సమాజంలోనూ, పుస్తకాలలోనూ, పత్రికలలోనూ, ఇతర ప్రచార సాధనాలలోనూ ఎన్నెన్నో తెలుసుకోవలసిన, ఆలోచించవలసిన విషయాలు ఉన్నప్పటికీ, వెలువడుతున్నప్పటికీ ప్రత్యేకంగా ఎత్తిచూపకపోవడం వల్ల వెలుగు లోకి రాకుండా, ఆలోచనాపరుల దృష్టికి రాకుండా పోతున్నాయి. అటువంటి తెలుసుకోవలసిన విషయాలను మా దృష్టికి వచ్చినంతవరకు సేకరించి అందించడం ఈ శీర్షిక లక్ష్యం. ప్రజల అవగాహనల గూడును సుస్థిరంగా నిర్మించడానికే ఈ పుల్లా పుడకా.
***
భారత పాలకవర్గాల కుటిల రాజనీతికి నిదర్శనాలు కోకొల్లలు. శాంతి మంత్రాలు జపిస్తూనే యుద్ధ సన్నాహాలు సాగించడం, తెల్లజెండాలు ఎగరేస్తూనే కుత్తుకలు తెగ్గోయడం, పావురాలు ఎగరేస్తూనే వాటిని కాల్చిచంపడం భారత పాలకులకు వెన్నతో పెట్టిన విద్య. నవంబర్ రెండో వారంలో మాల్దీవుల లోని అడ్డు నగరంలో సమావేశమైన దక్షిణాసియా దేశాల సమాఖ్య (సార్క్) సభలో భారత పాలకులు ‘దక్షిణాసియాలో శాంతి, విశ్వాస నిర్మాణం, స్వేచ్ఛ, మానవ హోదా, ప్రజాస్వామ్యం, పరస్పర గౌరవం, సత్పరిపాలన, మానవహక్కులు వంటి ఆశయాలకు పునరంకితమవుతామ’ని గంభీర ప్రవచనాలు పలికారు. సార్క్ సభ్యులైన బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, అఫ్ఘనిస్తాన్ అన్నీ కూడ ఆర్థిక వ్యవస్థ రీత్యానూ, జనాభా రీత్యానూ, సైనిక పాటవం రీత్యానూ భారత్ కన్న చాల చిన్నవి. ఆ దేశాల ప్రభుత్వాలతో శాంతిసామరస్యాలు నెరపి దక్షిణాసియాలో శాంతి నెలకొల్పవలసిన బాధ్యత భారత ప్రభుత్వానిదే. కాని భారత ప్రభుత్వం ఇరుగుపొరుగు దేశాలతో శాంతి ప్రవచనాలు పలుకుతూనే, తన సైనిక పాటవాన్ని, ఆయుధ శక్తిని, విధ్వంసక శక్తిని విపరీతంగా పెంచుకుంటూ పోతున్నది. భారతదేశం శాంతి అహింసలకు నిలయం అని, యుద్ధాలకు వ్యతిరేకి అని, తనకు తానై ఎవరిమీదా యుద్ధం చేయలేదని మన పాఠ్యాంశాల్లో చిన్నప్పటినుంచీ నూరిపోస్తున్నారు. కాని అవన్నీ పచ్చి అబద్ధాలని ఈ ఆరు దశాబ్దాల స్వతంత్ర భారత చరిత్ర ప్రతిరోజూ నిరూపిస్తున్నది. కనీసం గత ఇరవై సంవత్సరాలలో భారత ప్రభుత్వం ఆయుధాల కొనుగోళ్లలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలుస్తున్నది. తనను తాను శాంతి కాముకమని అభివర్ణించుకునే ప్రభుత్వం వేలకోట్ల రూపాయలు రక్షణ వ్యయానికి వెచ్చిస్తూ పెద్ద ఎత్తున మారణాయుధాలు కొనుగోలు చేస్తున్నది. రానున్న 12 సంవత్సరాలలో కనీసం 200 బిలియన్ డాలర్ల (ప్రస్తుత మారకపు రేటు ప్రకారం పదిలక్షల కోట్ల రూపాయలు) యుద్ధసామగ్రి, విమానాలు, జలాంతర్గాములు, విమాన వాహక నౌకలు, క్షిపణులు, ఆయుధాలు కొనుగోలు చేయాలని భారత ప్రభుత్వం ప్రణాళికలు వేస్తున్నది. సార్క్ సమావేశాలలో శాంతి ప్రకటన చేసి నాలుగు రోజులు గడవకుండానే స్విట్జర్లాండ్ నుంచి యుద్ధ విమానాలు, ఫ్రాన్స్ నుంచి క్షిపణులు కొనడానికి రు. 5000 కోట్ల బేరం కుదుర్చుకుంది. ఇదే నెలలో ఫైటర్ జెట్ యుద్ధ విమానాలు కొనడానికి 11 నుంచి 20 బిలియన్ డాలర్ల (55 వేల నుంచి ఒక లక్ష కోట్ల రూపాయల) బేరం ప్రారంభించింది. ఈ బేరంలో అధికారులను, మంత్రులను మెప్పించడానికి (అంటే ముడుపులతో కొనివేయడానికి) ఐదు బహుళజాతి సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. అవి అమెరికాకు చెందిన బోయింగ్, లాక్ హీడ్ మార్టిన్, ఫ్రాన్స్ కు చెందిన దసాల్ ఏవియేషన్, రాఫేల్, యూరపియన్ కూటమికి చెందిన యూరోఫైటర్. ఇవి కాక బ్రిటిష్ సంస్థ హాక్ నుంచి రు. 16 వేల కోట్ల యుద్ధవిమానాలు, రష్యా నుంచి రు. 65000 కోట్ల యుద్ధ విమానాలు కొనే ప్రణాళికలు కూడ ఉన్నాయి. గత నాలుగు సంవత్సరాలలో భారత ప్రభుత్వం బహుళజాతి సంస్థల నుంచి కొనుగోలు చేసిన రక్షణ సామగ్రి విలువ ఒక లక్షా యాభై ఐదు వేల కోట్ల రూపాయల పైచిలుకే. 2007-8లో రు. 28,159 కోట్లుగా ఉన్న ఈ కొనుగోళ్లు 2010-11 నాటికి రు. 46,887 కోట్లకు పెరిగాయి. ఇవి విదేశాల నుంచి నేరుగా దిగుమతులు కాగా, స్వదేశీ సంస్థల నుంచి కొనుగోళ్లు ఇందుకు రెట్టింపు ఉంటాయి. అవి కూడ స్వదేశీ సంస్థలని పేరు పెట్టుకున్నవే గాని పరోక్షంగా ఆ డబ్బు బహుళజాతి సంస్థలకు చేరేదే. ఇంతకూ ఇన్ని లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి కొంటున్న సామగ్రిలో ఎక్కువ భాగం ఎందుకూ పనికి రానిది. రిపబ్లిక్ డే కవాతులో ప్రదర్శన మినహా ఎప్పుడూ వాడనిది. కేవలం పొరుగుదేశాలు కొన్నాయని భారత ప్రభుత్వం, భారత ప్రభుత్వం కొన్నదని పొరుగుదేశాల ప్రభుత్వాలు పోటీపడి కొనుక్కుని ఆ సామగ్రిని తయారుచేసే బహుళజాతి సంస్థలకు లాభాలు సమకూర్చి పెట్టడానికి తప్ప మరెందుకూ పనికి రానివి. అసలు ఈ యుద్ధ సామగ్రి కొనుగోళ్ల పోటీ ఒక పెద్ద కుంభకోణం. విస్తృతమైన కుట్ర. మొదట బహుళజాతి సంస్థల యాజమాన్యాలు, ప్రతినిధులు ఏదో ఒక దేశ నాయకులకు, అధికారులకు ముడుపులు పెట్టి ఆ సామగ్రి కొనిపిస్తారు. వాళ్లు కొన్నారని చూపి పొరుగువాళ్లను భయపెట్టి, బెదిరించి వీళ్లతోనూ కొనిపిస్తారు. ఈలోగా సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి వల్ల మరింత మెరుగైన, శక్తిమంతమైన సామగ్రి తయారవుతుంది. కనుక పాతది తీసేసి కొత్తది కొనుక్కొమ్మని మళ్లీ వెంట పడతారు. ఈ విషచక్రం నిర్విరామంగా తిరుగుతూనే ఉంటుంది. దేశాభివృద్ధికీ, సంక్షేమ పథకాలకూ, కోట్లాది ప్రజలకు కూడూ గూడూ గుడ్డా ఇవ్వడానికీ పనికి రావలసిన లక్షల కోట్ల రూపాయల అపారమైన నిధులు ధ్వంసమై పోతుంటాయి.
***
ప్రజల వోట్ల ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులే ఈ దేశ పాలకులనీ, వారికి ఏదో ఒక స్థాయిలో ప్రజాప్రయోజనాల పట్ల శ్రద్ధాసక్తులు ఉంటాయనీ అనుకుంటే అది అమాయకత్వానికి చిహ్నం. కాదనుకుంటే రెండు తాజా ఉదాహరణలు చూడండి. పరిపాలనకు సంబంధించిన కీలక చట్టాలు చేసే అధికారం ఉన్న పార్లమెంటు ప్రతి సంవత్సరం మూడు నాలుగు సార్లు సమావేశమై ఆ బిల్లులను చర్చిస్తుంది. ఆ చట్టాలు నిజంగా ప్రజోపయోగానికేనా, వాటిలో ప్రజాప్రయోజనాలకు వ్యతిరేకమైన నిబంధనలుంటే ఎలా సవరించాలి అని చర్చించే అవకాశం ప్రజా ప్రతినిధులు అని పిలవబడే పార్లమెంటు సభ్యులకు ఉంటుంది. కాని చాల బిల్లులు ప్రవేశపెడుతున్న సమయంలో, చర్చ జరిగే సమయంలో, బిల్లులు ఆమోదం పొంది చట్టాలుగా మారే సమయంలో సభలో నాలుగో వంతు సభ్యులు కూడ లేకపోవడం ఆనవాయితీగా ఉంటున్నది. ఉన్నవారైనా అవి వింటారో, చదువుతారో, చర్చిస్తారో, నిద్రలో జోగుతుంటారో తెలియదు. ఎంతో కీలకమైన, ప్రజా జీవితాన్ని ధ్వంసం చేసే, దేశ వనరులను బహుళజాతి సంస్థలకు దోచిపెట్టే చట్టాలు కూడ ఎటువంటి చర్చా లేకుండా క్షణాలలో ఆమోదం పొందిన అనుభవాలెన్నో ఉన్నాయి. ఈ సారి నవంబర్ 22 నుంచి డిసెంబర్ 21 వరకు, నెల రోజుల్లో జరగనున్న శీతాకాలపు సమావేశాల్లో సభ మొత్తం 21 రోజులు కూచుంటున్నది. ఈ సారి చర్చకు రానున్న బిల్లులలో అతి ముఖ్యమైనవే 20 ఉన్నాయి. అంటే ఈ 21 రోజుల్లో కొన్ని రోజులైనా ఆందోళనలకు, అభ్యంతరాలకు, అవరోధాలకు, వాయిదాలకు చెల్లిపోతాయనుకుంటే, రోజుకు రెండు బిల్లులు ఆమోదించినా కష్టమేనన్నమాట. ఈ బిల్లులలో రెండో దశ ఆర్థిక సంస్కరణలు అమలు జరపడానికి, అంటే బహుళజాతి సంస్థలకు, దేశ దేశాల సంపన్నులకు ఉపయోగపడే విధానాలు అమలు చేయడానికి ఉద్దేశించినవి ఎన్నో ఉన్నాయి. ఇప్పటికే ఉన్న స్టాంపుల చట్టానికి, అక్రమ ధన లావాదేవీల నిరోధక చట్టానికి, జీవిత బీమా చట్టానికి, బీమా చట్టాలకు, బ్యాంకింగ్ చట్టాలకు, ఎగుమతి దిగుమతి బ్యాంకుల చట్టానికి, పెట్రోలియం, ఖనిజాలు, పైప్ లైన్ల చట్టానికి, దామోదర్ లోయ కార్పొరేషన్ చట్టానికి, ప్రసారభారతి చట్టానికి బహుళజాతి సంస్థలకు అనుకూలమైన సవరణలు చేస్తున్న బిల్లులు ఉన్నాయి. అలాగే పెన్షన్ నిధులను బహుళజాతి సంస్థలకు అప్పగించడానికి ఉద్దేశించిన బిల్లు, అణు విద్యుత్ సంస్థలను, బయోటెక్నాలజీని నియంత్రించే స్వతంత్ర సంస్థలను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన బిల్లు కూడ ఈ బిల్లులలో ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక్క బిల్లులోనూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దేశ ప్రజలకు నష్టదాయకమైన నిబంధనలున్నాయి. దేశ వనరులను కొల్లగొట్టుకు పోయేందుకు బహుళజాతి సంస్థలకు అవకాశమిచ్చే నిబంధనలున్నాయి. అధికార కూటమికి ఉన్న ఆధిక్యత వల్ల గాని, ప్రపంచీకరణ పట్ల ప్రతిపక్షాలకు కూడ నిజమైన వ్యతిరేకత లేనందువల్ల గాని ఈ బిల్లులన్నీ ఎటువంటి చర్చా లేకుండానే యథాతథంగా, అంటే లబ్ధిదారులైన బహుళజాతిసంస్థలు రాసి ఇచ్చిన దానిలో అక్షరం పొల్లుపోకుండా చట్టాలుగా మారిపోతాయి. ప్రజాజీవనాన్ని అల్లకల్లోలం చేస్తాయి.
చట్టసభల ద్వారా, చట్టబద్ధంగానే, బహిరంగంగానే ఇంత దుర్మార్గం సాగిపోతుండగా మరొక వైపు నుంచి ప్రపంచ ప్రఖ్యాత మేధావిగా, శాస్త్రవేత్తగా పేరు తెచ్చుకుని రాష్ట్రపతిగా కూడ కొంతకాలం పనిచేసిన అబ్దుల్ కలాం కూడంకుళం అణువిద్యుత్ కేంద్రానికి బహిరంగంగా మద్దతు ప్రకటించి తాను అణువిద్యుత్ బహుళజాతి సంస్థల సేవలో ఉన్నానని చూపుకున్నారు. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా కూడంకుళంలో ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన అణు విద్యుత్ కర్మాగారం తమ బతుకులకు బుగ్గి చేయనున్నదని, తమ జీవితాలలో విషం చిలకనున్నదని గుర్తించిన ఆ ప్రాంత ప్రజలు చాల కాలంగా పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. పదమూడు వేల కోట్ల రూపాయల వ్యయంతో, రష్యన్ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణమవుతున్న ఈ విద్యుత్ కేంద్ర వ్యయంలో సగానికి పైగా బహుళజాతి సంస్థలకే అందుతుంది. ఇటీవల జపాన్ లో ఫుకుషిమా అణువిద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాద తీవ్రత చూసిన తర్వాత కూడంకుళం అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా ప్రజాందోళన మరింత ఉధృతమైంది. భద్రతా ప్రమాణాలను పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం నిపుణులతో, నిరసనకారులతో ఒక బృందాన్ని నియమించవలసి వచ్చింది. ఆ నిపుణుల బృందం సమావేశానికి సరిగ్గా రెండు రోజుల ముందర, ఆ సమావేశాన్ని ప్రభావితం చేసే దురుద్దేశంతో, ఒక ప్రముఖ ఇంగ్లిష్ దినపత్రికలో మాజీ రాష్ట్రపతి మహాశయులు దుర్మార్గమైన, అణువిద్యుత్ అనుకూలమైన, బహుళజాతి సంస్థల ప్రయోజనాలకు మేలు కలిగించే సుదీర్ఘ వ్యాసం రాశారు. ఇటు పార్లమెంటు సభ్యులైనా, అటు రాష్ట్రపతి అయినా జీ హుజూర్ జో హుకుం అని బహుళ జాతి సంస్థలకు చెప్పుకోవడానికి ఎన్ని పాట్లు పడుతున్నారో!
***
అలా ఒకవైపు ప్రభుత్వం తరఫున, చట్టసభల తరఫున రెండో దశ ఆర్థిక సంస్కరణల ప్రతిపాదనలు, ప్రయత్నాలు జరుగుతుండగానే, ప్రపంచీకరణ శక్తులకు, బడాపెట్టుబడిదారులకు ప్రతినిధిగా ఉన్న వాణిజ్య పత్రిక ది ఎకనమిక్ టైమ్స్ ఈ మార్పులకు అనుగుణంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడానికి ప్రయత్నిస్తున్నది. ఇరవై సంవత్సరాల ప్రపంచీకరణ ముగిసిపోయి, దేశం ఒక మూలమలుపుకు చేరిందని, ఇక్కడినుంచి ఇంకా పునరుద్ధరించడానికి ఒక దిశా నిర్దేశం కావాలని గంభీరంగా ప్రవచిస్తూ ‘ఎజెండా ఫర్ రిన్యువల్’ ప్రకటించింది. అధికార మార్పిడికి ముందు 1944-45లోనే దేశంలోని బడా పారిశ్రామికవేత్తలు తమ ప్రయోజనాల పరిరక్షణ కోసం భారత జాతీయ కాంగ్రెస్ ముందు ఉంచిన బొంబాయి ప్లాన్ తో పోల్చదగినంత చరిత్రాత్మక కార్యక్రమంగా ఎకనమిక్ టైమ్స్ దీన్ని అభివర్ణిస్తోంది. దేశంలోని ఆరుగురు బడా సంపన్నులు, పారిశ్రామిక, వ్యాపారవేత్తలు ఈ పది అంశాల ప్రణాళికను తయారు చేశారు. ఎచ్ డి ఎఫ్ సి అనే ద్రవ్యసంస్థ అధిపతి దీపక్ పరేఖ్, ఐసిఐసిఐ బ్యాంక్ అధిపతి కె వి కామత్, హిందుస్తాన్ యునిలివర్ అనే బహుళజాతి సంస్థ మాజీ అధిపతి అశోక్ గంగూలీ, ఎ జెడ్ బి పార్ట్ నర్స్ అనే బహుళజాతి న్యాయసలహా సంస్థ అధిపతి జియా మోడీ, వివిధ రంగాలకు వ్యాపించిన వ్యాపారవేత్త సునీల్ భారతి మిత్తల్, ఇన్ఫోసిస్ మాజీ అధిపతి ఎన్ ఆర్ నారాయణ మూర్తి ఈ ప్రణాళిక రచయితలు. వీరిలో ఏ ఒక్కరూ భారత సమాజంలో గ్రామీణ ప్రాంతాలతో గాని, అట్టడుగు వర్గాలతో గాని, పేదరికంతో గాని, సాధారణ ప్రజా జీవితంతో గాని సంబంధం ఉన్నవాళ్లు కాదు. వారికి ఈ దేశాభివృద్ధి అంటే అర్థం తమ వ్యాపారాలు, తమ యజమానులైన బహుళజాతి సంస్థల వ్యాపారాలు అభివృద్ధి చెందడం మాత్రమే. ఈ ప్రణాళిక దేశ పునర్నిర్మాణానికి సూచిస్తున్న పది అంశాలు: 1. ప్రభుత్వ ప్రయత్నాలను వ్యతిరేకించడం, ప్రజలలో నిరాశను వ్యాపింపజేయడం ప్రతిపక్షాలకు అలవాటయింది. ఆ అలవాటును వదులుకుని ప్రతిఒక్కరూ సంస్కరణల రంగంలో ప్రభుత్వానికి సహకరించాలి. 2. దేశంలో పెట్టుబడులు పెట్టదలచిన విదేశీ, స్వదేశీ మదుపుదార్లకు ఉత్సాహం కలిగించే సత్వర నిర్ణయాలు తీసుకోవాలి. 3. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి అవసరమైన చిన్నా పెద్దా చర్యలన్నీ చేపట్టాలి. 4. విద్యుత్ చార్జీలు పెంచి, సబ్సిడీలు తగ్గించి విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయాలి. 5. వ్యవసాయ రంగంలో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకురావాలి. వ్యవసాయ మార్కెట్ల మీద ప్రభుత్వ నియంత్రణ తగ్గించాలి. 6. పెద్ద నగరాలను నిర్మించాలి. ప్రభుత్వ–ప్రైవేట్ రంగాల సమన్వయం ద్వారా నగరాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. 7. పారిశ్రామిక, వ్యాపార అవసరాల కోసం భూసేకరణను సులభతరం చేయాలి. 8. సత్వర ఆర్థికాభివృద్ధి కొరకు వివిధ మంత్రిత్వ శాఖల మధ్య ఇతోధిక సమన్వయం కావాలి. 9. విద్యారంగాన్ని ప్రైవేటీకరించి, లాభం కోసం పనిచేసే రంగంగా మార్చాలి. 10. రాజకీయ పార్టీలకు కార్పొరేట్ సంస్థలు ఇచ్చే విరాళాలను పారదర్శకంగా మార్చి అవినీతిని అరికట్టాలి. ఈ పది అంశాలనూ ఒక్క మాటలో చెప్పాలంటే, దేశాన్ని ఇంకా ఎక్కువగా అమ్మకానికి పెట్టండి అని. లేదా, ఈ దేశ వనరులన్నిటినీ దేశదేశాల సంపన్నులకు అప్పగించండి అని. ఇది దేశ పునర్నిర్మాణ ప్రణాళిక కాదు, దేశ విధ్వంస ప్రణాళిక.