విప్లవ విస్తృతి చిహ్నం కిషన్ జీ

కిషన్ జీ గా సుప్రసిద్ధుడైన భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) అగ్రనాయకుడు మల్లోజుల కోటేశ్వర రావును పశ్చిమ బెంగాల్ లోని పశ్చిమ మేదినీపూర్ జిల్లా బురిషోల్ అడవులలో కేంద్ర రిజర్వ్ పోలీసు బలగాలు ఎదురుకాల్పుల పేరిట నవంబర్ 24న కాల్చిచంపాయి. కోటేశ్వర రావు యాభై ఏడు సంవత్సరాల జీవితంలో దాదాపు నాలుగు దశాబ్దాలు విప్లవోద్యమంలో పనిచేశారు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో ప్రారంభించి జిల్లా, రాష్ట్రమూ కూడ దాటి నాటి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్ (నేటి చత్తీస్ గడ్, జార్ఖండ్), ఒరిస్సా, పశ్చిమబెంగాల్, ఈశాన్య రాష్ట్రాల దాకా సువిశాల ప్రాంతంలో వివిధ వర్గాల ప్రజల మధ్య తన విప్లవ కృషి కొనసాగించారు. విద్యార్థి, యువజన. రైతుకూలీ, ఆదివాసి, మహిళా, మైనారిటీ పోరాటాల లోనూ, జాతుల సమస్య లోనూ, అన్ని అణగారిన ప్రజా సమూహాల లోనూ విప్లవ రాజకీయ కార్యాచరణలో భాగంగా పని చేశారు. రచన, అనువాదం, ఉపన్యాసం, పత్రికా నిర్వహణ, రాజకీయ నిర్మాణ నిర్వహణ, సైనికాచరణ వంటి అన్ని స్థాయిలలోనూ పనిచేశారు. విప్లవ జీవితమంతా అద్భుతమైన మానవ సంబంధాలు నెరిపి వేలాది మందికి ఆప్తమిత్రుడిగా, లక్షలాది మందికి సహచరుడిగా, నాయకుడిగా, ప్రేరణగా నిలిచారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన జీవితమూ ఆచరణా విప్లవోద్యమ విస్తృతికి అద్దం పడతాయి. విప్లవం మొరటైనదనీ, సంకుచితమైనదనీ, గిరిగీసుకుని కూచునేదనీ సాధారణంగా ఉన్న దురభిప్రాయాలను, అపోహలను, అపార్థాలను ఆయన జీవితమూ ఆచరణా తుత్తునియలు చేస్తాయి.

విప్లవం అంటే హింస మాత్రమేననీ, విప్లవకారులకు తుపాకులూ, మందుపాతరలూ, చంపడమూ, చావడమూ తప్ప మరేమీ తెలియవనీ అంతకంతకూ ఎక్కువగా పాలకులు ప్రచారం చేస్తున్నారు. మధ్యతరగతి బుద్ధిజీవులనూ, పత్రికల పాఠకులనూ, టెలివిజన్ వీక్షకులనూ నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. సంప్రదాయం బలంగా ఉన్న సమాజంలో, ప్రజల మీద పాలకవర్గ భావజాలం పట్టు ఎక్కువగా ఉన్న సమాజంలో ప్రతి కొత్త భావమూ, ప్రతి పాలకవర్గ వ్యతిరేక భావమూ దుష్ప్రచారానికీ, అపార్థాలకూ గురవుతాయి. భారత సమాజంలో సంప్రదాయం, పాలకవర్గ భావజాలం అతి దుర్మార్గమైన హిందూ బ్రాహ్మణీయ ఆవరణలో ఉండడం వల్ల కొత్త భావాల పట్ల పాలకవర్గాల దుష్ప్రచారం మరింత ఎక్కువగా, మరింత నీచంగా ఉండడం సహజమే. గౌతమ బుద్ధుడి సామాజిక ప్రగతిశీల అంశాల పట్ల సమాజంలో పెంచి పోషించబడిన దుష్ప్రచారాల నుంచి ప్రస్తుత మావోయిస్టు విప్లవకారుల అభిప్రాయాల గురించి, ఆచరణ గురించి ప్రచారంలో ఉన్న అబద్ధాల, దుష్ప్రచారాల దాకా ఈ చరిత్ర సుదీర్ఘమైనది.

ఈ దురభిప్రాయాలనూ దుష్ప్రచారాలనూ బద్దలు చేస్తూ విప్లవం ఎంత సువిశాలమైనదో, ఎంత మానవీయమైనదో, ఎంత ఆలోచనాత్మకమైనదో, ఎంత కష్టభరితమైనదో దాదాపు ప్రతి విప్లవకారుడి జీవితమూ చూపుతున్నప్పటికీ ఆ నిజం తెలుసుకోవడానికి మధ్యతరగతి బుద్ధిజీవులలో ఎక్కువమంది ఇంకా సిద్ధపడడం లేదు.

ఈ నేపథ్యంలో విప్లవ విస్తృతికీ, లోతుకూ, మానవతాస్ఫూర్తికీ, కష్టభరితమైన ప్రజాసేవా మార్గానికీ, పట్టువిడుపుల బహుళత్వానికీ, నూతన సమాజ నిర్మాణానికీ అసాధారణమైన చిహ్నంగా నిలుస్తుంది మల్లోజుల కోటేశ్వరరావు జీవితం. ఈ దేశం మీద, ఈ దేశ ప్రజల మీద నిజమైన ప్రేమ ఉన్నవారెవరైనా అనివార్యంగా నడవవలసిన దారి ఏమిటో ఆయన చూపాడు. ఆ దారి ఎక్కడ మొదలై ఎక్కడిదాకా విస్తరిస్తుందో ఆయన జీవితమే ఉదాహరణ. ఆయన పని చేసిన ప్రాంతాలు పుట్టి పెరిగిన పెద్దపల్లి నుంచి కరీంనగర్ జిల్లాకూ, ఉత్తర తెలంగాణకూ, అటునుంచి రాష్ట్రం మొత్తానికీ, గోదావరి దాటి మహారాష్ట్ర – మధ్యప్రదేశ్ అడవులకూ, అటునుంచి ఒరిస్సా సరిహద్దులకూ, ఇంకా పైకి బీహార్ కూ, అటునుంచి పశ్చిమ బెంగాల్ కూ, క్రమంగా ఈశాన్య ప్రాంతానికీ విస్తరించాయి. ‘నదీనదాలు, అడవులు, కొండలు, ఎడారులా మనకడ్డంకి’ అన్నట్టుగా భారతదేశంలో సువిశాల ప్రాంతాన్ని ఆయన తన పాదముద్రలతో నింపాడు. ఈ క్రమంలో అప్పటికే వచ్చిన తెలుగు, హిందీ, ఇంగ్లిష్ లకు తోడుగా గోండి, ఒరియా, సంథాలీ, బెంగాలీ వంటి భాషలెన్నో నేర్చుకున్నాడు. కోటేశ్వరరావు అనే పేరుతో మొదటి ఇరవై సంవత్సరాలు గడిపితే, ఆ తర్వాతి నాలుగు దశాబ్దాలు ప్రహ్లాద్, రాంజీ, శ్రీధర్, కిషన్ జీ వంటి అనేక పేర్లతో పనిచేశాడు.

అలాగే మొట్టమొదట విద్యార్థి రంగంతో ప్రారంభించి క్రమంగా యువజనులు, రైతు కూలీలు, పార్టీ నిర్మాణం, ఆదివాసులు, మహిళలు, మైనారిటీలు, అణచివేతకు గురైన జాతులు వంటి అన్ని ప్రజా రంగాలలోనూ పనిచేశాడు. వివిధ రంగాలలో పనిచేసే ప్రజాసంఘాలకు మార్గదర్శకత్వం వహించడం మాత్రమే కాదు, ఆయారంగాల పనులను కూడ చేశాడు. స్వయంగా రచన చేశాడు, అనువాదం చేశాడు, పత్రికలు నడిపాడు, ఉపన్యాసాలు ఇచ్చాడు, పాఠశాలలు నిర్వహించాడు, సైనిక శిక్షణ ఇచ్చాడు, సైనిక కార్యకలాపాలలో పాల్గొన్నాడు, అన్నిరకాల వాహనాలు నడిపాడు. సైనిక ఘటనల వ్యూహాలు రచించాడు. ఐక్యసంఘటన ఎత్తుగడలు రచించాడు. మార్క్సిస్టుల పేరుతో ఊరేగుతున్న సోషల్ ఫాసిస్టుల స్వరూపాన్ని విప్పి చెప్పాడు. ప్రపంచీకరణ వ్యతిరేక పోరాటాలకు తలమానికం వంటి, ప్రపంచీకరణ కార్యక్రమాన్ని ఆపగలిగిన సింగూరు, నందిగ్రామ్ పోరాటాలకు నాయకత్వం అందించాడు. అపజయాన్ని ఎదుర్కొన్న నక్సల్బరీకి రెండు దశాబ్దాల తర్వాత పునరుజ్జీవనాన్ని ఇచ్చిన లాల్ గడ్ కు నాయకత్వం వహించాడు. పోలీస్ సంత్రాష్ బిరోధి జనసాధారణేర్ కమిటీ వంటి విశాల ప్రజా ఐక్య సంఘటనను నిర్మించాడు. మొదట దండకారణ్యంలోనూ, ఆ తర్వాత జంగల్ మహల్ లోనూ ప్రత్యామ్నాయ రాజకీయాధికారాన్ని బీజరూపంలో సాధించడంలో గణనీయమైన పాత్ర నిర్వహించాడు. చరిత్ర నిర్మాణంతో పాటే చరిత్ర నమోదు కావాలనుకున్నాడు, చరిత్ర రచన జరగాలనుకున్నాడు. పెద్దపల్లి నుంచి జంగల్ మహల్ దాకా తాను భాగస్వామి ఐన అన్ని పోరాటాలనూ ఏదో ఒక రూపంలో నమోదు చేశాడు, చేయించాడు.

ఇవన్నీ సామాజిక కార్యక్రమాలైతే, వ్యక్తిగతంగా ఆయన వందలాది మంది హృదయాలను చూరగొన్నాడు. వేలాది మందికి ప్రేరణగా నిలిచాడు, లక్షలాది మంది పాల్గొంటున్న ఒక మహావిప్లవ క్రమానికి దిశానిర్దేశం చేసే అగ్రనాయక బృందంలో ఉన్నాడు. నిరుత్సాహానికి గురైన ఎందరినో విప్లవంలో నిలబెట్టాడు, అద్భుతమైన సంభాషణలు నడిపాడు, చిరకాలం గుర్తుండే ఉత్తరాలు రాశాడు. పరిచయమైతే చాలు స్నేహంగా మలిచాడు, స్నేహమైతే చాలు విప్లవానికి ఏ రంగంలోనైనా చిన్నమెత్తు పని ఐనా చేసేట్టు తీర్చిద్దిదాడు. తన బంధువులనూ స్నేహితులనూ మాత్రమే కాదు, తన ప్రభావంలోకి వచ్చినవారి బంధువులనూ, స్నేహితులనూ కూడ విప్లవ కార్యక్రమాలలో ఎక్కడో ఒక చోట సంబంధంలోకి తెచ్చాడు. విప్లవం ఎంత విశాలమైనదో, అది ఎట్లా పిడికెడు మంది వర్గ శత్రువులకు మినహా మిగిలిన అశేష ప్రజానీకంలో ప్రతి మనిషికీ వర్తిస్తుందో, అవసరమయిందో, అనివార్యమయిందో ఆయన చెప్పాడు, చూపాడు, వారందరినీ విప్లవంలో భాగం చేశాడు.

అంత అద్భుతమైన, అసాధారణమైన మనిషి గురించి తెలుసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. తెలియజెప్పడం తెలిసినవారందరి బాధ్యత. ఆయన గురించి తెలుసుకోవడమంటే ఆయన పాల్గొన్న విప్లవోద్యమం గురించి తెలుసుకోవడమే.

కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో 1954లో పుట్టిన కోటేశ్వరరావు విద్యార్థి దశనుంచే ప్రజానుకూల రాజకీయాలవైపు, సామాజిక కార్యాచరణవైపు ఆకర్షితుడయ్యాడు. తండ్రి స్వాతంత్ర్య సమరయోధుడు వెంకటయ్య, తల్లి మధురమ్మ ఇంట్లో నెలకొల్పిన ప్రజాస్వామిక వాతావరణంతో పాటు కౌమారదశలో పడిన ప్రభావాలు కూడ ఆయన భావి జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని తయారుచేసి ఉంటాయి. పెద్దపల్లి ప్రాంతంలో ఇంకా ఆరని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట జ్ఞాపకాలు, స్థానిక ప్రజాచరిత్ర పట్ల, సోషలిస్టు ఆదర్శాల పట్ల ఠాకూర్ రాజారాం సింగ్ కలిగించిన ఆసక్తి, ఉన్నత పాఠశాల దశలో ప్రారంభమైన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఆ ప్రభావాలలో ముఖ్యమైనవి.

పెద్దపల్లి నుంచి తూర్పు వైపు కనబడే రామగిరి గుట్టలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలంలో అనభేరి ప్రభాకర రావు, గట్టుపల్లి మురళి వంటి గెరిల్లా పోరాట యోధుల స్థావరాలు. పెద్దపల్లికి నిజాం వ్యతిరేక పోరాటకాలం నుంచీ కూడ ప్రజాపోరాట చరిత్ర ఉంది. 1940లలోనే అక్కడ నిజాం పోలీసులకు వ్యతిరేకంగా ప్రజలు సాగించిన ఆందోళనలు చరిత్రకెక్కాయి. కోటేశ్వరరావు కుటుంబానికి పొరుగున నివసిస్తుండిన న్యాయవాది ఠాకూర్ రాజారాం సింగ్ పెద్దపల్లిలో ఒక విలక్షణమైన వ్యక్తి. కరీంనగర్ జిల్లా గోదావరీ తీరంలో రెండువేల ఏళ్లకింద అద్భుతమైన సంస్కృతి విలసిల్లిందని నమ్మి, సొంతంగా తవ్వకాలు జరిపి, పరిశోధనలు చేసిన, భారతీయ తత్వశాస్త్రంలో భౌతికవాద దృక్పథం గురించి రచనలు చేసిన అరుదైన మనిషి ఆయన. అలా ఆయన పెద్దపల్లిలో స్థానిక ప్రజా చరిత్ర పట్ల గౌరవాన్నీ, భౌతికవాద దృక్పథాన్నీ, సోషలిస్టు భావాలనూ విత్తనాలుగా చల్లారు. ఆ వాతావరణంలో కోటేశ్వరరావుకు పదిహేనో ఏటనే సామాజికాచరణలో భాగమయ్యే అవకాశాన్ని ఇచ్చినది 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం. ఆ ఉద్యమంలో భాగంగా పోలీసు నిర్బంధాన్ని కూడ చవిచూసిన కోటేశ్వరరావు సహజంగానే రాజ్య వ్యతిరేక భావజాలంలోకి ప్రవేశించాడు.

అవన్నీ తెలిసీ తెలియని వయసులో ప్రభావాలైతే, తొలియవ్వనంలో డిగ్రీ కోసం 1971 – 74 మధ్య కరీంనగర్ లో ఉన్నప్పుడు పడిన ప్రభావాలు, ప్రవేశించిన ఆచరణ మరింత స్పష్టమైనవి. స్పష్టతనిచ్చినవి. అప్పటికి నక్సల్బరీ పంథాలో విప్లవోద్యమ పునర్వికాసం కోసం ఒకవైపు అజ్ఞాత విప్లవకారులు, మరొకవైపు విప్లవ రచయితలు, జననాట్యమండలి కళాకారులు జరుపుతున్న ప్రయత్నాలు కరీంనగర్ ను కూడ తాకాయి. సాహిత్యం మీద, చరిత్ర మీద, ప్రజాజీవితం మీద ఆసక్తి ఉన్న యువకుడిగా కోటేశ్వరరావు సహజంగానే ఈ రాజకీయావగాహనలలోకి వచ్చాడు. అందుకే 1974లో డిగ్రీ ముగిసి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర విద్యలో చేరినా దానికన్న ఎక్కువగా అప్పటికే నిర్మాణమవుతున్న విప్లవ విద్యార్థి ఉద్యమంలో భాగమయ్యాడు. 1974 అక్టోబర్ లో ఏర్పడి, 1975 ఫిబ్రవరిలో మొదటి మహాసభలు జరుపుకున్న రాడికల్ విద్యార్థి సంఘ నిర్మాతలలో ఒకడయ్యాడు.

నిజంగా ఆ కాలం గొప్ప విప్లవాల, అన్వేషణల, ప్రయోగాల, విజయాల ఉద్వేగభరిత కాలం. 1970 నాటికే శ్రీకాకుళ విప్లవోద్యమ నాయకత్వాన్నీ, ప్రధాన శ్రేణులనూ రాజ్యం పొట్టనపెట్టుకుంది. మొత్తం గిరిజనోద్యమాన్నే రక్తపుటేర్లలో ముంచి అణచివేసింది. 1972 నాటికి నక్సల్బరీ కూడ అపజయానికీ చీలికలకూ గురయింది. భారత విప్లవోద్యమ నిర్మాత చారు మజుందార్ హత్యకు గురయ్యాడు. ఈ దేశ ప్రజల విముక్తి పోరాటాలలో అత్యద్భుతమైన గుణాత్మక మార్పు తెచ్చిన నక్సల్బరీ, శ్రీకాకుళాలు అలా తాత్కాలిక అపజయానికి గురయ్యాయి. అప్పుడు ఆ నిప్పురవ్వను ఆరిపోకుండా నిలిపి ఉంచడానికి ఆంధ్రప్రదేశ్ విప్లవోద్యమం, ప్రత్యేకించి మిగిలిపోయిన రాష్ట్ర కమిటీ సాహసోపేతమైన ప్రయోగాలు చేసింది. నక్సల్బరీ చూపిన మార్గాన్ని ఎత్తిపడుతూనే, దాని తప్పులను సరిదిద్దుకుంటూ కొత్తదారి నిర్మించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ ప్రయత్నాలలో భాగంగా దేశవ్యాప్త విప్లవకారులను పునరేకీకరించి ఏర్పరచిన సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ 1974 నాటికి ఆత్మవిమర్శ నివేదికనూ, ‘విప్లవానికి బాట’ అనే ఎత్తుగడల పంథానూ రూపొందించింది. ఆ అవగాహనల వెలుగులో ప్రజాసంఘాల నిర్మాణం ప్రారంభించింది.

అలా విప్లవోద్యమం తొలినాటి అతివాద తప్పిదాలను సవరించుకుంటూ ప్రజాపంథాలో పునర్నిర్మాణమవుతున్న సమయానికే కోటేశ్వరరావు విప్లవ రాజకీయాలలో ప్రవేశించాడు. అప్పటినుంచి గడిచిన ముప్పై ఆరు సంవత్సరాలలో కొద్దినెలల పాటు జైలులోనూ, ఒకటి రెండు సంవత్సరాల పాటు బహిరంగ జీవితంలోనూ మినహాయిస్తే మిగిలిన కాలమంతా ఆయన ఆ ప్రజాపంథాను బలోపేతం చేస్తూ, ఉన్నతీకరిస్తూ, విస్తరిస్తూ అశేష ప్రజానీకం మధ్య విప్లవోద్యమ నిర్మాణంలో అజ్ఞాత జీవితం గడిపాడు.

అప్పటికే సాహిత్య, కళా రంగాలలో పనిచేసే బహిరంగ సంఘాల అనుభవం ఉన్నప్పటికీ, ప్రజా పంథాలో మొదటి ప్రయోగంగా, మొదటి ప్రజాసంఘంగా రాడికల్ విద్యార్థి సంఘం తన మొదటి మహాసభలు జరుపుకుని, ఒక సంఘటిత నిర్మాణంగా విద్యార్థి రంగంలో విప్లవోద్యమ నిర్మాణానికి ప్రయత్నాలు ప్రారంభించి నాలుగు నెలలు గడవకుండానే ఎమర్జెన్సీ వచ్చింది. రాడికల్ విద్యార్థి సంఘ నాయకులనూ, బాధ్యులనూ నిర్బంధించడానికి పోలీసుల ప్రయత్నాలు మొదలయ్యాయి. రాడికల్ విద్యార్థులు అరెస్టయి, ఎప్పటికి విడుదలవుతారో తెలియని జైలు జీవితాన్ని గడపడమా, అరెస్టు తప్పించుకుని, ప్రజలలో విప్లవోద్యమ నిర్మాణం కొరకు అజ్ఞాత జీవితం ఎంచుకోవడమా అనే సవాల్ వచ్చినప్పుడు ఎక్కువమంది రెండో మార్గాన్నే ఎంచుకున్నారు. విప్లవ విద్యార్థి ఉద్యమ నాయకుడు సూరపనేని జనార్దన్ ను, మరి ముగ్గురు సహచరులను ఎమర్జెన్సీ విధించిన నెలరోజులకు మెదక్ జిల్లా గిరాయిపల్లిలో బూటకపు ఎదురుకాల్పులలో కాల్చిచంపడంతో ప్రజల మధ్య కృషి ప్రాధాన్యత మరింత తెలిసివచ్చింది. అలా ఎందరో రాడికల్ విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలలో విప్లవోద్యమ నిర్మాణ కృషిలోకి దిగారు. అప్పుడు కరీంనగర్ జిల్లా గ్రామసీమలలో పనిచేయడం మొదలుపెట్టిన రాడికల్ విద్యార్థులలో కోటేశ్వరరావు ఒకరు.

ఆ విద్యార్థులు జగిత్యాల, సిరిసిల్ల తాలూకాల గ్రామాలలో అప్పటికి కొనసాగుతుండిన భయంకర భూస్వామ్య దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేసి పోరాటాలకు సమాయత్తం చేశారు. కూలిరేట్ల పెంపుదల నుంచి దొరల అక్రమ ఆక్రమణలో ఉన్న భూములను స్వాధీనం చేసుకోవడం దాకా, స్త్రీలపై అత్యాచారాలను ప్రతిఘటించడం నుంచి ప్రజల హక్కుల కొరకు ప్రభుత్వాధికారులను నిలదీయడం దాకా ఆ సమయంలో ప్రజలు చేపట్టిన పోరాటరూపాలు అసంఖ్యాకం. ఎమర్జెన్సీ చీకటిపాలనకు మేలిముసుగుగా ఇందిరాగాంధీ ప్రకటించిన ఇరవై సూత్రాల పథకంలో ఆదివాసులకు, దళితులకు, భూమిలేని నిరుపేదలకు అనుకూలంగా ఉన్న సూత్రాలను అమలు చేయాలనే డిమాండ్ తో ప్రజలను కూడగట్టి ఆందోళనలు ప్రారంభించారు. వందలాది గ్రామాలలో రైతుకూలీలను, యువజనులను సంఘటితం చేసి, పోరాటాలకు సమాయత్తం చేశారు. రాడికల్ విద్యార్థి సంఘానికి సోదర సంస్థగా 1975 జూన్ లో ఏర్పడి ఉండవలసిన రాడికల్ యువజన సంఘం ఎమర్జెన్సీ వల్ల ఏర్పడక పోయినా, ఎమర్జెన్సీలోనే ఈ కరీంనగర్ గ్రామాలలో సంఘ నిర్మాణం జరిగిపోయింది. అలా రెండు సంవత్సరాల పాటు ప్రజల మధ్య సాగిన కృషి విప్లవోద్యమం ఎంచుకున్న ప్రజాపంథా ఎంత సరిఅయినదో, ఎంత అవసరమైనదో ఎత్తిపట్టింది. అద్భుతమైన ఫలితాలనిచ్చింది. అందువల్లనే ఎమర్జెన్సీ తర్వాత సాయుధ పోరాట తాత్కాలిక విరమణ ప్రకటించిన విప్లవోద్యమం బహిరంగ ప్రజా ఉద్యమాన్ని ఎంచుకున్నది.

ఈ పోరాటాన్ని మొగ్గలోనే తుంచివేయాలనే ఉద్దేశంతో భూస్వాములు 1977 నవంబర్ 6న సిరిసిల్ల తాలూకా తిమ్మాపురంలో లక్ష్మీరాజంను, నవంబర్ 10న జగిత్యాల తాలూకా కన్నాపురంలో పోశెట్టిని హత్య చేశారు. ఈ హత్యలతో ప్రజలు భయపడి ఉద్యమం నుంచి వైదొలగుతారని భూస్వాములు ఆశించారు గాని, లక్ష్మీరాజం – పోశెట్టిల మార్గంలో మునుముందుకే సాగుతామని ప్రజలు శపథం తీసుకున్నారు. గ్రామాలలో విప్లవ ప్రజాసంఘాలు మరింత బలోపేతమయ్యాయి. భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు మరింత పదునెక్కాయి. ఇలా మేల్కొంటున్న పల్లెలన్నీ 1978 సెప్టెంబర్ 7న  జగిత్యాల జైత్రయాత్రకు తరలి వచ్చాయి. నాగేటి చాళ్లలో రగుల్కొంటున్న రైతాంగ పోరాటకారులు వేలాది మందితో అప్పటికి అతి ఎక్కువ మంది హాజరయిన ఆ సభ విప్లవోద్యమానికి ప్రజల్లో ఉన్న ఆదరణకు నిదర్శనంగా నిలిచింది. వందలాది గ్రామాల నుంచి ప్రజలు తమ సమస్యలు పరిష్కరించడానికి, తమ పోరాటంలో తోడు నిలవడానికి సంఘం రావాలంటూ సభావేదిక మీదికి వేలాది దరఖాస్తులు పంపారు. ఆ పోరాట క్రమంలోనే గ్రామగ్రామాన భూస్వామ్య దోపిడీ పీడనలను వ్యతిరేకిస్తూ, ఒక గొప్ప పోరాట రూపంగా భూస్వాముల సాంఘిక బహిష్కరణ ముందుకు వచ్చింది. ఆ సభ తర్వాత నెల తిరగకుండానే భూస్వామ్య దౌర్జన్యానికి వత్తాసు పలుకుతూ రాజ్య పోలీసు బీభత్సం, రైతాంగ పోరాటం మీద విరుచుకు పడింది. ఆ అక్టోబర్ 20 న జగిత్యాల, సిరిసిల్ల తాలూకాలను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటిస్తూ, ఆ ఉత్తర్వులు అక్టోబర్ 4 నుంచే అమలు లోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. ఒకవైపు పోలీసులు గ్రామాల మీద, రైతుకూలి సంఘాల, రాడికల్ యువజన సంఘాల కార్యకర్తల మీద దాడులు చేస్తూ, అక్రమంగా నిర్బంధిస్తూ, చిత్రహింసలు పెడుతూ, అబద్ధపు కేసులు బనాయిస్తూ ఉండగా, మరొకవైపు దొరలు, దొరల గూండాలు ఎదురుతిరిగిన వారి మీద దాడులు, కాల్పులు, ఇళ్ల ధ్వంసాలు, పంటల విధ్వంసాలు సాగించారు. ఈ హింసాకాండను ఎదుర్కొనే క్రమంలోనే కరీంనగర్ – ఆదిలాబాద్ రైతాంగపోరాటాలు మరింత సంఘటితమయ్యాయి, కొత్త ప్రాంతాలకు, కొత్త శ్రేణులలోకి విస్తరించాయి, ప్రతిహింసా పోరాట రూపాలు చేపట్టాయి. రాడికల్ విద్యార్థి యువజన సంఘాలు, రైతుకూలీ సంఘంతో పాటు ఒక నూతన తరహా కార్మికోద్యమ సంస్థగా సింగరేణి కార్మిక సమాఖ్య ఏర్పడింది. ఈ అన్ని ప్రజా సంఘాలు 1980 ఏప్రిల్ వరకు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు – లెనినిస్టు) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రకమిటీ పేరుతో పనిచేసి, ఆ తర్వాత భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు – లెనినిస్టు) పీపుల్స్ వార్ పేరిట ఏర్పడిన విప్లవ నిర్మాణ మార్గదర్శకత్వంలో ముందుకు సాగాయి. ఈ ఉజ్వల చరిత్రలో ఆ పార్టీ జిల్లాకమిటీ కార్యదర్శిగా కోటేశ్వర రావు పాత్ర ప్రధానమైనది. ఆయన 1980 వరకూ కొంతకాలం సిరిసిల్ల ప్రాంతంలోనూ, మరికొంతకాలం తూర్పు ప్రాంతంలోనూ పనిచేశాడు. ఏప్రిల్ 1980లో పీపుల్స్ వార్ ఏర్పడిన తర్వాత, పునర్నిర్మాణమైన రాష్ట్రకమిటీకి ఆయన మొట్టమొదటి కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాడు. ఆ బాధ్యతలలో 1984 చివరిదాకా కొనసాగిన ఆయన, ఆ తర్వాత రెండు సంవత్సరాలు రాష్ట్ర కార్యదర్శివర్గంలో ఒకరుగా ఉన్నాడు.

ఎమర్జెన్సీ అనంతర ప్రజావెల్లువ నాటి నుంచి 1985లో తెలుగుదేశం ప్రభుత్వం ‘ఆట పాట మాట బంద్’ అని ప్రకటించి నిర్బంధం అమలు చేసేదాకా జరిగిన బహిరంగ ప్రజా పోరాటాల చరిత్ర ఉజ్వలమైనది. రాడికల్ విద్యార్థి సంఘం (1978 ఫిబ్రవరి వరంగల్, 1979 ఫిబ్రవరి అనంతపురం, 1981 ఫిబ్రవరి గుంటూరు, 1983 ఫిబ్రవరి తిరుపతి), రాడికల్ యువజన సంఘం (1978 మే గుంటూరు, 1979 మే ఖమ్మం, 1981 మే వరంగల్, 1982 మే ఏలూరు, 1984 జూన్ అనంతపురం), రైతుకూలీ సంఘం (1981 జూన్ నెల్లూరు, 1983 మే కరీంనగర్, సింగరేణి కార్మిక సమాఖ్య (1982 జూన్ గోదావరి ఖని, 1983 జనవరి కొత్తగూడెం), ఆల్ ఇండియా రెవల్యూషనరీ స్టూడెంట్స్ ఫెడరేషన్ (1985 ఫిబ్రవరి హైదరాబాద్) రాష్ట్ర స్థాయి మహాసభలు మాత్రమే కాక, స్థానిక సమస్యలమీద, జాతీయ అంతర్జాతీయ సమస్యల మీద ఈ సంస్థలు నిర్వహించిన, ఇతర సంస్థలతోపాటు కలిసి నిర్వహించిన సభలు, సమావేశాలు, ప్రదర్శనలలో, 1978 లో ప్రారంభించి ఏడెనిమిది సంవత్సరాల పాటు ప్రతి వేసవిలోనూ విద్యార్థి యువజన బృందాలతో జరిగిన ‘గ్రామాలకు తరలండి’ కార్యక్రమాలలోనూ రాష్ట్రంలో లక్షలాది మంది పాల్గొన్నారు. విప్లవ సందేశం చేరని గ్రామం, పట్టణం లేదు. ఆ సంచలనాలన్నిటికీ చోదకశక్తిగా, చోదకశక్తులలో ఒకరుగా ఉన్న నాయకుడు కోటేశ్వరరావు. విప్లవోద్యమం ప్రజలకు దూరంగా అడవుల్లో ఉన్నదని దుష్ప్రచారాలు చేసేవారు చదువుకోవలసిన అద్భుత ప్రజా పోరాట చరిత్ర ఆ దశాబ్దానిది. ఆ దశాబ్ది చరిత్ర నిర్మాణంలో కీలకపాత్ర వహించిన వారిలో కోటేశ్వరరావు ఒకరు.

అలా అంచెలంచెలుగా పురోగమిస్తూ, అపార ప్రజాదరణను చూరగొంటూ, నిజమైన ప్రజా ప్రత్యామ్నాయాన్ని నిర్మిస్తున్న విప్లవోద్యమంపై 1985 నుంచీ క్రూర నిర్బంధం మొదలయిది. బహిరంగ కార్యకలాపాలపై ఆంక్షలు, రాంనగర్ కుట్రకేసు, అప్పటికే వచ్చిన తీవ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం (టాడా) కిందా, ఇతర అక్రమ ఆరోపణలతోనూ వేలాది కేసులు, ఎన్ కౌంటర్ల పేరుతో విచ్చలవిడి హత్యలు, లాటిన్ అమెరికన్ నిర్బంధాన్ని తలపింపజేసే మిస్సింగ్ లు నిత్యకృత్యాలయ్యాయి. అంతకుముందే నాలుగైదు సంవత్సరాలుగా ప్రయోగంలో ఉన్న దండకారణ్య గెరిల్లా జోన్ పర్ స్పెక్టివ్ వెలుగులో విప్లవోద్యమాన్ని గోదావరి దాటి బస్తర్ అడవులలోకి ఇంకా ఎక్కువగా విస్తరించడమే నాటి అవసరమని విప్లవోద్యమ నాయకత్వం భావించింది. అలా ఆంధ్రప్రదేశ్ విప్లవోద్యమం నుంచి దండకారణ్య విప్లవోద్యమంలోకి, బీజప్రాయంలో ప్రత్యామ్నాయ రాజకీయాధికార నిర్మాణం ప్రారంభమైన చోటికి, ప్రజా అభివృద్ధి నమూనా ఆచరణ ప్రయోగంలోకి విస్తరించినవాడు కోటేశ్వరరావు. నిజానికి ఆ తర్వాత ఆయన కృషి గురించి ఒక నామవాచకంగా కాక సర్వనామంగా, ఒక వ్యక్తి కృషిగా కాక సమష్టి కృషిగా, రాజకీయ నాయకత్వ కృషిగా కాక ప్రజల సృజనాత్మక వికాసంగా చెప్పవలసిందే. అందువల్లనే ఆ తర్వాత కాలంలో ఆయన భాగమైన కృషి గురించి నివేదికలు, పుస్తకాలు వెలువడ్డాయి గాని తొలిరోజుల ఆంధ్రప్రదేశ్ విప్లవోద్యమ కృషి లాగ ఇది ఆయన పని అని విడదీసి చెప్పడం సాధ్యం కాదు. ఒకరకంగా విప్లవోద్యమ పరిణతికి ఇది నిదర్శనం,

నాటి మధ్య ప్రదేశ్ లోని ఉమ్మడి బస్తర్ జిల్లాలో మొదలైన ఈ కృషి తూర్పుకు విస్తరించి ఇంద్రావతి దాటి అబూజ్ మాడ్ పర్వత శ్రేణిలో స్థిరపడడానికి, అటు నుంచి సారండా అడవి ద్వారా ఇంకా ఈశాన్యానికి సాగి జంగల్ మహల్ అటవీ ప్రాంతానికి చేరడానికి బాటలు తీసిన అనేకమంది విప్లవకార్యకర్తలలో కోటేశ్వరరావు ఒకడు. బస్తర్ లో 1980 ల తొలిరోజులనుంచీ సాగుతున్న విప్లవకృషి 1980ల చివరినాటికి ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాకూ, ప్రజా రాజకీయాధికార తొలిరూపాలకూ చేరింది. ఇవాళ జనతన సర్కార్ గా ప్రాచుర్యంలోకి వచ్చిన నిర్మాణాలకు తొలిపునాది పడినది అప్పుడే. అట్లాగే 1990ల తర్వాత నూతన ఆర్థిక విధానాల ప్రపంచీకరణలో భాగంగా ఖనిజ వనరుల కాణాచి అయిన మధ్య భారత అరణ్యాలలోకి చొచ్చుకురావడానికి బహుళజాతిసంస్థలు, సామ్రాజ్యవాదులు, వారి తైనాతీగా ప్రభుత్వమూ చేసిన ప్రయత్నాలను వీరోచితంగా అడ్డుకున్నదీ, అడ్డుకుంటున్నదీ ఈ కృషే. నక్సల్బరీ ప్రజా ఉద్యమం అణచివేతకు గురై, వెనుకంజ వేసిన తర్వాత. మార్క్సిస్టు పార్టీ పేరుతో ఉన్న పాలకవర్గ ముఠా అధికారంలోకి వచ్చి హింసతో, భయోత్పాతంతో ప్రజావ్యతిరేక పాలనను   కొనసాగిస్తున్న తర్వాత ఇక మళ్లీ పశ్చిమ బెంగాల్ లో నక్సల్బరీ పంథా ప్రజా ఉద్యమం పునర్వికాసం జరుగుతుందా అని సందేహిస్తున్న సమయంలో అక్కడి బూడిదలోంచి ఫీనిక్స్ పక్షిని ఎగురవేసినదీ ఆ కృషే. లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం ఒకవైపు అంతర్జాతీయ బహుళజాతి సంస్థలకూ, మరొకవైపు దేశీయ బడా వ్యాపార సంస్థలకూ వేలాది ఎకరాల భూమిని కట్టబెట్టడానికి ప్రయత్నించినప్పుడు ఆ ప్రయత్నాలకు విజయవంతమైన అడ్డుకట్ట వేసినదీ ఆ కృషే. భారత విప్లవోద్యమ విజయం పోరాట శక్తుల ఐక్యసంఘటనలో మాత్రమే ఉన్నదనే గుర్తింపుతో జాతి విముక్తి ఉద్యమాలనూ విప్లవోద్యమాన్ని ఏకం చేయడానికి ప్రయత్నాలు సాగించి విజయం సాధించినదీ ఆ కృషే. ఆ కృషి అంతటిలోనూ కోటేశ్వరరావు పూసల్లో దారంలా ఉన్నాడు. మరో మాటల్లో చెప్పాలంటే భారత విప్లవోద్యమ విస్తృతికీ, పరిణతికీ ఉదాహరణగా నిలిచినవాడాయన.

ఆయన కృషిలో అత్యధిక భాగం అజ్ఞాత జీవితంలో, సమష్టి కార్యాచరణలో భాగంగా సాగినది గనుక ఆయన జీవితచరిత్రను సమగ్రంగానూ, బహిరంగంగానూ చెప్పడం విప్లవ విజయం దాకా సాధ్యం కాకపోవచ్చు. వ్యక్తిగతంగా ఆయన ఎటువంటి ప్రేమాస్పదుడో, స్నేహశీలో, పుస్తకప్రియుడో, సంభాషణా చతురుడో, ప్రేరణాత్మాకమైన ఉపన్యాసకుడో, నమ్మకమైన సహచరుడో, ఆశను నింపే నాయకుడో చెప్పడం బహుశా ఉద్యమ సహచరులకూ, సన్నిహితులకూ తప్ప ఇతరులకు సాధ్యం కాదు.

కాని ముందే చెప్పినట్టు ఆయన తాను భాగస్వామ్యం వహించిన పోరాటాలన్నిటినీ నమోదు చేయాలని ప్రయత్నించాడు. చరిత్ర నిర్మాణంతో పాటే రచన సాగాలని కోరుకున్నాడు. ఆ రచన కూడ వివరాలు, ఆధారాలు, చరిత్ర, పట్టికలు వంటి వాటితో అర్థ గణాంక శాస్త్రవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు రాసే సమగ్రమైన, ఆధారాలతో కూడిన నివేదికగా ఉండాలని కోరుకున్నాడు. చాలవరకు అది సాధించాడు. అనేక మంది సహచరులతో కలిసి సమష్టిగా ఆయన సాగించిన కృషిని స్థూలంగానైనా అర్థం చేసుకోవాలంటే భారత విప్లవోద్యమ చరిత్రను అధ్యయనం చేయాలి. వేరువేరు రచయితలు రాసినవైనా, ఆయన సారథ్యంలోనూ, ఇతరంగానూ వెలువడిన పుస్తకాలలో కొన్నిటినైనా (ముఖ్యంగా, నాగేటి చాళ్లల్లో రగిలిన రైతాంగ పోరాటం -1981, కరీంనగర్ – ఆదిలాబాద్ రైతాంగ పోరాటాలు వర్ధిల్లాలి – 1982, దున్నేవానికి భూమి లభించనిదే రైతాంగానికి విముక్తి లేదు – 1982, సింగరేణి బొగ్గు గనుల్లో రగిలిన పోరాటాలు వర్ధిల్లాలి – 1982, మునుముందుకు సాగుతున్న రైతాంగ పోరాటాలు – చుట్టుముడుతున్న ప్రభుత్వ నిర్బంధ కాండ – 1983, మహారాష్ట్ర కొండకోనల్లో ఊపిర్లు పోసుకుంటున్న ఆదివాసి పోరాటాలు – 1984, క్రిమ్సన్ ఫ్లాగ్ ఫ్లైస్ అలాఫ్ట్ – 1985, బస్తర్ : ప్రొ ఇంపీరియల్ డెవలప్ మెంట్ స్ట్రాటజీ వర్సస్ పీపుల్స్ స్ట్రగుల్స్ – 1993, దండకారణ్య రెవల్యూషనరీ మూవ్ మెంట్ – గవర్నమెంట్స్ రిప్రెషన్ అండ్ పీపుల్స్ రెసిస్టెన్స్ – 1994, ఆదివాసి పెజంట్ మూవ్ మెంట్ ఆఫ్ మహారాష్ట్ర – రిప్రెషన్ అండ్ రెసిస్టెన్స్ – 1994, న్యూ పీపుల్స్ పవర్ ఇన్ దండకారణ్య – 2000, ఈ అడవి మాదే – దండకారణ్య విప్లవోద్యమ చరిత్ర – 2002, సింగూరు నుంచి లాల్ గడ్ వయా నందిగ్రామ్ – 2009, దండకారణ్య మహిళా ఉద్యమ చరిత్ర – 2010, ముప్పై ఏళ్ల దండకారణ్య సాహితీ సాంస్కృతికోద్యమ చరిత్ర – 2010) అధ్యయనం చేయాలి.

అటువంటి అసాధారణమైన కృషి సాగించిన కోటేశ్వర రావు లేని లోటు తీర్చలేనిదనే మాట నిజమే గాని ఆయన ఆదర్శంతో, ఆయన శిక్షణలో ఇప్పటికే ఎందరో ప్రజాపోరాట యోధులు తయారయ్యారు గనుక వారు ఆ లోటు తీర్చగలరు. అంతకన్న ముఖ్యంగా ఇటువంటి యోధులను మళ్లీ మళ్లీ రూపొందించగల శక్తి ప్రజా ఉద్యమానికి ఉంటుంది. కోటి కాంతులు వెదజల్లే సూర్యుడి అస్తమయంతో చీకటి కమ్మినట్టు అనిపించే మాట నిజమే గాని మళ్లీ ప్రభాతం రెక్కవిప్పడం ప్రకృతి నియమం. చరిత్ర నిర్మాతలైన ప్రజలు ఒరిగిన నాయకుల, వీరుల లోటును పూ

About ఎన్.వేణుగోపాల్ N Venugopal

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues.
This entry was posted in Telugu. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s