మతి తప్పిన తలకిందుల మేధో మథనం

గడ్డిబొమ్మను తయారుచేసి దాన్ని విరగ్గొట్టి గెలిచానని భ్రమపడడం ఒక బాల్యచేష్ట. పిల్లల్లో అది అమాయకత్వం కావచ్చు గాని, వయసు ముదిరినా వదలకపోతే అది మానసిక వికారం. ప్రత్యర్థి ఆలోచనలను ఉన్నవి ఉన్నట్టుగా కాక, తాను అనుకున్నట్టుగా చిత్రించి, వాటిని ఓడించానని మురిసిపోవడం ఈ మానసిక వికారంలో ప్రధానం.

తెలుగులో జాహ్నవి (మంచి నది పేరు పెట్టుకున్నారు గాని ఆ ప్రవాహ స్వభావం, స్వచ్ఛత లేకపోగా, అజ్ఞానం, బుకాయింపు వెరసి వర్ధిల్లుతున్న రచయిత – ఎబివిఆర్ గా మిగిలిపోయారు) అనే ఒక అజ్ఞాత రచయిత ఈ మానసిక వికారాన్ని ప్రదర్శిస్తూ దాదాపు రెండు సంవత్సరాలుగా చాల హాస్యాన్ని సృష్టిస్తున్నారు. అయిన్ రాండ్ వంటి రచయితలను మక్కీకి మక్కీ తెలుగులో దించుతూ సోషలిజం, ప్రభుత్వం, ప్రగతిశీల భావజాలం, సామాజిక బాధ్యత వంటి భావనలకు తాను తయారుచేసుకున్న గడ్డిబొమ్మలను తానే బద్దలుకొట్టి చూశారా, ఎవరూ చేయని ఎంత గొప్ప పని చేశానో అని విర్రవీగుతున్నారు.

సోషలిజం మీద, ఇతర అంశాల మీద ప్రదర్శిస్తున్న ఆ అజ్ఞానమూ బుకాయింపులూ అలా ఉండగా, ఇప్పుడాయన తెలంగాణ మీద తన అమూల్యాభిప్రాయాలను (అమూల్య అంటే వెలకట్టలేని, విలువైన అని కాదు, విలువ లేని చెత్తసరుకు అని!) ప్రకటించారు. నిండా వందవాక్యాలు లేని ఈ వ్యాసం అనబడే వంటకంలో రెండువందల అబద్ధాలను కూర్చి బుకాయించడం ఆయనకే చెల్లింది.

తాత్విక కోణంలో తెలంగాణ అని గంభీరమైన శీర్షిక ఇచ్చుకున్న ఈ రచనలో అసలు బండి మొదటినుంచీ గాడితప్పి నడిచింది. నిజాలు రాయాలనే నియమం పెట్టుకోకపోవడం వల్ల తెలంగాణ సంగతి పక్కనపెట్టండి, తత్వశాస్త్రానికీ, తాత్వికకోణానికీ సంబంధించిన అందరికీ తెలిసిన నిజాలలో కూడ అబద్ధాలూ, బుకాయింపులూ మొదలయ్యాయి. వాస్తవిక ఆధార హేతుబద్ధ స్వేచ్చా తాత్వికత (జాహ్నవి దృష్టిలో అది పెట్టుబడిదారీ ఆలోచనా విధానం కావచ్చు) వాస్తవ భౌతిక ప్రపంచాన్ని ప్రాథమికమని నమ్ముతుందట, మనిషి స్పృహ, చైతన్యం వాస్తవ ప్రపంచానికి సంబంధించే ఉంటాయని నమ్ముతుందట. కాని సమసమాజ సమతావాదం, సమసమాజ తాత్వికత, సోషలిస్టు భావజాలం మాత్రం మనిషి చైతన్యమే ప్రాథమికమని అనుకుంటుందట. సృష్టిని మనిషి నిజమనుకుంటే నిజం, మాయ అనుకుంటే మాయ అని ఈ తాత్వికత అనుకుంటుందట. ఇంతటి అబద్ధాలనూ బుకాయింపులనూ రాస్తే ఎవరైనా నవ్విపోతారని కూడ ఈ రచయితకు అనిపించినట్టు లేదు. తత్వశాస్త్రంలో భావవాదం, భౌతికవాదం అని రెండు శాఖలున్నాయనీ, సమసమాజ తాత్వికత మౌలికంగా భౌతికవాదమనీ, అంటే ఆ తాత్వికత భౌతిక ప్రపంచం మీద ఆధారపడిందనీ, దాని మీద అభివృద్ధి చెందిన గతితార్కిక భౌతిక వాదం పదార్థాన్ని ప్రాథమికంగా గుర్తిస్తూనే, చైతన్యానికి తగిన స్థానం ఇస్తుందనీ, తత్వశాస్త్రం మీద ఏ ప్రాథమిక పుస్తకం చదివినా తెలిసిపోయే విషయాన్ని తలకిందులుగా చదవగల నేర్పు జాహ్నవిది.

ఆ నేర్పుతో, అంటే ఉన్నది లేనట్టూ, లేనిదీ ఉన్నట్టూ భావించగల, రాయగల నేర్పుతో తెలంగాణ మీద, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షల మీద అవాకులూ చవాకులూ రాయడానికి జాహ్నవి సాహసించారు. అడ్డదిడ్డమైన వాదనలు, అవాస్తవాలను వాస్తవాలుగా భ్రమింపజేయడానికి ప్రయత్నించడం, కనీస వాస్తవిక స్పృహ లేకపోవడం వంటి ఎన్నో సర్కస్ ఫీట్లతో సాగిన ఈ వ్యాసాన్ని తాగుబోతుల ప్రార్థనతో ప్రారంభించడం గొప్ప కవితా న్యాయం. వ్యాసం ఏమి చెప్పబోతున్నదో రచయిత ముందే చాల సముచితంగా చెప్పారన్నమాట. కావాలంటే పాఠకులు ఎమితిని సెపితివి కపితము, బెమపడి ఎర్రి పుచ్చకాయ మరి తిని సెపితో, ఉమెతకాయ తిని సెపితో అని తెనాలి రామకృష్ణుడిని కూడ సాయం పిలుచుకోవచ్చు.

ఈ వ్యాసంలో ప్రతి వాక్యమూ ఒక అబద్ధమో, బుకాయింపో గనుక ప్రతి వాక్యానికీ ఖండన, సవరణ, వివరణ అవసరమవుతాయి. ఇక్కడ ప్రధానమైన వాదనలకు మాత్రమే పరిమితమవుతాను.

భౌగోళికంగా కృష్ణా, గోదావరి డెల్టాలు వేరు, పీఠభూమయిన తెలంగాణ వేరు. ఇదెవరూ మార్చలేని వాస్తవం. పండించగలిగే పంటలు వేరు, భూమి స్వభావం వేరు అని, గోదావరికి కాలడ్డం పెట్టి సాగునీరు పారిస్తామని డాంబికాలు పలికారని అంటూ మొత్తం మీద తెలంగాణ సమస్య భౌగోళికమైనదని, అందువల్ల ఎవరూ ఏమీ చేయలేరని జాహ్నవి తేల్చారు. ఈ అబద్ధానికి ఎన్నో స్థాయిలలో జవాబు చెప్పవచ్చు. తెలంగాణ మొత్తం ఒకే తలంగా పీఠభూమిగా లేదు. సముద్ర మట్టానికి 300 అడుగుల ఎత్తు నుంచి 1200 అడుగుల ఎత్తు వరకూ ఉన్న స్థలాలు తెలంగాణలో ఉన్నాయి. ఈ భూభాగం నుంచే కృష్ణకూ, గోదావరికీ ఎన్నో ఉపనదులు ప్రవహిస్తున్నాయి. ఈ పరీవాహక ప్రాంతంలోని ఉపనదుల మీదనైనా, కృష్ణ, గోదావరి నదుల మీదనైనా వాటా అడిగే అధికారం, హక్కు తెలంగాణకు సంపూర్ణంగా ఉంది. అన్నిచోట్లా భూమ్యాకర్షణతో పల్లానికే ప్రవహించే అవకాశం లేకపోతే, ఎటువంటి సాంకేతిక విధానాన్ని ఉపయోగించాలో ఆలోచించవచ్చు. కాని ఇది భౌగోళికం కనుక చేయలేం అని ఊరుకోదలచుకుంటే అసలు నాగరికతే ముందుకు సాగేది కాదు.

ఇక జాహ్నవి సహజంగా అవకాశాలు ఉన్నాయని నమ్మింపజూస్తున్న కృష్ణా, గోదావరి డెల్టాలు 1850కి ముందు, ధవళేశ్వరం, బెజవాడ ఆనకట్టలు కట్టకముందు ఎలా ఉన్నాయో, సరిగ్గా అప్పుడు హైదరాబాద్ రాజ్యంలో నీటి పారుదల సౌకర్యాలు, వ్యవసాయ సౌభాగ్యం ఎలా ఉన్నాయో, ఒక్కసారి ఆర్థర్ కాటన్ రాసిన ఉత్తరాలు, వ్యాసాలు చూస్తే తెలుస్తుంది.

కనుక జాహ్నవి అన్నట్టు అది ఎవరూ మార్చలేని వాస్తవం కాదు. సామాజిక న్యాయ భావనలు, సుపరిపాలనా విధానాలు, న్యాయమైన జలవనరుల పంపిణీ విధానాలు, నీటిపారుదల విధానాలు, పంటల పద్ధతులు ఉంటే తెలంగాణ రాజనాలు పండే మాగాణం. కాకతీయుల నాటినుంచి ఇరవయో శతాబ్ది తొలిరోజులవరకూ కనీసం ఏడువందల సంవత్సరాలు రుజువయిన వాస్తవమది.

ఇక తెలంగాణ ప్రాంతంలో శతాబ్దాలపాటు ఆధునిక విద్యావ్యవస్థ, స్వేచ్ఛల్లేని నిజాం పాలన ఉందని, సీమాంధ్ర ప్రాంతాలు వంద సంవత్సరాలు బ్రిటిష్ విద్యావ్యవస్థ, చట్టబద్ధ పాలనలో ఉన్నాయని, అవి విస్మరించజాలని వాస్తవాలని జాహ్నవి అంటున్నారు. ఇందులో ఒక కుటిల వాదన వంద సంవత్సరాల సీమాంధ్రను, శతాబ్దాల తెలంగాణను పోల్చడం. ఆ రెంటికీ పోలిక లేదు. ఇక ఆ వంద సంవత్సరాలలో హైదరాబాద్ రాజ్యంలో కూడ బ్రిటిషిండియాలో వచ్చిన విద్యా, వైద్య, తంతి, తపాలా, రైల్వే, ప్రజారవాణా, పాలనా వ్యవస్థలన్నీ తరతమ భేధాలతో వచ్చాయి. హైదరాబాద్ ఆధునిక నగరంగా అప్పుడే అభివృద్ధి చెందింది. కాకపోతే ఇక్కడ పాలన రాచరికం గనుక, ఆ రాచరికం భూస్వామ్యం మీద ఆధారపడింది గనుక గ్రామీణ ప్రాంతాలలో ఆధునికత ప్రవేశించడానికి ఆటంకాలుండేవి. సరే, ఆ చరిత్రను అలా ఉంచినా, ఇవాళ మాట్లాడుతున్నది ఆ ఆధునిక పూర్వ పాలన అయిపోయిన అరవై సంవత్సరాల తర్వాత. ఈ అరవై సంవత్సరాలలో ఆ చారిత్రక అసమానతను సరిదిద్దడానికి ఏం చేశారు? విస్మరించజాలని వాస్తవం ఎన్ని దశాబ్దాల ప్రజాపాలనలోనైనా అలాగే విస్మరించజాలకుండా ఉండిపోతే ఏం మారినట్టు? పాలకులు ఏం బాధ్యత పడినట్టు?

ఇక పెద్దమనుషుల ఒప్పందం గురించి, ఒకే పార్టీలోని పెద్దమనుషులు తమలో తాము రాసుకున్న ఒప్పందం అని జాహ్నవి అంటున్నారు. చరిత్ర తెలియని ఈ పెద్దమనిషి అభేద్యమైన అజ్ఞానానికి ఏం జవాబు చెప్పగలం? ఫజల్ అలీ కమిషన్ సమైక్య రాష్ట్రం గురించి తెలంగాణలో ఉన్న భయ సందేహాలను ప్రస్తావించి, స్కాట్లండ్ కు ఇంగ్లండ్ ఇచ్చిన లాంటి హామీ కూడ ఇక్కడ ఉపయోగపడదని కూడ చెప్పిన తర్వాత, నిజంగానే ఒక పార్టీలోని పెద్దమనుషులే కుట్రపూరితంగా ఈ పెద్దమనుషుల ఒప్పందం రాశారనుకుందాం. కాని అది ఆ పెద్దమనుషులకే పరిమితమై పోలేదు. అది పార్లమెంటులో ప్రవేశపెట్టబడింది. దాని ఆధారంగా చట్టాలు, వ్యవస్థలు, పద్ధతులు తయారయ్యాయి. ఇప్పుడడుతుగున్న ప్రశ్న ఆ చట్టాలను, వ్యవస్థలను, పద్ధతులను ఉల్లంఘించినవారెవరు? ఆ ఉల్లంఘనలకు పరిహారం ఏమిటి? ఆ ఉల్లంఘనలను ఈ యాభైనాలుగు ఏళ్లలో కనీసం డజనుసార్లు ఎత్తి చూపితే, ప్రతిసారీ మరొక కొత్త వాగ్దానం వచ్చి, అదీ ఉల్లంఘన జరిగింది గదా! ఇక మరొక వాగ్దానం వద్దు, విడిపోక తప్పదు అని తెలంగాణ సమాజం నినదిస్తుంటే, ఆవాగ్దానాలను ఉల్లంఘించిన వారిని జాహ్నవి తప్పుపట్టడం లేదు. ఆయనకు కనీస న్యాయభావన ఉన్నదా లేదా?

నిజానికి ఆ వాగ్దానాలన్నీ రక్షణకోసం చూపే విచక్షణాధికారాలు. అంటే ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ అని రాజ్యాంగంలో షెడ్యూల్డ్ కులాలకు, తెగలకు రిజర్వేషన్ లు కల్పించినప్పుడు పని చేసిన తాత్వికత. అవి తప్పనిసరిగా అమలులోకి రావలసింది. దాన్ని తూట్లు పొడిచినది ఆరుదశాబ్దాల ఆంధ్రప్రదేశ్ పాలకవర్గాలు, అందులో కోస్తా, రాయలసీమ పాలకవర్గాలతో పాటు, వారికి దళారీలుగా మారిన తెలంగాణ పాలకులు కూడ ఉన్నారు. ఇవాళ తెలంగాణ సమాజం వారి మీద కూడ విమర్శ ఎక్కుపెడుతూనే ఉన్నది.

ఉద్యోగాల దోపిడీ? అదేమన్నా బంగారమా దోచుకోవడానికి అని వెటకరిస్తున్నారు జాహ్నవి. ఆయనే తన అవసరం కోసం ఉటంకించిన తెలంగాణ వెనుకబాటుతనం వల్ల, తెలంగాణ ప్రజలను ఇతరులు మోసం చేయకుండా ఉండడానికి ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ గా, ఇన్నాళ్లూ అవకాశాలు నిరాకరించబడిన వాళ్లకు అవకాశాలు కల్పించే చర్యగా, స్వయంపాలన ఆదర్శంగా (ఈ ఆదర్శంతోనే మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది) స్థానికులకు ఉద్యోగాలు అనే ఆలోచన వచ్చింది. స్థానికులకు ప్రత్యేకించబడిన ఉద్యోగాలను స్థానికేతరులు కబ్జా చేస్తే అది కచ్చితంగా దోపిడీనే. ఎంత తాత్విక కోణంలో చూసినా దోపిడీ, దోపిడీ కాకుండా పోదు.

వాస్తవం, వాస్తవం అంటూ జాహ్నవి ఒక ఇరవయ్యో ముప్పయ్యో చిట్టా రాశారు. అవన్నీ కళ్లముందరి చరిత్రకు తప్పుడు వ్యాఖ్యానాలు. బహుశా వాటిముందర చేర్చాలని మరచిపోయినట్టున్నారు. లేదా అవే వాస్తవాలనే భ్రమలో ఉన్నట్టున్నారు. మచ్చుకు ఆ వాస్తవాలు ఒకటి రెండు చూద్దాం.

2004 ఎన్నికల ఒప్పందంలో రెండో ఎస్సార్సీకి ఒప్పుకుని ఇరుపక్షాలూ సంతకాలు పెట్టాయట. అబద్ధాలు ఆడడానికైనా ఒక పరిమితి ఉంటుంది. ఎవరికీ దొరకని ఈ ఒప్పందమేదో జాహ్నవి బయటపెడితే బాగుండును. ఇతరులకు ఇప్పటికి 2004 ఎన్నికల పొత్తుకు సంబంధించి తెలిసినవి మూడే మూడు అక్షరబద్ధమైన విషయాలు – 2004 కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక, 2004 యుపిఎ కనీస ఉమ్మడి కార్యక్రమం, 2004 పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగం. ఈ మూడు పత్రాలలోనూ తెలంగాణ గురించి ఉన్న విషయాలలో వాక్యాలు ఎంత డొంక తిరుగుడుగానైనా ఉండవచ్చు గాని, జాహ్నవి చెపుతున్న రెండో ఎస్సార్సీ ఊసే ఎక్కడా లేదు.

అసలీ డిమాండును పదిహేనేళ్ల క్రితం అందరికంటే ముందుగా మావోయిస్టులు తెరపైకి తెచ్చారన్నది వాస్తవం. వాళ్ల భయానికి ఎవరూ వ్యతిరేకించడానికి నోరెత్తలేదన్నది వాస్తవం అని సహజమైన పోలీసుబుద్ధితో మావోయిస్టు బూచిని పైకితెచ్చి, అసలు విషయాన్ని మసిపూసి మారేడుకాయ చేయడానికి జాహ్నవి ప్రయత్నించారు. ఈ డిమాండ్ మొదటిసారి 1952లో వచ్చింది. 1954-55ల్లో ఫజల్ అలీ కమిషన్ ముందు వచ్చింది. 1958 నుంచి 1968 దాకా ఆంధ్రప్రదేశ్ రీజినల్ కమిటీ (దాని పేరు తెలంగాణ రీజినల్ కౌన్సిల్ కావలసింది, 1956లోనే జరిగిన కుట్రల వల్ల దాని పేరే మారిపోయింది!) వందలాది అభ్యంతరాలలో, వార్షిక నివేదికలలో వచ్చింది. 1969 రక్షణల అమలు నినాదంలో వచ్చింది. 1969 జై తెలంగాణ ఉద్యమంలో వచ్చింది. 1972 తెలంగాణ ఉద్యమంలో వచ్చింది. భయంకరమైన అణచివేత తర్వాత, విద్రోహం తర్వాత కూడ ఆరని ఆ నిప్పు కణిక మళ్లీ 1996 నుంచీ రగుల్కొంటూనే ఉంది. మధ్యలో 610 జి.వో. రూపంలో వచ్చింది. 2001లో ప్రధాన స్రవంతి రాజకీయాలలో చేరి, 2009 నాటికి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి డిసెంబర్ 9 ప్రకటనను సాధించింది. ఈ చరిత్రనంతా మరచిపోయినట్టు నటిస్తూ, పదిహేనేళ్లకిందనే మావోయిస్టులవల్లనే ఈ డిమాండ్ వచ్చిందనడం బేహద్బీ. జాహ్నవికి ఈ చరిత్ర జ్ఞానం లేకపోయి అయినా ఉండాలి. తెలిసినా మాయ చేయగల ధూర్తత్వమైనా ఉండాలి.

ఇన్నాళ్లూ వెనుకబడినతనం కారణం చూపి డిమాండు పెట్టారన్నది వాస్తవం. శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు తర్వాత ఆత్మగౌరవ ప్రతిపాదనను ముందుకు తెచ్చారన్నదీ వాస్తవం అని మరొక రెండు పెద్ద అబద్ధాలను వాస్తవాలుగా చెప్పడం జాహ్నవి వ్యక్తిత్వానికి సహజమే. 1952లో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అన్నప్పుడే, నాన్ ముల్కీ గోబ్యాక్ అన్నప్పుడే అందులో వెనుకబడినతనం నుంచి అభివృద్ధి చెందాలనే ఆకాంక్షా ఉంది. మా వనరుల మీద మాకే అధికారం అనే సహజ న్యాయసూత్రమూ ఉంది. మానేల మీద మా స్వతంత్ర వ్యక్తిత్వంతో, ఆత్మగౌరవంతో బతుకుతాం అనే ఆత్మగౌరవ నినాదమూ ఉంది. ఆ ఆకాంక్షలే ఈ అరవై సంవత్సరాల ఉద్యమంలో అడుగడుగునా ఉన్నాయి. కనీసం ఈ పదిహేను సంవత్సరాలలో వెలువడిన రెండువందలకు పైగా పుస్తకాలలో ఏఒక్కటి చదివినా జాహ్నవికి ఈ విషయం తెలిసి ఉండేది. మనకు తెలియనిది లేదని అనుకోవడం మన ఆత్మ సంతృప్తికి ఉపయోగపడుతుందేమో గాని, రచయితా, మేధావీ కాదలచుకున్నవారికి శోభించదు. ఏ విషయం మీద వ్యాఖ్యానించదలచుకున్నారో ఆ విషయం మీద కనీస పరిజ్ఞానమైనా ఉండడం అవసరం.

ఉద్యమం పేరిట వ్యక్తుల ప్రాథమిక హక్కుల్ని తుంగలో తొక్కడం వాస్తవం అని మరొక ఉవాచ. అవేమిటో తెలుసా? ఆంధ్ర మెస్ ల పట్ల వ్యతిరేకత, థియేటర్లు పగులగొట్టడం, షూటింగులు భగ్నం చేయడం, ఇళ్ల మీద దాడులు, వాహనాల దహనం, నాలుక కోస్తాం, జాగో భాగోలన్నీ లక్షలాది మంది భయ విహ్వలతకు, కోట్లాది మంది అభద్రతా భావానికి దారితీశాయన్నది వాస్తవం.ఒక ప్రాంతపు ప్రజలందరి ప్రాథమిక హక్కులు ఆరు దశాబ్దాల పాటు కొల్లగొట్టబడడం జాహ్నవికి కనబడ లేదు. రెండు తరాలు తమ చదువులు కోల్పోయాయి, ఉద్యోగాలు కోల్పోయాయి, నీళ్లు కోల్పోయాయి, పంటలు కోల్పోయాయి, పరిశ్రమలు కోల్పోయాయి. అభివృద్ధి కోల్పోయాయి. ఈ ప్రాథమిక హక్కులను ఇక తుంగలో తొక్కడానికి వీల్లేదు అని ప్రశ్నిస్తే అది మాత్రం కనబడి  అభ్యంతరకరమవుతోంది. రెండు తరాల జీవితాన్ని ధ్వంసం చేస్తే కనబడలేదు, ఇవాళ చెయ్యి అడ్డం పెడితే, ఆ విధ్వంసానికి కారణమైన వారి భయవిహ్వలత, అభద్రత కనబడుతున్నాయి. ఆకలి అంటే, హక్కులు అంటే, ఆత్మగౌరవం అంటే, న్యాయం అంటే శాంతి భద్రతల సమస్యగా కనబడే పోలీసు దృక్పథం ఇది. సంస్కృతి అన్నమాట వినబడితే నా చెయ్యి రివాల్వర్ మీదికి పోతుంది అని హిట్లర్ దగ్గర పోలీసు మంత్రిగా పనిచేసిన గోరింగ్ అనేవాడంటారు. జాహ్నవి సరిగ్గా అలాగే ఉన్నట్టున్నారు.

ఇంతకూ ఆయన ఇచ్చిన జాబితాలో ఇళ్లమీద దాడులు, వాహనాల దహనం ఎక్కడో ఒకచోట చాల చిన్నస్థాయిలో జరిగినవి మాత్రమే.  థియేటర్లు పగలగొట్టడం ఎక్కడా జరగలేదు, ఎక్కడైనా రాళ్లు విసరడం జరిగిందేమో. నాలుక కోస్తాం, జాగోభాగో ఒక ఉద్యమంలో ఉద్రేక, ఉద్వేగాలవల్ల వచ్చిన నినాదాలే గాని, అది ఎక్కడా అమలయిందీ లేదు, అమలు కావాలనుకున్నదీ లేదు. ఇక ఆంధ్ర శబ్దం మీద వ్యతిరేకత గురించి మాత్రం కొంచెం చెప్పాలి. నిజానికి హైదరాబాదు రాజ్యంలో తెలుగు భాషా సంస్కృతుల వికాసం కోసం జరిగిన ప్రయత్నాలన్నిటిలో తెలంగాణ వైతాళికులందరూ ఆంధ్ర శబ్దాన్ని చాల గౌరవంతో, ఇష్టంతో వాడారు. కాని 1956 తర్వాత కోస్తాంధ్ర పాలకుల విధానాల వల్ల ఆ మాటే తిట్టు మాట అయిపోయింది. అంటే ఆ మాటను అగౌరవానికి గురిచేసినవారు కోస్తాంధ్ర పాలకులే తప్ప తెలంగాణ వాదులు కాదు. ఇంతకీ ఆంధ్ర శబ్దాన్ని తిడుతున్నప్పుడు, అది సగటు ఆంధ్ర ప్రజల మీద వ్యతిరేకత కాదు. పాలకుల మీద, పాలకవిధానాల మీద వ్యతిరేకత మాత్రమే.

ఒక ఉదాహరణ చెప్పాలంటే, భారత స్వాతంత్ర్యోద్యమంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదం, బ్రిటిష్ పాలకులు, బ్రిటిష్ దుర్నీతి వంటి మాటలెన్నో వాడాం. అది బ్రిటన్ ప్రజలందరినీ ఉద్దేశించినదని ఎవరూ అనలేదు, అనుకోలేదు. అది కేవలం పాలకులను, వలస దుర్మార్గాన్ని ప్రదర్శించినవారిని ఉద్దేశించినది మాత్రమే. ఆమాటకొస్తే, అసలు ఆ వలస దుర్మార్గంతో ఏ సంబంధం లేకపోయినా, మొత్తంగా తెల్లవారు అని శ్వేతజాతీయులందరినీ తిట్టిన సంప్రదాయం ఉంది.

తెలంగాణ వాదాన్ని సమర్థిస్తున్నవారికి జాహ్నవి కొన్ని లక్షణాలు అంటగట్టారు. అవి తాత్విక శూన్యత, అహేతుక ఆత్మాశ్రయవాదం (సబ్జెక్టివిటీ). వాస్తవాలెలా ఉన్నా సరే, నేనడిగింది ఇచ్చి తీరాల్సిందే. ఎందుకంటే నేను కావాలనుకుంటున్నాను గనుక. ఇంత మంది చెబుతున్నారు కాబట్టి నిజమే అయ్యుండాలి. ఇంతమంది కోరుతున్నారు కాబట్టి న్యాయమే అయ్యుంటుంది అనే ఉద్వేగపూరిత గొర్రెదాటు మనస్తత్వం.తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ఉన్నవారికి ఈ లక్షణాలు ఉన్నాయో లేదో గాని, జాహ్నవికి మాత్రం ఈ లక్షణాలన్నీ ఉన్నట్టున్నాయి.

వీటికి తోడు ఆయనకు మరి రెండు లక్షణాలు కూడ ఉన్నాయనిపిస్తున్నది. తెలంగాణ వాదులు అడుగుతున్నది చాల సాధారణమైన, మౌలికమైన, సహజన్యాయసూత్రాలకు అనుగుణమైన, ప్రజాస్వామికమైన ప్రశ్న. ఒక రాష్ట్రంలో మొత్తం అవకాశాలలో, సౌకర్యాలలో, పాలనలో,  మా ప్రాంత విస్తీర్ణాన్ని బట్టి, మా జనాభానుబట్టి, మా దగ్గర ఉన్న వనరులను బట్టి మా వాటా ఉంటుందా, ఉండదా అనే ప్రశ్న అది. ఆ ప్రశ్నను తోసివేయడం మనిషయిన వాడికి సాధ్యం కాగూడదు. అలాగే, ఈ సమాజంలోని చారిత్రక, ప్రాంతీయ, కుల, మత, స్త్రీపురుష, భాషా అంతరాలను బట్టి కొన్ని సామాజిక బృందాలకు రక్షణలు, హెచ్చు అవకాశాలు, హామీలు ఇవ్వాలని రాజ్యాంగ స్ఫూర్తి నిర్దేశించింది. రాజ్యాంగబద్ధ ప్రజాస్వామిక స్వభావం ఉన్న ఎవరికయినా ఆ పునాదిపై తెలంగాణను వ్యతిరేకించడం కుదరదు. అంటే మనిషి అయినా, రాజ్యాంగబద్ధ ప్రజాస్వామిక వాది అయినా తెలంగాణ ఆకాంక్ష అర్థమవుతుంది, సమర్థించవలసి వస్తుంది. మరి జాహ్నవి ఏమిటో తెలియదు.

అసలే ఏదైనా శాంతిభద్రతల కళ్లద్దాలలోంచి తప్ప మరొకరకంగా కనబడదు. అందులోనూ ఆలోచన మతి తప్పి తలకిందులుగా సాగుతోంది. ఇక ఆ మేధను మథిస్తే వెలువడేది ఇటువంటి కాలకూట విషం మాత్రమే.

n  ఎన్ వేణుగోపాల్

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Telugu. Bookmark the permalink.

7 Responses to మతి తప్పిన తలకిందుల మేధో మథనం

 1. chowdary says:

  oye neekaimainaa mentalaa. inta pedda post lu evarooo chadavaru, better post this to any news paper

  • సభ్య సమాజంలో ఉన్నప్పుడు, ఇతర వ్యక్తులతో సంభాషిస్తున్నప్పుడు కనీస సభ్యత పాటించడం నేర్చుకోండి. అపరిచిత వ్యక్తిని ఏకవచనంలో సంబోధించడం, మెంటలా అని అడగడం ఎటువంటి సభ్యతో మీకే వదిలేస్తున్నాను. ఇంతకూ బ్లాగుల మీద పుస్తకాలు రాసినవాళ్లు ఉన్నారు. తెలియకపోతే మాట్లాడకపోవడం మంచిది. అలాగే నా రచనలన్నీ పత్రికలలో అచ్చయినవే. ఆ తర్వాతే బ్లాగులో పెడుతున్నా. ఈ వ్యాసం కూడ నమస్తే తెలంగాణ దినపత్రికలో అచ్చయింది.

 2. Kiran says:

  Anna…Ee JAHNAVI assalu peru endanna.????

 3. Narasimha Rao Vattikunta. says:

  I have gone through the assay of Jahnavi and I find no conceptual mistakes here. I agree with every word with the assay. I don’t know the history but conceptually it is so sound.

 4. Narasimha Rao Vattikunta. says:

  One thing I want to ask you is why are u personally smearing Jahnavi ?? I’m just wondering why are you afraid so much ???

 5. surfizenn says:

  బ్లాగుల్లో టపాల సైజు గురించి ఫిర్యాదు చేయడం ఆశ్చర్యంగా ఉంది. తాడేపల్లి ఇంతకంటే పెద్ద టపాలే రాస్తాడు. అయినా దాని గురించి ఎవరూ కామెంట్ చేయగా చూళ్ళేదు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s