వీక్షణం ఫిబ్రవరి 2012 సంచిక కోసం
సమాజంలోనూ, పుస్తకాలలోనూ, పత్రికలలోనూ, ఇతర ప్రచార సాధనాలలోనూ ఎన్నెన్నో తెలుసుకోవలసిన, ఆలోచించవలసిన విషయాలు ఉన్నప్పటికీ, వెలువడుతున్నప్పటికీ ప్రత్యేకంగా ఎత్తిచూపకపోవడం వల్ల వెలుగులోకి రాకుండా, ఆలోచనాపరుల దృష్టికి రాకుండా పోతున్నాయి. అటువంటి తెలుసుకోవలసిన విషయాలను మా దృష్టికి వచ్చినంతవరకు సేకరించి అందించడం ఈ శీర్షిక లక్ష్యం. ప్రజల అవగాహనల గూడును సుస్థిరంగా నిర్మించడానికే ఈ పుల్లా పుడకా.
***
ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలను ఒక్క మాటలో చెప్పాలంటే పెట్టుబడిదారీ విధానం మీద పెరుగుతున్న అసమ్మతి, మార్క్సిజం మీద పెరుగుతున్న ఆసక్తి అని చెప్పాలి. దాదాపు ప్రతి దేశంలోనూ పెట్టుబడిదారీ విధాన దుష్ఫలితాలను గుర్తించిన వేలాది, లక్షలాది ప్రజలు పెట్టుబడిదారీ పాలకవర్గాలకు, పాలనావిధానాలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ప్రత్యామ్నాయం గురించి భిన్నాభిప్రాయాలున్నప్పటికీ పెట్టుబడిదారీ విధానం మానవతకు హానికరమనే గుర్తింపు సర్వత్రా కనబడుతోంది. విస్తరిస్తోంది. చివరికి పెట్టుబడిదారీ సమర్థక సిద్ధాంతకర్తలు, ప్రచారసాధనాలు కూడ ఈ అభిప్రాయాలకు విలువ ఇవ్వక తప్పడం లేదు. ఇక మరొకవైపు, పెట్టుబడిదారీ విధానాన్ని వ్యతిరేకిస్తున్న శక్తులలో, తటస్థంగా ఉన్న శక్తులలో కూడ, పెట్టుబడిదారీ విధానం మీద బలమైన, లోతైన విమర్శను ఎక్కుపెట్టిన మార్క్సిజాన్ని మళ్లీ అధ్యయనం చేయాలనే ఆసక్తి ఇతోధికంగా పెరుగుతోంది. ఈ రెండు పరిణామాలకూ రెండు ఇటీవలి ముఖ్యసూచికలు:
లండన్ కేంద్రంగా 1888లో ప్రారంభమై, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇరవైరెండు కేంద్రాలనుంచి వెలువడుతూ, పెట్టుబడిదారీ విధానాన్ని సమర్థించే ప్రధానమైన వాణిజ్య దినపత్రిక ఫైనాన్షియల్ టైమ్స్ 2012 జనవరి 12న ‘సంక్షోభంలో పెట్టుబడిదారీ విధానం’ అనే ప్రముఖుల అభిప్రాయాల శీర్షిక ప్రారంభించింది. తొలిరోజున శీర్షిక పరిచయ సంపాదకీయం ‘కంపెనీలు తమ అత్యున్నత అధికారులకు ఇస్తున్న జీతాలలో ఏదో తప్పు ఉన్నదని అనుకోవడానికి వీథిలో శిబిరంలో కూచున్న నిరసనకారుడే కానక్కరలేదు. 1980లో బడాబాబుల జీతాలు సగటు ఉద్యోగి జీతానికి 14 రెట్లు ఎక్కువ ఉండేవి. గత 30 సంవత్సరాలలో అవి పెరిగి పెరిగి ఇప్పుడు 75 రెట్లు ఎక్కువ ఉన్నాయి…ఇది ఎంతమాత్రం సమర్థనీయం కాదు… ఈ స్థితిలో మన ఆర్థిక వ్యవస్థ సాధికారతే సమస్యగా మారింది’ అని రాసింది. ఈ శీర్షిక కింద గత రెండు వారాలలో బిల్ క్లింటన్ వంటి సామ్రాజ్యవాద ప్రతినిధులు, జెఫ్రీ సాక్స్ వంటి పెట్టుబడిదారీ స్టాక్ మార్కెట్ గురువులు, మహతిర్ మహమ్మద్ వంటి దళారీ పాలకులు పెట్టుబడిదారీ విధానాన్ని ఇంకా కాపాడగలమనే భ్రమతో చిట్కాలు రాయగా, అరుంధతీ రాయ్ వంటి విమర్శకులు పెట్టుబడిదారీ విధానపు దుర్మార్గ పర్యవసానాలను, దాన్ని కూలదోయవలసిన అవసరాన్ని వివరించారు. ఎవరు ఏమి రాశారనే దానికన్న ముఖ్యంగా ఒక అగ్రశ్రేణి పెట్టుబడిదారీ పత్రిక తమ వ్యవస్థ సంక్షోభంలో ఉన్నదని గుర్తించడమే, ఆ వ్యవస్థ దుస్థితికి నిదర్శనం.
పెట్టుబడిదారీ విధాన పతనం గురించి అలా పెట్టుబడిదారీ పత్రికలే రాయవలసి వస్తుండగా, మార్క్స్ మౌలిక రచనల మీద ఆసక్తి రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతున్నది. మార్క్స్ రచనల అమ్మకాలు, అధ్యయనం, చర్చలు కనీవినీ ఎరగనంతగా జరుగుతున్నాయి. ప్రపంచానికి ఏదో పెద్ద జబ్బు చేసిందనీ, అది మరింతగా ముదిరి ప్రస్తుతం బయటపడుతున్నదనీ, నిజమైన రోగ నిర్ధారణ చేసి, ఔషధం సూచించినది డాక్టర్ కార్ల్ మార్క్స్ మాత్రమేనని రోజురోజుకూ మరింత ఎక్కువమంది అర్థం చేసుకుంటున్నారు. ఈ ఆసక్తి శుష్కమైన ఆసక్తి కాదు. చాల లోతైన అధ్యయనం, చర్చ, వ్యాఖ్యానం, అన్వయం జరుగుతున్నాయి. అందుకు తాజా ఉదాహరణ చెప్పాలంటే: పెట్టుబడిదారీ ఆర్థిక సంక్షోభాల కారణాల గురించి మార్క్స్ చేసిన సూత్రీకరణలలో ప్రధానమైనది లాభాల రేటుకు నానాటికీ పతనమయ్యే ధోరణి ఉందనేది. ఈ సూత్రానికి కాలం చెల్లిందని, ఆ తర్వాత ప్రపంచం నూట నలభై సంవత్సరాలు ముందుకు నడిచిందని, ఆయన చెప్పినట్టు లాభాల రేటు పడిపోవడం వల్ల సంక్షోభం తలెత్తుతుందనే మాట నిజం కాదని చాలమంది పెట్టుబడిదారీ అర్థశాస్త్ర పండితులు వేలాది పేజీలు రాశారు. పాల్ స్వీజీతో సహా కొందరు మార్క్సిస్టు అర్థ శాస్త్రవేత్తలు కూడ ఈ చర్చలో పాల్గొని, మార్క్స్ పొరపాటు పడ్డాడని అంగీకరించారు. లాభాలరేటు తగ్గుతుందనడం సరికాదని అన్నారు. కాని సామ్రాజ్యవాద ఆర్థిక వ్యవస్థలు సంక్షోభంలో కూరుకుపోయిన ప్రస్తుత తరుణంలో ఆ సంక్షోభ కారణాల గురించిన చర్చ మళ్లీ రేకెత్తుతున్నది. లాభాల రేటు పడిపోవడం గురించి మార్క్స్ చేసిన సూత్రీకరణ సరైనదేనని వాదిస్తూ మార్క్సిస్టు అర్థశాస్త్రవేత్త ఆండ్రూ క్లిమన్ రాసిన ‘ది ఫెయిల్యూర్ ఆఫ్ కాపిటలిస్ట్ ప్రొడక్షన్ – అండర్ లైయింగ్ కాజెస్ ఆఫ్ ది గ్రేట్ రిసెషన్’ నవంబర్ 2011లో వెలువడింది. మార్క్సిస్టు అర్థశాస్త్రవేత్త మైకేల్ రాబర్ట్స్ తన బ్లాగ్ (http://thenextrecession.wordpress.com) లో డిసెంబర్ 8న ఆ పుస్తకంపై సమీక్ష రాశారు. నిండా ఆరు వారాలు పూర్తి కాకముందే ఆ వ్యాసం మీద రెండు వందల యాభై వ్యాఖ్యలు వచ్చాయి. కనీసం వంద వ్యాఖ్యలు మార్క్సిస్టు రాజకీయార్థిక సూత్రాల మీద లోతైన చర్చ చేశాయి. మార్క్సిజానికి, మార్క్సిస్టు దృక్పథానికి, ఆచరణకు కాలం చెల్లిందని వాదించే పండితమ్మన్యులు ఎక్కడ?
***
పెట్టుబడిదారులు పేదప్రజల రక్తం తాగి బతుకుతారు అనేది కేవలం కవితా వాక్యం కాదు, అతిశయోక్తి కాదు. పెట్టుబడిదారులు, సంపన్నులు బతికేది పేద ప్రజల మీదనే. పేద ప్రజలతో శ్రమ చేయించుకుని ఆ శ్రమకు తగిన ఫలితం ఇవ్వకుండా శ్రమను కొల్లగొట్టడం ఒక ఎత్తయితే, ఆ పేదప్రజలకు నిత్యమూ అవసరమైన సరుకులను, అంత అవసరం కాకపోయినా అలవాటు చేసిన, మప్పిన సరుకులను వారికి అమ్మడం ద్వారా సంపాదించే లాభాలు మరొక ఎత్తు. ఈ సరుకుల అమ్మకాల మార్కెట్ ఎంత విశాలమైనదో, సాలీనా ఎన్ని కోట్ల రూపాయల సరుకులు అమ్మి, ఎంత లాభాలు గడించడానికి అవకాశం ఉన్నదో మార్కెట్ పరిశోధనా సంస్థలు ఎప్పటికప్పుడు లెక్కలు వేస్తుంటాయి. ఈ పరిశోధనా సంస్థల పరిభాషలో ఎఫ్ ఎం సి జి (ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ -త్వరితగతిన అమ్ముడయ్యే వినియోగ సరుకులు) మార్కెట్ అనేది సాధారణంగా మనం కొనే నిత్యజీవితావసర సరుకుల మార్కెట్. దేశంలో పట్టణ ప్రాంతాలలో మురికివాడలలో నివసించే ప్రజానీకం సాలీనా ఈ ఎఫ్ ఎం సి జి మార్కెట్ లో ఎంత ఖర్చు పెడుతున్నారు అని ఇటీవల ఒక పరిశోధన జరిగింది. ఆ పరిశోధన ప్రకారం ఈ మార్కెట్ విలువ అక్షరాలా ముప్పై వేల కోట్ల రూపాయలు. అంటే కనీసపక్షం పదివేల కోట్ల రూపాయల లాభం అన్నమాట. ఆ వర్గీకరణలోని కుటుంబాల సగటు నెలసరి ఆదాయం రు. 12,000కు మించనప్పటికీ, మొత్తం దేశంలోని వినియోగ సరుకుల మార్కెట్ లో పది శాతాన్ని వాళ్లు ఆక్రమిస్తున్నారు. కనుక ఈ రంగంలో సరుకులు తయారు చేసే ఉత్పత్తి, వ్యాపార సంస్థలు ఈ మురికివాడల వాసుల కోసం తమ ఉత్పత్తులను ఎలా మార్చాలి, ఎలా ప్యాకేజి చేయాలి, వాటికి ఎటువంటి ఆకర్షణీయమైన వ్యాపార ప్రకటనలు తయారు చేయాలి అని పరిశోధనలు సాగుతున్నాయి. ఈ మార్కెట్ ను ‘ఇండియా 2’ అని పిలుస్తూ ఈ రంగంలోకి ప్రవేశిస్తున్న ఫ్యూచర్ గ్రూప్ అనే వ్యాపార సంస్థ మహానగరాలలో చౌకధరల దుకాణాలు తెరవదలచింది. మురికివాడల వాసులు కొనే 300 సరుకులను ప్రత్యేకంగా ఎంపికచేసి వాటిని 10 నుంచి 20 శాతం తక్కువధరలకు అమ్మనుంది. పిరామల్ హెల్త్ కేర్, డాబర్ ఇండియా, పెప్సికో ఇండియా, నెస్లె ఇండియా వంటి బహుళజాతి సంస్థలు మురికివాడల వినియోగదారులకోసం తమ సరుకులను తక్కువ ధరల చిన్న ప్యాకెట్లలో విడుదల చేస్తున్నాయి. లాభాల వేటలో పెట్టుబడిదారులు ఎన్నెన్ని పనులు చేస్తారు!!
*
దేశంలోని ప్రజలందరికీ రోజుకు రెండు పూటలా తిండి దొరుకుతోందా? ఆకలిచావుకు బలి కాని స్థితి ఉందా? దేశం లోని ప్రజలందరికీ వంటి మీద చాలినంత బట్ట, ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షించుకోవడానికీ, గౌరవప్రదంగా కనబడడానికీ తగినంత బట్ట దొరుకుతోందా? దేశంలోని ప్రజలందరికీ ఉండడానికి ఇళ్లున్నాయా, చలి నుంచీ, ఎండ నుంచీ, వాననుంచీ కాపాడుకోవడానికి ఆశ్రయముందా? దేశంలోని గ్రామాలన్నిట్లో ప్రజలకు ఆరోగ్యకరమైన మంచినీటి సౌకర్యం ఉందా? దేశంలో చదువుకోదగిన వయసులో ఉన్న బాల బాలికలందరికీ పాఠశాలలు అందుబాటులో ఉన్నాయా? దేశ ప్రజలందరికీ మానవులుగా దక్కవలసిన ఆత్మగౌరవం దక్కుతోందా? ఇటువంటి ప్రశ్నలు ఎన్నయినా వేసుకోవచ్చు, అన్ని ప్రశ్నలకూ లేదు అని జవాబు చెప్పుకోవచ్చు. కాని దేశప్రజలకు టెలిఫోన్ సౌకర్యాలు ఉన్నాయా అని ప్రశ్న వేసుకుని చూడండి. ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి, అదంతా ప్రపంచీకరణ చలవే అని వ్యవస్థా నిర్వాహకుల దగ్గరినుంచి తమను తాము మేధావులుగా గుర్తించుకునే వాళ్లవరకూ అందరూ అంటున్నారు. దేశ జనాభాలో 68 శాతం మందికి, అంటే తొంబై కోట్లకు పైగా ప్రజలకు టెలిఫోన్ అందుబాటులో ఉంది. వీటిలో 88 కోట్ల ఫోన్లు వైర్ లెస్ ఫోన్లు (సెల్ ఫోన్లు) కాగా, 3 కోట్ల ఫోన్లు వైర్ లైన్ ఫోన్లు. వీటిలో బిఎస్ ఎన్ ఎల్, ఎం టి ఎన్ ఎల్ వంటి ప్రభుత్వరంగ సంస్థల వాటా 12 శాతం కాగా మిగిలిన ఫోన్లన్నీ ప్రైవేటురంగ సంస్థలవే. పట్టణ ప్రాంతాలలో ప్రతి 100 మందికి 151 ఫోన్లు ఉండగా, గ్రామీణ ప్రాంతాలలో ప్రతి 100 మందికి 32 ఫోన్లు ఉన్నాయి. కేంద్ర కమ్యూనికేషన్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి లోక్ సభలో ఇచ్చిన లిఖిత సమాధానంలో దేశవ్యాప్తంగా 6,80,465 మొబైల్ టవర్లు, బేస్ ట్రాన్స్ మిటింగ్ స్టేషన్లు ఉన్నాయని, వీటి ద్వారా కోట్లాది మంది మొబైల్ వినియోగదారుల అవసరాలు తీరుతున్నాయని అన్నారు. ఈ సంఖ్య దేశంలోని మొత్తం నగరాలు, పట్టణాలు, గ్రామాలు కలిపితే వచ్చే అంకెకు దాదాపు సమానం. అంటే సగటున ప్రతి గ్రామానికీ ఒక మొబైల్ టవర్ ఉన్నదన్న మాట. ఇవి ప్రజల మధ్య సంబంధాలు పెంపొందించడమూ, ఎక్కువ సంభాషణకు అవకాశం కలిగించడమూ, రేడియేషన్ ప్రభావంతో పర్యావరణాన్నీ, మానవ ఆరోగ్యాన్నీ ధ్వంసం చేయడమూ అలా ఉంచి, అన్నిటికన్న ప్రధానమైనవి ఈ రంగంలో లాభాలు. ఈ రంగం మార్కెట్ ఆదాయం సాలీనా మూడు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు. అందులో అత్యధిక భాగం ప్రైవేటు, బహుళజాతి సంస్థలదే. మరి సెల్ ఫోన్లు మన అవసరం కోసం ఉన్నాయా, పెట్టుబడిదారుల లాభాలకోసం వచ్చి, మన అవసరాలు తీర్చినట్టు కనబడుతున్నాయా?
*
మొబైల్ టవర్లు ఎక్కువగా ఉంటే, ప్రజలందరికీ మొబైల్ ఫోన్ సౌకర్యం దొరికితే ఎందుకు అభ్యంతరం, మనుషులు మాట్లాడుకుంటే మంచిదే గదా అని ప్రశ్న రావచ్చు. కాని ఈ మొబైల్ ఫోన్లు ప్రజల అవసరాలను ఎంతగా తీరుస్తున్నాయో అనుమానమే గాని, పెట్టుబడిదారీ సంస్థలకు మాత్రం వేల కోట్ల రూపాయల లాభాలు సమకూర్చి పెడుతున్నాయి. భారత దేశంలోని బడా కంపెనీలలో నుంచి ప్రతి సంవత్సరం ఆదాయం రీత్యా, లాభాల రీత్యా బడాబడా కంపెనీలు 200 ఎంపిక చేసి వాణిజ్య పత్రిక ది ఎకనమిక్ టైమ్స్ ఇటి 200 అని ఒక జాబితా తయారు చేస్తుంది. 2011 డిసెంబర్ లో విడుదలయిన ఈ జాబితాలో టెలికమ్యూనికేషన్ సేవలు అందించే సంస్థలు ఐదు ఉన్నాయి. భారతీ ఎయిర్ టెల్ 12వ స్థానంలో, రిలయన్స్ కమ్యూనికేషన్స్ 34వ స్థానంలో, ఐడియా సెల్యులర్ 50 వ స్థానంలో, టాటా కమ్యూనికేషన్స్ 63వ స్థానంలో, ఎం టి ఎన్ ఎల్ 189వ స్థానంలో ఉన్నాయి. వీటిలో భారతీ ఎయిర్ టెల్ మొత్తం ఆదాయం రు. 59,602 కోట్లు, పన్ను చెల్లించిన తర్వాత మిగిలిన లాభం రు. 6,047 కోట్లు, రిలయన్స్ కమ్యూనికేషన్ ఆదాయం రు. 23,108 కోట్లు, లాభం రు. 1,346 కోట్లు. ఐడియా సెల్యులర్ ఆదాయం రు. 15,503 కోట్లు, లాభం రు. 899 కోట్లు. టాటా కమ్యూనికేషన్స్ ఆదాయం రు. 12,133 కోట్లు. లాభం రాలేదని, రు. 854 కోట్లు నష్టం వచ్చిందని నమోదు చేశారు. ఇక ప్రభుత్వ రంగ ఎం టి ఎన్ ఎల్ ఆదాయం రు. 3,992 కోట్లు, లాభం రాలేదని, రు. 2,802 కోట్లు నష్టం వచ్చిందని నమోదు చేశారు. ఇవి ఎంత దొంగ లెక్కలో, ఎలా ఆదాయాన్ని, లాభాలను తక్కువ చేసి చూపించడం జరిగిందో వేరే కథ. ఉన్నవి ఉన్నట్టుగా నమ్మినా మొదటి మూడు స్థానాలలో ఉన్న ప్రైవేట్ టెలికాం సంస్థలు ఒక్క సంవత్సరంలోనే రు. 8,292 కోట్ల లాభం సంపాదించాయి. దేశ సంపద దుర్వినియోగం అవుతున్నట్టా, సద్వినియోగం అవుతున్నట్టా?
Very well written. Very informative too!.