తెలంగాణ చరిత్రలో మలుపులు

శ్రీ గిరిజా మనోహర్ బాబు అభినందన సంచిక కోసం

మరుగున పడిన, విస్మృతికీ వక్రీకరణకూ గురి అయిన తెలంగాణ చరిత్రను తవ్వితీయాలని, పునఃపరిశీలన, పునర్వాఖ్యానం, పునర్లేఖనం జరపాలనీ తపన పెరుగుతున్న చరిత్రాత్మకమైన సందర్భం ఇది. ఒక విధంగా తెలంగాణ చరిత్ర రచన పునఃప్రారంభమవుతున్న వేళ ఇది. ఈ సమయంలో ఇప్పటికి మనకు తెలిసిన తెలంగాణ చరిత్ర ఏయే మలుపులు తిరిగి ఇవాళ ఉన్న స్థితికి చేరిందో అన్వేషించడం ఆసక్తికరంగా ఉంటుంది. ఈ పని ప్రత్యేకించి చరిత్ర పరిశోధకులు చేయవలసినదే గాని, తెలంగాణ చరిత్ర పట్ల శ్రద్ధాసక్తులు, గౌరవం ఉన్న ప్రతి తెలంగాణ బిడ్డా ఈ మహత్తర కృషిలో తన వంతు భాగం పంచుకోవచ్చు.

అయితే ఈ అత్యవసరమైన అన్వేషణకు చాల పరిమితులున్నాయి. తెలంగాణ చరిత్ర రచనకు ఆధారాల లేమి వల్ల ఏర్పడుతున్న అస్పష్టత ఒక సమస్య కాగా, దొరుకుతున్న ఆధారాలను విస్మరించిన, వక్రీకరించిన, ఉద్దేశపూర్వకంగా తప్పుడు వ్యాఖ్యానం ఇచ్చిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి. కనీసం దొరుకుతున్న ఆధారాలతోనైనా తెలంగాణ చరిత్ర రచన ఇంకా పూర్తి కాలేదు. ఇవాళ ప్రత్యేక అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని ప్రకటిస్తున్న తెలంగాణ ఎలా నడిచివచ్చిందో ఇంకా సమగ్రంగా తెలియదు. తెలిసిన కొద్ది భాగమైనా తెలంగాణకే ప్రత్యేకమైనదీ కాదు, తెలంగాణ గతాన్ని గౌరవాదరాలతో చూసినదీ కాదు.

తెలుగు భాషకు రెండువేల ఏళ్ల పైచిలుకు చరిత్ర ఉందనుకుంటే, అందులో తెలుగు మాట్లాడే ప్రజలందరూ కలిసి ఉన్న సమయం నాలుగైదు వందల ఏళ్లకు మించదు. అలా తెలుగు ప్రజలందరూ ఒకే పాలనలో, ఒకే రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక అస్తిత్వంతో కలిసి ఉన్న కాలం అతి తక్కువే అయినప్పటికీ, మొదటినుంచీ తెలుగు ప్రజలందరికీ ఒకే ఉమ్మడి చరిత్రను రచించాలనే ప్రయత్నాలే సాగుతూ వచ్చాయి. ఆ కాలంలో ప్రబలంగా ఉండిన భావజాలం వల్ల కొమర్రాజు వెంకట లక్ష్మణ రావు (1877-1923), ఆదిరాజు వీరభద్రరావు (1890-1973), చిలుకూరి నారాయణరావు (1890-1952), మల్లంపల్లి సోమశేఖరశర్మ (1891-1963), నేలటూరు వేంకటరమణయ్య (1893-1977), సురవరం ప్రతాపరెడ్డి (1896-1953) వంటి తొలితరం చరిత్రకారులందరూ ఇటువంటి ప్రయత్నమే చేశారు. ఆ సమయానికి ఉండిన “జాతీయ” భావనల వల్ల, జాతికి భాషే ఏకైక సూచిక అనే అభిప్రాయం వల్ల, పరాయి పాలనకు వ్యతిరేకంగా జాతిని ఏకం చేయాలనే ఆకాంక్షల వల్ల తెలుగువారి చరిత్రను అఖండంగా చెప్పడానికి వీలు లేదనే స్ఫురణ లేకుండా పోయింది. కృత్రిమంగా ఏకం చేసిన ఆంధ్రుల చరిత్రలో తెలంగాణ చరిత్రను అవిభాజ్యమైన భాగంగా మార్చడం జరిగింది. అలా భాగం అవుతున్నప్పుడు కూడ సముచితమైన, సగౌరవమైన స్థానం దొరికిన భాగంగా కాక, చిన్న భాగంగా, అనుబంధంగా, పాదసూచికగా మాత్రమే తెలంగాణ మిగిలిపోయింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఏర్పడడంతో, ఆంధ్రప్రదేశ్ అస్తిత్వానికి హేతుప్రదర్శనా, సమర్థనా ప్రయత్నాలలో తెలంగాణ చరిత్ర వక్రీకరణకు, విస్మరణకు, అబద్ధాలకు, అతిశయోక్తులకు నిలయంగా మారింది.

అందువల్ల తెలంగాణ చరిత్రలో మలుపుల గురించి మాట్లాడాలంటే మొదట తెలుగువారి చరిత్రలను, ఆంధ్రుల చరిత్రలను, ఆంధ్రప్రదేశ్ చరిత్రలను శుభ్రం చేయవలసి ఉంటుంది.  ఈ ప్రాంతంలో ఆయాకాలాలలో ఉండిన వందలాది పాలనల, వేరువేరు రాజకీయ విభాగాల, వేరువేరు సంస్కృతీధారల, వేరువేరు ఉత్పత్తి విధానాల, వేరువేరు సామాజికజీవనాల చరిత్రగా పునర్విశ్లేషించవలసి ఉంటుంది.

ఇది తెలంగాణ చరిత్రకు, అంటే వస్తువుకు సంబంధించిన సమస్య కాగా, చరిత్రలో మలుపుల గురించి రాయాలంటే, చరిత్ర రచనా సంవిధానానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి.

అసలు ఒక ప్రాంతపు చరిత్రలో మలుపులు అని వేటిని గుర్తించవచ్చు? చారిత్రక ఘటనలలో ఒక ఘటన మలుపు అయి మరొకటి మలుపు కాకుండా పోవడం ఎందుకు జరుగుతుంది? అసంఖ్యాకమైన ఘటనలలో కొన్ని ఘటనలనే చారిత్రక ఘటనలుగా ఎంచుకోవడం చరిత్ర రచయిత ఇష్టాయిష్టాలకు సంబంధించినదా, లేక ఒక ఘటన చారిత్రక ఘటన అని చెప్పడానికి వస్తుగత ప్రమాణాలు ఏమైనా ఉన్నాయా? ఇటువంటి అనేక ప్రశ్నలు చరిత్ర రచనా సంవిధానంలో వివాదాస్పదంగా ఉన్నాయి.

రచనలో, వ్యాఖ్యానంలో, విశ్లేషణలో చరిత్రకారులు ఎటువంటి ఘటనను చరిత్రలో మలుపు అనుకుంటారనేది ఒక స్వీయాత్మక సమస్య అయితే దానికన్న ముఖ్యమైన సమస్య వస్తుగతంగా అసలు చరిత్ర నిర్మాణ క్రమంలోనే ఉండే సంక్లిష్టత. చరిత్ర ఎప్పుడూ సరళరేఖగా సాగదు. చరిత్ర గతి అనేక కారణాల, పరిణామాల, పరస్పర ప్రతిచర్యల పర్యవసానంగా అల్లిబిల్లిగా ఉంటుంది. సూక్ష్మంగా చూసినప్పుడు సరళరేఖగా ఉండనిది కూడ స్థూలంగా చూస్తే ఒక క్రమాన్ని పాటించినట్టు కనిపిస్తుంది. ఆ స్థూల స్థితిలో చరిత్రగతిని మనం ఒక క్రమంలో, ఒక సరళరేఖలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం గనుక ఆ సరళరేఖ ఎక్కడెక్కడ దిశ మార్చుకున్నదో అక్కడల్లా ఒక మలుపు ఉన్నదని మనం ఊహిస్తాం. ఆ మలుపుకు ఉండగల అసంఖ్యాక అస్పష్ట, సంక్లిష్ట, పరోక్ష కారణాలలోంచి మనకు స్పష్టంగా, సూటిగా, ప్రత్యక్షంగా కనబడే కారణాలే ఆ మలుపుకు మూలమని భావిస్తాం.

ఒక సమాజ చరిత్ర రూపొందే క్రమమే ఆ సమాజంలోని విభిన్న వ్యక్తుల, బృందాల, సమూహాల, వర్గాల ప్రయోజనాల మధ్య ఘర్షణతో సాగుతుంది. సాధారణంగా ఆ ప్రయోజనాలు నిగూఢంగానో, అస్పష్టంగానో, మారురూపాలలోనో ఉంటాయి గనుక చరిత్ర పరిశీలకులకు ఆ క్రమమంతా ఆ వ్యక్తుల మధ్య ఘర్షణగానే కనబడుతుంది. అలాగే సాధారణంగా క్రమం కనబడదు గాని ఘటన కనబడుతుంది గనుక ఆ వ్యక్తుల జీవితంలో, ఆచరణలో కీలకమైన ఘటనలే మలుపులుగా చిత్రణ పొందుతాయి. ‘పరస్పరం సంఘర్షించిన శక్తులలో’ ఒక వ్యక్తి, ఒక బృందం ఓటమి పాలయి, మరొక వ్యక్తి, మరొక బృందం విజయం సాధించడం ఒక మలుపుగా కనబడుతుంది.

ఈ ఘర్షణ అతి తక్కువసార్లే బహిరంగంగా ప్రత్యక్షంగా ఉండవవచ్చుగాని చాల సందర్భాలలో అవ్యక్తంగా, పరోక్షంగా ఉండవచ్చు. అది పరోక్షంగా ఉన్నప్పుడు ఘర్షించే బృందాలు అత్యల్ప సంఖ్యాకులవనీ, అత్యధిక సంఖ్యాకులకు ఆ ఘర్షణతో ఏమీ సంబంధం లేదనీ అనిపించవచ్చు. అప్పుడు సమాజం పాలకపక్షం, ప్రతిపక్షం, ప్రజలు అనే మూడు కనబడే ముక్కలుగా ఉండవచ్చు. పాలకపక్షం తీసుకునే ప్రతినిర్ణయమూ, ఆచరణా ఒక మలుపు కావచ్చు. అది ప్రజా ప్రయోజనకరంగానూ ఉండవచ్చు, ప్రజా వినాశకరంగానూ ఉండవచ్చు. కనుక మలుపులను గుర్తించడం మాతమే కాక, వాటి స్వభావాన్ని కూడ అంచనా కట్టవలసి ఉంటుంది. ఇలా గుర్తించడం, అంచనా కట్టడం రెండూ కూడ స్వీయాత్మకమైనవే.

ఈ స్వీయాత్మక అంచనాలను అలా ఉంచి చరిత్ర నిర్మాణంలో యాదృచ్ఛికత, ఆవశ్యకత, అనివార్యత అనే వస్తుగత పరిణామాలకు కూడ వాటి వాటి పాత్రలు ఉన్నాయి.

ఏ చారిత్రక క్రమంలోనైనా ఎన్నో మలుపులు ఉంటాయి గాని ఆ మలుపు కొనసాగిందా, అది ఒక విడి ఘటనగా మిగిలిపోయిందా అనేది కూడ కీలకమైన విషయమే. తెలంగాణ చరిత్రలో కొన్ని అద్భుతమైన మలుపులు కనబడుతున్నాయి గాని అవి కొనసాగలేదు. ఆ మలుపులు కొనసాగి ఉంటే తెలంగాణ చరిత్ర మరొకరకంగా ఉండి ఉండేది. కొన్ని మలుపులు కొనసాగకపోయి ఉంటే తెలంగాణ ఇవాళ ఉన్న స్థితికన్న మెరుగైన స్థితిలో ఉండేది. కాని ఆ మలుపులు కొనసాగాయి. చరిత్ర సరళరేఖకాదని, చాల సంక్లిష్టమైన ఎత్తుపల్లాల, ఒడిదుడుకుల మార్గమనీ చెప్పడానికి ఈ మలుపుల కొనసాగింపు, ప్రతిష్టంభనలు ఉదాహరణగా నిలుస్తాయి.

మరొక సమస్య చరిత్రలో మలుపు అనేది ఎప్పుడూ సమకాలీనంగా గుర్తింపు పొందదు. ఒక ఘటన గడిచిపోయిన తర్వాత దాని పర్యవసానాల వల్ల, దానివల్ల జరిగిన ఇతర పరిణామాల వల్ల అది మలుపు అనే స్పృహ పెరుగుతుంది. కనుక చరిత్రలో మలుపులు ఎప్పుడైనా తదనంతర కాలంలో గుర్తింపు పొందవలసిందే గాని అవి జరుగుతూ ఉన్నప్పుడు గుర్తించడం సాధ్యం కాదు.

ఈ పూర్వరంగంలో తెలంగాణ చరిత్రలో కీలకమైన మలుపుల గురించి ప్రస్తావించడం, భావి పరిశోధనలకు సూచనలను అందజేయడం మాత్రమే ఈ వ్యాస లక్ష్యం.

ప్రస్తుతం తెలంగాణగా ప్రాచుర్యంలో ఉన్న ప్రాంతం తన అస్తిత్వం ప్రత్యేకమైనదని గుర్తించడమే, ఈ ప్రాంతానికి ఆ పేరు రావడమే ఒక ముఖ్యమైన మలుపు. బహుశా అది మొదటి మలుపు కాకపోవచ్చు. ఆ గుర్తింపు కన్న ముందే ఈ ప్రాంత చరిత్రలో మరికొన్ని మలుపులు ఉండవచ్చు. కాని ఆ గుర్తింపు మలుపు ఎప్పుడు జరిగిందో తగిన ఆధారాలు ఇంకా లేవు. ఈ ప్రాంతంలో, దక్కన్ పీఠభూమిలో ఏర్పడిన తొలి రాజ్యం శాతవాహన సామ్రాజ్యం ఒక్క తెలంగాణనే పాలించలేదు. అది అప్పటికి అభివృద్ధి చెందుతున్న మరాఠీ, కన్నడ, తెలుగు భాషా ప్రాంతాలలో రాజ్యం చేసింది. శాతవాహనులు తెలంగాణను కూడ పాలించినప్పటికీ, వారి పాలనాకాలంలోనే తెలంగాణ తెలుగు ఒక రూపం పొందినప్పటికీ ఆ కాలపు తెలంగాణ చరిత్ర మలుపులను గురించి సాధికారికంగా చెప్పగలిగిన ఆధారాలు లేవు.

శాతవాహనుల పతనం నుంచి కాకతీయ రాజ్య స్థాపన దాకా జరిగిన చరిత్రలో కూడ తెలంగాణ అస్తిత్వానికి కచ్చితమైన మలుపులు ఉండే ఉంటాయి. అవి లేకపోతే తెలంగాణ నుంచి కాకతీయుల వంటి విశాల సామ్రాజ్యాన్ని ఏలిన రాజవంశం పుట్టుకు రావడానికి ఆస్కారం ఉండేది కాదు. కాని ఆ చరిత్ర మలుపుల గురించి కూడ మనకింకా ఎక్కువగా తెలియదు.

కాకతీయుల కాలంలోని తెలంగాణ చరిత్రలో గుర్తించదగిన మలుపులు కొన్ని ఉన్నాయి. వాటిలో కనీసం నాలుగు మలుపులను పేర్కొనాలి. మొదటిది కాకతీయ పాలకులు వ్యవసాయం మీద, నీటి పారుదల మీద పెట్టిన శ్రద్ధ. ఆహారసేకరణ, పశుపోషణ, స్వల్పస్థాయి వ్యవసాయం దశలు దాటి సమాజం స్థిర వ్యవసాయ దశలోకి, సంఘటిత విశాల వ్యవసాయ దశలోకి, సాగునీటి సౌకర్యాల కల్పన అనే సాంకేతిక పరిజ్ఞాన దశలోకి పయనించడం అప్పుడే ప్రారంభమైంది. తప్పనిసరిగా తెలంగాణ చరిత్రలో ఇది కీలకమైన మలుపు. ఆ కాలానికి దక్షిణ భారతదేశం మొత్తంలో తమిళ ప్రాంతాలను మినహాయిస్తే ఇటువంటి చరిత్ర మలుపును చూసిన ప్రాంతం మరొకటి లేదు. ఈ వ్యవసాయోత్పత్తి పెరుగుదల మొత్తంగా సామాజిక, సాంస్కృతిక వికాసానికి దారితీసింది. సంపద విపరీతంగా పెరిగి, రెండు శతాబ్దాలు తిరగకుండానే ఢిల్లీ పాలకుల కన్ను పడడానికి కారణమైంది.

కాకతీయుల ద్వారా తెలంగాణ చరిత్రలో జరిగిన మరొక మలుపు సాంప్రదాయిక నిచ్చెనలో అట్టడుగున ఉన్న సామాజిక బృందానికి రాజ్యాధికారం రావడం. కాకతీయులు తమ కులానికి చెందినవారేనని రుజువులు చూపెట్టడానికి ఇప్పటివరకూ చాలమంది ప్రయత్నించారు. స్వయంగా కాకతీయులే తాము “చతుర్థాన్వయులమని (చతుర్థ కులజులమ”ని) చెప్పుకున్నందువల్ల మిగిలిన మూడు వర్ణాలకూ ఆ అవకాశం తప్పిపోయింది. కాని, శూద్రులలో కూడ అధికారమూ, ఆస్తీ సమకూరిన వర్గాలు కాకతీయుల వారసత్వం తమదేనని ప్రకటించుకుంటున్నాయి. ఆ వివాదం ఎలా ఉన్నా, చెరువులు, కుంటలు, రాతి భవనాలు, రాతి శిల్పాలు వంటి కాకతీయుల నిర్మాణాలు చూస్తే వారు నిర్మాణ శ్రమతో సంబంధం ఉన్నవారో, ఆ శ్రమకు ప్రాధాన్యత ఇచ్చినవారో అనిపిస్తుంది. శాసనాధారాలను బట్టి వారిని సామంత విట్టి, లేదా సామంత వడ్డె అనాలనీ, వారు పుళింద వంటి ఆదివాసి తెగలకు చెందినవారయి ఉండి పైకి ఎదిగి శూద్ర స్థాయికి చేరి ఉండవచ్చుననీ చరిత్రకారులు ఊహిస్తున్నారు. ఏమయినా తెలంగాణ చరిత్రలో ఇది ఒక ముఖ్యమైన మలుపు అనే చెప్పాలి. ఆచార వ్యవహారాలను బట్టి, ఆయుధ, సైనిక శక్తిని బట్టి, వ్యాపార స్థితిని బట్టి  అగ్రకులాలైనవారికి కాక శారీరకశ్రమ ప్రధానంగా గల కులానికి రాజ్యాధికారం రావడం ఒక మలుపే.

అట్లాగే పితృస్వామిక హిందూ మతాన్ని అవలంబించిన రాజవంశాలలో ఒక స్త్రీ చక్రవర్తి కావడం కూడ కాకతీయుల కాలంలో తెలంగాణ చరిత్రలో జరిగిన కీలకమైన మలుపే. శాతవాహనుల యుగంలో నాగనీక వంటి ప్రముఖులైన రాజకుటుంబ స్త్రీలను గురించి ప్రస్తావనలు ఉన్నాయి గాని అప్పటి బౌద్ధ సంప్రదాయంలో అది ఆశ్చర్యకరం కాదు. ఆ తర్వాత మధ్యయుగాలలో పెరిగిన భూస్వామ్య, పితృస్వామిక మత విలువల్లో స్త్రీని సింహాసనం మీద అంగీకరించడం అరుదైన విషయమే. దేశ చరిత్రలోనే వేలాది మంది రాజులలో నలుగురైదుగురికి మించి స్త్రీలు లేరు. అటువంటిది కాకతీయ సామ్రాజ్యంలో పదకొండో శతాబ్ది లోనే స్త్రీ రాణి కావడం ఒక మలుపే. గణపతి దేవునికి పురుష సంతానం లేకపోవడం, కూతురి మీద అపారమైన ప్రేమ ఉండడం కారణాలు కావచ్చుగాని, అప్పటికి కూడ భూస్వామ్య విలువలలో పురుష సంతానం లేకపోతే దత్తత స్వాకారం, కూతురి మీద ప్రేమ ఉన్నప్పటికీ అల్లుడికి రాజ్యం అప్పగించడం వంటి అలవాట్లు ఉన్నాయి.

కాకతీయ సామ్రాజ్య కాలంలోనిదే మరొక సంఘటన కూడ తెలంగాణ చరిత్రలో మలుపుగా చెప్పుకోవచ్చు. అది పగిడిద్దరాజు, సమ్మక్క, సారలమ్మ, జంపన్నల నాయకత్వంలో ఆదివాసులు జరిపిన పోరాటం. రాజరికాన్ని ఆదివాసులు ఎదిరించి, రాజ సైనికులతో పోరాటానికి దిగడం, ఆ పోరాటంలో స్త్రీలు అగ్రభాగాన పాల్గొని ప్రాణత్యాగానికి కూడ వెరవకపోవడం ఏ ప్రజల చరిత్రలోనైనా అరుదైన ఘటనగా, మలుపుగా గుర్తించవలసిందే.

నిజానికి ఈ మలుపులన్నీ కూడ సామాజిక చరిత్రగతిని ప్రగతి వైపు నడిపించగలిగినవే. ఆ మలుపు తర్వాతి పరిణామాలు అదే దిశలో కొనసాగి ఉంటే తెలంగాణ చరిత్ర మరొక రకంగా ఉండేది. కాని మొత్తంగా దక్కన్ పాలకుల సంపద, ముఖ్యంగా వరంగల్ సంపద ఢిల్లీ చక్రవర్తుల నోరూరించిందని, మొదట దేవగిరిమీద, ఆ తర్వాత వరంగల్ మీద దండయాత్రలకు, దాడులకు అదే కారణమని చరిత్రకారులు నమోదు చేసి ఉన్నారు. అలా పద్నాలుగో శతాబ్ది తొలి దశాబ్దాలలో అనేకసార్లు వరంగల్ మీద జరిగిన దాడులు, వరంగల్ నుంచి దోచుకుపోయిన సంపద, చివరికి ప్రతాపరుద్రుడిని బందీగా తీసుకుపోవడం, ప్రతాపరుద్రుడు నర్మదానదిలో ఆత్మాహుతి చేసుకోవడం మరొక ముఖ్యమైన మలుపు.

ఆ తర్వాత గడిచిన ఏడు వందల సంవత్సరాలలో తెలంగాణ చరిత్ర అనేక మలుపులు తిరిగింది. వారసులు గర్వించదగిన అద్భుతమైన ప్రజానుకూల మలుపులూ ఉన్నాయి, తెలంగాణ సంపదలనూ, ప్రజాజీవితాన్నీ ధ్వంసం చేసిన ప్రజావ్యతిరేక మలుపులూ ఉన్నాయి.

చతుష్పాద పద్యాన్ని కాదని ద్విపదను, సంస్కృతాన్ని కాదని జానుతెనుగును, కుల అంతరాల్ని కాదని చాపకూడును, దైవిక ఊహా వస్తువులను కాదని యథార్థ జీవిత వ్యథార్థ దృశ్యాన్ని ఆదరించిన పాల్కురికి సోమన ప్రయత్నం ఒక మలుపు. నమ్మిన విశ్వాసం కోసం రాజును ధిక్కరించిన, రాజాంకితంతో పడుపుకూడు భుజించడం కన్న హాలికులు కావడాన్ని సమర్థించిన బమ్మెర పోతన మరొక మలుపు. ఎక్కడినుంచో వచ్చినవారు మమ్మల్ని పాలించడమేమిటి, మాపాలన మాదే, మారాజ్యం మాదే అని ప్రకటించిన సర్వాయి పాపడు మరొక మలుపు. ఈ మలుపులు కొనసాగి ఉండకపోవచ్చు. ఇవాళ గుర్తించ గలుగుతున్నట్టుగా ఇంతకు ముందు గుర్తింపు పొంది ఉండకపోవచ్చు. కాని ఇటువంటి ఘటనలు విడి ఘటనలు కావు, అవి ఈ నేలలో సాగిన సుదీర్ఘ, సంక్లిష్ట పరిణామాలకు వ్యక్తీకరణ రూపాలు. ఇలా బయటపడిన ఒక్కొక్క వ్యక్తీకరణ వెనుక పెనుగులాడిన వందలాది విఫల ప్రయత్నాలు, సుదీర్ఘ క్రమాలు ఉండి ఉంటాయి. తెలంగాణ చరిత్ర పునర్నిర్మాణ క్రమంలోనే ఆ క్రమాలు, బహుశా మౌఖిక గాథలలో మిగిలిపోయిన, వక్రీకరించిన ప్రస్తావనలలో మిగిలిపోయిన ఆ క్రమాలు తమ పూర్తి వ్యక్తీకరణలు పొందగలుగుతాయి.

ఆ మలుపులనుంచి ఆరు వందల సంవత్సరాలు దాటి ఇటీవలి పందొమ్మిదో, ఇరవయో శతాబ్దాలలోకి వస్తే కూడ తెలంగాణ చరిత్ర అనేక మలుపులు తిరిగింది. ఆ మలుపులలో కొన్ని కొనసాగి ఉన్నా, మరికొన్ని మలుపులు తిరగకపోయినా తెలంగాణ సంపదలు తెలంగాణ ప్రజలకే అంది, తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి జరిగిఉండేది.

దేశంలోని బ్రిటిష్ పాలనా ప్రాంతాలలోనూ, స్వదేశీ సంస్థానాలలోనూ 1857 ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం చెలరేగుతున్నప్పుడు హైదరాబాద్ కూడ ఆ సంగ్రామంలో దేశీయ పక్షం తీసుకుని వలసవాదులను ఎదిరించి ఉంటే చరిత్ర మరొక రకంగా ఉండేది. ఆ తిరుగుబాటులో హైదరాబాద్ తమకు వ్యతిరేకంగా నిలబడితే భారతదేశంలో తమకు నూకలు చెల్లినట్టేనని స్వయంగా బ్రిటిష్ పాలకులే రాసుకున్నారు. కాని తెలంగాణ చరిత్రలో ఒక కీలకమైన మలుపుగా హైదరాబాద్ పాలకులు, ముఖ్యంగా ప్రధాని సాలార్ జంగ్ బ్రిటిష్ పాలకులను కాపాడడానికి నిర్ణయం తీసుకున్నాడు. అటువంటి ప్రజావ్యతిరేక, దేశవ్యతిరేక నిర్ణయం తీసుకున్న వ్యక్తే హైదరాబాద్ రాజ్యంలోకి ఆధునిక విద్యనూ, వైద్యాన్నీ, రవాణా సౌకర్యాలనూ, సమాచార సౌకర్యాలనూ తీసుకు వచ్చి తెలంగాణ చరిత్రలో ఒక ప్రజానుకూల మలుపుకూ కారణమయ్యాడు.

అలాగే తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీ ప్రవేశం ఒక కీలక మలుపు. దేశం మొత్తం మీదనే ఎక్కడా లేని విధంగా భూస్వామ్యం మీదా, రాచరికం మీదా, దాన్ని కాపాడుతున్న వలసవాదం మీద తెలంగాణ రైతు సాయుధంగా తిరగబడిన అద్భుతమైన మలుపు అది. ఒక రకంగా ఒక వెనుకబడిన దేశంలో ప్రజా విప్లవం ఎలా రావాలో ఒక మార్గం చూపిన గొప్ప ప్రయత్నం అది. ఆ మలుపు కొనసాగి ఉంటే, దున్నేవానికే భూమి వంటి అసాధారణమైన మార్పు జరిగిఉంటే, ఆంధ్ర మహాసభలోనూ, రైతాంగ సాయుధ పోరాటంలోనూ వ్యక్తమయిన విశాల ప్రజారాశుల ఐక్యత కొనసాగి ఉంటే, ప్రజల చేతికి రాజ్యాధికారం అంది ఉంటే తెలంగాణ ప్రజాజీవితం తప్పనిసరిగా ఎన్నో విజయాలు సాధించి ఉండేది. సాధించిన విజయాలను బలోపేతం చేసుకుని ఉండేది. కాని ఆ అద్భుతమైన మలుపు కొనసాగలేదు. ఐదు సంవత్సరాలు తిరగకుండానే, రాజ్య హింస వల్ల మాత్రమే కాదు, స్వయంగా నాయకత్వ విద్రోహం వల్ల, అధికారిక విరమణ వల్ల ఆ పోరాటం ఆపివేయబడి తెలంగాణ చరిత్రలో ఒక ప్రజావ్యతిరేకమైన మలుపుగా విషాదకరంగా నమోదయింది.

ఆ తర్వాత ఐదు సంవత్సరాలకు జరిగిన ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తెలంగాణ చరిత్రలో మరింత విషాదకరమైన, ప్రజావ్యతిరేకమైన పర్యవసానాలకు దారితీసిన మలుపుగా గడిచిన ఆరు దశాబ్దాల చరిత్ర సాక్ష్యం పలుకుతున్నది.

ఈ మలుపులన్నిటినీ వాస్తవికంగా గుర్తించి, నమోదు చేసి, నిర్మమంగా విశ్లేషించడం ఇవాళ్టి చారిత్రక అవసరం. ఆ అవసరాన్ని తీర్చే చరిత్రకారుల కోసం తెలంగాణ చరిత్ర ఎదురుచూస్తున్నది.

About ఎన్.వేణుగోపాల్ N Venugopal

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues.
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

8 Responses to తెలంగాణ చరిత్రలో మలుపులు

 1. Raj says:

  Ento anni assumptions tho meeku kavalsi natlu rasukunnaru. Okkadaniki kuda proof lekunda. Ignorance is a bliss annaru anduke :-)

  • Thank you. It seems you are full of bliss. Telangana charitra tho meeku aemaatram parichayam (lothaina adhyayanam kooda kaadu) unnaa aa bliss poyi undedi. Naa vyaasam lonchi aadhaaram leni okka assumption choopagaligite nenu kooda mee bliss pondutaanu.

   • Raj says:

    “తెలుగు భాషకు రెండువేల ఏళ్ల పైచిలుకు చరిత్ర ఉందనుకుంటే, అందులో తెలుగు మాట్లాడే ప్రజలందరూ కలిసి ఉన్న సమయం నాలుగైదు వందల ఏళ్లకు మించదు.”

    Just show me the proof for it and on what basis telugu people or united and devided over these 2000+ years?

    I am happy to accept that I am ignorant and I am happy because of it and just go beating the drum that I am telugu and u r not telugu. how the heck all that matter when we (people) can’t help our next door person and fight over history and all.

   • తెలుగు మాట్లాడే ప్రజల భూభాగం ఇవాళ్టి ఆంధ్రప్రదేశ్ అంతా అనుకుంటే (బళ్లారి, హోసూరు, పర్లాకిమిడి లాంటి ప్రాంతాలను వదిలేసినా), ఈ భూభాగమంతా 1956 నవంబర్ 1 కి ముందు ఒకే పాలనలో, ఒకే రాజ్యంగా ఎన్నడూ లేదు. క్రీ.పూ. 200 నుంచి క్రీ.శ. 200 మధ్య శాతవాహనుల పాలనలో ఈ భూభాగంలో ఎక్కువ భాగం ఒకే పాలనలో ఉంది గాని శాతవాహనులు కోటిలింగాల నుంచి పశ్చిమాన పైఠాన్ వరకూ తూర్పున ధరణికోట వరకూ విస్తరించారు. వారిది పూర్తిగా తెలుగు పాలన అని చెప్పడానికీ లేదు. వారు ఉత్తరాంధ్రకు గాని, కృష్ణ దక్షిణానికి గాని వెళ్లిన ఆధారాలు లేవు. ఆ నాలుగు వందల ఏళ్లలో ఒక వంద సంవత్సరాలు ఇవాళ్టి ఆంధ్రప్రదేశ్ లోని కొంత భాగం ఒకే పాలన కింద ఉందనవచ్చు. ఆ తర్వాత మళ్లీ కాకతీయుల వరకూ తెలుగు వారిలో ఎక్కువ మంది ఒక్క పాలన కిందికి రాలేదు. పదకొండు – పద్నాలుగు శతాబ్దాల మధ్య రెండు వందల యాభై ఏళ్ల కాకతీయుల పాలనలో ఉత్తరాంధ్ర భాగం కాలేదు. దక్షిణాన కంచి వరకూ వెళ్లిన ఆధారం ఉంది గాని ఇవాళ్టి రాయలసీమ వారి పాలనలో లేదు. కాకతీయుల పతనం తర్వాత ఏర్పడిన “తెలుగు” పాలనగా చెప్పుకునే విజయనగర రాజ్యం కృష్ణకు ఉత్తరానికి రానేలేదు. ఆ తర్వాత కుతుబ్ షాహీల పాలనలో నూటయాభై ఏళ్లు మళ్లీ ఆంధ్రప్రదేశ్ లోని అధిక భాగం ఒకే పాలన కిందికి వచ్చింది. ఆ తర్వాత అసఫ్ జాహీల పాలనలో యాభై ఏళ్లకే అది మళ్లీ వేరువేరు పాలనల కిందికి వెళ్లింది. మీకు తెలియనిదల్లా లేదని, అబద్ధమని, ఊహ అని అనుకుంటే, జీవితం చాల సులువు. మీరన్నట్టు బ్లిస్. కాని చరిత్ర మనం కోరుకున్నట్టు జరగలేదు, జరగదు.

   • Raj says:

    “క్రీ.పూ. 200 నుంచి క్రీ.శ. 200 మధ్య శాతవాహనుల పాలనలో ఈ భూభాగంలో ఎక్కువ భాగం ఒకే పాలనలో ఉంది గాని శాతవాహనులు కోటిలింగాల నుంచి పశ్చిమాన పైఠాన్ వరకూ తూర్పున ధరణికోట వరకూ విస్తరించారు. వారిది పూర్తిగా తెలుగు పాలన అని చెప్పడానికీ లేదు. వారు ఉత్తరాంధ్రకు గాని, కృష్ణ దక్షిణానికి గాని వెళ్లిన ఆధారాలు లేవు. ”
    Are there any proof that there were telugu people in South of Krishna or North Andhra. I guess at the time of Sathavahana its not even todays telugu. Then how can we say telugu people or not under one ruler. People from different civilizations (tribes) come together to form a common group and they may go different ways as well, which is a natural process and we can not draw lines on that process.

    “కాని చరిత్ర మనం కోరుకున్నట్టు జరగలేదు, జరగదు.” Thats exactly my point is. we can not control the history in making. So it helps us not to take it to heart to much.

    “నమ్మిన విశ్వాసం కోసం రాజును ధిక్కరించిన, రాజాంకితంతో పడుపుకూడు భుజించడం కన్న హాలికులు కావడాన్ని సమర్థించిన బమ్మెర పోతన మరొక మలుపు.” this sort things happened all over the world all the time. It can not be attributed as a nature of all the people living in one area. Pothana was not lived in the area called Telangana. Its not the same place and same time. Desa kalamana paristhitulu total ga different.

    Like the above, I see, so many gaps including the story about Kakathiya. Are Kakathiya’s belong to today’s telengana or the telugu speaking people of 600 years back. Kakathiyas represented all telugu and Hindu people and fought against Muslim invasion. Then how come they belong to telugu people of one area. Kakathiyulu telengana history lo malupu kadu….telugu speaking people history lo malapu.

 2. Raj says:

  “క్రీ.పూ. 200 నుంచి క్రీ.శ. 200 మధ్య శాతవాహనుల పాలనలో ఈ భూభాగంలో ఎక్కువ భాగం ఒకే పాలనలో ఉంది గాని శాతవాహనులు కోటిలింగాల నుంచి పశ్చిమాన పైఠాన్ వరకూ తూర్పున ధరణికోట వరకూ విస్తరించారు. వారిది పూర్తిగా తెలుగు పాలన అని చెప్పడానికీ లేదు. వారు ఉత్తరాంధ్రకు గాని, కృష్ణ దక్షిణానికి గాని వెళ్లిన ఆధారాలు లేవు. ”
  Are there any proof that there were telugu people in South of Krishna or North Andhra. I guess at the time of Sathavahana its not even todays telugu. Then how can we say telugu people or not under one ruler. People from different civilizations (tribes) come together to form a common group and they may go different ways as well, which is a natural process and we can not draw lines on that process.

  “కాని చరిత్ర మనం కోరుకున్నట్టు జరగలేదు, జరగదు.” Thats exactly my point is. we can not control the history in making. So it helps us not to take it to heart to much.

  “నమ్మిన విశ్వాసం కోసం రాజును ధిక్కరించిన, రాజాంకితంతో పడుపుకూడు భుజించడం కన్న హాలికులు కావడాన్ని సమర్థించిన బమ్మెర పోతన మరొక మలుపు.” this sort things happened all over the world all the time. It can not be attributed as a nature of all the people living in one area. Pothana was not lived in the area called Telangana. Its not the same place and same time. Desa kalamana paristhitulu total ga different.

  Like the above, I see, so many gaps including the story about Kakathiya. Are Kakathiya’s belong to today’s telengana or the telugu speaking people of 600 years back. Kakathiyas represented all telugu and Hindu people and fought against Muslim invasion. Then how come they belong to telugu people of one area. Kakathiyulu telengana history lo malupu kadu….telugu speaking people history lo malapu.

 3. Ranjith says:

  Hello Mr. Raj,

  You sounded like people who strongly believes in creationism, who say world is only 10,000 years old. You know why I compare with those people, even though scientists founded 4.4 million years old fossil, creationists still need more proof but they(creationists) never came up with a trace of proof that world is created not evolved.

  Your whole argument is pointless and directionless, if you do not know the history read it first and make counter arguments. I can say what proof you got that you can say this wrong, then I sound stupid.

  According to me writer did great research work where only few historians, journalists and analysts can really do this kind of work in India these days. Even though writer sympathizes for Telangana cause, he also wrote numerous articles and books on people suffering all over the country. I can give you one example making an assumption that you belong to Andhra geographically. Writer wrote multiple articles on struggles of Sompeta people which is in Srikakulam district and clearly stated atrocities of police and state, I’m assuming again here that you know what happened in Sompeta last year, otherwise I pity you.

  So finally before asking for proof, build a meaningful discussion and point out if the article has any mistakes with your findings by doing research. You need to do some reading, no lot of reading to at least get there and understand the history.

  By the way Kakatiya’s, Sri krishnadevraya’s are fuedal lords, monarchs and they have nothing to do with people and their well being so you better understand that they did wars for their sake not for people. I think this is enough for you.

  • Raj says:

   Hi Ranjit,

   Just read your comment once again. then you will come to know how meaningful or should I say meaningless you are sounding. Cut the false cry and point to some facts, if you have any.

   For that matter which ruler was not a fuedal lord in the past. It was not democracy in those days. I only said they dont belong to any place measured by todays borders.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s