ఈభూమి నవంబర్ 2011 సంచిక కోసం
అది అంతిమ పోరాటం కాకపోవచ్చు. అది క్రమబద్ధంగా, క్రమశిక్షణాయుతంగా, ఒకే నాయకత్వం కింద, పాల్గొంటున్న వారందరికీ ఒకే రకమైన విస్పష్టమైన లక్ష్యాలతో నడుస్తున్న పోరాటం కాకపోవచ్చు. కాని దాని విశిష్టత అంతా అది లేవనెత్తుతున్న ప్రశ్నలలో ఉన్నది. అది ప్రకటిస్తున్న నిరసనలో ఉన్నది. అది రూపొందిస్తున్న వినూత్న పోరాట రూపాలలో ఉన్నది. అది చూపుతున్న పట్టుదలలో ఉన్నది. దానికి దొరుకుతున్న విశ్వవ్యాప్త సంఘీభావంలో ఉన్నది. అది తన ప్రత్యర్థులలో సృష్టిస్తున్న వణుకులో ఉన్నది.
ఆ పోరాటం ఒక సామాజిక బృందపు ఆలోచనగా చిన్న నీటిబిందువుగా మొదలై, న్యూయార్క్ లో సెలయేరై, అమెరికా అంతా నది అయి, ప్రపంచమంతా ప్రవహిస్తున్న మహానది అయింది. ప్రత్యర్థిని తుడిచిపెట్టగల సముద్రగర్జన అవుతుందా లేదా కాలమే చెప్పాలి. అది ఉప్పెనగా మారకపోయినా ఇప్పటికే అది సృష్టిస్తున్న భూకంపం పెట్టుబడి గుండెలలో సునామీల సూచనలు ఇస్తున్నది.
దాని పేరు ‘ఆక్యుపై వాల్ స్ట్రీట్’ (వాల్ స్ట్రీట్ ను ముట్టడిద్దాం). ఆరు వారాలకు పైగా ప్రపంచంలోని పెట్టుబడిదారీ సంస్థలలో, ప్రభుత్వాలలో, పాలకవర్గాలలో, సమర్థక వ్యాఖ్యాతలలో బెదురు పుట్టిస్తున్నది. అంతర్జాతీయంగా ప్రచార సాధానాలన్నిటిలో ప్రముఖమైన వార్త అయి ప్రపంచ ప్రజలందరినీ ఉర్రూతలూగిస్తున్నది.
అది ఒక చిన్న కదలికగా 2011 సెప్టెంబర్ 17న న్యూయార్క్ నగరంలోని వాల్ స్ట్రీట్ (ప్రపంచ ప్రఖ్యాత స్టాక్ ఎక్స్ చేంజ్) సమీపంలోని జకోటి పార్క్ లో మొదలయింది. ఆరు వారాల స్వల్ప కాలంలోనే అది అమెరికాలో దాదాపు వంద నగరాలకు, 80 దేశాలలో కనీసం వెయ్యి నగరాలకు విస్తరించి తన ప్రతిధ్వనిని వినిపిస్తున్నది. ప్రధానంగా కెనడాకు చెందిన సామాజిక కార్యకర్తల బృందం ఆడ్ బస్టర్స్ ఈ ఆందోళనకు బీజం వేసింది. సామాజిక ఆర్థిక అసమానతలను వ్యతిరేకించడం, కార్పొరేట్ల దురాశను, ప్రభుత్వం మీద కార్పొరేట్ సంస్థల, ముఖ్యంగా ద్రవ్య సంస్థల ఆధిపత్యాన్ని, పైరవీకార్ల ప్రాబల్యాన్ని ఎదిరించడం అనే ప్రాథమిక లక్ష్యాలతో ఈ ఆందోళన మొదలయింది. “99 శాతం జనం మనం” అనే ఆకర్షణీయమైన నినాదంతో పెట్టుబడిని ముట్టడించడానికి సాగుతున్న ఈ ఆందోళన క్రమక్రమంగా ఉద్యమంగా విస్తరించి అమెరికాలో అతి సంపన్నులయిన ఒక్క శాతం కార్పొరేట్ పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా మిగిలిన 99 శాతం ప్రజానీకాన్ని కూడగట్టడానికి ప్రయత్నించి విజయం సాధించింది.
కెనడా లోని వాంకోవర్ కు చెందిన ఆడ్ బస్టర్స్ మీడియా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ మొట్టమొదటిసారి ఈ ఆలోచన చేసింది. వ్యాపార ప్రకటనలు లేకుండా, వినియోగవస్తు సంస్కృతిని వ్యతిరేకించే ఆడ్ బస్టర్స్ అనే పత్రికను నడిపే ఈ సంస్థ ప్రభుత్వం మీద కార్పొరేట్ సంస్థల ఆధిపత్యాన్ని, ఆర్థిక అసమానతలను వ్యతిరేకించడానికి, ఇటీవలి ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి మూలకారకులైనవారిపై ఎటువంటి చట్టబద్ధ చర్యలూ తీసుకోని ప్రభుత్వ వైఖరిని నిరసించడానికి ఒక మార్గంగా అసలు వాల్ స్ట్రీట్ నే ముట్టడిస్తే ఎలా ఉంటుంది అని జూలై లో తన పాఠకులకు ఒక ఇమెయిల్ రాసింది. కొద్ది వారాల్లోనే ఆ ఆలోచనా బీజం లక్షలాది మందిని ఆకర్షించి మహావృక్షంగా ఎదిగింది. డబ్బుసంచుల అధికారాన్నీ రాజకీయాలనూ వేరు చేయడానికి అధ్యక్షుడు చర్యలు చేపట్టాలనే కనీస కోర్కె మీద ఒత్తిడి తేవాలనీ, కొత్త అమెరికాను సృష్టించాలనీ ఇది మొదలయింది. ఈలోగా సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన ఆలోచనలను ప్రచారం చేసే ఎనోనిమస్ అనే ఇంటర్నెట్ కార్యకర్తల బృందం వాల్ స్ట్రీట్ ను ముట్టడించడం అనే ఆలోచనకు కార్యరూపం ఇవ్వాలని సూచించింది. ‘మన్ హట్టన్ (న్యూయార్క్ నగరంలో వాల్ స్ట్రీట్ ఉన్న ప్రాంతం) కే వెల్లువెత్తుదాం. అక్కడ శిబిరాలు వేసుకుందాం. అక్కడే వంటావార్పూ చేసుకుందాం, శాంతియుతంగా కాట్రగడలు నిర్మిద్దాం. నిజంగానే వాల్ స్ట్రీట్ ను ముట్టడిద్దాం’ అని ఆ కార్యకర్తలు ఇచ్చిన పిలుపుకు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.
న్యూయార్క్ నగరంలో ఉన్న పోలీసు నిబంధనల ప్రకారం బహిరంగ ప్రజా స్థలాలలో అనుమతి లేకుండా ప్రదర్శనలు జరపడం నిషిద్ధం. అనుమతి అడిగితే ఎలాగూ ఇవ్వరు. అందువల్ల వాల్ స్ట్రీట్ పక్కనే, కూలిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ దాపున ఉన్న ఒక ప్రైవేటు పార్కును అద్దెకు తీసుకుని ప్రదర్శన జరపాలని తలపెట్టారు. ఒక ఎకరం కన్న తక్కువ స్థలంలో ఉన్న ఆ ప్రైవేటు పార్కు బ్రూక్ ఫీల్డ్ ఆఫీస్ ప్రాపర్టీస్ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు చెందినది. ఆ సంస్థ అధ్యక్షుడు జాన్ జకోటి పేరు మీద ఆ పార్క్ ను జకోటి పార్క్ అని పిలుస్తున్నారు.
అయితే ఒక కెనడియన్, ఒక అంతర్జాల సామాజిక కార్యకర్తల బృందాలు ప్రారంభించిన ఈ ఆలోచన ఇంతగా ఎలా విస్తరించింది? ‘వాల్ స్ట్రీట్ ను ముట్టడిద్దాం’ అనే నినాదం ఇవాళ ప్రతి నగరం పేరుకూ ‘ముట్టడిద్దాం’ కలిపి, ఆక్యుపై వాషింగ్టన్, ఆక్యుపై బాస్టన్, ఆక్యుపై ఓక్ లాండ్ అంటూ కొన్ని వందల నగరాలకు ఎలా ఎదిగింది? నిజానికి ఇది ప్రత్యక్షంగా వాల్ స్ట్రీట్ కో, ఆయా నగరాలకో పరిమితమయినది కాదు. ఇది ప్రభుత్వాల పట్ల, కార్పొరేట్ సంస్థల పట్ల, పెట్టుబడిదారుల మితిమీరిన లాభాపేక్ష పట్ల ప్రజలలో నానాటికీ పెరుగుతున్న వ్యతిరేకతకు, అసంతృప్తికి, ఆగ్రహానికి ఒక ప్రతీకాత్మక ప్రతిస్పందన. సారాంశంలో ఈ ముట్టడి లక్ష్యం పెట్టుబడి దుర్గాల ముట్టడే.
నిజానికి బహుళజాతి సంస్థలు, ముఖ్యంగా అంతర్జాతీయ ద్రవ్య, తనఖా, బీమా సంస్థలు ఆర్థిక వ్యవస్థలనూ, ప్రజాజీవనాన్నీ ఎట్లా దోచుకుంటున్నాయో, అతలాకుతలం చేస్తున్నాయో 2008 సంక్షోభ సందర్భంగా అమెరికన్ పౌరులలో ఎక్కువమందికి తెలిసివచ్చింది. సబ్ ప్రైమ్ సంక్షోభం అనే గృహరుణాల సంక్షోభంలో లక్షలాది మంది ప్రజల జీవితం అల్లకల్లోలమయింది. లక్షలాది మంది బాధితులు దిక్కుతోచని స్థితిలో అల్లకల్లోలమయ్యారు. వేల కోట్ల డాలర్ల కుంభకోణాలు బయటపడ్డాయి. డజన్ల కొద్దీ బ్యాంకులు, బీమా, తనఖా సంస్థలు, సలహా సంస్థలు దివాళా తీశామని ప్రకటించాయి. మొత్తంగా ఆర్థిక వ్యవస్థే కుప్పకూలబోతుందని అనిపించింది. సమాజం పట్ల అంతటి ఘోరాలకూ నేరాలకూ తలపడిన బ్యాంకింగ్, బీమా, తనఖా తదితర బహుళజాతిసంస్థల మీద, వాటి కార్యనిర్వాహకవ్యక్తుల మీద ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, ఇటువంటి ఆర్థిక నేరాలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు ఆశించారు. సరిగ్గా అప్పుడే జార్జి బుష్ నాయకత్వంలోని రిపబ్లికన్ పాలన ముగిసి బారక్ ఒబామా నాయకత్వంలోని డెమొక్రటిక్ పాలన మొదలవుతున్నది గనుక, ఈ ఆఫ్రో అమెరికన్ ప్రగతిశీల వ్యక్తి ఆర్థిక వ్యవస్థను మరమ్మత్తు చేస్తాడని, నేరస్తులను శిక్షిస్తాడని, బాధితులను ఆదుకుంటాడని చాలమంది ఆశించారు.
కాని జరిగినది ఆర్థిక వ్యవస్థ మరమ్మత్తు కాదు. గృహ రుణాలలోనూ, బ్యాంకుల దివాళాలోనూ బాధితులైన లక్షలాది మందికి ఎటువంటి నష్టపరిహారమూ, సహాయమూ అందలేదు గాని ఒబామా ప్రభుత్వం బ్యాంకుల యజమానులకు మాత్రం లక్షల కోట్ల డాలర్ల బెయిల్ ఔట్ సహాయ పథకాలను ప్రకటించింది. అమెరికా ప్రభుత్వం బహుళజాతి సంస్థల చేతుల్లో కీలుబొమ్మగానే పనిచేస్తుంది గాని, వాటి నేరాలకైనా సరే వాటిమీద శిక్షలు విధించజాలదని మరొకసారి రుజువయింది. అలా గత మూడు సంవత్సరాలలో ఒబామా ప్రభుత్వం కార్పొరేట్ సంపన్నులకు, బహుళజాతి సంస్థలకు, వారి అక్రమాలకు ఎలా వత్తాసునిస్తున్నదో గమనిస్తూ వచ్చిన అమెరికన్ పౌరులలో అసహనం, వ్యతిరేకత మిన్నంటాయి. అగ్గిపుల్ల ముట్టించి విసిరే వారి కోసం ఎదురుచూస్తున్న ఆ ఎండు గడ్డి మీదికి ఆక్యుపై వాల్ స్ట్రీట్ నినాదం నిప్పురవ్వయి ఎగసి వచ్చింది. పది సంవత్సరాలకు పైగా అమెరికాలోనూ యూరప్ లోనూ సాగుతున్న ప్రపంచీకరణ వ్యతిరేక ప్రదర్శనలు, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచ వాణిజ్య సంస్థ, వరల్డ్ ఎకనమిక్ ఫోరంలకు వ్యతిరేకంగా సాగుతున్న నిరసన ప్రదర్శనలు, ఆలోచనలు, చర్చలు ఈ వాల్ స్ట్రీట్ ముట్టడికి అవసరమైన పూర్వరంగాన్ని సృష్టించిపెట్టాయి.
అందువల్లనే ఆడ్ బస్టర్స్ ప్రారంభించిన సన్నని సెలయేరులోకి న్యూ యార్క్ లోనూ, అమెరికా వ్యాప్తంగానూ ఇంకా బలమైన ప్రవాహాలు వచ్చి చేరడం మొదలయింది. డజన్ల కొద్దీ ప్రజాసంఘాల కూటమిగా రూపొందిన న్యూ యార్క్ సిటీ జనరల్ అసెంబ్లీ, ఎన్నికల సంస్కరణలు కోరే యు ఎస్ డే ఆఫ్ రేజ్ వంటి అసంఖ్యాక స్వచ్ఛంద ప్రజా సంస్థలు, నిర్మాణాలు, వ్యక్తులు ‘వాల్ స్ట్రీట్ ను ముట్టడిద్దాం’లో భాగమయ్యారు.
ఈ ఆందోళన ప్రారంభించిన ‘99 శాతం జనం మనం’ అనే ఆకర్షణీయమైన నినాదం కూడ ఒకవైపు అమెరికన్ ఆర్థిక సామాజిక వాస్తవికతకు అద్దం పట్టింది. మరొకవైపు ఈ ఆందోళనలో అతి ఎక్కువమంది పాల్గొనడానికి, మమేకం కావడానికి, తమ జీవితాలను, భవిష్యత్తును అందులో చూసుకోవడానికి అవకాశం కల్పించింది. స్వయంగా అమెరికా ప్రభుత్వ గణాంకాల ప్రకారమే 1979 నుంచి 2007 మధ్య అమెరికాలో అత్యున్నత స్థాయిలో ఉన్న ఒక్క శాతం సంపన్నుల ఆదాయాలు 275 శాతం పెరిగాయి. కాగా మధ్య తరగతి ఆదాయ వర్గంలో ఉన్న 60 శాతం మంది ఆదాయాలు మాత్రం 40 శాతం పెరిగాయి. మరొక గణాంకం చూస్తే అమెరికన్ జనాభాలోని అత్యంత సంపన్నులైన ఒక్క శాతం కుటుంబాలు మొత్తం దేశ సంపదలో 40 శాతాన్ని అజమాయిషీ చేస్తున్నాయి. అగ్రభాగాన ఉన్న 20 శాతం జనాభానే దేశపు మొత్తం ఆదాయంలో 80 శాతం పొందుతోంది. ఈ అసమానతలకు కారణం కార్పొరేట్ సంస్థలకు, ముఖ్యంగా ద్రవ్య సంస్థలకు ఆర్థిక వ్యవస్థమీద, రాజకీయాల మీద ఉన్న మితిమీరిన అధికారమేనని ఆందోళనకారులు చేస్తున్న వాదనలను ప్రజలు సులభంగా అంగీకరించారు. ప్రజలుతమ నిత్యజీవితాల్లో అనుభవిస్తున్న దారిద్ర్యం, నిరుద్యోగం, అసమానత, పీడన ఆందోళనకారుల వాదనలలోని సామంజస్యాన్ని రుజువు చేశాయి. నిజానికి ఈ అసమానతలు, కార్పొరేట్ అక్రమాలు అమెరికాలో మాత్రమే కాదు, ప్రపంచమంతా తరతమ భేదాలతో ఉన్నవే. కాకపోతే పిల్లి మెడలో గంట కట్టడానికి అమెరికన్ పౌరులు, ముఖ్యంగా మొదట న్యూ యార్క్ పౌరులు ముందుకు వచ్చారు. ఆ గంట ఇవాళ 82 దేశాలలో ప్రతిధ్వనిస్తున్నది.
గత ఆరువారాలలో వాల్ స్ట్రీట్ ముట్టడి ప్రదర్శనలో వివిధ వక్తలు, పాల్గొంటున్నవారు మాట్లాడిన అంశాలు, నిర్వాహకులూ భాగస్వాములూ నిర్వహిస్తున్న వెబ్ సైట్లు, బ్లాగులు, ట్విట్టర్, ఫేస్ బుక్ వగైరా సందేశాలు కలిపి చూస్తే కొన్ని ఉమ్మడి లక్ష్యాలు కనబడుతున్నాయి. ఈ విభిన్న ఆలోచనలను క్రోడీకరించిన బ్లూంబర్గ్ బిజినెస్ వీక్ పత్రిక వాల్ స్ట్రీట్ ముట్టడి ఉద్యమ లక్ష్యాలు ఏమిటో వివరించడానికి ప్రయత్నించింది: అవి
- ఎక్కువ ఉద్యోగాలు కావాలి
- మంచి ఉద్యోగాలు కావాలి
- ఆదాయాలలో మరింత ఎక్కువ సమానత్వం కావాలి
- బ్యాంకులు లాభం లేకుండా, లేదా తక్కువ లాభంతో పనిచేయాలి
- బ్యాంకు యజమానులకు తక్కువ నష్ట పరిహారాలు ఇవ్వాలి
- తనఖా, డెబిట్ కార్డుల వంటి సేవలకు బ్యాంకులు వినియోగదారులమీద విధిస్తున్న పన్నుల విషయంలో కఠినమైన ప్రభుత్వ నిబంధనలు ఉండాలి
- రాజకీయాల మీద కార్పొరేషన్లు, ముఖ్యంగా ఆర్థిక, ద్రవ్య సంస్థల అదుపాజ్ఞలు తగ్గిపోవాలి
- విద్యార్థుల రుణాలు, గృహ రుణాలు, ఇతర వస్తువుల తనఖా రుణాల విషయంలో ప్రభుత్వ నిబంధనలు బ్యాంకులకు అనుకూలంగా కాక ప్రజలకు అనుకూలంగా ఉండాలి.
నిజానికి ఈ డిమాండ్లన్నీ కూడ ప్రపంచానికంతటికీ, అన్ని దేశాలకూ వర్తించేవే. తరతమ స్థాయిల్లో ప్రతి దేశంలోనూ కార్పొరేట్ అక్రమాలు, కార్పొరేట్లతో ప్రభుత్వ మిలాఖత్తు కొనసాగుతున్నాయి. అందువల్లనే అమెరికాలో మొదలయిన ఈ ఆందోళన నిప్పురవ్వ ఇవాళ ప్రపంచమంతా దావానలమై విస్తరిస్తోంది.
ఆందోళనలో విశాల ప్రజా బాహుళ్యం చేరడం కూడ ఈ విశాలమైన ఆకాంక్షల వల్లనే. దాదాపు అన్నిరకాల రాజకీయాభిప్రాయాలు ఉన్నవారు ఈ ఉద్యమంలో భాగస్తులయ్యారు. జకోటి పార్క్ లో ప్రదర్శన జరుపుతున్నవారిలో, అక్కడికి వచ్చి సంఘీభావం ప్రదర్శించినవారిలో ఉదారవాదులు, స్వతంత్ర రాజకీయవాదులు, అరాచకవాదులు, సోషలిస్టులు, మార్క్సిస్టులు, స్వేచ్ఛావాదులు, పర్యావరణ వాదులు అందరూ ఉన్నారు.
అందుకే ఈ ఉద్యమం మీద వ్యాఖ్యానిస్తూ మార్క్సిస్టు ఆర్థికవేత్త ఫ్రెడ్ గోల్డ్ స్టీన్ విలువైన మాట అన్నారు: “వాల్ స్ట్రీట్ ను ముట్టడిద్దాం ఉద్యమం వర్గపోరాటంలో కొంతకాలంగా సాగుతున్న స్తబ్దతను, వెనుకడుగు దశను తలకిందులు చేసింది. గతంలో ఉండిన నిర్లిప్తతను బద్దలు చేసింది. కైరోలోనూ, విస్కాన్సిన్ లోనూ కార్మికులు, విద్యార్థులు ‘ఇంకానా ఇకపై చెల్లదు” అన్నప్పుడు ఏం జరిగిందో ఈ ఉద్యమంలోనూ అదే జరుగుతోంది. అమెరికన్ సామ్రాజ్యవాదమే తమకు బలమైన, అత్యంత దుర్మార్గమైన శత్రువు అని తెలిసిన ప్రజలందరినీ ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సాహపరచిన ఉద్యమం ఇది. 1999లో సియాటిల్ ప్రదర్శన జరిగినప్పటి నుంచీ ఒక దశాబ్దంగా ప్రపంచ ప్రజలందరూ ఇటువంటి విశాల పోరాట వెల్లువ కోసం ఆశతో ఎదురు చూస్తున్నారు. ప్రగతిశీలవాదులకు, విప్లవకారులకు, నిరుద్యోగులకు, కార్మిక సంఘాలకు, విద్యార్థి సంఘాలకు, పీడితులకు, లెక్కలలో లేనివారికి ప్రాతినిధ్యం వహించే సామాజిక బృందాలకు, పర్యావరణ బృందాలకు, స్త్రీలకు, లెస్బియన్, గే, బై, ట్రాన్స్, క్వీర్ సమూహాలకు, ఒక్కమాటలో చెప్పాలంటే పెట్టుబడిదారీ విధానం కోరల్లో చిక్కి ఆశోపహతులయిన వారందరికీ వీథుల్లోకి రావడానికి ఈ ఉద్యమం ఒక అవకాశం ఇచ్చింది.” పతితులార, భ్రష్టులార, బాధాసర్ప దష్టులార ఏడవకండేడవకండి అంటూ జగన్నాథ రథచక్రాలు కదలడం ప్రారంభించిన సమయం అన్నమాట ఇది.
ఉద్యమం ప్రారంభమైనప్పుడు యువకులే ఎక్కువమంది పాల్గొన్నారు గాని క్రమక్రమంగా అన్ని వయసులవాళ్లూ కలిసి వచ్చారు. అట్లాగే అన్ని మత విశ్వాసాలవాళ్లూ, మతం మీద విశ్వాసం లేనివాళ్లూ కూడ ఇందులో పాల్గొంటున్నారు. అక్కడ క్రైస్తవులు ఎక్కువమంది ఉండే అవకాశం ఉంది. కాని జకోటి పార్క్ లో ఒకపక్క ముస్లింలు నమాజ్ చేసుకుంటున్న, మరొకపక్క యూదులు ప్రార్థన చేసుకుంటున్న దృశ్యాలూ కనబడుతున్నాయి.
ప్రస్తుతం జకోటి పార్క్ నిరసన ప్రదర్శన న్యూయార్క్ సిటీ జనరల్ అసెంబ్లీ మార్గదర్శకత్వంలో జరుగుతోంది. ఈ జనరల్ అసెంబ్లీ ప్రతిరోజూ సాయంత్రం ఏడు గంటలకు జరుగుతుంది. అక్కడికి అన్ని భాగస్వామ్య బృందాల ప్రతినిధులు వచ్చి తమ ఆలోచనలూ అవసరాలూ సలహాలూ చర్చిస్తారు. అక్కడికి ఎవరైనా రావచ్చు, ఎవరైనా మాట్లాడవచ్చు. అక్కడ చర్చకు నాయకులెవరూ లేరు. ఆందోళనకారులలోనే కొందరు స్వచ్ఛంద కార్యకర్తలు చర్చను నిర్వహిస్తారు. వారే సమావేశ మినిట్స్ రాస్తారు. గత సమావేశ మినిట్స్ తెలియజేస్తారు. అత్యవసరంగా అందరికీ తెలియవలసిన సమాచారం తెలుపుతారు. సమావేశంలో స్త్రీల గళం, శ్వేతేతర జాతుల వ్యక్తుల గళం ఎక్కువగా వినిపించడానికి వారికి ప్రత్యేక సౌకర్యం కల్పించారు. మాట్లాడడానికి వేచి ఉన్న వ్యక్తుల వరుసలో స్త్రీలు, నలుపు/పసుపు/ఎరుపు/మిశ్రమ జాతుల వ్యక్తులు ఉంటే వారిని ముందుకు పంపిస్తారు. వారి అభిప్రాయాలు వినడానికి ఎక్కువ శ్రద్ధ చూపుతారు.
అలాగే ఈ ఉద్యమ క్రమంలో ఆందోళనకారులు మరెన్నో వినూత్నమైన, విశిష్టమైన పద్ధతులను రూపొందించారు. న్యూయార్క్ నగరంలో అమలులో ఉన్న పోలీసు నిబంధనల ప్రకారం ఉపన్యాసకులు, గాయకులు మైకులు వాడాలంటే అనుమతి తీసుకోవాలి. అటువంటి అనుమతి ఈ ఉద్యమకారులకు దొరకలేదు గనుక వాళ్లు ‘మానవ మైక్రోఫోన్’ అనే ఒక కొత్త పద్ధతిని సృష్టించారు. ఉపన్యసించే వక్త ఒక పదాన్ని గాని, వాక్యాన్ని గాని చెప్పి విరామం ఇస్తారు. చుట్టూ ఉన్నవారు అందరూ కలిసి ఒక్కుమ్మడిగా ఆ పదాన్నో, వాక్యాన్నో పునరుద్ఘాటిస్తారు. ఒక్క గొంతు కొన్ని డజన్ల గొంతులలో పునరుక్తమవుతుంది. ఇది ఒకరకంగా వినోదంగానూ ఉంది, మరొకరకంగా దూరంగా ఉన్నవాళ్లకు వక్త మాటలు తెలియజేసేట్టుగానూ ఉంది, ఇంకొకరకంగా, ఉపన్యాసకులకూ శ్రోతలకూ మధ్య విభజన రేఖను చెరిపేసింది. ప్రతి శ్రోతనూ ఉపన్యాసంలో భాగం చేసింది, ఉపన్యాసకుడితో జతకలిపేలా చేసింది. వక్తా శ్రోతలూ కలగలిసిన సమూహం కొత్త ఐక్యతను సాధించింది.
ఈ ప్రదర్శన నిర్వహణకు అవసరమైన నిధుల విషయంలో కూడ ఉద్యమకారులు చాల పారదర్శకంగా ఉన్నారు. అక్టోబర్ 27 నాటికి ఐదు లక్షల డాలర్ల విరాళాలు సేకరించగలిగిన ఉద్యమం ఆదాయ వ్యయ లావాదేవీలు నిర్వహించడానికి ఒక ఆర్థిక కమిటీని ఏర్పాటు చేసుకుని, పార్క్ లోనే ఒక న్యాయవాదిని, ఒక అకౌంటెంట్ ను కూడ నియమించుకుంది.
అంతర్జాతీయ సంఘీభావం, ప్రతిస్పందనలు, ఉద్యమ విశిష్టతలతో పాటు ఈ ఉద్యమం పట్ల పెట్టుబడిదారీ సంస్థల, అధిపతుల స్పందన కూడ చూడవలసి ఉంది.
“దేశ ఆర్థిక వ్యవస్థ తోను, దాని పనితీరు తోను ప్రజలు చాల అసంతృప్తితో ఉన్నారు. ఈ గందరగోళ స్థితికి మనం చేరడానికి కారణం మన ద్రవ్య వ్యవస్థ సృష్టించిన సమస్యలే అని వారు చేస్తున్న ఆరోపణలో వాస్తవం ఉంది. ప్రభుత్వం తరఫున సాగిన ప్రతిచర్యల పట్ల కూడ వారికి అసంతృప్తి ఉంది. ఒక రకంగా చూస్తే నేను వారిని తప్పు పట్టలేను” అని అమెరికా ఫెడరల్ రిజర్వ్ (మన రిజర్వ్ బ్యాంక్ వంటిది) అధ్యక్షుడు బెన్ బెర్నాంకె అన్నాడు. కొన్ని బహుళజాతి సంస్థల ప్రతినిధులు ఈ ఉద్యమాన్ని తప్పు పట్టగా మరి కొన్ని సంస్థలు మాత్రం ఉద్యమకారుల వాదనలో నిజం ఉందని అన్నారు.
మరొకపక్క అమెరికాలోనూ ప్రపంచవ్యాప్తంగానూ పేరెన్నికగన్న మేధావులందరూ ఉద్యమాన్ని సమర్థిస్తూ ప్రకటనలు జారీ చేశారు. న్యూ యార్క్ లోగాని, ఇతర నగరాలలో గాని ఈ ప్రదర్శనలలో పాల్గొన్నారు.
ఈ ఉద్యమాన్ని ఇప్పటికే చాలమంది వర్గపోరాటంతో పోలుస్తున్నారు. కాని కమ్యూనిస్టుల నాయకత్వం కిందసాగే వర్గపోరాటం లాగ ఈ వాల్ స్ట్రీట్ ముట్టడి ఉద్యమం ఒకే నాయకత్వం కింద, ఒకే లక్ష్యంతో కేంద్రీకృతంగా సాగడం లేదు. అదే దాని బలమూ బలహీనతా కూడ. జనబాహుళ్యానికీ, విభిన్న ఆలోచనలకూ అవకాశం ఇవ్వడం వల్ల అది గొప్ప ప్రజాస్వామిక స్ఫూర్తితో, అన్నిరకాల అభిప్రాయాలకూ వేదికగా మారింది. కాని అదే సమయంలో ఇది ఎక్కుపెట్టే లక్ష్యం ఏమిటనీ, లక్ష్య స్పష్టత ఉందా అనీ, సుస్థిరమైన, ఆచరణ సాధ్యమైన ప్రత్యామ్నాయాన్ని ఈ ఉద్యమం సూచిస్తున్నదా అనీ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ చర్చ ఎలా ఉన్నా, ప్రజా ఉద్యమాల రంగస్థలంగా ఉన్న ఇరవయో శతాబ్దానికి కాలం చెల్లిందనీ, ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో స్వార్థమే రాజమార్గంగా ఉంటుందనీ, ప్రతి వ్యక్తీ సమాజం గురించి పట్టించుకోని ద్వీపాంతరవాస జీవితం గడిపేస్థితి వచ్చిందనీ, ఇక సమాజహితం అనే మాట చాదస్తపు మాట అయిపోయిందనీ పెట్టుబడిదారీ మేధావులు ప్రవచిస్తున్న వేళ, ఆ ఎనుబోతు కడుపులోపలే (బెల్లీ ఆఫ్ ది బీస్ట్) జనహిత కదలికలు ప్రారంభించిన వాల్ స్ట్రీట్ ముట్టడి కార్యకర్తలు ఈ శతాబ్ది ప్రజా ఉద్యమాలకు ప్రేరణగా నిలుస్తారు.