ప్రజల పట్ల శ్రద్ధ లేని పాలకులు

వీక్షణం జూలై 2011 సంపాదకీయం

 

తమను తాము ప్రజాస్వామిక అవతారాలమని, అత్యధిక వోట్లు తెచ్చుకున్న ప్రజాప్రతినిధులమని, తమ పనులకన్నిటికీ ప్రజామోదం ఉన్నట్టేనని చెప్పుకుంటున్న పాలకులకు ప్రజల పట్ల కనీస శ్రద్ధ లేదని రోజురోజూ రుజువవుతున్నది. ప్రత్యేకించి రాష్ట్రం సమస్యల సుడిగుండంలో నానాటికీ దిగజారిపోతుండగా, ఈ అగ్నిపర్వతం ఎప్పుడు పేలిపోతుందోననిపించే స్థితి ఉండగా పాలకులకు మాత్రం చీమకుట్టినట్టయినా లేదు. ఏ ఒక్క ప్రజాసమస్యనైనా పరిష్కరిద్దామనే ఆలోచనే పాలకుల దరిజేరడం లేదు. పాత సమస్యలను, ప్రజలు లేవనెత్తుతున్న సమస్యలను పరిష్కరించకపోవడం మాత్రమే కాదు, ప్రజలకు కొత్త సమస్యలను పాలకులే సృష్టిస్తున్నారు. మరొకవైపు ప్రజలకు ఎంతమాత్రం సంబంధంలేని పనికిమాలిన వ్యవహారాలలో, విలాసాలలో, పక్కదారి పట్టించే, ప్రజలకోసమేనని మభ్యపెట్టే కార్యక్రమాలలో మునిగి తేలుతున్నారు. ఇవాళ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాంతమూ ఏ ఒక్క ప్రజాసమూహమూ సమస్యలు లేని స్థితిలో లేదు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి సాగుతున్న ఆందోళన, అనిశ్చితి, ఆ ఉద్యమంలో పాల్గొంటున్న ప్రజలమీద నిర్బంధం ఏడాదిన్నరకు పైగా యథాతథంగా ఉన్నాయి. వర్షాకాలం ప్రారంభమైన మూడు వారాలుగా రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగ సమస్యలు మొదలయ్యాయి. మరొకవారంలో విద్యాసంవత్సరం మొదలై విద్యార్థుల సమస్యలు మొదలయ్యాయి. విద్యార్థుల సమస్యలలో భాగంగానే వెనుకబడిన వర్గాల విద్యార్థుల ఉపకార వేతనాల, బోధనా ఫీజుల రియింబర్స్ మెంట్ సమస్యలు మొదలయ్యాయి. పుట్టపర్తి సత్యసాయిబాబా ప్రశాంతి నిలయంలో జరిగిన అశాంతి, అక్రమ కార్యకలాపాలు ఒక్కటొక్కటిగా బయటికి వస్తున్నాయి. సోంపేట థర్మల్ పవర్ ప్రాజెక్టుకు విలువైన బీల భూమి అప్పగిస్తూ జారీ అయిన ప్రభుత్వ ఉత్తర్వులు చెల్లవని రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. స్థానిక స్వపరిపాలనా సంస్థల పదవీకాలం ముగిసిపోయి సంవత్సరం గడిచిపోయినా, మళ్లీ ఎన్నికలు జరిపితే గెలిచే ఆశలేని పాలకపార్టీ ఆ ఎన్నికలను ఎగ్గొట్టడానికి అనేక కుటిల యత్నాలు పన్నుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయనే మాట కూడ చిన్నదైపోయేంతగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశమైన రాష్ట్ర శాసనసభ ప్రజాసమస్యలను చర్చించలేదు సరిగదా, ఆ చర్చకు అవకాశం ఇచ్చే అవిశ్వాస తీర్మానాన్ని కూడ చేపట్టకుండా పదవుల పందేరంతో ముగిసిపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్ర ప్రజానీకం యావత్తూ తక్షణ పరిష్కారం కోరుతూ డజన్లకొద్దీ చిన్నా పెద్దా సమస్యలు ముందుకు తెచ్చి వాటిపై ఏదో ఒక రూపంలో ఆందోళన చేస్తుండగా పాలకులు మాత్రం వాటిని పట్టించుకునే స్థితిలో లేరు. ఆ ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్నామని చెప్పుకుంటున్న రాజకీయపక్షాలకు చిత్తశుద్ధి లేకపోవచ్చు. అవి నిజమైన ప్రజా నాయకత్వం కింద జరుగుతుండకపోవచ్చు. సంఘటిత నిర్మాణ రూపం ధరించలేక పోవచ్చు. ప్రస్తుతం తెలుగు సమాజానికి అలవాటయిపోయిన రాజకీయ, కుల, మత, ప్రాంత విభజనల కింద చీలిపోయి ఉండవచ్చు. కాని సమస్యల ఉనికి, అవి పరిష్కారం కావాలనే ప్రజల ఆకాంక్ష రెండూ కూడ ‘ఎందెందు వెదకి చూచిన అందందే’ అన్నట్టు వాస్తవంగా ఉన్నాయి. కాని వినగల దానవాగ్రణి లేడు. ఈ సమస్యలేవీ పట్టని పాలకులు రాజకీయ పదవుల పంపకాలలో, ఆస్తి ఇబ్బడి ముబ్బడిగా పెంచుకోవడంలో, ప్రత్యర్థులను బుజ్జగించడంలో, బెదిరించడంలో, ఆత్మస్తుతి – పరనిందలలో కాలం గడుపుతున్నారు. ప్రతి ప్రజాస్వామిక ఆకాంక్షనూ శాంతి భద్రతల సమస్యగా చూసి, చూపి దమనకాండను అమలు చేయడం, ఆ ప్రజాస్వామిక ఆకాంక్షను వ్యక్తం చేసే వారికి ఒక గడ్డిబొమ్మ ప్రతినిధిని తయారుచేసి, ఆ ప్రతినిధికి పదవుల ఎరచూపి కొనివేయడం, ఒక సమస్యను మించి మరొక సమస్యను సృష్టించి ప్రజల దృష్టి మళ్లించడం ఈ దేశ పాలకులకు అలవాటయిన విద్యలు. రాష్ట్రంలో వర్షాలు మొదలై, దుక్కులు కూడ ప్రారంభమైన తర్వాత కూడ ప్రభుత్వం వైపు నుంచి విత్తనాల సరఫరా క్రమబద్ధం కాలేదు. మృగశిరకు ముందే తగిన ఏర్పాట్లు, ముందుజాగ్రత్త చర్యలు తీసుకుని, విత్తన వ్యాపారుల అక్రమ నిలువల మీద, అధికధరల మీద నిఘా పెట్టవలసిన ప్రభుత్వాధికారులు, ప్రభుత్వ అధీనంలోని విత్తన డిపోలలో తగిన మోతాదులో విత్తనాలు నిలువ ఉంచవలసిన ప్రభుత్వాధికారులు మొత్తం ప్రైవేటు వ్యాపారస్తులకు దళారులుగా మారిపోయారు. చాల చోట్ల అవసరమైన విత్తనాల పరిమాణంలో పావు వంతు కూడ అందుబాటులో లేక, లాటరీ చీట్లు తీసి రైతులకు విత్తనాలు ఇచ్చారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గిరాకీ గురించి ప్రభుత్వానికి తగిన సమాచారం లేకపోవడం, అందువల్ల సరఫరా కాస్త తక్కువ పడడం ఎప్పుడైనా జరగవచ్చు. కాని ఈ సారి జరిగినది మాత్రం తలకిందులు. ఎక్కడా అవసరమైనదానిలో పావు వంతు కన్న ఎక్కువ ప్రభుత్వం సరఫరా చేయలేకపోయింది, ప్రైవేటు వ్యాపారులు చేసేలా నియంత్రించ లేకపోయింది. విత్తనాల కోసం రైతులు గంటలకొద్దీ బారులు తీరి పడిగాపులు పడడం, లాటరీలు, విత్తనాలు అందలేదని నిరసన వ్యక్తం చేసిన రైతుల మీద లాఠీచార్జిలు, ఘర్షణలు, రాజకీయ ఆశ్రితులకే సహాయం అందుతున్నదనే ఆరోపణలు, మంత్రుల ఘెరావ్ లు, చివరికి రైతులు ఈ సంవత్సరం పంటలు పండించబోమని, క్రాప్ హాలిడే ప్రకటించడం మన పాలకుల అలసత్వానికి, నిర్లక్ష్యానికి, ప్రజలతో సంబంధం లేకపోవడానికి అద్దంపడుతున్నాయి. సరిగ్గా రైతులకు విత్తనాల విషయంలో జరిగినట్టే పాఠశాల విద్యార్థుల పుస్తకాల విషయంలో జరిగింది. అది సమసిపోకముందే వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఆర్థిక సహాయం విషయంలో ప్రభుత్వం కొత్త సమస్యలు సృష్టించడం మొదలుపెట్టింది. ఇంకొకవైపు పుట్టపర్తి ఆశ్రమంలో తవ్వినకొద్దీ అక్రమాలు బయటపడుతుంటే, కనీస చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడానికి కూడ ప్రభుత్వం సిద్ధపడడం లేదు. ఈ లోగా భూములను సంపన్నవర్గాలకు కట్టబెట్టడంలో ఎపిఐఐసి అవకతవకలు బయటపడుతూనే ఉన్నాయి. సోంపేట భూముల గురించి ప్రభుత్వ ఉత్తర్వును హైకోర్టు తప్పుపట్టింది. ఇన్ని సమస్యలు ఉండగా, వీటిని పరిష్కరించడానికి ఇసుమంత ప్రయత్నమయినా చేయని ప్రభుత్వం తెలంగాణను బుజ్జగించడానికి ఒక తెలంగాణ వ్యక్తికి ఉపముఖ్యమంత్రి పదవి, ఒక సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవడానికి ఆ వర్గానికి చెందిన వ్యక్తికి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి లాంటి తూతూ మంత్రపు చర్యలతో ఆయా ప్రాంతాల, వర్గాల అసంతృప్తులను చల్లార్చగలనని కలలు కంటున్నది. పాలకులు ప్రజలకు ఇంతగా దూరమైతే అంతిమ పర్యవసానం ఎంత విస్ఫోటకంగా ఉంటుందో చరిత్ర ఎన్నోసార్లు చెప్పింది. ఇవాళ కాకపోతే రేపయినా మననేలమీద ఆ చరిత్ర పునరావృతం కాకతప్పదు.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Telugu. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s