గ్రామాల అధ్యయనం ఎందుకు?

వీక్షణం ఫిబ్రవరి 2012 సంచిక కోసం

ఇవాళ భారత సమాజ స్థితి అస్తవ్యస్తంగా ఉన్నది. అత్యధిక సంఖ్యాక ప్రజల జీవనం ఉండవలసినట్టుగా లేదు. కోట్లాది ప్రజలకు కనీస అవసరాలు తీరడం లేదు. విజ్ఞాన, వినోద అవసరాలు ఎంతో కొంత తీరినట్టు కనబడుతున్నా ఆరోగ్యకరమైన పద్ధతిలో తీరడం లేదు. విజ్ఞానం, వినోదం పేరిట వికృతమైన, అసహజమైన, సమాజవ్యతిరేకమైన భావజాల అంశాలు మనసుల్లో రుద్దబడుతున్నాయి. అసంఖ్యాక ప్రజానీకానికి మానవ సహజమైన గౌరవం దక్కడం లేదు. రాజ్యాంగ ఆదర్శాలైన సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామిక పాలన, లౌకికత్వం అరకొరగా అమలవుతున్నాయి. చాల సందర్భాల్లో అమలు కావడమే లేదు. ఇటువంటి విషయాలు తెలియని వారూ చర్చించని వారూ ఎవరూ లేరు. ఈ రుగ్మతలు తొలగిపోయి, సమాజం మారాలనే అభిప్రాయాన్ని వ్యక్తపరచే వాళ్ల సంఖ్యకు కూడ కొదవలేదు. ఆ మార్పు స్వరూప స్వభావాలు ఏమిటనే విషయంలో ఎవరి దృక్పథం వాళ్లకు ఉండవచ్చు. ఎవరికి సరైనదనిపించిన మార్గాన్ని వారు అనుసరిస్తుండవచ్చు. కాని సామాజిక మార్పును సాధించాలంటే ముందు ఆ సమాజం ఎలా ఉన్నదో అర్థం కావాలి. స్థితిని సరిగా అర్థం చేసుకోకపోతే దాన్ని మార్చడమూ సాధ్యం కాదు. జరిగిపోతున్న మార్పులను సరిగా అర్థం చేసుకోకపోతే వాటి దిశను మార్చడమూ సాధ్యం కాదు. భారత సమాజాన్ని ప్రజానుకూల దృక్పథంతో మార్చాలంటే దాన్ని ముందు సరిగా అర్థం చేసుకోవాలి.

నిజానికి భారత సమాజం అని సాధారణంగా పిలుస్తున్నది ఏకశిలా సదృశమైన ముద్ద కాదు. ఉత్తర కొసనుంచి దక్షిణ కొసకు మూడు వేల రెండు వందల కిలోమీటర్లు, పడమటి కొస నుంచి తూర్పు కొసకు మూడు వేల కిలోమీటర్లు విస్తరించిన ఈ సువిశాల భారత దేశంలో, ‘భారత సమాజం’గా చెప్పుకుంటున్న దానిలో భౌగోళిక అర్థంలోనూ, సాంస్కృతిక అర్థంలోనూ అనేక సమాజాలు ఉన్నాయి. ఆయా సమాజాల మధ్య ఉన్న వైరుధ్యాలు, ఆయా సమాజాల లోపలనే ఉన్న వైరుధ్యాలు ప్రతిరోజూ బయటపడుతూ, ఇదంతా ఒకటే సమాజమనే భావనను ప్రశ్నిస్తూనే ఉన్నాయి. ఇంత వైశాల్యం నుంచి ఏదో ఒక సమాజపు ముక్కను తీసుకుని, మళ్లీ అందులోంచి ఒక గ్రామాన్నో, పట్టణాలనో, కొన్ని గ్రామాలనో, పట్టణాలనో అధ్యయనం చేసి భారత సమాజం గురించి నిర్ధారణలకు రావడం కుదరదు.

అనేక చారిత్రక, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలలో ఆయా సమాజాలన్నీ వాటికవిగా ఎదుగుతూ వచ్చాయి. ఒకదానితో ఒకటి సంబంధం లోకి వచ్చి ఐక్యత, ఘర్షణలతో, పరస్పర చర్య ప్రతిచర్యలకు లోనై, ఆదాన ప్రదానాలతో అభివృద్ధి చెందాయి. కొన్ని సమాజాలు కలిసిపోయాయి, మరికొన్ని విడివిడిగానే ఉండి పోయాయి. అప్పటివరకూ కలిసి ఉన్న కొన్ని సమాజాలలో కొత్త వైరుధ్యాలు బయటపడ్డాయి. అంతకు ముందు హిందూ పురాణ గాథలలోనూ, కేవలం సిద్ధాంత రీత్యానూ ఉండిన భారత సమాజ భావన బ్రిటిష్ పాలనతో, ఏకీకృత మార్కెట్ రూపొందడంతో  స్థిరపడింది. అప్పటికీ స్వదేశీ సంస్థానాలు ఈ భారత సమాజంలో భాగం కాలేదు. అధికార మార్పిడి తర్వాతనే, ఉమ్మడి రాజకీయ, చట్టపరమైన నిర్మాణాలు రూపొందడంతోనే భారత సమాజం ఇవాళ ఉన్న రూపంలోకి వచ్చింది. అయినా ఇప్పటికీ భౌగోళిక, సాంస్కృతిక వైవిధ్యాలు, వైరుధ్యాలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఈ వైవిధ్యాలు, వైరుధ్యాలు వ్యక్తమయ్యే ప్రధాన రంగస్థలం గ్రామీణ ప్రాంతాలే. అందువల్ల సమాజాన్ని – అది భారత సమాజం అనుకున్నా, విడివిడిగా జాతి, భాషా, మత, కుల, పాలనా విభాగ ప్రాతిపదికల సమాజాలు అనుకున్నా – అర్థం చేసుకోవాలంటే తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాలలోకి వెళ్లవలసిందే. అలా సాగే విడివిడి అధ్యయనాలను ఎన్నిటినో సమన్వయం చేయాలి. వాటి మధ్య దేశవ్యాపిత సాధారణ స్వభావం ఉన్నదా అని అన్వేషించాలి. అలాగే పట్టణ ప్రాంతాలనూ అధ్యయనం చేయాలి. వాటి స్వభావాన్నీ గుర్తించాలి. అలా బయటపడిన అనేక స్వభావాల మధ్య ఒక ప్రబల, ప్రధాన స్వభావం ఉన్నదని, లేదా కొన్ని ప్రధాన స్వభావాలు ఉన్నాయని గుర్తించగలిగితేనే భారత సమాజ స్వభావం గురించి నిర్ధారించడం సాధ్యమవుతుంది.

ఈ భారత సమాజ స్వభావం అనే దానిలో గ్రామీణ ప్రాంతాల స్వభావం కీలకమైనది. ఈ దేశంలో గ్రామాలు వేల సంవత్సరాలుగా మనుగడ సాగిస్తున్నాయి. అనేక మార్పులకు తట్టుకుంటూ, వాటిలో కొన్ని మార్పులను సంలీనం చేసుకుంటూ గ్రామాలు నిలిచి ఉన్నాయి. దేశంలో అత్యధిక జనాభాకు ఆశ్రయమిస్తూ, దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక వ్యవస్థలను పరిరక్షిస్తూ ఉన్నవి గ్రామాలే. అందువల్ల మన సమాజంలో గ్రామాల అధ్యయనం చాల ముఖ్యమైనది, అవసరమైనది. మొత్తంగా భారత సమాజాన్ని అర్థం చేసుకోవాలంటే ప్రధానంగా అట్టడుగున మౌలిక ప్రాతిపదికగా ఉన్న గ్రామాలను విస్తృతంగా, నిశితంగా అధ్యయనం చేయకతప్పదు.

కేవలం వైవిధ్యాలను, వైరుధ్యాలను అర్థం చేసుకోవడానికి మాత్రమే గాక, అశేష జన బాహుళ్యం గ్రామాలలోనే నివసిస్తున్నందువల్ల కూడ గ్రామాల అధ్యయనం తప్పనిసరి అవుతుంది. ‘భారతదేశం గ్రామాల్లో నివసిస్తుంది’ అని గాంధీ అన్నాడని చాల మంది చదివో, వినో ఉంటారు. ఆయన పట్టణాలతో పోలుస్తూ మరీ ఆ మాట అన్నాడు. ఆయన 1931 నవంబర్ లో లండన్ లో ఒక సమావేశంలో మాట్లాడుతూ చాల స్పష్టంగా ‘భారతదేశం గ్రామాల్లో ఉంది, బొంబాయి, కలకత్తా, మద్రాసులలో కాదు’ అన్నాడు. అటువంటి అభిప్రాయాన్నే అంతకు ముందూ ఆ తర్వాతా కూడ ప్రకటించాడు. ఎనిమిది దశాబ్దాలు గడిచిన తర్వాత కూడ, చాల ఎక్కువ పట్టణీకరణ జరిగిందని అనిపిస్తున్న తర్వాత కూడ ‘భారతదేశం గ్రామాల్లో నివసిస్తుంది’ అనే మాటకు కాలం చెల్లలేదు. అది ఆలంకారికమైన మాట అయిపోలేదు. అది ఇంకా అక్షరాలా వాస్తవంగానే ఉంది. ఇప్పటికీ దేశంలో 6,40,867 గ్రామాలు ఉన్నాయి. ఇవాళ్టికీ, 2011 జనగణన ప్రకారం కూడ, దేశ జనాభాలో 68.84 శాతం గ్రామాల్లో నివసిస్తున్నారు. ఇదే గణాంకాల ప్రకారం పట్టణ జనాభా 31.16 శాతంగా ఉన్నది. అది పది సంవత్సరాలకు ముందు ఉన్న 27.82 శాతం నుంచి 3.34 శాతం పెరిగింది. అంటే గ్రామీణ జనాభా ఆ మేరకు తగ్గింది. అయితే ఈ శాతాలను పక్కనపెట్టి మొత్తం జనాభా చూస్తే ఇవాళ్టికీ 37 కోట్ల మంది ప్రజలు పట్టణాల్లో ఉండగా, 84 కోట్ల మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు.

ఇక రాష్ట్ర గణాంకాలు పరిశీలిస్తే, 2001లో 27.30 శాతంగా ఉన్న పట్టణ జనాభా, 2011లో 33.49 శాతానికి పెరిగింది. అంటే గ్రామీణ జనాభా 72.70 శాతం ఉన్నదల్లా 66.51 శాతానికి తగ్గింది. అంటే రాష్ట్రంలో పట్టణ జనాభా దేశ సగటు కన్న ఎక్కువగా 6.19 శాతం పెరిగింది. ఆమేరకు గ్రామీణ జనాభా తగ్గింది. పట్టణాల సంఖ్య 210 నుంచి 353 కు పెరిగింది. ఇందులో సాధారణ పట్టణాలు 117 నుంచి 125కు పెరగగా, జనగణనలో పట్టణాలుగా గుర్తింపు పొందేవి 93 నుంచి 228కి పెరిగాయి. అలాగే గ్రామాల సంఖ్య 2001లో 28,123 ఉన్నదల్లా, 2011లో 27,800 అయింది.

ఈ అంకెలు చూసి పట్టణాలు పెరుగుతున్నాయనీ, గ్రామాలు తరిగిపోతున్నాయనీ నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ అంకెలతో సంబంధం లేకపోయినా గ్రామాలను చిన్నచూపు చూడడం విద్యావంతులలో పెరిగిపోతోంది, గ్రామాల ప్రాధాన్యత తగ్గిపోతోందని, గ్రామాలను పట్టించుకోనక్కరలేదని కొందరు మేధావులు వాదిస్తున్నారు. గ్రామాలను తప్పనిసరి అయి పట్టించుకున్నా ఆయా శక్తులు తమ అవసరాలకోసం మాత్రమే పట్టించుకుంటున్నాయని, కాని గ్రామాల పరిశీలనకు సామాజిక ప్రాముఖ్యత లేదని వాదనలు వినబడుతూనే ఉన్నాయి.

అందుకే ఈ పట్టణీకరణ – గ్రామాల పతనం అంకెలను కొంచెం జాగ్రత్తగా పరిశీలించాలి. పది సంవత్సరాల ముందు జరిగిన 2001 జనగణనలో రాష్ట్రంలో 6507 పట్టణాలున్నాయనీ, 2011 జనగణన నాటికి అవి 7935 కు పెరిగాయనీ, అంటే పది సంవత్సరాలలో 2,774 పట్టణాలు పెరిగాయనీ 2011 జనగణన నివేదికలు చెపుతున్నాయి. కాని పట్టణం నిర్వచనాన్ని ఎప్పటికప్పుడు మారుస్తూ రావడం వల్ల ప్రతి జనగణన జరిగినప్పుడు అంతకుముందు పట్టణాలుగా ఉన్నవాటిలో కొన్నిటిని పట్టణాలు కాదనడమూ, కొన్ని కొత్త ప్రాంతాలను పట్టణాలుగా గుర్తించడమూ జరుగుతోంది. మామూలుగా పట్టణాలుగా గుర్తించే వాటిని చట్టబద్ధ పట్టణాలు అనీ, తన నిర్వచనం ప్రకారం పట్టణాలుగా గుర్తించే వాటిని ‘సెన్సస్ పట్టణాలు’ అనీ జనగణనలో పరిగణిస్తారు. ప్రస్తుత నిర్వచనం ప్రకారం ‘సెన్సస్ పట్టణం’ అంటే ఐదువేలకన్న ఎక్కువ జనాభా, 75 శాతం పురుష శ్రామిక జనాభా వ్యవసాయేతర కార్యకలాపాల్లో ఉండడం, జనసాంద్రత కి.మీ.కు 400 కన్న ఎక్కువ ఉండడం. కాని ఈ లక్షణాలు పెద్ద గ్రామాలకూ, పాలనా కేంద్రాలకూ, యాత్రాస్థలాలకూ కూడ ఉంటాయి.

అందువల్ల గ్రామీణ ప్రాంతాలు పెరిగాయన్నా, తగ్గాయన్నా ఆ నిర్ధారణను యథాతథంగా విశ్వసించనక్కరలేదు. అంతేకాదు, ఒకవేళ పట్టణ జనాభా ఎక్కువగా నమోదయిందన్నా, ఆ జనాభా స్వభావం ఏమిటో కూడ చూడవలసి ఉంటుంది. ఆ “పట్టణ జనాభా” పూర్తిగా గ్రామాలతో సంబంధాలు తెంచుకున్నారా, గ్రామాలకు మళ్లీ తిరిగివెళ్లే ఆలోచన లేకుండా వచ్చారా, చదువు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం తదితర కారణాలతోనో, ఏ కారణమూ లేకుండానో పట్టణ పౌరులుగా ఉంటూ, గ్రామంలో తమ సంబంధాలు, ఆస్తులు, ప్రయోజనాలు యథావిధిగా ఉంచుకున్నారా వంటి అంశాలు తేల్చవలసే ఉంటుంది. మన పట్టణాలలో అతి తక్కువ మాత్రమే పారిశ్రామిక పట్టణాలు గనుక, మిగిలినవన్నీ కూడళ్లు, మతధార్మిక కేంద్రాలు, పాలనా కేంద్రాలు అయినందువల్ల పట్టణాలుగా మారినవే గనుక ‘పట్టణ జనాభా’ కూడ నిజంగా పట్టణీకరణ చెందిన జనాభానా, పట్నవాసం గడుపుతున్న పల్లెటూరి వారా కూడ ఆలోచించవలసి ఉంటుంది.

అంటే ప్రతి జనగణనలోనూ పట్టణీకరణ శాతం, పట్టణ జనాభా శాతం పెరిగిపోతున్నట్టు కనబడుతున్నప్పటికీ ఆ రూపం వెనుక సారాంశంలో మారీ మారని గ్రామాలే ఉన్నాయి. అట్లని గ్రామాలు మారడం లేదని కాదు. తప్పనిసరిగా, సహజంగా, అనివార్యంగా మారుతున్నాయి. ఆ మార్పులు గ్రామీణ ప్రజల జీవితంలో చెప్పుకోదగిన పద్ధతిలో కనబడుతున్నాయి. అయితే ప్రతి మార్పూ మౌలిక మార్పు కాదు. ప్రతి రూపంలో మార్పూ సారంలో మార్పు కాదు. ఆ మార్పుల స్వరూప స్వభావాలను అర్థం చేసుకోవడానికి, అవి రూపంలో మార్పులు మాత్రమేనా, సారంలో ఏమయినా మార్పులు వస్తున్నాయా, మౌలిక మార్పులు వస్తున్నాయా అర్థం చేసుకోవడానికి కూడ తప్పనిసరిగా గ్రామాలను అధ్యయనం చేయాలి.

ఇక ఆర్థికవ్యవస్థ పరంగా చూస్తే గ్రామాలే ఇవాళ్టికీ దేశానికి జీవగర్ర. జాతీయాదాయంలో ప్రాథమిక రంగం (వ్యవసాయం, పశు సంపద, గనులు, అటవీ వనరులు, మత్స్య సంపద) వాటా 27 శాతం మాత్రమేననీ, ఈ ప్రాథమిక రంగం ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలోనే ఉన్నది గనుక దేశ సంపదకు గ్రామీణ రంగం అందజేస్తున్నది తక్కువ అని చాలమంది ఆర్థికవేత్తలు ఒక వాదన చేస్తూ ఉంటారు. ఇక్కడ గుర్తించవలసిన మూడు అంశాలు ఉన్నాయి.

ఒకటి, ఈ గ్రామీణ రంగ ఆస్తులకు, ఉత్పత్తులకు, వాటాకు ధరల నిర్ణయంలో దారుణమైన అన్యాయం జరుగుతున్నది గనుక వాటి విలువ తక్కువగా కనబడుతున్నది. గ్రామీణ, ప్రాథమిక రంగ, వ్యవసాయ రంగ ఉత్పత్తులకు న్యాయమైన ధరలు లెక్కిస్తే తప్పనిసరిగా జాతీయాదాయంలో వాటి వాటా పెరిగిపోతుంది.

రెండు, గ్రామీణ ఉత్పత్తుల విలువను కేవలం ధరలతో, ద్రవ్యమానంతో మాత్రమే కొలవడం సరైనది కాదు. గ్రామీణ ఉత్పత్తులు లేకపోతే సామాజిక మనుగడే సాధ్యం కాదు. సాపేక్షికంగా జీవనానికి అంతగా అవసరంలేని పారిశ్రామిక, సేవారంగ ఉత్పత్తులకు విలువ కట్టే ప్రమాణాలతోనే, జీవనానికి అత్యవసరమైన గ్రామీణ ప్రాథమిక రంగ ఉత్పత్తులకు విలువ కట్టగూడదు. ఉదాహరణకు గ్రామీణ రంగంలో ఉత్పత్తి అయ్యే వరి, పారిశ్రామిక రంగంలో ఉత్పత్తి అయ్యే కారు, సేవారంగంలోని ఉత్పత్తి అనడానికి కూడ వీలులేని సెల్ ఫోన్ టాక్ టైం మూడిటినీ జాతీయోత్పత్తిలో భాగంగా సమానంగా చూడడం  ఉచితం కాదు. ఈ మూడిటికీ విలువ కట్టడానికి ఒకే పద్ధతి ఉపయోగిస్తే ఆహారం ఎంత అవసరమో, కారూ, టాక్ టైమూ అంతే అవసరమని అనుకోవలసి వస్తుంది. మనిషి ప్రాణం నిలిపి ఉంచుకోవడానికి అవసరమైనవి, మనిషి జీవన సౌకర్యానికి అవసరమైనవి, విలాసానికి దగ్గరగా, అవసరం కాకపోయినా అలవాటైనవి అనే విభజన పాటించకుండా అన్నిటికీ ఒకే ప్రమాణాలు ఉపయోగించడం వల్ల ప్రాథమిక రంగం, గ్రామీణ రంగం అత్యవసరమైన ఆహారపదార్థాలు, వస్తువులు ఉత్పత్తి చేస్తూ, ముడిసరుకులు అందిస్తూ కూడ తక్కువ స్థాయిలో మిగిలిపోతోంది.

మూడు, ప్రభుత్వం, పాలకవర్గ మేధావులు చెప్పే లెక్కలను అంగీకరించి జాతీయాదాయంలో గ్రామీణ వాటా 27 శాతం మాత్రమే ఉన్నదనుకున్నా, జాతీయ వ్యయంలో గ్రామీణ ప్రాంతాలకు తిరిగి అందుతున్నది ఆ 27 శాతం కాదు గదా, కేవలం 5 శాతం మాత్రమే. ఉత్పత్తి కారకాలన్నీ తమ తమ దోహదాన్ని బట్టి ఉత్పత్తి ఫలాన్ని పంచుకోవాలనే సహజ న్యాయ సూత్రాన్ని పాటించినా గ్రామీణ ప్రాంతాలకు అన్యాయమే జరుగుతోంది.

ఈ అసమతౌల్యాన్ని, అన్యాయాన్ని నిర్ధారించడానికి కూడ గ్రామీణ అధ్యయనాలు అవసరం. ఒక గ్రామంలో ఉత్పత్తి అవుతున్నవేమిటి, ఆ ఉత్పత్తికి న్యాయంగా రావలసిన ఫలితం ఏమిటి, గ్రామానికి తిరిగి అందుతున్న ఫలం ఎంత వంటి ప్రశ్నలకు జవాబులు గ్రామీణ అధ్యయనాల ద్వారా వెలికితీయవలసిందే. గ్రామం మొత్తంగా తాను బయటికి ఇస్తున్నదెంత, పొందుతున్నదెంత లెక్కలు తేల్చాలి. ఇస్తున్నదాంట్లో గ్రామంలోని ఏయే వర్గాలు ఎంత ఇస్తున్నాయో, పొందినదానిలో ఏయే వర్గాలు ఎంత పొందుతున్నాయో కూడ లెక్కకట్టాలి.

ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం జాతీయ ఉత్పత్తిని గ్రామ స్థాయికి విభజించి చూడడం మాత్రమే కాదు, అసలు దేశ వనరులు, ముఖ్యంగా సహజ వనరులన్నీ, గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయని గుర్తించాలి. భూమి, నీరు, అడవి, ఖనిజాలు దేశం మొత్తానికీ చెందినవే కావచ్చుగాని, మొట్టమొదట అవి ఆయా గ్రామాలలో ఉన్నవి. ఆ గ్రామాలకే చెందినవి. ఆ గ్రామీణుల దగ్గరి నుంచి, వారి అవసరాలు తీర్చకుండా వాటిని దొంగలించగూడదు. ఆ వనరులను ఎలా ఉపయోగించాలనే నిర్ణయాధికారం ఆ గ్రామస్తులకే, ఆ వనరులమీద శ్రమ చేస్తున్నవారికే ఉండాలి. ఈ వనరుల అధ్యయనం కోసం, గ్రామ సంపదను తేల్చిచెప్పడం కోసం, ఆ గ్రామ సంపదను ఆ గ్రామంలోనే వినియోగిస్తే, గ్రామం ఎలా పురోగమిస్తుందో తెలపడం కోసం, ఆ వనరులను విదేశాలకో, సుదూర పారిశ్రామిక అవసరాల కోసమో తరలించకుండా, ఎలా గ్రామీణ చిన్న పరిశ్రమలు స్థాపించి, స్థానిక ఉపాధి అవకాశాలు పెంచవచ్చునో తేల్చడం కోసం కూడ గ్రామీణ అధ్యయనాలు అవసరం.

నేలల స్వభావాన్ని, నీటి లభ్యతను, స్థానిక అవసరాలను, స్థానిక ప్రజా సాంకేతిక పరిజ్ఞానాన్ని పట్టించుకోకుండా దేశం మొత్తానికీ, రాష్ట్రం మొత్తానికీ, జిల్లా మొత్తానికీ ఒకటే వ్యవసాయ విధానాన్ని ప్రకటించడం ప్రస్తుతం జరుగుతోంది. విశాలమైన మార్కెట్ దృష్టితో బహుళ జాతి సంస్థలు ఆదేశించిన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు కొనే వ్యవసాయం తయారవుతోంది. బహుళజాతిసంస్థల, బడా వ్యాపారుల, భూస్వాముల అనుకూల విధానాలే దేశంలో ఎటువంటి నీటిపారుదల సౌకర్యాలు ఉండాలో, ఎటువంటి పంటలు వేయాలో, ఎటువంటి మార్కెట్ సౌకర్యాలు కల్పించాలో నిర్ణయిస్తున్నాయి. ఇందుకు బదులుగా గ్రామంలోని భూముల స్వభావం ఏమిటి, నీటి వసతి ఏమిటి, గ్రామ ప్రజల అవసరాలు ఏమిటి అనే వాస్తవిక అధ్యయనం మీద ఆధారపడే వ్యవసాయం అమలు చేయడానికి కూడ గ్రామీణ అధ్యయనాలు కావాలి.

గ్రామీణ ప్రజలకు తప్పనిసరిగా పారిశ్రామిక ఉత్పత్తులు కావాలి. ఆ పారిశ్రామిక సరుకులలో ఏవి తప్పనిసరి అవసరాలు, వేటిని వదులుకున్నా జీవనం కొనసాగుతుంది అనే సమీక్ష వేరే చర్చ. కాని ఇవాళ ఉన్న స్థితిలో టూత్ బ్రష్షులు, టూత్ పేస్టులు, టీ పొడి, కాఫీ పొడి, వంటి సబ్బులు, బట్టల సబ్బులు, చక్కెర, ఉప్పు, బట్టలు, స్టీలు, ప్లాస్టిక్ పాత్రలు, మంచాలు, ఫాన్లు, రేడియోలు, టెలివిజన్లు, పెన్నులు, పుస్తకాలు, సైకిళ్లు, మోటర్ సైకిళ్లు, కార్లు, ట్రాక్టర్లు, కొడవళ్లు, గొడ్డళ్లు వంటి వందలాది పారిశ్రామిక ఉత్పత్తులైన సరుకులు కావాలి. దేశంలో ఈ గ్రామీణ మార్కెట్ చాల పెద్దది. మార్కెట్ పరిశోధకులు దీన్ని 72 కోట్ల నుంచి 79 కోట్ల వినియోగదారుల మార్కెట్ అంటున్నారు. జనాభా రీత్యా చూస్తే అది అమెరికా మార్కెట్ తో రెట్టింపు, యూరప్ లోని పదహారు దేశాల మార్కెట్ తో నాలుగు రెట్లు. విలువ రీత్యా తేడా ఉండవచ్చు గాని అది కనీస అంచనాలలో పది లక్షల కోట్ల రూపాయల నుంచి గరిష్ఠ అంచనాలలో ఇరవై ఒక్క లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల మార్కెట్. ఇందులో ఇరవై శాతం లాభం వేసుకున్నా ఉత్పత్తిదారులకు, వ్యాపారులకు ఇంతకు మించిన బంగారు బాతు మరొకటి ఉండదు.

ఈ గ్రామీణ, స్థానిక మార్కెట్ ఇంత లాభసాటిది గనుకనే బహుళజాతిసంస్థలు భారత గ్రామీణ మార్కెట్ మీద కన్నువేసి ఉన్నాయి. ఈ మార్కెట్ ను బహుళజాతి సంస్థలు ఇప్పటికే అధ్యయనం చేస్తూనే ఉన్నాయి. గడిచిన రెండు దశాబ్దాల ప్రపంచీకరణ క్రమంలో మన గ్రామీణ ప్రాంతాలలోకి బహుళజాతి సంస్థల సరుకుల చొరబాటు ఎంతగా పెరిగిపోయిందో, ప్రతి గ్రామం నుంచీ బహుళ జాతి సంస్థలు ఎంత సంపదను కొల్లగొట్టుకు పోతున్నాయో లెక్కలు తీయడానికి కూడ గ్రామీణ అధ్యయనాలు జరపాలి. స్వతంత్ర, స్వావలంబన విధానాలు అమలు చేస్తే, బహుళజాతి సంస్థల దోపిడీని అరికట్టి, ఆ స్థానంలో స్థానిక, స్వదేశీ, ప్రభుత్వ రంగ పారిశ్రామిక ఉత్పత్తులు అందించగలిగితే దేశీయ పారిశ్రామికీకరణ ఎంత సుస్థిరంగా ఉండగలదో చూపడానికి కూడ గ్రామీణ మార్కెట్ అధ్యయనాలు కావాలి.

ఇక రాజకీయ ప్రాధాన్యత దృష్ట్యా చూసినా గ్రామీణ ప్రాంతాలు అతి కీలకమైనవి. ఎన్నికల రాజకీయాలలోనైనా, ఎన్నికలకు బైటి రాజకీయాలలోనైనా ఇవాళ్టికీ గ్రామాలే ప్రధానంగా ఉన్నాయి. రాజకీయాలంటే ప్రజా జీవిత సమస్యలకు సృజనాత్మకమైన, ఆచరణ సాధ్యమైన, ఉమ్మడి పరిష్కారాలను కనిపెట్టే ప్రయత్నం అని నిర్వచించుకుంటే, అత్యధిక ప్రజానీకం ఉన్న గ్రామాలే రాజకీయాలకు ఆయువుపట్టు అవుతాయి. గ్రామీణ ప్రాంత ప్రజల రాజకీయ వైఖరులు ఎలా నిర్ణయమవుతున్నాయో, వాటిని రూపొందిస్తున్న శక్తులు, ప్రయోజనాలు ఏమిటో తేల్చుకోకుండా రాజకీయాలలో జోక్యం చేసుకోవడం, రాజకీయాలు నడపడం, రాజకీయాలను మార్చడం సాధ్యం కాదు. ఆ శక్తులను, ప్రయోజనాలను గుర్తించడానికి గ్రామీణ అధ్యయనాలు తప్పనిసరి. గ్రామంలో తరతరాలుగా కొనసాగుతున్న రాజకీయ వ్యవస్థలు ఏమిటో, ఆ రాజకీయ వ్యవస్థలను తొలగించి వచ్చిన రాజకీయపార్టీలు, ఎన్నికలు, పంచాయత్ రాజ్, మండల, గ్రామ ప్రజా ప్రతినిధులు వంటి నిర్మాణాలు గ్రామాలకు ఏం చేశాయో పరిశీలించాలి. పాలక సంస్థలు గ్రామీణ రాజకీయాలను తమకు అనువుగా మలచుకోవడంలో ఎటువంటి రాజనీతిని అవలంబించాయో తెలుసుకోవాలి. ప్రజలను నమ్మించగలిగిన ప్రజావ్యతిరేక ఎత్తుగడలే రాజకీయాలుగా ఎలా చలామణీ కాగలుగుతున్నాయో వివరంగా అర్థం కావాలంటే గ్రామీణ అధ్యయనాలు జరపాలి. ప్రజానుకూల, ప్రత్యామ్నాయ రాజకీయాలు ప్రజలలో ఎందుకు బలంగా వేళ్లూనుకోవడం లేదో, వాటిని ఏ అవరోధాలు ఆపుతున్నాయో తెలియాలంటే గ్రామీణ అధ్యయనాలు కావాలి.

గ్రామాలలో సామాజిక నిర్మాణ ప్రాధాన్యతను చూస్తే గ్రామీణ అధ్యయనాల ఆవశ్యకత ఎంత ఎక్కువగా ఉందో అర్థమవుతుంది. మన సామాజిక వ్యవస్థకు పునాది అయిన కుల వ్యవస్థ, అంతరాల దొంతరలు గ్రామీణ ప్రాంతాల లోనే అతి ఎక్కువగా కనబడతాయి. పట్టణాలలో కూడ కుల ప్రభావం ఉన్నప్పటికీ దాని మీద ముసుగులు కప్పబడి ఉంటాయి. కాని కులం గ్రామీణ ప్రాంతాలలో నగ్నంగా, బహిరంగంగా ఉంటుంది. గ్రామంలో ప్రతి మనిషికీ గుర్తింపు కులం ద్వారానే ఉంటుంది. ఆ కులాల మధ్య అసమానతలలో, అస్పృశ్యత పాటింపులో కొంత మార్పు, కొన్ని తేడాలు కనబడవచ్చు గాని కులంతో ప్రమేయం లేని గ్రామం ఉండదు. ఆస్తి యాజమాన్యంలో, శ్రమ భాగస్వామ్యంలో కులం ప్రాధాన్యత కాస్త తగ్గినట్టు కనబడవచ్చుగాని గ్రామంలో పాటించే సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, చివరికి “ప్రజాస్వామిక” ఎన్నికల రాజకీయాలు అన్నీ కూడ కులం ఆధారంగానే సాగుతున్నాయి. అయితే ఈ సాధారణ సూత్రీకరణలు యథాతథంగా ప్రతి గ్రామానికీ వర్తించవు. భారత సమాజం ఎంత సంక్లిష్టమైనదంటే ప్రతి సూత్రీకరణకూ మినహాయింపులు ఉంటాయి, భిన్నమైన దృష్టాంతాలు ఉంటాయి. ఆ మినహాయింపులనూ, భిన్నమైన సూచికలనూ అర్థం చేసుకోవాలంటే కూడ గ్రామీణ అధ్యయనాలు తప్పనిసరి. ఒక మనిషి వ్యక్తిగత జీవితంలోనూ, సామాజిక జీవితంలోనూ కులం పాత్ర, సామాజిక నిర్మాణాల పాత్ర ఎంతగా ఉంటున్నదో, అది ఆ మనిషి గుర్తింపుకు, శ్రమకు, ఆత్మగౌరవానికి, ఆత్మవిశ్వాసానికి, అవగాహనకు, చైతన్యానికి, సంఘీభావానికి, సంఘటిత ఆచరణకు ఎంత మేరకు దోహదం చేస్తున్నదో, ఎంతమేరకు అడ్డగిస్తున్నదో విడివిడిగా అధ్యయనం చేస్తేగాని మన సమాజంలోని మనుషులను చైతన్యానికి, ఆచరణకు పురిగొల్పుతున్నవేవో, అడ్డుకుంటున్నవేవో అర్థం కాదు.

ఇక గ్రామాలే ఇవాళ్టికీ మన సాంస్కృతిక జీవనానికి పాదుగా ఉన్నాయి. సామ్రాజ్యవాద సాంస్కృతిక రూపాల దాడి ఎంతగా సాగుతున్నా, అంటుకట్టిన, వక్రీకరణకు గురైన సినిమా రంగం సంస్కృతికి ఎన్ని తప్పుడు అర్థాలు ఇస్తున్నా, ఇవాళ్టికీ మన సమాజ సాంస్కృతిక రూపాలు గ్రామాలలోనే నిలిచి ఉన్నాయి. అయితే ఆ గ్రామీణ సంస్కృతిలో కూడ భూస్వామ్య, మత, కుల అంతరాల, పితృస్వామిక, ప్రజావ్యతిరేక అంశాలు ఉండవచ్చు. కాని మన నేల మీది శ్రమజీవుల వ్యవసాయ పనులతో పాటు పుట్టిన పాటల వంటి స్వల్పకాలిక సాంస్కృతిక కళారూపాలు, వ్యవసాయ పనులు లేని వేసవి సమయాల తీరికవేళలలో మన శ్రామికులు రూపొందించిన దీర్ఘకాలిక కళారూపాలు, ప్రతి కులానికీ ఆశ్రిత కులంగా ఉండి విలువైన సాంస్కృతిక రూపాల ఉత్పత్తినీ, ప్రదర్శననూ నిర్వహించిన సమూహాలు, మన ప్రజల సహజీవనంలో వికసించిన మానవసంబంధాల సంస్కృతి – ఇదంతా ఎన్ని మార్పులతోనైనా, ఎన్ని వక్రీకరణలతోనైనా ఇంకా నిలిచి ఉన్నది మన గ్రామాలలోనే. మన ప్రజల చరిత్ర, వారసత్వాన్నీ వివరించే ఈ సంస్కృతి అధ్యయనం కోసం కూడ గ్రామాల అధ్యయనం తప్పనిసరి.

నిజానికి ఇప్పటివరకూ జరిగిన గ్రామీణ అధ్యయనాలన్నీ ఈ అవసరాలలో ఏదో ఒక అవసరాన్నో, లేక కొన్ని అవసరాలనో తీర్చడానికి జరిగాయి. ఈ అధ్యయనాలన్నిటినీ క్రోడీకరిస్తే, సామాజిక అవగాహన కోసం అధ్యయనాలు, సాంస్కృతిక వైవిధ్యాన్ని గుర్తించడం కోసం అధ్యయనాలు, పాలనా అవసరాల కోసం అధ్యయనాలు, ఆర్థిక అవసరాల కోసం అధ్యయనాలు, సామాజిక మార్పుకోసం అధ్యయనాలు అని చెప్పవచ్చు. ఈ అధ్యయనాలను జరిపిన వారి ఆధారంగా క్రోడీకరించాలంటే మూడు రకాలుగా చెప్పాలి:

ఒకవైపు సామాజిక శాస్త్రవేత్తలు తమ విద్యాపరమైన పరిశోధనలో భాగంగా చేసిన అధ్యయనాలు. వీటిలో కొన్ని తమను తాము తటస్థమైనవిగా చెప్పుకుంటాయి గాని సామాజిక పరిశోధనలో తటస్థత సాధ్యం కాదు. నిర్ధారణలు ఏవయినా, వీలయినంతవరకు దృగ్గోచరాంశాలను తటస్థంగా నమోదు చేయాలనే లక్ష్యాన్ని చాల పరిశోధనలు పెట్టుకున్నాయి గాని అసలు గ్రామాన్ని దర్శించడమే పరిశీలకుడి దృక్పథం నుంచి జరుగుతుంది. ఏది ఏమైనా, ఆయా దృక్పథాలను, నిర్ధారణలను ఆమోదించినా, ఆమోదించలేకపోయినా, ఇటువంటి అధ్యయనాలు ఆయా ప్రత్యేక గ్రామాల గురించి అవసరమైన, ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తాయి. ఇవి ప్రధానంగా సామాజిక అవగాహన కోసం, సాంస్కృతిక వైవిధ్యాన్ని గుర్తించడం కోసం జరిగే అధ్యయనాలు.

మరొకవైపు బ్రిటిష్ వలస పాలనా కాలం నాటి నుంచి ఇవాళ్టివరకూ పాలకులు తమ పాలితుల గురించి అర్థం చేసుకోవడానికి జరిపిన గ్రామీణ అధ్యయనాలు. ఇవి నేరుగా పాలనాధికారులుగా పనిచేసినవారయినా చేశారు, లేదా, సామాజిక శాస్త్రవేత్తల సహాయంతోనైనా సాగించారు. ఇవి గ్రామాల గురించిన సమాచారాన్ని వీలయినంత నిష్పాక్షిక దృష్టితో అందించడానికి ప్రయత్నిస్తాయి గాని, ఈ అధ్యయనాల దృష్టి అంతా పాలకులకు పాలన గురించిన సలహాలు, సూచనలు అందించడమే. బహుళజాతి సరుకుల వ్యాపార సంస్థలు, వ్యవసాయ పరికరాలు, విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు తయారుచేసే, అమ్మే వ్యాపార సంస్థలు జరిపే గ్రామీణ అధ్యయనాలను కూడ ఇందులోనే భాగం చేయవచ్చు. ఇవి ప్రధానంగా పాలనా అవసరాల కోసం, ఆర్థిక అవసరాల కోసం జరిగే అధ్యయనాలు.

ఇంకొకవైపు వేర్వేరు రాజకీయ, తాత్విక దృక్పథం గల సంస్థలు, సామాజిక మార్పు లక్ష్యంగా గల సంస్థలు, తమ తమ రాజకీయ, తాత్విక ఆచరణలోకి గ్రామీణ ప్రజలను సంఘటితం చేయదలచిన సంస్థలు జరిపిన గ్రామీణ అధ్యయనాలు. ఇందులో ఇరవయోశతాబ్ది తొలి అర్ధ భాగంలో గాంధేయ వాదులు, ఆ కాలంలోనూ, ఆ తర్వాతా కూడ కమ్యూనిస్టులు, నక్సలైట్లు, పర్యావరణ వాదులు వంటి అన్ని దృక్పథాలు గలవారు ఉన్నారు. ఇవి ప్రధానంగా సామాజిక మార్పు కోసం జరిగే అధ్యయనాలు.

ఈ వ్యాసం ప్రారంభంలో చెప్పినట్టు ఇవాళ సమాజం మారవలసిన అవసరం ఉన్నదని గుర్తించి ఆ సామాజిక మార్పు ఎలా సాధించాలో, ఆ మార్గం ఎక్కడ తొట్రు పడుతున్నదో నిర్ధారించడానికి గ్రామీణ అధ్యయనాలు కావాలి. ఇవాళ తప్పనిసరిగా, అనివార్యంగా జరగవలసిన సామాజిక మార్పుకు చోదకశక్తులేవో, ఆ మార్పు కృషిలో కలిసి వచ్చే శక్తులేవో గుర్తించడానికి, సామాజిక మార్పు అవసరాన్ని అట్టడుగు స్థాయి నుంచి రాజ్యాధికార స్థాయి దాకా వివరించి, విశ్లేషించడానికి గ్రామీణ అధ్యయనాలు కావాలి.

చైనా సమాజంలో విప్లవ కృషికి ముందూ, విప్లవ కృషి సాగుతుండగానూ, విప్లవానంతరమూ కూడ గ్రామీణ ప్రాంతాల అధ్యయనానికి చైనా కమ్యూనిస్టు పార్టీ, ప్రత్యేకించి మావో సే టుంగ్ చాల ప్రాధాన్యత ఇచ్చారు. తొలిరోజుల్లోనే 1926లో రాసిన ‘చైనా సమాజంలో వర్గాల విశ్లేషణ’, 1927లో రాసిన ‘హునాన్ రైతాంగ ఉద్యమ పరిశోధనా నివేదిక’ ల నుంచి, 1941లో రాసిన ‘గ్రామీణ సర్వే లకు ముందుమాట, వెనుకమాట’ల నుంచి, విప్లవానంతరం 1955లో ‘సోషలిస్ట్ అప్ సర్జ్ ఇన్ చైనాస్ కంట్రీసైడ’ ముందుమాట వరకూ, సాంస్కృతిక విప్లవకాలంలో గ్రామీణ కమ్యూన్ల పరిశీలన వరకూ మావో సే టుంగ్ గ్రామీణ అధ్యయనాల అవసరాన్ని ఎంతగానో నొక్కి చెప్పారు.

భారత కమ్యూనిస్టు ఉద్యమ, విప్లవోద్యమ సంప్రదాయంలో కూడ గ్రామీణ అధ్యయనాలు ఎన్నో జరిగాయి. గ్రామీణ ప్రాంతాలలో వర్గ విశ్లేషణ సవ్యంగా జరిపితేనే, గ్రామీణ ప్రాంతాలలో మిత్రులనూ శత్రువులనూ స్పష్టంగా విభజించి చూడగలిగితేనే, భారత సమాజ స్వభావం సవ్యంగా అర్థం చేసుకుని, ఆ సమాజాన్ని మార్చడానికి తగిన వ్యూహాన్నీ ఎత్తుగడలనూ రచించుకుంటేనే తమ కార్యక్రమం విజయవంతమవుతుందనీ, ఆ పనికి గ్రామీణ అధ్యయనాలు అవసరమనీ విప్లవకారులు ఎన్నడూ మరచిపోలేదు.

ఒక్కమాటలో చెప్పాలంటే సామాజిక మార్పును ఆశించే, ఆ మార్పు కృషికి నాయకత్వం వహించే శక్తులకు సమాజ స్వభావాన్నీ, ఆ స్వభావంలో వస్తున్న మార్పులనూ అర్థం చేసుకోవడానికీ, సామాజిక మార్పుకు క్రియాశీలంగా సృజనాత్మకంగా నాయకత్వం వహించడానికీ గ్రామీణ అధ్యయనాలు అత్యవసరం.

About ఎన్.వేణుగోపాల్ N Venugopal

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues.
This entry was posted in వ్యాసాలు, Veekshanam. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s