ప్రజాభిప్రాయ సేకరణా? సంహరణా?

వీక్షణం జూన్ 2011 కొరకు

ప్రభుత్వం గాని, ప్రభుత్వ అనుమతితో ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు గాని ఎక్కడైనా “అభివృద్ధి పథకాలు” చేపట్టేటప్పుడు ఆ పథకాలు ఏ ప్రాంత ప్రజల జీవితంపై, ఉపాధిపై, వనరులపై, పర్యావరణంపై ప్రభావం వేసే అవకాశం ఉందో ఆ ప్రజల అభిప్రాయాలు సేకరించి, ఆ అభిప్రాయాలకు అనుగుణంగా పథకాలలో మార్పులు, చేర్పులు చేయాలని ప్రజాసంక్షేమ చట్టాలు చెపుతాయి. నిర్దిష్టంగా అటవీ (సంరక్షణ) చట్టం (1980), పర్యావరణ (పరిరక్షణ) చట్టం (1986), షెడ్యూల్డ్ ప్రాంతాల పంచాయత్ విస్తరణ చట్టం (1996) వంటి చట్టాలు, కేంద్ర ప్రభుత్వ పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ వేరువేరు సమయాలలో జారీ చేసిన ఉత్తర్వులు  ప్రతి పథకానికీ పర్యావరణ ప్రభావ మదింపు అవసరమని నిర్దేశించాయి. ఆ మదింపులో ప్రజాభిప్రాయ సేకరణ అనే ప్రక్రియ తప్పనిసరిగా ఉండాలని 1997 నుంచీ నిర్దేశిస్తున్నారు. ఆ ప్రజాభిప్రాయ సేకరణ ఎలా జరపాలో ఆ చట్టాలు, వేర్వేరు ప్రభుత్వ ఉత్తర్వులు స్పష్టంగా, నిర్దిష్టంగా నిర్దేశించాయి.

ఏదైనా పథకం గురించి ప్రభుత్వంగాని, ప్రైవేటు పెట్టుబడిదారులు గాని ఆలోచించి, ఆ పథకానికి తగిన స్థలం ఎంపిక చేసుకోగానే, ఆ పథకం వల్ల ఆ స్థలంలోని ప్రజలపై, పర్యావరణంపై పడే ప్రభావం గురించి మదింపు నివేదికను తయారు చేయాలి. లేదా చేయించాలి. ఆ నివేదికతో ఆ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి దరఖాస్తు చేసి వారి దగ్గరినుంచి అనుమతి సంపాదించాలి. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వ కాలుష్య నియంత్రణ  మండలి ఆ పథకం అమలయ్యే ప్రాంతంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలి. ఆ సమావేశాన్ని స్థానిక జిల్లా కలెక్టర్ గాని, కలెక్టర్ ప్రతినిధి గాని నిర్వహించాలి. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రతినిధి, రాష్ట్ర ప్రభుత్వంలో పర్యావరణానికి బాధ్యత వహించే అధికారి, స్థానిక సంస్థల ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక ప్రజలు, పర్యావరణ బృందాలు ఈ ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనాలి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని పర్యావరణ పరిశీలనా కమిటీ ఈ ప్రజాభిప్రాయ సేకరణ నివేదిక ఆధారంగానే ఆ పథకాన్ని అనుమతించవచ్చునా, నిరాకరించవలసి ఉంటుందా, మార్పులు సూచించవలసి ఉంటుందా నిర్ణయిస్తుంది, అంటే చట్ట ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ నివేదిక మీద నిర్ణయం జరిగేదాకా ఒక పథకం పని మొదలు కావడానికే వీలు లేదు.

కాని దేశంలో ఇంతవరకూ జరిగిన వందలాది ప్రజాభిప్రాయ సేకరణలలో ఒక్కటైనా నిజంగా ప్రజాభిప్రాయాన్ని సేకరించడానికి జరగలేదు. పెట్టుబడిదారులు, “అభివృద్ధి పథకాల” మదుపుదార్లు, బహుళజాతి సంస్థలు, అధికారులు, ప్రభుత్వాలు కోరుకున్న ఫలితాలు రాబట్టడానికి తూతూ మంత్రంగానే ఈ ప్రజాభిప్రాయ సేకరణలను జరుపుతున్నారు. ప్రజాభిప్రాయ సేకరణలను నిబంధనల ప్రకారంగాని, ప్రజానుకూలంగా గాని జరపడం లేదు. నిజంగా ఆ పథకం వల్ల నష్టపోయే ప్రాంతాలకు దూరంగా సమావేశాలు నిర్వహించడం, ఆ పథకంవల్ల లాభపడే పెట్టుబడిదారులకు అనుకూలమైనచోట నిర్వహించడం, వ్యతిరేకంగా మాట్లాడతారనుకున్నవాళ్లను రాకుండా చేయడం, అనుకూలంగా మాట్లాడే దళారులను, దొంగ సాక్షులను తయారు చేసి పెట్టుకోవడం, సమావేశ స్థలంలో విపరీతంగా పోలీసులను మోహరించి ప్రజలను భయపెట్టడం, వ్యతిరేకంగా మాట్లాడేవారికి, పథకం వల్ల జరిగే నష్టాలను వివరించేవారికి తగినంత సమయం ఇవ్వకపోవడం, వారిని బెదిరించడం, వారు స్థానికులు కాదని, ఆ రంగంలో నిపుణులు కాదనీ అభ్యంతరాలు చెప్పడం, చిట్టచివరికి వ్యతిరేకాభిప్రాయాలన్నిటినీ అణచివేసి ప్రజాభిప్రాయ సేకరణలో అనుకూల అభిప్రాయాలే వచ్చాయని నివేదికలు తయారు చేయడం ఆనవాయితీ అయింది. అంతకన్న ఘోరంగా ప్రజాభిప్రాయ సేకరణ జరపడానికి కొన్ని సంవత్సరాల ముందుగానో, నెలల ముందుగానో ఆ పథకాల పనులు ప్రారంభమై పోతున్నాయి. తవ్వకాలు, నిర్మాణాలు, కాంట్రాక్టర్లకు చెల్లింపులు, అవసరమైన సామగ్రి సేకరణ జరిగిపోతున్నాయి. అలా వందల కోట్ల రూపాయలు ఖర్చయిన తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ జరపడం అంటే అది కేవలం నామమాత్రమే తప్ప చట్టబద్ధం కాదు.

ప్రజాభిప్రాయ సేకరణ పేరిట ప్రభుత్వాలు, పాలకులు ఎన్ని ఘోరాలు జరుపుతున్నారో, ప్రజాభిప్రాయాన్ని సంహరించడానికి, ప్రజాభిప్రాయాన్ని వినిపించేవారిని అణచివేయడానికి, ప్రజాభిప్రాయం అనేదాన్ని మసిపూసి మారేడుకాయ చేయడానికి ఎలా ప్రయత్నిస్తున్నారో తెలుసుకోవడానికి ఈ నెలలో రాష్ట్రంలో జరిగిన మూడు ప్రజాభిప్రాయ సేకరణ సమావేశాలు ఉదాహరణగా నిలుస్తాయి.

వీటిలో మొదటిది డా. బి ఆర్ అంబేద్కర్ ప్రాణహిత – చేవెళ్ల సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం అనే రు. 40 వేల కోట్ల పథకానికి సంబంధించినది. ఈ పథకం ఆదిలాబాద్ జిల్లా లోని తుమ్మిడిహట్టి నుంచి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వరకూ ప్రతిపాదిస్తున్న 340 కి.మీ. కాలువలకు, సొరంగాలకు, గొలుసు జలాశయాలకు సంబంధించినది. తెలంగాణలో ఏడు జిల్లాల ద్వారా సాగే ఈ పథకం లక్షలాది మంది ప్రజలను ప్రభావితం చేస్తుంది. భూములనుంచి, ఉపాధి నుంచి నిర్వాసితులను చేస్తుంది. దాదాపు ఒక లక్ష ఎకరాల భూమి ముంపుకు గురవుతుంది.

అయినా ఎటువంటి ప్రజాభిప్రాయ సేకరణ జరగకుండానే, అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి సరిగ్గా ఎన్నికల ముందు నవంబర్ 2008లో ఈ పథకానికి చేవెళ్లలో శంకుస్థాపన చేశాడు. నాలుగేళ్లలో ఈ పథకం పూర్తవుతుందన్నాడు. అప్పుడే బడ్జెట్ కేటాయింపులు, టెండర్లు, కాంట్రాక్టర్లకు చెల్లింపులు మొదలయ్యాయి. ఈ ప్రాజెక్టు నమూనా తయారీ కోసం కన్సల్టెంట్లకు రు. 1100 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారని, చిన్నమెత్తు పని కూడ జరగకముందే రు. 600 కోట్లు ఇచ్చేశారని, స్వయంగా శాసనసభలో ప్రజా పద్దుల కమిటీ ఎత్తిచూపి తప్పుపట్టింది. ఈ దొంగల దోపిడీ ప్రారంభమైన రెండున్నర సంవత్సరాల తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ తతంగం మొదలయింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, నల్లగొండ, వరంగల్, రంగారెడ్డి జిల్లాలలో ఏప్రిల్ 19 నుంచి మే 10 వరకూ ప్రజాభిప్రాయ సేకరణలు జరపాలని రాష్ట్రప్రభుత్వ కాలుష్య నియంత్రణ మండలి నిర్ణయించింది. అందులో భాగంగా ఏప్రిల్ 30న కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో బహిరంగ మైదానంలో ఈ సమావేశం జరిగింది.

ఈ ప్రాణహిత – చేవెళ్ల ఎత్తిపోతల పథకం ఆర్భాటంగా ప్రారంభమై, కంట్రాక్టర్ల, రాజకీయ నాయకుల జేబులు నింపడానికే సాగుతున్నది గాని దానివల్ల ప్రజలకు ఒరగబోయేదేమీ లేదనే విమర్శలు మొదటినుంచీ ఉన్నాయి. ఎక్కడినుంచి ఎన్ని నీళ్లు ఎత్తిపోస్తామంటున్నారో అక్కడ అన్ని నీళ్లు లేవు. ఉన్నా వాటిని ఎత్తిపోయడానికి అవసరమయ్యే విద్యుచ్ఛక్తి లేదు. కొత్త విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేసినా, నీళ్లు తీసుకునే చోటినుంచి చేర్చవలసిన చోటికి ఉన్న అంతరం వల్ల అది సులభంగా సాధ్యమయ్యే పని కాదు. ఈ దారిలో కాలువల వల్ల, సొరంగాలవల్ల, కొత్త జలాశయాల వల్ల (అవి నిండకపోయినా) ప్రజలు కోల్పోయిన భూమి, నిర్వాసిత సమస్య, పునరావాస సమస్య తీర్చడానికి ప్రభుత్వం దగ్గర ఎటువంటి ఆలోచనా లేదు. అవన్నీ తర్వాత, ఇప్పుడైతే కాంట్రాక్టర్లకు డబ్బులు అందించవచ్చునని, వాటిలోంచి తమ ముడుపులు దండుకోవచ్చునని రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు తలపోస్తున్నారు. ఈ దీర్ఘకాలిక ప్రశ్నలు ఎలా ఉన్నా, ఈ ప్రాజెక్టు పనులలో భాగంగా కాంట్రాక్టర్లు ఇల్లంతకుంట, అనంతగిరి గ్రామాలలో సొరంగాల కోసం భూమిని తవ్వి, పక్కన మట్టిదిబ్బలు పోశారు. అందువల్ల తవ్వకంలోనూ, మట్టి దిబ్బల వల్లా భూమి కోల్పోయిన గ్రామాల రైతులు ప్రభుత్వం మీద, అధికారుల మీద, కాంట్రాక్టర్ల మీద ఆగ్రహంగా ఉన్నారు. ప్రజాభిప్రాయ సేకరణతో వారి ఆగ్రహ ప్రకటనకు అవకాశం దొరికింది.

ఆ సమావేశంలో ప్రజలు, ప్రజల తరఫున సామాజిక కార్యకర్తలు లేవనెత్తిన అనేక ప్రశ్నలకు అధికారులు సమాధానాలు చెప్పలేదు. ఏదో ఒక రకంగా ఎన్నికలలో గెలిచినంత మాత్రాన తమను తాము ప్రజాప్రతినిధులమని చెప్పుకునేవారిలో ఒకరిద్దరు మాత్రం ఆ సమావేశంలో ప్రజాప్రతినిధులుగా కాక కాంట్రాక్టర్ల ప్రతినిధులుగా, ప్రభుత్వ ప్రతినిధులుగా వ్యవహరించారు. ప్రశ్నలు వేసిన వారిని అడ్డుకున్నారు. ఎదురు ప్రశ్నించారు. ప్రాజెక్టు నష్టాలను వివరిస్తున్నవారి ఉపన్యాసాలను మధ్యలో ఆపివేశారు. (ఈ ప్రజాభిప్రాయ సేకరణ ఎంత హాస్యాస్పదంగా జరిగిందో తెలుసుకోవాలంటే ఎవరైనా యూట్యూబ్ మీద ఉన్న పదిహేను నిమిషాల చిత్రీకరణను చూడవచ్చు). చివరికి ఈ పథకం గురించి సంపూర్ణ అధ్యయనం చేసి, శాస్త్రీయంగా, ప్రజానుకూలంగా తన వాదనలు వినిపిస్తున్న శాతవాహన విశ్వవిద్యాలయ అధ్యాపకురాలు సూరేపల్లి సుజాతను ఒక శాసనసభ్యుడు వ్యక్తిగతంగా, నీచంగా దూషించాడు. రాయడానికి వీలులేని బూతులు ప్రయోగించాడు. తన అనుచరులను ఆమె మీదికి ఉసిగొల్పాడు. ఆమె స్థానికురాలు కాదు గనుక, బాధిత రైతు కాదు గనుక మాట్లాడడానికి వీలు లేదన్నాడు. అధ్యాపకురాలిగా ఆమె పని విద్యార్థులకు పాఠాలు చెప్పడమే తప్ప, ఇటువంటి చోట మాట్లాడడం కాదన్నాడు. అంతకుముందు కొందరు ప్రజాప్రతినిధులు ప్రాజెక్టు గురించి సరిగానే స్పందించినప్పటికీ, ఈ దూషణ పర్వం కొనసాగుతుంటే మాత్రం మౌనంగా ఉండి పోయారు.

తన అనుభవం గురించి ఆమె మాటల్లోనే చెప్పాలంటే, “అసలు నేను చేసిన తప్పు ఏమిటో నాతో సహా అక్కడ ఉన్న ఎవరికీ అర్థం కాలేదు. ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు మాట్లాడరా? ప్రశ్నించరా? ఆయన చెప్పిన అభ్యంతరాలు నాది ఈ జిల్లా కాదని. నేను రైతును కాదని. పాఠాలు తప్ప ఇంకో పని నేను చేయకూడదని. మరి ఎవరు ఏ పని చేయాలో ఆయన సెలవు ఇవ్వలేదు. ఈ తతంగం అంతా చూస్తున్న మీడియా మాత్రం కనీసం రిపోర్ట్ చేయలేదు. ఒకరో ఇద్దరో కాస్త రాశారు. రెండోరోజు ప్రజాసంఘాల నిరసనకి పత్రికలూ రాయక తప్పలేదు. అంటే మీడియాకి, ప్రజాప్రతినిధులకి, పార్టీలకి న్యాయకోణం గాని, జెండర్ కోణం గాని ఉన్నాయా అని ప్రశ్న వేసుకోవాలి. ఇక్కడ కులం దృష్టి లోంచి చూడడం కాదు, ఒక మహిళగా, బేలగా కూడ కాదు. సమస్య గురించి ఎవరు మాట్లాడాలన్నదే అసలు సంగతి…. అంతో ఇంతో చదువుకొన్న నా పరిస్థితే ఈవిధంగా ఉంటే మరి మామూలు మనుషులు, ఆడవాళ్ల పరిస్థితి?”

“ఇక్కడ జరిగిన సంఘటన తెలంగాణలో, ఇక్కడి ప్రజాప్రతినిధుల సమక్షంలో, ఇక్కడి వనరుల కోసం ఇక్కడి వ్యక్తులు ప్రశ్నించారు. కాని ఫలానా ఆయన దళిత ఎమ్మెల్యే కాబట్టి నేను గాని, ఎవరు గాని మాట్లాడొద్దని ఎన్నో అభ్యర్థనలు. న్యాయం కోసం మాట్లాడని వాడు నాయకుడు ఎట్లా అవుతాడు? న్యాయం తరువాతనే కులం, మతం, ప్రాంతం కదా? … ఈ ప్రపంచంలో అన్యాయాన్ని ఎదిరించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది, దానికి వీసా, పాస్ పోర్ట్ అవసరం లేదు. ఇక్కడి పోలీసు అధికారులు నాకో కొత్త పాఠం చెప్పారు: నేను ప్రజల దగ్గరికి వెళ్లకూడదట, ఏదైనా కోర్టులో మాత్రమే తేల్చుకోవాలట. చిన్న పాటి బెదిరింపు. ఇంకా విచిత్రం ఏమంటే, ఒక కాంట్రాక్టర్ వచ్చి ఇక్కడ రెండు సంవత్సరాలుగా పని చేస్తుంటే, భూములు తీసుకొని మట్టి దిబ్బలుగా మారుస్తుంటే, ప్రజాప్రతినిధులు మాకు ఏమి తెలియదు అనడం విడ్డూరం కాదా?…”

ఇక మరొక ప్రజాభిప్రాయ సేకరణ విశాఖపట్నం జిల్లా డుంబ్రిగూడ మండలం సరాయి గ్రామంలో మే 10న జరగబోయి, ప్రజా ఆగ్రహం వల్ల ఆగిపోయింది. ఆ గ్రామంలోని సర్వే నం. 122 లో చైనా క్లే అనే ఖనిజాన్ని తవ్వుకునేందుకు ముచ్చిక భూదేవి అనే ఆదివాసి స్త్రీ తలపెట్టిన పథకం గురించి ప్రజాభిప్రాయ సేకరణ అది. అక్కడ దాదాపు పదహారు హెక్టార్ల భూమిలో 60 లక్షల టన్నుల చైనా క్లే ఖనిజం ఉందని అంచనా. ఆ ఖనిజానికి ప్రస్తుత మార్కెట్ విలువ ఆరువందల కోట్ల రూపాయల పైనే. ఆ ఖనిజం పింగాణీ పాత్రల తయారీలో, రంగులు, కాగితం, రబ్బర్, సిరామిక్, గాజు, ఫైబర్ పరిశ్రమల్లో ఉపయోగపడుతుంది. ఒక టన్ను ధర కనీస పక్షం వెయ్యి రూపాయలు ఉంటుందని అంచనా. ఏడాదికి పదిహేను వేల టన్నులు తవ్వుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ దరఖాస్తుదారుకు ఇప్పటికే అనుమతినిచ్చింది. షెడ్యూల్డ్ ప్రాంతాల పంచాయత్ విస్తరణ చట్టం ప్రకారం గ్రామసభ ఆమోదం ఉంటేనే ఈ అనుమతి ఇవ్వాలి. అప్పుడు కూడ వ్యక్తుల పేర్ల మీద కాక ఆదివాసుల సహకార సంఘాలకు ఇవ్వాలి. కాని గ్రామస్తులలో ఎవరికీ తెలియకుండానే ఈ అనుమతులు మంజూరయ్యాయి. బేనామీ పేరుతో దాఖలయిన దరఖాస్తుతో పాటు గ్రామసభ తీర్మానం చేసినట్టు తప్పుడుపత్రం కూడ సృష్టించి అనుమతి సంపాదించారు. ఈ అక్రమాలన్నీ అయిన తర్వాత, ఆ అనుమతిని ఖరారు చేయడం కోసం కేవలం తూతూ మంత్రంగా ప్రజాభిప్రాయ సేకరణ జరప తలపెట్టారు.

నిజానికి ఈ ఖనిజం డుంబ్రిగూడ మండలంలో కనీసం 24 గ్రామాలలో ఉందని అంచనా. సరాయి గ్రామంలోని ఒక సర్వే నంబర్ లో తవ్వకాలను ప్రయోగాత్మకంగా ప్రారంభించి, మొత్తంగా మండలమంతటికీ విస్తరించాలని, మొత్తంగానే ఏజెన్సీలో ఉన్న అనేక విలువైన ఖనిజాలను తవ్వుకుపోవాలని ఖనిజ మాఫియా ఆలోచన. స్థానిక రాజకీయ నాయకులు ఈ ఖనిజ మాఫియాకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తున్నారు.

తమ ప్రాంతం నుంచి ఖనిజనిలువలను తవ్వుకుపోవడానికి సాగుతున్న కుట్రలను ఎప్పటినుంచో గమనిస్తూ, వ్యతిరేకిస్తున్న విశాఖ ఏజెన్సీ ఆదివాసులు ఈ చైనా క్లే తవ్వకాల ప్రతిపాదన మీద కూడ నిరసన తెలిపారు. దానితో ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణను వాయిదావేసి, ఆదివాసులను చల్లార్చే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా పడిందని తెలియక కొంత, అలా ప్రకటించి కూడ దొంగచాటుగా అధికారులు వస్తారేమోనని కొంత, ఆదివాసులు చెట్లు కొట్టి రోడ్లకు అడ్డంగా పడేసి, గ్రామానికి దారి మూసేశారు. ప్రజాభిప్రాయ సేకరణ జరగవలసిన సమయానికి గ్రామంలో గుమిగూడారు. వారిని తవ్వకాలకు అనుకూలం చేయడం కోసం అక్కడికి వెళ్లిన స్థానిక శాసనసభ్యుడిని, మండల ప్రజాపరిషత్ సభ్యుడిని ఆదివాసులు నిలదీశారు. కాంట్రాక్టర్ల దగ్గర, ఖనిజ మాఫియాల దగ్గర డబ్బు తీసుకుని, ఆదివాసుల పేర్లతో బేనామీ దరఖాస్తులు చేయించి ఖనిజ నిలువలు కొల్లగొడుతున్నారంటూ ఆదివాసులు “ప్రజాప్రతినిధులను” నిలదీసి తూర్పారబట్టారు. దాడిచేశారు. ఆదివాసి మహిళలే ముందు నిలిచి కర్రలు పట్టుకుని ఎంపిపిని వెంటాడారు, పేడ చల్లారు. రాళ్లు, గొడ్డళ్లు, విల్లంబులు, కత్తులు పట్టుకుని తరిమికొట్టారు. గాయపడి, చొక్కా చిరిగి ఎంపిపి పారిపోవలసి వచ్చింది. ఆదివాసులు ఎమ్మెల్యేతో వాదన పెట్టుకుని, అతని వాహనాన్ని ధ్వంసం చేశారు. తాను ఖనిజ తవ్వకాలకు వ్యతిరేకమని, ఇక్కడ జరిగిందంతా తనకు తెలియకుండా జరిగిందని అంటూ శాసనసభ్యుడు తప్పించుకున్నాడు. వాహనం ధ్వంసం కావడంతో డుంబ్రిగూడకు కాలినడకనే వెళ్లిపోయాడు.

ఇక మూడో ప్రజాభిప్రాయ సేకరణ విశాఖపట్నం సమీపంలోని గంగవరం ప్రైవేటు ఓడరేవు సామర్థ్యాన్ని ప్రస్తుత ఒక కోటి అరవై ఐదు లక్షల టన్నుల నుంచి నాలుగు కోట్ల పది లక్షల టన్నులకు పెంచడానికి వీలుగా నాలుగు కొత్త బెర్త్ లు నిర్మించే పథకం. పర్యావరణానికి పెద్ద ఎత్తున హాని కలిగించే ఈ ఓడరేవు విస్తరణ కార్యక్రమం అమలు జరపవద్దని కోరుతూ కొన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మత్స్యకారులు ఆందోళన ప్రారంభించారు. పోర్టు ఆవరణలో, ప్రైవేటు యాజమాన్యం కనుసన్నల్లో మొదలైన ఈ ప్రజాభిప్రాయ సేకరణకు న్యాయబద్ధత ఏమిటని ఆందోళనకారులు ప్రశ్నించారు. ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభం కాకుండానే మూడు గంటల పాటు నిరసన కార్యక్రమం జరిగింది. పోర్టు లయజాన్ ఆఫీసర్ పోర్టు విస్తరణ జరపాలని తానే రాసిన ఐదు వినతి పత్రాలను ఐదుగురు నిరక్షరాస్య మత్స్యకారులతో జాయింట్ కలెక్టర్ కు ఇప్పించడానికి ప్రయత్నించగా ఆందోళనకారులు అది గుర్తించి, బయటపెట్టారు. జాయింట్ కలెక్టర్ ఆ వినతిపత్రాలను తిరస్కరించక తప్పలేదు. విపరీతంగా పోలీసులను మోహరించి, డజన్ల కొద్దీ ఆందోళనకారులను అరెస్టు చేశారు. లాఠీఛార్జి చేశారు. అక్కడికి చేరిన పోలీసులు పోర్టు అధికారి ఆదేశాల ప్రకారం పనిచేశారు. ఆయన గతంలో పోలీసు అధికారిగా పనిచేసి ప్రస్తుతం పోర్టులో అధికారిగా ఉన్నాడు,

నిజానికి గంగవరం మొదటి దశలోని నిర్వాసితుల సమస్యల పరిష్కారమే జరగలేదు. పోలీసు కాల్పులు కూడ జరిగి, ఒక మత్స్యకారుడు మరణించి, రాష్ట్రమంతా గగ్గోలు పుట్టినా, అప్పుడు లేవనెత్తిన పునరావాసం, ఉద్యోగకల్పన, నష్టపరిహారం వంటి సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయి. అప్పుడు అంగీకరించిన కాలుష్య నియంత్రణ పథకాలు అమలులోకి రాలేదు. కాని మరింత కాలుష్యానికి దారితీసే కొత్త విస్తరణ పథకానికి ప్రభుత్వమూ ఆమోదించింది. తూతూ మంత్రపు ప్రజాభిప్రాయ సేకరణా ప్రారంభించింది. పోలీసుల మోహరింపుతో, లాఠీఛార్జితో, అరెస్టులతో ప్రజాభిప్రాయ ప్రకటన జరగలేదు గనుక బహుశా ప్రజాభిప్రాయం అనుకూలంగానే ఉందనే నివేదికా రావచ్చు, ఈ పథకానికి అనుమతులూ దొరకవచ్చు.

ఈ మూడు ఉదంతాలనుంచి గ్రహించవలసిన అంశాలు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న వ్యవస్థలో పాలకవిధానాలలో ఎక్కడో ఒకచోట ప్రజానుకూల అంశాలు ఉన్నా, చట్టంలో పొందుపరచినా అవి అమలు కావు. రాజకీయ, అధికార వర్గాల దోపిడీ, పీడన, అణచివేత, లాభార్జనలే ప్రధానమైపోయి, ప్రజానుకూల చట్టాలు కేవలం ప్రదర్శన వస్తువులుగా మిగిలిపోతాయి. వాటిని అమలు చేయండి అని ప్రశ్నించడం, ఆందోళన చేయడం ఈ వ్యవస్థ స్వభావాన్ని ప్రజలకు తెలియజెప్పడానికే పనికి వస్తుంది గాని, ఆధిపత్యవర్గాలు ఎప్పటికీ వాటిని అమలు చేయవు. పైగా ప్రశ్నించిన, ఆందోళన తెలిపిన వ్యక్తులను, సంస్థలను, రాజకీయ పక్షాలను అణచివేయడానికి, అవమానించడానికి అధికారవర్గాలు ప్రయత్నిస్తాయి. ఇటువంటి చట్టబద్ధమైన, శాంతియుతమైన, ప్రజాస్వామికమైన ప్రజా ఆకాంక్షల ప్రకటనల వల్ల, వాటిమీద జరుగుతున్న దమననీతి వల్ల మళ్లీ మళ్లీ రుజువయ్యే అంశమేమంటే ఈ వ్యవస్థలో సంస్కరణలకు, అతుకులకు, మాట్లకు అవకాశం లేదు. ఈ వ్యవస్థ సంపూర్ణ పరివర్తన తప్ప మరొక మార్గం లేదు.

అట్లాగే వ్యవస్థ మార్పు గురించి మాట్లాడకుండానో, తక్కువ మాట్లాడుతూనో, అస్తిత్వ పోరాటాల ద్వారానే అణగారిన అస్తిత్వాలకు న్యాయం చేకూరుతుందని మాట్లాడుతూ సామాజిక అస్తిత్వాలను, పుట్టుకను ప్రధానం చేస్తున్నవారికి కూడ ఈ మూడు ఉదంతాలు ఒక సవాలు విసురుతున్నాయి. ఇల్లంతకుంట ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలవైపు నిలబడినది ఒక దళిత మహిళా మేధావి. పాలకులవైపు నిలబడి ఆమెను దూషించినది ఒక దళిత శాసనసభ్యుడు. ఆమెతో పాటు నిలబడి ఆందోళనలో పాల్గొన్న ప్రజలలో, కార్యకర్తలలో “అగ్రవర్ణాలలో” పుట్టినవారు కూడ ఉన్నారు. డుంబ్రిగూడ ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలకు వ్యతిరేకంగా, ఖనిజ మాఫియా తరఫున నిలబడినది ఎన్నికైన ఆదివాసి “ప్రజాప్రతినిధులు”. గంగవరంలో తమ తరఫున వినతి పత్రాలు ఇవ్వడానికి కొందరు మత్స్యకారులనైనా అగ్రవర్ణ పెట్టుబడిదారులు ఆకర్షించగలిగారు. ఇక రాజకీయాల విషయానికి వస్తే పథకాలను సమర్థించినది ఒకచోట కాంగ్రెస్ నాయకులు, మరొకచోట తెలుగుదేశం నాయకులు. ఆస్తి సంపాదన, ప్రజల వనరులను కొల్లగొట్టడం వంటి విషయాలలో అస్తిత్వాలు, పుట్టుక మూలాల కన్న వర్గ ప్రయోజనాలదే పైచేయి అవుతోంది. పాలకవిధానాలను ప్రశ్నించి, ప్రజలవైపు నిలవడంలో పుట్టుక కన్న ప్రజాస్వామిక స్వభావానిదే, న్యాయానిదే నిర్ణాయక పాత్ర అవుతోంది.

 

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Telugu, Veekshanam. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s