తెలంగాణ – భాషా చర్చ – కొన్ని ఆలోచనలు

తెలంగాణ ప్రత్యేక అస్తిత్వ ఆలోచనలలో, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలలో భాగంగా చాల అవసరమైన, అర్థవంతమైన చర్చలెన్నో జరుగుతున్నాయి. ఇంతకు ముందు చర్చకు రాని ఎన్నో అంశాలలో కొత్త ఆలోచనలు, పాత ఆలోచనల సమీక్షలు, పునరాలోచనలు సాగుతున్నాయి.

ఈ విశాల చర్చలో భాగంగా విరివిగా భాషా చర్చ కూడ సాగుతున్నది. దాదాపుగా చరిత్రకారులందరూ ఆమోదించిన ఆంధ్ర-తెలుగు భాషల ఏకత్వం, బి ఎస్ ఎల్ హనుమంతరావు వంటి చరిత్రకారులు దశాబ్దాల కిందనే ప్రతిపాదించిన ‘ఆంధ్ర భాష  – తెలుగు భాష వేరువేరు’ అనే సిద్ధాంతం, తెలంగాణ భాష ప్రత్యేకత వరకూ ఎన్నో వాదనలు, ప్రతివాదనలు జరుగుతున్నాయి. సాధారణంగానే ఇటువంటి చర్చలలో అతివాదాలకు ఎక్కువ అవకాశం ఉంటుంది. అందువల్లనే స్థూలంగా ఒకే శిబిరంలోని వారి మధ్యనే అనవసరమైన తీవ్రతతో చర్చలు జరుగుతున్నాయి. ప్రజలు – పాలకులు అనే విభజన విస్మరణకు గురవుతూ ఒక ప్రాంతంలోని ప్రజలూ పాలకులూ ఒకటే అయినట్టు చర్చ జరుగుతున్నది. పాలకులనూ ప్రజలనూ వేరు చేసి చూడవలసిన దృక్పథం లోపిస్తున్నది. ప్రాంతీయ ఉద్యమ సమయ సందర్భాల రీత్యా ఒక్కోసారి పాలకులకూ ప్రజలకూ మధ్య విభజన రేఖ చెరిగిపోయినట్టు కనిపించినా, ఒకే ఉద్యమంలో ఇరు వర్గాలూ కలిసి పనిచేస్తున్నా, ప్రజా ఉద్యమకారులు ఎప్పటికీ విస్మరించజాలని వైరుధ్యం అది. ఇలా తమ ప్రాంత పాలకవర్గాల మీద అనవసరమైన ఆదరణ చూపిస్తున్న కారణంగానే, ఇతర ప్రాంత ప్రజల మీద అకారణమైన, అనవసరమైన వ్యతిరేకత కూడ వ్యక్తమవుతున్నది. ఇది తప్పనిసరిగా జాగ్రత్త వహించవలసిన అంశం. అవతలి ప్రజలు అని మాత్రమే  కాదు, ఎక్కడయినా ప్రజల మీద వ్యతిరేకత ప్రజా ఉద్యమానికి మంచిది కాదు.

ఈ సందర్భంలోనే ‘నడుస్తున్న తెలంగాణ’లో సాగుతున్న భాషా చర్చ గురించి కొన్ని గుర్తించవలసిన, గుర్తుంచుకోవలసిన విషయాలు పాఠకుల దృష్టికి తేవడం కోసం నాలుగు మాటలు:

ఒకే భాషకు చెందినవారయినా కాకపోయినా పీడిత ప్రజలందరూ ఒకటే, పీడకులూ ఒకటే. ఒక భాషా సమూహం, లేదా ఒక ప్రాంతం మొత్తంగా దోపిడీకీ పీడనకూ గురవుతున్నదంటే ఆ ప్రాంతంలో అందరూ సమానమైన దోపిడీ పీడనలకు గురవుతున్నారని కాదు, దోపిడీ చేసే ప్రాంతంలోని అందరికీ ఆ దోపిడీలో వాటా ఉన్నట్టు కాదు. వర్గ దృక్పథంతో అధ్యయనం చేసినప్పుడు “దోపిడీకి గురయ్యే ప్రాంతం” లోనూ, “దోపిడీ చేసే ప్రాంతం” లోనూ కూడ వర్గ విభజన ఉందని అర్థమవుతుంది. ప్రాంతీయ అసమానతలను, పాలక – పాలిత, పీడక – పీడిత వర్గ విభజనతో కలిపి అధ్యయనం చేయకపోతే అది సంకుచిత, జాతీయ దురహంకారానికి దారితీస్తుంది. ‘అన్ని గడపల్లోన మా గడపమేలు’ అనే అతిశయానికీ, ‘ఇక్కడ పుట్టినదంతా మంచి, అక్కడ పుట్టినదంతా చెడు’ అనే తప్పుడు అవగాహనకూ దారి తీస్తుంది.

‘సీమాంధ్ర’ అనే మాటను ప్రచార సాధనాలు వాడుకలోకి తెచ్చాయి గాని, ఆ మాటకు అర్థం లేదు. రాయల సీమ, ఆంధ్ర అనే రెండు వేరు వేరు పదాలు కలిసి ఏర్పడిందని ఆ పదబంధానికి అర్థం చెప్పుకోవాలనుకున్నా, చారిత్రకంగా కూడ దోపిడీ పీడనల విషయంలో రాయలసీమను కోస్తాంధ్ర తర్వాత పెట్టవలసిందే గాని, ముందు పెట్టడం సాధ్యం కాదు.

అది అలా ఉంచి, ‘సీమాంధ్ర భాష’ అనేదేదీ లేదు. రాష్ట్రంలో కనీసం ఐదు మాండలికాలు (ఉత్తరాంధ్ర, కృష్ణా – గోదావరి డెల్టా, దక్షిణ కోస్తా, రాయలసీమ, తెలంగాణ) ఉన్నాయి. వీటిలో ఒకటి ఎక్కువా కాదు, ఒకటి తక్కువా కాదు. సుదీర్ఘ చరిత్ర క్రమంలో ప్రజలు అభివృద్ధి చేసుకున్న భాషా మాండలికాలు ఇవి. మూల పదసంపద, వాక్యనిర్మాణ పద్ధతులు, వ్యాకరణం ఒకటే అయి, ఉచ్చారణలో, లేఖనంలో, కొన్ని పదాలలో తేడాలు ఉన్నప్పుడు మాండలికాలు అంటారు. ఆ రకంగా ఇవన్నీ తెలుగు మాండలికాలు. వీటన్నిటినీ భాషలుగా చెప్పుకున్నా, అది ఒక స్వతంత్ర ఆత్మగౌరవ ప్రకటనగా అంగీకరించవచ్చు గాని శాస్త్రీయ నిర్వచనం కాదు.

అలాగే ఒక భాషను, లేదా ఒక భాషా సమూహాన్ని మొత్తంగా ఉత్తమమైనదనో, నీచమైనదనో, ఆధిపత్యపూరితమైనదనో, అణచివేయబడినదనో చెప్పడానికి వీలు లేదు. ఆ పని చేసేది, చేయగలిగేది భాషా కాదు, భాషా సమూహమంతా కూడ కాదు. ఆ పని చేసేది పాలకవర్గాలు. సమాజపు వనరుల మీద, మిగులు ఉత్పత్తి మీద, పాలన మీద అధికారం ఉన్న వర్గాలు తమ భాషా సంస్కృతులనే ఆధిపత్య స్థానంలో పెడతాయి. దాని అర్థం ఆ పాలకులకు ఆ భాషనే మాట్లాడుతున్న తమ ప్రాంత ప్రజల మీద ప్రేమ ఉందనో, ఆ భాష మీద ప్రేమ ఉందనో కాదు. అది కేవలం తమ ఆధిపత్యం చాటుకోవడానికే.

దాదాపు పాలకుల భాషలుగా ప్రాధాన్యత పొందిన అన్ని భాషల విషయంలోనూ ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఇవ్వవచ్చు. భారతదేశం మీదా, మొత్తం భూగోళం మీదా ఆధిపత్యం చలాయించిన బ్రిటిష్ పాలకవర్గాలు అన్ని భాషలనూ తొక్కివేసి, ఇంగ్లిష్ ఆధిపత్యాన్ని ప్రవేశపెట్టినప్పటికీ ఆ మేలు, కొద్దిమంది ప్రభువర్గీయులకూ, అప్పుడే వికసిస్తున్న ఇంగ్లిష్, యూరపియన్ పెట్టుబడిదారులకూ తప్ప, ఇంగ్లిష్ మాట్లాడే ప్రజలందరికీ ఏమీ దక్కలేదు. అసఫ్ జాహీల పాలనలో, హైదరాబాదు రాజ్యంలో, కేవలం పాలకుల మాతృభాష అయినందువల్ల, పది శాతం మంది మాత్రమే మాట్లాడే భాషను అధికార భాషగా చేసినా అది ఆ పది శాతం ప్రజలను పేదరికం నుంచీ, పీడన నుంచీ బయట పడవెయ్యలేదు. కనుక భాష వెనుక ఉన్న రాజకీయార్థిక శక్తులు ముఖ్యం గాని, భాష కాదు. భాష ఆ ఆధిపత్యశక్తుల చర్యలకు ఒక సూచిక మాత్రమే.

మరి ఒక పరాయి భాష ఆధిపత్యం సాగుతున్నదనీ, తమ భాషకు అవమానం జరుగుతున్నదనీ ఒక భాషా సమూహం భావించే  మాట కూడ నిజమే. ఇవాళ తెలంగాణ బుద్ధిజీవులలో ప్రాచుర్యంలో ఉన్న ఆలోచన ఇదే. అలా ఆధిపత్యం – అణచివేత జరగడానికి భాషాకారణాల కన్న ఎక్కువగా రాజకీయార్థిక కారణాలు ఉంటాయి, ఉన్నాయి. కృష్ణా – గోదావరి డెల్టాలో 1850లలోనే మొదటి ఆనకట్టలను బ్రిటిష్ ప్రభుత్వం కట్టినందువల్ల, గోదావరి, కృష్ణా జిల్లాలలో (అప్పటి బ్రిటిష్ పాలనలో అవి ఇప్పటిలాగ నాలుగు జిల్లాలు కావు, రెండే జిల్లాలు) వ్యవసాయాదాయం పెరిగింది, మిగులు పెరిగింది. ఆ మిగులునుంచి కొత్త పాలకవర్గం పుట్టుకువచ్చింది. వారి ఆర్థిక ప్రగతి విద్యారంగానికీ, పత్రికారంగానికీ వ్యాపించింది. పందొమ్మిదో శతాబ్దం చివరినాటికే సాహిత్యం వికసించింది. ఆ తర్వాత మూడు నాలుగు దశాబ్దాలలో సినిమా రంగం వికసించింది. ఈ విద్యా, పత్రికా, సాహిత్య, సినిమా సంప్రదాయమంతా గోదావరి – కృష్ణా జిల్లాల మాండలికాన్నే “ప్రామాణిక” భాషగా మార్చాయి. అటువంటి విద్యా, పత్రికా, సాహిత్య, సినిమా ప్రవేశం ఇతర మాండలికాలకు ఆ తర్వాత ఎంతోకాలానికి గాని దొరకలేదు. అందువల్లనే కోస్తాంధ్ర (కచ్చితంగా చెప్పాలంటే గోదావరి – కృష్ణా డెల్టా పాలకవర్గాల) మాండలికం మిగిలిన నాలుగు మాండలికాలను తరతమ స్థాయిలలో అవమానానికి, నిరాదరణకు, హేళనకు గురి చేస్తూనే ఉంది. ఆ మాండలికాల నుంచి కూడ సమైక్యాంధ్ర పాలకవర్గాలలోకి ఎదగగలిగిన పాలకవర్గాల మాండలికాలకు ఆ స్థాయిలో గౌరవం కూడ దక్కింది. కనుక ఇక్కడ చూడవలసింది ఆ మాండలికాలు పొందిన గౌరవానికో, అవమానానికో కారణమైన రాజకీయార్థిక వ్యవస్థనే తప్ప భాషలుగా వాటిని విమర్శించినా, ఆ భాష మాట్లాడే ప్రజలను విమర్శించినా ప్రయోజనం లేదు.

అలా ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి వంద సంవత్సరాల ముందు మొదలయిన రాజకీయార్థిక, సామాజిక పరిణామాల ఫలితమే తెలుగు భాషలో అంతరాలకు కారణం. పాలకవర్గాలు అంటించిన ఆభిజాత్యం, అతిశయం ప్రజలలోకి కూడ పాకి ఉండవచ్చును గాని, ఆ ప్రజలను విమర్శించినంత మాత్రాన ఆ ఆధిపత్య మూలాలను అర్థం చేసుకోలేం. తెలంగాణ ఉద్యమం నిజమైన అర్థంలో ప్రజా ఉద్యమం కావాలంటే అది కోస్తాంధ్ర, రాయలసీమలలోని పీడిత ప్రజలను దూరం చేసుకోగూడదు. సీమాంధ్ర భాష వంటి ప్రయోగాలు ప్రజల మధ్య రావలసిన ఐక్యతను దెబ్బతీస్తాయి. తెలంగాణ పోరాటం కోస్తాంధ్ర, రాయలసీమ పాలకవర్గాల మీద, అరవై సంవత్సరాలుగా ఆ పాలకవర్గాలు అవలంబిస్తున్న విధానాలమీద, హామీల ఉల్లంఘనల మీద, తెలంగాణ అస్తిత్వాన్ని అణచివేసిన విధానాల మీద మాత్రమే గాని, ఇతర ప్రాంతాల ప్రజలకు వ్యతిరేకంగా కాదు. మొత్తంగా జరిగిన దోపిడీ, పీడనలలో కొద్ది వాటా అక్కడి ప్రజలకు కూడ అంది ఉండవచ్చును గాని, అది పాలక విధానాల ఫలితమే తప్ప ఆ ప్రజల కోరిక వల్ల కాదు.

చరిత్రలోకి వెళితే నిజాం రాచరికం మీద, భూస్వామ్యం మీద పోరాటం ముస్లింల మీద కాదు, బ్రిటిష్ వలసవాదుల మీద పోరాటం బ్రిటిష్ ప్రజల మీద కాదు. ఇవాళ తెలంగాణ ఉద్యమ తీవ్రతలో ఈ విషయాలు కాస్త విస్మరణకు గురవుతున్నట్టు కనిపిస్తున్నాయి.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Telangana. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s