జూలూరు గౌరీశంకర్ సంకలనం కోసం
ఆరు దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షల చరిత్రలో సకల జనుల సమ్మె ఒక అద్భుతమైన పరిణామం. నాలుగు దశాబ్దాల పోరాట క్రమంలో, ప్రత్యేకించి నమ్మకద్రోహాన్ని ప్రతిఘటిస్తున్న రెండు సంవత్సరాల వర్తమాన ఉద్యమంలో సకల జనుల సమ్మె ఒక అసాధారణమైన ప్రయత్నం. ఆ నలభై రెండు రోజుల నిరసన – ప్రతిఘటన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రజా ఉద్యమానికి అనుకూల పాఠాలనూ, ప్రతికూల పాఠాలనూ కూడ మిగిల్చాయి. అన్ని సామాజిక వర్గాలూ పాల్గొన్నప్పుడు, ముఖ్యంగా కార్మిక వర్గం అగ్రభాగాన నిల్చినప్పుడు, ఒక ప్రజా ఉద్యమం ఎటువంటి విజయాలు సాధించగలదో సకల జనుల సమ్మె చూపింది. ప్రధానంగా రాజకీయ ఉద్యమమైన తెలంగాణ ఆకాంక్షల ఉద్యమంలో రాజకీయ పక్షాల, నాయకుల దివాళాకోరు, దగాకోరు ఎత్తుగడల వల్ల ఉద్యమం ఎటువంటి అపజయాల పాలయిందో సకల జనుల సమ్మె చూపింది. అందరికీ చోటు ఉండే ప్రాంతీయ ఉద్యమంలో ఆయా సామాజిక వర్గాలు తమతో పాటు తమ భావజాలాలను, పోరాటరూపాలను తీసుకువస్తాయని, వాటిలోని అభివృద్ధికర అంశాలు ఉద్యమాన్ని పురోగమింపజేసినట్టుగానే అభివృద్ధినిరోధక, మూఢాచార భావాలు, రూపాలు ఉద్యమంలోని ప్రజాస్వామికతను భగ్నం చేస్తాయని కూడ సకల జనుల సమ్మె చూపింది. ఒక్క మాటలో చెప్పాలంటే సకల జనుల సమ్మె జయాపజయాల, ఆనంద విషాదాల కలనేత.
ఆ విస్తృత, ఉధృత ప్రవాహంలోంచి ఏదో ఒక రోజును, ఏదో ఒక బిందువును వేరు చేసి విశ్లేషించడం సులభసాధ్యమూ కాదు, సమగ్రమూ కాదు. కాని మెతుకు పట్టి చూసినట్టు ఏ ఒక్కరోజున అయినా ఏమి జరిగిందో పరిశీలించి దాని ఆధారంగా మొత్తంగా సకల జనుల సమ్మెను ఎలా అర్థం చేసుకోవాలో, దాని పూర్వాపరాలేమిటో, ఆ అపురూపమైన ప్రజా సంచలనం ఏ అసమగ్రత వల్ల అర్ధాంతరంగా ఆగిపోయిందో చూడవచ్చు.
ఉదాహరణకు సకల జనుల సమ్మెలో మూడో వంతు గడిచిన పద్నాలుగో రోజు (సెప్టెంబర్ 26) జరిగిన పరిణామాలను, ఆ మర్నాడు పత్రికలలో వెలువడిన వార్తల ఆధారంగా విశ్లేషించడానికి ప్రయత్నిద్దాం. ఆ రోజు జరిగిన విషయాలలో i. రోజువారీ జరిగే సాధారణ ఆందోళనా కార్యక్రమాలు; ii. ప్రభుత్వ స్పందనలు; iii. ఉద్యమ నాయకుల ప్రకటనలు; iv. భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ప్రణాళికలు, ప్రకటనలు ఉన్నాయి.
రోజువారీ జరిగే సాధారణ ఆందోళనా కార్యక్రమాలు దాదాపుగా అంతకు ముందు రెండు సంవత్సరాలుగా ఏదో ఒక స్థాయిలో జరుగుతూ ఉన్నవే. ప్రత్యేకించి ఆ రోజున జరిగిన కార్యక్రమాల జాబితా చూస్తే, సింగరేణి, ఆర్టీసీ కార్మికుల సమ్మె, ఉద్యోగుల సమ్మె, ప్రభుత్వ కార్యాలయాల ముందు ధర్నా, ఉపాధ్యాయుల సమ్మె, పాఠశాలల మూసివేత, కేంద్ర ప్రభుత్వోద్యోగుల సామూహిక సెలవు, బి ఎచ్ ఇ ఎల్, ఇ సి ఐ ఎల్ ఉద్యోగుల రాలీ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల బంద్, న్యాయవాదుల విధుల బహిష్కరణ, న్యాయవాదుల ఆటపాటలు, సామూహిక భోజనాలు, సీమాంధ్ర న్యాయవాదులకు గాంధేయ మార్గంలో గులాబీపూలు ఇవ్వడం, ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి, ఆలయాల్లో ఆర్జిత సేవల నిలుపుదల, ఆంజనేయ ఆలయం వద్ద ధూంధాం, యాదగిరిగుట్టలో నృసింహ మహాయాగం, హోమాలు, యజ్ఞాలు, రుద్రాభిషేకాలు, సకల జనుల సమ్మెకు అర్చకుల ఆశీర్వాదం, బోనాలు, బతుకమ్మలు, కామారెడ్డిలో యువకుడి ఆత్మహత్య వంటి విభిన్న కార్యక్రమాలు ఉన్నాయి. ఇవి కాక కొంచెం భిన్నంగా, ప్రత్యేకంగా కనబడే కార్యక్రమాలు ద్రోహుల బట్టలు ఉతికేది లేదని కరీంనగర్ రజకులు చేసిన ప్రకటన, హైదరాబాద్ లో ఎమ్మార్ నిర్వహణ కార్యాలయంపై జరిగిన దాడి.
ఈ కార్యక్రమాలలో అవసరమైనవీ అనవసరమైనవీ, ప్రయోజనకరమైనవీ ప్రయోజనం లేనివీ, కొనసాగించవలసినవీ కొనసాగించగూడనివీ అన్నీ ఉన్నాయి. వీటిలో ఎన్ని నిరసన రూపాలో, ఎన్ని పోరాట రూపాలో, మరెన్ని కేవలం ఆకాంక్షా, ఐక్యతా ప్రదర్శనలో, అస్తిత్వ ప్రకటనలో వివరంగా విశ్లేషించవలసే ఉంది.
ఏ ప్రజా ఉద్యమంలోనైనా ఆకాంక్షల ప్రకటన, ఐక్యతా ప్రదర్శన, నిరసన ప్రదర్శన, ప్రతిఘటన అనే నాలుగు దశలు గడిస్తే గాని అంతిమ విజయం సాధ్యం కాదు. ఈ నాలుగు దశలు ఏకకాలంలోనైనా జరగవచ్చు, ఒకదాని తర్వాత ఒకటిగానైనా జరగవచ్చు. ప్రజలు పోరాటానికి సిద్ధపడే ఆకాంక్షలు ఏమిటో ప్రకటించడం మొదటి పని. ఆ ఆకాంక్షలను మళ్లీ మళ్లీ ప్రకటించుకోవడం, విస్తరించుకోవడం ఉద్యమ విజయం దాకా జరుగుతూనే ఉంటాయి. ఈ ఆకాంక్షలు ఒంటరి వ్యక్తులవో, చిన్న సమూహాలవో కావని, ఆ ఆకాంక్షలు సకల సమాజానివనీ ఐక్యతా ప్రదర్శన రెండవ దశ. ఈ ఐక్యతా ప్రదర్శన వల్ల ఉద్యమానికి బలం చేకూరుతుంది. ఆ ఐక్యత విచ్చిపోకుండా చివరిదాకా కాపాడుకోవడం ఉద్యమశ్రేణుల బాధ్యత. కాపాడడం నాయకత్వ బాధ్యత. ఈ రెండు దశల తర్వాత ఉద్యమానికి కీలకమైన మలుపు తమ ఆకాంక్షలను అడ్డుపడే, నెరవేర్చని, తమ ఐక్యతను గుర్తించని శక్తులకు, పాలకవర్గాలకు వ్యతిరేకంగా నిరసన తెలపడం. నిరసన ప్రదర్శన అనేక రకాలుగా జరుగుతుంది. ఆ పాలకవర్గ, ప్రత్యర్థి శక్తులు నాగరికమైనవైతే, కనీస ప్రజాస్వామిక స్పృహ ఉన్నవైతే ఇటువంటి నిరసన ప్రదర్శనలకు స్పందించి ప్రజల ఆకాంక్షలు తీర్చడానికి ప్రయత్నిస్తాయి. కాని ప్రజల ఆకాంక్షలను గుర్తించి, గౌరవించి, నెరవేర్చే పాలకవర్గాలు, ఆధిపత్య శక్తులు ప్రస్తుతం లేవు.
అందువల్ల ప్రజా ఉద్యమం తప్పనిసరిగా చివరి దశ అయిన ప్రతిఘటనలో ప్రవేశించవలసి వస్తుంది. ప్రతిఘటన దశలో మొదట ఆత్మరక్షణ, తర్వాత ఇరుపక్షాల మధ్య సమాన బలంతో ప్రతిష్టంభన, ఆ తర్వాత దాడి వంటి ఉపదశలు కూడ ఉంటాయి. తమ ఆకాంక్షలు తీర్చకుండా, తమ నిరసన మీద దాడి చేస్తున్న, తమ అస్తిత్వం మీద, వనరుల మీద దాడి చేస్తున్న ప్రత్యర్థి శక్తుల ఆటలు సాగకుండా నిలువరించడం, ఆత్మరక్షణ చేసుకోవడం ప్రతిఘటనలో మొదటి ఉపదశ. అది క్రమక్రమంగా పెరిగి అటూ ఇటూ ముందుకు కదలని స్థితి వస్తుంది. ఆ తర్వాత ప్రజాశక్తులు మరింత బలం పుంజుకుని ప్రత్యర్థి శక్తుల మీద దాడి చేసి, ఓడిస్తే తప్ప తమ ఆకాంక్షలు నెరవేరవని గుర్తించడం చివరి దశ. అటువంటి దాడి క్రియాశీలంగా, ప్రభావశీలంగా జరిగినప్పుడు, ప్రజల ఆకాంక్షలు నెరవేరే స్థితి వస్తుంది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ చరిత్రను చూస్తే 1952 నుంచీ అస్తిత్వ ఆకాంక్షల ప్రకటన నిరంతరాయంగా సాగుతూనే ఉంది. ఐక్యతా ప్రదర్శన 1952 కన్న 1954లో ఎక్కువగా, అంతకన్న 1969లో మరింత ఎక్కువగా, 1996 నుంచి సాగుతున్న పోరాటంలో మరింత ఎక్కువగా, 2009 డిసెంబర్ 23 తర్వాత మరింత ఎక్కువగా అంచెలంచెలుగా విస్తృతమవుతూ ఉంది. నిరసన ప్రకటనలు 1969 కాలంలో జరిగాయి, 2009 డిసెంబర్ నుంచి చాల ఎక్కువగా జరుగుతున్నాయి.
కాని కోస్తాంధ్ర, రాయలసీమ పాలకవర్గాలు, రాష్ట్ర, దేశ పాలకవర్గాలు ఎంత మొరటువీ, అనాగరికమైనవీ, అప్రజాస్వామికమైనవీ అంటే వాటికి ఈ ఆకాంక్షలపట్ల, ఐక్యతపట్ల, నిరసనలపట్ల సున్నితంగా ప్రతిస్పందించే శక్తి లేదు. అందుకే పైన వివరించిన రూపాల ప్రజా ఆందోళనలు ఎంతకాలం జరిగినా పాలకవర్గాలకు చీమ కుట్టినట్టయినా కాలేదు. ‘మీ ఆకాంక్షలు ఎంతగా ప్రకటించినా, మీ ఐక్యతను ఎంతగా ప్రదర్శించినా మేం చూడం, వినం, స్పందించం. మీరు ఎంచుకుంటున్న నిరసన రూపాలతో మాకేమీ నష్టం లేదు. మీ పాఠశాలలు మూతబడి మీ పిల్లల చదువే చెడిపోతుంది. మీ రాస్తాలు రోకో అయి మీ ప్రయాణాలే దెబ్బతింటాయి. మీ కార్యాలయాలు మూతబడి మీ పనులే ఆగిపోతాయి. మీ పిల్లల ఆత్మహత్యలు మీ కుటుంబాలలోనే విషాదం నింపుతాయి. మీ ఆటపాటలు, బతుకమ్మలు, ధూంధాంలు మీ ఆకాంక్షను, ఐక్యతను ప్రకటిస్తాయేమో గాని వాటివల్ల మాకేమీ నష్టం లేదు. మీరు ఏంచేసినా మాదేం పోతుంది’ అనుకునేంత దుర్మార్గమైన పాలకవర్గాలు ఇవాళ రాజ్యం చేస్తున్నాయి.
ఇక మరికొన్ని రూపాలయితే తెలంగాణ అస్తిత్వ ప్రత్యేకత పేరిట, సాంస్కృతిక చిహ్నాల పేరిట హైందవ, బ్రాహ్మణ్య, కులాచార, మూఢాచార పరిధి లోపలివి. ఆ రూపాలవల్ల తెలంగాణ ఆకాంక్షల ఐక్యతా ప్రదర్శన జరిగిందేమో గాని అవి ప్రత్యర్థుల మీద ఎటువంటి ప్రభావాన్నీ వేయగలిగినవి కావు. ఉద్యమంలో పాల్గొంటున్న సకల జనుల మధ్య సమానత్వాన్ని కాక అంతరాల దొంతరను పాటించేవి. మత, కుల అసమానతను ప్రోత్సహించేవి. అసలు శత్రువును వదిలేసి గడ్డిబొమ్మల మీద, దిష్టిబొమ్మల మీద కోపం తీర్చుకునే పేదవాని కోపం పెదవికి చేటు లాంటి రూపాలు అవి.
ఈ స్థితిలో పాలకవర్గాల మెడలు వంచాలంటే ప్రతిఘటన తప్పదు. సకల జనుల సమ్మె ప్రాముఖ్యత ఏమంటే అది మొదటిసారిగా ప్రతిఘటనను ముందుకు తెచ్చింది. ముఖ్యంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వ్యతిరేకించడానికి కోస్తాంధ్ర, రాయలసీమ పాలకవర్గాల ప్రధాన కారణం వారి రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలే గనుక, సకల జనుల సమ్మె ఆ రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు కొనసాగకుండా ప్రతిఘటించడానికి పూనుకుంది. సింగరేణి కార్మికుల సమ్మె గాని, ఆర్టీసీ సిబ్బంది సమ్మె గాని, వాణిజ్య పన్నుల విభాగపు సమ్మె గాని, రైల్ రోకో గాని రాష్ట్ర పాలకుల ఆర్థిక ప్రయోజనాలను గణనీయంగా దెబ్బతీశాయి.
అయితే ఈ ప్రతిఘటనలో కూడ ఒక లోపం ఉంది. తెలంగాణకు ప్రత్యర్థులు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, కోస్తాంధ్ర, రాయలసీమ పెత్తందారులు, తెలంగాణ ద్రోహులు కాగా సకల జనుల సమ్మెలో ప్రతిఘటన రాష్ట్ర ప్రభుత్వం మీద జరిగినంత ఎక్కువగా మిగిలిన ముగ్గురు ప్రత్యర్థులమీద జరగలేదు. ఆ నేపథ్యంలోనే ఎమ్మార్ మీద దాడి, తెలంగాణ ద్రోహులకు తమ స్థాయిలో సంఘ బహిష్కారం చేస్తామని రజకులు చేసిన ప్రకటన ఆహ్వానించదగినవి. నిజంగానే సకల జనుల సమ్మె రాష్ట్ర ప్రభుత్వాన్ని వణికించింది. అదే రకంగా మిగిలిన ముగ్గురు ప్రత్యర్థుల మీద ప్రతిఘటన సాగి ఉంటే ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉండేవి. కేంద్ర ప్రభుత్వ పరిశ్రమల కార్మికులు ఒకరోజు పనులు బందు పెట్టారు, రైల్ రోకో మొదటి మూడు రోజులు ప్రభావశీలంగా జరిగి కేంద్ర ప్రభుత్వానికి వణుకు పుట్టించింది.
కాని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక ప్రయోజనాల మీద నిజంగా ప్రభావం వేయగల బ్యాంకింగ్, బీమా, కమ్యూనికేషన్ వ్యవస్థలు ఒక్క రోజు కూడ, ఒక్క గంట కూడ ఆగలేదు. సకల జనుల సమ్మెలో రైల్వేల స్తంభన ఇంకా ఎక్కువ రోజులు సాగవలసి ఉండింది. దానితో పాటు ఈ మూడు రంగాలు కూడ చేరి ఉంటే ఫలితాలు భిన్నంగా ఉండేవి.
ఇక తెలంగాణ ఆకాంక్షలకు ప్రధాన ప్రత్యర్థి అయిన కోస్తాంధ్ర, రాయలసీమ ఆధిపత్యవాదుల ఆర్థిక ప్రయోజనాల మీద దెబ్బపడనంతవరకూ వారు తెలంగాణకు వ్యతిరేకంగా ఢిల్లీలోనూ హైదరాబాద్ లోనూ చక్రం తిప్పుతూనే ఉంటారు. వారు దిగివచ్చేలా చేయాలంటే వారు తెలంగాణను వ్యతిరేకించినంతకాలం వారి రాజకీయ ఆర్థిక ప్రయోజనాలు తెలంగాణలో సజావుగా సాగబోవనే హెచ్చరికను ఇవ్వవలసి ఉంటుంది. దురదృష్టవశాత్తూ తెలంగాణ ఉద్యమం తీవ్రంగా జరిగిన సమయంలో కూడ అటువంటి హెచ్చరిక రాలేదు. ఒకటి రెండు సినిమాలను ఆడనివ్వబోమనే హెచ్చరికలు, ఒకటి రెండు వ్యాపార సంస్థల మీద దాడులు మాత్రమే మినహాయింపు. కనీసం సకల జనుల సమ్మె సమయంలోనైనా ఈ పని ఎక్కువగా జరిగి ఉండవలసింది. ఒక్క ఎమ్మార్ ప్రాపర్టీస్ మీద దాడి మినహా మిగిలిన ఏ కోస్తాంధ్ర, రాయలసీమ ఆర్థిక ప్రయోజనాల మీద దాడి జరగలేదు. తెలంగాణకు వ్యతిరేకంగా ఢిల్లీలో మంత్రాంగం నడుపుతున్న సుబ్బరామిరెడ్డి గాయత్రీ కన్ స్ట్రక్షన్స్ రు. 1300 కోట్ల హైదరాబాద్ – రామగుండం రహదారి విస్తరణ పనులు ఉద్యమ జిల్లాల మీదుగా సజావుగా సాగుతూనే ఉన్నాయి. ఈ రెండు సంవత్సరాల ఉద్యమ సందర్భంలోనే తెలంగాణ వనరులను కొల్లగొట్టి వందల కోట్ల రూపాయలు సంపాదించే కోస్తాంధ్ర, రాయలసీమ రియల్ ఎస్టేట్, కాంట్రాక్ట్, రవాణా, చిట్ ఫండ్, విద్యా, వైద్య వ్యాపారులు వ్యాపారాలు హాయిగా చేసుకుంటూనే ఉన్నారు.
చివరి ప్రత్యర్థిగా తెలంగాణలోనే పుట్టి తెలంగాణ ప్రజా ఆకాంక్షలను వ్యతిరేకిస్తున్న ప్రజా ప్రతినిధులు, వ్యాపారవర్గాలు ఉన్నాయి. వారి రాజకీయ ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసే పని కూడ సకల జనుల సమ్మె చేయవలసినంతగా చేయలేదు.
ఇక సకల జనుల సమ్మె పట్ల పాలకుల ప్రతిస్పందనకు ఉదాహరణలు చూస్తే ఉద్యమకారుల మీద తీవ్రమైన నిర్బంధ కాండ జరిగింది. సమ్మెలో ఉన్న చెక్ పోస్టు రవాణా ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. రైతులకూ విద్యుత్ ఉద్యోగులకూ మధ్య వైరుధ్యం సృష్టించడానికి ప్రభుత్వ ప్రయత్నం చేసింది. ఒక ప్రజా ఉద్యమం జరిగేటప్పుడు ఆ ఉద్యమంలో భాగం కాదగిన వర్గాల మధ్య చీలికలు సృష్టించడం, తద్వారా ఉద్యమాన్ని బలహీన పరచడం పాలకులకు అలవాటే. తెలంగాణ ఉద్యమం ఇటువంటి చీలికలను నివారించి ఉండవలసింది. ఒకరిమీదికి మరొకరిని ఉసిగొలిపే ప్రయత్నాలను అరికట్టవలసి ఉండింది. ఆ పని కూడ సక్రమంగా, సకల జనుల సమ్మె స్ఫూర్తికి తగినట్టుగా జరగలేదు. సకల జనులలో కొందరయినా సకల జనుల సమ్మెలో భాగం కాలేదు. ముఖ్యంగా రాజకీయ నాయకత్వం తన పూర్తి శక్తి సామర్థ్యాలతో పాల్గొనలేదు.
ప్రభుత్వ స్పందనలలో అన్నిటికన్న అన్యాయమైనది ఈ రోజున ముఖ్యమంత్రి చేసిన ప్రకటన. రవాణా, ఇందిరా క్రాంతి పథం ఉద్యోగుల తొలగింపు, సస్పెన్షన్, నోటీసులు వంటి చర్యలు ఈ రోజునే ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా రవాణా ఉద్యోగులను తొలగిస్తూ ఉత్తర్వులు వచ్చాయి. ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యమకారులు రవాణా ప్రధాన కార్యాలయానికి వెళ్లి ఆందోళన చేసి ఆ ఉత్తర్వులను ఉపసంహరింపజేశారు. ఆ ఘటనపై స్పందిస్తూ ముఖ్యమంత్రి ఆ అన్యాయమైన ప్రకటన చేశారు. ఆందోళనకారులు కొన్ని కార్యాలయాల్లోకి వెళ్లి నోటీసుల రద్దుకు ఒత్తిడి తెచ్చిన విషయం తమ దృష్టికి వచ్చిందని, అలా రద్దు చేసే ఉత్తర్వులు చెల్లబోవని ముఖ్యమంత్రి అన్నారు.
ఇక ఈ రోజున వెలువడిన ఉద్యమ నాయకుల ప్రకటనలను మూడునెలలు గడిచిపోయిన తర్వాత చూస్తే వాటిలోని బోలుతనం, మాటలు కోటలు దాటినా చేతలు అంగుళం కూడ కదలకపోవడం కనబడతాయి. నిజానికి రాజకీయ నాయకుల గంభీర ప్రకటనలకు, దివాళాకోరు ఆచరణకు మధ్య తేడా తెలిసిన ఎవరికైనా ఈ ప్రకటనలను విశ్లేషించవలసిన అవసరమే లేదు. మూడు నెలల తర్వాత ఆ ప్రకటనలు, ఆ ప్రకటనకర్తలు ఎక్కడున్నారో అంచనా వేయడానికైనా ఒకసారి ఆ ప్రకటనలను గుర్తు చేసుకోవాలి. “తెలంగాణ ప్రాంత మంత్రుల ఢిల్లీ యాత్రలతో ఉపయోగం లేదు. సర్కారును పడగొట్టాలి” అనీ, “సీమాంధ్ర ప్రాంత బస్సులను అడ్డుకుంటాం” అనీ, “ఇక తెలంగాణ ప్రజలు, ఉద్యోగులు ముఖ్యమంత్రికే ఎస్మా నోటీసులు ఇస్తారు” అనీ ఒక నాయకుడు అనగా, “తెలంగాణ కోసం అవసరమైతే తలలు నరుక్కుంటాం గాని సీమాంధ్ర నాయకులకు తలవంచే ప్రసక్తి లేదు” అని మరొక నాయకుడు అన్నారు. “సమ్మె చేసి ఉద్యోగాల నుంచి తొలగించబడుతున్న సిబ్బంది ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత వారి ఉద్యోగాలన్నీ క్రమబద్ధీకరిస్తాం” అని ఒక నాయకుడు అనగా, “కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కేంద్రం ద్వారా తెలంగాణ తెప్పించడమో, అక్టోబర్ ఒకటి లోగా రాజీనామాలు చేయడమో తేల్చుకోవాలి. తెదేపా ప్రజాప్రతినిధులు చంద్రబాబుతో సానుకూల ప్రకటన చేయించడమో, పదవులను వీడి ప్రజల్లోకి రావడమో తేల్చుకోవాలి” అని మరొక నాయకుడు అన్నారు. “ముఖ్యమంత్రి అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నారు, ఆయన తీరు మార్చుకోకపోతే తెలంగాణ ప్రజలు ఊరుకోరు. ప్రభుత్వం తక్షణం తెలంగాణ ప్రకటన చేయాలి. లేని పక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవు” అని ఒక నాయకుడు అనగా, “చూస్తూ ఊరుకోబోం” అని మరొక నాయకుడు అన్నారు.
ఈ భీషణ ప్రతిజ్ఞలలో, గంభీర ప్రవచనాలలో ఒక్క శాతమైనా ఆచరణలోకి వచ్చిందో లేదో అందరికీ తెలిసిన విషయమే.
ఇక ఆ రోజునే తెలంగాణ ఉద్యమ నాయకులు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. ఆ కార్యాచరణ ప్రణాళికలో కార్మికుల ర్యాలీలు, రాస్తారోకోలు, ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి. హైదరాబాద్ నగర బంద్. కాగడాల ప్రదర్శన, బతుకమ్మ ఉత్సవాలు, దశకంఠ కాంగ్రెస్ సంహారం వంటి అంతకు ముందు జరుగుతున్నటువంటి కార్యక్రమాలే ఉన్నాయి. ఇకనుంచి ఉద్యమ తీరులో మార్పు ఉంటుందని కూడ ప్రకటించి టోల్ టాక్స్ బహిష్కరణ, రైల్ రోకో, సీమాంధ్ర బస్సులను అడ్డుకోవడం వంటి కార్యక్రమాలు కూడ ప్రకటించారు గాని ఈ మూడు ముఖ్యమైన, అవసరమైన కార్యక్రమాలు ఆ తర్వాత జరగలేదు, ప్రభావశీలంగా జరగలేదు.
తెలంగాణకు అడ్డుగా ఉన్న నలుగురు ప్రత్యర్థుల – రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, కోస్తాంధ్ర, రాయలసీమ ఆధిపత్యవాదులు, తెలంగాణ ద్రోహులు – రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటాయనే హెచ్చరిక రానంతవరకూ ఆ నలుగురూ తెలంగాణను అడ్డుకుంటూనే ఉంటారని మరొకసారి రుజువయింది. వారి రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలమీద ఎక్కుపెట్టిన తొలిప్రయత్నంగా సకల జనుల సమ్మె కొంత నిప్పును రాజేసింది గాని దాన్ని దావానలంగా మార్చలేకపోయింది. రాజకీయ నాయకత్వం తమ ప్రయోజనాల కొరకో, అధినాయకులకు లోబడో నీరు చల్లిన ఫలితంగా రాజుకున్న నిప్పు మీద కూడ నివురు కప్పింది. ఇవాళ తెలంగాణ సమాజం ఆ నివురు ఊది నిప్పు రాజేసే శక్తుల కోసం ఎదురుచూస్తున్నది.