ప్రజా ఉద్యమాలు – పాలకుల స్పందన

వీక్షణం జనవరి 2012 సంచిక కోసం

ఇవాళ దేశంలో ఏదో ఒక ప్రాంతంలో, ఏదో ఒక ప్రజాసమూహం, ఏదో ఒక సమస్య మీద ఆందోళనకు దిగకుండా క్షణం కూడ గడవడం లేదు. ఏ రోజున ఏ క్షణాన పరిశీలించినా దేశ జనాభాలో అత్యధికులు ఏదో ఒక సమస్యపై ఆందోళన చెందుతూ ఉండడం, వారిలో కొందరైనా ఆ ఆందోళనను బహిరంగంగా వ్యక్తీకరిస్తూ ఉండడం కనబడుతున్నది. వాటి పట్ల ప్రభుత్వాల ప్రతిస్పందన ఆ సమస్యలను పరిష్కరించి, ఆ ఆందోళలను చల్లార్చేదిగా కాక, హింస, బలప్రయోగాలద్వారా అణచివేసేదిగా ఉండడంతో ఈ ఆందోళనలలో కొన్ని తీవ్రతరంగా, హింసాత్మకంగా కూడ మారుతున్నాయి. వేలాది పత్రికలూ, వందలాది ఇరవై నాలుగు గంటల వార్తావాహినులూ కూడ పట్టుకోలేనంత పెద్ద ఎత్తున ఈ ప్రజాందోళనలు సాగుతున్నాయి. నిజానికి ఆ పత్రికల, టెలివిజన్ ఛానళ్ల యాజమాన్యాలకు ఈ ప్రజా ఆందోళనలను పట్టించుకోవాలనే కోరిక ఏమీ లేదు. ఆ కదలికలకు ప్రచారం ఇవ్వగూడదనే అభిప్రాయమే ఉంది. కాని వినక, వినిపించక తప్పని, నిత్యమూ వెలువడుతున్న వార్తలు అవే. ప్రజా ఆకాంక్షల పట్ల గౌరవంతో కాకపోయినా, సంచలనం కోసమో, ప్రజాదరణ కోసమో అయినా ఆ ప్రజాందోళనలకు పత్రికలలో, ఛానళ్లలో స్థానం దొరుకుతున్నది. మొత్తంగా జరుగుతున్న ప్రజాందోళనలలో ఇలా పత్రికలకూ ఛానళ్లకూ ఎక్కుతున్నవి సగం కూడ ఉండకపోవచ్చు. అవి కూడ హింసాత్మకంగా మారినప్పుడో, ప్రజల ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించినప్పుడో, ప్రజా జీవితం స్తంభించినప్పుడో మాత్రమే అరకొరగా ప్రచారంలోకి వస్తున్నాయి. ఆ అసమగ్ర చిత్రణను బట్టి చూసినా దేశమంతా ఎంతగా అగ్ని పర్వతంగా ఉన్నదో, బద్దలు కావడానికి సిద్ధంగా ఉన్నదో తెలుస్తుంది.

ఇలా ప్రజాందోళనలను కొద్దో గొప్పో ప్రాచుర్యానికి తెస్తున్న ఈ ప్రచార మాధ్యమాల దృష్టి కోణంతో కూడ ఒక సమస్య ఉంది. ఈ ప్రచార మాధ్యమాలకు మాత్రమే గాక, మామూలుగానే పరిశీలకులెవరికైనా ఘటనలే కనబడతాయి గాని క్రమాలు కనబడవు. ఘటనల గురించే మాట్లాడడం జరుగుతుంది గాని ఆ ఘటనకు దారితీసిన, ఆ ఘటన తర్వాత కొనసాగే క్రమాల గురించి చర్చ ఉండదు. ఎక్కువలో ఎక్కువ ఆ ఘటనకు తక్షణ కారణాల గురించీ, తక్షణ ప్రతిస్పందనల గురించీ చర్చ జరగవచ్చు గాని అంతకు మించిన సుదీర్ఘ, విశాల పరిణామాల గురించి చర్చ ఉండదు. ప్రజలకు సమస్య ఉండడమూ, ఆ సమస్య మీద ప్రజలలో ఆందోళన రగుల్కొనడమూ వార్త కావడం లేదు, ఆ ఆందోళన బహిరంగంగా వ్యక్తమయినప్పుడు మాత్రమే కొంతవరకు వార్త అవుతున్నది. ఆ ఆందోళన మీద ప్రభుత్వ బలగాలు హింసను ప్రయోగించినప్పుడు, ప్రజలు ప్రతిఘటనకు పూనుకున్నప్పుడు మరికాస్త పెద్ద వార్త అవుతున్నది. మర్నాటికల్లా అది మరపుకు కూడ గురవుతున్నది. ఆ ఆందోళనే మరొక సంచలనాత్మక ఘటనగా మారేదాక అలా విస్మృతిలోనే ఉండి పోతున్నది.

ఇలా క్రమం గురించి కాక ఘటన గురించి మాత్రమే పట్టించుకోవడం సాధారణంగానే మానవ గ్రహణేంద్రియాల సమస్య. మానవ గ్రహణేంద్రియాలు – కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం – ఘటనలనే, ఆకస్మికంగా జరిగినట్టు కనిపించే గుణాత్మకమైన మార్పునే గుర్తించగలవు గాని లోలోపల మెల్లమెల్లగా సాగే క్రమాన్ని గుర్తించజాలవు. నీరు వందో డిగ్రీ దగ్గర ఆవిరి కావడమే కనబడుతుంది గాని ఆ వంద డిగ్రీల వరకు సాగివచ్చే క్రమం గుర్తించదగినట్టుగా కనబడదు.

ఘటనల వెనుక ఉండే నేపథ్యాన్నీ, ఘటనల మధ్య ఉండే కార్యకారణ సంబంధాన్నీ, వాటి చరిత్రనూ తెలుసుకోవడానికి హేతుబద్ధ జ్ఞానమూ, భావనీకరించగలిగిన అవగాహనా కావలసి వస్తుంది. అవి లేని మనుషులను తయారు చేయడమే ఇవాళ పాలకవర్గ భావజాలం పని. ఆ పాలకవర్గ భావజాల ప్రచారసాధనాలు తప్పనిసరిగా క్రమాలతో, నేపథ్యంతో, చరిత్రతో, కార్యకారణ సంబంధాలతో పనిలేదన్నట్టుగా ఉత్తి ఘటనలనే ఎత్తి చూపుతాయి. ఆ ఘటనలకు ఒకదానితో మరొకదానికి సంబంధం లేనట్టు చూపుతాయి. ఆ ఘటన యాదృచ్ఛికమైనదన్నట్టు చూపుతాయి. నిన్న జరిగిన ఘటనను మరచిపోయినట్టూ, ఇవాళ్టి ఘటన దానికదిగా కొత్తదయినట్టూ చూపుతాయి. ఆ ఘటన చిత్రణలో కూడ మౌలికమైన మానవ సమస్యలకు, ఆకాంక్షలకు, ఉద్వేగాలకు స్థానం ఇవ్వకుండా, వాటికన్న ఎక్కువగా హింసాహింసల వంటి ఇతర అనుబంధ అంశాలమీదనే చర్చ జరుగుతుంది.

అలా పక్కదారి పట్టించదలచుకున్న ప్రచారసాధనాలలోనే ఇవాళ దేశంలో అసంఖ్యాకమైన ప్రజాందోళనల ఘటనలు కనబడుతున్నాయి. ఇన్నిన్ని ఘటనలు జరగడం యాదృచ్ఛికం కాదు. వాటి మధ్య ఏదో సంబంధం, వాటి వెనుక గుర్తించదగిన నేపథ్యం, వాటికి ప్రత్యేకమైన చరిత్ర ఉండే ఉంటాయి. ఇప్పటికయినా బుద్ధిజీవులు ఈ లక్షలాది ఘటనల వెనుక క్రమాన్నీ, కార్యకారణ సంబంధాలనూ, వాటి గతాన్నీ, వాటి పర్యవసానాలనూ గుర్తించవలసి ఉంది.

ప్రపంచ ప్రఖ్యాత నవలాకారుడు వి ఎస్ నయిపాల్ 1988-90 మధ్య భారతదేశంలో పర్యటించి, 1990లో ‘ఇండియా: ఎ మిలియన్ మ్యుటినీస్ నౌ’ (లక్షలాది తిరుగుబాట్ల వర్తమాన భారతదేశం) అనే పుస్తకం ప్రచురించాడు. ఆయన ఇతరంగా అంగీకరించలేని అభిప్రాయాలు ఎన్నో ప్రకటించినప్పటికీ, ఈ పుస్తకంలో భారత సమాజం ఎంత సంక్షుభితంగా ఉన్నదో చూపడానికి ప్రయత్నించాడు. బ్రిటిష్ వారిని వెళ్లగొట్టి సంపాదించుకున్న స్వాతంత్ర్యం ఒక రకమైన విప్లవమనీ, ఆ విప్లవం లోపల దాగిన అనేక విప్లవాలు ఇప్పుడు బయట పడుతున్నాయనీ ఆయన అన్నాడు. “సుదీర్ఘ కాలంగా నిద్రాణంగా ఉన్న మతం, కులం తెగ వంటి విచ్ఛిన్నకర ప్రత్యేకతలెన్నో ఇప్పుడు బయట పడి ముఠాతత్వాన్ని పెంచుతున్నాయి” అనీ, తత్ఫలితంగా “ముఠా, మత, ప్రాంత అతివాదాల వంటి ఇరవై రకాల బృంద అతివాదాల” మద్దతుతో “భారతదేశం లక్షలాది చిన్న తిరుగుబాట్ల దేశం”గా మారిందనీ ఆయన అన్నాడు. ఇంతకాలం విదేశీ పాలన వల్లనో, దారిద్ర్యం వల్లనో, అవకాశాల లేమి వల్లనో, నిస్సహాయత వల్లనో అణగిపోయిన ప్రత్యేకతలు ఇవాళ వెలికిరావడానికి పెనుగులాడుతున్నాయని ఆయన అన్నాడు. ఆ మాట రాసి ఇరవై ఏళ్లు గడిచాక ఆ “లక్షలాది తిరుగుబాట్లు” తగ్గలేదు సరిగదా, కోట్లాది తిరుగుబాట్లుగా మారాయి. మొత్తంగా నయిపాల్ విశ్లేషణతో ఏకీభవించలేకపోయినా ఇవాళ దేశంలో అశేష ప్రజానీకం తమ అస్తిత్వం కోసం, జీవనం కోసం, జీవన భద్రత కోసం, అభివృద్ధి కోసం పెనుగులాట సాగిస్తున్నదని ఆ పెనుగులాట అసంఖ్యాక, ఊహాతీత రూపాలు తీసుకుంటున్నదనీ మాత్రం అంగీకరించవచ్చు.

నిజానికి ఇటువంటి పెనుగులాట జరగడమే ఒక అద్భుతమైన విషయం. సమాజం నిలువనీరు లాగ లేదనీ, ప్రవాహంగా మారడానికి ప్రయత్నిస్తున్నదనీ, మారుతున్నదనీ ఈ పెనుగులాట చూపెడుతున్నది. ఇటువంటి పెనుగులాట యూరప్ లో పదిహేనో శతాబ్దం నుంచి పందొమ్మిదో శతాబ్దం దాకా జరిగి అక్కడ సమాజం కదలబారింది. బూర్జువా ప్రజాస్వామిక విప్లవాలు జరిగాయి, రాజరికాలు, భూస్వామ్య బంధనాలు కూలిపోయాయి. సామాజిక జీవితంలో, ఆలోచనలలో కొత్తగాలులు వీచాయి. భారత సమాజంలో మాత్రం ఇటువంటి పెనుగులాట జరగడానికే అనేక సామాజిక, చారిత్రక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అవరోధాలున్నాయి. ఆ అవరోధాల మధ్యనే దేశం లక్షలాది, కోట్లాది తిరుగుబాట్లకు నిలయంగా ఉన్నదంటే ఇక్కడ కూడ ఒక గొప్ప సామాజిక ప్రయోగం జరుగుతున్నదన్నమాట. ఒక మథనం జరుగుతున్నదన్నమాట. ఈ సామాజిక ప్రయోగాన్ని ఎంత సమగ్రంగా అర్థం చేసుకోగలిగితే, ఆ సామాజిక ప్రయోగాన్ని అడ్డుకోవడానికి పాలకవర్గాలు చేస్తున్న ప్రయత్నాలను గుర్తించగలిగితే, ఆ అవరోధాల పట్ల, పాలకవర్గాల ప్రయత్నాల పట్ల అంత పెద్ద ఎత్తున వ్యతిరేకత సాధ్యమవుతుంది.

అసలు ఈ ప్రజా ఉద్యమాలు ఇంత పెద్ద ఎత్తున ఎందుకు తలెత్తుతున్నాయో, వాటి మధ్య అంతస్సూత్రం ఏమిటో గుర్తించడం మొట్టమొదటి పని. ప్రజల కోరికలు, ఆకాంక్షలు, విన్నపాలు, నిరసనలు, కదలికలు, సంఘటిత కార్యాచరణలు, ఆందోళనలు, పోరాటాలు, ప్రతిఘటనలు, ఉద్యమాలు – ఇలా ఈ ప్రజాఉద్యమాలు అనేక రూపాలలో ఉన్నాయి, ఉంటున్నాయి. ఇవన్నీ ఒకే ప్రాంతంలో ఒకే స్థాయిలో జరుగుతూ ఉండకపోవచ్చు. ఎడతెరిపి లేకుండా నిరంతరం సాగుతూ ఉండకపోవచ్చు. కొంతకాలం ఉధృతంగా సాగి, మరికొంతకాలం మందకొడిగా ఉండవచ్చు. ఆ ప్రాంతంలోని అందరూ, ఆ సమస్య వల్ల బాధితులయిన వారందరూ ఆ ఉద్యమంలో పాల్గొంటూ ఉండకపోవచ్చు. కొంతకాలం చాల మంది పాల్గొని, మరికొంతకాలం భాగస్వామ్యం తగ్గిపోయి ఉండవచ్చు. ఒకే సమస్య మీద భిన్న భావజాలాల అనుయాయులు వేరువేరుగానో, ఐక్యంగానో ఆందోళన చేస్తూ ఉండవచ్చు. ఒక సమస్య మీద ఒక భావజాలపు బృందం ఆందోళన చేస్తున్నందువల్ల, మరొక భావజాల బృందం అది సమస్యే కాదని అంటూ ఉండవచ్చు. భారత సమాజంలోని సంక్లిష్టతవల్ల, శకలాలు శకలాలుగా విడిపోయిన సామాజిక స్థితి వల్ల ప్రజా ఉద్యమాలలో రావలసిన, రాదగిన ఐక్యత కూడ రాకుండా ఉండవచ్చు. ఆయా ప్రజా ఉద్యమాలు తమ ముందు పెట్టుకున్న లక్ష్యాలలో, వాటిలో పాల్గొంటున్న ప్రజాసమూహాల పొందికలో, అవి సాధిస్తున్న ఐక్యతలో, అవి ఎంచుకుంటున్న పోరాట రూపాలలో అవి విభిన్నంగా, వైవిధ్యపూరితంగా ఉండవచ్చు. ఇవన్నీ ఎట్లా ఉన్నా, ఇవాళ భారత సమాజంలో ఉద్యమంలో లేని వర్గమూ, మతమూ, కులమూ, ప్రాంతమూ, భాషా బృందమూ, వయో బృందమూ లేదనేది మాత్రం వాస్తవం.

అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, ఇవాళ భారత ప్రజానీకంలో అత్యధికులకు, వాల్ స్ట్రీట్ ముట్టడి ఉద్యమంలో చెప్పినట్టు 99 శాతానికి కాకపోయినా కనీసం 90 శాతానికి, తమ నిత్య జీవిత సమస్యలనుంచి భవిష్యత్ స్వప్నాల దాకా ఏ ఒక్క రంగంలోనైనా ఉద్యమానికి దిగక తప్పని స్థితి ఉందనేది, నిజంగానే ఉద్యమాలకు పూనుకుంటున్నారనేది వాస్తవం.

దేశంలోని ఒక్కొక్క రాష్ట్రం చూస్తూ వచ్చినా, ఒక్కొక్క ప్రజాసమూహం చూస్తూ వచ్చినా, ఆయా సమస్యలు చూస్తూ వచ్చినా  భారతదేశంలో ఉన్న వైవిధ్యమంతా ఈ ప్రజా ఉద్యమాలలో కూడ ఉన్నదని అర్థమవుతుంది. అటు చివరన కాశ్మీర్ లో జాతి విముక్తి పోరాటం నుంచి ఇటు చివరన కూడంకుళం అణువిద్యుత్ కేంద్రాన్ని తెరవగూడదనే ప్రజాందోళన దాకా, ఇటు చివరన జైతాపూర్ అణువిద్యుత్ కేంద్రానికి వ్యతిరేక ఆందోళన నుంచి అటు చివరన ఈశాన్య రాష్ట్రాలలో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఎత్తివేయాలనే ఆందోళన దాకా దేశవ్యాప్తంగా కొన్ని డజన్ల పెద్ద ప్రజా ఉద్యమాలు నడుస్తున్నాయి. తమ గ్రామానికి మంచినీటి సౌకర్యం కల్పించాలనే ఆందోళన నుంచి మొత్తం దేశాన్నే అర్ధభూస్వామ్య – అర్ధవలస స్థితి నుంచి విముక్తి చేసే నూతన ప్రజాస్వామిక విప్లవం సాధించాలనే ఉద్యమం దాకా ఎన్నో ఉద్యమాలు సమాంతరంగా నడుస్తున్నాయి. వీటిలో ఒక గ్రామానికో, ఒక ప్రాంతానికో ఉన్న నిత్య జీవిత సమస్యను తక్షణమే పరిష్కరించాలనే ఉద్యమాల నుంచి అసలు ఈ రాజకీయార్థిక, సాంఘిక వ్యవస్థను కూలదోసి నూతన వ్యవస్థను నిర్మించేవరకు ఈ దేశ ప్రజల సమస్యలకు పరిష్కారం లేదని నమ్మే ఉద్యమాల వరకు అనేక రకాల ఉద్యమాలు ఉన్నాయి. అంటే పాలకవర్గాలు తలచుకుంటే, రాజ్యాంగబద్ధంగానే, సామరస్య పూర్వకంగానే పరిష్కరించగల సమస్యల మీద ఉద్యమాల నుంచి, ఆ పాలకవర్గాలనే మార్చివేయదలచుకున్న ఉద్యమాల దాకా అన్నీ ఉన్నాయి.

ఆశ్చర్యకరంగా ఉద్యమాలలో ఇటు చివర నుంచి అటు చివరి వరకు, అంటే పాలకవర్గ సాధికారతను గుర్తించి, బలోపేతం చేయగల ఉద్యమాల నుంచి, అసలు ఆ సాధికారతను గుర్తించని, బలహీనం చేయగల ఉద్యమాల వరకు ఉండగా, పాలకవర్గాలు మాత్రం అన్ని ఉద్యమాలను ఒకే దృష్టితో, అనుమానంతోనే చూస్తున్నాయి. అన్నిటిపట్లా దమననీతినే అనుసరిస్తున్నాయి. ఇవాళ భారత పాలకవర్గాల దృష్టిలో తమను ప్రశ్నించేవారందరూ అణచివేయవలసిన వారేననే దృక్పథం పెరిగిపోయింది. ఇందుకు కారణం ఈ పాలకవర్గాలకు ప్రజలతో సంబంధం గతంలోకన్న చాల తగ్గిపోవడమే. ఈ పాలకవర్గాలలో భాగమైన భూస్వామ్య వర్గం గాని, దళారీ బడా బూర్జువా వర్గం గాని సామ్రాజ్యవాదంతో అంటకాగుతూ, ప్రతిదానికీ సామ్రాజ్యవాదం మీద ఆధారపడుతూ, సామ్రాజ్యవాదుల ప్రయోజనాలను తీర్చడంలోనే తమ మనుగడ ఉందని భావిస్తున్నాయి. కనుక వాటికి ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ తాము ప్రభుత్వాలు నడుపుతున్నామనీ, తాము ప్రజలకు జవాబుదారీగా ఉండాలనీ అనిపించడం లేదు. అసలు ఈ ప్రజలు తమ వాళ్లనీ, తాము ఈ దేశ ప్రజలలో భాగమనీ అనిపించడం లేదు. ప్రజలతో సామరస్య పూర్వకంగా వ్యవహరించవలసిన అవసరం కనబడడం లేదు. అదే సమయంలో పూర్తిగా సామ్రాజ్యవాదుల కీలుబొమ్మలుగా, తైనాతీలుగా, దళారీలుగా కనబడకుండా ఉండడానికి, స్థానిక పాలకవర్గాలుగా చలామణీ కావడానికి ఈ పాలకవర్గాలకు ఉపయోగపడే కులం, మతం వంటి భూస్వామ్య భావజాల పరికరాలు అందుబాటులో ఉన్నాయి.

దేశ ప్రజల ప్రయోజనాల పట్ల, దేశ వనరుల పరిరక్షణ పట్ల ఇంతగా నిర్లక్ష్యం ఉన్న, ఏ మాత్రం శ్రద్ధాసక్తులు లేని ఇటువంటి పాలకవర్గాల పాలనలో ప్రజల దైనందిన జీవితం సమస్యలమయం అయిపోవడం సహజమే. చారిత్రక, రాజకీయార్థిక, సామాజిక, సాంస్కృతిక కారణాల వల్ల సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న సమస్యలు కొన్ని అయితే, పాలనా విధానాల వల్ల రోజు రోజూ కొత్తగా తలెత్తుతున్న సమస్యలు కొన్ని. తగిన సమయంలో పరిష్కరించకపోవడం వల్ల తీవ్రతరంగా మారిన సమస్యలు కొన్ని అయితే, తప్పుడు పరిష్కారాల వల్ల కొత్త రూపాలు పొందిన సమస్యలు కొన్ని. పాలకులకూ ప్రజలకూ మధ్య వైరుధ్యం వల్ల తలెత్తే సమస్యలు కొన్ని అయితే, ప్రజల మధ్య వైరుధ్యం వల్ల తలెత్తి సవ్యమైన పరిష్కారం జరగనందువల్ల ముదిరిపోయిన సమస్యలు మరికొన్ని. అవన్నీ అలా ఉండగానే గత రెండు దశాబ్దాలుగా సాగుతున్న ప్రపంచీకరణ విధానాల పర్యవసానంగా ప్రజల జీవనానికీ, ఉపాధికీ, జీవన భద్రతకూ, మొత్తంగా దేశ భవిష్యత్తుకూ వచ్చి పడిన సమస్యలు మరెన్నో. ఇన్ని సమస్యలతో సతమతమవుతున్న దేశ ప్రజలు ఆ సమస్యల పరిష్కారం కోసం ఒకనాడు కాకపోతే ఒకనాడయినా ఆందోళనాపథం చేపట్టక తప్పదు.

సమస్యల వారీగానైనా, ప్రాంతాల వారీగానైనా, సామాజికవర్గాల వారీగానైనా దేశంలో ప్రస్తుతం ఎన్ని రకాల ప్రజా ఉద్యమాలు నడుస్తున్నాయో ఒక స్థూలమైన జాబితా అయినా చూడడం ఆసక్తిదాయకంగా ఉంటుంది.

దేశంలో ఇప్పటికీ మూడింట రెండు వంతుల జనాభా వ్యవసాయ, గ్రామీణ రంగాలలో ఉన్నారు గనుక వారి సమస్యల గురించి, ఆ సమస్యల పరిష్కారం కొరకు సాగుతున్న ఆందోళనల గురించి మొదట చెప్పుకోవాలి. ఇక్కడ కూడ మళ్లీ అసలు వ్యవసాయ జీవనపు పునాది సమస్యలను పరిష్కరించాలనే ఉద్యమాలూ ఉన్నాయి. అంత సుదీర్ఘ కాలం తీసుకునే పరిష్కారాలు కాకపోయినా, మధ్యంతర, తాత్కాలిక పరిష్కారాలు సాధించాలనే ఉద్యమాలూ ఉన్నాయి.

వ్యవసాయ రంగం మెరుగు పడడం, అభివృద్ధి చెందడం అంటే సాగుభూమి పెరగడం, వంగడాలు పెరగడం, ఉత్పాదకాలు పెరగడం, దిగుబడులు పెరగడం వంటి అంకెలలో పెరుగుదలలు కావు, వ్యవసాయం మీద ఆధారపడిన గ్రామీణ జనబాహుళ్యం జీవన పరిస్థితులు మెరుగుపడడం. వారి అవసరాలు తీర్చేలా, వారి ఆకాంక్షలు నెరవేరేలా, వారి నిత్యజీవితావసరాలు మాత్రమే కాక వినోద, విజ్ఞాన అవసరాలు తీర్చేలా వ్యవసాయరంగం మారడం. అది జరగాలంటే  మౌలికంగా భూసంబంధాలు మారాలనీ, భూయాజమాన్యంలో మార్పులు రావాలనీ, నిజమైన భూసంస్కరణలు అమలు జరగాలనీ, ఇతర ఉపాధి అవకాశాలు ఉన్న వారికి భూమి మీద యాజమాన్యం ఉండగూడదనీ, దున్నేవారికే భూమి అనే ప్రాతిపదిక మీద భూసంస్కరణలు జరిగి, రైతాంగానికి వ్యవసాయాభివృద్ధికి అవసరమైన అన్ని సౌకర్యాలూ కల్పించాలనీ కోరే ఉద్యమాలు వ్యవస్థ మార్పు అనే దీర్ఘకాలిక పరిష్కారం కోరుతున్నాయి. ఆ ఉద్యమాలన్నీ స్థూలంగా నక్సల్బరీ పంథా విప్లవోద్యమానికి చెందినవి.

ఆ ఉద్యమాలకు సమాంతరంగా మెరుగైన వ్యవసాయం కోసం, వ్యవసాయ రంగ తక్షణ అభివృద్ధి కోసం, రైతు కూలీల జీవనస్థితిగతుల మెరుగుదల కోసం సాగుతున్న ఉద్యమాలు కూడ ఉన్నాయి. అవి చౌకధరలకు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, నీటిపారుదల సౌకర్యాలు, విద్యుత్ సౌకర్యాలు, రుణ, పరపతి సౌకర్యాలు, శాస్త్రీయ ప్రయోగాల మద్దతు కల్పించాలనే ఉద్యమాలు కావచ్చు. అతివృష్టి, అనావృష్టి పరిస్థితులలో రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలనే ఉద్యమాలు కావచ్చు. వ్యవసాయ కూలీల జీవన ప్రమాణాలకు పెంచడానికి తగినట్టుగా కూలిరేట్లు పెరగాలనే ఉద్యమాలు కావచ్చు. రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు, మార్కెట్ సౌకర్యాలు కావాలనే ఉద్యమాలు కావచ్చు. గ్రామీణ ప్రజల కూడు, గుడ్డ, నీడ అవసరాల కొరకు జరిగే ఉద్యమాలు కావచ్చు. ఇవన్నీ కూడ ఆయా సమయాలను బట్టి తలెత్తి, కాలం మారగానే, లేదా ప్రభుత్వం నుంచి ఏవో హామీలో, చిన్నపాటి సహాయాలో అందగానే ఆగిపోవచ్చు. ఈ గ్రామీణ, వ్యవసాయాధార ప్రజానీకపు ఆందోళనా స్థితికి నిదర్శనంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతుల ఆత్మహత్యలను చూడవచ్చు. కొన్ని ప్రాంతాల్లో, కొంతమంది ఆందోళనా పథం చేపడుతుండగా, మరికొన్ని ప్రాంతాలలో రైతాంగం నిస్సహాయతలో ఆత్మహత్యలకు పూనుకుంటున్నారంటే వారంతా ఆందోళనా పథం చేపట్టగల అవకాశం ఉన్నవారేనని అర్థం చేసుకోవాలి.

ఇక గ్రామీణ ప్రాంత జనాభాలోనే పూర్తిగా వ్యవసాయాధారంగా లేక, కొంతవరకు చేతివృత్తులమీద ఆధారపడి, ప్రస్తుతం వాటికి ఆదరణ కరువై జీవనోపాధి పోగొట్టుకుంటున్న కులాలు, సామాజిక బృందాలు కనీసమైన మనుగడ కొరకు వేరు వేరు రూపాల ఆందోళనలకు పూనుకుంటున్నాయి. ఇటువంటి చేతివృత్తి వారిలో ప్రధానంగా చేనేత కార్మికులు దేశవ్యాప్తంగానే ఆందోళనలకూ దిగుతున్నారు, ఆత్మహత్యలకూ పాల్పడి వార్తలకెక్కుతున్నారు.

మొత్తం దేశంలో సవ్యమైన పారిశ్రామికీకరణ జరగనప్పటికీ, గణనీయమైన జనాభా ఇంకా పారిశ్రామిక రంగంలోకి ప్రవేశించనప్పటికీ, పారిశ్రామికరంగంలో ఉన్న తక్కువ జనాభా కూడ అనేక సమస్యలతో ఉంది. మన పారిశ్రామిక రంగంలో పెద్దఎత్తున అసంఘటిత రంగం ఉండడం, సంఘటిత రంగం కూడ ఇంకా పెట్టుబడిదారీ పూర్వ సంబంధాలతోనే ఉండడం వల్ల ఈ రంగంలో సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మెరుగైన పారిశ్రామిక వ్యవస్థ కోసం కార్మికవర్గం సాగిస్తున్న ఆందోళనలు జీతాల పెంపుదల కోసం, పని పరిస్థితుల మెరుగుదల కోసం సాగిస్తున్న పోరాటాలుగా వ్యక్తమవుతున్నాయి. మారుతి సుజుకి  కార్ల తయారీ కర్మాగారంలో సమ్మె నుంచి బ్యాంకింగ, బీమా, విమానయాన సిబ్బంది సమ్మెల దాకా జరుగుతున్న, జరిగిన కార్మిక ఆందోళనలు ఏ ఒక్క పారిశ్రామిక రంగమూ సవ్యంగా లేదని చూపుతున్నాయి. మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో భాగంగా ప్రారంభించిన ప్రభుత్వ రంగాన్ని నానాటికీ బలహీనం చేస్తూ ప్రైవేటు లాభాపేక్షాపరులకు అప్పగించడం, కొత్త పరిశ్రమలను పూర్తిగా బహుళజాతి ప్రైవేటు కంపెనీలకే అప్పగించడం, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పేరుతో ప్రైవేటీకరణకు తలుపులు బార్లా తెరవడం వంటి అనేక కార్మిక వ్యతిరేక కార్యక్రమాలు కార్మికులలో నిరసనను, ప్రతిఘటనను రేకెత్తిస్తున్నాయి. సంఘటిత కార్మిక సంఘాలు ఈ నిరసనను, ప్రతిఘటనను వాడుకుని ఉద్యమాలు సృష్టించడానికి సిద్ధంగా లేకపోవడం వల్ల యాజమాన్యాల కుట్రలు కొనసాగుతున్నాయి గాని ఇవాళ దేశ పారిశ్రామిక రంగం ఉద్యమాల నిప్పురవ్వ పడితే భగ్గున మండగలిగిన స్థితిలో ఉంది.

అలా ప్రధానంగా వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో ఉన్నవారు ఎదుర్కొంటున్న ప్రత్యేక సమస్యలు కాక వారూ, ఇతరులూ కూడ ఎదుర్కొంటున్న నిత్యజీవిత సమస్యలూ, ఆ సమస్యలపై పోరాటాలూ కూడ ఎన్నో ఉన్నాయి. రోజురోజుకూ పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరల గురించి ఆందోళన చెందని మనిషి లేరు. కనీసం కొన్ని సందర్భాలలోనైనా ఆ ఆందోళన బహిరంగంగా వ్యక్తమవుతున్నది. అలాగే తమ ప్రాంతంలో మంచినీరు లేదని, రహదారి సరిగా లేదని, రవాణా సౌకర్యాలు సరిగా లేవని, పారిశుధ్య సౌకర్యాలు లేవని, వైద్య, ఆరోగ్య సౌకర్యాలు లేవని, విద్యుత్ సరఫరా సరిగా లేదని, విద్యుత్ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయని, పాలకుల, వారి మద్దతు ఉన్న పెత్తందారుల, గూండాలు ఆగడాలు మితిమీరాయని,  ఒక ఆధునిక ప్రజాస్వామిక దేశంలో పౌరులుగా తాము రాజ్యాంగబద్ధమైన హక్కుగా, న్యాయంగా పొందవలసిన సౌకర్యాలు కూడ పొందడం లేదని దేశవ్యాప్తంగా ప్రజలు దాదాపు ప్రతిచోటా ఆందోళన పడుతూనే ఉన్నారు. ఆ ఆందోళనలలో కొన్నయినా సంఘటిత, ప్రతిఘటనా రూపాలు పొందుతున్నాయి.

అలాగే చారిత్రకంగా, సామాజికంగా మత సమూహాల మధ్య, కుల సమూహాల మధ్య, ప్రాంతాల మధ్య ఉన్న అంతరాల వల్ల ఏర్పడుతున్న సమస్యలు, ఆ సమస్యలను తీర్చడంలో పాలకులు అవలంబిస్తున్న నిర్లక్ష్యం, అలసత్వం కూడ ఆయా సమూహాల ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వలసానంతర భారతదేశం రూపొందిన పద్ధతిలో ఆయా జాతుల ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా  జాతుల బందిఖానాగా మారిపోయినందువల్ల అప్పటినుంచి ఇప్పటివరకూ కొనసాగుతున్న జాతి విముక్తి ఉద్యమాలు ఉన్నాయి. రాష్ట్రాల ఏర్పాటు గాని, పాలనాపరమైన వ్యవస్థల ఏర్పాటు గాని ప్రజల ఆమోదం లేకుండా పైనుంచి జరగడం, భాషా, సాహిత్య, సాంస్కృతిక రంగాలలో దేశం మొత్తం మీద గుత్తాధిపత్యం సాగడం ప్రజలలో ఆందోళనను రేకెత్తించి, ఏదో ఒక సమయంలో ఎక్కువమంది పాల్గొనే ఉద్యమాలుగా మారుతున్నాయి. ఇటువంటి ఉద్యమాలు చాల చోట్ల ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి ఎడతెగకుండా సాగుతున్నాయి. పాలకవర్గాలు కనీసం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి లౌకికతత్వాన్ని పాటిస్తే, వెనుకబడిన కులాలకు, బృందాలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తే, ప్రజా ఆకాంక్షలను గౌరవించే పాలనాపరమైన నిర్ణయాలు తీసుకుంటే ఇటువంటి ప్రజా ఆందోళనలను కొంతవరకు తీర్చవచ్చు. కాని పాలకవర్గాలు ఆ మాత్రం ప్రజానుకూలతను కూడ చూపడం లేదు.

పైన చెప్పిన సమస్యలన్నిటికి మూలాలు కొంతవరకు చరిత్రలోను, సామాజికంగాను ఉండగా, స్వయంగా పాలనా విధానాల వల్ల, పాలక నిర్ణయాల వల్ల తలెత్తుతున్న సమస్యలు, ప్రజలను ఆందోళనా పథంలోకి నెడుతున్న సమస్యలు మరెన్నో ఉన్నాయి. పాలనావ్యవస్థలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోవడం వల్ల ఆ సమస్యను ఎక్కువగా గుర్తిస్తున్న మధ్యతరగతి కూడ ఆందోళనా పథం చేపట్టింది. గత రెండు దశాబ్దాలలో ప్రపంచీకరణ విధానాల పర్యవసానాలుగా ప్రజల జీవితాలను కొల్లగొడుతూ ఉద్యమాలవైపు తోస్తున్న పరిణామాలు ఎన్నో ఉన్నాయి. దేశంలోని అపారమైన భూ, జల, అటవీ, ఖనిజ వనరులను బహుళజాతి సంస్థలకు, దేశదేశాల సంపన్నులకు దోచిపెట్టే ఏకైక కార్యక్రమంలో మునిగి ఉన్న పాలకులు ఆ పని కోసం ప్రజలను పెద్ద ఎత్తున తమ నివాస స్థలాల నుంచి, భూముల నుంచి, అడవుల నుంచి విస్థాపన చేస్తున్నారు, గనుల తవ్వకం, ప్రత్యేక ఆర్థిక మండలాలు, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, విద్యుదుత్పత్తి కేంద్రాలు, మహా రహదారులు, విమానాశ్రయాలు, ఓడరేవులు, వికృతమైన పట్టణీకరణ వంటి కార్యక్రమాల కొరకు లక్షల ఎకరాల భూముల నుంచి లక్షలాదిగా ప్రజలను నిర్వాసితులను చేస్తున్నారు. ప్రకృతిని, పర్యావరణాన్ని, ప్రజలకూ ప్రకృతికీ మధ్య సమన్వయాన్ని గౌరవించని, అతి లాభార్జనాకాంక్షతో ప్రతిదాన్నీ మితిమీరి, విచ్చలవిడిగా, అరాచకంగా దోపిడీ చేసే పెట్టుబడిదారీ నమూనాను పాటించడం వల్ల పర్యావరణ విధ్వంసం జరుగుతూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నది. పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలు కూడ నానాటికీ పెరుగుతున్నాయి. ఇవేమీ పట్టించుకోని పాలకులు ప్రజావ్యతిరేకమైన పాత చట్టాలను అమలు చేస్తూ, కొత్త చట్టాలు ప్రవేశపెడుతూ, అభివృద్ధి మాయాజాలంతో ఒక ప్రజా కంటక అభివృద్ధి నమూనాను దేశం మీద రుద్దుతున్నారు. ఈ అభివృద్ధి నమూనా లక్షలాది కుటుంబాల మనుగడను, ఉపాధిని, భవిష్యత్తును రద్దు చేయబోతున్నది గనుక అది మరింత పెద్ద ఎత్తున ప్రత్యక్షంగా ఆందోళనలకు, ఉద్యమాలకు దారి తీస్తున్నది.

ఇది దేశవ్యాపిత దృశ్యం కాగా, రాష్ట్రంలో దృశ్యం ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఉత్తరాంధ్రలో బాక్సైట్ ఖనిజ తవ్వకాలకు, థర్మల్, అణు విద్యుదుత్పత్తి కేంద్రాలకు వ్యతిరేకంగా, మత్స్యకారుల జీవనాన్ని కొల్లగొడుతూ తీరప్రాంతాలను బహుళజాతి సంస్థలకు, బడాపెట్టుబడిదారుల ఓడరేవులకు అప్పగించడానికి వ్యతిరేకంగా, ఆదివాసులను ముంపుకు గురిచేస్తూ నిర్మించబోతున్న పోలవరం ఆనకట్టకు వ్యతిరేకంగా, కోస్తా జిల్లాలలో సంపన్నమైన వరిపొలాలను పెట్రో కెమికల్ పరిశ్రమలకు అప్పగించే కోస్తా కారిడార్ కు వ్యతిరేకంగా, గిట్టుబాటు ధరలకు హామీనివ్వని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, రాయలసీమలోనూ, తెలంగాణలోనూ గనుల తవ్వకాలకు వ్యతిరేకంగా, కొండలను కొల్లగొట్టడానికి వ్యతిరేకంగా, పరిశ్రమల మూసివేతకు వ్యతిరేకంగా, షెడ్యూల్డ్ కులాల జాబితాలో వర్గీకరణను అమలు చేయాలని కోరుతూ, మైనారిటీలకు రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ సాగుతున్న పెద్ద ఉద్యమాలు డజనుకు పైగానే ఉన్నాయి. స్కాలర్ షిప్పులు, ఫీజుల రియింబర్స్ మెంట్ వంటి విద్యార్థి సమస్యల దగ్గర ప్రారంభించి 104, 108 సర్వీసులను కొనసాగించాలనే ఆందోళన వరకు ఎన్నో ఆందోళనలు కూడ ఉన్నాయి.

ఈ మొత్తం సామాజిక చిత్రపటం మనకు చూపుతున్నదేమంటే, ఇవాళ దేశంలోని నూట ఇరవై కోట్ల ప్రజలలో నూట పదికోట్లకు పైచిలుకు ప్రజలు ఏదో ఒక సమస్యతో, చిన్నదో పెద్దదో ఆందోళనతో ఉన్నారు. లేదా ఆందోళన జరపవలసిన స్థితిలో ఉన్నారు. నిన్నటివరకూ వీథుల్లోకి రావడానికి నామోషీ పడినవాళ్లు, రాని వాళ్లు కూడ ఇవాళ వీథుల్లోకి రాకతప్పదని భావిస్తున్నారు. కనుక ఈ ప్రజా ఉద్యమాల వెల్లువ రోజురోజుకూ మరింత పెరిగేదే గాని తగ్గేది కాదు. తప్పనిసరిగా భవిష్యత్తు ప్రజా ఉద్యమాలదే.

ఇంత విశాలమైన, సమగ్రమైన సామాజిక స్థాయిలో ప్రజా ఉద్యమాలు జరుగుతుంటే ప్రజల పేరుతో నడుస్తున్న ప్రభుత్వాలు, ప్రజలకు జవాబుదారీగా ఉండవలసిన పాలకవర్గాలు ఆ ప్రజా ఆకాంక్షల పట్ల ఎట్లా ప్రతిస్పందిస్తున్నాయి? ప్రజా ఉద్యమాలలో ఇంత విస్తృతీ, వైవిధ్యమూ ఉండగా ప్రభుత్వ ప్రతిస్పందన మాత్రం ఒకేవిధంగా ఉంటున్నది. కేవలం భద్రతా బలగాలను – పోలీసులను, పారా మిలిటరీ బలగాలను, సైన్యాన్ని, ప్రైవేటు సైన్యాలను – ఉపయోగించి ఉద్యమాలను అణచివేయగలనని, ఉద్యమకారుల నోరు మూయించగలనని, ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించనక్కరలేదని పాలకవర్గాలు అనుకుంటున్నాయి. ఏవో కొన్ని ఉద్యమాల విషయంలో బుజ్జగించడానికి, నాయకత్వాన్ని కొనివేయడానికి, పాలకవర్గ ముఠాలనే ఆ ఉద్యమాల నాయకత్వ స్థానంలో కూచోబెట్టడానికి, ఉద్యమాలలో చీలికలు తేవడానికి పాలకులు ప్రయత్నించి విజయం సాధించినట్టు కనబడుతున్నారు. అయితే ఆ విజయం తాత్కాలికం మాత్రమే. సమస్యలు నిజంగా పరిష్కారం కాకపోతే ఆ ఉద్యమాలలో పాల్గొనే ప్రజలే బుజ్జగింపులను తోసిరాజంటారు. అమ్ముడుపోయిన నాయకత్వాన్ని తిరస్కరిస్తారు, చీలికలను అధిగమించి ఐక్యత సాధిస్తారు. అందుకు ఆలస్యం కావచ్చుగాని అటువంటి పద్ధతుల ద్వారా ప్రజా ఉద్యమాలను రద్దు చేయడం సాధ్యం కాదు. నాయకత్వాలను హత్య చేయడం ద్వారా, పాల్గొనే శ్రేణుల మీద క్రూర నిర్బంధాన్ని అమలు చేయడం ద్వారా భయభీతావహం సృష్టించి ఉద్యమాల నుంచి ప్రజలను దూరం చేయాలని పాలకులు ప్రయత్నిస్తున్నారు.

ప్రజా ఉద్యమాలతో వ్యవహరించేటప్పుడు అన్ని పద్ధతులనూ వదిలి బలప్రయోగానికి, హింసకు మాత్రమే పాల్పడడం  భారత పాలకవర్గాలకు మొదటినుంచీ అలవాటే. ప్రత్యర్థులతో పాలకులు ఏడు పద్ధతులలో వ్యవహరించాలని ప్రాచీన భారతీయ రాజనీతిలో పదే పదే చెప్పారు. వాటిలో సామ (చర్చ, సామరస్యం), దాన (ధన సహాయం, లంచం), భేద (ప్రత్యర్థుల మధ్య విభేధాలు సృష్టించి చీలదీసి బలహీనపరచడం), దండ (బలప్రయోగం, హింస, నిర్బంధం, అణచివేత) అనే నాలుగు పద్ధతులు ఎక్కువ ప్రచారంలో ఉన్నాయి. అవి కాక మాయ (పరిష్కరిస్తున్నామనే భ్రమ కల్పించడం), ఉపేక్ష (పట్టించుకోకుండా ఉండడం), ఇంద్రజాల (మాటల గారడీతో బోల్తా కొట్టించడం) అనే మరో మూడు పద్ధతులు కూడ ఉన్నాయి. ఈ పద్ధతులను ‘అర్థశాస్త్రం’లో వివరించిన కౌటిల్యుడు అన్నిటిలోనూ దండనీతికే ప్రథమస్థానం ఇచ్చాడు. కౌటిల్య రాజ్యతంత్రాన్ని పుణికి పుచ్చుకున్న భారత రాజ్యం కూడ మొదటి నుంచీ ప్రథమ స్థానాన్ని దండోపాయానికీ హింసకూ బలప్రయోగానికీ దమనకాండకూ ఇస్తూ వస్తోంది. దాన, భేద, మాయా, ఉపేక్షా, ఇంద్రజాల పద్ధతులు కూడ కొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తున్నప్పటికీ, శాంతి సామరస్యాలతో కూడిన సామ పద్ధతి ఎంత మాత్రమూ లేదు.

అందుకే చాల చిన్న సమస్యల మీద సాగుతున్న ఆందోళనల మీద కూడ, విద్యార్థులు, మహిళలు, వికలాంగులు వంటి వర్గాల ఆందోళనల మీద కూడ పాలకులు దమనకాండకే దిగుతున్నారు. రాజ్యాంగబద్ధమైన కోరికలను తీర్చమని అడుగుతున్న ఉద్యమాల మీద, చివరికి పాలకులు చేసిన వాగ్దానాలను అమలు చేయాలని కోరుతున్న ఉద్యమాల మీద కూడ ప్రభుత్వ బలగాలు దమనకాండ సాగిస్తున్నాయి. శాంతియుతమైన నిరసన తెలిపే ప్రదర్శనకారులమీద లాఠీఛార్జీలు, బాష్పవాయు ప్రయోగాలు, రబ్బరు బులెట్ల కాల్పులు, తుపాకి కాల్పులు, అక్రమ నిర్బంధాలు, చిత్రహింసలు, తప్పుడు కేసులు సర్వసాధారణమై పోయాయి. ఇక వ్యవస్థనే మార్చే ఉద్దేశంతో సాగే ఉద్యమాల మీద, మౌలిక ఆకాంక్షల మీద జరిగే ఉద్యమాల మీద, పాలకవిధానాలను అడ్డుకునే ఉద్యమాల మీద అమలు చేస్తున్న క్రూర మారణ కాండ గురించి చెప్పనే అక్కరలేదు. అక్రమ నిర్బంధాలు, తప్పుడు కేసులు, చిత్రహింసలు, ఎన్ కౌంటర్ల పేరిట హత్యలు, మిస్సింగులు, కోవర్ట్ హత్యలు, బాంబుదాడులు కూడ దాటిపోయి మానవరహిత విమానాల ద్వారా సమాచార సేకరణ, బాంబుదాడులు, సైనిక, వైమానిక దళాల వినియోగం, ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో యుద్ధం సాగుతున్నాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ ఈ దేశంలో ప్రభుత్వమే అంతర్యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నది. సిద్ధాంతరీత్యా తటస్థంగా ఉండవలసిన ప్రభుత్వం తన ముసుగులన్నీ విప్పేసి సాగుతున్న వర్గపోరాటంలో తాను ప్రజావ్యతిరేక పక్షాన ఉన్నట్టు చూపుకుంటున్నది.

మరి అన్ని రకాల ప్రజా ఉద్యమాల పట్ల ప్రభుత్వ స్పందన ఇటువంటి దమన నీతి మాత్రమే అయినప్పుడు ప్రజా ఉద్యమాలు ఏమి చేయవలసి ఉంటుంది? ప్రభుత్వం పాలకవర్గాల తరఫున ప్రజలమీద యుద్ధం ప్రారంభించినప్పుడు ప్రజలు ఆ యుద్ధాహ్వానాన్ని తీసుకుని తమ శక్తులను సంఘటితం చేసుకుని తమ విడివిడి ఉద్యమాలను ఏకం చేసుకుని బలోపేతం చేసుకోక తప్పదు. విడివిడిగా ఉన్న తమమీద దుర్మార్గమైన దాడి చేస్తున్న ప్రభుత్వాన్ని, పాలకవర్గాలను ఓడించాలంటే, తమ ఆకాంక్షలు నెరవేర్చుకోవాలంటే ప్రజా ఉద్యమాలన్నీ ఐక్యం కాక తప్పదు. నిజానికి అన్ని ప్రజా ఉద్యమాలు ఐక్యమయినప్పుడు వాటిని ఎదిరించడానికి పాలకవర్గ బలం సరిపోదు. వాల్ స్ట్రీట్ ఉద్యమకారులు చెపుతున్నట్టు అటువైపు ఉన్నది ఒక్కశాతం, ఇటువైపు ఉన్నది తొంబైతొమ్మిది శాతం.

అయితే ఆ తొంబై తొమ్మిది శాతం – లేదా కనీసం తొంబై శాతం – చిత్తశుద్ధితో తమ ఆకాంక్షలు నెరవేర్చుకోదలచుకుంటే, తమ స్వప్నాలు సఫలం కావాలనుకుంటే ఏకం కావడం మొదటి షరతు. కాని భారత సమాజపు చీలికల నేపథ్యంలో అటువంటి ఐక్యత రాత్రికి రాత్రి ఆకాశం నుంచి ఊడిపడదు. ఆ ఐక్యత సాధించే దిశలో సుదీర్ఘకాలం ఓపికగా ఎంతో కృషి చేయవలసి ఉంటుంది. అందుకొరకు ప్రజా ఉద్యమాలన్నీ, ఉద్యమ నిర్మాణాలన్నీ మొదట ఒకరితో ఒకరు సంఘీభావం ప్రదర్శించడం మొదలుపెట్టాలి, తమ ఉద్యమాల మధ్య సమన్వయం సాధించుకోవాలి. వీలయిన కనీస కార్యక్రమాలలోనైనా ఐక్య కార్యాచరణకు సిద్ధపడాలి. భారత పాలకవర్గాలు, వాటికి ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వాలు తామందరికీ ఉమ్మడి శత్రువు అనే అవగాహన కల్పించుకుని ఆ శత్రువును చికాకుపరచడానికి, బలహీన పరచడానికి ఉన్న అన్ని అవకాశాలను వాడుకోవాలి. ఆ క్రమంలో అన్ని ప్రజా ఉద్యమాల మధ్య ఏర్పడే విశాల ఐక్య సంఘటన మాత్రమే భావి భారతదేశంలో ఏయే ప్రజా సమూహాల ఏయే ఆకాంక్షలు ఎట్లా తీరుతాయో భవిష్య దృష్టి ప్రకటించి నిజమైన ఐక్యతను సాధించగలదు. నిజమైన విజయం సాధించగలదు. తమ దేశవనరులు తమకే చెందాలని, తమ శ్రమ ఫలితం తమకే దక్కాలని, తమ నేలమీద తాము ఆత్మగౌరవంతో తలెత్తుకుని, సర్వతోముఖ అభివృద్ధి సాధించాలని అశేష భారత పీడిత ప్రజానీకం శతాబ్దాలుగా కంటున్న కల అప్పుడు మాత్రమే నిజమవుతుంది.

About ఎన్.వేణుగోపాల్ N Venugopal

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues.
This entry was posted in వ్యాసాలు, Veekshanam. Bookmark the permalink.

2 Responses to ప్రజా ఉద్యమాలు – పాలకుల స్పందన

  1. Alapati Ramesh Babu says:

    sir, please increase your font size. very difficult to read.

  2. Ranjith B says:

    Hi,

    Hope font size now helps, I cannot go more than this.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s