అసలు సమస్యలను మసకబార్చే ‘అవినీతి వ్యతిరేకత’

సంపాదకీయ వ్యాఖ్యలు 1

ద్వంద్వాలుగా కనబడేవన్నీ, ద్వంద్వాలుగా చూపబడేవన్నీ ద్వంద్వాలు కావు. ఎదురెదురుగా ఉన్నట్టు, తీవ్రమైన ఘర్షణ పడుతున్నట్టు కనబడుతున్నవన్నీ నిజంగా ప్రత్యర్థి శక్తులు కావు. పాలకవర్గ ముఠాల మధ్య కూడ తమ స్వార్థ ప్రయోజనాల కోసం భీకరమైన ఘర్షణలే జరుగుతాయి. అన్నా హజారే – కపిల్ సిబాల్, బాబా రాందేవ్ – ప్రభుత్వం, యుపిఎ – బిజెపి, అవినీతి – అవినీతి రాహిత్యం అనే ద్వంద్వాలను ఇవాళ పాలకవర్గాలలోని వివిధ ముఠాలు, ఆ ముఠాలకు ప్రాతినిధ్యం వహించే ప్రచారసాధనాలు నిజంగా ఎదురుబొదురుగా నిలబడిన ద్వంద్వాలన్నట్టుగా ప్రచారం చేస్తున్నాయి.

ఆయా వ్యక్తులలో ఎవరో ఒకరు నిజాయితీపరులు కూడ కావచ్చు. తాము నమ్మిన విశ్వాసానికి తగినట్టు పనిచేస్తుండవచ్చు. కాని ఇది వ్యక్తుల సమస్య కాదు. ఒక చారిత్రక ఘట్టంలో ఒకే పాలకవర్గంలోని వివిధ ముఠాల ప్రయోజనాల మధ్య బయటపడుతున్న ఘర్షణ కొందరు వ్యక్తుల, కొన్ని నినాదాల రూపం తీసుకుంటున్నది. ఆ ఘట్టమే అదా ఇదా, అటుంటావా ఇటుంటావా అని ఒక కుహనా సవాల్ విసురుతున్నది. ఇద్దరూ దొంగలే అయినచోట ఒక దొంగ పక్షం వహించకతప్పని నిర్బంధ స్వేచ్ఛను ప్రజలకు ఇస్తున్నది. ఈ కనబడే నాటకమంతా నిజమని భ్రమపడే మధ్య తరగతి ఈ ద్వంద్వాల్లో ఒకదానికి, తాము సరైనదనుకునేదానికి మద్దతు ఇస్తూ వీథుల్లోకి వస్తోంది. రూపానికీ సారానికీ తేడా లేకపోతే శాస్త్రం అవసరమే ఉండదన్నాడు మార్క్స్. ఇవాళ దేశంలో ఘర్షణ రూపంలో సాగుతున్న ఈ ప్రహసనపు సారాంశాన్ని అర్థం చేసుకోవలసి ఉంది. అన్నా హజారే నుంచి బాబా రాందేవ్ దాకా, భారతీయ జనతా పార్టీ నుంచి లోక్ సత్తా దాకా ఇవాళ అవినీతి గురించి మాట్లాడుతున్న వారెవరూ రోగలక్షణం గురించే మాట్లాడుతున్నారు తప్ప రోగం గురించీ, రోగ కారణాల గురించీ మాట్లాడడం లేదు. రోగలక్షణాలను తొలగించే పని ఎంత నిజాయితీగా జరిగినా రోగం లేకుండాపోదు. ఈ వ్యవస్థ ఇప్పుడున్న స్థితిలో కొనసాగడమే అవినీతికి మూలం. ఈ పాలనను, ఈ రాజ్యాంగ వ్యవస్థను, ఇవాళ్టి రాజకీయార్థిక, సామాజిక, సాంస్కృతిక ధర్మాన్ని కూలదోయకుండా, ఇవి ఇలాగే ఉంచి, అవినీతిని రద్దు చేస్తామని అనడం తెలిసి చేసినా తెలియక చేసినా అర్థరహితం. అవినీతి మహమ్మారి లాగ విస్తరించింది గనుక, ప్రతి జీవన రంగాన్నీ అతలాకుతలం చేస్తున్నది గనుక, అవినీతిని నిర్మూలించాలి అనే నినాదానికి ప్రజల నుంచి మద్దతు వచ్చే మాట నిజమే. ఆ మద్దతు ఒకరకంగా యథాస్థితి పట్ల ప్రజల వ్యతిరేకతకు చిహ్నం. ఆ వ్యతిరేకతను సరైన దారిలో నడిపించాలంటే అవినీతి మూలాలను వివరించి, నిర్మూలన ఎలా సాధ్యమో చెప్పాలి. అవినీతిని నిర్మూలించాలంటే వ్యవస్థను మార్చాల్సి ఉంటుందనే అవగాహన ఇవ్వాలి. కాని ఇవాళ ఈ “అవినీతి నిర్మూలన” ఉద్యమాన్ని నడుపుతున్నవి పాలకవర్గ ముఠాలే గనుక ఆ మౌలిక అంశాల జోలికి పోకుండా ప్రజల అసంతృప్తిని చల్లార్చడానికి ప్రయత్నిస్తున్నాయి. చట్టంలో మార్పులు తెస్తే, నిజాయితీపరులైన అధికారులు ఉంటే, చట్టాలను సరిగా అమలు చేస్తే అవినీతి రద్దయిపోతుందనే భ్రమలు కలిగిస్తున్నాయి. నిజమైన పరిష్కారాలవైపు, అర్థవంతమైన ప్రత్యామ్నాయాలవైపు ప్రజలు వెళ్లకుండా అడ్డుకోవడాన్ని మించి ఈ ఆందోళనలు సాధించగలిగినదేమీ లేదు. పాలకవర్గాలలోని ప్రతిపక్ష ముఠాలు ఈ నాటకం ఆడుతుండగా, పాలకముఠా ఈ మాత్రం నటన కూడ అవసరం లేదనే మొరటుతనాన్ని ప్రదర్శిస్తున్నది. ఇప్పటిదాకా మౌనంగానో, స్వల్పస్థాయి ఆందోళనతోనో కూచున్న ప్రేక్షకులు లేచి నిలిచి రంగస్థలం మీదికి దండయాత్ర జరిపేదాకా ఈ నాటకాలు సాగుతూనే ఉంటాయి.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Telugu. Bookmark the permalink.

One Response to అసలు సమస్యలను మసకబార్చే ‘అవినీతి వ్యతిరేకత’

  1. xyz says:

    correct. తెలంగాన ప్రజలు రాజకీయ నాయకుల మెడలు ఎలా వొంచుతున్నారో, దేశ ప్రజలంతా రాజకీయ నాయకుల మెడలు వంచాలి. టి.వి లాంటి ఛానల్స్ సపోర్ట్ గా నిలబడాలి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s