సకల జనుల సమ్మె కర్తవ్యం ప్రతిఘటన

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ఉద్యమంలో కీలకఘట్టంగా ఈ వారంలో సకల జనుల సమ్మె ప్రారంభం కాబోతున్నది. ఆగస్ట్ మొదటి వారం నుంచీ సాగుతున్న వేరువేరు పోరాట రూపాల కొనసాగింపూ, ఉన్నతీకరణా ఈ సకల జనుల సమ్మె. తెలంగాణ ప్రజల పోరాట శీలాన్నీ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఆకాంక్ష బలాన్నీ ప్రదర్శించగల ఉజ్వల ఉద్యమ ఘట్టం ఇది. చరిత్రాత్మక సందర్భం ఇది.

గత ఇరవై నెలల పోరాట క్రమంలో వెలికివచ్చిన వివిధ పోరాట రూపాల గురించీ, వాటి జయాపజయాల గురించీ, అవి సాధించిన, సాధించలేకపోయిన అంశాల గురించీ చర్చించడానికి ఇది ఒక సందర్భం. ఆ సమీక్ష సకల జనుల సమ్మెలో అనుసరించవలసిన మార్గాల గురించి మన అవగాహన మెరుగుపడడానికి వీలు కల్పిస్తుంది. విభిన్న వర్గాల జెఎసిల ఏర్పాటు, విద్యాసంస్థల బంద్, తెలంగాణ వ్యాప్త బంద్, ప్రజాజీవన స్తంభన, విభిన్న ఉద్యోగ, కార్మిక వర్గాల సమ్మెలు, ఉద్యోగుల పెన్ డౌన్, సహాయనిరాకరణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బోర్డుల మార్పు, రాస్తారోకో, ధర్నా, నిరాహారదీక్ష, ఊరేగింపు, సభ, ధూంధాం, ఆటాపాటా, బోనాలు, కళాప్రదర్శనలు, వంటావార్పూ, రహదారుల మీద ఆటలు, బతుకమ్మ, ప్రజాప్రతినిధులను నిలదీయడం, ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకోవడం, శవదహనాలు, దిష్టిబొమ్మల దహనాలు, పిండప్రదానాలు, ఆత్మహత్యలు వంటి అనేక నిరసన రూపాలు ఈ ఇరవై నెలల్లో తెలంగాణలో వ్యక్తమయ్యాయి. వాటి మంచి చెడులను చర్చించవచ్చు గాని, మొట్టమొదట గుర్తించవలసిన అంశం ఇవన్నీ తెలంగాణ ప్రజల నిరసన ప్రకటనలు, ఆగ్రహ వ్యక్తీకరణలు, ప్రజా సంఘటితత్వానికీ, సంఘీభావానికీ, ఐక్యతకూ, ఆకాంక్షకూ చిహ్నాలు.

ఐతే ఈ రూపాలన్నీ తెలంగాణ ప్రజల ఐక్యతనూ, ఆకాంక్షనూ ప్రకటించినంత బలంగా తెలంగాణ ప్రత్యర్థుల మీద ప్రభావం వేశాయా ఆలోచించవలసి ఉంది. నిజానికి ఏదయినా ఒక నిరసన రూపం నిరసన తెలుపుతున్న ప్రజల ఐక్యతనూ, ఆకాంక్షనూ ఎంతగా ప్రకటిస్తుందో, ఎవరి మీద ఆ నిరసన వ్యక్తమవుతున్నదో వారి మీద అంతగా ప్రభావం వేయాలి. యథాస్థితి కొనసాగించడం కుదరదనీ, నిరసనకారుల ఆకాంక్షను గుర్తించి పరిస్థితిలో తగిన మార్పులు చేయక తప్పదనీ వారు గుర్తించేలా చేయాలి. తెలంగాణ ప్రజలు గత ఇరవై నెలల్లో ప్రదర్శించిన అన్నిరకాల నిరసన రూపాలూ నాలుగుకోట్ల ప్రజల ఆకాంక్షను తిరుగులేని విధంగా ప్రకటించాయి. కాని ప్రత్యర్థులు, కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును అడ్డుకుంటున్న పిడికెడు మంది కోస్తాంధ్ర, రాయలసీమ పెట్టుబడిదారులు, వ్యాపారులు, రాజకీయవేత్తలయినా ఇసుమంత కూడ కదిలినట్టు కనబడడం లేదు. పైగా మొత్తం పరిస్థితి 2009 డిసెంబర్ 9 కన్న ముందరి స్థితికి దిగజారినట్టు అనుమానం కలుగుతున్నది. అంటే తెలంగాణ ప్రజలు వేరువేరు స్థాయిల్లో తమ శక్తి కొద్దీ చేసిన త్యాగాలు, నిరసన ప్రకటనలు ఏ ఫలితమూ సాధించలేదా అని నిరాశ తలెత్తుతున్నది.

అందువల్ల ఈ ఇరవై నెలల నిరసన రూపాలను పునస్సమీక్షించవలసి ఉంది. పునస్సమీక్షించడమంటే ఆ రూపాలను తిరస్కరించడం కాదు, గౌరవించకపోవడం కాదు. సగౌరవంగానే వాటిని అంచనా వేసి వాటి సాఫల్య వైఫల్యాలను మదింపు వేయాలి. వాటి ప్రయోజనాన్నీ నష్టాన్నీ బేరీజు వేయాలి. ఉదాహరణకు ఈ ఇరవై నెలల నిరసన రూపాలలో ఆత్మహత్య అనే రూపం ఎంతమాత్రం అంగీకరించడానికి వీలులేనిది. దాదాపు ఏడు వందలమంది యువతీయువకుల విలువైన ప్రాణాలు ఇలా బలి అయిపోయాయి. ఏ తెలంగాణ సాధన తమ జీవిత లక్ష్యమని వారు అనుకున్నారో, ఆ తెలంగాణ సాకారం కాకుండానే వారు మనమధ్య లేకుండా పోయారు. నిస్సహాయతలో, ఇక గత్యంతరంలేని, దిక్కుతోచని పరిస్థితిలో, వ్యక్తిగత స్థాయిలో ఆత్మహత్య జరిగితే అర్థం చేసుకోవచ్చుగాని, సామాజిక స్థాయిలో మాత్రం ఆత్మహత్యకు అర్థం లేదు. ఎందుకంటే సమాజానికి గత్యంతరం లేకపోవడం, దిక్కుతోచకపోవడం ఉండవు. సామాజిక పరిణామాలు ఎంత వైవిధ్యభరితమైనవంటే ఎన్ని దారులు మూసుకుపోయినా మరొక దారి మిగిలే ఉంటుంది. ఎక్కడా ఇక ముగింపు అని చెప్పవలసిన పరిస్థితి రాదు. నిజం చెప్పాలంటే తెలంగాణ ఉద్యమం ఇంకా అన్ని దారులూ ప్రయత్నించనే లేదు. అప్పుడే దారులు మూసుకుపోయాయని నిరాశ చెందడం, ఆత్మహత్యకు పూనుకోవడం నిస్సందేహంగా తప్పుడు చర్యే. అలాగే ఈ ఇరవై నెలల పోరాట రూపాలలో పిండ ప్రదానం వంటి బ్రాహ్మణీయ, మూఢనమ్మక చర్యలు, శవదహనం, దిష్టిబొమ్మల దహనం వంటి సాంకేతిక, తంత్రశాస్త్ర, చేతబడి వంటి చర్యలూ వ్యక్తమయ్యాయి. తెలంగాణ ఆకాంక్ష వంటి ఉదాత్తమైన ఆకాంక్షతో ఇవి సరిపోవు. ఇవి కొనసాగుతున్న పీడక సంస్కృతిలో భాగమే. పీడితులపై కూడ ఉండే పీడక సంస్కృతి ప్రభావంలో భాగమే. ఇవేవీ ప్ర్రత్యర్థి మీద నిజంగా ప్రభావం వేసే చర్యలు కావు.

ఇక సరైన పోరాట రూపాలు చేపట్టినప్పుడు కూడ అవి ప్రత్యర్థుల మీద ప్రభావం చూపే పద్ధతిలో, చూపేంత బలంగా జరగలేదు. ‘మీ నిరాహార దీక్షల వల్ల మీ కడుపే మాడుతుంది, మీ రాస్తారోకోల వల్ల మీ ప్రజల ప్రయాణానికే ఇబ్బంది కలుగుతుంది, మీ బంద్ ల వల్ల మీ ప్రజాజీవనమే స్తంభించిపోతుంది. మీ విద్యాసంస్థల బంద్ వల్ల మీ పిల్లల చదువే చెడిపోతుంది’ అని ప్రత్యర్థులు పరిహాసమాడే స్థితి వచ్చింది. నిరాహారదీక్ష నైతిక ఒత్తిడి తేగల చర్యే గాని ఇవాళ తెలంగాణ ప్రత్యర్థులు ఎంత నీతి లేని వారంటే నిరాహారదీక్ష వంటి రూపం వారిమీద ఎటువంటి ప్రభావమూ వేయదు. ఇక మిగిలిన రూపాలు ఏకకాలంలో ప్రజాజీవనాన్నీ, ప్రభుత్వపాలననూ స్తంభింపజేసే శక్తి గలవి. కాని ఈ ఇరవై నెలలలో అవి ప్రజా జీవనాన్ని స్తంభించినంతగా, ప్రభుత్వాన్ని, పాలకవర్గాలను కదిలించగలిగాయా ఆలోచించవలసే ఉంది.

ఈ నిరసన రూపాలు ఎంతో గొప్పగా, విస్తృతమైన ప్రజా మద్దతుతో, ప్రజా భాగస్వామ్యంతో జరిగినప్పటికీ, అవి ప్రత్యర్థులమీద ప్రభావం చూపకపోవడానికి ప్రధాన కారణం, అవి నిరసనగా మాత్రమే మిగిలిపోవడం, ప్రతిఘటనగా ఎదగకపోవడం. తమ వనరులను దోచుకోవడం ఆగిపోవాలంటే, తమ నిధులు, నీళ్లు, నియామకాలు తమకే దక్కాలంటే తమ రాష్ట్రం తమకు దక్కాలని నిరసన తెలుపుతున్న ప్రజలు ఆ నిరసన సఫలం కావాలంటే ఆ వనరుల దోపిడీని ఎక్కడికక్కడ ప్రతిఘటించక తప్పదు. నిధుల కేటాయింపులో, నీళ్ల పంపిణీలో, నియామకాలలో సాగుతున్న అన్యాయాలను ఎక్కడికక్కడ ప్రతిఘటించక తప్పదు. ఈ అసమానతకు, దోపిడీకి, వివక్షకు కారణమైన పాలనను ప్రతిఘటించక తప్పదు. కాని దురదృష్టవశాత్తూ ఈ ప్రతిఘటనలేవీ జరగలేదు, ప్రారంభమైనవి కూడ ముందుకు సాగలేదు.

ఇవాళ సకల జనుల సమ్మె ముందు ఉన్న ప్రధాన కర్తవ్యం ప్రతిఘటన. దోపిడీని, పీడనను ప్రతిఘటించడం కేవలం రాజకీయ చర్యో, సామూహిక చర్యో మాత్రమే కాదు. ఏ ఒక్కరో చేసి, ఇతరులు సాక్షులుగా ఉండేది కాదు. ప్రతి ఒక్కరూ చేయవలసినది, చేయగలిగినది. వ్యక్తిగత స్థాయి నుంచి సామాజిక స్థాయి వరకు ఎన్ని రూపాలలోనయినా ప్రతిఘటన ఉండవచ్చు.

ఈ ప్రతిఘటన కోస్తా నుంచి, రాయలసీమ నుంచి పొట్టచేత పట్టుకుని వచ్చిన సాధారణ ప్రజల మీద కానక్కరలేదు. ప్రజల మధ్య విద్వేషాలూ, ఘర్షణలూ అవసరం లేదు. తెలంగాణ ఫిర్యాదు పాలకులమీద, పాలక విధానాల మీద, తెలంగాణలో పుట్టి కూడ ఆ పాలకులలో భాగమైనవారి మీద మాత్రమే గాని, ఇతర ప్రాంతాల సాధారణ ప్రజల మీద కాదు. నిజం చెప్పాలంటే, తెలంగాణ నేల మీదికి గత ఐదారు వందల సంవత్సరాలలో డజన్ల కొద్దీ జాతులు వలస వచ్చి ఇక్కడి ప్రజలతో శాంతియుత సహజీవనం చేస్తున్నాయి. తెలంగాణలో భాగమయ్యాయి. అలా కాక, ఈ ఆరు దశాబ్దాలలో కోస్తా, రాయలసీమల నుంచి తెలంగాణకు వచ్చిన కొందరు, పొట్టచేతపట్టుకుని వచ్చినప్పటికీ, ఆభిజాత్యంతో, ఇంకా అక్కడివారమనే అహంకారంతో స్థానికులను చిన్నచూపు చూస్తూ, పాలకుల పక్షం చేరిన వారున్నారు. వారిని కూడ ప్రతిఘటించనక్కరలేదు గాని, వారికి నిజాలు చెప్పి దారికి తేవలసి ఉంది.

ఇవాళ జరగవలసిన ముఖ్యమైన ప్రతిఘటన తెలంగాణ ప్రత్యర్థుల రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలమీద. ఆ రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు నెరవేరకుండా ప్రతిఘటించడం ఇవాళ్టి అవసరం. ఈ ఇరవై నెలలలో కూడ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించే రాజకీయవాదుల, వ్యాపారుల ప్రయోజనాలు తెలంగాణ గడ్డమీద యథావిధిగా సాగిపోయాయి. తెలంగాణను వ్యతిరేకించే, పైకి సమర్థిస్తున్నట్టు కనబడి లోపల వ్యతిరేకించే, కపటపు రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు తమ రాజకీయ ప్రయోజనాలకు చీమ తలకాయంత నష్టం కూడ జరగలేదని భావించే పరిస్థితి ఉంది. చివరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి తాము వ్యతిరేకమని బహిరంగంగా ప్రకటించిన పార్టీలు కూడ తెలంగాణ గడ్డమీద సజావుగా తిరుగుతున్నాయి, కార్యక్రమాలు నడుపుతున్నాయి. ఉత్తుత్తి రాజీనామాలు చేసి, ప్రభుత్వంలో కొనసాగుతున్న, తెలంగాణ వ్యతిరేకుల అంటకాగుతున్న నాయకులు తెలంగాణలో మామూలుగా తిరుగుతున్నారు. తెలంగాణ సమాజం ముక్తకంఠంతో ప్రకటిస్తున్న ఆకాంక్షను వ్యతిరేకిస్తున్న వారి రాజకీయ ప్రయోజనాలు తెలంగాణలో దెబ్బతినక తప్పదని ప్రకటిస్తే తప్ప, వారిని ప్రతిఘటిస్తే తప్ప రాజకీయ పార్టీల, రాజకీయ నాయకుల ద్వంద్వవైఖరికి అడ్డుకట్ట పడదు. అలా రాజకీయ ప్రయోజనాలు దెబ్బతింటాయని అర్థమైనప్పుడు మాత్రమే ఆ రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు తెలంగాణను వ్యతిరేకించి తమ ఉనికిని కోల్పోవడమా, తెలంగాణ సాధన కృషిలో భాగం కావడమా తేల్చుకోక తప్పని స్థితి వస్తుంది. ఆ స్థితి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వైపు దారితీస్తుంది.

ఇవాళ రాజకీయాలంటే వ్యాపారమే. కాంట్రాక్టర్లు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు రాజకీయాల్లో చేరి తమ ఆర్థిక ప్రయోజనాలు నెరవేర్చుకుంటున్నారు. తెలంగాణను వ్యతిరేకిస్తున్నదీ ఈ వ్యాపార-రాజకీయ వర్గమే. తెలంగాణను వ్యతిరేకిస్తూనే తెలంగాణలో వ్యాపార, ఆర్థిక ప్రయోజనాలు పొందుతూ, కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్న ఈ వర్గపు ఆర్థిక ప్రయోజనాలను ప్రతిఘటించనంతవరకూ, తెలంగాణ నుంచి వారికి చేకూరుతున్న ఆర్థిక మూలాల మీద అడ్డుకట్ట వేయనంతవరకూ వారు తెలంగాణను వ్యతిరేకిస్తూనే ఉంటారు. ఈ డబ్బు సంచులే పట్టుకుని తెలంగాణను వ్యతిరేకించడానికి ఢిల్లీలో చక్రం తిప్పుతూ ఉంటారు. ఇలాంటి వారు డజన్లకొద్దీ ఉన్నారు గాని ఒక్క ఉదాహరణ చెప్పాలంటే, తెలంగాణకు ప్రథమ శత్రువుగా తనను తాను ప్రకటించుకున్న రాజకీయ వ్యాపారికి చెందిన విద్యుత్ కర్మాగారం సింగరేణి బొగ్గుతోనే నడుస్తున్నది. అది ఈ ఇరవై నెలల్లో ఒక్కరోజు కూడ బొగ్గు కొరతను ఎదుర్కోలేదు. ఈ ఇరవై నెలల్లో కూడ వందలకోట్ల రూపాయల లాభాలు సంపాదించింది. ఇలా తెలంగాణ వ్యతిరేక ఆర్థిక ప్రయోజనాలు సజావుగా సాగిపోతున్నాయి.

కనుక ఈ సకల జనుల సమ్మె సందర్భంగానైనా తెలంగాణ వ్యతిరేకుల, ప్రత్యర్థుల, శత్రువుల రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలను ప్రతిఘటిస్తామని శపథం చేయవలసి ఉంది. అరణ్యవాసమూ, అజ్ఞాతవాసమూ అయిపోయి, రాయబారం కూడ విఫలమై, ఇక యుద్ధం తప్పదని తెలిసిన ఈ క్షణాన జమ్మిచెట్టు మీంచి ఆయుధాలు దించక తప్పదు. సకలజనుల సమ్మె ఆ యుద్ధానికి నాంది కావాలి.

n ఎన్ వేణుగోపాల్

ఆగస్ట్ 13, 2011

(నమస్తే తెలంగాణ లో ప్రచురణ: ఆగస్ట్ 14, 2011)

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Telugu. Bookmark the permalink.

One Response to సకల జనుల సమ్మె కర్తవ్యం ప్రతిఘటన

  1. john says:

    1. OU లో మెస్ లో వండే వాళ్ళు ‘సకల జనులే’ కదా….మరి OU లో మెస్ close చేస్తారా సమ్మె time లో ?!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s