సకల జనుల సమ్మెను ఎలా చూడాలి?

వీక్షణం నవంబర్ 2011 సంచిక కోసం

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఒక కీలకమైన ఘట్టంగా సకల జనుల సమ్మె 2011 సెప్టెంబర్ 13న మొదలయి నలభై రెండు రోజులపాటు కొనసాగి అక్టోబర్ 24న ప్రభుత్వానికీ ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నేతలకూ మధ్య కుదిరిన ఒప్పందంతో ఆగిపోయింది. మొత్తం నలభై రెండు రోజుల సమ్మెలో రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు చివరిదాకా ఉండగా, సింగరేణి కార్మికులు, ఆర్ టి సి సిబ్బంది, ఉపాధ్యాయులు వివిధ కారణాలవల్ల మధ్యలోనే సమ్మె నుంచి వైదొలిగారు. సకల జనుల సమ్మె ఆగిపోయినా ఉద్యమం కొనసాగుతుందనీ, ఇది తాత్కాలిక విరామమే తప్ప విరమణ కాదనీ అక్టోబర్ 24న ఐకాస నేతలు ప్రకటించారు.

జీతభత్యాలు, పని పరిస్థితులు వంటి తమ వృత్తి, ఉద్యోగ పరమైన కోర్కెలపై కాక ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనే రాజకీయ ఆకాంక్ష సాధించడం కొరకు ఉద్యోగ, కార్మిక, ఉపాధ్యాయ వర్గాలు సమ్మె సాగించడం దానికదే అసాధారణమైన విషయం. సకల జనుల సమ్మె దాని పేరుకు తగినట్టుగా సకల జనుల ఆకాంక్షలను, ఐక్యతను, నిరసనను ప్రదర్శించింది. అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో సాగింది. కాని ప్రధానంగా పాల్గొనవలసిన, నాయకత్వం వహించవలసిన రాజకీయవర్గాల అలసత్వం వల్ల, దివాళాకోరుతనంవల్ల, ద్వంద్వవైఖరి వల్ల సకల జనుల సమ్మెకు తొలినుంచీ లోలోపలనే చీడ పాకింది. తెలంగాణ ఆకాంక్ష అన్ని వర్గాలనూ ఎంతగా ఏకం చేసినప్పటికీ, సమాజంలోని అంతర్వైరుధ్యాలు, విభజనలు, అంతరాలు వాటికవిగాగాని, స్వార్థపరశక్తుల ప్రోత్సాహం వల్లగాని సకల జనుల సమ్మెకు లోపలి నుంచి తూట్లు పొడవడానికి ప్రయత్నించాయి. సకల జనుల సమ్మెలో పాల్గొంటున్న వర్గాలలో కొన్ని సంఘటిత బృందాలకు మినహా, మిగిలిన అసంఖ్యాక ప్రజానీకానికి అర్థవంతమైన పోరాట, ప్రతిఘటనా రూపాలను అందించడంలో నాయకత్వం అవసరమైన కృషి చేయలేదు. ఇటువంటి లోపలి లోపాలతో పాటు, బైటినుంచి తెలంగాణ ప్రత్యర్థివర్గాలు, పాలకవర్గాలు, ప్రచార సాధనాలు సకల జనుల సమ్మె మీద పెద్ద ఎత్తున దాడి చేశాయి. సమ్మెకు వ్యతిరేకంగా మధ్యతరగతికి సబబుగా తోచే కొన్ని వాదనలను ముందుకు తెచ్చాయి. సమ్మెకు వ్యతిరేకంగా విద్యార్థులను, ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులను రెచ్చగొట్టడానికి ప్రయత్నించాయి. సమ్మె నాయకత్వాలను, శ్రేణులను కొనివేయడానికి, బెదిరించడానికి ప్రయత్నించాయి. ఆ ప్రయత్నాలు కుదరనప్పుడు దమననీతికి పాల్పడ్డాయి. ఇంటా బయటా సాగిన ఈ దాడులతో సర్వ జనుల సమ్మె పెట్టుకున్న లక్ష్యాలను సాధించకుండానే విరమించవలసిన స్థితి ఏర్పడింది.

మొత్తంగా మదింపు వేస్తే, సకల జనుల సమ్మె తెలంగాణ ప్రజల ఐక్యతను, ఆకాంక్షను, నిరసనను ప్రదర్శించడంలో అసాధారణమైన విజయం సాధించింది. అపూర్వమైన సంప్రదాయాల్ని నెలకొల్పింది. అదే సమయంలో తప్పనిసరిగా నేర్చుకోవలసిన పాఠాలనూ అందించింది. ఒక ప్రజాఉద్యమంలో నాయకత్వమూ, భాగస్వాములూ ప్రతి చిన్న విషయంలోనూ ఎంత జాగరూకత వహించవలసి ఉంటుందో సకల జనుల సమ్మె నుంచి నేర్చుకోవలసినది ఎంతో ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే సకల జనుల సమ్మె అనుభవంలో అనుకూల అంశాలూ ఉన్నాయి, ప్రతికూల అంశాలూ ఉన్నాయి. అందువల్ల ఈ ప్రయోగపు మంచి చెడులను, సాఫల్య వైఫల్యాలను నిష్పక్షపాతంగా, వస్తుగతంగా అంచనా వేసుకోవలసి ఉంది. అటువంటి సమీక్ష మాత్రమే తెలంగాణ ఉద్యమానికీ, మొత్తంగా ప్రజా ఉద్యమాలకూ అవసరమైన అవగాహనలను అందించగలుగుతుంది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతున్నదని కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబర్ 9న చేసిన ప్రకటన తర్వాత, ఆ ప్రకటనను తిరగదోడుతూ విస్తృత సంప్రదింపులు జరగాలని డిసెంబర్ 23న మరొక ప్రకటన చేసిన తర్వాత జరిగిన ఇరవై రెండు నెలల కాలంలో తెలంగాణ ప్రజా జీవితం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఒకవైపు ప్రజల ఆకాంక్ష మరింత బలోపేతమవుతూ పదునుదేరుతూ ఉండడం, మరొకవైపు పాలకవర్గ రాజకీయ పక్షాల కుట్రలూ కుహకాలూ బహిరంగంగా, నిర్లజ్జగా సాగడం ఈ ఇరవై రెండు నెలల చరిత్ర. ఈ కాలంలో తెలంగాణ సమాజం డిసెంబర్ 9 ప్రకటనకు ఆచరణ రూపం ఇచ్చేలా ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడానికి అనేక ప్రయత్నాలు చేసింది. రకరకాల నిరసన రూపాలు వెలికివచ్చాయి. ప్రజల సృజనాత్మక చొరవ అద్భుతంగా ప్రకటితమయింది. పాలకవర్గాలు మాత్రం చర్చల పేరుతో, కమిటీల పేరుతో సాచివేత ప్రయత్నాలు చేసింది. ఉద్యమకారుల మధ్య చీలికలు సృష్టించడానికి ప్రయత్నించింది. పెద్దఎత్తున నిర్బంధకాండను అమలు చేసింది. ఉద్యమాన్ని నీరుగార్చడానికి, అణచడానికి పాలకవర్గాలు ప్రయత్నిస్తుంటే, తమ ఆకాంక్ష చల్లారేది కాదని, రాష్ట్ర ఏర్పాటు అనే ఏకైక పరిష్కారం తప్ప మరేదీ తమకు ఆమోదయోగ్యం కాదని ప్రజలు చూపారు. అయినా ఆ ప్రజా ప్రయత్నాలేవీ విజయం సాధించలేకపోయిన తరుణంలో మరింత ఉన్నత రూపంగా సకల జనుల సమ్మె ఆలోచన రంగం మీదికి వచ్చింది.

ఐతే అంతకు ముందరి రకరకాల నిరసన, పోరాట రూపాలు, సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన, తెలంగాణ వ్యతిరేక వస్తు బహిష్కరణ లాంటి నినాదాలు ఎందువల్ల ఫలితం సాధించలేకపోయాయో, ఆ అనుభవాల నుంచి ఏ పాఠాలు తీసుకోవలసి ఉన్నదో, సకల జనుల సమ్మెను పటిష్టంగా, అర్థవంతంగా ఎలా రూపొందించవలసి ఉన్నదో నాయకత్వం తగినంత ఆలోచన, చర్చ సాగించినట్టు కనబడదు. సకల జనుల సమ్మె నినాదం ఎంత విస్తృతమైనదో, దాని ఆచరణ రూపాలేమిటో, విడివిడిగా వ్యక్తుల, వివిధ ప్రజా సమూహాల బాధ్యత ఏమిటో నాయకత్వం స్పష్టంగా చెప్పలేకపోయింది. ఉద్యమ నాయకత్వంలో విభిన్న రాజకీయార్థిక ప్రయోజనాల బృందాలు ఉండడం వల్ల ఈ అస్పష్టత నెలకొందని సంజాయిషీ చెప్పుకోవచ్చు. కాని, ఆ భిన్న బృందాలకు తెలంగాణ సాధన అనే లక్ష్యం మీద ఉండవలసినంత చిత్తశుద్ధి ఉంటే కనీసం ఆమోదించే ఉమ్మడి పోరాట రూపాలను అన్వేషించడం అసాధ్యం కాదు. కాని నాయకత్వం ఆ కనీస ఐక్యతను, చిత్తశుద్ధిని ప్రదర్శించలేకపోయింది. ఒకవైపు ప్రజలలో అద్భుతమైన ఐక్యత, చిత్తశుద్ధి, ఆశయ స్పష్టత ఉండగా, నాయకత్వంలో మాత్రం అవి కొరవడ్డాయి.

ఐనా నాయకత్వపు చొరవవల్ల కాక, ప్రజల ఒత్తిడితో మాత్రమే ఒక క్రియాశీల ఆచరణ రూపంగా సకల జనుల సమ్మె ముందుకు వచ్చింది. ఏమి జరగాలో, ఎట్లా జరగాలో, ఎవరి బాధ్యత ఏమిటో స్పష్టంగా నిర్దేశించని నాయకత్వం ‘ఎవరు ఏమి అర్థం చెప్పుకుంటే అదే జరగనీ’ అనే ప్రాప్తకాలజ్ఞతతో, అలసత్వంతో వ్యవహరించింది. అంతవరకూ అనుసరించిన, ఫలితం ఇవ్వని ఆచరణరూపాలు చేపట్టినా ఫరవాలేదనే ఆలోచనతో, తమ చేతులు దాటిపోయే సమరశీల పోరాట రూపాలు మాత్రం చేపట్టవద్దనే అతి జాగ్రత్తతో నాయకత్వం సకల జనుల సమ్మెకు పిలుపు ఇచ్చింది.

ఆ పిలుపు ఇవ్వడంలో కూడ నాయకత్వం ప్రదర్శించిన సందిగ్ధతను ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. సకల జనుల సమ్మెను ఆగస్ట్ మొదటి వారంలో ప్రారంభించడానికే మొదట సన్నాహాలు జరిగాయి. అది మొదట ఆగస్ట్ 17కు వాయిదా పడింది. మళ్లీ ఎన్నో ముందువెనుక గుంజాటనలు సాగి, చివరికి కింది నుంచి వేడి పెరిగిన తర్వాత సెప్టెంబర్ 13న సమ్మె మొదలయింది. ఈ సమ్మెలో సింగరేణి కార్మికులు, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, ఆర్ టి సి సిబ్బంది, ఉపాధ్యాయులు ఒకరొకరుగా పాల్గొనడంతో బలం చేకూరింది. కాని సకల జనులంటే ఈ పది, పదిహేను లక్షల మంది మాత్రమే కాదు. తెలంగాణలోని నాలుగున్నర కోట్ల ప్రజలూ సకల జనులే. వారందరూ సమ్మెలో పాల్గొనడమంటే ఏమిటో నాయకత్వం సూచించలేకపోయింది, నిర్దేశించలేకపోయింది, కనీసం వచ్చిన సూచనలను స్వీకరించలేకపోయింది. కేవలం సంఘటిత, క్రమబద్ధ ఉద్యోగాలలో ఉన్నవారికి మాత్రమే ఆ ఉద్యోగవిధులను ఆపివేయమనే పిలుపు ఇవ్వడం జరిగింది గాని, ఇతర ఉపాధి, ఉద్యోగాలలో, సాధారణ జీవితంలో ఉన్న కోట్లాది మంది సమ్మెలో పాల్గొనడం ఎలానో నాయకత్వం మార్గనిర్దేశనం చేయలేకపోయింది. వారికి ఎక్కువలో ఎక్కువ నిరాహారదీక్ష, ప్రదర్శన, ఊరేగింపు, సభ, సమావేశం, ధూంధాం, వంటా వార్పు, ఆటపాటలు, దిష్టిబొమ్మల దహనం, శవదహనం, పిండప్రదానం, యాగాలు వంటి పెద్దగా ఉపయోగం లేని, ప్రత్యర్థులమీద ఎటువంటి ప్రభావమూ చూపలేని రూపాలు మాత్రమే మిగిలాయి. గ్రామాలకు తరలండి అనే పిలుపు వినవచ్చింది గాని అది పెద్దగా అమలయినట్టు లేదు.

ఈ రూపాలలో కొన్ని ప్రజల ఐక్యతను, ఆకాంక్షను, నిరసనను ప్రకటించడంలో బలమైనవే. కాని అవేవీ ప్రత్యర్థుల మీద ప్రభావం వేయగల శక్తిమంతమైన ప్రతిఘటనా రూపాలు కావు. సభలు, సమావేశాలు, ఊరేగింపులు, ప్రదర్శనలు, కార్యాలయం ముందర శిబిరం వేసి పాటలు, మాటలు సాగించడం వంటి రూపాలు తెలంగాణ ఆకాంక్షల గురించి, పరిష్కారం గురించి తెలంగాణ ప్రజలకు తెలిసిన విషయాలనే మరొకసారి తెలియజేసేవే. కనీస నైతికత లేని ప్రత్యర్థుల మీద నిరాహారదీక్ష వంటి నైతిక ఒత్తిడి రూపాలు ఎటువంటి ప్రభావమూ వేయవు. దిష్టిబొమ్మల దహనం, శవదహనం, పిండప్రదానం, యాగాలు వంటి రూపాలైతే ప్రధానంగా బ్రాహ్మణీయ, హిందూ మతభావజాలాన్ని, మూఢనమ్మకాలను పెంచిపోషించేవే గాని ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షతో ఎటువంటి సంబంధమూ ఉన్నవి కావు. ఈ ఆచరణ రూపాలు అర్థవంతమైన పోరాట రూపాలవునో కాదో, వాటి పరిమితులూ అవకాశాలూ ఏమిటో, వాటి ద్వారా సాధించగలిగిందేమిటో నాయకత్వం ఎన్నడూ లోతుగా ఆలోచించినట్టు కనబడదు. ప్రత్యర్థి మీద ప్రభావం వేసే ఆచరణ రూపాలు లేక, ఉన్నవి నిరుపయోగమని రుజువు అవుతుండడంతో, సుదీర్ఘకాలం అవే రూపాలతో ఉన్నచోటనే కదం తొక్కుతుండడంతో నిరాశా నిస్పృహలకు లోనైన, సున్నిత మనస్కులైన అనేక మంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మొత్తంగా ఉద్యమంలోనే ఒకరకమైన నిర్లిప్తత, క్రియాశీల రూపాలు చేపట్టాలనే కోరికకూ, అవి వద్దనే నాయకత్వానికీ మధ్యన డోలాయమాన స్థితి నెలకొన్నాయి.

ఈ స్థితిలో ప్రారంభమైన సకల జనుల సమ్మె పాత ఆచరణ రూపాలను సరిగా సమీక్షించి, కొత్త ఆచరణ రూపాలను అన్వేషించి వాటిని ఈ సకల జనుల సమ్మెలో ప్రధాన నినాదాలుగా చేయవలసి ఉండింది. కాని అలా జరగక పోగా, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలకు సమ్మెను సూచిస్తూ, ఇతర వర్గాలకు ఏ ప్రత్యేకమైన సూచనా లేకుండా సకల జనుల సమ్మె మొదలయింది. అప్పటికే ఉద్యమం చీలికలకు గురై ఉండడంతో ఈ సకల జనుల సమ్మె ప్రారంభమైనపుడు అన్ని వర్గాలూ సహకరిస్తాయా లేదా అనే అనుమానమూ ఉండింది. సహాయ నిరాకరణ ఉద్యమ విరమణ సందర్భంగా ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి మీద వచ్చిన విమర్శలూ, అపోహల వల్ల ఈ సారి పిలుపు ప్రారంభంలో సందేహాస్పదంగానే ఉండింది.

అలా ఎన్ని బాలారిష్టాలతో, నాయకత్వపు సందిగ్ధాలతో మొదలయినా సకల జనుల సమ్మె క్రమక్రమంగా అద్భుతంగా పరిణమించింది, వేడెక్కింది, బలోపేతమయింది. సింగరేణి కార్మికుల సమ్మె వల్ల ప్రభుత్వ, ప్రైవేటు విద్యుదుత్పత్తి కర్మాగారాలకు దెబ్బతగిలింది. ఆ విద్యుత్తు మీద ఆధారపడిన ఇతర పరిశ్రమలకూ దెబ్బతగిలింది. ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ రాష్ట్ర ప్రభుత్వానికి అందే ఆదాయానికి గండి పడింది. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, ఆర్ టి సి సిబ్బంది సమ్మెకు దిగడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు పన్నుల ఆదాయం, ఇతర ఆదాయం గండి పడే స్థితి వచ్చింది. మిగిలిన వర్గాల సమ్మె రాష్ట్ర పాలకుల మీద నైతిక ప్రభావం వేసేది మాత్రమే గనుక ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు గాని సింగరేణి, ఆర్ టి సి, ప్రభుత్వోద్యోగుల సమ్మె వల్ల ఆర్థిక సంక్షోభం తలెత్తి ప్రభుత్వం ఇబ్బందిలో పడింది. ఏదో ఒకటి చేసి ఈ సమ్మెను ముగింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం పడిన తాపత్రయానికి మౌలిక కారణం అదే. అట్లని ఇతర వర్గాల ప్రజల భాగస్వామ్యాన్ని తక్కువ చేసి చూడనక్కరలేదు. వారి ఆందోళనా రూపాలు తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమస్ఫూర్తిని సజీవంగా నిలిపి ఉంచడానికి తోడ్పడ్డాయి.

కలిసివచ్చేవారెవరో, వ్యతిరేకించేవారెవరో స్పష్టంగా అంచనా వేసుకుని కలిసివచ్చేవారిని కలుపుకోవడానికీ, వారి శక్తిసామర్థ్యాలకు తగిన ఆచరణ రూపాలు ఇవ్వడానికీ, వారి మధ్య అభిప్రాయ భేదాలను సున్నితంగా పరిష్కరించడానికీ తగిన వ్యూహాలూ, వ్యతిరేకించేవారిని ఒంటరులను చేసి, చికాకుపరచి, వారి ప్రయోజనాలను దెబ్బతీసే వ్యూహాలూ రూపొందించుకుని అమలు చేసినప్పుడే ఏ ప్రజా ఉద్యమమైనా తాను అనుకున్న లక్ష్యాలు సాధించగలుగుతుంది. సకల జనుల సమ్మెకు నాయకత్వం వహించిన తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితికి గాని, భాగస్వామ్య రాజకీయ పక్షాలకు గాని, విభిన్న ఉద్యోగ, కార్మిక, ఉపాధ్యాయ సంఘాలకు గాని ఈ స్పష్టత ఉన్నదా అనుమానమే. సమ్మె జరిగిన తీరును చూస్తే ఈ స్పష్టత లేదని, ఉండవలసినంతగా లేదని అనిపిస్తుంది. అట్లాగే, ప్రజల చేతికి చొరవ పోగూడదని, ఉద్యమమంతా తాము గీసిన పరిమితులలోపలే జరగాలని ఈ దేశంలో రాజకీయ నాయకత్వాలన్నిటి ఉమ్మడి ఆకాంక్ష. చౌరీచౌరా తర్వాత ఆందోళనను విరమించిన గాంధీ నాటినుంచీ ఇవాళ్టిదాకా ప్రతి నాయకత్వమూ ఇటువంటి పనే చేస్తూ వచ్చాయి.

నిజానికి తెలంగాణ ఆకాంక్ష విషయంలో కలిసి వచ్చే శక్తులు తెలంగాణ ప్రజానీకంలో 99 శాతం, కనీసం 95 శాతం. వ్యతిరేకించే శక్తులు తెలంగాణలో ఉన్న దళారులూ, వారి ఆశ్రితులూ ఒక్క శాతమో, ఐదు శాతమో. కాక, తెలంగాణ వ్యతిరేక శక్తులు కోస్తాంధ్ర, రాయలసీమ పాలకవర్గాలలో, సంపన్న వర్గాలలో, రాష్ట్ర ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాయి. సకల జనుల సమ్మె ఇటు మిత్రులు కాదగిన 95 శాతాన్ని ఏకం చేయలేకపోయింది. వారంతట వారే ఏకమైనప్పుడు తగిన పోరాట రూపాలు ఇవ్వలేకపోయింది. ఆ ఐక్యతను దెబ్బతీయడానికి ప్రత్యర్థి వర్గాలు చేస్తున్నప్రయత్నాలను అడ్డుకోలేకపోయింది.

ఇక అటు ప్రత్యర్థి శక్తుల మీద ప్రత్యక్ష పరోక్ష ప్రభావం వేయగల శక్తిమంతమైన పోరాట రూపాలను అన్వేషించి, సృష్టించి, అమలు చేయడంలో కూడ నాయకత్వం తగినంత కృషి చేయలేకపోయింది. తెలంగాణ ప్రత్యర్థి శక్తులు ప్రధానంగా నాలుగు – రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, కోస్తాంధ్ర, రాయలసీమ సంపన్నులు, తెలంగాణ దళారీలు. ఈ నాలుగు శక్తులను లొంగదీస్తే తప్ప, తటస్థంచేస్తే తప్ప, దెబ్బతీస్తే తప్ప, బలహీనంచేస్తే తప్ప, తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యం కాదు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం గత యాభై ఐదు సంవత్సరాలుగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అమలు చేసున్న పాలక విధానాలకు, వివక్షా విధానాలకు, వాగ్దాన భంగాలకు వ్యతిరేకంగా సాగుతున్నది గనుక ఉద్యమంలోని ప్రతి అడుగూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను అడ్డుకునే దిశగా సాగవలసి ఉంది. ఎక్కడ వీలయితే అక్కడ రాష్ట్ర, కేంద్ర పభుత్వాలను స్తంభింపజేయడానికి, చికాకు పరచడానికి, ఆర్థికంగా, రాజకీయంగా బలహీన పరచడానికి, ఆర్థిక రాజకీయ ప్రయోజనాలను దెబ్బతీయడానికి ప్రయత్నించవలసి ఉంది. అంటే ఉద్యమం ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేకంగా సాగాలి. కాని మొదటి నుంచీ కూడ ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాలు మూసివేయడం, రవాణా ఆపివేయడం మినహా మరొక రూపం ముందుకు రాలేదు. ప్రభుత్వ స్తంభన అన్నప్పుడు అర్థం ప్రభుత్వ కార్యాలయాల, విద్యాలయాల, రవాణా సౌకర్యాల మూసివేత మాత్రమే కాదు. ప్రధానంగా ప్రభుత్వ రాజకీయార్థిక మూలాలు దెబ్బతినడమే స్తంభన అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ సాధికారతను ప్రశ్నించాలి, సవాలు చేయాలి. దాని ఆర్థిక ఆదాయ మూలాలకు గండి కొట్టాలి. అప్పుడు అది రాజకీయంగానూ ఆర్థికంగానూ బలహీనమై ఉద్యమకారుల ఆకాంక్షల సామంజస్యాన్ని చర్చించడానికీ, అర్థం చేసుకోవడానికీ, అంగీకరించడానికీ  సిద్ధపడుతుంది. ఈ ఇరవై రెండు నెలల ఉద్యమంలో సకల జనుల సమ్మె మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక మూలాల మీద కొంత ప్రభావం వేసింది. అంతకు ముందరి సహాయ నిరాకరణ, శాసనోల్లంఘనల సమయంలో దాని రాజకీయ సాధికారతను సవాలు చేసే పని జరిగింది గాని ముందుకు సాగలేదు. నలభై రెండు రోజుల పాటు సాగిన సకల జనుల సమ్మె ప్రభుత్వ సాధికారత లోని బోలుతనాన్ని బట్టబయలు చేసింది. అయితే ఇవి రెండూ కూడ ఇంకా విస్తృతంగా సాగగల అవకాశాన్ని సకల జనుల సమ్మె కూడ వాడుకోలేదు.

రాష్ట్ర ప్రభుత్వానికైనా ఏదో ఒక మేరకు ఈ వేడి తగిలింది గాని కేంద్ర ప్రభుత్వం మీదనైతే నాలుగు రోజుల పాటు రైల్ రోకో ప్రత్యక్షంగానూ, సింగరేణి సమ్మె పరోక్షంగానూ వేసిన ప్రభావం మినహా ఇతరంగా పడిన ప్రభావం తక్కువ. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మీద ప్రభావం చూపడానికి అవసరమైన బ్యాంకింగ్, బీమా, కమ్యూనికేషన్స్, కేంద్ర పన్నుల వ్యవస్థలు, తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సకల జనుల సమ్మె ప్రభావంలోకి రాలేదు. వాటిని కూడ స్తంభింపజేయ గలిగితే కేంద్ర ప్రభుత్వ సాధికారతకు, ఆర్థిక మూలాలకు ప్రమాదం ఏర్పడి ఉండేది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికంటె ఎక్కువ స్పందన చూపక తప్పేది కాదు.

తెలంగాణ విషయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వైఖరి వ్యతిరేకంగా ఉండడానికి, వివక్షతో, వాగ్దాన భంగాలతో, అన్యాయాలతో కూడిన పాలక విధానాలు అమలు కావడానికి మూల కారణం కోస్తాంధ్ర, రాయలసీమలలోని సంపన్న పాలకవర్గాలు. ఆ పాలకవర్గాలు నేరుగా అధికారంలో ఉండిగాని, పరోక్షంగా ప్రభావం వేసి గాని తెలంగాణ వ్యతిరేక విధానాలకు కారణమయ్యాయి. కనుక తెలంగాణ అనుకూల ఉద్యమమేదైనా ప్రధానంగా ఈ కోస్తాంధ్ర, రాయలసీమ పాలక, సంపన్న వర్గాలను బలహీనం చేసే, వారి రాజకీయార్థిక ప్రయోజనాలను దెబ్బతీసే పోరాట రూపాలు చేపట్టాలి. తెలంగాణ వనరుల మీద ఆధిపత్యం చలాయిస్తున్న ఆ కోస్తాంధ్ర, రాయలసీమ పాలకుల దోపిడీ పీడనలను అడ్డుకోవాలి. దురదృష్టవశాత్తూ తెలంగాణ ఉద్యమం ఇటువంటి పనికి ఇంతవరకూ పెద్దఎత్తున పూనుకోనేలేదు. ప్రజలలో ఉన్న న్యాయమైన ఆగ్రహం అటువంటి ప్రతిఘటన రూపాలను చేపట్టడానికి సిద్ధ పడినప్పుడు కూడ నాయకత్వం వారిని వెనక్కి లాగింది. లేదా పాలకవర్గ నిర్బంధకాండ అనే బూచిని చూపింది. తెలంగాణలో భూములు ఆక్రమించినవారు, ఖనిజనిలువలు దోచుకుంటున్నవారు, పరిశ్రమల పేరుతో జల, విద్యుత్, అటవీ సంపద దోచుకుంటున్నవారు, టోల్ గేట్లు, రహదారులు, అనేక రకాల ప్రాజెక్టులు నిర్మించి తాము చేసిన వ్యయానికి వందల రెట్లు ఎక్కువ ఆదాయం పొందుతూ తెలంగాణ మూలుగులను పీలుస్తున్నవారు కోస్తాంధ్ర, రాయలసీమ కాంట్రాక్టర్లు, సంపన్నులు గాని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు గాని వేలాది మంది ఉన్నారు. అలాగే రవాణా, బ్యాంకింగ్, చిట్ ఫండ్, కాంట్రాక్టులు, విద్యా, వైద్య, ఆరోగ్య వ్యాపారాలు, సినిమా, మీడియా రంగాల ద్వారా తెలంగాణను దోపిడీ చేస్తున్న తెలంగాణేతర, ప్రత్యేకంగా కోస్తాంధ్ర, రాయలసీమ సంపన్నులు ఉన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు పట్ల వారు వ్యతిరేకులా, అనుకూలురా అనే గీటురాయి మీద వారి పట్ల వైఖరిని ప్రకటించుకుని, వ్యతిరేకులమీద ప్రతిఘటన చూపవలసి ఉంటుంది. కాని తెలంగాణకు వ్యతిరేకంగా ఢిల్లీలో చక్రం తిప్పుతున్నవారు, ప్రతిరోజూ తెలంగాణకు వ్యతిరేకంగా ప్రచారసాధనాలలో మాట్లాడుతున్నవారు ఇవాళ్టికీ తెలంగాణలో యధేచ్ఛగా తమ దోపిడీని కొనసాగించ గలుగుతున్నారు. సకలజనుల సమ్మె కూడ వారికి వేడి కలిగించలేకపోయింది, వారి ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలను దెబ్బతీయలేకపోయింది.

వారికి దళారీలుగా పనిచేస్తూ తెలంగాణకు వ్యతిరేకులుగా పనిచేస్తున్న తెలంగాణ నాయకులు కూడ ఉన్నారు. వారు ఎక్కడ పుట్టారనేదానికన్న ముఖ్యంగా వారు ప్రజా ఆకాంక్షలను వ్యతిరేకిస్తున్నారనే కారణం మీదనే వారిని ఎదిరించవలసి ఉంది. వారి రాజకీయ ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీయవలసి ఉంది. సకల జనుల సమ్మె ఇటువంటి వారి మీద విమర్శలు, ఎక్కువలో ఎక్కువ ఇళ్లముందర ప్రదర్శనలు మినహా ఇంకా లోతైన ప్రభావం వేయగల ఆచరణ రూపాలు చేపట్టలేకపోయింది.

ఒకవైపు ఇటువంటి అస్పష్టతలు, అవగాహనాలోపాలు ఉన్నప్పటికీ ప్రజా వెల్లువ అద్భుతంగా సాగింది. విరామం ప్రకటించాలనే ఆలోచనకు నాయకత్వం వచ్చినా ప్రజలు మాత్రం అందుకు సమ్మతించలేదు. నాయకత్వం అటువంటి ఆలోచనకు రావడానికి తగిన కారణాలు ఉన్నాయి. రాజకీయ నాయకత్వాల అవకాశవాద వైఖరి, ఆర్థిక ఇబ్బందులు, చీలికలు వంటి కారణాలతో పాటు, మధ్యతరగతిని ప్రభావితం చేసే “ప్రజల ఇబ్బందులు” అనే సాకును పాలకులు బాగా వాడుకున్నారు. ఒకవైపు తెలంగాణ ప్రజానీకమంతా ఈ ఇబ్బందులను సహిస్తుండగా, పాలకులు మాత్రం కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులను సృష్టించి తమ పిల్లల చదువులు చెడిపోతున్నాయనే గోల ప్రారంభించారు. ప్రయాణ సౌకర్యాలు లేక ఇబ్బంది కలుగుతున్నదని గోల ప్రారంభించారు. ఇబ్బంది లేని ఉద్యమం ఏదీ ఉండదని, ఇవాళ్టి బధిరాంధ ప్రభుత్వాలు ఇబ్బంది కలిగించకుండా మాట వినే స్థితి లేదని, అయినా యాభై ఐదు సంవత్సరాల, రెండు తరాల జీవితమే ధ్వంసమైపోయిన ఇబ్బందిని తొలగించడానికే ఈ ఏడువారాల ఇబ్బంది అని బలంగా చెప్పి ఒప్పించడంలో సకల జనుల సమ్మె నాయకత్వం చేయవలసినంత కృషి చేయలేదు. ‘అరయంగా కర్ణుడీల్గెనార్గురి చేతన్’ అన్నట్టు అనేక కారణాలు కలగలసి సకల జనుల సమ్మె విరమణ దిశగా పయనించవలసి వచ్చింది.

సకల జనుల సమ్మె కొట్టవచ్చినట్టుగా కనిపించింది గనుక, ప్రభావశీలమైన రూపంగా ముందుకు వచ్చింది గనుక అది ఆగిపోతే సమస్తమూ ఆగిపోయినట్టేనేమో అనే సందేహాలు తలెత్తాయి. కాని ఒక వెనుకంజతోనే ఉద్యమం ఆగిపోయినట్టు కాదు. దేశ చరిత్రలో చూస్తే బ్రిటిష్ వలస వ్యతిరేక జాతీయోద్యమం సామ్రాజ్యవాద, భూస్వామ్య వ్యతిరేక సారాంశం నుంచి పక్కకు జరిగినందువల్ల ఎన్నోసార్లు ఇటువంటి తాత్కాలిక అపజయాలను చూసింది, అయినా మళ్లీ మళ్లీ విజృంభించింది. చివరికి ప్రజా ఆకాంక్షలు నెరవేరకుండానే స్వాతంత్ర్య ప్రకటన అనే పెద్ద అపజయాన్ని కూడ చూసింది. అయినా భారత ప్రజా ఉద్యమం మళ్ళీ నక్సల్బరీ ప్రజా వెల్లువగా నిజమైన సారాంశపు పోరాటంగా మారింది. అది కూడ ఎన్నోసార్లు తాత్కాలిక అపజయాలకూ, వెనుకంజలకూ గురి అయింది. మళ్లీ మళ్లీ తిరిగి తిరిగి తలెత్తుతూనే ఒక చోట అపజయానికి గురయినా మరొకచోట, ఒకచొట వెనుకంజ వేసినా మరొకచోట విస్తరిస్తూనే ఉంది.  తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్రలోనే చూస్తే కనీసం మూడు సార్లు 1953, 1969-71, 1999-2000 ఉద్యమం దమననీతికి గురయి అపజయాన్ని ఎదుర్కొంది. కాని చితాభస్మం నుంచి లేచినిలిచిన పక్షి వలె తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఎప్పటికప్పుడు కొత్త దశకు ఎదిగింది. ఇప్పుడు కూడ సకల జనుల సమ్మె విరామం అంతిమ విరమణ కాదు, కానక్కరలేదు. వెనుకంజ వేయడమే, తాత్కాలిక విరామమే తప్పు కాదు. దాని నుంచి పాఠాలు నేర్చుకుని మరొక ముందడుగుకు సమాయత్తం కాకపోవడం తప్పు. సకల జనుల సమ్మె అనుభవం నేర్పే పాఠాలను సరిగా గ్రహించి భవిష్యత్తు పోరాటాలలో ఉపయోగించినప్పుడే తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యమైనా, ఇతర ప్రజా ఉద్యమాల లక్ష్యాలైనా నెరవేరుతాయి.

About ఎన్.వేణుగోపాల్ N Venugopal

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues.
This entry was posted in వ్యాసాలు, Veekshanam. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s