, ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ డామినిక్ స్ట్రాస్-కాన్ పదే పదే అన్నారు. “పూర్తిస్థాయి సంక్షోభంనుంచి మనం ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉన్నాం. తర్వాత చేసే చికిత్స కన్న నిరోధమే మంచిదని గత ఆర్థిక సంక్షోభం మనకు గుణపాఠం నేర్పింది. మనం ఆ పాఠాన్ని విస్మరించడానికి వీలు లేదు” అనీ, అరబ్ దేశాలలో జోక్యానికి “మామూలు పరిస్థితులు నెలకొనేదాకా వేచిచూద్దాం అనే ధోరణి మంచిది కాదు. అలా మనం అవకాశాలను జారవిడుచుకోలేం. విప్లవ పరిస్థితులలో యథాస్థితి వాదం నెగ్గదు” అనీ జోలిక్ ప్రపంచబ్యాంకు చేయనున్న పనులేమిటో సూచించాడు. ఇక స్ట్రాస్-కాన్ మరొక అడుగు ముందుకువేసి వ్యవస్థకు అనేక వ్యాధులు ఉన్నాయని, కొత్త వ్యాధులు కూడ పొడసూపుతున్నాయని, ఇప్పుడు చేతులు ముడుచుకు కూచుంటే పని జరగదని అన్నాడు. “వృద్ధి సరిపోదు. పాత పద్ధతిలో అయితే మనం వృద్ధి జరిగితే సరిపోతుందని, మిగిలినవన్నీ వాటంతట అవే జరుగుతాయనీ అనుకునేవాళ్లం. కాని ఆ పద్ధతికి కాలం చెల్లింది” అన్నాడు. ఐఎంఎఫ్ లో కీలకాధికారం గల కమిటీ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నం “మనం ఇంకా ఎప్పుడైనా పగిలిపోగల స్థితిలోనే ఉన్నాం. మనం చాల జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. చికాకు పరిచే సన్నివేశాలు ఏర్పడతాయని గుర్తించి, ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. మరీ ముఖ్యంగా వ్యవస్థాత్మకంగా కీలకమైన దేశాల విషయంలో మరొక సంక్షోభం రాకుండా జాగ్రత్త పడాలి” అన్నాడు. ఇలా వ్యవస్థాత్మకంగా కీలకమైన, ప్రమాదపు అంచులలో ఉన్న దేశాలుగా ఏడు దేశాలను గుర్తించారు. అవి అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, చైనా, భారతదేశం. ఈ ఏడు దేశాలు తమ సంక్షోభాలను నివారించడానికి ఏ చర్యలు చేపట్టాలో నవంబర్ లో ఫ్రాన్స్ లో జరిగే సమావేశంలో నిర్ణయాలు తీసుకోవాలనుకున్నారు. అంటే నవంబర్ లో మళ్లీ ఒకసారి భారతదేశంలో ప్రపంచీకరణ విధానాలను మరింత తీవ్రతరం చేసే చర్యలు చేపట్టడానికి రంగం సిద్ధం కానున్నదన్నమాట. ఇది పాలకవర్గాల నుంచి, బహుళజాతిసంస్థల నుంచి జరుగుతున్న కుటిల ప్రయత్నం. ఈ ప్రయత్నాన్ని తిప్పికొట్టగల శక్తి ఇవాళ్టికివాళ ఆయాదేశాల విప్లవ, ప్రజా శక్తులకు లేకపోవచ్చు. కాని ఈ దేశాలలో తమ కార్యక్రమాలవల్ల సంక్షోభం రాగల స్థితి ఏర్పడిందని, దాన్ని నివారించడానికి మరింత పెద్దఎత్తున ప్రపంచీకరణ విధానాలు అమలు జరపాలని బహుళజాతి సంస్థలు, సామ్రాజ్యవాద శక్తులు ఆలోచిస్తున్నాయని గుర్తించడం ప్రజాశక్తుల బాధ్యత. ఆ దాడి గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసి, ఆ దాడిని ఎదుర్కోవడానికి ప్రజలను సమాయత్తం చేయడం, ఒకవేళ పాలకవర్గాలకూ, ఆర్థిక వ్యవస్థలకూ సంక్షోభమే వస్తే, ఆ సంక్షోభాన్ని ప్రజావెల్లువలను రేకెత్తించడానికి ఉపయోగించుకోవడం విప్లవ, ప్రజాశక్తుల, సామ్రాజ్యవాద వ్యతిరేకుల, నిజమైన ప్రజాస్వామిక వాదుల కర్తవ్యం.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Veekshanam. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s