ఎప్పటికైనా రాజపక్షను శిక్షిస్తారా?

సంపాదకీయ వ్యాఖ్యలు 2

శ్రీలంకలో స్వతంత్ర ఈలం స్థాపించుకోవాలనే తమిళ జాతి ఆకాంక్ష సాయుధపోరాట రూపం తీసుకుని ప్రపంచం దృష్టిని ఆకర్షించి ఇరవై సంవత్సరాలు నిరాఘాటంగా కొనసాగి, అతి భయంకరమైన అణచివేతకు గురై ఓడిపోయి రెండు సంవత్సరాలయింది. 2009 మేలో శ్రీలంక ప్రభుత్వం, భారత ప్రభుత్వ సహాయంతో అతి దుర్మార్గమైన దాడులు జరిపి అత్యంత కిరాతకంగా వేలాది మంది ఎల్ టి టి ఇ సైనికులను, సాధారణ తమిళ ప్రజలను చంపివేసింది. హతుల సంఖ్య నలభై వేల నుంచి లక్ష దాకా ఉండవచ్చని అంచనా.

శ్రీలంక సైనికులు వేలాది మంది స్త్రీలపై అత్యాచారాలు చేశారు. పిల్లలను ఊచకోత కోశారు. లిబరేషన్ టైగర్స్ తో ఏ సంబంధమూ లేనివారిని, చివరికి శరణార్థి శిబిరాలలో చేరినవారిని కూడ తమిళులైతే చాలు అన్నట్టుగా జాతిహననకాండ జరిపారు. ఆఖరి యుద్ధం జరిగిన ముల్లైతీవు ప్రాంతంలో ప్రభుత్వమే ‘కాల్పులు జరపని ప్రాంతం’ అని కొన్ని ప్రాంతాలను నిర్దేశించి, సాధారణ ప్రజానీకాన్ని అక్కడ సమీకరించి వారిని ఊచకోత కోశారని బయటపడింది. అంతర్జాతీయ రెడ్ క్రాస్ సహాయంతో యుద్ధ ప్రాంతంలో ఆస్పత్రులు ఏర్పాటు చేసి, వాటి మీద బాంబులు వేయకుండా ఉండడానికి పైకప్పుల మీద కనబడేట్టుగా రెడ్ క్రాస్ చిత్రించాలని ఆదేశం ఇచ్చి, ఆ గుర్తు ఉన్న భవనాల మీదనే బాంబుదాడులు జరిపారు. తాజాగా బిబిసి ఛానల్ 4 లో ప్రదర్శించిన ‘శ్రీలంకాస్ కిల్లింగ్ ఫీల్డ్స్’ లో లిబరేషన్ టైగర్లను నగ్నంగా చేసి ఎదురుగా నిలబెట్టి ఎలా కాల్చిచంపారో, లిబరేషన్ టైగర్స్ కు చెందిన మహిళల మీద ఎలా అత్యాచారాలు జరిపారో దారుణమైన వీడియోలు బయటపడ్డాయి. ఈ దుర్మార్గానికి భారత ప్రభుత్వం ఆర్థిక, సైనిక, ఆయుధ, నైతిక సహకారం అందించగా, సభ్యసమాజం అనబడేది మౌనసాక్షిలా నిలిచిపోయింది. ఐక్యరాజ్యసమితి, ప్రపంచంలో మానవతను, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికే తాము కంకణం కట్టుకున్నామని బూటకపు ప్రవచనాలతో ఇరాక్, అఫ్ఘనిస్తాన్ లలో నరమేధం సాగించిన అమెరికన్, యూరపియన్ ప్రభుత్వాలు రాజపక్ష రక్తపిపాసపై పల్లెత్తుమాట అనలేదు. రెండు సంవత్సరాలుగా ప్రగతిశీల మేధావులు, తమిళ శరణార్థులు సాగించిన ప్రయత్నాల ఫలితంగా చిట్టచివరికి ఐక్యరాజ్యసమితి నియమించిన పరిశీలక బృందం శ్రీలంక ప్రభుత్వపు దుర్మార్గాల చిట్టాను బయటపెట్టింది. ఏప్రిల్ లో ఐక్యరాజ్యసమితి ప్రధానకార్యదర్శికి అందిన ఈ నివేదిక శ్రీలంక ప్రభుత్వం సాగించిన ఐదు దుర్మార్గాలను స్పష్టంగా ప్రకటించింది. కాల్పులు జరగగూడని ప్రాంతాలలో సాధారణ పౌరుల మీద జరిగిన కాల్పులు; ఆస్పత్రులమీద, మానవ ఆవాసాల మీద బాంబు దాడులు; ఆహారం, ఔషధాలు వంటి మానవతా సహాయం అందకుండా అడ్డుకోవడం; శరణార్థులమీద, టైగర్ల మీద యుద్ధానంతరం జరుగుతున్న కక్ష సాధింపు, మానవహక్కుల ఉల్లంఘనలు; మొత్తంగా దేశంలోనే ప్రచార సాధనాల మీద, విమర్శకుల మీద జరుగుతున్న దాడులు. ఈ నివేదిక ఎల్ టి టి ఇ మీద కొన్ని విమర్శలు చేసింది గాని ఇప్పుడు అవి అప్రస్తుతం. ఈ నివేదిక వెలువడి రెండు నెలలు గఢిచినా, ప్రపంచ దేశాలలో ఏఒక్కటీ ఈ నివేదిక ఆధారంగా శ్రీలంక ప్రభుత్వం మీద చర్య తీసుకోవాలని కోరలేదు. కనీసం ఆ నివేదికలో సూచించినట్టు అంతర్జాతీయ న్యాయవిచారణ జరపడానికి ప్రయత్నించడం లేదు. మన కళ్ల ముందర ఒక జాతి స్వయం నిర్ణయాధికార ఆకాంక్షను ఇంత బీభత్సంగా, దుర్మార్గంగా చిదిమివేస్తే మాట్లాడకుండా, ప్రశ్నించకుండా, ప్రతిఘటించకుండా కూచున్న మహాఘనత వహించిన ప్రజాస్వామిక ప్రభుత్వాలను ఏమనాలి? ఇరవయ్యొకటో శతాబ్దపు హిట్లర్ గా తనను తాను రుజువు చేసుకున్న మహింద రాజపక్ష యుద్ధ నేరాలకు ఎప్పటికైనా శిక్ష పడుతుందా?

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Telugu. Bookmark the permalink.

2 Responses to ఎప్పటికైనా రాజపక్షను శిక్షిస్తారా?

  1. chaalaa baagaa spandhinchaaru. nijamgaa.. shiksha..undadhu. nenu vraasina oka havitha choodandi.please… http://vanajavanamali.blogspot.com/2010/11/vanajavanamali-kavithwa-vanamlovanaja_6033.html

  2. chaalaa baagaa spandhinchaaru. nijamgaa.. shiksha..undadhu. nenu vraasina oka kavitha choodandi.please… http://vanajavanamali.blogspot.com/2010/11/vanajavanamali-kavithwa-vanamlovanaja_6033.html

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s