ప్రజల పాటకు ప్రతిఫలం మరణశిక్ష!

వీక్షణం ఆగస్ట్ 2011

జార్ఖండ్ ప్రజా కళాకారుడు, పదిహేను సంవత్సరాలకు పైగా ఖొత్తా, సంథాలీ, నాగ్ పురి, హిందీ భాషలలో ప్రజా చైతన్య గీతాలు ఆలపిస్తూ తిరుగుతున్న ప్రముఖ గాయకుడు జీతన్ మరాండీకి ఒక అబద్ధపు కేసులో, దొంగ సాక్ష్యాల ఆధారంగా గిరిది న్యాయస్థానం మరణ శిక్ష విధించింది. ఈ కేసు వివరాలు చూస్తే ఈ దేశంలో, ముఖ్యంగా జార్ఖండ్ వంటి పోరాట ప్రాంతాలలో పాలకవర్గాలు ప్రజా ఉద్యమకారుల మీద, ఉద్యమ సమర్థకుల మీద, ప్రచారకుల మీద ఎంత దుర్మార్గమైన దమననీతిని అనుసరిస్తున్నాయో అర్థమవుతుంది. ఒక సాంస్కృతిక సంస్థ నాయకుడిగా, గాయకుడిగా, సాంస్కృతిక కార్యకర్తగా బహిరంగ జీవితంలో ఉన్న వ్యక్తి మీద తప్పుడు సాక్ష్యాలతో హత్యానేరాన్ని ఆరోపించడమే ఒక కుటిలనీతి కాగా, సాక్ష్యాల బోలుతనం స్పష్టంగా బయట పడుతున్నా, బధిరాంధ న్యాయస్థానం మరణ శిక్ష విధించడం మరింత నీచం.

జీతన్ మరాండీ జార్ఖండ్ లోని గిరిది జిల్లాలో సుదూర్ అనే ఊళ్లో 1980లలో పుట్టాడు. “మా కుటుంబంలో చదువుకున్న వాళ్లెవరూ లేదు. దుర్భర దారిద్ర్యంలో ప్రతి ఒక్కరూ పనిచేసి పొట్టనింపుకోవలసి ఉండేది. అలా నా జీవితం కూడ పశువుల కాపరిగా మొదలయింది. పలకా బలపం పట్టుకోవలసిన వయసులో ఆ చేతులతో పశువులను అదిలించే కర్ర పట్టుకున్నాను. పశువుల లెక్క కోసం కూడ గులకరాళ్లే ఉపయోగించేవాణ్ని. అతి కష్టం మీద మూడో తరగతి చదివాను. నా బడి చదువు అంతే” అని ఆయన ఒక రచనలో అన్నాడు.

కాని త్వరలోనే ఆయన లోకం పోకడ తెలుసుకున్నాడు. లోకాన్ని మార్చవలసి ఉందని అనుకున్నాడు. మొదట గాంధేయ ప్రభావంతో పాటలు పాడడం, జానపద కళా ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించాడు. క్రమంగా ప్రాచుర్యంలోకి వచ్చాడు. ఆదివాసి సాంస్కృతిక కళారూపాల సంరక్షకుడిగా, వారసుడిగా గుర్తింపు పొందాడు. “అలా మేం పల్లె నుంచి పల్లెకూ, పట్నాలకూ చేరుకున్నాం. ఇతర ప్రాంతాల ప్రగతిశీల వ్యక్తులతో, బృందాలతో పరిచయం పెంచుకున్నాం. మా భావాలూ ఉద్వేగాలూ హారంలో పూలలా కలిసిపోయాయి” అని ఆయన చెప్పుకున్నాడు. అలా ఆయన విప్లవోద్యమ సమర్థకుడిగా, విప్లవోద్యమ సాంస్కృతిక గళంగా ఎదిగాడు. జార్ఖండ్ ఎబెన్ అనే సాంస్కృతిక బృందాన్ని నిర్వహించాడు. అఖిల భారత విప్లవ సాంస్కృతిక సమితిలో భాగమయ్యాడు.

“మేం వేలాది మంది ప్రజల ప్రేమాదరాలను చూరగొన్నాం. రచయితలు, కళాకారులు, సాహిత్యకారులు, సామాజిక కార్యకర్తలు ఎందరో నన్ను ప్రోత్సహించారు. వాళ్లందరికీ నేను ఒక ప్రజా కళాకారుడిగా, ప్రగతిశీల సామాజిక కార్యకర్తగా, ప్రజలను మేల్కొలిపిన గాయకుడిగా తెలుసు. నా చేతుల్లో నగారా, ఢోలక్, హార్మోనియం వంటి సంగీత సాధనాలే తప్ప ఆయుధాలు ఎప్పుడూ చూడలేదని వాళ్లెవరయినా చెప్పగలరు. ఒక జానపద సాంస్కృతిక కళాకారుడిగా ధోతి, జుబ్బా, గజ్జెలు ధరించి ఉండగానే చూశారు గాని మరే ఇతర యూనిఫారంలో చూడలేదు. నా గళమూ నా సంస్కృతీ మాత్రమే నా సాధనాలు. నా చుట్టూ ఎప్పుడు చూసినా కళాకారుల గుంపే ఉండేది. ముఖ్యంగా బాల కళాకారులు ఉండేవారు. మేం జానపదకళలను ప్రచారం చేస్తూ గ్రామాలూ పట్టణాలూ తిరిగాం. నేనెన్నడూ ఒక కలం పేరు వాడలేదు. నాకొక అలియాస్ లేదు. నేను నా పేరుతోనే, జీతన్ మరాండీగానే ప్రచారమయ్యాను. నా పేరుమీదనే నా గొంతుతోనే నాలుగైదు భాషల్లో పాటల కాసెట్లు విడుదలయ్యాయి. ఆ పాటలేవీ అసభ్యమైనవి కాదు, తప్పుదారి పట్టించేవి కాదు. అవన్నీ సామాజిక స్పృహను రేకెత్తించేవి” అని ఆయన జైలు నుంచి రాసిన ఉత్తరంలో అన్నాడు.

అసలు ఆయన జైలుకు ఎందుకు వెళ్లవలసి వచ్చింది? గిరిది జిల్లా దేవరి పోలీస్ స్టేషన్ పరిధిలోని చిల్ఖారా గ్రామంలో 2007 అక్టోబర్ 26న మావోయిస్టు గెరిల్లా దళం జరిపిన దాడిలో అప్పటి ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ కొడుకు అనూప్ మరాండీతో సహా 20 మంది మరణించారు. చిల్ఖారీ హత్యాకాండగా ప్రసిద్ధమైన ఈ ఘటన తర్వాత ఆ హత్యాకాండలో “జీతన్ మరాండీ” అనే పేరుగల నాయకుడు పాల్గొన్నాడని వార్తలు వచ్చాయి. ఒక పత్రిక అయితే కళాకారుడు జీతన్ మరాండీ ఫొటో కూడ వేసి వార్త రాసింది. వెంటనే జీతన్ మరాండీ దాన్ని ఖండించాడు. పత్రికల్లో ఆ ప్రకటన కూడ వచ్చింది. పోలీసులు కూడ ఈ జీతన్ మరాండీ, ఆ జీతన్ మరాండీ వేరు వేరు అన్నారు.

కాని ఐదు నెలల తర్వాత, 2008 ఏప్రిల్ లో జీతన్ మరాండీ రాంచీ నుంచి ప్రయాణంలో ఉండగా పోలీసులు పట్టుకుపోయారు. పది రోజుల పాటు రహస్య ప్రదేశంలో అక్రమ నిర్బంధంలో చిత్రహింసలకు, వేధింపులకు గురిచేసి, ముఖ్యమంత్రి ఇంటి ముందు ప్రదర్శన జరిపి, ఉపన్యాసం ఇచ్చాడనే కేసు పెట్టి జైలుకు పంపారు. జైలులో ఉండగానే ఆయన మీద మరెన్నో కేసులు బనాయించారు. అలా బనాయించిన కేసులలో ఒకటి చిల్ఖారీ హత్యాకాండ కేసు.

మరొక కేసు కోసం కోర్టుకు తీసుకువచ్చినప్పుడు పోలీసు అధికారి జీతన్ మరాండీని కొందరు వ్యక్తులకు పరిచయం చేశాడు. ఆ వ్యక్తులు చిల్ఖారీ కేసులో సాక్షులనీ, వారు జీతన్ మరాండీని కోర్టులో గుర్తించడానికే ఈ పరిచయం అనీ ఆ తర్వాత తేలింది. ఆ ఇద్దరు “సాక్షులు” తప్ప మరెవరూ, చివరికి హతుల బంధువులుగాని, గ్రామస్తులు గాని ఈ జీతన్ మరాండీ హత్యాస్థలంలో ఉన్నాడని సాక్ష్యం చెప్పలేదు.

ఈ అబద్ధపు కేసుల, దొంగ సాక్ష్యాల తతంగాలను ఎప్పటికప్పుడు జీతన్ మరాండీ కింది నుంచి పైదాకా అధికారుల దృష్టికి తెస్తూనే ఉన్నాడు. అయినా గిరిది మొదటి అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి ఐ డి మిశ్రా జూన్ 23న ఇచ్చిన తీర్పులో జీతన్ మరాండీకి, ఛత్రపతి మండల్, మనోజ్ రాజ్ వర్, అనిల్ రామ్ అనే మరో ముగ్గురు నిందితులకు మరణశిక్ష విధించాడు. ఆరుగురు నిందితులను నిర్దోషులుగా వదిలిపెట్టాడు.

ఈ కేసు నడిచిన పద్ధతి గాని, సాక్షుల విచారణ గాని, శిక్ష విధించిన తీరు గాని కేవలం ఒక ప్రజా సాంస్కృతిక కార్యకర్త మీద కక్ష సాధింపు ధోరణిలో మాత్రమే సాగాయి. ఈ మరణ శిక్షను ఖండించడం, ఈ మరణ శిక్ష రద్దు చేయాలని పోరాడడం ప్రజాస్వామిక వాదుల, ప్రజా సాంస్కృతిక కార్యకర్తల కర్తవ్యం.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Telugu. Bookmark the permalink.

One Response to ప్రజల పాటకు ప్రతిఫలం మరణశిక్ష!

  1. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు విప్పితే నీ గమ్యం చెరసాల అవుతుంది, ఉరి కొయ్యకి నీ గొంతు బిగుసుకుపోతుంది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s