ప్రపంచీకరణ పర్యవసానాలు – ఆత్మహత్యలు, వలసలు, హత్యలు, అంతర్యుద్ధం

ఈభూమి ఫిబ్రవరి 2012 కోసం

భారత దేశంలో నూతన ఆర్థిక విధానాలు, ప్రపంచీకరణ విధానాలు ప్రారంభమై ఇరవై సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ విధానాలు ఏ పర్యవసానాలకు దారి తీశాయో మందిపు వేయడం, భవిష్యత్ పరిణామాలు ఎలా ఉండనున్నాయో ఊహించడం ఆసక్తికరంగా ఉంటుంది. ఈ విధానాలు ఇరవై ఏళ్లుగా సాగుతున్నాయి గనుక, కేంద్ర ప్రభుత్వం ద్వారానూ, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ద్వారానూ అనేక రంగాలలో అమలయ్యాయి గనుక ఆ పర్యవసానాలన్నిటినీ ఒక వ్యాసంలో చర్చించడం సాధ్యం కాదు. కాని దేశ ప్రజాజీవితం మీద తీవ్రమైన ప్రభావం వేసిన ప్రధానమైన పర్యవసానాలు ఏమిటో, అవి ఈ సమాజాన్ని ఏ దిశలో నడిపించనున్నాయో స్థూలంగా చర్చించవచ్చు.

ఈ ప్రతికూల పర్యవసానాలు మాత్రమే వచ్చాయా, ఇతర అనుకూల పర్యవసానాలు లేవా అని ప్రపంచీకరణ సమర్థకులు వాదించబోతారు. కాని ఆ అనుకూల ఫలితాలు అనబడేవి దేశ ప్రజానీకంలో అతి తక్కువ మందికి, బహుశా నూట ఇరవై కోట్ల జనాభాలో ఎక్కువలో ఎక్కువ పది కోట్ల మందికి అంది ఉంటాయేమో. ఆ అనుకూల ఫలితాల ఉప ఉత్పత్తులు మరికొన్ని కోట్ల మందికి అంది ఉంటాయేమో గాని ప్రతికూల ఫలితాలు మాత్రం కనీసం ఎనబై కోట్ల సాధారణ ప్రజానీకానికి అనుభవంలోకి వచ్చాయి, వస్తున్నాయి. అందువల్ల సైద్ధాంతికంగా చూసి ప్రపంచీకరణకు అనుకూల ఫలితాలు ఉన్నాయని అనుకున్నా అవి సార్వజనీనమైనవీ కాదు, విశాలమైనవీ కాదు, సుస్థిరమైనవీ కాదు. ప్రతికూల ఫలితాలు మాత్రం దాదాపు సార్వజనీనంగా ఉన్నాయి. విశాల ప్రజారాశుల మీద ప్రభావం వేశాయి. ఈ విధానాలు ఇలాగే సాగితే దేశపు మనుగడే ప్రశ్నార్థకమై పోతుంది. ఈ పరిణామాలు ఇలాగే సాగితే ఈ దేశ భవిష్యత్తు అంధకార మయమైపోతుంది. అందువల్ల ఆ ప్రతికూల పర్యవసానాలను గుర్తించి వాటిని అరికట్టడం ఎలాగో ఆలోచించవలసి ఉంది.

నిజానికి ప్రపంచీకరణ విధానాల పర్యవసానాలు ప్రతికూలంగా, ఆశించినవిధంగా లేవని, ప్రపంచీకరణ విధానాల ప్రారంభకులే, నిర్వాహకులే గుర్తించారని చూసినప్పుడు విమర్శకుల మాటలు కేవలం విమర్శలు కావని, అక్షరసత్యాలని అంగీకరించక తప్పదు.

ప్రపంచీకరణ విధానాలు 1991 జూలై మొదటి వారం నుంచి పి వి నరసింహారావు ప్రధాన మంత్రిగా, డా. మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్న ప్రభుత్వ కాలంలో మొదలయ్యాయి. ఆ తర్వాత ఎనిమిది సంవత్సరాలకు 1999లో జె ఆర్ డి టాటా స్మారకోపన్యాసంలో స్వయంగా పి వి నరసింహారావు ప్రపంచీకరణ విధానాలకు ఉద్దేశించిన లక్ష్యాలు వేరనీ, ఉద్దేశించని పర్యవసానాలు వచ్చాయనీ, ప్రపంచీకరణ విధానాల్ని సమీక్షించాలనీ అన్నారు. ప్రపంచీకరణ విధానాలు అమలయిన ఇరవై ఏళ్ల తర్వాత కూడ దేశంలోని బాలబాలికల్లో 42 శాతం పోషకాహార లోపంతో ఉన్నారనీ, ఇది సిగ్గుతో తల దించుకోవలసిన విషయమనీ డా. మన్మోహన్ సింగ్ ఇటీవలనే అన్నారు. ప్రపంచీకరణ విధానాలకు మానవముఖాన్ని జోడించలేకపోయామనీ, అందువల్లనే అనుకున్న సామాజిక పురోగతి సాధించలేకపోయామని, రాజకీయాల్లో తమ ఓటమికి అదే కారణమయిందనీ ప్రపంచీకరణ విధానాల అమలులో అగ్రశ్రేణి నాయకుడుగా గుర్తింపు పొందిన చంద్రబాబు నాయుడు గత ఏడు సంవత్సరాలలో అనేక సార్లు అన్నారు.

దేశంలో ప్రపంచీకరణ విధానాల వైతాళికులుగా, నిర్వాహకులుగా అందరికంటె ముందు చెప్పవలసిన ముగ్గురు నాయకులు ఈ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారంటే ప్రపంచీకరణ విధానాలలో మౌలికంగానే ఏదో లోపం ఉందనుకోవాలి. అది సిద్ధాంతరీత్యా సరైనదే అయి, కేవలం ఆచరణలో విఫలం అయిందనే మాట నిజం కాదనుకోవాలి.

ఈ రెండు దశాబ్దాల చరిత్రను నిశితంగా పరిశీలిస్తే ప్రపంచీకరణ పర్యవసానాలు ఆత్మహత్యలు, వలసలు, హత్యలు, అంతర్యుద్ధం మాత్రమేననిపిస్తుంది. మన సమాజంలో తీవ్రమైన ఆర్థిక, సామాజిక అసమానతలు, అంతరాలు ఉండడం వల్ల తప్పనిసరిగా ఆర్థిక, సామాజిక న్యాయాన్ని అమలుచేసే సంక్షేమ రాజ్య భావనే పాలనావిధానం కావాలి. అందువల్లనే రాజ్యాంగ నిర్మాతలు మన రాజ్యాంగ ఆదర్శాలను ఆ దృష్టితో తయారు చేశారు. కాని ప్రపంచీకరణ విధానాలు మన పాలనానీతి నుంచి సంక్షేమ రాజ్య భావనను రద్దు చేశాయి. రాజ్యం ప్రజా సంక్షేమ బాధ్యతలు పట్టించుకోనక్కరలేదని, జాతీయోద్యమ ఆదర్శాలుగా, రాజ్యాంగ ఆదర్శాలుగా ఉన్న సంక్షేమ రాజ్య భావనను, ఆర్థిక, సామాజిక న్యాయ సాధన భావనను క్రమక్రమంగా వదుల్చుకోవాలని ప్రపంచీకరణ శక్తులు మన రాజకీయ నేతలకు ఉద్బోధించాయి. ఆ భావనలను వదులుకోవడం ద్వారా దేశ వనరులను ప్రజలనుంచి కొల్లగొట్టి ప్రపంచీకరణ శక్తులకు అప్పగించడానికి అవకాశం వస్తుంది. ఆ భావనలను వదులుకోవడమంటే దేశ ప్రజలలో కొనుగోలు శక్తి ఉన్న వారిని మాత్రమే ఎంచుకుని వారి అవసరాలు, కోర్కెలు, విలాసాలు తీర్చే మార్కెట్ శక్తులకు దేశాన్ని అప్పగించడానికి అవకాశం వస్తుంది. రాజ్యం ప్రజా ప్రాతినిధ్య రాజ్యంగా, ప్రజాస్వామిక రాజ్యంగా, సంక్షేమ రాజ్యంగా ఉండడం మానేసి దేశదేశాల సంపన్నులకు, బహుళజాతిసంస్థలకు అవకాశాలు కల్పించే ఫెసిలిటేటర్ స్థాయికి, మరో మాటల్లో చెప్పాలంటే బ్రోకర్ స్థాయికి, దిగజారిపోతుంది. రాజ్యం అలా దళారీ, బ్రోకర్, మధ్యవర్తి, పైరవీకార్ పాత్రను చేపట్టిన తర్వాత ప్రణాళికాబద్ధ ఆర్థిక విధానం, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ రంగం, రాజ్యాంగ బద్ధ పాలన, ప్రజాప్రతినిధుల జవాబుదారీతనం వంటి విలువలన్నీ రద్దయిపోతాయి. వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగం, పాలన వంటివన్నీ దేశాభివృద్ధికీ, ప్రజల సర్వతోముఖ వికాసానికీ అవసరమైన విధానాల ద్వారా కాక విదేశీ బహుళజాతి సంస్థలు, పరాయి ప్రభుత్వాలు, వారికి దళారులుగా పనిచేసే స్వదేశీ నాయకులు, వ్యాపారవేత్తలు, దేశదేశాల సంపన్నులు కోరుకున్న, ఆదేశించిన విధానాల ద్వారా జరుగుతాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఆస్తులు, అమ్మకాలు, కొనుగోళ్లు, లాభాల గురించిన ఆలోచనలు తప్ప మనిషి గురించీ, మనిషి అవసరాల గురించీ, మనిషి సృజనాత్మక అభివృద్ధి గురించీ, ప్రజాజీవన సౌందర్యం ఇనుమడించడం గురించీ ఆలోచనలు ఉండవు.

తత్ఫలితంగా అప్రధానమైపోయిన మనిషి మాయమైపోవలసి వస్తుంది. ఆత్మహత్య చేసుకుని తనను తాను రద్దు చేసుకోవలసి వస్తుంది. హింసకూ హత్యకూ గురి అయి రద్దయిపోవలసి వస్తుంది. వలస వెళ్లి తెలియని ఊళ్లో, తెలియని మనుషుల మధ్య, తెలియని పనిలో అనామకంగా, అపరిచితంగా, మానవగౌరవాన్ని పోగొట్టుకుని అమానవ స్థితిలో బతుకునీడ్చవలసి వస్తుంది. లేదా తమ సమస్యలకు అసలు కారణాలు తెలియక, తమ పొరుగువారే కారణమని అపోహపడి, నిజమైన శత్రువును వదిలి సోదరుల మీదనే అంతర్యుద్ధానికి దిగవలసి వస్తుంది. ఈ ఇరవై ఏళ్ల భారత చరిత్ర ఈ నాలుగు పరిణామాలనూ అతి ఎక్కువగా చూసింది, చూపింది.

దేశవ్యాప్తంగా గత ఇరవై సంవత్సరాలలో ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోయాయని ప్రభుత్వ గణాంకాలే వేనోళ్ల చెపుతున్నాయి. అంతకు ముందు కూడ ఆత్మహత్యలు ఉండవచ్చుగాని అవి ప్రధానంగా వ్యక్తిగత కారణాలతో, వ్యక్తిగత జీవితంలోని నిరాశానిస్పృహలతో జరిగేవి. వ్యక్తులు ఒంటరితనంతో ఆత్మహత్య చేసుకునేవారు. కాని ప్రపంచీకరణ విధానాల అమలు తర్వాత ప్రధానంగా సామాజిక, ఆర్థిక కారణాలతో జరుగుతున్నాయి. సామూహికంగానే నిస్సహాయత వ్యాపించి ఆత్మహత్యలు పెరిగిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా ఐదు లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటే అందులో లక్ష మంది భారతీయులేననీ, ఇది జనాభా నిష్పత్తి కన్న ఎక్కువ అనీ గణాంకాలు చెపుతున్నాయి. ఆత్మహత్య రేటు అనే అంతర్జాతీయ ప్రమాణం (ప్రతి లక్ష మంది జనాభాకు ఎన్ని ఆత్మహత్యలు) ఈ రెండు దశాబ్దాలలో భారత దేశంలో 7.9 నుంచి 10.3కు పెరిగింది. ఆత్మహత్యలు చేసుకున్న వారిలో అత్యధికులు రైతులు. గత ఇరవై సంవత్సరాలలో మూడు లక్షలకు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకోగా, చేనేత కార్మికులు, ఇతర ధ్వంసమైపోయిన చేతివృత్తుల కార్మికులు, మూతబడిన పరిశ్రమల కార్మికులు, పోటీ ప్రపంచపు ఒత్తిడికి తట్టుకోలేని విద్యార్థి యువజనులు కూడ గణనీయమైన సంఖ్యలో ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల, వ్యవసాయ రంగాన్ని మనుగడ కోసం వ్యవసాయం నుంచి మార్కెట్ కోసం వ్యవసాయం స్థితికి మార్చి, అంతర్జాతీయ మార్కెట్ కుతంత్రాల రథచక్రాలకు కట్టివేయడం వల్ల రైతుల జీవితం అల్లకల్లోలమై పోయింది. ప్రభుత్వ సహాయం గాని, సమాజ సహాయం గాని అందని నిస్సహాయ స్థితిలో రైతులు తమ జీవితాలు బలిపెట్టవలసి వచ్చింది. ప్రపంచీకరణ విధానాలు సాంస్కృతికంగా తెచ్చిన మార్పుల వల్ల, స్వార్థ విలువలు ప్రకోపించడం వల్ల, ఎవరికి వారే పైకి పోవాలనే కుత్తుకలు ఉత్తరించుకునే పోటీ వల్ల రైతులకు ఎటువైపు నుంచీ సహాయం అందని పరిస్థితి పెరిగింది. ప్రపంచీకరణ సంస్కృతి ప్రధానంగా మన సామాజిక జీవనంలోంచి సామూహికతను, సహజీవన సంస్కృతిని, సానుభూతిని, సంఘీభావాన్ని ధ్వంసం చేసింది. ప్రతి మనిషినీ ఒంటరి ద్వీపాన్ని చేసింది. వ్యక్తిని సంఘం నుంచి వేరు చేసింది. మనిషిని సంఘజీవిగా కాకుండా వ్యక్తిగత దురాశాపరుడిగా, లాభాకాంక్షాపరుడిగా మార్చి వేసింది. అలా చేస్తేనే మనిషిలోని జాంతవిక, వికృత సహజాతాలను రెచ్చగొట్టడానికీ, వాటికి అవసరమైన సరుకులను తయారుచేసి మార్కెట్లలో నింపడానికీ, ఇబ్బడి ముబ్బడిగా లాభాలు దండుకోవడానికీ వీలవుతుంది. మనిషిలో ఆత్మహత్యాలోచనలు పెరిగిపోవడం అలా మనిషిని సంఘం నుంచి వేరు చేసిన పరిణామానికి ప్రతిఫలమే.

ప్రపంచీకరణ పర్యవసానాలలో మరొకటి వలసలు. దేశంలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి జీవనోపాధినీ, మంచి బతుకునూ వెతుక్కుంటూ వ్యక్తులు, కుటుంబాలు, సమూహాలు వలస వెళ్లడం ఎప్పటి నుంచో ఉన్నదే గాని ప్రపంచీకరణ తర్వాత సామూహిక వలసలు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం, చేతివృత్తులు ధ్వంసమైపోయి, గ్రామంలో ఉపాధి అవకాశాలు కరువైపోయి, ఒక్కో గ్రామం నుంచి వందలాది మంది బతుకుదెరువు కోసం పట్టణాలకు చేరడం చాల ఎక్కువయింది. పట్టణాలలో కూడ పరిశ్రమలు మూతపడి, ఆధునిక యంత్ర ప్రవేశం వల్ల ఉద్యోగ కల్పన తగ్గిపోయి, లేదా కొన్ని రకాల నైపుణ్యాలకే ప్రాధాన్యత పెరిగిపోయి, అసంఖ్యాక శ్రామిక జనావళి పొట్ట చేత పట్టుకుని ఇతర పట్టణాలకూ, మహానగరాలకూ వలస వెళ్లడం మొదలయింది. గ్రామీణ ప్రాంతాలలో, అటవీ ప్రాంతాలలో ప్రపంచీకరణ ఫలితమైన భారీ ప్రాజెక్టులు, కర్మాగారాలు, ప్రత్యేక ఆర్థిక మండలాలు, గనుల తవ్వకాలు పెరిగి లక్షలాది ఎకరాల భూములను హస్తగతం చేసుకోవడంతో ఆ భూముల మీద ఆధారపడిన ఆదివాసులు, దళితులు, వెనుకబడిన వర్గాల వారు వలసవెళ్లక తప్పని స్థితి ఏర్పడింది. గోదావరి ఉత్తర గట్టు నుంచి మహారాష్ట్ర, చత్తీస్ గడ్, మధ్య ప్రదేశ్, ఒరిస్సా, జార్ఖండ్ ల మీదుగా బెంగాల్ దాకా వ్యాపించి ఉన్న సువిశాల మధ్య భారత దండకారణ్యంలో విస్తారంగా ఉన్న ఖనిజ నిలువలను బహుళజాతి సంస్థలకు అప్పగించడం కోసం అక్కడి ఆదివాసి ప్రజానీకాన్ని బెదరగొట్టి వలసల వైపు నెట్టడం జరుగుతోంది. అలా వలస వెళ్లడానికి నిరాకరించినందుకు, తమ ప్రాంతంలోని వనరులను బహుళజాతి సంస్థలు ఆక్రమించడానికి వీలు లేదని ప్రతిఘటించినందుకు ఆ ఆదివాసులలోనే కొందరిని చేరదీసి, సాల్వా జుడుం అనే హంతక కిరాయి సైన్యాన్ని తయారుచేసి వేలాది గూడాలను తగులబెట్టించి, వందలాది మంది ఆదివాసులను వారి సోదరులచేతనే హత్య చేయించిన కిరాతక విధానం ప్రపంచీకరణ ఫలితమే. ఈ పరిణామం వల్ల ప్రధానంగా బస్తర్ ప్రాంతం నుంచి బలవంతంగా వలస వచ్చిన రెండు లక్షలకు పైగా గొత్తి కోయలు ఇప్పటికీ ఖమ్మం జిల్లాలో తల దాచుకుని దుర్భరమైన బతుకునీడుస్తున్నారు. ఒరిస్సా, జార్ఖండ్ ల నుంచి సాగుతున్న వలసలకు లెక్కలేదు.

ప్రపంచీకరణ మన సమాజంలో ఆత్మహత్యలతో సమానంగా హింసా ప్రవృత్తిని, నేర ప్రవృత్తిని, హత్యా సంస్కృతిని కూడ పెంచి పోషించింది. సమాజంలో డబ్బు విలువ పెరగడం వల్ల, డబ్బుతో పొందగల విలాసాలు కళ్లముందర రెచ్చగొడుతూ ఆకర్షిస్తుండడం వల్ల, ఎవరికీ అందనిది తనకే అందాలనే అనారోగ్యకరమైన పోటీ తత్వం పెచ్చరిల్లుతుండడం వల్ల నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఏదో ఒక రకంగా ఎక్కువ డబ్బు సంపాదించడమే, ఆ డబ్బుతో ఎక్కువ సరుకులూ విలాసాలూ ఇతరులకు లేని సౌకర్యాలూ కొనుక్కోవడమే జీవిత సాఫల్యానికి చిహ్నమనే భావజాలం ప్రబలడంతో డబ్బు సంపాదనలో నీతి అవినీతుల చర్చ పక్కకు పోయింది. ఎంత అవినీతితోనైనా, అక్రమంగానైనా డబ్బు సంపాదించడమే జీవిత లక్ష్యమైపోయింది. అందువల్ల ఆర్థిక నేరాలు పెరిగిపోయాయి. డబ్బు సంపాదన కోసం హింసాత్మక నేరాలూ బెదిరింపులూ కిడ్నాప్ లూ హత్యాప్రయత్నాలూ హత్యలూ పెరిగిపోయాయి. కొన్ని వందల రూపాయల కోసం జరుగుతున్న హత్యల గురించీ, ఆస్తుల కోసం కుటుంబాలు విచ్ఛిన్నమై హత్యల దాకా దారి తీస్తుండడం గురించి ప్రతిరోజూ వార్తలు వస్తూనే ఉన్నాయి. అసలు మొత్తంగానే పత్రికలలో నేరవార్తల స్థలం ఈ ఇరవై సంవత్సరాలలో విపరీతంగా పెరిగిపోయింది. ఇది పత్రికలలో వార్తలు పెరగడం వల్ల వచ్చిన పెరుగుదల మాత్రమే కాదు, అసలు సమాజంలోనే నేరాలు పెరిగిపోతుండడం వల్ల వాటిని ఎక్కువగా నివేదించక తప్పడం లేదు. ఇక ఎలక్ట్రానిక్ మాధ్యమాలు పూర్తిగా సంచలనాత్మకత మీద ఆధారపడతాయి గనుక నేర వార్తలు ఎంత ఎక్కువ వెలువడితే వాటికి అంత తృప్తి. జరిగే నేరాలను నివేదించడం సరిపోనట్టు, ప్రతి ఛానల్ లోనూ కొత్తగా నటులతో చిత్రించిన నేరాల పునర్నిర్మాణ కార్యక్రమాలు ఉంటున్నాయి. ఇలా మొత్తం మీద ప్రపంచీకరణ తర్వాత నేరం, హత్య సర్వసాధారణమైపోయిన స్థితి ఏర్పడింది.

ఇక ప్రపంచీకరణనూ, ఈ వ్యవస్థనూ ధిక్కరిస్తూ కొత్త విలువల కోసం, కొత్త వ్యవస్థ కోసం మాట్లాడుతున్న, కృషి చేస్తున్న ఉద్యమకారులను హత్య చేయడం కూడ అంతకు ముందు నుంచీ ఉన్నప్పటికీ ప్రపంచీకరణ తర్వాత మరింత ఎక్కువగా పెరిగింది. పైన వలసల సందర్భంగా వివరించిన సాల్వాజుడుం ఇటువంటి హత్యాకాండలో ప్రైవేటీకరణ ప్రయోగం కాగా, దేశ వ్యాప్తంగా ప్రపంచీకరణ వ్యతిరేక ఉద్యమకారులను ఎందరినో ప్రభుత్వ పారామిలిటరీ బలగాలు, పోలీసు బలగాలు, ప్రైవేటు సైన్యాలు పొట్టన పెట్టుకున్నాయి. చివరికి ప్రపంచీకరణను వ్యతిరేకించే గాంధేయ, సర్వోదయ, సమాచార హక్కు చట్టం కార్యకర్తలను కూడ ప్రపంచీకరణ శక్తులు హత్య చేస్తున్నాయి, చేయిస్తున్నాయి.

కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కచ్ నుంచి కోహిమా దాకా ఇవాళ అంతర్యుద్ధం సాగుతున్నది. కొన్ని చోట్ల అది బహిరంగంగా, స్పష్టంగా ఉండవచ్చు. కొన్ని చోట్ల అది అస్పష్టంగా, ఇతర రూపాలలో ఉండవచ్చు. కాని ఇవాళ దేశంలో జాతుల మధ్య, ఒకే జాతి లోని రెండు పక్షాల మధ్య, ప్రాంతాల మధ్య, రాష్ట్రాల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య, అభివృద్ధి నమూనాల మధ్య, పాలకులు రుద్దుతున్న విధానాలకూ ప్రజల ఆకాంక్షలకూ మధ్య ఎడతెగని ఘర్షణ సాగుతున్నది. అది అటు చివర కాశ్మీర్ లో తమ చారిత్రక స్వతంత్ర ప్రతిపత్తిని గౌరవించాలనే ఆకాంక్ష కావచ్చు, ఇటు చివర కూడంకుళంలో తమ ఆరోగ్యాన్నీ భద్రతనూ ధ్వంసం చేసే అణు విద్యుత్ కేంద్రం పట్ల వ్యతిరేకత కావచ్చు. అటు తమిళులకూ మలయాళీలకూ మధ్య సామరస్యంగా పరిష్కరించుకోలేని జల వివాదం కావచ్చు. మరొక చోట అప్రజాస్వామిక సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయాలనే కోరిక కావచ్చు. మరొక చోట తమకు రాజ్యాంగబద్ధమైన రాయితీలు కావాలనే కోరిక కావచ్చు. మరొక చోట తమ ఆకాంక్షల సాఫల్యానికి కొత్త రాష్ట్రం ఏర్పాటే మార్గమనే కోరిక కావచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే యథాస్థితిని అంగీకరించబోమనీ, మార్పు కావాలనీ కోరని ప్రజాసమూహం ఒక్కటి కూడ లేని స్థితిలో ఇవాళ దేశం ఉంది. ఇదే అంతర్యుద్ధ స్థితి. ఈ అంతర్యుద్ధాన్ని తీవ్రతరం చేసినవీ, బలోపేతం చేస్తున్నవీ ప్రపంచీకరణ విధానాలు.

ఈ పరిణామాలూ పర్యవసానాలూ ఇలాగే సాగితే, అంటే ఆత్మహత్యలు, వలసలు, హత్యలు, అంతర్యుద్ధం ఇదే పద్ధతిలో పెరిగిపోతూ ఉంటే సామాజిక మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. సమాజం మధ్యయుగాల నాటి దుడ్డున్నవాడిదే బర్రె విలువలలోకి, కంటికి కన్ను పంటికి పన్ను విధానాల లోకి, దొంగల దోపిడీ రాజ్యంలోకి, హింసా రిరంసలోకి పయనిస్తుంది, ఆధిపత్య శక్తుల వికటాట్టహాసాలకు బలి అయిపోతుంది. సమాజమే ఆత్మహత్య చేసుకోవలసి వస్తుంది. సమాజ గమనంలో నేర్చుకున్న సహకారం, సమానత్వం, మానవగౌరవం, ప్రజాస్వామ్యం, లౌకికత్వం, చట్టబద్ధపాలన వంటి విలువలు మాయమైపోతాయి. ఈ ప్రపంచీకరణ పర్యవసానాల నుంచి సమాజాన్ని కాపాడి, మానవ విలువల ఆధారంగా పునర్నిర్మించగలిగేదీ, వ్యవస్థను మార్చగలిగేదీ విప్లవం మాత్రమే. కాని అశేష ప్రజా బాహుళ్యం పాల్గొనకుండా, సమర్థించకుండా, అట్టడుగు అణగారిన సమూహాలు నాయకత్వం వహించకుండా విప్లవం విజయం సాధించడం సాధ్యం కాదు. అరాచకమా విప్లవమా, ఫాసిజమా ప్రజాస్వామ్యమా, హింసా శాంతా, పరాధీనతా అభివృద్ధా అనే సవాళ్లు ప్రపంచ చరిత్రలో అనేక సార్లు తలెత్తాయి. ఇవాళ ఈ దేశం ముందర ప్రపంచీకరణ అదే సవాలును ఉంచింది. జవాబు చెప్పవలసింది మనమే.


About ఎన్.వేణుగోపాల్ N Venugopal

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues.
This entry was posted in వ్యాసాలు, Ee Bhoomi. Bookmark the permalink.

2 Responses to ప్రపంచీకరణ పర్యవసానాలు – ఆత్మహత్యలు, వలసలు, హత్యలు, అంతర్యుద్ధం

  1. నేను మీ విశ్లేషణతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. కానీ మీనుంచి వనరులు, పెరుగుతున్న జనాభా, పంపిణీ సమస్యలు, జనాభాని నియంత్రించలెని రాజకీయాలు అనే మౌలిక సమస్య పై విశ్లేషణ ని ఆశిస్తున్నాను.

    ఇంకో మౌలిక మైన ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. యంత్రం ద్వారా మనిషి సుఖాన్ని అన్వేషిస్తున్నాడు కదా. దీనికి పరిమితి ఎక్కడ . పేదవాడైనా బహుళజాతి కంపెనీ ఎగ్జిక్యూటివ్ అయినా యంత్రపు ప్రభావంలో సమానంగా పడిపోతున్నాడు. ఇదేమన్నా పారడాక్సా . సిస్టమ్ గురించే కాకుండా Costituents ని కూడా విశ్లేషించి రాయగలరు.

  2. Ghanta Siva Rajesh says:

    Great Post on good tapic.
    i completely agree with you
    in really every single human being is fighting with other in one way or other.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s