నెల్లూరు గుండెలపై కుంపట్లు

వీక్షణం ఆగస్ట్ 2011

 

నెల్లూరు జిల్లా సముద్రతీరంలోని ముత్తుకూరు మండలంలో, దానికి ఆనుకుని ఉన్న చిల్లకూరు, వెంకటాచలం మండలాలలో ముప్పై కిలోమీటర్ల పరిధిలో ఇరవై ఆరు థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విద్యుత్ కేంద్రాలలో ప్రైవేటు రంగంలో 25, ప్రభుత్వ రంగంలో ఒకటి రాబోతున్నాయి. వీటిలో కొన్ని ఆగిపోయాయని, మందకొడిగా సాగుతున్నాయని వార్తలు వస్తున్నప్పటికీ ప్రభుత్వం అనుకున్నట్టుగా నిర్మాణం సాగితే, కొద్ది సంవత్సరాలలో ఈ విద్యుత్ కేంద్రాల వల్ల రోజుకు రెండు లక్షల టన్నుల బూడిద, 15 లక్షల టన్నుల కార్బన్ డై ఆక్సైడ్, 22,000 టన్నుల గంధకం, వేరువేరు పరిమాణాలలో పాదరసం, ఆర్సెనిక్, కాడ్మియం వంటి అణుధార్మిక, విషపదార్థాలెన్నో వెలువడతాయి. ఎనిమిది గ్రామాలలో నెలకొల్పుతున్న ఈ కేంద్రాల వల్ల చుట్టూ నెల్లూరు జిల్లా సముద్రతీర ప్రాంతమంతా బూడిదకుప్పగా మారిపోతుంది. అక్కడి నీరు, గాలి విషపూరితమై వ్యవసాయానికీ, పళ్లతోటలకూ, చేపల చెరువులకూ, సముద్రం మీద చేపలవేటకూ అవకాశాలు మృగ్యమైపోతాయి. ఏటేటా దూరతీరాల నుంచి వచ్చే పక్షుల విహార కేంద్రాలు వట్టిపోతాయి. అక్కడి ప్రజలందరూ అక్కడే ఉంటే చనిపోవడమో, తీవ్రంగా అనారోగ్యం బారినపడడమో జరుగుతుంది. లేదా ఉన్నఊరూ, ఉపాధీ వదిలిపెట్టి పొట్టచేత పట్టుకుని వలస వెళ్లవలసి వస్తుంది.

ఈ విద్యుత్ కేంద్రాలవల్ల ఎన్ని మెగావాట్ల విద్యుదుత్పాదన సామర్థ్యాన్ని ఏర్పరచబోతున్నామో, జరగనున్న విద్యుదుత్పత్తి వల్ల ఎన్ని కొత్త పరిశ్రమలు రాబోతున్నాయో, ఎన్ని వేల కోట్ల పెట్టుబడి రాబోతోందో, ఎన్ని ఉద్యోగాల కల్పించబోతున్నామో పాలకులు చాల భారీ అంకెలు ప్రకటిస్తున్నారు. ఎన్నెన్నో ఆకుకు అందని పోకకు పొందని “అభివృద్ధి” స్వప్నాలను అమ్ముతున్నారు. కాని ఆ కలలన్నీ తీరప్రాంత మత్స్యకారులకు, వ్యవసాయదారులకు, పేద, మధ్యతరగతి ప్రజలకు పీడకలలే కానున్నాయి. అభివృద్ధి పేరుతో సాగుతున్న ఈ మహాయజ్ఞంలో నెల్లూరు ప్రజలు సమిధలు కాబోతున్నారు. ఈ ప్రయత్నమంతా ప్రజలను తమ భూములనుంచీ, ఉపాధినుంచీ, జీవితాలనుంచీ నిర్వాసితులను చేయబోతున్నది. ఇప్పటికే ప్రభుత్వం 30,000 ఎకరాల సారవంతమైన, వరి పండించే భూములను, చేపల చెరువులను ఆక్రమించి పెట్టుబడిదారులకు అప్పగించింది.

ఇదంతా ఆ ప్రాంత అభివృద్ధికి కాక, ఒక మహా విధ్వంసానికే దారితీయబోతున్నది. పిడికెడు మంది పెట్టుబడిదార్లకు, బహుళజాతి సంస్థలకు, దేశ దేశాల సంపన్నులకు ఇబ్బడిముబ్బడిగా లాభాలు సంపాదించుకునే అవకాశాలు ఇవ్వడం తప్ప ఈ విద్యుదుత్పత్తి కేంద్రాల వల్ల జరగబోయే అభివృద్ధీ లేదు, ప్రజల మేలూ లేదు. అసలు సంత పెద్ద మొత్తంలో తయారయ్యే విద్యుత్తు ప్రజలకు అవసరమే లేదు. ఆ విద్యుత్తుతో వచ్చే పరిశ్రమల్లో స్థానికులకు అవసరమైన వస్తువులు ఉత్పత్తి కాబోవడం లేదు. ఆ విద్యుత్ కేంద్రాలలోనూ, పరిశ్రమలలోనూ వస్తాయని చెపుతున్న ఉద్యోగాలలో నూటికి ఒక్కటి కూడ స్థానికులకు రాదు. అక్కడికి రాబోతున్న వేల కోట్ల రూపాయల పెట్టుబడి వల్ల స్థానిక ప్రజల జీవితాలలో ఇసుమంత మెరుగుదల కూడ జరగదు సరిగదా, వారి జీవితాలూ జీవనోపాధులూ రద్దయిపోతాయి.

అసలింత హడావుడిగా 30,000 మెగా వాట్ల విద్యుదుత్పత్తి కోసం కేంద్రాలు నిర్మించవలసిన అవసరం ఉందా అని మొట్టమొదట ప్రశ్నించవలసి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికీ గడిచిన 55 ఏళ్లలో సాధించిన విద్యుదుత్పత్తి సామర్థ్యం 14,769 మెగావాట్లు (2010 సెప్టెంబర్ నాటికి). ఇందులో సగమే థర్మల్ విద్యుత్తు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ప్రస్తుత వినియోగానికి అవసరమైన సామర్థ్యం కన్న ఇది వెయ్యి మెగావాట్లు మాత్రమే తక్కువ. ప్రభుత్వ లెక్కల ప్రకారమే రానున్న 15 సంవత్సరాలలో పెరిగే వినియోగాన్ని బట్టి మరొక 15,000 మెగావాట్ల సామర్థ్యం అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు. మరి ఒక్క నెల్లూరు జిల్లాలోనే 30,000 మెగావాట్ల అదనపు సామర్థ్యాన్ని కల్పించడం ఎందుకు? ఇంతకూ ఈ కేంద్రాలలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తు రాష్ట్రానికి ఇవ్వకపోయినా ఫరవాలేదని, ఆ కంపెనీలు తమ ఇష్టం వచ్చిన ధరకు, ఇష్టం వచ్చినవారికి అమ్ముకోవచ్చునని కూడ ప్రభుత్వం హామీ ఇస్తోంది. ఇక ఈ విద్యుత్ కేంద్రాలన్నీ ఉత్పత్తిలోకి దిగితే, నిజంగానే విద్యుత్తు ఉత్పత్తి అయితే అది అమ్ముకోవడానికి కృష్ణపట్నం ఓడరేవు వల్ల రాగల పరిశ్రమలు, మద్రాసు నగరంలోని పరిశ్రమలు మాత్రమే మిగులుతాయి. ఆ పరిశ్రమలకు కూడ అంత విద్యుత్తు అవసరం ఉంటుందా, ఉన్నా మద్రాసు పరిశ్రమలు నెల్లూరు కేంద్రాల నుంచి కొనుక్కుంటాయా అన్నీ అనుమానాలే. అంటే అన్ని వైపులనుంచీ ఆలోచించి చూస్తే, విద్యుత్ కేంద్రాల పేరుమీద భూములు ఆక్రమిస్తున్న, ఇతర మినహాయింపులు, రాయితీలు సంపాదిస్తున్న కంపెనీలకు విద్యుదుత్పత్తి కాక ఇతర ప్రయోజనాలు, ఉద్దేశాలు ఏవో ఉన్నాయన్నమాట. ఈ భూమి అంతా సముద్రతీరంలో విలాస, విహారకేంద్రాలు ఏర్పరచడానికో, రియల్ ఎస్టేట్ గా మార్చడానికో, రాయలసీమ-కర్ణాటక సరిహద్దులలోని ఖనిజ నిలువలను విదేశాలకు ఎగుమతి చేసే కేంద్రాలు నిర్మించడానికో ఉపయోగపడుతుందన్నమాట.

ఈ మౌలిక ప్రశ్నలను కూడ అలా ఉంచి, మన ప్రభుత్వాధికార వర్గాల అవకతవకలు, అవినీతి, అక్రమాలు కూడ ఈ నెల్లూరు విధ్వంసకాండ తీవ్రతను మరింత పెంచుతున్నాయి. ఈ విద్యుదుత్పత్తి కేంద్రాల కోసం ఎంత భూమి అవసరమో, ఎంత సేకరించారో, ఎంత పారిశ్రామికవేత్తలకు ఇచ్చారో, ఏ ధరన లెక్కకట్టి ఇచ్చారో, రైతుల దగ్గరినుంచి ఏ ధరన సేకరించారో, ఏ ఒక్కటీ పారదర్శకంగా లేవు. ప్రభుత్వం చెపుతున్నవన్నీ తప్పుల తడకలు, పచ్చి అబద్ధాలు. ఒక్క ఉదాహరణ చెప్పాలంటే జిల్లా కలెక్టర్ 5.9.2010న రాసిన లేఖలో కోస్టల్ ఆంధ్రా పవర్ కార్పొరేషన్ కు 2,687 ఎకరాలు ఇచ్చామని అన్నారు. కాని మూడు నెలల తర్వాత ఎపిఐఐసి ఏర్పాటు చేసిన సమావేశ ఎజెండాలో అదే కంపనీకి 21 ఎకరాలు మాత్రమే ఇచ్చామని రాశారు. ఎక్కడి 2,687? ఎక్కడి 21? మూడు నెలల్లోనే 2,665 ఎకరాలు ఎట్లా ఎక్కడ కరిగిపోయాయి? అలాగే సింహపురి ఎనర్జీ అనే కంపెనీ పెట్టుబడి కలెక్టర్ లేఖలో రు. 2600 కోట్లు ఉన్నదల్లా మూడునెలల తర్వాత సమావేశం నాటికి రు. 6000 కోట్లు అయింది. అలాగే కైనెటా పవర్ ప్రాజెక్ట్ అనే కంపెనీ వ్యయం మొదట రు. 7868 కోట్లు ఉన్నదల్లా సమావేశం నాటికి రు. 10,000 కోట్లు అయింది. అసలు నిర్మాణమూ, ఉత్పత్తీ మొదలుపెట్టకుండానే ఈ పెట్టుబడి వ్యయం అంకెలను ఇలా విపరీతంగా పెంచడానికి కారణం ఎవరు? ఎవరి ముడుపుల కోసం ఈ అంకెలు పెరిగాయి? మరొక ఆసక్తికరమైన విషయమేమంటే వీటిలో కోస్టల్ ఆంధ్రా పవర్ కార్పొరేషన్ అంబానీలకు చెందిన రిలయన్స్ ది. సింహపురి ఎనర్జీ తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావుది. కైనెటా పవర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు వల్లభనేని బాలశౌరిది.

ఇంత పెద్ద ఎత్తున విద్యుదుత్పత్తి కేంద్రాలు నెల్లూరు జిల్లాకే ఎందుకు వస్తున్నాయో కూడ ఆలోచించవలసి ఉంది. అటుకొసన శ్రీకాకుళం జిల్లాలో సముద్రతీర ప్రాంతంలో ఇలాగే లెక్కలేనన్ని విద్యుత్ కేంద్రాలు వస్తున్నాయి. ఇవన్నీ రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చడానికి కాదనేది స్పష్టమే. విరివిగా సముద్రజలాలు, తీరప్రాంతం, లోతట్టున ఖనిజ వనరులు, అభివృద్ధి చెందిన ఓడరేవులు ఉన్న ప్రదేశంలో భవిష్యత్తు విద్యుత్ అవసరాల కోసం గాని, రియల్ ఎస్టేట్ కోసం గాని ఈ ప్రాజెక్టులు వస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా కృష్ణపట్నం ఓడరేవు, తమిళనాడుకూ, చెన్నై నగరానికీ చేరువలో ఉండడం, రాయలసీమ – కర్ణాటక సరిహద్దులలోని ఖనిజ నిలువలకు అతి తక్కువ దూరంలో ఉన్న సముద్రతీరం కావడం, గ్రాండ్ ట్రంక్ రైలు, రోడ్డు మార్గాలు చేరువలో ఉండడం వంటి అనేక కారణాలున్నాయి. ఈ జిల్లాకే చెందిన రాజకీయ నాయకులకు ఇటువంటి వ్యాపారాలలో ఆసక్తి ఉండడం మరొక అదనపు కారణం.

కాని నెల్లూరు సహజ, ప్రాకృతిక కారణాలవల్ల ఇటువంటి విధ్వంసకరమైన అభివృద్ధి నమూనాను ఎంతమాత్రం అమలు చేయడానికి వీలులేదు. ఈ జిల్లా 163 కి.మీ. సముద్రతీరంతో, దాదాపు 140 తీర గ్రామాలతో, వేలాది మంది మత్య్సకారుల ఆశ్రయంగా ఉంది. పెన్నార్, స్వర్ణముఖి నదీ ప్రవాహాలవల్ల, చిన్నతరహా నీటి పారుదల సౌకర్యాల వల్ల ఈ జిల్లా అనేక పంటలకు, ముఖ్యంగా వరికి ప్రసిద్ధిగాంచింది. గత మూడు దశాబ్దాలుగా సముద్ర తీర గ్రామాలలో, కొంత లోతట్టు గ్రామాలలో చేపల చెరువులు కూడ పెరిగాయి. పులికాట్ సరస్సు, నేలపట్టు పక్షుల విహారకేంద్రం వంటి ప్రకృతి సహజమైన స్థలాలు ఉన్నాయి. మొత్తానికి ఈ జిల్లా పర్యావరణ రీత్యా చాల సున్నితమైన ప్రాంతాలలో ఒకటి. ఈ సున్నితమైన పర్యావరణ వ్యవస్థలో ఏమాత్రం చిన్న కాలుష్యమైనా తీవ్ర ప్రమాదాలకు దారితీస్తుంది. అటువంటి చోట ఇంత భారీ కాలుష్యానికి, విధ్వంసానికి పూనుకోవడం దుర్మార్గం.

నిజానికి ఈ వ్యవహారంలో ప్రభుత్వం, పాలకులు తామే రాసుకున్న అనేక చట్టాలను, నిబంధనలను కూడ ఉల్లంఘిస్తున్నారు. రాజ్యాంగంలో ప్రజలకు హామీ ఇచ్చిన అనేక రక్షణలకు, ప్రాథమిక హక్కులకు, ఆదేశిక సూత్రాలకు తూట్లు పొడుస్తున్నారు. జల కాలుష్యానికి వ్యతిరేకంగా 1974లో, వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా 1981లో, సముద్ర తీరప్రాంతాల రక్షణకోసం 1991లో తామే తీసుకు వచ్చిన చట్టాలను తుంగలో తొక్కుతున్నారు. నూతన ఆర్థిక విధానాల, ప్రపంచీకరణ విధానాల వెల్లువలో దేశవ్యాప్తంగా ఇదే జరుగుతున్నది. కాని ఇక్కడ బహుళజాతిసంస్థల, బడా వ్యాపారస్తుల ప్రయోజనాలతో పాటు అదనంగా వ్యాపారవేత్తలయిన స్థానిక రాజకీయ నాయకుల పాత్ర కూడ ఉంది.

ఒక్కసారి ఈ విద్యుత్ కేంద్రాల జాబితాను పరిశీలిస్తే, ఆ కంపనీలలో ఎక్కువ భాగం బడా పెట్టుబడిదారులకు, వ్యాపారవేత్తలయిన రాజకీయ నాయకులకు సంబంధించినవేనని అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు టి సుబ్బరామిరెడ్డి, లగడపాటి రాజగోపాల్, వల్లభనేని బాలశౌరి, నేదురుమల్లి జనార్దనరెడ్డి, కాంగ్రెస్ శాసనమండలి సభ్యుడు వాకాటి నారాయణరెడ్డి, తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు, మాజీ పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి వంటి రాజకీయ నాయకులు మాత్రమే కాక, అటు కాంగ్రెస్ కో, ఇటు తెలుగుదేశంకో, లేదా రెండు పార్టీలకు ఉమ్మడిగానో మద్దతు, ముడుపులు ఇచ్చే వ్యాపారవేత్తలు ఈ కేంద్రాల మదుపుదార్లుగా ఉన్నారు.

ఇన్నిరకాల తప్పుడు ప్రయోజనాలతో, అనవసరంగా, దుర్మార్గంగా, విధ్వంసకరంగా, ప్రజాజీవితానికి వినాశకరంగా నెల్లూరును మహమ్మారిలా ముంచెత్తుతున్న ఈ థర్మల్ ప్రాజెక్టుల వ్యవహారాన్ని తీవ్రంగా ప్రతిఘటించడం ప్రతి ఒక్క ప్రజాస్వామికవాదికి, ప్రజాపక్ష ఆలోచనాపరులకు తప్పనిసరి బాధ్యత.

(పెన్నార్ డెల్టా ఆయకట్టుదార్ల సంఘం అధ్యక్షులు బెజవాడ గోవిందరెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం ఈ వ్యాసానికి ప్రధాన ఆధారం)

సం.

విద్యుత్ కంపెనీ పేరు

స్థాపిత శక్తి (మెవా)

గ్రామం

ప్రధాన పెట్టుబడిదారు / సహకరిస్తున్న రాజకీయవేత్త

1.

మహావీర్ ఎనర్జీ ప్రై. లి.

500

అంకులపాటూరు

 

2.

వి ఎస్ ఎఫ్ ప్రాజెక్ట్స్ లి.

485

అంకులపాటూరు

 

3.

డా. ఆర్ కె పి పవర్ లి.

420

అంకులపాటూరు

 

4.

ఎస్ బి క్యు స్టీల్స్ లి.

300

అంకులపాటూరు

 

5.

బాలాజీ పవర్ అండ్ సోలార్ ఎనర్జీ

100

అంకులపాటూరు

మాగుంట శ్రీనివాస రెడ్డి

6.

గూడూర్ థర్మల్ పాంట్

300

అంకులపాటూరు

లగడపాటి రాజగోపాల్

7.

ప్రాగ్దిశ పవర్ ప్రై. లి.

2640

మోమిడి

లగడపాటి రాజగోపాల్

8.

శివస్వాతి కన్ స్ట్రక్షన్స్ ప్రై. లి.

1200

మోమిడి

ప్రత్తిపాటి పుల్లారావు

9.

లాంకో పవర్

1000

మోమిడి

లగడపాటి రాజగోపాల్

10.

ఎన్ ఎస్ ఎల్ ఆంధ్రా పవర్ ప్రై. లి.

1320

మోమిడి, ఏరూరు

మండవ ప్రభాకర రావు

11.

ఆశ్రిత్ ఎనర్జీ ప్రై లి.

200

ఏరూరు

 

12.

కృష్ణపట్నం పవర్ కార్పొరేషన్

1980

తమ్మినపట్నం, మోమిడి

నవయుగ గ్రూప్, నేదురుమల్లి జనార్దనరెడ్డి

13.

కైనెటా పవర్ ప్రాజెక్ట్స్ లి.

1980

తమ్మినపట్నం, మోమిది

వల్లభనేని బాలశౌరి

14.

మీనాక్షి ఎనర్జీ ప్రై. లి.

2320

తమ్మినపట్నం, మోమిది

కాట్రగడ్డ శ్రీనివాసరావు

15.

సింహపురి ఎనర్జీ ప్రై. లి.

1920

తమ్మినపట్నం

నామా నాగేశ్వరరావు

16.

వి ఎన్ ఆర్ పవర్ టెక్ ప్రై.లి.

330

తమ్మినపట్నం, మోమిడి

వాకాటి నారాయణ రెడ్డి

17.

నెక్కంటి పవర్ ప్రై. లి.

60

చిల్లకూరు మం.

 

18.

ఎన్ కార్ పవర్ జెన్

350

చిల్లకూరు మం.

 

19.

ఎక్సెలాన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్

350

చిల్లకూరు మం.

 

20.

థర్మల్ పవర్ టెక్ కార్పొరేషన్

1980

నేలటూరు/పైనాపురం

గాయత్రి ప్రాజెక్ట్స్ (సుబ్బరామిరెడ్డి)

21.

దామోదరం సంజీవయ్య పవర్ ప్లాంట్

1600

నేలటూరు

ఏ పి జెన్ కో

22.

లెదర్ పార్క్ పవర్

500

కృష్ణపట్నం

 

23.

కోస్టల్ ఆంధ్రా పవర్ కార్పొరేషన్

3960

కృష్ణపట్నం

రిలయన్స్ గ్రూప్ (అంబానీ)

24.

నెల్ కాస్ట్ ఎనర్జీ

1320

పైనా పురం

నాగార్జున కన్ స్ట్రక్షన్స్ కంపనీ (రాజు), సుబ్బరామిరెడ్డి

25.

శౌర్య ఎనర్జీ

100

తిరుమలమ్మ పాలెం

 

26.

పూజిత ఇంజనీరింగ్ కంపనీ

100

తిరుమలమ్మ పాలెం

విపిజె గ్రూప, సికిందరాబాద్

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Telugu. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s