సిబిఐ నమోదు చేసిన ఆజాద్ ‘హత్య’ కేసు

ఈ భూమి జూన్ 2011 సంచిక కోసం

ఎప్పుడో ఒకసారైనా తీగలాగితే డొంకంతా కదులుతుంది. ఎంత ఆలస్యంగానైనా సత్యం బయటపడుతుంది. అధికారమే నేరమై సాగేచోటకూడ, నేరస్తులు ఎప్పటికైనా బోనెక్కక, శిక్ష అనుభవించక తప్పని కాలం వస్తుంది. ఇవి శుష్క సత్యాలు కావని, ఆ దారిలో ఒక చిన్న ముందడుగు వేయడానికైనా అవకాశం ఉందని ఒక తాజా ఉదంతం చెపుతోంది.

పోలీసులు అలవాటుగా, నలభై ఏళ్లుగా చెపుతున్న “ఎదురుకాల్పుల” కథ ఈసారి ఆనవాయితీగా కంచికి వెళ్లకుండా ఎదురుతిరిగింది. ఫలానా చోట నక్సలైట్ల సంచారం ఉందని సమాచారం రావడం, ఆ “అసాంఘిక శక్తులను” పట్టుకోవడానికి, ఆ ప్రాంతాన్ని సోదా చేయడానికి పోలీసు బృందం అర్ధరాత్రి అడవిలోకి బయల్దేరడం, దారిలో నక్సలైట్ల అలికిడి విని లొంగిపొండి అని పోలీసులు హెచ్చరించడం, అవతలివాళ్లు వినకుండా బాంబులు విసిరి, కాల్పులు ప్రారంభించడం, “విధిలేక”, “తప్పనిసరి పరిస్థితులలో”, “ఆత్మరక్షణ కోసం” పోలీసులు ఎదురుకాల్పులు జరపడం, కొద్ది గంటల తర్వాత అవతలినుంచి కాల్పులు ఆగిపోవడం, ఆ తర్వాత అటువైపు వెళ్లి చూస్తే కొన్ని మృతదేహాలు, కొన్ని ఆయుధాలు, కొన్ని కిట్ బ్యాగులు కనబడడం – ఇదీ నాలుగు దశాబ్దాలుగా అలవాటయిన ఎన్ కౌంటర్ కథ. ఎన్నిసార్లు ఎందరు ప్రశ్నించినా, ఈ కథలో లొసుగులు చూపెట్టినా పోలీసు రచయితలు మాత్రం ఇదే కథను కనీసం రెండు వేలసార్లు రాశారు. అదే కథ పదే పదే చెప్పినా, నామవాచకాలు, స్థల కాలాలు మాత్రం మారుతుండేవి. ఈ నలభై ఏళ్లలో మూడు నాలుగు సార్లు ఈ కథ ఎదురుతిరుగుతున్నట్టు కనబడింది గాని అంగబలమో అర్థబలమో బలంగా వీచి కథ పోలీసులు అనుకున్నట్టే సజావుగా సాగిపోయింది. ఈ సారి మాత్రం కథ ఎదురుతిరుగుతున్నట్టు, తీగలాగితే డొంకంతా కదులుతున్నట్టు కనబడుతోంది.

భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ సభ్యుడు, అధికార ప్రతినిధి ఆజాద్ (చెరుకూరి రాజ్ కుమార్), ఢిల్లీకి చెందిన ఫ్రీలాన్స్ జర్నలిస్టు హేమచంద్ర పాండే గత సంవత్సరం జూలై 2 ఉదయం ఆదిలాబాద్ జిల్లా వాంఖిడి సమీపంలోని సర్కెపల్లి అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించారని పోలీసులు ప్రకటించారు. అది ఎన్ కౌంటర్ కాదనీ, వారిద్దరినీ జూలై 1న నాగపూర్ లో పట్టుకుని, ఆదిలాబాద్ అడవుల్లోకి తీసుకువచ్చి అతి సమీపం నుంచి కాల్చి చంపారనీ పౌరహక్కుల సంఘాలు ఆరోపించాయి. ఘటన తర్వాత అక్కడికి వెళ్లిన పత్రికా ప్రతినిధులుగాని, పౌరహక్కుల సంఘాల నిజనిర్ధారణ బృందాలు గాని ఘటనా స్థలంలో ఎదురుకాల్పులు జరిగిన ఆధారాలేమీ లేవని గుర్తించారు. పోలీసులు చెపుతున్నట్టుగా కొన్ని గంటల పాటు ఎదురుకాల్పులు జరిగిన శబ్దాలేవీ వినిపించలేదని సమీప గ్రామస్తులు కూడ చెప్పారు. తెలంగాణలో, ఆదిలాబాద్ లో ఉద్యమం అణగారి పోయిందని, నక్సలైట్ల కదలికలే లేవని ఒకవైపు పోలీసులే ప్రకటిస్తుండగా, ఈ అగ్రనాయకుడు అక్కడికి ఎందుకు వస్తాడని ప్రశ్నలు వచ్చాయి. అంత అగ్రనాయకుడు అడవిలోనే ఉండి ఉంటే ఎన్నో వలయాల రక్షణ కవచం ఉంటుందని, ఆయనను అడవిలో అలా ఎన్ కౌంటర్ లో చంపడం సాధ్యం కాదనీ సందేహాలు వెలువడ్డాయి. జూలై 1 ఉదయం నాగపూర్ లోని సీతాబర్డి ప్రాంతంలో దండకారణ్యం నుంచి వచ్చిన కొరియర్ తో కలిసి ఆజాద్ దండకారణ్యంలోకి రావలసి ఉండిందని, అక్కడికి ఆయన రాలేదని, అంటే ఆ సమయానికి ముందే నాగపూర్ లోనో, నాగపూర్ కు వచ్చే దారిలోనో ఆయనను పట్టుకుని ఉంటారనీ, కొద్ది గంటలలోనే ఆయనను, ఆయనతోపాటు ఉన్నందుకు హేమచంద్ర పాండే అనే జర్నలిస్టునూ చంపేశారనీ మావోయిస్టు పార్టీ ప్రకటించింది.

హేమచంద్ర పాండే జర్నలిస్టు కాదనీ, మావోయిస్టేననీ (అయితే చంపవచ్చునన్నమాట!) పోలీసులు కల్పించిన కట్టుకథలను, చేసిన వాదనలను అటు హిందీ పాత్రికేయులూ, ఇటు ఆంధ్రప్రదేశ్ పాత్రికేయులూ సాక్ష్యాధారాలతో ఖండించారు. ఉత్తరాఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోనూ, విద్యార్థి ఉద్యమంలోనూ పాల్గొన్న పాండే అనేక హిందీ పత్రికలకు వార్తలూ వ్యాసాలూ రాశారని, ప్రగతిశీల జర్నలిస్టుగా ఉన్నారని ఆధారాలు చూపించారు. కేవలం వృత్తిధర్మంగా ఆజాద్ ను ఇంటర్వ్యూ చేయడానికో, దండకారణ్య విప్లవోద్యమం మీద వార్తాకథనాలు రాయడానికో వెళ్లి ఉంటాడని ఊహించారు. నిజానికి గత ఆరు సంవత్సరాలలో న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, బిబిసి లతో సహా డజన్లకొద్దీ జర్నలిస్టులు ఆ ప్రాంతాలకు వెళ్లి వార్తాకథనాలు రాశారు. అది నిషిద్ధమూ కాదు, అసహజమూ కాదు. జర్నలిస్టులందరూ రాయాలని కోరుకునే వార్తాకథనపు అవకాశం. కాని ఆజాద్ ను చంపదలచిన పోలీసులు ఆ బూటకపు ఎదురుకాల్పులకు సాక్ష్యంగా ఉంటాడనే కారణంతోనే పాండేను జర్నలిస్టని కూడ చూడకుండా కాల్చిచంపారనీ, జర్నలిస్టు కాదని బుకాయిస్తున్నారనీ తేటతెల్లమయింది.

చిట్టచివరికి మృతదేహపు పోస్ట్ మార్టం నివేదిక ఆ ఇద్దరూ ఎదురు కాల్పులలో చనిపోలేదని విస్పష్టమైన రెండు ఆధారాలు ప్రకటించింది. ఒకటి, తాము కొండ కింద ఉన్నామని, నక్సలైట్లు కొండ పైన ఉన్నారని, రెండున్నర గంటల పాటు ఎదురు కాల్పులు జరిగాయని పోలీసులు ప్రకటించారు. అంటే ఒకవేళ ఎదురుకాల్పులే జరిగి ఉంటే, పోలీసుల తుపాకిగుండు కొండ కింది నుంచి పైకి ఏటవాలుగా వెళ్లి ఉండాలి. కాని పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం తుపాకి గుండు ఆజాద్ ఛాతీకి రెండు అంగుళాల పైన ప్రవేశించి, వీపులోంచి ఛాతీకి రెండు అంగుళాల కిందినుంచి బైటికి వచ్చింది. అంటే కిందినుంచి పైకి వెళ్లిన తుపాకి తూటా కొంతదూరం తర్వాత దారి మార్చుకుని వెనక్కి తిరిగి అంతే వేగంతో శరీరంలోంచి దూసుకుపోయిందన్నమాట! అందుకే “ఈ తుపాకి గుండు భూమ్యాకర్షణ సిద్ధాంతాలు తప్పని రుజువు చేస్తున్నట్టుంది” అని నిజనిర్ధారణ సంఘం సభ్యుడు, ప్రపంచ ప్రఖ్యాత అర్థశాస్త్రవేత్త అమిత్ భాదురి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

అంతకన్న బలమైన రెండో ఆధారం, శవపరీక్ష నివేదికలో తుపాకి తూటా ప్రవేశించిన చోటు గురించి, బైటికి వెలువడిన చోటు గురించి నమోదు చేసిన అంశాలు. ఈ నివేదికను ఔట్ లుక్ వారపత్రిక హతుడు ఎవరో చెప్పకుండా ముగ్గురు ప్రఖ్యాత ఫోరెన్సిక్ నిపుణులకు ఇచ్చి విశ్లేషించమని కోరింది. వాళ్లు ముగ్గురూ, ఒకరితో ఒకరికి సంబంధం లేకుండానే ఆ తూటా ప్రవేశించిన, బయటికి వచ్చిన గాయాలను బట్టి, అతి దగ్గరి నుంచి, కనీసం  పదమూడు సెంటీమీటర్ల దూరం నుంచి కాల్చినదై ఉంటుందని విశ్లేషించారు. అంటే పోలీసులు చెపుతున్నట్టు ఫర్లాంగు దూరం నుంచి వచ్చిన కాల్పులకు ప్రతిగా, “ఆత్మరక్షణ కోసం” జరిగిన కాల్పులలో ఆజాద్ మరణించలేదని. మనిషిని కూచోబెట్టి, పక్కన నిలబడిన పోలీసు అధికారి ఛాతికి గురిపెట్టి కాల్చి ఉంటాడని స్పష్టమైంది.

జూన్ 30 మధ్యాహ్నం దాకా తనతో ఉండిన, ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా, ఒక రవాణా సంస్థ న్యూస్ లెటర్ కు పార్ట్ టైమ్ సంపాదకుడిగా పనిచేస్తుండిన తన సహచరుడిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు దుర్మార్గంగా చంపివేసి, ఎన్ కౌంటర్ కట్టుకథ అల్లుతున్నారని, కనీసం సత్యాన్వేషణకు అవసరమైన న్యాయవిచారణ జరిపించడానికి కూడ సిద్ధంగా లేరని, కనుక న్యాయవిచారణ జరిపించమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హేమచంద్ర పాండే సహచరి బబిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అదే సమయానికి అటువంటి అభ్యర్థనతోనే సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ సుప్రీంకోర్టులో రిట్ దాఖలు చేసి ఉన్నారు. మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వంతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని తాను ప్రయత్నిస్తున్నానని, అందుకోసం తాను కేంద్ర హోంమంత్రి చిదంబరంతో మాట్లాడుతున్నానని, చిదంబరం ఇచ్చిన లేఖను తాను ఆజాద్ కు పంపానని, ఆ లేఖ పట్టుకుని, అగ్రనాయకత్వంతో చర్చించడానికే ఆజాద్ దండకారణ్యంలోకి వెళుతూ ఉండి ఉంటారని అగ్నివేశ్ అన్నారు. తాను పంపిన లేఖవల్లనే ఆజాద్ మృతి సంభవించినట్టుందని, స్వామి అగ్నివేశ్ తన అపరాధభావనను బహిరంగంగా ప్రకటించారు. ఈ ఎన్ కౌంటర్ ఘటనపై న్యాయవిచారణ జరపాలని కోరుతూ ఆయన చిదంబరంను, ప్రధాని మన్మోహన్ సింగ్ ను, అనేక మంది మంత్రులను, చివరికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కూడ కలిశారు. ఈ ప్రయత్నాలన్నీ విఫలమై ఆయనకూడ న్యాయవిచారణకు ఆదేశించమని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ లోగా కేంద్ర మంత్రి మమతా బెనర్జీతో సహా ఎంతోమంది రాజకీయ నాయకులు, మేధావులు కూడ ఈ ఎన్ కౌంటర్ పై న్యాయవిచారణ జరిపించాలని కోరారు.

హేమచంద్ర పాండే సహచరి పిటిషన్ ను, స్వామి అగ్నివేశ్ పిటిషన్ ను కలిపి విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ క్రమంలో చాల తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. “ఈ రిపబ్లిక్ తన పిల్లలను తానే ఇలా ఎన్ కౌంటర్ల పేరిట చట్టవ్యతిరేకంగా హత్య చేయ్యడానికి, పొట్టనపెట్టుకోవడానికి వీలు లేదు” అని కూడ అంది. న్యాయవిచారణ అవసరం లేదంటూనే, దానికన్న రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేని స్వతంత్ర, కేంద్ర ప్రభుత్వ సంస్థతో దర్యాప్తు చేయించడానికి అంగీకరించి, దర్యాప్తు బాధ్యతను కేంద్ర నేర పరిశోధక సంస్థ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ – సిబిఐ) కి అప్పగించింది. సిబిఐ కూడ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలోని విభాగమే గనుక, స్వయంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మీదనే ఈ ఎన్ కౌంటర్ కు సంబంధించి అనుమానాలు ఉన్నాయి గనుక సిబిఐ దర్యాప్తు అనేది కూడ సందేహాలకు తావు తీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మాత్రం సిబిఐ దర్యాప్తు నిష్పాక్షికంగా, సత్యాన్వేషణ దిశలో సాగేలా సుప్రీంకోర్టు పర్యవేక్షణ జరుపుతుందని హామీ ఇచ్చారు.

ఇంత తతంగం నడిచిన తర్వాత, లోకానికంతటికీ ఎప్పటినుంచో తెలిసిన వాస్తవాన్ని కనిపెట్టడానికి సిబిఐ రంగంలోకి దిగింది. మే 19న సంబంధిత పోలీసు అధికారులపై నేరస్వభావం గల కుట్ర (భారత శిక్షా స్మృతి సెక్షన్ 120-బి), హత్య (భారత శిక్షా స్మృతి సెక్షన్ 302) అభియోగాలపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసు కింద ఇప్పటికి ఆసిఫాబాద్ సర్కిల్ ఇనస్పెక్టర్, తాండూర్ సబ్ ఇనస్పెక్టర్, బెల్లంపల్లి ఆర్మ్ డ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్ కు సంబంధించిన ఆర్ ఎస్ ఐ, సివిల్, ఆర్మ్ డ్ రిజర్వ్ స్పెషల్ పార్టీ పోలీసు అధికారుల మీద కేసు నమోదయింది.

రాష్ట్ర చరిత్రలో ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై హత్యా నేరం కింద, కుట్ర నేరం కింద నమోదయిన మొదటి కేసు ఇది. నిజానికి ప్రతి ఎన్ కౌంటర్ కేసునూ హత్యా నేరంగా నమోదు చేసి, ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరపవలసి వచ్చిందని రుజువు చేసుకునే బాధ్యతను పోలీసులపై పెట్టాలని రాష్ట్ర హైకోర్టు, జాతీయ మానవహక్కుల సంఘం ఎన్నో ఏళ్ల కిందనే ఆదేశాలిచ్చాయి. ప్రతి ఎన్ కౌంటర్ ఘటనపైనా విధిగా న్యాయవిచారణ జరపాలని ఆదేశాలిచ్చాయి. కాని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఆ ఆదేశాలను బుట్టదాఖలు చేశాయి. ఇప్పుడు కేసు సుప్రీం కోర్టులో ఉండడం వల్ల, సుప్రీం కోర్టు నేరుగా సిబిఐని ఆదేశించడం వల్ల బండి కాస్త ముందుకు కదిలింది.

‘ఎన్ కౌంటర్లన్నీ హత్యలే’ అనే నినాదం గత నలభై సంవత్సరాల్లో మీరు అనేక సార్లు విని ఉంటారు, గోడల మీద చదివి ఉంటారు, అడపాదడపా అక్కడక్కడ అయినా పత్రికల్లో చదివి ఉంటారు, టెలివిజన్ తెర మీద చూసి ఉంటారు. ఆ మాట విప్లవోద్యమ కార్యకర్తలో, సానుభూతిపరులో, పౌరహక్కుల, మానవహక్కుల సంఘాల కార్యకర్తలో అనడం విని ఉంటారు. కాని మొదటిసారిగా కేంద్ర హోం మంత్రిత్వశాఖలోని ఒక విభాగమైన కేంద్ర నేరపరిశోధక సంస్థ ఆమాట అంటోంది. ఎన్ కౌంటర్లన్నీ హత్యలే అనకపోయినా కనీసం ఒక సుప్రసిద్ధమైన ఎన్ కౌంటర్ కేసును హత్య కేసుగా నమోదు చేసింది. ఈ కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయ దుర్మార్గాల, పోలీసు అత్యాచారాల చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని రచించగలుగుతుందా, నిజమైన హంతకులను బోనెక్కించగలుగుతుందా, శిక్షార్హమైన పద్ధతిలో అభియోగపత్రం దాఖలు చేసి, సరైన వాదనలు వినిపించి, హంతకులకు శిక్షలు పడేలా చేయగలుగుతుందా, కింది కోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా మూడు నాలుగు అంచెలలో ఆ శిక్ష నిలబడి అమలవుతుందా అన్నీ ప్రశ్నలే. వేచి చూడాలి. అవన్నీ జరిగినా జరగకపోయినా నలభై సంవత్సరాలుగా నిరాటంకంగా ఎన్ కౌంటర్ పేరిట జరిగిపోతున్న చట్టవ్యతిరేక హత్యల చరిత్రలో మొదటి సారి ఒక ఎన్ కౌంటర్ కేసు హత్యానేరంగా, కుట్ర నేరంగా నమోదు కావడమే అసాధారణం గనుక దాని గురించి, ఎన్ కౌంటర్ల విధానం గురించి వివరంగా చర్చించుకోవడానికి ఇది సరైన సందర్భం.

నిజానికి ఎన్ కౌంటర్ అనేది భారతదేశంలో తన అర్థాన్ని కోల్పోయిన ఒక ఇంగ్లిషు మాట. ఆ మాటకు అర్థం ఎదురుపడడం అని. ఎదురుపడడం అంటే అనుకోకుండా, ముందు తెలియకుండా జరిగే చర్య. కాని మనదగ్గర “ఎన్ కౌంటర్ చేస్తాను”, “ఎన్ కౌంటర్ చేయిస్తాను”, “ఎన్ కౌంటర్ అయ్యాడు” అనే రూపంలో, అంటే అది ఒక ఉద్దేశ్యపూర్వక చర్య అనే అర్థంలో వాడకంలోకి వచ్చింది. ఎన్ కౌంటర్ అంటే చట్టవ్యతిరేకంగా, చట్టబద్ధమైన విచారణ జరపకుండా మరణశిక్ష విధించడం అనే అర్థం వచ్చింది. వ్యవస్థను మార్చే పోరాటం చేస్తున్న నక్సలైట్లను ఇలా చట్టాతీతంగా చంపవచ్చునని రాజకీయ ఆధిపత్య వర్గాలు పోలీసులకు లైసెన్సు ఇచ్చిన తర్వాత ఆ లైసెన్సును మరెన్నో చోట్ల వాడడం జరిగింది. రాజకీయ ప్రత్యర్థులను, నేరస్తులుగా పేరుపడినవాళ్లను, చిన్న చిన్న నేరాలు చేసిన వాళ్లను కూడ ఇలా చంపేసి, ఎన్ కౌంటర్ అని ప్రకటించడం అలవాటయింది. నిజంగా వాళ్లు నేరం చేసినా, విచారణ జరిగితే పడే శిక్ష కన్న పెద్ద శిక్ష, తిరిగి సవరించడానికి వీలు లేని శిక్ష, మరణ శిక్ష విధించే అధికారాన్ని పోలీసులు తమ హక్కు భుక్తం చేసుకున్నారు.

ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్ లలో బందిపోట్లుగా పేరుపడినవాళ్లను, కాశ్మీర్ లో ముస్లిం యువకులను, ఈశాన్య రాష్ట్రాలలోనూ, గుజరాత్ లోనూ, పంజాబ్ లోనూ దేశంలో అనేక చోట్లా తీవ్రవాదులుగా ముద్రపడినవాళ్లను వేలాది మందిని ఈ ప్రజాస్వామిక, గణతంత్ర రాజ్యం ఎన్ కౌంటర్లలో చంపేసింది. బొంబాయి నేర సామ్రాజ్యంలోకి ప్రవేశించిన ఈ హింసా ప్రవృత్తి వల్ల పోలీసులు ఒక మాఫియా ముఠాదగ్గర డబ్బులు తీసుకుని మరొక మాఫియా ముఠాకు చెందినవాళ్లను ఎన్ కౌంటర్ చేయడం ప్రారంభించారు. ఎన్ కౌంటర్ కింగ్, ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్, ఎన్ కౌంటర్ టైగర్ అనే బిరుదులు గల పోలీసు అధికారులూ పుట్టుకొచ్చారు.

మన రాష్ట్రానికి సంబంధించి కూడ ఈ ఎన్ కౌంటర్ల చరిత్ర కొత్తది కాదు. మొట్టమొదటి ఎన్ కౌంటర్ బ్రిటిష్ వలస  పాలనాకాలంలో జరిగిన అల్లూరి సీతారామరాజు ఎన్ కౌంటర్. ఆ తర్వాత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలంలో మొదట నిజాం ప్రభుత్వం, ఆ తర్వాత యూనియన్ సైన్యాలు కూడ రైతాంగ కార్యకర్తలను చంపడానికి ఈ ఎన్ కౌంటర్ కట్టుకథలు అల్లాయి. “స్వతంత్ర” భారత చరిత్రలో 1968లో బెంగాల్ లో ఈ ఎన్ కౌంటర్ హత్యలు మళ్లీ మొదలు కాగా ఆంధ్రప్రదేశ్ లో మొదటి భారీ ఎన్ కౌంటర్ లో పంచాది కృష్ణమూర్తినీ, ఆరుగురు సహచరులనూ సోంపేట రైల్వే స్టేషన్ లో అరెస్టు చేసి 1969 మే 27న కాల్చి చంపారు. వారిని అరెస్టు చేశామని, ఏం చేయాలని శ్రీకాకుళం నుంచి వచ్చిన మెసేజ్ కు “బంప్ దెమ్ ఆఫ్” (వాళ్లను లేపెయ్యండి) అని హైదరాబాదు లోని అత్యున్నత అధికారపీఠం నుంచి జవాబు వెళ్లిందని, ఆ తర్వాతనే వారిని చంపి వేయడం జరిగిందని సమాచారం. జలగం వెంగళరావు హోంమంత్రిగా ఉండగా మొదలైన ఈ ప్రక్రియను తర్వాత ఎందరో ముఖ్యమంత్రులు, హోంమంత్రులు, వారి కనుసన్నల్లో నడిచే పోలీసు దొరలు మూడు అరెస్టులూ ఆరు ఎన్ కౌంటర్లుగా కొనసాగించారు. లెక్కలేని నక్సలైట్ నిర్మూలనా నిధులూ, హతుల తలల మీద ఉండే పారితోషికాలూ, స్పెషల్ పార్టీ పోలీసులకు దొరికే ఖాతా అక్కరలేని వాహనాలూ, ఇంధనమూ, ఇన్ ఫార్మర్ల కు ఇచ్చే డబ్బూ – ఇలా రాష్ట్ర ప్రజాధనం నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చయింది. ఆ వేల కోట్ల రూపాయలతో నాలుగువేలమందిని బలిగొన్నారు. ఎన్ని హత్యలు చేస్తే అంత వీరుడిగా గుర్తింపూ, పారితోషికాలూ, పదోన్నతులూ ఇవ్వడం రాజకీయ విధానంగా మొదలయింది. ఒక కేసులో సుప్రీంకోర్టులో ఇలా హత్యలు చేసినందుకు పదోన్నతి ఇవ్వడం సబబేనని రాష్ట్ర ప్రభుత్వం వాదించిందంటే ఈ శిక్షాతీత హంతక ప్రవృత్తి ఎంత విస్తరించిందో అర్థమవుతుంది.

ఈ ఎన్ కౌంటర్ హత్యలు కచ్చితంగా రాజకీయ విధానమే అని చెప్పడానికి ఒక విస్పష్టమైన ఆధారం ఉంది. ఎన్ కౌంటర్ అనేది యాదృచ్ఛికంగా జరిగేది కాదని, ఉద్దేశపూర్వకంగా ఆదేశానుసారం జరిగేదేనని చెప్పడానికా అన్నట్టు రాష్ట్ర చరిత్రలో మూడు సందర్భాల్లో ఎన్ కౌంటర్లు జరగనే లేదు. మొదటి సారి 1985-89 మధ్య ఎన్ టి రామారావు ముఖ్యమంత్రిగా ‘ఆట పాట మాట బంద్’ అని విప్లవోద్యమం మీద ఆంక్షలు విధించి, దమననీతిని అమలు చేసినతర్వాత నవంబర్ 1989లో కాంగ్రెస్ పక్షాన మర్రి చెన్నారెడ్డి తమ ప్రభుత్వం వస్తే నిర్బంధం ఉండదని వాగ్దానం చేశారు. ఆ వాగ్దానానికి అనుగుణంగా అన్నట్టుగా 1989 డిసెంబర్ నుంచి 1990 మే వరకూ దాదాపు ఆరు నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా ఒక్క “ఎన్ కౌంటర్” కూడ జరగలేదు. మళ్లీ 1992 మేలో పీపుల్స్ వార్ మీద, ఆరు ప్రజాసంఘాల మీద మొదటిసారిగా నిషేధం విధించబడి, కాంగ్రెస్ పాలనలో నిర్బంధ విధానం మొదలయ్యాక, తాము అధికారంలోకి వస్తే ఆ నిర్బంధాన్ని తొలగిస్తామని, నిషేధాన్ని ఉపసంహరిస్తామని తెలుగుదేశం అధ్యక్షుడు ఎన్ టి రామారావు ప్రకటించారు. అప్పుడు కూడ మొదటి ఆరు నెలలు ఒక్క ఎన్ కౌంటర్ ఘటన కూడ జరగలేదు. చంద్రబాబు నాయుడు పాలనాకాలంలో అమలయిన నిర్బంధం తర్వాత నక్సలైట్లతో చర్చలు జరుపుతామనే ఎన్నికల వాగ్దానంతో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పాలన లోనూ మే 2004 నుంచి జనవరి 2005 వరకూ ఒక్క ఎన్ కౌంటర్ కూడ జరగలేదు. ఈ మూడు ఉదాహరణలూ చెప్పేదేమంటే ఎన్ కౌంటర్లు పాలకవిధానాలలో భాగంగానే జరగాలంటే జరుగుతాయి, ఆగిపోవాలంటే ఆగిపోతాయి అని.

నిజానికి రాజ్యాంగం ప్రకారం ఎంతటి నేరస్తులకైనా తగిన చట్టబద్ధమైన విచారణ ప్రక్రియ జరపకుండా శిక్ష విధించడానికి వీలు లేదు. రాజ్యాంగంలోని అధికరణం 21 ఈ దేశంలోని పౌరులందరికీ జీవించే స్వేచ్ఛను హామీ ఇస్తుంది. “చట్టం ప్రకారం నిర్దేశించిన పద్ధతిలో తప్ప” మరొకరకంగా ఎవరి ప్రాణమూ తీయడానికి వీలు లేదని ఆ అధికరణం చెపుతుంది. అంటే విచారణ జరిగే కింది స్థాయి న్యాయస్థానంలో సందేహానికి తావులేని విధంగా వాదనలు జరిగి, నిందితుడికి తనను తాను సమర్థించుకునే పూర్తి అవకాశాలు ఇచ్చి, శిక్ష విధించాలి. ఆ శిక్షను సమీక్షించే అధికారం ఆ పైస్థాయిలో ఉండే హైకోర్టుకూ, ఇంకా పైన ఉండే సుప్రీంకోర్టుకూ ఉంటుంది. ఈ ప్రక్రియ అంతటిలోనూ ఆ నేరం “అరుదైనవాటిలో కెల్లా అరుదైనది”గా ఉంటేనే మరణశిక్ష విధించాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. ఇంత జరిగిన తర్వాత కూడ నిందితులకు క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి అర్జీ పెట్టుకునే అవకాశం ఉంటుంది. అది కూడ విఫలమయితేనే మరణ శిక్ష అమలవుతుంది. దేశంలో నిజంగా నేరస్తుల విషయంలోనే మరణశిక్షకు ఇంత సుదీర్ఘమైన, చట్టబద్ధమైన విచారణా క్రమం ఉండగా రాజకీయ ప్రత్యర్థులను మట్టుపెట్టడానికి పాలకులు ఎటువంటి దర్యాప్తూ, పరిశోధనా, విచారణా, వాదనా అక్కరలేని సరాసరి మరణశిక్షగా ఎన్ కౌంటర్ పద్ధతి తయారు చేశారు.

“చట్టబద్ధ పాలన అవసరం లేదు, మన అవసరాల కోసం చట్టాన్ని పక్కనపెట్టి, అతిక్రమించి, మన ఇష్టారాజ్యంగా నడపవచ్చు” అని ఒకసారి, ఒక అవసరం కోసం అనుకుంటే, ఇక అది భస్మాసుర హస్తమై అలా అనుకున్నవాళ్ల మీదికి కూడ వస్తుంది. అలా చట్టాతీత హత్యల పరంపరకు శిక్షలు పడడం, ఆ పరంపరను అనుమతించినవాళ్లు ప్రజాన్యాయస్థానంలోనో, కనీసం ప్రత్యర్థి రాజకీయాల క్రీడలో భాగంగా మామూలు న్యాయస్థానాలలోనో బోను ఎక్కక తప్పడం లేదు. ఇప్పటికే కాశ్మీర్ లో, ఢిల్లీలో, కేరళలో ఎన్ కౌంటర్ పేరిట హత్యలు చేసిన పోలీసు అధికారులకు శిక్షలు పడ్డాయి. గుజరాత్ లో సోహ్రాబుద్దీన్ షేక్, కౌసర్ బీ హత్య కేసు సిబిఐ విచారణ జరిపింది. గీతా జోహ్రీ వంటి నిజాయితీపరురాలైన సిబిఐ అధికారి వల్ల వంజారా వంటి డిజి స్థాయిలోని అత్యున్నత పోలీసు అధికారులు, చివరికి అమిత్ షా వంటి హోం మంత్రి కూడ జైలు పాలయ్యారు.

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం సుప్రీం కోర్టు పర్యవేక్షణలో, సిబిఐ ఆధ్వర్యంలో నమోదయిన ఆజాద్ హత్య కేసు ఎంత దూరం సజావుగా వెళ్లగలుగుతుందో చూడాలి. అయితే ఇక్కడ కేవలం హత్యానేరం మాత్రమే అయితే ఇప్పుడు నమోదయిన పేర్లు సరిపోతాయి. (నిజానికి ఇటువంటి హత్యలు చేసే ప్రత్యేక బలగాలు వేరు. వాళ్లు నక్సలైట్లను పట్టుకుని, చంపి, మృతదేహాలను కావాలనుకున్న చోట పడేసి, అప్పుడు “మీ పరిధిలో మృతదేహాలున్నాయి. వెళ్లి మీరే ఎన్ కౌంటర్ చేశారని క్లెయిమ్ చేసుకోండి” అని స్థానిక పోలీసులకు చెపుతారు. ఒక సుప్రసిద్ధమైన ఉదాహరణలో అప్పటి పీపుల్స్ వార్ అగ్రనాయకులను ముగ్గురిని బెంగళూరులో అరెస్టు చేసి, చంపేసి, హెలికాప్టర్ లో మృతదేహాలు తీసుకువచ్చి కరీంనగర్ జిల్లాలో పడేశారు. ఆ సమయానికి తన పెళ్లి శుభలేఖలు పంచుకుంటూ హైదరాబాద్ లో తిరుగుతున్న ఎస్పీకి ఆ కబురు అంది హడావుడిగా జిల్లాకు వెళ్లి తన ఆధ్వర్యంలోనే ఆ ఎన్ కౌంటర్ జరిగిందని చెప్పుకున్నాడు!!) కాని ఇప్పుడు సిబిఐ ‘నేరస్వభావం గల కుట్ర’ అనే అభియోగాన్ని కూడ మోపినందువల్ల, స్వామి అగ్నివేశ్ చెప్పినట్టు కేంద్ర హోంమంత్రి పళనియప్పన్ చిదంబరం దగ్గరినుంచి కింది స్థాయి వరకూ చాలమంది నిందితులను ఇందులో చేర్చవలసి ఉంటుంది. అలాగే ఆజాద్ ఎన్ కౌంటర్ జరిగిననాటినుంచీ “అది నిజమైన ఎన్ కౌంటరే” అని ప్రకటిస్తున్న వాళ్లందరూ కూడ జరిగిన నేరాన్ని కప్పిపుచ్చడం, నేరస్తులను రక్షించడం, సాక్ష్యాధారాలను మాయం చేయడం, దర్యాప్తు ప్రక్రియను ప్రభావితం చేయడం అనే నేరాలు చేసినట్టు లెక్క. కనుక అటువంటి ప్రకటనలు చేసినవారందరినీ కూడ ప్రస్తుత సిబిఐ దర్యాప్తు విచారణలో భాగం చేయవలసి ఉంటుంది. అటువంటి ప్రకటన సంబంధిత శాఖాధిపతులు చేయడం ఒక ఎత్తయితే, ఆ శాఖతో ఎటువంటి సంబంధంలేనివాళ్లు, రాజ్యాంగబద్ధమైన అధికార స్థానంలో ఉన్నవాళ్లు చేయడం మరొక ఎత్తు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కూడ అటువంటి ప్రకటన చేశారు.

ఆజాద్ మీద రాసిన ఒక వ్యాసంలో అమిత్ భాదురి ‘క్రానికల్ ఆఫ్ ఎ డెత్ ఫోర్ టోల్డ్’ (ముందే తెలిసిన మరణపు గాథ) అని అంతకు ముందు తాను ఒక ఎన్ కౌంటర్ లో చనిపోయానని వచ్చిన వార్తకు ఆజాద్ ప్రతిస్పందనను ఉటంకించారు. అది మాత్రమేకాదు, ఆజాద్ రాజకీయ జీవితం ప్రారంభానికీ, మరణానంతర ఎన్ కౌంటర్ వివాదానికీ కూడ సంబంధం ఉంది.

ఎమర్జెన్సీలో గిరాయిపల్లి ఎన్ కౌంటర్ అనే సుప్రసిద్ధమైన కేసులో మరొక ముగ్గురితో పాటు హత్యకు గురయిన వరంగల్ రీజినల్ ఇంజనీరింగ్ కాలేజి విద్యార్థి సూరపనేని జనార్దన్ కు జూనియర్ గా చెరుకూరి రాజకుమార్ రాజకీయాల్లోకి వచ్చారు. ఎమర్జెన్సీలో జరిగిన ఎన్ కౌంటర్ల మీద లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఒక ప్రైవేట్ విచారణ కమిటీని నియమించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వి ఎం తార్కుండే అధ్యక్షతన సాగిన ఆ విచారణ కమిటీ మొదటిసారిగా 1975-77 కాలం నాటి ఎన్ కౌంటర్లను విచారించి “ఎన్ కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలే” అనే నివేదికను ప్రచురించింది. ఆ నివేదిక ఆధారంగా జస్టిస్ వశిష్ట భార్గవ నాయకత్వాన న్యాయవిచారణ కమిషన్ నియామకం జరిగింది. ఆ కమిషన్ మూడు ఎన్ కౌంటర్ ఘటనలను విచారించడానికి పూనుకుని, ఒక్క గిరాయిపల్లి ఘటన మీద మాత్రం విచారణ పూర్తి చేసింది. చెరుకూరి రాజ్ కుమార్ ఆ విచారణకు సంపూర్ణంగా సహకరించారు, సిద్ధిపేటలో వారాల తరబడి ఉండి, గిరాయిపల్లి ప్రాంతంలో మనిషి మనిషినీ కలిసి సాక్ష్యాలు సేకరించి, న్యాయవాది కన్నబిరాన్ కు అందజేసి ఆ విచారణలో పోలీసుల హంతక పాత్రను వెలికి తేవడంలో అపారమైన కృషి చేశారు. బహుశా ఆ కృషి వల్లనే భార్గవా కమిషన్ విచారణలో గిరాయిపల్లి ఎన్ కౌంటర్ లో సూరపనేని జనార్దన్ ను, ముగ్గురు సహచరులనూ వేరువేరు చోట్ల నుంచి పట్టుకుపోయి, చిత్రహింసలు పెట్టి, చివరికి గిరాయిపల్లి అడవిలో చెట్లకు కట్టి కాల్చివేశారని స్పష్టంగా బయటపడింది. ఆ తర్వాత ఆ విచారణ సాగకుండా ప్రభుత్వం విధించిన ఆటంకాలతో అసలు కమిషనే రద్దయిపోయింది.

అలా 1977లో రాష్ట్రంలో బూటకపు ఎన్ కౌంటర్ల మీద మొట్టమొదటి న్యాయవిచారణ కమిషన్ పనిలో విశేష కృషి చేసిన చెరుకూరి రాజ్ కుమార్ (ఆజాద్), 2010లో మరొక బూటకపు ఎన్ కౌంటర్ లో తానే మరణించినా, అసలు బూటకపు ఎన్ కౌంటర్ల మీద మొట్టమొదటి సిబిఐ విచారణకు, మొట్టమొదటి హత్యానేరం నమోదుకూ కారణమయ్యారు. మూడున్నర దశాబ్దాలు గడిచినా పాలకుల క్రౌర్యం మారలేదన్న మాట. ప్రజల ప్రతిఘటనా మారలేదన్నమాట.

About ఎన్.వేణుగోపాల్ N Venugopal

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues.
This entry was posted in వ్యాసాలు, Ee Bhoomi, Telugu. Bookmark the permalink.

2 Responses to సిబిఐ నమోదు చేసిన ఆజాద్ ‘హత్య’ కేసు

  1. Praveen Sarma says:

    CBIని నమ్మలేము.

  2. It is a very nice and informative post.Thanks for sharing your knowledge

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s