చిరుమొగ్గల మరణాలు – ఎవరు చేసిన హత్యలివి?

ఈభూమి ఏప్రిల్ 2012 సంచిక కోసం

ఖమ్మం జిల్లా వేపలగడ్డ లోని డా. ఎల్ వి రెడ్డి మెమోరియల్ స్కూల్ విద్యార్థులను తీసుకుపోతున్న బస్సు రాఘవాపురం దగ్గర వాగులో పడి ఎనిమిది మంది చిన్నారులు మరణించిన సంఘటన మార్చ్ 20న జరిగింది. ముక్కుపచ్చలారని పసిపిల్లలు, అందరికందరూ ఐదారేడుల శైశవగీతాలు ఆ దారుణ ప్రమాదంలో మరణించడం ఎంతటి కర్కోటకులనయినా కంటతడి పెట్టిస్తుంది. అందుకే ఆ సంఘటన జరిగిన మరుక్షణం నుంచీ అనేక ఖండనలు, నిరసనలు, హాహాకారాలు, తప్పులు వెదికే ప్రయత్నాలు, నేరస్తులను శిక్షించాలనే ప్రకటనలు చాల వెలువడ్డాయి. పైపై కారణాలను, కారకులను గురించి ఎంతో కొంత చర్చ జరిగింది. కాని ఆ ఘటనను గాని, దానికి దారితీసిన పరిణామాలను గాని లోతుగా చర్చించకుండానే, మర్నాటికల్లా ఆ చర్చంతా మరుగునపడి పోయింది. సాధారణంగానే ఇటువంటి ఘటనలు జరగగానే మధ్యతరగతి వ్యాఖ్యాతలు ఆ గంటో, ఆ రోజో చాల తీవ్రంగా ప్రతిస్పందిస్తారు. ఎవరి మీద నెపం పెట్టడానికి వీలవుతుందా అని వెతుకుతారు. ఈ నేరం ఫలాని వాళ్లదే అని ప్రకటించి, వాళ్లను కఠినంగా శిక్షించాలని కొంచెం ఆగ్రహాన్నీ, కొంచె ఉచిత సలహానూ వ్యక్తీకరించి చేతులు దులుపుకుంటారు. మనసు మీది నుంచి ఆ నెత్తుటి మరక కడిగేసుకుంటారు. మళ్లీ మరొక సంఘటన జరిగేదాకా లోకాన్ని పట్టించుకోనక్కర లేదనుకునే, ‘చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష’ అనుకునే, దైనందిన కార్యకలాపాలలో కూరుకుపోయే మధ్యతరగతి మనస్తత్వం ఇది.

ఈ సారి ప్రమాదం తర్వాత కూడ డ్రైవర్ తాగుబోతుతనం, శిక్షణలేని క్లీనర్ బస్సు నడపడం, నేతల నిర్లక్ష్యం, అధికారుల అవినీతి అనే నాలుగైదు పైపై కారణాలను మరీ లోతుకు పోకుండా చర్చించి అక్కడితో కన్నీళ్లు తుడిచేసుకోవడం జరిగింది. ఈ కారణాలన్నీ నిజమే కావచ్చు. ఇవి కూడ మరింత సూక్ష్మంగా విశ్లేషించవలసిన అవసరం ఉండవచ్చు. అసలు బయటపడని, ఇప్పటికి దృష్టి పడని కారణాలు మరెన్నో ఉండవచ్చు. ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఉండాలంటే ఇప్పటికి ప్రస్తావనకు వచ్చిన పరిష్కారాల కన్న లోతయిన, విశాలమైన పరిష్కారాలు అవసరం కావచ్చు. కనీసం ఈ ఎనిమిది లేత ప్రాణాల అపహరణ సందర్భంగానైనా అటువంటి మౌలిక కారణాల గురించీ, పరిష్కారాల గురించీ ఆలోచించవలసి ఉంది.

అసలు ప్రమాదం, అందులోనూ రోడ్డు ప్రమాదం అనగానే దాన్ని యాదృచ్ఛికతగా భావించి కారణాలకోసం లోతుగా అన్వేషించనవసరం లేదనే ధోరణి ఒకటి ఉంది. ఒకానొక లిప్తపాటు ఏమరపాటు వల్ల ప్రమాదాలు జరుగుతాయనీ, అందువల్ల ప్రమాదాలకు తక్షణ బాధ్యుల నిర్లక్ష్యం తప్ప మరే కారణమూ ఉండదని చాల మంది అనుకుంటారు. కనుక ప్రమాద కారణాలను వెతకబోతే అనవసరమైన రంధ్రాన్వేషణగా భావిస్తారు. కాని యాదృచ్ఛికతగా కనబడేది కూడ ఒక నిర్దిష్ట క్రమంలో భాగమే. ఆ ఘటన యాదృచ్ఛికంగా జరగడానికి కూడ తక్షణ, దృశ్యమాన కారణాలతో పాటు దీర్ఘకాలిక, అదృశ్య కారణాలు కూడ ఎన్నో ఉంటాయి. స్పష్టంగా కనబడే పరిణామాల వెనుక దాగిన అస్పష్ట పరిణామాలు ఎన్నో ఉంటాయి.

ఉదాహరణకు ఈ రాఘవాపురం ప్రమాదానికి కూడ విశాలమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, వ్యక్తిగత  కారణాలెన్నో ఉన్నాయి. వాటిలో ఏ ఒక్కదాన్నో చూసి, ఆ కారకులను శిక్షిస్తే ఇటువంటి ప్రమాదాలను అరికట్టగలమని అనుకోవడం అమాయకత్వమే అవుతుంది. ఆ కారణాలలో కొన్నిటిని మనం గుర్తించడమే లేదు. గుర్తించిన కారణాలలో కొన్ని చట్టపరంగా శిక్షార్హమైన నేరాలు కావు, అవి ఎక్కువలో ఎక్కువ న్యాయదృష్టితో, నైతిక దృష్టితో నేరాలు కావచ్చు. అందువల్ల ఆ కారణాలకు శిక్షలు విధించడం కూడ కుదరదు.

ఈ రాఘవాపురం ప్రమాదాన్ని సమగ్ర, విశాల దృష్టితో పరిశీలించినప్పుడు కనీసం డజను కారణాలున్నాయని తేలుతుంది. ఆ ఒక్కొక్క కారణానికీ ఒకరో అంతకన్న ఎక్కువో కారకులు ఉండవచ్చు. ఇప్పటివరకూ చర్చకు వచ్చిన ముగ్గురు నలుగురు కారకులను శిక్షించినా మిగిలిన కారణాలు పనిచేస్తూనే ఉంటాయి గనుక ఇటువంటి ప్రమాదాలను అరికట్టగలమనే హామీ లేదు.

మొట్టమొదటి కారణం మన విద్యావ్యవస్థ పనిచేస్తున్న తీరు. ఆరుదశాబ్దాల స్వపరిపాలన తర్వాత ప్రతి గ్రామంలోనూ నాణ్యమైన ప్రాథమిక విద్యను అందించలేకపోయిన పాలకవర్గాల వల్ల ఐదారేళ్ల పిల్లలు ఎన్నో మైళ్ల అవతల ఉన్న పాఠశాలలకు వెళ్లి చదవక తప్పని పరిస్థితి ఉంది. చిన్నారి బాలలకు సమీప పరిధిలో ప్రాథమిక విద్య అందేలా పాఠశాలలను నెలకొల్పాలని పెట్టుకున్న ఆదర్శం ఇప్పటివరకూ అమలు కాలేదు. ఎక్కడన్నా ఒకచోట అమలయిందనుకున్నా ఆ పాఠశాలలో ఉపాధ్యాయులుంటే నల్లబల్ల ఉండని, అది ఉంటే సుద్దముక్క ఉండని, అన్నీ ఉంటే పశువుల పాకలో పాఠాలు నడవవలసిన దుస్థితి ఉందని ప్రతి సంవత్సరం నివేదికలు వస్తూనే ఉన్నాయి. అసలు పద్నాలుగేళ్ల లోపు పిల్లలందరికీ నిర్బంధ ఉచిత విద్య అందిస్తామని రాసుకున్న రాజ్యాంగ ఆదర్శం, ఆ పని పదేళ్ల లోపు సాధిస్తామని 1950లో చెప్పుకున్న సంకల్పం, అరవై సంవత్సరాల తర్వాత ఎక్కడవేసిన గొంగళి సామెత కూడ నవ్వుకునే స్థాయిలో అమలయింది. ఉన్న ఊళ్లో బడి ఉండదు. ఉన్నా అది నాణ్యమైన విద్య అందించదు. ఈ స్థితిలో ఈ పరిసర గ్రామాల కుటుంబాలు ఏం చేయాలి? పాలకుల వైఫల్యానికి ప్రజలు మూల్యం చెల్లించవలసి వస్తుంది.

దానితో రెండవ కారణం రంగం మీదికి వస్తుంది. ప్రభుత్వ రంగంలో ప్రాథమిక విద్య కూడ కల్పించని స్థితి ఉన్నప్పుడు, విద్య కూడ ఒక లాభసాటి వ్యాపారం అయినప్పుడు చదువు అమ్మే అంగళ్లు ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తాయి. మా కొట్లో సరుకే రుచికరమైనదంటే, మా కొట్లో సరుకే రుచికరమైనదని విషాహారానికి పంచదార పూత పూసి అమ్మే బేహారులు బయల్దేరుతారు. ఆదర్శాలతో, శ్రేయోలక్ష్యాలతో ప్రారంభమైన ప్రయత్నాలు కూడ ఈ కుత్తుకలు కత్తిరించుకునే వ్యాపారపోటీలో పడి అవే చిలుకపలుకులు పలుకుతాయి. విద్య అంటే జ్ఞానం, అవగాహన, యుక్తాయుక్త విచక్షణ అనే అభిప్రాయం రద్దయిపోయి, విద్య అంటే నాలుగు ముక్కలు ముక్కున పట్టి పరీక్ష పత్రం మీద చిలకరించి నాలుగు మార్కులు ఎక్కువ తెచ్చుకోవడం, ఆ మార్కులు చూపి పెద్ద ఉద్యోగం, అంటే ఎక్కువ ఆదాయం వచ్చే ఉద్యోగం సంపాదించడం అనే అర్థం స్థిరపడుతుంది. ఆ అర్థం బలపడినకొద్దీ విద్య లక్ష్యం మారిపోతుంది. అటువంటి విద్య ప్రైవేటు రంగంలో మాత్రమే దొరుకుతుందనే అభిప్రాయంతో ప్రైవేటు రంగం వేపు పరుగు మొదలవుతుంది. ఆ పరుగులో లేగదూడల కాళ్లు విరగక తప్పదు.

ఇవాళ మరణించిన పిల్లల పేర్లు చూస్తే వారు అందరికందరూ ఆదివాసి, వెనుకబడిన కులాల పిల్లలని అనిపిస్తోంది. వేల సంవత్సరాలుగా విద్య అందని, విద్యకు దూరం ఉంచబడిన వర్గాలలో విద్యాదాహానికి అది ఒక గుర్తు. విద్య ఒక్కటే ఇవాళ సమాజంలో పైకి పోయే మార్గమని, పైకి పోవడం అంటే కూడ డబ్బు సంపాదించడమని నిర్వచనాలు చెప్పుకుంటున్నప్పుడు ఇటువంటి విద్య కోసం వెంపరలాట తప్పదు. అందువల్ల ఆ వర్గాల విద్యా అవసరాలు తీర్చడం ప్రభుత్వాలు ప్రధాన కర్తవ్యంగా భావించవలసి ఉంది. ఎప్పటికన్నా ఎక్కువగా నాణ్యమైన విద్యా సౌకర్యాలను గ్రామీణ ప్రాంతాలకు, ఈ వర్గాలకు చేరువలోకి తీసుకు పోవలసి ఉంది. కాని ఈ కర్తవ్యాన్ని నిర్వహించడం తమ పని కానే కాదని అనుకునే స్థితికి మన పాలకులు చేరారు.

ఇది మొత్తం విద్యారంగం చిత్రం అయినా, దీనిలోపలనే కనీస చట్ట నిబంధనలకు లోబడి, రాజ్యాంగ ఆదర్శాలకు లోబడి, నైతికతకు లోబడి విద్యారంగాన్ని నడపడం ఎట్లా అని చూడడానికి సంబంధిత ప్రభుత్వ శాఖలు ఉంటాయి. తాము పాఠశాలలు ఏర్పాటు చేయలేకపోయినా, ఆ బాధ్యతను ప్రైవేటు రంగానికి అప్పగించినా, ఆ ప్రైవేటు రంగం ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నదో, విద్యాబోధన ఎట్లా జరుగుతున్నదో, ఉపాధ్యాయుల నాణ్యత ఎట్లా ఉన్నదో, ఉపాధ్యాయుల మీద పని ఒత్తిడి, జీతభత్యాల స్థితి ఎట్లా ఉన్నదో, బాలబాలికల నుంచి ఎటువంటి ఫీజులు వసూలు చేస్తున్నారో పర్యవేక్షించవలసిన బాధ్యత ప్రభుత్వ శాఖలది. తనను తాను సంక్షేమ రాజ్యంగా పిలుచుకునే ప్రభుత్వం తప్పనిసరిగా పాటించవలసిన కర్తవ్యాలు ఇవి. కాని ఈ పనులు చూడవలసిన శాఖలు ఒకటి కన్న ఎక్కువ కావడం వల్ల, వాటి మధ్య సమన్వయం కొరవడడం వల్ల, అవన్నీ కూడ అవినీతి నిలయాలుగా మారినందువల్ల ఈ బాధ్యతలన్నీ నెరవేర్చినట్టే కాగితాల మీద ఉంటుంది. ఆచరణలో అన్నీ లొసుగులే ఉంటాయి. పిల్లలకు సౌకర్యాలు కలిగించడం అనేది పెద్ద మాట, వారిని బందెల దొడ్లలో తోలకపోతే చాలు. వారికి ఎకరాల కొద్దీ ఆటస్థలాలు ఉండాలనేది, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలనేది అత్యాశ. బహుళ అంతస్తుల భవనాల్లో, అపార్ట్ మెంట్లలో, చిన్న చిన్న గదుల్లో నలభై యాభై మందిని కుక్కకపోతే చాలు. విద్యాబోధన అంటే చదువు రావడం అనే అర్థం ఎట్లాగూ లేదు, వల్లెవేయడం, మార్కులు తెచ్చుకోవడం అని మాత్రమే ప్రభుత్వ శాఖలు కూడ నమ్మే స్థితి వచ్చింది. మార్కులు రాకపోతే పాఠశాలలు ఎత్తివేసే కార్యక్రమాన్ని ప్రభుత్వమే మొదలుపెట్టింది. అలా చదువును మార్కుల వేటతో సమానం చేసింది. ఉపాధ్యాయుల రికార్డులు సక్రమంగా నిర్వహించే ప్రైవేటు పాఠశాలలు రాష్ట్రంలోనే ఐదు శాతం కూడ ఉన్నాయో లేవో. అర్హత లేని ఉపాధ్యాయులను నియమించడం, వారికి ఇస్తున్న జీతాలకు రెండు రెట్లకో మూడు రెట్లకో సంతకాలు పెట్టించుకోవడం, రోజుకు ఎన్ని పీరియడ్లు చెపితే నాణ్యత ఉంటుందో అంతకు రెట్టింపుకన్న ఎక్కువ పని ఒత్తిడి ఉండడం సర్వ సాధారణం. ఇన్ని అక్రమాలతో నడుస్తున్నా పిల్లల నుంచి మాత్రం విపరీతమైన ఫీజులు గుంజడం యథావిథిగానే జరుగుతుంది. ఇటువంటి విద్యావ్యవస్థలో ఎదుగుతున్న, చదువు నేర్చుకుంటున్న, సామాజిక విలువలు నేర్చుకుంటున్న పిల్లలు భవిష్యత్తులో ఏమయిపోతారో ఊహించడమే భయానకం. ఈ స్థితి ఆ పిల్లల మీద తెలిసి గాని తెలియక గాని ఒత్తిడిని కలగజేస్తుంది. వారి మానసిక స్థితి ఆందోళనాకరంగా ఉంటుంది. దానికంతా బాధ్యత వహించవలసినది ఆయా సంబంధిత ప్రభుత్వ శాఖలు.

ఇక రాఘవాపురం ప్రమాదాన్ని నిర్దిష్టంగా చూస్తే ఆ రహదారి, దాని మీద నిర్మించిన వంతెన సక్రమంగా లేవని, అవి లోపభూయిష్టంగా, ప్రమాదకరంగా ఉన్నాయని ఎంతో కాలంగా చెపుతున్నామని స్థానికులు అన్నారు. మనదగ్గర రోడ్లు వేసే కంట్రాక్టర్లకు, ఆ కంట్రాక్టులు ఇచ్చే ప్రభుత్వ శాఖలకు, ట్రాన్స్ పోర్ట్ ఇంజనీరింగ్ అనే శాస్త్రం ఉన్నదని, దాన్ని గౌరవించాలని తెలియనే తెలియదని ఆ రోజే ఒక టివి ఛానెల్ లో మాట్లాడిన ఒక ఇంజనీరింగ్ నిపుణుడు అన్నారు. మంత్రులు, శాసనసభ్యులు తమ కుటుంబ సభ్యులకో, ఆశ్రితులకో కాంట్రాక్టులు ఇప్పించుకోవడం, ఆ కాంట్రాక్టులో దొరికినంత దండుకోవడం మాత్రమే చూస్తున్నారు గాని రహదారి ఎలా పోతే, వంతెన ఎంత బలహీనంగా ఉంటే వారికేం పట్టింది? రాష్ట్రంలో ప్రపంచబ్యాంకు పాలన మొదలయిన తర్వాత దాదాపు అన్ని రహదారులు, రహదారుల మీద కల్వర్టులు, వంతెనలు మళ్లీ మళ్లీ నిర్మాణమయ్యాయి. ఆ నిధుల్లో ఎన్ని కైంకర్యమయ్యాయో, ఎన్ని కైంకర్యం కావడానికి ఆ ప్రణాళికలు తయారయ్యాయో గాని రహదారులూ, కల్వర్టులూ, వంతెనలూ అన్నీ ప్రమాద అవకాశాలు పెరిగిన స్థితిలో ఉన్నాయి. ప్రమాదం జరగ లేదంటే అది అదృష్టమే గాని, రహదారి, వంతెన బాగుండడం కారణం కాదు.

ఇక ఆ ప్రమాదానికి దారి తీసిన బస్సు నడపగల స్థితిలోనే ఉందా అనేది పెద్ద ప్రశ్నగా ముందుకు వచ్చింది. పాఠశాలల బస్సులను, ఆ మాటకొస్తే రహదారి మీద నడిచే ఏ వాహనాన్నయినా పరీక్షించి యోగ్యతా పత్రం ఇవ్వవలసిన బాధ్యత రవాణా శాఖది. ఈ యోగ్యతా పత్రాలు ఎలా ఇస్తారో, ఎట్లా డబ్బులు చేతులు మారి ఎంతమాత్రం పనికి రాని వాహనాలు యోగ్యమైనవిగా ముద్ర వేసుకుని రహదారి మీదికి ఎక్కి ప్రమాదాలు చేసి ప్రాణాలు బలితీసుకుంటాయో ‘భారతీయుడు’ సినిమా చెప్పి ఉంది. మరీముఖ్యంగా ప్రైవేటు పాఠశాలల వంటివి డబ్బే ప్రధానంగా చూసుకుంటాయి గనుక వాహనాలకు మరమ్మత్తు చేసి డబ్బు ఖర్చుపెట్టడం ఎందుకు అనుకుంటాయి. ఆ మరమ్మత్తుకయ్యే డబ్బులో పావో పదో వంతో రవాణాశాఖ అధికారులకు ఇస్తే బస్సు యోగ్యమైనదై పోతుంది.

రోడ్డు, వంతెన, బస్సు అన్నీ సరిగ్గానే ఉన్నా, ప్రమాదం జరిగితే, ఆ వాగులో లోతయిన గుంత, అందులో నిండా నీళ్లు లేకపోతే ఇన్ని మరణాలు సంభవించి ఉండేవి కాదని తెలుస్తోంది. ఆ లోతయిన గుంతకు కారణం ఇసుక మాఫియా. నిర్మాణ కార్యకలాపాలు పెరిగినకొద్దీ ఇసుక అవసరం పెరిగిపోయింది. గ్రామ పంచాయతీల పరిధిలోకి వచ్చే ఇసుక తవ్వకాల అనుమతులు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగానే భారీ కుంభకోణంగా మారిపోయాయి. అంత చిన్నవాగులో అసలు ఎంత ఇసుక ఉంటుంది, ఆ ఇసుక తవ్వవచ్చునా, తవ్వినా ఎంత తవ్వాలి, ఇంకా ఎక్కువ తవ్వితే వాగు వట్టిపోయి, భూగర్భ జలాలు అడుగంటి, పర్యావరణ ప్రమాదాలు రావా వంటి అనేక ప్రశ్నలు వేసుకుని సరైన జవాబు చెప్పి, ఇసుక తవ్వకాలను నియంత్రించవలసిన ప్రభుత్వశాఖలు ఏ లాలూచీల వల్ల మౌనంగా ఉండిపోయాయో అందరికీ తెలిసిన సంగతే. నిజానికి ఇసుక తవ్వకాల గురించి తీవ్రంగా ఆలోచించవలసిన అవసరం ఉంది. వాగులలో, నదులలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు జరిపి, పట్టణాలకు తరలించి కోట్ల రూపాయలు చేసుకుంటున్న మాఫియా ఇవాళ రాష్ట్రంలో చాల బలమైన నేరసామ్రాజ్యంగా మారి రాజకీయాలను శాసిస్తున్నది. మరొకవైపు ఆ ఇసుక తవ్వకాలవల్ల మన వ్యవసాయ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలమయిపోతున్నది.

ఈ ప్రమాదానికి కారకులుగా మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ గురించీ, ప్రమాద సమయానికి బస్సు నడుపుతుండిన శిక్షణలేని క్లీనర్ గురించీ వార్తలు చాలనే వచ్చాయి. వాళ్లిద్దరూ ఆ ప్రమాదానికి ప్రత్యక్ష బాధ్యులు అనే మాటలో సందేహం లేదు. కాని ఆ సిబ్బంది జీతభత్యాలు, పని పరిస్థితులు, వారిమీద ఉండే ఒత్తిడులు, వాహనం పరిస్థితి  కూడ పరిగణనలోకి తీసుకుని వారి బాధ్యత ఎంతో తేల్చవలసి ఉంటుంది. అలాగే డ్రైవర్ మద్యపానం గురించి అలవోకగా వ్యాఖ్యలు చేసేముందు ప్రభుత్వ విధానాలే ప్రజలు ఇంకా ఇంకా ఎక్కువగా మద్యం తాగాలని ప్రోత్సహిస్తున్నాయని, బలవంతాన తాగబోయిస్తున్నాయని గుర్తించవలసి ఉంది.

ఈ దృశ్యం మొత్తాన్నీ క్రోడీకరించి చూస్తే ఇవాళ చిన్నారి పిల్లల మరణం చూపుతున్న సమస్య ఏ ఒక్కరిదో కాదు, ఏ ఒక్కరి వల్లనో జరిగింది కాదు. ఇందుకు డబ్బే ప్రధానమని అనుకునే సామాజిక విలువలు, విద్యకు అర్థం మార్చేసిన సంస్కృతి, అత్యధిక లాభాపేక్షతో విద్యా దుకాణాలు నడుపుతున్న విద్యావ్యాపారస్తులు, అవినీతిలో కూరుకుపోయి ప్రజలు, ప్రజాసమస్యలు, ప్రజాస్వామ్యం పట్టని రాజకీయ నాయకత్వం, డబ్బు కోసం ఎటువంటి గడ్డి అయినా కరిచే, ఎంత ప్రజావ్యతిరేకమైన చర్యలైనా చేసే, తాము ప్రజాసేవకులమని మరచిపోయే అధికారగణం, పిల్లలను డబ్బు సంపాదించగల యంత్రాలుగా చూడడానికి అలవాటుపడుతున్న తల్లిదండ్రులు, అన్ని ఒత్తిళ్లకు, చికాకులకు ఉపశమనం మద్యపానమేనని నమ్మే సగటు శ్రమజీవులు, ఆ బలహీనత ఆధారంగా బొక్కసాలు నింపుకునే పాలకులు, ఇవాళ్టి దుస్థితికి ఇన్ని ఇన్ని కారణాలున్నాయి. ఇది అనేక రూపాల్లో బయట పడుతున్న సామాజిక రుగ్మత. ఆ రూపాలలో ఏ ఒకదాన్నో, రెంటినో మార్చినంత మాత్రాన ప్రయోజనం లేదు. అతుకులు, మాట్లు, మలామాలు, పూతలు, మాత్రలు, సంస్కరణలు ఏవీ లాభం లేదు. ఇవి పైపై చికిత్సల వల్ల మారే కారణాలు కావు. అన్నిటికన్ని కారణాలనూ తొలగించగల వెల్లువ తప్ప మరేదీ ఈ సామాజిక రుగ్మతకు పరిష్కారం కాదు.

ఈ కారణాలన్నీ కలిసి ఈ వ్యవస్థ కుళ్లిపోయిందనీ, పుచ్చిపోయిందనీ వేనోళ్ల ప్రకటిస్తున్నాయి. ఆ కారణాలన్నిటినీ తొలగించడం, పరిష్కరించడం అంటే వ్యవస్థ మారడం. సామాజిక, రాజకీయార్థిక, సాంస్కృతిక ధర్మం మారడం. ఆ దిశగా ఏ పని చేసినా ఈ చిన్నారి మొగ్గల కోసం కన్నీటి చుక్క వదిలినట్టే.

– ఎన్ వేణుగోపాల్

                                                                                                                                                                                                                          మార్చ్ 30, 2012

About ఎన్.వేణుగోపాల్ N Venugopal

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues.
This entry was posted in వ్యాసాలు, Ee Bhoomi. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s