ఇరవై ఏళ్ల ప్రపంచీకరణ

ఈభూమి ఆగస్ట్ 2011

ఇది ఒక విష విషాద గాథ. ఇది ఈ దేశం మరోసారి మోసపోయిన జాడ. ఇది మన ప్రియ భారత జనయిత్రి మూలుగులు పీల్చడానికి చెప్పన్నారు దేశాల గద్దలూ రాబందులూ గండభేరుండాలూ కలిసి వాలిన బీభత్స గాథ. మన రాజకీయ పక్షాలన్నీ తోడేళ్లలా నక్కల్లా తమ నిజరూపాలు చూపుకుని జనాలను పీక్కు తినడానికి ఆ రాబందుల వెంట సాగిన హీన గాథ ఇది. 1991 జూలైలో (కచ్చితంగా చెప్పాలంటే జూలై 1న) మొదలైన ఈ గాథకు ఈ జూలైకి ఇరవై సంవత్సరాలు నిండాయి. ఈ ఇరవై సంవత్సరాలలో ప్రతి సంవత్సరమూ ప్రతి మాసమూ ప్రతి వారమూ ప్రతి దినమూ ప్రతి గంటా ప్రతి నిమిషమూ భారత ప్రజల సర్వసత్తాక అధికారం అవమానానికి గురయింది. ప్రజా సంక్షేమ చర్యలకూ, రాజ్యాంగబద్ధ పాలనకూ అయితే అధికారగణానికి పనిగంటలూ, సెలవులూ ఉంటాయి గాని ఈ దేశ వ్యతిరేక, ప్రజావ్యతిరేక చర్యలకు మాత్రం మన ప్రభుత్వం ఓవర్ టైమ్ పనిచేసింది. వారానికి ఏడురోజులూ రోజుకు ఇరవైనాలుగు గంటలూ పనిచేసింది. భారత ప్రజల ప్రజాస్వామిక పాలనా యంత్రాంగం దేశదేశాల ధనస్వామ్యానికి దళారీగా మారి బహుళజాతి సంస్థలు విదిల్చిన ఎంగిలి మెతుకులు ఏరుకు తింది. భారత ప్రజల సామ్యవాద ఆదర్శం, రాజ్యాంగ ఆదేశిక సూత్రాలు తుంగలో తొక్కబడ్డాయి. లడఖ్ నుంచి లక్షద్వీపాల దాకా, కచ్ నుంచి కోహిమా దాకా ఈ దేశం అక్రమ లాభార్జనాపరుల పదఘట్టనల పొక్కిలి నేల అయింది. ఈ కథ అణువణువూ వివరించాలంటే ఈ రెండు లక్షల గంటలలో ప్రతిగంటా ఏ విధానాలు, చర్యలు, కుట్రలు, అమ్మకాలు, కొనుగోళ్లు, కొల్లగొట్టడాలు, దళారీతనాలు, విధ్వంసాలు, అక్రమార్జనలు, ప్రశ్నించిన ప్రజల మీద దమనకాండలు జరిగాయో రెండులక్షల పేజీలు రాసినా సరిపోదు. ఇక్కడ మచ్చుకు ఒక విహంగావలోకనం మాత్రమే.

ఎలా మొదలయింది?

లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ (సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ) అనే అంతర్జాతీయ కార్యక్రమాన్ని నూతన ఆర్థిక విధానాల, ఆర్థిక సంస్కరణల పేరుతో ఈ దేశంలో అమలు చేసే ప్రక్రియను 1991 జూన్ చివరివారంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రారంభించింది. ఆ వివరాలు తెలుసుకునే ముందు అసలు ఆ అంతర్జాతీయ కార్యక్రమపు ఉద్దేశాలేమిటో, అవి ఈ దేశంలోకి ఎందుకు వచ్చాయో, అవి “నూతన” విధానాలు అవునో కాదో, “సంస్కరణలు” అవునో కాదో తెలుసుకోవలసి ఉంది.

రెండవ ప్రపంచ యుద్ధం ముగింపుకు వస్తున్నప్పుడే, అప్పటికి రెండు మూడు వందల సంవత్సరాలుగా సాగుతున్న వలస విధానం ఇక కుదరదనీ, కొత్త ఎత్తులు ఎత్తవలసి ఉందనీ, కొత్త రూపాలలో నయావలస విధానాన్ని కొనసాగించాలనీ సామ్రాజ్యవాద దేశాలు ఆలోచించాయి. వలసవాదానికీ, సామ్రాజ్యవాదానికీ మూలం ఆర్థిక ప్రయోజనాలు. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల లోని అపారమైన వ్యవసాయ, జల, అటవీ, ఖనిజ, మానవ వనరులను దోచుకోవడానికే వలసవాదం పుట్టుకొచ్చింది. పదిహేడో శతాబ్ది నుంచీ అది వ్యాపార, పారిశ్రామిక, రాజకీయాధికార, పాలనా, సైనిక రూపాలలో ఆ దోపిడీని కొనసాగించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇక ఆ రూపాలన్నీ కుదరవనీ, ఆర్థిక, రాజకీయ అధికారాలను మాత్రం ప్రచ్ఛన్నంగానైనా కొనసాగించగలిగితే చాలుననీ పెద్దన్నలు భావించారు. ఆ పనిని సజావుగా అమలు చేయడానికి మేలిముసుగు సంస్థలుగా ప్రపంచబ్యాంకునూ, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థనూ ఏర్పరచారు. అంతర్జాతీయ వాణిజ్య సంస్థను ఏర్పరచబోయి అది కుదరక వ్యాపార, సుంకాల సాధారణ ఒప్పందం కుదుర్చుకున్నారు. అదే 1995లో ప్రపంచ వాణిజ్య సంస్థ అయింది. ఈ దుష్టత్రయం పాత వలస దేశాల ప్రభుత్వాలను సామ్రాజ్యవాద దేశాల, బహుళజాతి సంస్థల చెప్పుచేతల్లో ఉంచడానికి అన్నిరకాల దిగ్బంధనాలు తయారు చేసి పెట్టాయి.

ఆ పని ఒకవైపు జరుగుతుండగానే, కొత్తగా రాజకీయ స్వాతంత్ర్యం, అధికార మార్పిడి పొందిన వలస దేశాలలోని జాతీయోద్యమాలు అప్పటికి శతాబ్దాలుగా తమను దోపిడీ చేస్తున్న సామ్రాజ్యవాదం నుంచి నిజమైన విముక్తి కావాలని, ప్రజలకు కొత్త బతుకు ఇవ్వాలని, అంటే కొత్త అభివృద్ధి నమూనాలను చేపట్టాలని భావించాయి. వ్యాపారం కోసం వచ్చి, దేశాన్నే ఆక్రమించుకున్న సామ్రాజ్యవాద విధానాల మీద అనుమానంతో విదేశీ పెట్టుబడుల మీద, పరిశ్రమల మీద ఆంక్షలు విధించాలనుకున్నాయి. చట్టబద్ధమైన ఆంక్షలు విధించాయి. అలాగే అప్పటికి విజయవంతమైన ప్రజా అభివృద్ధి నమూనాగా సోవియట్ యూనియన్ సోషలిజం ఉండడం వల్ల తమ దేశాలలో కూడ సోషలిస్టు తరహా అభివృద్ధి నమూనాను పాటించాలనుకున్నాయి. లేదా పెట్టుబడిదారీ విధానంలోని మంచినీ, సోషలిజం లోని మంచినీ కలగలిపి మిశ్రమ ఆర్థిక వ్యవస్థలు స్థాపించాలనుకున్నాయి. ప్రణాళికాబద్ధ ఆర్థికాభివృద్ధి వ్యూహాలను రచించుకున్నాయి. ఈ కారణాల వల్ల దాదాపు అన్ని వలసానంతర దేశాలలోనూ ఏదో ఒక స్థాయిలో ప్రభుత్వ విధానంగా ప్రభుత్వ రంగ సంస్థలు, విదేశీ వాణిజ్యంపై, పెట్టుబడులపై ఆంక్షలు, దేశీయ మార్కెట్లను దేశీయ సంస్థలకే పరిరక్షించే రక్షణ చర్యలు, సంక్షేమ రాజ్య భావనలు వచ్చాయి. అయితే వలస వ్యతిరేక జాతీయోద్యమాలలో పాల్గొన్న ప్రజలు ఇలా కోరుకుంటుండగా, ఈ ప్రజా ఆకాంక్షలకు ద్రోహంచేసి, పాత సామ్రాజ్యవాద శక్తులకు దళారీలుగా మారి తమ పబ్బం గడుపుకోవాలని కూడ నాయకులు భావించారు.

మొత్తం మీద అరకొరగానైనా అమలులోకి వచ్చిన ఈ ప్రజానుకూల విధానాలను సామ్రాజ్యవాద దేశాల ప్రభుత్వాలు, వాటిని నడిపించే బహుళజాతిసంస్థలు తీవ్రంగా విమర్శించేవి. ఆ విమర్శలను సిద్ధాంతాలుగా మార్చి దేశంలోని కొందరు మేధావుల చేత కూడ చిలుక పలుకులు పలికించేవి. దేశం నిరంకుశమైన లైసెన్స్ రాజ్ అయిపోయిందని వారు విమర్శించేవారు. అధికార యంత్రాంగానికి విశేష అధికారాలు ఇచ్చారని, దేశపు మార్కెట్ల తలుపులు మూసుకుని కూచున్నారని, దేశ ప్రజలకు తమకు వీలైన వస్తువులు కొనుక్కునే స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు లేవని వగైరా విమర్శలు సాగుతుండేవి. ఈ విమర్శకుల లక్షం దేశంలో కొనసాగుతున్న ఆర్థిక విధానాలను సరళీకరించడం, దేశంలో ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడం, దేశంలోకి విదేశీ పెట్టుబడులు, విదేశీ సరుకులు వచ్చేలా మార్కెట్లను తెరిచి దేశాన్ని అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థతో సమ్మేళనం చేయడం.

ఈ బహుళజాతి సంస్థల కోరికలనే సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలుగా చెప్పవచ్చు. చమురు ఎగుమతి దేశాల సమాఖ్య (ఒపెక్) 1973లో చమురు ధరలు పెంచడంతో పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొన్న సామ్రాజ్యవాద దేశాలు, బహుళజాతి సంస్థలు ఈ సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలను అమలు చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. వాటినే 1979 నాటికి ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు షరతులుగా మార్చి వ్యవస్థాత్మక సర్దుబాట్ల రుణం అనే పద్ధతి మొదలుపెట్టాయి. మరొక దశాబ్దం గడిచేసరికి అప్పటివరకూ ప్రత్యర్థిగా కనబడిన సోవియట్ యూనియన్, తూర్పు యూరప్ దేశాలు కుప్పకూలిపోవడంతో, చైనా దిక్కు మార్చడంతో, ప్రపంచమంతా పెట్టుబడిదారీ మార్కెట్ గా మారి ఈ విధానాలు మరింత ముందుకు సాగాయి. భారతదేశంలో నూతన ఆర్థిక విధానాలు అమలు కావడానికి అంతర్జాతీయ నేపథ్యం ఇది.

దేశంలో ఏం జరిగింది?

ఈ విధానాలు నూతన ఆర్థిక విధానాల పేరుతో, సంస్కరణల పేరుతో అమలు లోకి వచ్చాయి గనుక వీటిలో నూతనత్వం ఏమిటో, సంస్కరణలు ఏమిటో కూడ పరిశీలించాలి. నిజానికి ఇవి నూతనమైనవీ కావు, పాత దాన్ని మేలు దిశగా మలిచే అర్థంలో సంస్కరణలూ కావు. అసలు ఈ విధానాలు 1947 కు ముందు నుంచీ ఉన్నవే. ఆగస్ట్ 15న అధికార మార్పిడి జరిగి రాణి, వైస్ రాయ్, గవర్నర్ జనరల్ ల పాలన తొలగినప్పటికీ పాలక విధానాలలో, పాలనా వ్యవస్థలో ఏ మార్పులూ జరగలేదు. స్వతంత్ర భారత ప్రభుత్వం బ్రిటిష్ సామ్రాజ్య ఛత్రఛాయలో, కామన్ వెల్త్ లో సభ్య దేశంగానే కొనసాగింది. కొత్త సామ్రాజ్యవాదిగా అవతరిస్తున్న అమెరికా నుంచి పెట్టుబడులనూ, సహాయాన్నీ స్వీకరించింది. 1949లోనే ప్రపంచబ్యాంకు దగ్గరికి అప్పుకోసం వెళ్లి అది చెప్పిన కంపెనీలకు కాంట్రాక్టులు ఇవ్వడం మొదలుపెట్టింది. అదనంగా సోవియట్ యూనియన్, తూర్పు యూరప్ దేశాల సహాయం కూడ ఉండడంతో భారత పాలకవర్గాలకు బేరాసారాలు ఆడడానికి కాస్త వెసులుబాటు మాత్రం ఉండింది. అయితే ఆ వెసులుబాటును ప్రజాప్రయోజనాలకోసం వినియోగించిన సందర్భాలు చాల తక్కువ.

ఈ అగ్రరాజ్య, సామ్రాజ్యవాద అనుకూల విధానాలలో భాగమే 1960లలో పి ఎల్ 480 కింద అమెరికా సహాయం, హరిత విప్లవం పేరుతో భారత వ్యవసాయంలో అంతర్జాతీయ వ్యవసాయ బహుళజాతి సంస్థలకు మార్కెట్ కల్పించడం, 1969 ఇండో – సోవియట్ సైనిక సహకార ఒప్పందం, డీగో గార్షియాలో అమెరికా సైనిక స్థావరం వగైరాలు. 1981 ఐఎంఎఫ్ అప్పుతో ఈ బంధం మరింత ముడిపడింది. 1985లో రాజీవ్ గాంధీ అధికారంలోకి రాగానే దిగుమతి సరళీకరణ విధానాలు ప్రకటించి అప్పటిదాకా నామమాత్రంగానైనా సాగుతుండిన దిగుమతి ప్రత్యామ్నాయ విధానాన్ని రద్దు చేశారు. ఇలా దిగుమతులు విపరీతంగా పెరిగిపోవడంతో భారత ఆర్థిక వ్యవస్థ ఐదు సంవత్సరాలు తిరగకుండానే చెల్లింపుల సంక్షోభాన్ని ఎదుర్కొంది. భారత ప్రభుత్వం దగ్గర ఒక వారం దిగుమతులకు చెల్లించవలసిన విదేశీ మారకద్రవ్య నిలువలు కూడ లేని స్థితి వచ్చింది. సరిగ్గా అప్పుడే సోవియట్ యూనియన్ కూలిపోవడంతో భారత్ ను కష్టకాలంలో ఆదుకునే మరొక ద్రవ్య వ్యవస్థ లేకుండా పోయింది. రెండు సంవత్సరాలలో మూడు ప్రభుత్వాలు మారిపోవడం వంటి రాజకీయ పరిణామాలు కూడ జరిగాయి. ఈ దశలోనే చంద్రశేఖర్ ప్రధానిగా ఉన్న ప్రభుత్వం ఒకవైపు ఐఎంఎఫ్ నుంచి అప్పు తీసుకోవాలని, మరొకవైపు రిజర్వ్ బ్యాంక్ లో నిలువ ఉన్న 20 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ కు తాకట్టుపెట్టి విదేశీ మారక ద్రవ్యం సంపాదించాలని నిర్ణయించింది. ఇటువంటి క్లిష్టమైన, ఇబ్బందికరమైన పరిస్థితులలో ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల ప్రచారం మధ్యలోనే రాజీవ్ గాంధీ హత్య జరిగింది.

ఇన్ని సంక్షోభాల మధ్య మైనారిటీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం స్థాపించడానికి అవసరమైన 272 స్థానాలు ఏ పార్టీకీ, కూటమికీ రాకపోవడంతో 244 స్థానాలు వచ్చిన కాంగ్రెస్ వామపక్షాల మద్దతుతో అధికారాన్ని చేపట్టింది. పి వి నరసింహారావు ప్రధానమంత్రిగా, డా. మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా, పి. చిదంబరం వాణిజ్య మంత్రిగా అధికారంలోకి వచ్చిన ఈ మైనారిటీ ప్రభుత్వం నిండా ఐదు సంవత్సరాలు సజావుగా మనగలగడం మాత్రమే కాదు, దేశ రాజకీయార్థిక వ్యవస్థలో గణనీయమైన మార్పులు తీసుకు వచ్చింది. 1980లకు ముందు జీవితంతో పోల్చి చూసేవారికి లోకం మారిపోయిందన్న ఆభాసను కల్పించింది. ఆ తర్వాతి తరానికి ఈ రంగుల ప్రపంచమే నిజమనిపించేట్టు చేసింది.

1991 జూన్ 21న కాంగ్రెస్ నాయకత్వంలోని మైనారిటీ ప్రభుత్వాధినేతగా పి వి నరసింహారావు అధికారం స్వీకరించారు. ఆ మర్నాడు ప్రధాని తన ఆర్థిక మంత్రిగా డా. మన్మోహన్ సింగ్ పేరు ప్రకటించారు. అప్పటివరకూ ఎన్నడూ రాజకీయాలతో సంబంధంలేని అర్థశాస్త్రవేత్త, భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ డైరెక్టర్ గా, సౌత్ కమిషన్ సెక్రటరీ జనరల్ గా, కొద్దికాలంపాటు ప్రధాని చంద్రశేఖర్ కు ఆర్థిక సలహాదారుగా ఉన్న వ్యక్తి హఠాత్తుగా ఈ పదవిలోకి రావడం, ఆ పదవి ఆధారంగా భారత ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన మార్పులకు నాంది పలకడం యాదృచ్ఛికం కాదు. భారత ఆర్థిక వ్యవస్థలో తాము తేదలచుకున్న మార్పులు ఆర్థికమంత్రిగా తమకు అనుకూలుడు ఉంటేనే సాధ్యమని అంతర్జాతీయ ద్రవ్యసంస్థలు, బహుళజాతి సంస్థలు భావించాయి. రాజకీయవేత్త అయితే ఎంత కాదనుకున్నా వోట్ల కోసం ప్రజల దగ్గరికి వెళ్లవలసి ఉంటుంది గనుక, ప్రజల మాట వినకతప్పదు గనుక ప్రజల మాట వినే అవసరమూ, అవకాశమూ లేని వ్యక్తే ఆ పదవిలో ఉండాలని అనుకున్నాయి. న్యాయాన్యాయాలు, దేశ ప్రజా సంక్షేమం అనే విలువల కన్న సామర్థ్యం, నైపుణ్యం అనే మోసకారి విలువలే రాజ్యం చేసే పరిస్థితికి నాందిగా “సమర్థుడయిన ఆర్థిక నిపుణుడు” పేరుతో డా. మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా మార్చాయి.

తొలి నెల రోజులు

జూన్ 24 నుంచే తాను తేదలచుకున్న మార్పులేమిటో ప్రధానమంత్రికన్న ఎక్కువగా ఆర్థికమంత్రి ప్రకటించడం ప్రారంభించారు. జూన్ 27న అఖిలపక్ష సమావేశం జరిపి కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభ స్థితిలో ఐఎంఎఫ్ అప్పు తప్ప గత్యంతరం లేదని అన్ని పార్టీల ఆమోదం సంపాదించారు. అప్పు ఇవ్వడానికి ఐఎంఎఫ్ విధిస్తున్న షరతులేమిటో చెప్పాలని కొన్ని రాజకీయపక్షాలు అడిగినప్పటికీ ఆర్థికమంత్రి జవాబు దాటవేశారు. అది మైనారిటీ ప్రభుత్వం గనుక ప్రతిపక్షాలు గట్టిగా పట్టుబడితే జవాబు చెప్పక తప్పేది కాదు. కాని సిపిఐ, సిపిఎంలతో సహా ప్రతిపక్షాలేవీ ఆ ప్రశ్న మీద పట్టు పట్టలేదు.

ఇక ఈ అఖిల పక్ష సమావేశపు ఆమోదం చేతిలో పట్టుకుని జూలై నెల అంతా ప్రభుత్వం వీరంగమాడింది. జూలై 1న రూపాయి మారకపు విలువ 9 శాతం తగ్గించారు. నూతన పారిశ్రామిక విధానం తయారు చేస్తున్నామని, విదేశీ పెట్టుబడిమీద, గుత్తాధిపత్యం మీద ఉన్న ఆంక్షలు తొలగిస్తామని ప్రకటించారు. జూలై 3న రూపాయి విలువను మళ్లీ 12 శాతం తగ్గించారు. జూలై 4న రూపాయి మారకపు విలువ మరొక శాతం తగ్గించారు. విదేశీ వాణిజ్యం మీద ఆంక్షలు ఎత్తివేశారు. జూలై 7న వాణిజ్య మంత్రిత్వ శాఖ ఎక్స్ పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ పేరిట పారిశ్రామిక, వ్యాపార సంస్థలకు రాయితీలు, మినహాయింపులు ప్రకటించింది. జూలై 8న రిజర్వ్ బ్యాంక్ మరొక 20 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ కు తరలించింది. జూలై 11న మరొక పది టన్నుల బంగారాన్ని తరలించారు. నూతన ఆర్థిక విధానాల తర్వాత తొలి రైల్వే బడ్జెట్ లో జూలై 16న ఛార్జీలను, రవాణా ఛార్జీలను విపరీతంగా పెంచారు. జూలై 18న మళ్లీ 12 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ కు తరలించారు.

ఈ వరుస ఇలాగే సాగి జూలై 24న డా. మన్మోహన్ సింగ్ తన తొలి బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఆ బడ్జెట్ దేశదేశాల పెట్టుబడిదారులకు అనేక వరాలు ప్రకటించింది. భారత దేశపు వనరులను కొల్లగొట్టుకు పోవడానికి అన్ని మార్గాలు తెరిచి ఉంచామని హామీ ఇచ్చింది. భారత మార్కెట్లలోకి అవసరమైనవీ, అనవసరమైనవీ ఎన్నెన్ని సరుకులూ సేవలూ దించినా, దేశీయ ఉత్పత్తిదార్లు చితికిపోయేలా చేసినా తాము కల్పించుకోబోమని వాగ్దానం చేసింది. అప్పటివరకూ దేశ ప్రజలను, వనరులను, మార్కెట్లను, దేశీయ చిన్న, మధ్యతరహా పారిశ్రామిక వేత్తలను రక్షించడానికి ఉన్న చట్టాలను రద్దు చేస్తామని, మారుస్తామని, విదేశీ వ్యాపారులకు వీలు కల్పించే కొత్త చట్తాలను తెస్తామని వాగ్దానాలు చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసి, వాటాలు అమ్మివేసి, ప్రైవేటీకరించి, సిబ్బందిని తగ్గించి, విదేశీ పరిశ్రమలకు పోటీ కాకుండా చూస్తామని, దేశీయ ద్రవ్య సంస్థలు దేశీయ పారిశ్రామిక సంస్థలకు సహాయ పడకుండా చూసేందుకు ద్రవ్య రంగ సంస్కరణలు తెచ్చి వాటిని నిర్వీర్యం చేస్తామని ప్రకటించింది. ఒక్కమాటలో చెప్పాలంటే ‘ఈ దేశం మీదేనండి, మీ రాజ్యం మీరేలండి’ అని బహుళజాతి సంస్థలకు, సామ్రాజ్యవాద దేశాలకు, దేశదేశాల సంపన్నులకు భారత ప్రభుత్వం మంగళ హారతులు పాడింది.

తర్వాతి రెండు దశాబ్దాలు

ఈ ఆర్థిక విధానాలకు దేశంలోని అన్ని పార్లమెంటరీ రాజకీయ పక్షాల ప్రత్యక్ష, పరోక్ష మద్దతు ఉంది. ఇంతకు ముందే చెప్పినట్టు 1991 జూన్ 27న జరిగిన అఖిలపక్ష సమావేశంలో అన్ని రాజకీయ పక్షాలు పాల్గొన్నాయి. దేశ ఆర్థికస్థితి క్లిష్టంగా ఉన్నదని, నడుము కట్టుకుని బాగుచెయ్యాలని ప్రధాని, ఆర్థిక మంత్రి ఇచ్చిన పిలుపును ఆమోదించాయి. నాయకులు నడుం కట్టుకున్నారో లేదో తెలియదు గాని ప్రజలు కడుపు కట్టుకుని, ఒక్క పూట తిండి కూడ వదులుకుని, ఉద్యోగాలు, ఉపాధులు, భూములు, జీవితాలు పోయినా నోరు మూసుకుని ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించాలని అన్ని రాజకీయ పక్షాలూ ఆమోదించాయి. ఆ రాజకీయ పక్షాల మధ్య ఎన్ని విభేదాలున్నా ఈ సర్వజనామోదం ఇవాళ్టి దాకా అప్రతిహతంగా కొనసాగుతోంది.

అందుకే ఆ తర్వాత ఐదు సంవత్సరాలకే కాంగ్రెస్ ప్రభుత్వం మారిపోయి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చి 13 రోజులు పాలించినా, ఆ తర్వాత యునైటెడ్ ఫ్రంట్ కూటమి వచ్చి, దానిలో ఇద్దరు ప్రధాన మంత్రులు మారి పాలించినా, తర్వాత మళ్లీ భాజపా నాయకత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ ప్రభుత్వం మొదట 13 నెలలు, తర్వాత ఐదు సంవత్సరాలు పాలించినా, ఆ తర్వాత కాంగ్రెస్ నాయకత్వంలోని యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వం గత ఏడు సంవత్సరాలుగా పాలిస్తున్నా, ఈ ప్రభుత్వాలకూ, కూటములకూ లోపలి నుంచీ బయటి నుంచీ అన్ని పార్టీల మద్దతు ఉంది. ఇన్ని కప్పల తక్కెడ పాలనలలో కూడ ఈ నూతన ఆర్థిక విధానాల కార్యక్రమం యథావిధిగా, ఏ చిన్న మార్పూ లేకుండా సాగిపోతున్నది. ఒకరినొకరు అతి తీవ్రంగా విమర్శించుకునే ఈ పక్షాలన్నీ నూతన ఆర్థిక విధానాల విషయంలో మాత్రం ఒకరి అడుగులలో మరొకరు అడుగులువేసి నడుస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడో, ప్రజల సమక్షంలో ఉన్నప్పుడో ఈ విధానాలను విమర్శించినవారే, అధికార పక్షంలోకి రాగానే ఆ విధానాలను అమలు చేస్తున్నారు.

అంతకన్న విచిత్రంగా, రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను చేపడుతున్నపార్టీలు, తమను తాము వామపక్షాలమని పిలుచుకునే పార్టీలు, నూతన ఆర్థిక విధానాలకు తాము వ్యతిరేకమని ప్రచారం చేసుకునే పార్టీలు కూడ ఇవే ఆర్థిక విధానాలను తు.చ. తప్పకుండా అనుసరిస్తున్నాయి. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల జాబితాలోని అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వాలకే పూర్తి నిర్ణయాధికారం ఉండగా, కనీసం ఆ అంశాలలోనైనా నూతన ఆర్థిక విధానాలను అనుసరించబోమని ప్రకటించడం లేదు, అనుసరించకుండా ఉండడం లేదు.

ఫలితాలేమిటి?

నూతన ఆర్థిక విధానాలలో ప్రభుత్వ వ్యయం తగ్గించాలనే ద్రవ్య విధానం ఉండడం వల్ల ప్రభుత్వాలు అనవసర వ్యయాలను, ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న రక్షణ వ్యయాన్ని తగ్గించలేదు గాని సంక్షేమ రంగాలకు, వ్యవసాయ రంగానికి కేటాయింపులను నానాటికీ తగ్గిస్తూ వచ్చింది. అందువల్ల వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గిపోయి కొత్త నీటి పారుదల సౌకర్యాల కల్పన, పాత నీటి పారుదల సౌకర్యాల నిర్వహణ, వ్యవసాయ పరిశోధన, ఎరువుల సబ్సిడీ, వ్యవసాయ రుణాలు, పరపతి సౌకర్యాలు, మార్కెట్లలో రైతాంగానికి రక్షణ చర్యలు వంటి ఎన్నో వ్యవసాయ రంగ ప్రయోజనాలు దెబ్బతిన్నాయి. అంతేగాక ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందాల వల్ల భారత వ్యవసాయ రంగాన్ని విదేశీ పారిశ్రామిక అవసరాలకు కట్టివేయడంతో, దేశంలోకి విరివిగా వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులను అనుమతించడంతో వ్యవసాయ రంగం చితికిపోయింది. వేలాది మంది రైతుల ఆత్మహత్యలకు కారణం ఈ విధానాలే.

ఇక పారిశ్రామిక రంగం విషయానికి వస్తే, 1947 నుంచీ కొనసాగుతున్న ప్రభుత్వ రంగ పరిశ్రమలను ధ్వంసం చేయడం, ప్రభుత్వ రంగానికి గతంలో ఇచ్చిన రిజర్వేషన్లను, రాయితీలను తొలగించడం, చాల ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు రంగానికి అప్పగించడం, ప్రైవేటు రంగంలో మితిమీరిన పోటీకి వీలు కలిగించి, విదేశీ బడా పారిశ్రామిక కంపెనీలను అనుమతించి స్థానిక, దేశీయ పరిశ్రమలు చితికిపోయేలా చేయడం, లక్షలాది మంది కార్మికులను, సిబ్బందిని వీథులపాలు చేయడం, విదేశీ, స్వదేశీ బడా పరిశ్రమల గుత్తాధిపత్యం వల్ల నిత్యావసర సరుకుల ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయినా నియంత్రణ చర్యలేవీ చేపట్టక పోవడం నూతన ఆర్థిక విధానాల ఫలితాలే.

ఇలా స్థిరమైన, నికరమైన, భౌతికమైన వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను ఒకవేపు ధ్వంసం చేస్తూ, సేవా రంగాన్ని అభివృద్ధి చేస్తానంటూ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. పునాది సరిగ్గా లేకుండా ఉపరితలంలో నిర్మించిన ఈ పేకమేడలు మధ్యతరగతిని అబ్బురపరుస్తున్నాయి గాని నిజంగా ఈ మేడిపండు పొట్ట విప్పి చూస్తే పురుగులు లుకలుకలాడుతూ కనిపిస్తాయి. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో నిజమైన ప్రగతి లేకుండా సేవారంగం అభివృద్ధి చెందిందంటే అది స్థానికమైన, సుస్థిరమైన అభివృద్ధి కాదన్నమాట. అది కేవలం విదేశీ, బహుళజాతి సేవా సంస్థల శాఖోపశాఖల విస్తరణేనన్న మాట. కనీసం విదేశీ పరిశ్రమలయితే ఇక్కడ కార్ఖానాలు పెట్టి, ఇక్కడ ఉత్పత్తి చేసి, ఇక్కడినుంచి రవాణా చేసి, భౌతికంగా ఇక్కడ కాలు నిలుపుతారనే నమ్మకమైనా ఉంటుంది. కాని అటువంటి భౌతిక పెట్టుబడి, వ్యవస్థల అవసరం లేకుండానే కేవలం ఎలక్ట్రానిక్ యంత్రాల మీద, నామమాత్రపు సిబ్బంది మీద ఆధారపడి నడిచే ద్రవ్య, బీమా, టెలికాం, ఐటి వంటి సేవారంగ సంస్థలు కాలు నిలవని, అస్థిర పెట్టుబడికి చిహ్నాలు. అవి ఎక్కడ లాభాలు ఎక్కువ ఉంటే అక్కడికి క్షణాల మీద తరలిపోతాయి. వాటి విస్తరణ వాపే తప్ప బలం కాదు.

ఒకవైపు అటువంటి విదేశీ సేవారంగ సంస్థలమీద ఆధారపడుతూ, ప్రజా జీవనానికి అత్యవసరమైన విద్యా, వైద్య, విహార, వినోద, ద్రవ్య, బీమా వంటి రంగాలలోని స్థానిక, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వం పనిగట్టుకుని ధ్వంసం చేసింది. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడం అనే పేరుతో ఈ పనులన్నిటినీ ప్రైవేట్ రంగానికి అప్పగించి, వాటి పనిని సులభతరం చేసే వ్యవస్థగా మాత్రమే ప్రభుత్వం మిగలాలనే కుహనా ఆర్థిక, దోపిడీ సిద్ధాంతాలను అడ్డం పెట్టుకుని ఈ రంగాలనుంచి తన పెట్టుబడిని ఉపసంహరించుకుంది.

ఇక ద్రవ్య రంగంలో 1990ల మొదట్లోనే రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ నరసింహం నాయకత్వంలో సంస్కరణల సిఫారసుల కమిటీలు వేసి, భారత ప్రజలు మిగులు నిధులు ఆదా చేసుకునే బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాలను విదేశీ కంపెనీలకు అప్పగించడానికి, తద్వారా వారికి వేలకోట్ల రూపాయల నిధులను అప్పనంగా అప్పగించడానికి పథకాలు రచించింది. అలాగే 1950ల ఇన్సూరెన్స్ జాతీయకరణ వల్ల, 1969 బ్యాంకింగ్ జాతీయకరణ వల్ల ఆ నిధులలో కొంత శాతం ప్రాధాన్యతా రంగాలకు, వ్యవసాయానికి, చిన్న తరహా పరిశ్రమలకు అందాలనే రక్షణ, సంక్షేమ విధానాలను రద్దు చేసింది.

అంతర్జాతీయ వాణిజ్యంలో ఈ నూతన ఆర్థిక విధానాల వల్ల దేశంలో పిడికెడు మంది సంపన్నుల విలాస అవసరాలు తీర్చే దిగుమతులు పెరిగిపోయాయి. లేదా రక్షణ అవసరాల పేరిట వేల కోట్ల రూపాయలను అంతర్జాతీయ ఆయుధ వ్యాపారులకు అప్పగించడం మొదలయింది. అతి విలువైన విదేశీ మారక ద్రవ్యం ఇలా వ్యర్థం కావడం, ప్రజలకు అత్యవసరమైన సరుకుల దిగుమతి ప్రాధాన్యత తగ్గిపోవడం జరిగాయి. డంకెల్ డ్రాఫ్ట్ మీద చర్చల దగ్గరి నుంచి మొదలై ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటు వరకూ జరిగిన పరిణామాలలో మనకు అవసరమైనా, లేకపోయినా, మనం తక్కువ ధరకే ఉత్పత్తి చేయగలిగినా, పండించగలిగినా, విదేశీ బహుళజాతి సంస్థలు మనమీద రుద్దే అన్ని సరుకులనూ, వ్యవసాయోత్పత్తులనూ కూడ మనం దిగుమతి చేసుకోవలసిన దుస్థితికి నెట్టబడ్డాం.

నూతన ఆర్థిక విధానాలు మన దేశ రాజకీయాల మీద చూపిన ప్రభావం చెప్పాలంటే ఈ ఇరవై సంవత్సరాల పాలనలో పేర్లు, జెండాలు, నినాదాలు మారినా విధానాలు మారకపోవడాన్ని చూపాలి. అంటే నూతన ఆర్థిక విధానాలు ఈ దేశ పాలకులందరూ ప్రజా వ్యతిరేకులేనని, బహుళజాతి సంస్థల బిచ్చాలకు ఆశపడేవారేనని చూపాయి. బయటపడుతున్న మన రాజకీయ నాయకుల అవినీతి భాగోతాలు ఇందుకు రుజువు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థతో సంబంధం వల్ల మన ఆర్థిక వ్యవస్థలోకి విపరీతంగా డబ్బు ప్రవహించి మన రాజకీయాలు పూర్తిగా డబ్బుమయం, అవినీతిమయం అయిపోయాయి. అంతకు ముందు కూడ దోపిడీ రాజకీయాలు ఉన్నప్పటికీ, ఎంతో కొంత ఆదర్శవాదం, ప్రజలపట్ల జవాబుదారీతనం, వోటర్లకు భయపడడం ఉండేవి. కాని నూతన ఆర్థిక విధానాల తర్వాత ప్రతి అంశమూ డబ్బుతోనే, అమ్మకం-కొనుగోలు లెక్కలలోనే చూసే తత్వం, జవాబుదారీతనం స్థానంలో దేన్నయినా డబ్బుతో కొనవచ్చుననీ, భిన్నాభిప్రాయాన్నీ, ప్రశ్నలనూ కూడ డబ్బుతో మాయం చేయవచ్చుననీ, వందల వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి అయినా ఎన్నికలలో గెలవవచ్చుననీ నూతన ఆర్థిక విధానాల ఫలితంగానే మన రాజకీయ నాయకులు భావిస్తున్నారు. మొత్తంగా రాజకీయాలను కూడ ఒక వ్యాపారంగా, పెట్టుబడి మీద లాభాల రేటు అతి ఎక్కువగాఉన్న వ్యాపారంగా మార్చడం నూతన ఆర్థిక విధానాల ఫలితమే.

పైన చెప్పిన రంగాలలో అంత తీవ్రమైన ప్రభావం ఉన్నప్పుడు అది సంస్కృతి మీద కూడ ప్రభావం చూపక తప్పదు. ఈ ఇరవై సంవత్సరాలలో భారత ప్రజా సంస్కృతిలో కూడ గణనీయమైన మార్పులు వచ్చాయి. గతంలో లాగ సామాజిక అంశాలకు స్పందించడం, తోటి మనుషుల కష్టాల పట్ల సానుభూతితో స్పందించడం, ఆ కష్టాలు తీర్చడానికి వీలయినంత సహకారం అందించడం, అన్నార్తులపట్ల, నిస్సహాయుల పట్ల, పేదల పట్ల జాలి, సంక్షేమ భావాలు కనబరచడం క్రమక్రమంగా లోపిస్తున్నాయి. ‘మాయమైపోతున్నడమ్మో మనిషన్నవాడు’ అని అందెశ్రీ రాసినట్టుగా నూతన ఆర్థిక విధానాల క్రమంలో మానవ లక్షణాలే లోపిస్తూ డబ్బు సంస్కృతి విస్తరిస్తున్నది. అమానవీయత మహమ్మారిలా వ్యాప్తిస్తున్నది.

సమర్థకుల వాదనలు

మన సామాజిక వ్యవస్థ ఇంతగా ధ్వంసమై పోతున్నా పాలకులు నూతన ఆర్థిక విధానాలను సమర్థిస్తున్నారు. ఈ విధానాలను ప్రారంభించిన పి వి నరసింహారావు ఆరు సంవత్సరాలలోనే వాటి దుష్ఫలితాలను గుర్తించి ‘నేననుకున్నది ఇది కాదు’ అని బహిరంగంగా ఒప్పుకున్నా, ఇప్పటికీ ఈ విధానాలకు అంటిపెట్టుకుని ఉన్న పాలకులున్నారు. ఈ విధానాల వల్ల లాభపడిన పిడికెడు మంది బహుళజాతి సంస్థల ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, రాజకీయ వేత్తలు, అమాయకులైన మధ్యతరగతి బుద్ధిజీవులు కొందరు ఈ విధానాలు దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నాయని ఇంకా నమ్ముతున్నారు, నమ్మబలుకుతున్నారు. వారికి కొత్త సరుకులూ సేవలూ అందుతున్న మాట నిజమే. వారి వ్యాపారాలు అభివృద్ధి చెందిన మాట నిజమే. వారికి రాజకీయాల వల్ల కోట్ల రూపాయల ఆస్తి కూడిన మాట నిజమే. వారికి సాఫ్ట్ వేర్ కంపెనీల వంటి నూతన ఆర్థిక విధానాల పర్యవసానాలలో భోగభాగ్యాలు సమకూరినమాట నిజమే. కాని నూతన ఆర్థిక విధానాల వల్ల ఇలా లాభపడిన సమూహం మొత్తం దేశంలో రెండు కోట్ల మంది మాత్రమే. ఎంత ఉదారంగా లెక్కించినా అలాంటి లబ్ధిదార్లు ఐదు కోట్లకు మించరు. అది దేశ జనాభాలో నూటికి నాలుగు కన్న తక్కువ. అంటే నూటికి నలుగురి బాగు కోసం మిగిలిన సమాజమంతా ఇంత దారుణమైన మూల్యం చెల్లిస్తున్నదన్నమాట. నూతన ఆర్థిక విధానాల వల్ల భూములు కోల్పోయి నిర్వాసితులైనవారి సంఖ్య, వ్యవసాయం, పరిశ్రమలు చితికి పోయినందువల్ల ఉపాధి కోల్పోయి బతుకు దుర్భరమైన వారి సంఖ్యలతో పోలిస్తే ఈ లాభపడినవారి సంఖ్య అతి తక్కువ. మరొకవైపు నుంచి చూస్తే నూతన ఆర్థిక విధానాల వల్ల దేశంలోని డాలర్ శతకోటీశ్వరుల సంఖ్య పెరుగుతున్నది. నూటఇరవై కోట్ల స్వతంత్ర భరతవర్ష వాస్తవ్యులలో ఒక సంవత్సరం 46 మందిని, మరుసటి సంవత్సరం 55 మందిని శతకోటీశ్వరులను చేసిన నూతన ఆర్థిక విధానాలను చూసి మురిసిపోవడం ఎంత అమానుషం! ఎంత దుర్మార్గం!

భవిష్యత్తు ఏమిటి?

ఇటువంటి ప్రజావ్యతిరేకమైన విధానాలు, రోజురోజుకూ పెరిగిపోతున్న అసమానతలు, పాలకుల నిర్లక్ష్య ధోరణులు అంతిమంగా ఏ పర్యవసానాలకు దారి తీస్తాయో ప్రపంచ చరిత్ర అనేక సార్లు చెప్పింది. పూటకు తిండి దొరకని ప్రజలు కోట్లాదిగా ఉండగా, ఇంద్రభవనాలలో రాజసాలు అనుభవిస్తూ, “అయ్యో వారికి రొట్టె లేదా, అయితే కేకులు తినవచ్చు గదా” అని పలికిన ఫ్రెంచి రాణి తల పారిస్ వీథుల్లో దొర్లింది. “రొట్టె ఇవ్వలేకపోతే, సర్కస్ ఇవ్వండి” అని సర్కస్ లతో ఆకలిని జోకొట్టే ప్రయత్నం చేసినా అది ఎక్కువకాలం సాగలేదు. ఆకలిగొన్న ప్రజలు, హక్కులు కోల్పోయిన ప్రజలు, తమ వనరులు తమకు దక్కకుండా పోయిన ప్రజలు, తాము ఎన్నుకున్న పాలకులు తమ జీవితాలను ధ్వంసం చేస్తున్నారని గుర్తించిన ప్రజలు తమ సహనం కోల్పోయిన నాడు జరిగే విస్ఫోటనం ఘోరమనీ, దురంతమనీ మనం ఎన్ని మాటలయినా అనవచ్చు. కాని ఆ పర్యవసానానికి దారి తీస్తున్న క్రమం గురించి ఒక్క క్షణమయినా ఆలోచించడం మంచిది.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Telugu. Bookmark the permalink.

3 Responses to ఇరవై ఏళ్ల ప్రపంచీకరణ

 1. KumarN says:

  Gosh!!! It’s been 20 years..and you guys are still harping on the same subject.
  God bless you!

 2. subhas says:

  Really nice explanation about shadow of the world-economy

 3. subhas says:

  There is a good book about the world-economy, free marketing effects on developing countries:
  http://www.economichitman.com/pix/cehmexcerpt.pdf. I read the telugu version too, but i don’t know the link info about telugu version. If any body having this info, please share me on subhas.soft@gmail.com

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s