ఆంధ్ర విద్యాలయ కళాశాల సదస్సు (2012 జనవరి) కోసం
“తిరుగుబాటు మనిషి బ్రతుకు
బ్రతుకనదగు బ్రతుకు
బ్రతకదలచినట్టి మనిషి బ్రతుకు
తిరుగుబాటు”[1]
ఏ విశేషణాలూ ఏ బిరుదులూ ఏ పొడి అక్షరాల హోదాలూ ఏ వర్గీకరణలూ అవసరం లేని ఇరవయో శతాబ్ది తెలంగాణ మహోన్నత వ్యక్తిత్వం కాళోజీ (1914-2002). ప్రజాకవి అన్నా, రచయిత అన్నా, వక్త అన్నా, పౌరహక్కులకోసం అవిశ్రాంతంగా పనిచేసినవాడన్నా, స్వాతంత్ర్య సమరయోధుడన్నా, తెలంగాణ వాది అన్నా, పద్మ విభూషణ్ అన్నా, సంభాషణా చతురుడన్నా అవన్నీ మన మన కోణాల నుంచి ఆయనను చిత్రించడానికి, పట్టుకోవడానికి ప్రయత్నించడమే గాని అవేవీ ఆయన వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించగలిగినవి కావు.
ఆయన బహుముఖ వ్యక్తిత్వంలో ఇటువంటి ఏదో ఒక కోణాన్ని మాత్రమే చూపించే ప్రయత్నాలు ఇప్పటికి ఎన్నో జరిగాయి[2]. భవిష్యత్తులోనూ జరగవచ్చు. అలా అన్ని రకాల అధ్యయనాలకూ వివరణలకూ విశ్లేషణలకూ అవకాశమిచ్చే తొమ్మిది దశాబ్దాల నిండు జీవితాన్ని, అందులో ఏడు దశాబ్దాలకు పైగా ప్రజాజీవితాన్ని, విస్తృతమైన రచనను మనకు విశ్లేషణా వస్తువుగా, ఆదర్శంగా, ఉదాహరణగా, పాఠంగా మిగిల్చి వెళిపోయిన వాడు కాళోజీ. నిజంగానే ఆయనను ఏ ఒక్క అంశంతోనో ముడిపెట్టి సంపూర్ణంగా వివరించడం సాధ్యం కాదు. ఆయన జీవితంలోని ఏదో ఒక భాగం, ఏదో ఒక పార్శ్వం ఏ వర్గీకరణకైనా లొంగవచ్చు గాని, దానికి మినహాయింపులు, సవరణలు, భిన్నమైన, ప్రతికూలమైన ఉదాహరణలు కూడ ఎన్నో ఉంటాయి. ఆ కాలపు తెలంగాణ బుద్ధిజీవులు చాలమందిలో ఇటువంటి బహుముఖ ప్రజ్ఞ, బహుళ జీవితాచరణ ఉన్నాయి[3]. వారిలో చాలమందిని వారు పనిచేసిన ఏదో ఒక రంగంతో గుర్తించినట్టుగానే, కాళోజీని కూడ ఏదో ఒక గుర్తింపుకు కుదించి చూడడమూ ఉంది.
కాళోజీ లోని ఈ బహుళత్వాన్ని గుర్తిస్తూనే, ఆయన సారాంశాన్ని ఒక్క మాటలో చెప్పడం ఎట్లా అని ఆలోచించినప్పుడు అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటమే, తిరుగుబాటే ఆయన జీవితాదర్శం అని సూత్రీకరించవచ్చుననిపిస్తుంది. పాఠశాల విద్యార్థి దశ నుంచి మరణానికి కొద్దినెలల ముందు వరకూ ఆయన సాంఘిక జీవితం మొత్తంలోనూ ఆయాకాలాలలో అన్యాయం అని ఆయన భావించిన, గుర్తించిన అంశాల మీద తిరుగుబాటే, పోరాటమే ఆయన స్వభావంగా కొనసాగింది. ఆ తిరుగుబాటును ఆయన కవిత్వంలో, సంభాషణలో, ఉపన్యాసంలో, ఆచరణలో, సామాజిక జీవనంలో ప్రతి చోటా చూపాడు, ఆచరించాడు. ఆ తిరుగుబాటు స్వభావానికి, పోరాట శీలానికి ఆయన కవిత్వంలోనూ, జీవితాచరణలోనూ వందలాది ఉదాహరణలు దొరుకుతాయి. వాటిలోంచి నాలుగైదు ఉదాహరణల ద్వారా, ఆయన జీవితాదర్శం పోరాటమేననీ మిగిలిన పనులన్నీ ఆ మౌలిక ధాతువుకు విస్తరణలూ కొనసాగింపులూ ప్రతిఫలనాలూనని వివరించే ప్రయత్నమే ఈ వ్యాసం.
అన్యాయాన్ని ఎదిరించే తిరుగుబాటు తత్వాన్ని ప్రదర్శించడం వ్యక్తిగత స్థాయిలోనూ, సామాజిక స్థాయిలోనూ జరుగుతుంది. వ్యక్తి తన జీవితంలో ఎదురయ్యే అన్యాయాలను ఎదిరించవచ్చు. ఆ తిరుగుబాటును రచనలో చూపవచ్చు. తనలాగే తిరుగబడే ఇతరులతో కలిసి సామాజికాచరణలో పాల్గొని ఆ తిరుగుబాటును సంఘటితం చేయవచ్చు. ఇలా వ్యక్తి, వ్యక్తీకరణ, సామాజికాచరణ అనే మూడు స్థాయిలలోనూ కాళోజీ తన తిరుగుబాటును చూపాడు.
‘అన్యాయాన్నెదిరించడం
నా జన్మహక్కు – నా విధి’
‘అన్యాయాన్నెదిరిస్తే
నాగొడవకు సంతృప్తి
అన్యాయం అంతరిస్తే
నా గొడవకు ముక్తి ప్రాప్తి
అన్యాయాన్నెదిరించినోడు
నాకు ఆరాధ్యుడు’
అనే కవితా పాదాలు కాళోజీ కవిత్వానికి, వ్యక్తిత్వానికి పర్యాయపదంగా అనేకసార్లు ఉటంకించబడ్డాయి. ఈ మాటలు ఆయన 1960ల చివరినుంచీ ఉపన్యాసాలలో చెపుతూ వచ్చాడు. రచనలలో చూస్తే 1975లో రాసిన ‘విన్నావా? వెంగళ్రావ్…’ లో మొదటిసారి నాలుగు పాదాలు, 1980లో రాసిన ‘అన్యాయం అంతరించాలె’ కవిత[4]లో మొత్తం పాదాలు కనబడుతున్నాయి. ఇంకా వెనక్కి వెళితే అవే మాటల్లో కాకపోయినా ఈ భావాలు ఎమర్జెన్సీ కాలంలో రాసిన కవిత్వం అంతటిలోనూ కనబడుతున్నాయి.
అలాగే అంతకు ముందు 1971లో రాసిన ‘తిరగబడమంటే తప్పా?’ కవిత లోనూ, 1970లో రాసిన ‘మార్చ్ ఆన్’[5] కవిత లోనూ, 1940ల కవిత్వంలోనూ, ముఖ్యంగా 1948 లో బైరాన్ పల్లి హత్యాకాండ తర్వాత జైలులో రాసిన ‘కాటేసి తీరాలె’ కవితలోనూ కనబడుతున్నాయి. ఆయన తొలి రచనలలో ఒకటయిన, 1941లో అచ్చయిన ఎచ్ ఎన్ బ్రెయిల్స్ ఫర్డ్ పుస్తకానువాదానికి ‘నా భారతదేశ యాత్ర’ అనే తటస్థమైన పేరు పెట్టారు గాని, మూలంలో దాని పేరు ‘రెబెల్ ఇండియా’. అలా తిరుగుబాటు తత్వం ఆయన రచనలలో 1941 నుంచీ ఉన్నదనవచ్చు. జనవరి 2002లో హైదరాబాదులో అఖిలభారత విప్లవసాంస్కృతిక సమితి మహాసభల ప్రారంభోపన్యాసంలో, అప్పుడే జరిగిన పద్మాక్షమ్మ గుట్ట ఎన్ కౌంటర్ ను ఖండిస్తూ ‘అన్యాయాన్నెదిరించినవాడు నాకు ఆరాధ్యుడు’ అనే మాటలు దాదాపు చివరిసారిగా చెప్పాడు. అంటే ఆయన వ్యక్తీకరణలో తిరుగుబాటు తత్వం అరవై సంవత్సరాల పాటు నిరంతరాయంగా సాగిందన్నమాట.
ఇక జీవితంలో తిరుగుబాటు తత్వమైతే ఆయనే ‘ఇదీ నాగొడవ’లో చెప్పుకున్న సుప్రసిద్ధమైన ఉన్నత పాఠశాల ఘటన దగ్గరనే మొదలయిందనాలి. అప్పుడు వరంగల్ కాలేజియేట్ హైస్కూల్ విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి కాళోజీ. గణపతి ఉత్సవాలకు సెలవు ఇవ్వబోమని యాజమాన్యం, ప్రిన్సిపాల్ నిర్ణయించడం కాళోజీకి అన్యాయం అనిపించింది. మొత్తం విద్యార్థులు 1400 అయితే అందులో 1200 మంది విశ్వాసాలకు వ్యతిరేకమైన ఈ అన్యాయమైన నిర్ణయాన్ని ఎదిరించాలని కాళోజీ అనుకున్నాడు. అప్పటికప్పుడు, కార్బన్ పేపర్లు కూడ లేని ఆ రోజుల్లో, పదకొండువందల పైగా సెలవు చీటీలు రాసి, విద్యార్థుల చేత క్లాస్ టీచర్లకు ఇప్పించి ఆ అన్యాయాన్ని ధిక్కరించాడు.
అది ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడి మీద వ్యక్తిగత స్థాయి తిరుగుబాటు అయితే, ఆంధ్ర మహాసభ నిర్మాణం లోపల కాళోజీ చేసిన తిరుగుబాటు ప్రజాస్వామిక విశ్వాసం కోసం, సమన్వయ దృష్టితో, స్థలకాలాల స్పృహతో చేసినది. అప్పటి సామాజిక స్థితిలో తెలంగాణ ప్రజలందరి ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించే ఉమ్మడి సంస్థగా ఆంధ్ర మహాసభ ఉండాలని, అది చీలిపోగూడదని కాళోజీ కోరుకున్నాడు. అది వర్గపోరాటాన్ని ప్రేరేపించే కమ్యూనిస్టుల సంస్థగా మారిపోతున్నది గనుక దాని నుంచి వైదొలగాలని అనుకున్నవాళ్లు ఎంత పెద్దవాళ్లయినా, గౌరవనీయులైనా సంస్థను చీల్చడం అన్యాయమే అని కాళోజీ అనుకున్నాడు. నిజానికి ఆయనకు రెండో పక్షం అయిన కమ్యూనిస్టుల మీద కూడ తీవ్రమైన విమర్శలే ఉన్నాయి. కాని చీలిక అన్యాయమని తాను అనుకున్నాడు గనుక, ఆ అన్యాయాన్ని ఎదిరిస్తూ, తనకు పూర్తి ఏకీభావం లేకపోయినా కమ్యూనిస్టుల ఆంధ్ర మహాసభలో కొనసాగాడు. ఆ పదకొండో ఆంధ్ర మహాసభ (బోనగిరి, 1944) సందర్భం గురించి ‘ఇదీ నాగొడవ’లోనూ, వట్టికోట ఆళ్వారుస్వామితో కలిసి కాళోజీ రాసిన లేఖలలోనూ ఈ తిరుగుబాటు కనబడుతుంది.
మొగిలయ్య హత్య తర్వాత వరంగల్ లో జరిగిన కవిసమ్మేళనంలోనూ, అరెస్టయి జైలులో ఉండి బైరాన్ పల్లి హత్యాకాండ గురించి విన్న సందర్భంలోనూ కాళోజీ ప్రదర్శించిన తిరుగుబాటు తత్వం, రాసిన కవితలు సుప్రసిద్ధమైనవే.
వలసవ్యతిరేక జాతీయోద్యమంలోనూ, నిజాం వ్యతిరేక పోరాటంలోనూ వ్యక్తిత్వాలు వికసించిన అనేక మంది నిజమైన దేశభక్తులకు, ప్రజాస్వామికవాదులకు అశనిపాతం ఎమర్జెన్సీ (1975-77). కేవలం తన అధికారం నిలుపుకోవడం కోసం దేశ ప్రజలందరి ప్రాథమిక హక్కులను రద్దు చేస్తూ ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ ప్రజాస్వామికవాదులందరినీ కదిలించింది. లక్షలాది మంది ప్రభుత్వ వ్యతిరేక కార్యకర్తలు, ఆలోచనాపరులు జైళ్లలో కుక్కబడిన ఆ సందర్భంలో బైట ఉండి అవకాశం వచ్చిన చోటనల్లా ఆ తిరుగుబాటును ప్రకటించినవాడు కాళోజీ. నిజానికి దేశంలో ఎమర్జెన్సీ విధించడానికి ముందు బంగ్లాదేశ్ యుద్ధ సమయం నుంచీ విదేశాంగ ఎమర్జెన్సీ అమలులో ఉండేది. ఆ ఎమర్జెన్సీని ఎత్తివేయాలని దేశీయ ఎమర్జెన్సీ ప్రకటించకముందే డిమాండ్ చేస్తూ వరంగల్ లో ఊరేగింపుకు పిలుపు ఇచ్చినవాడు కాళోజీ. ఆ ఊరేగింపు ప్రకటించిన సమయానికి తాను తప్ప ఎవరూ రాకపోతే ఒక్కడే ప్లకార్డు పట్టుకుని నడిచినవాడు కాళోజీ.
ఎమర్జెన్సీలో జరిగిన బూటకపు ఎన్ కౌంటర్ల గురించి ప్రజలపక్షాన నిజనిర్ధారణ జరపడానికి ఏర్పడిన తార్కుండే కమిటీలో భాగం కావడం లోనూ, నరహంతకుడుగా రుజువైన జలగం వెంగళరావు మీద ఎన్నికల్లో ప్రతీకాత్మకంగానైనా పోటీకి నిలబడాలని అనుకోవడంలోనూ కనబడే కాళోజీ తిరుగుబాటు తత్వం అందరికీ తెలిసినదే.
ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర విషయంలోనైతే తన మీద తానే తిరుగుబాటు చేసుకుని అన్యాయాన్ని ఎదిరించడంలో అగ్రభాగాన నిలబడిన వాడు కాళోజీ. భాషా సాహిత్యాల మీద ప్రేమ వల్ల 1950ల తొలిరోజుల్లో విశాలాంధ్ర మహాసభలో భాగమై, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని అంగీకరించనప్పటికీ, అతి త్వరలోనే ‘ఎవరనుకున్నారు? ఇట్లౌనని ఎవరనుకున్నారు?’ అని గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఎదిరిస్తూ 1968 నుంచి 2002 దాకా కాలికి బలపం కట్టుకుని తిరిగి ‘రెండున్నర జిల్లాల రెండున్నర కులాల’ మీద తిరుగుబాటును ప్రకటించినవాడు కాళోజీ. ప్రాంతేతరుడి దోపిడీ మీద మాత్రమే కాదు, ప్రాంతం వాడి దోపిడీ మీద కూడ తిరుగుబాటును ప్రకటించినవాడు కాళోజీ.
అలా అన్యాయాన్ని ఎదిరించడమే తన జీవితాదర్శంగా ప్రకటించడం మాత్రమే కాదు, ఏడు దశాబ్దాలకు పైగా ఆచరించి చూపినవాడు కాళోజీ. అన్యాయాన్ని సాగనివ్వగూడదని, ఎదిరించాలని ఆదర్శం బహుశా మానవసహజం కావచ్చు. న్యాయాన్యాయ భావన సాంస్కృతికంగా రూపొందేదే అయినా, దానిలో కొంత సహజాతమూ ఉంది. మనిషి సంఘ జీవి గనుక, సంఘ జీవి కాకపోతే మనిషి మనుగడే అసాధ్యం గనుక, ఆ సంఘ జీవితం ఏదో ఒక సమన్వయంతో సమన్యాయంతో సమానత్వంతో సాగడం తప్పనిసరి అనే అవగాహన సహజంగా రావలసిందే.
కాని సహజ జీవితాన్ని అసహజం చేయడమే మానవ పరిణామ క్రమంలో నాగరికత సాధించిన విజయం. సమష్టి కృషి ద్వారా వెలువడిన ఉత్పత్తిని సొంతం చేసుకోవాలనే సొంత ఆస్తి భావన వచ్చిన తర్వాత, ఆ ఆస్తిని తన సొంతానికి మాత్రమే కాక తన రక్త బంధువులకు అందించాలనే కుటుంబ భావన వచ్చింది. అన్యాయం మొదలయింది. ఆ క్రమంలో సొంత ఆస్తి కోసం సాగే దోపిడీ పీడనలను కాపాడడానికి రాజ్యం పుట్టుకువచ్చింది. అన్యాయమే రాజ్య స్వభావం అయిపోయింది. రాజ్యం సజావుగా సాగిపోవాలంటే ఈ అన్యాయ స్వభావాన్ని ప్రతి మనిషిలోనూ నింపవలసి వస్తుంది. మనిషిలోని సహజమైన న్యాయ స్వభావాన్ని తుడిచేయవలసి వస్తుంది. ఆస్తిపరవర్గాలు, పాలకవర్గాలు, రాజ్యం చేసే సకల ప్రయత్నాలూ అన్యాయాన్ని సహజమైనదిగా చూపే ప్రయత్నాలే.
ఆ ప్రయత్నంలో రాజ్యానికి సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక రాజకీయ వ్యవస్థలు ఉపయోగపడతాయి. అన్యాయాన్ని సమర్థించే సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక రాజకీయ వ్యవస్థలు ఏర్పడతాయి. అన్యాయాన్ని ఎదిరించాలనే సహజాతమైన కోరిక కూడ మనిషిలో ఉంది గనుక ఆ వ్యవస్థల మీద వ్యతిరేకత, ధిక్కారం కూడ సమాంతరంగా వ్యక్తమవుతూనే ఉంటాయి. ఈ ఘర్షణలో అసంఖ్యాక ప్రజలను మభ్యపెట్టడానికి అసలు అన్యాయానికి తప్పుడు అర్థాలు ఇవ్వడం, చాల ఎక్కువగా జరిగిపోతున్న అన్యాయాన్ని అన్యాయమని గుర్తించే పరిస్థితే ఉండకపోవడం జరుగుతాయి. న్యాయాన్యాయాల భావనే ఇలా గందరగోళానికి గురయినప్పుడు నిజంగా న్యాయపక్షం వహించి, అన్యాయాన్ని ఎదిరించే మనుషులు తక్కువమంది ఉండడం కూడ సహజమవుతుంది.
అటువంటి అరుదైన తక్కువమంది సహజమైన మనుషులలో, తిరుగుబాటుదారులలో ఒకరు కాళోజీ. అన్యాయాన్నీ, ఆస్తినీ, దౌర్జన్యాన్నీ, రాజ్యాన్నీ ఆయన వేరు చేసి చూడలేదు. ‘అసామ్య సమాజంలో/ ఆర్జనయే దౌర్జన్యం’[6] అని గుర్తించిన కాళోజీ అసమ సమాజానికీ, ఆర్జనకూ, దౌర్జన్యానికీ వ్యతిరేకంగా ఎలుగెత్తడమే తన జీవిత లక్ష్యంగా చేసుకున్నాడు. దౌర్జన్యానికి మూర్తీభవ రూపమైన రాజ్యానికి వ్యతిరేకంగా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రాజరిక పాలన నాటి నుంచి చంద్రబాబు నాయుడు “పార్లమెంటరీ ప్రజాస్వామిక” పాలన దాకా ఆరు దశాబ్దాల పాటు తిరుగుబాటును కొనసాగిస్తూ నిరంతర పోరాటానికి పూనుకున్నాడు.
[1] మార్చ్ ఆన్ – నాగొడవ, కాళోజీ కవితల సమగ్ర సంకలనం, కాళోజీ ఫౌండేషన, 2001, పే. 172.
[2] ఉదాహరణలు చెప్పాలంటే, సాహిత్య అకాడమీ కోసం భారతీయ సాహిత్య నిర్మాతలు శీర్షిక కింద పేర్వారం జగన్నాథం రాసిన ‘కాళోజీ నారాయణ రావు’ జీవిత చరిత్ర, కాళోజీ కవితల సంపూర్ణ సంకలనం ‘నాగొడవ’కు బి. తిరుపతి రావు రాసిన ముందుమాట చూడవచ్చు.
[3] ఈ అంశంలో మరిన్ని ఆలోచనల కోసం నా వ్యాసాలు ‘తెలంగాణ వైతాళికుడుగా వట్టికోట ఆళ్వారు స్వామి’, ‘సురవరం ప్రతాపరెడ్డి సామాజిక జీవితం’ (స్వేచ్ఛాసాహితి ప్రచురణ ‘లేచినిలిచిన తెలంగాణ’, 2010) చూడవచ్చు.
[4] నాగొడవ కవితల సంపూర్ణ సంకలనం పే. 326లో అచ్చయిన ఈ కవిత కింద తేదీ లేదు గాని, కవితలో రమీజాబీ, షకీలా ప్రస్తావన ఉంది గనుక, ‘1980లో కాళోజీ మాట’ అనే పాదం కూడ ఉంది గనుక ఇది 1980 కవిత కావచ్చు.
[5] నాగొడవ కవితల సంపూర్ణ సంకలనం పే. 172లో అచ్చయిన ఈ కవిత కింద 1968 అని తేదీ ఉంది గాని, దీనిలో ప్రస్తావించిన మార్చ్ కవితాసంకలనం 1970 జూలైలో, ఝంఝ కవితాసంకలనం 1970 అక్టోబర్ లో వెలువడినందువల్ల ఈ కవిత 1970 అక్టోబర్ తర్వాతది అయి ఉండడానికే ఎక్కువ అవకాశం ఉంది.
[6] అసామ్య సంఘంలో, నాగొడవ కవితల సంపూర్ణ సంకలనం, పే. 106.
“అలజడి మా ఊపిరి, ఆందోళన మా సిద్దాంతం, తిరుబాటు మా వేదాంతం”
శ్రీశ్రీ రాసిన ఈ మాటలు కాళోజీ తన చర్యల ద్వారా చూపించారు. కాళోజీ లాంటి వారు యుగానికి ఒక్కరో ఆరో.