సుప్రీం కోర్టు చరిత్రాత్మక తీర్పులు

వీక్షణం ఆగస్ట్ 2011

 

భారతదేశపు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జూలై మొదటివారంలో రెండు చరిత్రాత్మకమైన తీర్పులు ప్రకటించింది. తమముందు సంవత్సరాలుగా విచారణ జరుగుతున్న రెండు కేసులలో జూలై 4న, 5న తీర్పులు వెలువరించిన న్యాయమూర్తులు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి, జస్టిస్ సురిందర్ సింగ్ నిజ్జర్ దేశ రాజకీయార్థిక వ్యవస్థ గురించీ, పాలన గురించీ, ప్రపంచీకరణ విధానాల గురించీ, ప్రజా ఉద్యమాల గురించీ చాల ఆలోచనాత్మకమైన వ్యాఖ్యలు చేశారు. విదేశాలకు అక్రమంగా తరలిపోతున్న భారతీయ సంపదను వెనక్కి తేవాలనే కేసులోనూ, చత్తీస్ గడ్ లో సాల్వా జుడుం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రైవేటు సైన్యం అకృత్యాలను అరికట్టాలనే కేసులోనూ ఈ తీర్పులు వెలువడ్డాయి. ప్రజల గురించి, దేశం గురించి, న్యాయం గురించి ఈ తీర్పులు మళ్లీ ఒకసారి మౌలికమైన చర్చను ముందుకు తెచ్చాయి. ఈ దేశంలో అధికార వ్యవస్థలలో, పాలక సంస్థలలో కూడ ఎక్కడో ఒకచోట న్యాయాన్యాయాలు ఆలోచించగల వాళ్లు ఇంకా ఉన్నారని రుజువు చేశాయి.

వీటిలో మొదటి కేసును ‘సిటిజెన్ ఇండియా’ అనే స్వచ్ఛంద సంస్థ తరఫున రాం జత్మలానీ, గోపాల్ శర్మ, జలబాల వైద్య, కె పి ఎస్ గిల్, ప్రొ. బి బి దత్తా, సుభాష్ కాశ్యప్ వంటి సామాజిక కార్యకర్తలు, మాజీ ప్రభుత్వాధికారులు 2009 ఏప్రిల్ లో సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. భారతదేశపు నాయకులు, అధికారులు స్విట్జర్లాండ్ లోనూ, ఇతర ప్రాంతాలలోనూ దాచుకున్న అక్రమ సంపద గురించి విరివిగా వార్తలు వస్తున్నాయని, ఆ అక్రమ ధనాన్ని వెనక్కి తెప్పించడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని, ప్రభుత్వం చర్యలు తీసుకునేలా ఆదేశించాలని ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలయింది. అప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి గనుక ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే దురుద్దేశంతోనే ఈ వ్యాజ్యం దాఖలయిందని, ఆ వ్యాజ్యాన్ని అంగీకరించగూడదని ప్రభుత్వం వాదించింది. ఆ తర్వాత కేసు అనేక మలుపులు తిరిగి, మధ్యలో హసన్ అలీ ఖాన్, కాశీనాథ్ తపురియా, చంద్రికా తపురియా వంటి వారికి విదేశీ ఖాతాలలో వేల కోట్ల రూపాయల అక్రమ నిధులు ఉన్నాయని నిర్దిష్ట సమాచారం కూడ వచ్చింది. ఆ సమాచారం మీద కూడ ప్రభుత్వం ఏ చర్యలూ తీసుకోకపోవడమూ, దానిమీద సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని మందలించడమూ కూడ జరిగాయి. ధర్మాసనం ఇచ్చిన ఎన్నో మధ్యంతర ఉత్తర్వులను కూడ ప్రభుత్వం ఖాతరు చేయలేదు.

ఈ అక్రమ నిధుల వ్యవహారం చాల విస్తృతమైనది గనుక, ప్రభుత్వం నిర్లక్ష్యంగా, అలసత్వంతో వ్యవహరిస్తున్నది గనుక, ఈ వ్యవహారాన్ని పరిశోధించడానికి ఒక ప్రత్యేక పరిశోధనా బృందాన్ని నియమించాలని, దానిలో న్యాయమూర్తులను, ప్రజాజీవితంలో మచ్చలేనివారిని చేర్చాలని ఈ వాదనల క్రమంలో దరఖాస్తుదారులు వాదించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నదని, పరిశోధన సక్రమంగానే సాగుతున్నదని, అక్రమ నిధులను వెనక్కి తీసుకువస్తామని, కనుక దరఖాస్తుదారుల విన్నపాన్ని అంగీకరించవద్దని ప్రభుత్వం వాదించింది.

చిట్టచివరికి 2011 జూలై 4న ఇచ్చిన తీర్పులో అక్రమధనం వ్యవహారాన్ని పరిశోధించడానికి ఒక ఉన్నతస్థాయి ప్రత్యేక పరిశోధక బృందాన్ని నియమించాలని న్యాయస్థానం ఆదేశించింది. పదకొండు మంది ఉన్నతాధికారులతో ఏర్పడే ఈ బృందం మాజీన్యాయమూర్తులు జస్టిస్ బి పి జీవన్ రెడ్డి, జస్టిస్ ఎం బి షా ల నేతృత్వంలో పనిచేయాలని ఆదేశించింది. ఈ బృందానికి అన్ని అధికారాలూ కల్పించాలని, బృందం సుప్రీంకోర్టుకు జవాబుదారీగా పనిచేయాలని, అన్ని ప్రభుత్వ శాఖలూ ఈ బృందానికి సహకరించాలని ఆదేశించింది. అలాగే, దరఖాస్తుదారులకు అవసరమైన సమాచారం ఇవ్వకుండా అడ్డుకున్న ప్రభుత్వాన్ని అభిశంసిస్తూ, ఈ విషయంలో రహస్యమేమీ లేదని, ఆ సమాచారమంతా దరఖాస్తుదారులకు అందజేయాలని ఆదేశించింది. ఈ తీర్పులోని అన్ని ఆదేశాలను పాటించారో లేదో ఆగస్ట్ మూడో వారంలో న్యాయస్థానానికి నివేదించాలని ఆదేశించారు.

ఈ ఆదేశాలకన్న ముఖ్యంగా, ఎనభై పేరాగ్రాఫుల తీర్పులో, మొదటి ఇరవై ఒక్క పేరాగ్రాఫులలో న్యాయమూర్తులు ఈ మొత్తం వ్యవహారంపై తమ సైద్ధాంతిక వైఖరిని ప్రకటించారు. మొత్తానికి మొత్తంగా ప్రజానుకూల దృక్పథంతో రాసిన ఈ భాగాన్ని ప్రతిఒక్కరూ తప్పనిసరిగా చదవాలి. ‘స్వార్థమే మేలు’ అనే తప్పుడు సంస్కృతి మన సమాజంలో పెరిగిపోతున్నదని, గత రెండు మూడు దశాబ్దాలుగా, నయా ఉదారవాద సంస్కరణలలో భాగంగా ప్రభుత్వం ఈ సంస్కృతిని పెంచి పోషిస్తున్నదని న్యాయమూర్తులు అన్నారు. అందులో భాగంగానే అంతకంతకూ ఎక్కువగా అక్రమ సంపాదన, పన్నుల ఎగవేత, అక్రమ ధనాన్ని విదేశాలకు తరలించడం, దాన్నే ఇతర మార్గాలలో సక్రమ ధనంగా దేశంలోకి తిరిగి తీసుకురావడం జరుగుతున్నదని, ఇందులో రాజకీయ నాయకుల, అధికారవర్గాల పాత్ర ఉన్నదని తీర్పు అభిప్రాయపడింది. ఇవాళ అత్యవసరమైన రాజకీయార్థిక, సామాజిక, సాంస్కృతిక అవగాహనలను ఈ తీర్పులో పందుపరిచారు.

ఈ తీర్పు వెలువడినవెంటనే రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులు, ప్రపంచీకరణ శక్తులు తీర్పుకు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారు. న్యాయస్థానం తన పరిధి దాటి వ్యాఖ్యానించిందని విమర్శించారు. ప్రభుత్వం చేయవలసిన పనిని న్యాయస్థానం తన పరిధిలోకి తీసుకుందని అన్నారు. చివరికి ఈ తీర్పు చెల్లదని, దీని మీద పునర్విచారణ జరపాలని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు జూలై 15న అప్పీలు చేసుకుంది. ఆ అప్పీలు మీద విచారణ జరగవలసి ఉంది. కాని అక్రమధనం మీద స్వతంత్ర, చట్టబద్ధ పరిశోధన జరగడం తమకు ఇష్టం లేదని ప్రభుత్వం స్పష్టంగా చెపుతున్నదని రుజువయింది. “రాజకీయ వ్యవస్థను నడపడంలో ఉన్న వాస్తవికమైన, ఆచరణాత్మకమైన ఇబ్బందులను” న్యాయవ్యవస్థ అర్థం చేసుకోవాలని న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఇచ్చిన సలహా చూస్తే, అక్రమ ఆస్తులను విదేశాలకు తరలించినవారిని కాపాడడమే ఈ రాజకీయ వ్యవస్థ చేసే “వాస్తవికమైన, ఆచరణాత్మకమైన” పని అని రుజువయింది.

ఇక రెండవ కేసు 2007లో సామాజిక శాస్త్రవేత్త ప్రొ నందినీ సుందర్, చరిత్రకారుడు రామచంద్ర గుహ, భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఇ ఎ ఎస్ శర్మ దాఖలు చేసినది. చత్తీస్ గడ్ లోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టు ఉద్యమాన్ని అణచడానికనే పేరుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాల్వా జుడుం అనే ప్రైవేటు సైన్యం వల్ల, స్పెషల్ పోలీస్ ఆఫీసర్ల (ఎస్పీవోల) వల్ల పెద్దఎత్తున మానవహక్కుల ఉల్లంఘన జరుగుతున్నదని, దానితో ఆదివాసి ప్రజల మధ్య అంతర్యుద్ధానికి ప్రభుత్వమే ఆజ్యం పోస్తున్నదని, ఈ రాజ్యాంగేతర ప్రత్యేక పోలీసు అధికారుల నియామకాన్ని ఆపివేయాలని దరఖాస్తుదారులు కోరారు. విచారణ జరిగిన ఐదు సంవత్సరాలలో మరికొంతమంది దరఖాస్తుదారులు చేరారు, మరెన్నో ఘటనలు జరిగాయి. మధ్యలో దరఖాస్తుదారుల ఆరోపణలపై పరిశీలన జరిపి నివేదిక సమర్పించవలసిందిగా సుప్రీంకోర్టు జాతీయ మానవహక్కుల సంఘాన్ని ఆదేశించింది. ఆ నివేదిక 2008 ఆగస్టులో రాగా, ఆ సిఫారసులను పాటించవలసిందిగా సుప్రీంకోర్టు చత్తీస్ గడ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ప్రాంతంలో పాఠశాలలను, విద్యార్థుల వసతి గృహాలను పోలీసులు ఆక్రమించుకుని, చదువు సాగకుండా చేస్తున్నారని వచ్చిన ఆరోపణలను, ఆదివాసులను హత్య చేసిన ఎస్పీవోలపై కేసులు నమోదు చేయడం లేదనే ఆరోపణలను కూడ సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసు కూడ ఎన్నో మలుపులు తిరిగి చివరికి 2011 మార్చ్ లో మోర్పల్లి, తాడిమెట్ల, తిమ్మాపురం గ్రామాల మీద కోయ కమాండోలు జరిపిన దాడి దాకా వచ్చింది. ఆ దాడి నిజానిజాలు పరిశీలించడానికి, బాధితులకు సహాయం అందించడానికి సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్ వెళ్లగా, రక్షణ కల్పిస్తానని స్వయంగా ముఖ్యమంత్రి హామీ ఉండగానే, ఆయన మీద ఎస్పీవోలు దాడి చేసిన ఘటనను కూడ సుప్రీం కోర్టు పరిగణనలోకి తీసుకుంది.

చిట్టచివరికి 2011 జూలై 5న వెలువరించిన తీర్పులో న్యాయమూర్తులు ప్రధానంగా ఎస్పీవోల నియామకం గురించి, స్వామి అగ్నివేష్ ను అడ్డుకున్న ఘటన గురించి తమ ఆదేశాలు ప్రకటించారు. ఎస్పీవో అనే ప్రత్యేక అధికారులను ప్రత్యేకంగా అవసరమైన సందర్భాలలో నియోగించడానికి చట్టం అనుమతిస్తుంది గాని చత్తీస్ గడ్ లో ప్రస్తుతం ఏర్పాటయిన ఎస్పీవోలకు ఆ చట్ట నిబంధనలేవీ లేవని సుప్రీంకోర్టు ఆధారాలతో సహా చెప్పింది. భారత రాజ్యాంగం, భారత శిక్షా స్మృతి, భారత నేర విచారణా స్మృతి, సాక్ష్యాధారాల చట్టం వంటి నిబంధనలు చదివే సామర్థ్యం లేని, అనుమానితుల ప్రాథమిక హక్కుల గురించి పరిజ్ఞానం లేని, ఐదోతరగతి కూడ చదవని ఆదివాసులను కేవలం వారికి మావోయిస్టుల మీద ఉన్న కసి, ప్రతీకారవాంఛ ఆధారంగా నియమించారని, వారి జీతభత్యాలు, క్రమశిక్షణా చర్యలు, పదవీ విరమణ కాలం, విరమణానంతర ప్రతిఫలాలు ఏమీ నిర్ధారించకుండా, కేవలం నెలకు రు. 3000 ఇచ్చి, వారి చేతికి తుపాకి ఇచ్చి వారేమి చేసినా అడగబోమని ప్రభుత్వం చెప్పిందని కోర్టు ప్రకటించింది. ఈ మితిమీరిన అధికారం వల్లనే ఎస్పీవోలు అనేక అత్యాచారాలకు పాల్పడ్డారని, అందుకు ప్రభుత్వం బాధ్యత వహించాలని కోర్టు అభిప్రాయపడింది. ఇలా ప్రజలలో ఒక వర్గాన్ని మరొక వర్గం మీద ఉసి గొల్పడం అప్రజాస్వామికం, రాజ్యాంగ వ్యతిరేకం, చట్ట వ్యతిరేకం, అమానుషం అని కోర్టు అభిప్రాయపడింది.

అందువల్ల చత్తీస్ గడ్ రాష్ట్రప్రభుత్వం వెంటనే ఎస్పీవో వ్యవస్థను రద్ధు చేయాలని, ఈ ఎస్పీవో వ్యవస్థకు కేంద్రప్రభుత్వ నిధులను వెంటనే ఆపు చేయాలని, ఎస్పీవోలకు ఇచ్చిన ఆయుధాలను వెనక్కి తీసుకోవాలని, ఉద్యోగాల నుంచి తొలగించబడిన ఎస్పీవోల రక్షణ బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని, సాల్వా జుడుం, కోయ కమాండోల పేరు మీద చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడే అన్ని బృందాలను రద్దుచేయాలని ఆదేశించింది. అలాగే స్వామి అగ్నివేష్ మీద జరిగిన దాడిని తీవ్రంగా పరిగణించిన న్యాయమూర్తులు ఆ దాడి సంఘటనపైనా, అసలు ఆ మూడు గ్రామాలపై జరిగిన దాడి పైనా విచారణ జరపాలని సిబిఐని ఆదేశించారు.

సిబిఐ ఈ విచారణ నివేదికలను ఆరువారాల లోగా సమర్పించాలని, అలాగే చత్తీస్ గడ్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రప్రభుత్వం కూడ మిగిలిన ఆదేశాల మీద తగిన చర్యలు తీసుకుని, ఆరు వారాలలోగా తమకు ఆ చర్యల గురించి చెప్పాలని న్యాయస్థానం ఆదేశించింది.

ఈ తీర్పులో కూడ ఈ ఆదేశాలు ఒక ఎత్తయితే, ఈ 81 పేరాగ్రాఫుల తీర్పులో మొదటి 22 పేరాగ్రాఫులలో న్యాయమూర్తులు తమ సైద్ధాంతిక అవగాహనను వివరించడం మరొక ఎత్తు. వలసవాద దుర్మార్గం వల్ల, వనరుల దోపిడీ వల్ల కాంగోలో జరిగిన విధ్వంసం గురించిన నవలను ఉటంకిస్తూ ప్రారంభమైన ఈ భాగం సామ్రాజ్యవాద ప్రపంచీకరణ గురించి, వనరుల దోపిడీ గురించి, దేశదేశాల సంపన్నులకు ప్రభుత్వం దళారీగా వ్యవహరించడం గురించి ప్రస్తావించింది. అందువల్ల ప్రజలు అనివార్యంగా ఉద్యమాలవైపు చూడవలసి వస్తున్న పరిస్థితి గురించి రాసింది. మావోయిస్టులకు కూడ చట్టాన్ని తమ చేతిలోకి తీసుకునే హక్కు లేదని, వారిది హింసాకాండ అని పాలకవర్గ వైఖరినే ఒక పేరాగ్రాఫులో రాసినప్పటికీ, మొత్తంగా ప్రజల పోరాడే హక్కు పట్ల ఈ తీర్పు అనుకూలంగా స్పందించింది.

ఈ తీర్పు మీద ఒకవైపు ప్రపంచీకరణ శక్తులు, మరొక వైపు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, ప్రతినిధులు దుమ్మెత్తిపోయడం ప్రారంభించారు. ఈ తీర్పును కూడ రద్దు చేయాలని అప్పీలు వెళతామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. ఇంతవరకూ అలాంటి అప్పీలుకు వెళ్లలేదు గాని, న్యాయస్థానపు ఆదేశాలను కూడ పాటించలేదని, ఎస్పీవోలను రద్దుచేయలేదని వార్తలు వస్తున్నాయి.

ఐతే ఈ తీర్పులు ఎంత ప్రగతిశీలంగా, ప్రజాపక్షంగా ఉన్నట్టు కనబడుతున్నప్పటికీ, కొనసాగుతున్న రాజకీయార్థిక వ్యవస్థలో వీటికి ఎటువంటి ప్రభావం ఉండబోదనే సూచనలు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ తీర్పులలో వ్యక్తమయిన అభిప్రాయాల ఆధారంగా విశాల సంఘటిత ప్రజా ఉద్యమాలు సాగినప్పుడు మాత్రమే, ప్రజాశక్తి మాత్రమే ఈ తీర్పుల స్ఫూర్తిని ముందుకు తీసుకుపోగలదు.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Telugu. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s