ఈభూమి జనవరి 2012 సంచిక కోసం
రవి అస్తమించని సామ్రాజ్యంగా పేరు తెచ్చుకున్న బ్రిటిష్ సామ్రాజ్యం అంతరించింది. ఆ తర్వాత రవి అస్తమించని బహుళ జాతి సంస్థల సామ్రాజ్యంగా సాగుతున్న భూగోళం ఇవాళ రవి అస్తమించని సంక్షోభ ప్రపంచంగా ఉన్నది. ఈ సంవత్సరం దాదాపు ప్రతి దేశ ఆర్థిక వ్యవస్థలోనూ చిన్నవో పెద్దవో ఆర్థిక సంక్షోభాలు తలెత్తాయి. భారీ సంక్షోభాలు మాత్రమే లెక్కించాలంటే యూరో జోన్ సంక్షోభం కనీసం అరడజను దేశాలను అల్లకల్లోలం చేసింది. స్వయంగా సర్వంసహాచక్రవరి అమెరికా పరపతి యోగ్యతలో తన స్థానం నుంచి దిగజారింది. అభివృద్ధి చెందిన దేశాలన్నిటిలోనూ నిరుద్యోగం ప్రబలింది. వృద్ధి రేటు తగ్గింది. మూలిగేనక్క మీద తాటి పండు పడ్డట్టు జపాన్ ఆర్థిక వ్యవస్థను భూకంపం, తుపాను మరింత దిగజార్చాయి. ఈ అన్ని దేశాల స్టాక్ మార్కెట్లు సంవత్సరమంతా ఒడిదుడుకులలో సాగాయి. ఈసంక్షోభాల ఫలితంగా కనీసం ఇద్దరు ప్రధాన మంత్రులు పదవీచ్యుతులయ్యారు. ప్రభుత్వాలు మారిపోయాయి. పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానమే మౌలికంగా సంక్షోభానికి వనరు అనే రాజకీయార్థిక శాస్త్ర పాఠాలు మరొకసారి రుజువయ్యాయి.
అమెరికాలో గృహ రుణ సంక్షోభంగా 2008లో బయటపడిన సంక్షోభం నిజానికి పూర్తిగా సమసిపోలేదు. అది ఆ తర్వాత రెండు సంవత్సరాలు ఇతరేతర రూపాలలో వ్యక్తమవుతూ వచ్చి, 2011 నాటికి ప్రపంచవ్యాపిత సంక్షోభంగా మారింది. దీన్ని మాంద్యం అనాలా, సంక్షోభం అనాలా, వ్యాపార వలయం అనాలా, ఇది త్వరలోనే సమసిపోయి మళ్లీ పాలూ తేనే ప్రవహిస్తాయా అని వాణిజ్య పత్రికల సంపాదకీయాలూ, అర్థశాస్త్రవేత్తలూ చర్చోపచర్చలు సాగిస్తున్నారు. ఒక్క యూరో జోన్ సంక్షోభం మీదనే, గడిచిన ఏడెనిమిది నెలలలోనే ప్రపంచవ్యాప్తంగా పత్రికలలో పదిహేను లక్షల వ్యాఖ్యలు వెలువడ్డాయని అంచనా వేస్తున్నారంటేనే ఆలోచనాపరులను ఆ సమస్య ఎంతగా కదిలించిందో అర్థమవుతుంది. మొత్తం సంక్షోభంలో ఈ యూరోజోన్ సంక్షోభం ఒకానొక చిన్న భాగం మాత్రమే. ఈ వ్యాఖ్యలలో ఎక్కువభాగం సంక్లిష్టమైన సాంకేతిక పరిభాషతో నిండి ఉంటాయి గనుక సాధారణ పాఠకులెవరూ మామూలుగా వాటిని చదవరు. కాని ఆ సంక్షోభం ప్రపంచాన్నంతా చుట్టుముడుతున్నది గనుక, ప్రతి మనిషీ జీవితం మీదా ప్రభావం వేయనున్నది గనుక ప్రతి ఒక్కరూ ఈ సంక్షోభం గురించి అర్థం చేసుకోవాలి.
స్వయంగా ఒక అమెరికన్ ప్రభుత్వ నివేదికే చెప్పినట్టు ఈ సంక్షోభం సహజమైన ఉత్పాతం కాదు. ఇది కొన్ని ఉద్దేశ్యపూర్వక చర్యల ఫలితం. “అత్యంత ప్రమాదకరమైన, సంక్లిష్టమైన ఆర్థిక లావాదేవీలు జరిపినందువల్ల ఇది ఏర్పడింది. నిజమైన ప్రయోజనాలను, ఆ ప్రయోజనాల మధ్య ఘర్షణలను దాచిపెట్టినందువల్ల ఇది ఏర్పడింది. స్వార్థ ప్రయోజనాల కోసం ద్రవ్య వ్యాపారులు, ముఖ్యంగా వాల్ స్ట్రీట్, సాగించిన విచ్చలవిడి చర్యలను అదుపుచేయడంలో నియంత్రణాధికార వ్యవస్థలు, క్రెడిట్ రేటింగ్ సంస్థలు, మొత్తంగా మార్కెట్ విఫలమైనందువల్ల ఈ సంక్షోభం తలెత్తింది” అని ఆ నివేదిక రాసింది. ఈ నివేదిక 2011 సంక్షోభం గురించి మాట్లాడడం లేదు గాని ఈ సంక్షోభానికి దారితీసిన పాత సంక్షోభ కారణాలను అన్వేషించే క్రమంలో అసలు మౌలిక కారణాలలో కొన్నిటినైనా పేర్కొంది.
అత్యంత ప్రమాదకరమైన, సంక్లిష్ట ఆర్థిక లావాదేవీలు అనే మాట ఇక్కడ కీలకమైనది. ఇవాళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్నది ఈ ప్రమాదకరమైన, సంక్లిష్టమైన ఆర్థిక లావాదేవీలే. హామీ లేని, ధరావత్తులేని రుణాలు ఇవ్వడం, ఆ రుణ పత్రాలను తాకట్టు పెట్టి డబ్బు పొందగల అవకాశం కల్పించడం, భవిష్యత్తు ఉత్పత్తిని ఊహించి, దాని మీద రాగల ఆదాయం ఊహించి, దాని మీద జూదం లాంటి వ్యాపారం నడపడం, సాధారణ ప్రజల, వృద్ధుల నిలువ సొమ్మును ఈ జూద కార్యకలాపాలకు వాడడం, సంస్థలను, దేశాధినేతలను, ప్రభుత్వాలను చెప్పుచేతల్లో ఉంచుకోవడానికి రుణాలు ఇవ్వడం, ఆ రుణాల మీద వడ్డీలు కొన్ని సంవత్సరాలలోనే అసలును మించిపోవడం, ఎగుమతి దిగుమతుల ధరలను కృత్రిమంగా విపరీతంగా పెంచడం, విదేశీ మారకపు రేట్లను ఆయా ఆర్థిక వ్యవస్థల బలాబలాల ఆధారంగా కాక కృత్రిమంగా నిర్ణయించడం, బహుళజాతి సంస్థల ప్రయోజనాల కొరకే దేశాల మధ్య లావాదేవీలు నడపడం, స్టాక్ మార్కెట్లకు అపారమైన ప్రాధాన్యత ఇవ్వడం వంటి అపసవ్య ధోరణులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఈ స్థితికి తెచ్చాయి. ఈ ధోరణులలోని అపసవ్యత, దుర్మార్గం, దోపిడీ కనబడకుండా ఉండడానికి మేలి ముసుగుగా చాల సంక్లిష్టమైన, గణితశాస్త్ర పరమైన, కఠినమైన పరిభాషతో కూడిన సూత్రాలు తయారయ్యాయి. అందరికీ అవసరమైన విషయాలను, అందరి జీవితాలను ప్రభావితం చేసే విషయాలను ఎవరికీ అర్థం కాని మాంత్రిక, ఇంద్రజాలిక భాషలో మాట్లాడడం అలవాటయింది.
ఈ లావాదేవీలలో ఎక్కువభాగం కృత్రిమమైనవి గనుక, గాలిబుడగల లాంటివి గనుక ఏదో ఒకరోజు పేలిపోక తప్పదు. నిజానికి 2008లో అమెరికాలో బద్దలైన గృహరుణాల ఆర్థిక సంక్షోభం ఇటువంటి గాలిబుడగ పేలిపోయిన ఘటనే. ఆస్తిలేని, ఆదాయం లేని కుటుంబాలకు బ్యాంకులు రుణాలు ఇవ్వవచ్చుననీ, మళ్లీ ఆ బ్యాంకులు తనఖా సంస్థల దగ్గర ఆ రుణ పత్రాలను తాకట్టుపెట్టి తమ డబ్బు తాము సంపాదించుకోవచ్చుననీ, ఆ తనఖా సంస్థలు అంతర్జాతీయ ద్రవ్య సంస్థల దగ్గర ఆ రుణ పత్రాలను తాకట్టు పెట్టవచ్చుననీ, ఈ చక్రం వల్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుందనీ, తత్ఫలితంగా ఉద్యోగ కల్పన పెరిగి, మొదట రుణం తీసుకున్న ఆదాయంలేని వ్యక్తులకు ఉద్యోగాలు దొరికి వారు నెలసరి వాయిదాలు కట్టడం మొదలుపెదితే ఈ చక్రం సజావుగా సాగుతుందనీ పేరుపొందిన అర్థశాస్త్రవేత్తలు సిద్ధాంతాలు తయారుచేశారు. గణితశాస్త్ర సూత్రాలు వేసి ఎవరెవరికి ఎన్నెన్ని లాభాలో అరచేతిలో స్వర్గం చూపించారు. కాగితాల మీద ఆకర్షణీయంగా కనబడిన ఈ చక్రం విషచక్రమనీ, వ్యవస్థను సుడిగుండంలోకి లాగే సాలెగూడనీ త్వరలోనే అర్థమయింది. ఆ పత్రాలను తనఖాపెట్టుకున్న యూరపియన్ బ్యాంకులు ఇవాళ్టిదాకా తేరుకోలేదు. డజన్ల కొద్దీ బ్యాంకులు దివాళా తీశాయి. లక్షల కోట్ల డాలర్ల ప్రజాధనం వెచ్చించి ప్రభుత్వాలు తయారు చేసిన బెయిల్ ఔట్ ప్యాకేజీలు ఏడాది, రెండేళ్లు కూడ పనిచేయలేదు.
ఆ నివేదికలో మరొకమాట నిజమైన ప్రయోజనాలను, ప్రయోజనాల మధ్య ఘర్షణను దాచిపెట్టడం గురించి మాట్లాడుతుంది. ఏ బహుళ జాతి సంస్థకైనా లాభాపేక్ష నిజమైన ప్రయోజనం. తాను తయారుచేసే సరుకులకు అవసరమైన ముడిసరుకులు ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్లడం నిజమైన ప్రయోజనం. తాను తయారుచేసే సరుకు అతి చౌకగా తయారు కావాలని, వీలయినంత ఎక్కువ లాభం సంపాదించాలని కోరుకోవడం నిజమైన ప్రయోజనం. అదే సరుకును తయారు చేసే విభిన్న బహుళజాతి సంస్థలు, వాటి వెనుక ఉండే ఆయా దేశాల ప్రభుత్వాలు విదేశాలలోని వనరులకోసం, విదేశాల మార్కెట్ల కోసం ఘర్షణ పడుతుంటాయి. కాని ఒక బహుళ జాతి సంస్థ ఒక దేశంలో ప్రవేశించేటప్పుడు ఎప్పుడూ లాభం కోసమో, ఈ ప్రయోజనాల కోసమే వస్తున్నానని ప్రకటించదు. ఆ దేశ ప్రజల అవసరాలను, కోరికలను తీర్చే సరుకులను అందించడానికి వస్తున్నానంటుంది. మన బాక్సైట్, ఇనుప ఖనిజం, అనేక ఇతర ఖనిజాలు తవ్వుకుపోయి, మన వ్యవసాయోత్పత్తులు కొల్లగొట్టుకుపోయి మనకు మేలు చేస్తున్నానంటుంది. మన ఖనిజాలతో, మన వ్యవసాయోత్పత్తులతో, మన శ్రమతో తయారయిన సరుకులు మనకే అతి ఎక్కువ ధరలకు అమ్మి, మన అవసరాలు తీరుస్తున్నానంటుంది.
ఇలా బహుళ జాతి సంస్థలూ, ప్రభుత్వాధినేతలూ కలిసి ఆడుతున్న నాటకం ఫలితంగా, నిజమైన ప్రయోజనాలను దాచిపెట్టిన ఫలితంగా పేదదేశాల వనరుల దోపిడీ నిరాటంకంగా జరిగిపోతోంది. కాని ఆ వనరులను ఉపయోగించి ఉత్పత్తులు సాగించే బహుళజాతి సంస్థలు పడుతున్న పోటీల వల్ల మార్కెట్ తరిగిపోయి వారి సామర్థ్యానికి సమానమైన ఉత్పత్తి సాగించే పరిస్థితి లేదు. దానితో నిరుద్యోగం ప్రబలుతోంది. నిరుద్యోగం వల్ల మార్కెట్ ఇంకా కుంచించుకుపోతోంది. దానివల్ల వృద్ధిరేట్ల అంచనాలు తారుమారయిపోతున్నాయి. జాతీయాదాయం తరిగిపోతున్నందువల్ల సంక్షేమ వ్యయాలు తగ్గుతున్నాయి. అటు నిరుద్యోగం వల్ల, ఇటు సంక్షేమ కార్యక్రమాల కోత వల్ల ప్రజా జీవనం అస్తవ్యస్తమయిపోతోంది.
ఇక ఆ నివేదికలో చెప్పిన మరొక మాట పెట్టుబడిదారుల, లాభాపేక్షాపరుల అరాచకత్వంపై నియంత్రణ లేకపోవడం గురించి. దీనికి రుజువులూ ఉదాహరణలూ అక్కరలేదు. ఏరోజు ఏ పత్రిక తెరిచినా ఈ అదుపులేని దోపిడీ నిదర్శనాలు కనబడతాయి. కంచె చేను మేయడం అనే నుడికారం సిగ్గుపడేంతగా ఇవాళ కంచెలు బలిసిపోయి, చేలు చిక్కిపోతున్నాయి. కంచెలు తమపని దొంగగొడ్లను అడ్డుకోవడం అనుకోవడం లేదు, దొంగగొడ్లకు మార్గం సుగమం చేసేందుకే ప్రజాధనం నుంచి తమకు జీతభత్యాలు అందుతున్నాయని అనుకుంటున్నాయి.
మొత్తం మీద చెప్పాలంటే ఇవాళ్టి ఆర్థిక సంక్షోభం హఠాత్తుగా వచ్చినదీ కాదు, ఆశ్చర్యకరమైనదీ కాదు. కొనసాగే రాజకీయార్థిక, సాంఘిక ధర్మం ఇటువంటి సంక్షోభానికి దారితీయకపోతేనే ఆశ్చర్యపోవాలి గాని, అందుకు భిన్నంగా కాదు. ‘ఒకవ్యక్తిని వేరొక వ్యక్తీ, ఒక జాతిని వేరొక జాతీ, పీడించే సాంఘిక ధర్మం, ఇంకానా ఇకపై చెల్లదు’ అని ప్రజలు లేచి నిలిచేదాకా నిష్కృతి లేదు.
Box item
ఈ సంవత్సరం మొదట్లోనే, ఈ సంవత్సరం ఆర్థిక వృద్ధి రేటు అంతకు ముందుకన్న తగ్గవచ్చుననే అంచనాలు ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 4.2 శాతం ఉండవచ్చునని ఒక అంచనా ఉండగా, ఏడాది తిరిగేసరికి అది ఆ మాత్రం కూడ లేకుండా 3.9 శాతం మాత్రమే ఉన్నదని తేలింది. ఇది ప్రపంచ దేశాలన్నిటికీ వర్తించేది కాగా, అభివృద్ధి చెందిన దేశాల వృద్ధి రేటు 2.2 శాతం ఉండవచ్చునని అంచనావేస్తే, అది 1.6 శాతం మాత్రమే ఉన్నదని తేలింది.
అంతకు ముందరి రెండు సంవత్సరాలలో అంతర్జాతీయంగా కనీసం ఆరు కోట్ల మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారనీ, దానివల్ల 2011 సంవత్సరంలో కూడ నిరుద్యోగం రేటు పెరగవచ్చుననీ, ఈ నిరుద్యోగం రేటు సంక్షోభ పూర్వ స్థితికి 2015 దాకా చేరబోదని జనవరి 2011లో అంచనా వేయగా, సంవత్సరం తిరిగేసరికి, నిరుద్యోగం ఇంకా పెరుగుతున్నదనీ కనీసం 2008 నాటి ఉద్యోగ స్థితి 2018 దాకా రాదనీ తేలింది. జపాన్ మినహా ప్రధానమైన జి 7 ఆర్థిక వ్యవస్థలన్నిటి లోనూ నిరుద్యోగ రేతు 2011 లో ఆరు శాతానికి పైనే ఉంది.