గ్రామాల అధ్యయనాల చరిత్ర – 2

వీక్షణం ఏప్రిల్ 2012 సంచిక కోసం

ఆధునిక కాలంలో జరిగిన గ్రామ అధ్యయనాలలో ప్రధానమైనవి గ్రామ కైఫియత్తులు. బ్రిటిష్ పాలనా కాలంలో తయారయిన గ్రామ కైఫియత్తులలో ఎక్కువ భాగం మద్రాసు ప్రెసిడెన్సీలోని తెలుగు భాషా ప్రాంతాలలో జరిగినవే. ఈ గ్రామ కైఫియత్తుల రచన శాస్త్రీయ ప్రమాణాలను పూర్తిగా సంతరించుకోకపోయినా, లోపభూయిష్టంగానే ఉన్నా, గ్రామాల అధ్యయనాల చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా జరిగిన ఆ కృషిని గురించి కొంచెం వివరంగానే తెలుసుకోవాలి.

ఈస్టిండియా కంపెనీ దేశంలో ప్రవేశించిన తర్వాత నూట యాభై ఏళ్లకు, అంటే 1750ల తర్వాత, అనేక ప్రాంతాలలో పాలనాధికారం సంపాదించింది. అప్పుడు పాలనాధికారం అంటే ప్రధానంగా పన్నుల వసూలు అధికారమే. అప్పటికి ప్రధానమైన పన్ను ఆదాయం గ్రామాల నుంచి, వ్యవసాయ రంగం నుంచి వచ్చేదే గనుక గ్రామాలను, వ్యవసాయరంగాన్ని, పంటల విధానాన్ని, దిగుబడిని అధ్యయనం చేయడం బ్రిటిష్ పాలనావసరాలలో ముఖ్యమైన భాగమయింది. అప్పటికే ఇంగ్లండ్ లో పరిశ్రమలు వికసిస్తూ వాటికి ఎన్నెన్నో ముడిసరుకులు – వ్యవసాయోత్పత్తులు గాని, ఖనిజాలు గాని – అవసరమయ్యే స్థితి కూడ పెరుగుతూ వచ్చింది. ఈ అవసరాల నుంచే ఈస్టిండియా కంపెనీ భారత భూభాగంలో దొరికే వనరులను కనిపెట్టడానికి, అంచనావేయడానికి, మదింపు వేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ప్లాసీ యుద్ధం (1757)లో, బక్సార్ యుద్ధం (1764)లో ఈస్టిండియా కంపెనీ సాధించిన విజయం భారతదేశంలో బ్రిటిష్ వలసవాదానికి పాలనాధికారాలు ఇవ్వగా, కొద్ది కాలానికే 1767లోనే సర్వే ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయడం భారత దేశ వనరుల అధ్యయనానికి వాళ్లు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో సూచిస్తుంది. ఆ ప్రాధాన్యతలో భాగమే ఈస్టిండియా కంపెనీ అధికారులు జరిపిన వేరువేరు సర్వేలు, పరిశీలనలు, అన్వేషణలు. పెట్టుబడిదారీ పరిశ్రమలకు ముడిసరుకులను హామీ ఇచ్చే, సమకూర్చిపెట్టే ప్రయత్నంలో భాగంగా ఈ అధ్యయనాలు క్రమబద్ధంగా, కచ్చితంగా, స్పష్టంగా, ఆనాటికి అభివృద్ధి చెందినంత మేరకు శాస్త్రీయ పద్ధతులలో సాగాయి. ఆయా అన్వేషణలు చేసిన అధికారులు తమ సొంత చొరవతో ఎక్కువగానో తక్కువగానో ఈ అధ్యయనాలు జరిపి ఉండవచ్చు. వారిలో కొందరు స్థానిక చరిత్రలపట్ల, కళా సాహిత్య సాంస్కృతిక అంశాల పట్ల ఆదరాభిమానాలు కూడ ప్రదర్శించి ఉండవచ్చు. కాని, ఈస్టిండియా కంపెనీకి, మొత్తంగా బ్రిటిష్ పాలకవర్గాలకు మాత్రం ఈ అధ్యయనాల ఉద్దేశ్యాలు స్పష్టంగానే ఉన్నాయి.

అందుకే ఈ గ్రామ అధ్యయనాలు జరపడంలో 1784 నుంచి 1816 మధ్య కాలిన్ మెకంజీ (1754-1821) చేసిన అపారమైన కృషిని ప్రశంసిస్తూ ఈస్టిండియా కంపెనీ డైరెక్టర్ల బోర్డు “…భారత సమాజం గురించిన పరిజ్ఞానానికి, సైనిక, ఆర్థిక, వాణిజ్య ప్రయోజనాలకు ఉపయుక్తమైన విస్తృత సమాచారాన్ని అందించడంలో అసాధారణమైన ప్రతిభతో సాధించిన విజయాలు” అని అభివర్ణించింది. ఈస్టిండియా కంపెనీ విస్పష్టంగా గుర్తించిన “సైనిక, ఆర్థిక, వాణిజ్య ప్రయోజనాల” కొరకు కాలిన్ మెకంజీ చేసిన కృషిలో గ్రామ అధ్యయనాలు ఒక భాగం. ఇవాళ తెలుగు సీమలో అత్యధిక భాగం కనీసం పది జిల్లాల గ్రామాల చరిత్రకు ఈ మెకంజీ తయారు చేయించిన కైఫియత్తులే ఆధారం గనుక మెకంజీ కృషి గురించి తెలుసుకోవాలి.

కాలిన్ మెకంజీ ఆనాటి బ్రిటిష్ యువకులందరిలాగానే ఉద్యోగం వెతుక్కుంటూ తన ముప్పయవ ఏట, 1783లో భారతదేశానికి వచ్చాడు. ఇంజనీరింగ్ విభాగంలో ఉద్యోగిగా కంపెనీ సైన్యం వెంట తిరుగుతూ 1784-90 మధ్య నెల్లూరు, రాయలసీమ ప్రాంతాలలో రహదారుల, మార్గాల పటాలు తయారుచేశాడు.  ఆ నేపథ్యంలో 1790లో ఆయనకు గుంటూరు సర్కార్ ను సర్వే చేసే బాధ్యత అప్పగించారు. అప్పటికి రెండు సంవత్సరాల కిందనే నిజాం నవాబుల నుంచి గుంటూరు సర్కార్ ఈస్టిండియా కంపెనీ చేజిక్కింది. తమ పాలనలోకి వచ్చిన ప్రాంతంలో ఉన్న వనరులను, అక్కడ పన్నుల వసూలు అవకాశాలను అధ్యయనం చేయడమే ఈ సర్వే ప్రధాన ఉద్దేశం. మెకంజీ 1790 నుంచి 1793 వరకు గుంటూరు సర్కారును మాత్రమే కాక, పొరుగున ఉన్న కడప, కర్నూలు ప్రాంతాలను, నల్లమల, ఎర్రమల కొండలను కూడ సర్వే చేశాడు. ఆ తర్వాత 1794లో పెన్నా, కృష్ణ నదుల మధ్య ఉన్న నిజాం సరిహద్దు ప్రాంతాలన్నిటిని కూడ సర్వే చేశాడు. నిజాం పాలనా ప్రాంతాల గురించిన వివరమైన పటాన్ని 1796లో తయారు చేశాడు. ఈ కృషివల్ల మెకంజీ ఆ తర్వాత ఈస్టిండియా కంపెనీ అధికార నిచ్చెనలో పైపైకి ఎక్కి 1810లో మద్రాసు ప్రాంత సర్వేయర్ జనరల్ గా, 1816లో భారత దేశపు మొదటి సర్వేయర్ జనరల్ గా పదవులు చేపట్టాడు.

బ్రిటిష్ పాలకవర్గాల ప్రయోజనాల కోసమే అయినా మెకంజీ భూగోళం, భూగర్భవనరులు, వ్యవసాయం, సామాజిక వ్యవస్థ, పురావస్తు అవశేషాలు, చరిత్ర, సాహిత్యం వంటి ఎన్నో అంశాల మీద విలువైన సమాచారం సేకరించిపెట్టాడు. దాదాపు పదహారు వందల తాళపత్ర గ్రంథాలు, రాతప్రతులు, ఎనిమిది వేలకు పైగా శాసనాలు, ఆరు వేలకు పైగా నాణాలు సేకరించడంతో పాటు మెకంజీ చేసిన పనులలో 2,070 స్థానిక చరిత్రల సేకరణ ముఖ్యమైనది. ఆయా గ్రామాల గురించి పాలకులకు అవసరమైన సమాచారాన్ని రాబట్టడానికి మెకంజీ ఈ స్థానిక చరిత్రలు రాయించాడు. వాటికి కొంతవరకు ఆధారంగా నిలిచినవి అప్పటికి కొన్ని గ్రామాలలోనయినా భూముల గురించి, పంటల గురించి, పన్నుల గురించి సమాచారాన్ని భద్రపరచిన కవిలె, లేదా దండ కవిలె అనే కరణీకపు చిట్టాలు. మెకంజీ కూడ ఆనాటి సమాజంలో చదువూ, గ్రామం గురించి అవగాహనా ఉన్న కరణాలతోనే ఎక్కువగా వారి వారి గ్రామాల గురించి ఈ స్థానిక చరిత్రలు రాయించాడు. వాటన్నిటినీ గ్రామ కైఫియత్తులు అనిగాని, మెకంజీ కైఫియత్తులు అనిగాని పిలుస్తున్నారు. ఇవన్నీ కనీసం రెండువందల సంవత్సరాల కింద వాడకంలో ఉన్న భాషలో, పదప్రయోగాలతో, అదికూడ శిష్టులు రాసినవిగా ఉన్నాయి. కనుక చదవడానికి కష్టపడవలసి వచ్చినా కొంత విలువైన సమాచారం దొరకకపోదు.

గ్రామ చరిత్రను, గ్రామపు కవిలెకట్టను కైఫియత్ అనడం అలవాటు. స్థితి అనే అర్థం ఉన్న ఆ ఉర్దూ మాట హిందీలో వివరణ, నివేదిక, చిట్టా అనే అర్థంలో వాడకంలోకి వచ్చింది. ఇవి గ్రామాల గురించిన వివరణలే గాని గుర్తించవలసిన అంశం వీటిలో ఎక్కువ భాగం గ్రామ కరణాలు రాసినందువల్ల వారి వంశచరిత్రలు, వారి మత విశ్వాసాలు, వారికి ప్రధానమని అనిపించిన అంశాలు, వారి ఇష్టాయిష్టాలు ఎక్కువగా నమోదయ్యాయి. గుంటూరు ప్రాంతానికి సంబంధించి దొరుకుతున్న రెండు వందలకు పైగా కైఫియత్తులలో దాదాపు ప్రతిదానిలోనూ మొదట తమకు గ్రామ కరణీకం ఎలా వచ్చిందో ఒకే రకమైన వివరణ కనబడుతుంది. అలాగే గ్రామంలోని ఆలయాలు, వాటి నిత్య నైవేద్యానికి మాన్యాలు, ఆచారాలు, గ్రామం గురించిన గాథలు, విశ్వాసాలు, గ్రామం పుట్టుక గురించి అభూతకల్పనలు, గ్రామ సరిహద్దు వివరాలు ఎక్కువగానే కనబడతాయి. గ్రామంలోని భూములు, పంటలు, పన్నులు, చేనేత వంటి ఆనాటి ఉత్పత్తులు, వృక్షసంపద, జలవనరులు, ఖనిజాలు, సామాజిక సంబంధాలు, వృత్తికులాలకు మాన్యాలు వంటి వివరాలు కూడ కొన్ని కైఫియత్తులలో ఎంతో కొంత నమోదు అయ్యాయి. ఉదాహరణకు కడప జిల్లా సంబటూరు కైఫియత్తులో కరమ (కురుబ లేదా కురుమ కావచ్చు), వడ్లంగి (వడ్రంగి), అగసాల, తలారి, మంగలి, చాకలి, అంతుజాతికట్టు (బహుశా దళితులు కావచ్చు), దేవాదాయ, బ్రహ్మాదాయ మాన్యాలను గురించి విస్తీర్ణం, సరిహద్దులతో సహా చాల వివరంగా రాశారు. అలాగే కడప జిల్లా శెట్టిగుంట కైఫియత్తులో “యీ గ్రామం భూమిలో పండే ధాన్యాదుల వివరం – రాగులు, అరికెలు, ఉలవలు, మినుములు, వరి, సజ్జ, చామ, ఆముదాలు, జొన్నలు, మిర్పకాయలు, పొగాకు, నిమ్మతోటలు, అరిటితోటలు, ఆకుతోటలు, పోకతోటలు, టెంకాయతోటలు, గోగులు, కొర్రలు, కూరగాయలు, వగైరా, గుమ్మడికాయలు, సొరకాయలు, బీరకాయలు, బెండకాయలు, కాకరకాయలు – 23 జుమలా దినుసు వారి యిరువైమూడు” అని రాశారు. ఈ రెండో రకమైన ఆధారాల వల్ల కైఫియత్తులు గ్రామాల పరిశోధనకు ప్రధానమైన ఆధారాలుగా ఉపయోగపడతాయి.

1790ల నుంచి 1810ల నాటివరకు రాసిన ఈ కైఫియత్తులలో కొన్నిటిని మూడు నాలుగు దశాబ్దాల తర్వాత సి పి బ్రౌన్ (1798-1884) తిరగరాయించి భద్రపరిచాడు.  మెకంజీ కైఫియత్తులలో గుంటూరు (254 గ్రామాలు), కృష్ణా (3), ప్రకాశం (14), నెల్లూరు (7), శ్రీకాకుళం (12), విశాఖపట్నం (12), విజయనగరం (4) జిల్లాలకు సంబంధించిన కైఫియత్తులను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్కైవ్స్ ప్రచురించగా, కడప జిల్లా (127) కు సంబంధించిన కైఫియత్తులను సి పి బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రం ప్రచురించింది. ఈ గ్రామ కైఫియత్తులను అధ్యయనం చేస్తే, వాటిలో వదిలివేయవలసిన అంశాలను వదిలేసినా, గ్రామంలో ఎటువంటి భూములు ఉన్నాయి, అవి ఎవరి అధీనంలో ఉన్నాయి, గ్రామ కంఠం వంటి ఉమ్మడి భూములు ఎన్ని, ఏయే వృత్తికులాలకు ఎంతెంత మాన్యాలు ఉన్నాయి, గ్రామంలో ఏ పంటలు పండుతాయి, తోటలు ఎన్ని, ఏయే చెట్లున్నాయి, జలవనరులు ఏమిటి, గ్రామంలో పాలన ఎవరిది వంటి అనేక ప్రశ్నలకు స్థూలమైన జవాబులైనా దొరుకుతాయి. ఇప్పుడు అదనంగా చేరిన అనేక అంశాలతో పాటు, ఈ అంశాలను అధ్యయనం చేయడమే ఇవాళ్టికి కూడ గ్రామ అధ్యయనాలుగా భావిస్తున్నారు. కాకపోతే ఈ రెండు వందల సంవత్సరాలలో ఆ అధ్యయనాలకు శాస్త్రీయత, క్రమబద్ధత, నిర్దిష్టత్వం, ఒక వాస్తవాన్ని పలుకోణాలనుంచి పరిశీలించి నిగ్గు తేల్చడం, సర్వే, కేస్ స్టడీ, సెన్సస్, పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ వంటి పటిష్టమైన క్షేత్ర పరిశోధనా సంవిధానాలు వచ్చాయి.

మెకంజీ దక్షిణ భారతదేశంలో చేసినటువంటి పనినే ఇతర బ్రిటిష్ అధికారులు దాదాపు అదే సమయంలో ఇతర ప్రాంతాలలో కూడ చేశారు. సరిగ్గా అదే సమయంలో బెంగాల్ ప్రెసిడెన్సీ గవర్నర్ గా వచ్చిన కారన్ వాలిస్ (1738-1805) శాశ్వత భూమి శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టి గ్రామాలను, గ్రామాలలో భూసంబంధాలను, కంపెనీకి రాబట్టగల పన్నుల ఆదాయాన్ని అధ్యయనం చేయించాడు. దాదాపు అదే సమయంలో ఈస్టిండియా కంపెనీ స్కాటిష్ వైద్యుడు, భూగోళ శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ బుచానన్ (1762-1829)ని ప్రత్యేకంగా మద్రాసు, మైసూరు, బీహార్, బెంగాల్ గ్రామాలలో, పట్టణాలలో ప్రజల పరిస్థితిని అధ్యయనం చేసి నివేదిక ఇమ్మని కోరింది. ఆయన పుస్తకం ‘ఎ జర్నీ ఫ్రమ్ మద్రాస్ త్రూ ది కంట్రీస్ ఆఫ్ మైసూర్, కనరా, అండ్ మలబార్’ 1807లో అచ్చయింది.

శాశ్వత భూమి శిస్తు విధానం బెంగాల్ లో 1793లో మొదటిసారి అమలులోకి వస్తే, సరిగ్గా వంద సంవత్సరాల తర్వాత ఇండియన్ సివిల్ సర్వీస్ అధికారి, న్యాయమూర్తిగా పనిచేసిన బి ఎచ్ బెడెన్ పావెల్ (1841-1901) మూడు సంపుటాల, 2100 పేజీల ‘ది లాండ్ సిస్టమ్స్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా’ పుస్తకం రాశాడు. ఆయనే 1896లో ప్రధానంగా ఉత్తర భారత గ్రామాల గురించి ‘ది ఇండియన్ విలేజ్ కమ్యూనిటీస్’ అనే 450 పేజీల పుస్తకాన్ని, 1899లో మొత్తంగా భారత గ్రామాల గురించి ‘ది ఆరిజిన్ అండ్ గ్రోత్ ఆఫ్ విలేజ్ కమ్యూనిటీస్ ఇన్ ఇండియా’ అనే 100 పేజీల పుస్తకాన్ని ప్రచురించాడు. అలా దాదాపు పద్దెనిమిదో శతాబ్దం చివరినుంచీ బ్రిటిష్ అధికారులు, సామాజిక శాస్త్రవేత్తలు భారతీయ గ్రామాన్ని అధ్యయనం చేస్తూ వచ్చారు. వాటిలో పొరపాట్లు, పాలకవర్గ ప్రయోజనాల కొరకు మాత్రమే చేసిన అధ్యయనాలు ఉండవచ్చుగాని అవి ఇరవయో శతాబ్దిలో ఇంకా విస్తరించిన గ్రామ అధ్యయనాలకు ఉదాహరణలుగా నిలిచాయి. ప్రభావం చూపించాయి. అనుకూల, ప్రతికూల పాఠాలు నేర్పాయి.

ఆ క్రమంలోనే గ్రామాల అధ్యయనానికి వ్యవసాయాదాయ దృష్టి మాత్రమే కాక ఇతర అవసరాలు కూడ ఉనికిలోకి వస్తున్నాయి. అప్పుడే ప్రారంభమవుతున్న కార్ఖానాలకు, రైల్వేలకు అవసరమైన కలప, బొగ్గు విపరీతంగా దొరికే భూభాగంగా భారత దేశాన్ని అధ్యయనం చేయడం బ్రిటిష్ ప్రయోజనాలలో అనివార్య భాగమయింది. అలా 1830ల నుంచీ వేరువేరు వనరుల లభ్యతను అధ్యయనం చేసే కమిటీలు వేయడం మొదలయింది. అలా 1836లో కోల్ (బొగ్గు) కమిటీ ఏర్పడింది. క్రమంగా ఇతర ఖనిజాలను అన్వేషించడానికి కమిటీలు ఏర్పడ్డాయి. మెకంజీ కైఫియత్తులలోనే, అంటే 1811 కు ముందే గుంటూరు జిల్లాలో వొణుకుబాడు, కుంకలకుంటలలో పొటాషియం నైట్రేట్, అగ్నిగుండాల, రావులపురంలలో రాగి, గండి గనుమలలో ఇనుము, చీమలమర్రిలో చౌడుప్పు (సోడియం కార్బనేట్), సూరేకారం దొరుకుతాయని, వేమవరంలో కాగితం తయారు చేస్తారని నమోదు చేశారంటే గ్రామ అధ్యయనాల వెనుక ప్రయోజనాలేమిటో అర్థమవుతుంది. అలాగే దాదాపు ప్రతి గ్రామంలోనూ పండే పంటల వివరాలు, ఉత్పత్తి అయ్యే చేనేత వస్త్రాల వివరాలు కూడ కైఫియత్తులలో నమోదయ్యాయి. ఈ అవసరాల కొనసాగింపుగానే 1851లో జియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏర్పాటయింది. క్రమక్రమంగా గ్రామ అధ్యయనాల స్థానాన్ని వనరుల అధ్యయనాలు ఆక్రమించాయి.

ఆ తర్వాత గ్రామ అధ్యయనాల బాధ్యత కొంతవరకు స్వతంత్ర సామాజిక శాస్త్రవేత్తల మీద, ప్రజా రాజకీయ శక్తుల మీద పడింది. అందుకే ఆధునిక ప్రజానుకూల గ్రామ అధ్యయనాల చరిత్ర పందొమ్మిదో శతాబ్దం చివర, ఇరవయో శతాబ్ది మొదట మొదలయింది. మహాదేవ గోవింద రానడే (1842-1901), దాదాభాయి నౌరోజీ (1825-1917) వంటి తొలితరం జాతీయవాదులు, అర్థ శాస్త్రవేత్తలు 1890లనాటికే భారత ఆర్థికవ్యవస్థకు, గ్రామాలకు బ్రిటిష్ పాలనవల్ల జరుగుతున్న నష్టాలను వివరించడానికి అధ్యయనాలు, విశ్లేషణలు ప్రారంభించారు గాని వారికి గ్రామాలతో పెద్దగా పరిచయం లేదు. భారత ఆర్థిక వ్యవస్థను బ్రిటిష్ ప్రభుత్వ పత్రాల నుంచి విశ్లేషించడానికే వారు ప్రయత్నించారు. అదే సమయంలో జి. ఎఫ్ కీటింగ్ (రూరల్ ఎకానమీ ఇన్ ది బాంబే దక్కన్, 1912), గిల్బర్ట్ స్లేటర్ (ది రిపోర్ట్ ఆఫ్ ది లాండ్ ఎంక్వైరీ కమిటీ, 1913), హెరాల్డ్ మాన్ (లాండ్ అండ్ లేబర్ ఇన్ ఎ దక్కన్ విలేజ్, 1917) వంటి స్వతంత్ర పరిశోధకులు గ్రామ, వ్యవసాయ రంగ అధ్యయనాలు ప్రారంభించారు.

బ్రిటిష్ అర్థశాస్త్రవేత్త, మద్రాస్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేసి దక్షిణ భారత గ్రామ అధ్యయనాలలో చాల కృషి చేసిన గిల్బర్ట్  స్లేటర్ 1918లో ‘సమ్ సౌతిండియన్ విలేజెస్’ అనే పుస్తకం ప్రచురించాడు. ఆయన ఆ పుస్తకానికి ఉపోద్ఘాతంలో “పట్టణాల కన్న ముందు చూడవలసినవి గ్రామాలు. ఎన్నో ఆర్థిక సమస్యలను పట్టణాల దృక్పథం నుంచి పరిశీలించడం అలవాటయిన పారిశ్రామిక దేశాలలో కూడ గుర్తుంచుకోవలసిన విషయమేమంటే ఆ నగరాల, పట్టణాల ఆర్థిక జీవనాన్ని గ్రామాలతో సంబంధం లేకుండా అర్థం చేసుకోలేం. ఆ నగరాలకు, పట్టణాలకు అవసరమైన ఆహారాన్నీ, ముడి సరుకులనూ, అక్కడ శ్రామికులుగా అవసరమయ్యే యువతీ యువకులను అందించేది గ్రామీణ భూములే. భారతదేశంలో గనులు, పరిశ్రమలు, వాణిజ్యం, రవాణా వంటి ఏ రంగం కన్న ఎక్కువ మంది వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటారు. అందువల్ల గ్రామీణ కార్యకలాపాలు, గ్రామీణ జీవనం అత్యంత కీలకమైనవి. విస్మరించడానికి వీలులేనివి” అని రాశాడు.

ఇరవయో శతాబ్ది తొలి దశకాలలో, మొదటి ప్రపంచ యుద్ధ విధ్వంసం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్న తర్వాత, వ్యవసాయ రంగం, రైతాంగం తీవ్రమైన సంక్షోభంలో పడడంతో 1926లో బ్రిటిష్ ప్రభుత్వం మొదటి రాయల్ కమిషన్ ఆన్ అగ్రికల్చర్ ఏర్పాటు చేసింది. సరిగ్గా అప్పుడే భారత జాతీయోద్యమం ఒక మలుపు తిరుగుతోంది. జాతీయోద్యమంలో భాగం కాగలిగిన విస్తారమైన ప్రజాశక్తి గ్రామాలలో ఉన్నదని, బ్రిటిష్ పాలకుల ముడిసరుకుల అవసరాలను గాని, మార్కెట్ విస్తరణ అవసరాలను గాని తీరుస్తున్నదీ, అపారమైన పన్ను ఆదాయాన్ని సమకూరుస్తున్నదీ గ్రామాలేనని గుర్తింపు వచ్చింది. దానితో రాజకీయ ఉద్యమానికి కూడ గ్రామాలవైపు దృష్టి మళ్లింది. గాంధీ ప్రభావంతో చంపారన్ (బీహార్) లో, కైరా (గుజరాత్) లో జాతీయోద్యమంలో భాగంగా గ్రామీణ, రైతాంగ ఉద్యమాలు ప్రారంభం కావడంతో గ్రామాల అధ్యయనం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఆ రాజకీయ, సామాజిక నేపథ్యంలో దేశ వ్యాప్తంగా గ్రామీణ అధ్యయనాలు సాగించే సంస్థలు పుట్టుకువచ్చాయి. పంజాబ్ బోర్డ్ ఆఫ్ ఎకనమిక్ ఎంక్వైరీ అనే సంస్థ ఏర్పడి 1920ల నుంచి పంజాబ్ లో విడివిడిగా గ్రామాలను అధ్యయనం చేయడం ప్రారంభించింది. అదే పనిని 1930లలో బెంగాల్ లో బెంగాల్ బోర్డ్ ఆఫ్ ఎకనమిక్ ఎంక్వైరీ, కలకత్తా ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్ స్టిట్యూట్, విశ్వభారతి రూరల్ రికన్ స్ట్రక్షన్ బోర్డ్ సంయుక్తంగా చేశాయి. మిగిలిన అన్ని ప్రాంతాలలోనూ గ్రామాల అధ్యయనాలు ప్రారంభమయ్యాయి. అలా 1930ల చివరికి దేశ వ్యాప్తంగా గ్రామ అధ్యయనాల పట్ల శ్రద్ధాసక్తులు పెరిగాయి. ఆ దశకానికే గాంధీ ప్రభావం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గురించి ఆలోచనలు కూడ పెరిగాయి. గాంధేయ ఆర్థికవేత్త జె సి కుమారప్ప 1935లో అఖిల భారత గ్రామీణ పరిశ్రమల సంఘం ఏర్పాటు చేశాడు. ఆయనే 1931లో  గుజరాత్ లోని కైరా జిల్లాలో ఒక తాలూకా గ్రామాలలో అధ్యయనం జరిపి ‘యాన్ ఎకనమిక్ సర్వే ఆఫ్ మటర్ తాలూకా’ పుస్తకం రాశారు. గాంధేయ సంఘ సంస్కర్త కాకా కాలేల్కర్ ఆ పుస్తకానికి రాసిన ముందుమాటలో “గ్రామాన్ని పట్టించుకోనక్కరలేదనే విద్యావంతులు తయారవుతున్నార”ని ఎగతాళి చేశారు. గ్రామాలు ముఖ్యమైనవని అనుకునేవారు కూడ గ్రామాలను నిర్దిష్టంగా, కచ్చితంగా, శాస్త్రీయంగా అధ్యయనం చేయడం లేదని, రైతులు స్వయంగా చెప్పినవి విని వాళ్ల నుంచి గణాంకాలు, వివరాలు సేకరించడం లేదని అన్నారు.

ఈ విమర్శలు ఎలా ఉన్నా 1940ల నాటికి గ్రామాల అధ్యయన ప్రాధాన్యత పెరిగింది. గ్రామాలను అధ్యయనం చేయాలనే ఆలోచనలు పెరిగాయి. అధ్యయనం చేసే పరిశోధకులు పెరిగారు, సంస్థలు విస్తరించాయి. రెండు ప్రపంచ యుద్ధాల మధ్య కాలంలో అర్థశాస్త్రవేత్తలు డి ఆర్ గాడ్గిల్, సి ఎన్ వకీల్, సమాజ శాస్త్రవేత్తలు ఆర్ కె ముఖర్జీ, జి ఎస్ ఘుర్యె స్వయంగా గాని, తమ పరిశోధక విద్యార్థుల చేత గాని గ్రామాల అధ్యయనం మీద కేంద్రీకరించారు.

ఈ అకడమిక్ పరిశోధనలకు, అధ్యయనాలకు సమాంతరంగా, ఒక్కోసారి పరస్పర ప్రభావాలతో, సహకారంతో ఇరవయో శతాబ్ది తొలి అర్ధ భాగంలో రాజకీయ దృక్పథంతో కూడ గ్రామ అధ్యయనాలు జరిగాయి. గ్రామాల ప్రాధాన్యత గురించి గాంధీ అభిప్రాయాలు చాల ప్రాచుర్యంలో ఉన్నవే. గాంధీ ప్రభావం ఉన్నమేరకు జాతీయోద్యమ కార్యకర్తలు గ్రామాల మీద దృష్టి పెట్టారు. అలాగే పట్టణంలో పుట్టి, పట్టణ ఉన్నతవర్గాల ప్రతినిధిగానే పేరు తెచ్చుకున్న జవహర్ లాల్ నెహ్రూ కూడ ఈ సమయంలోనే గ్రామాల మీద దృష్టిపెట్టాడు. గ్రామాలతో పరిచయం తమ వంటి మధ్యతరగతి కళ్లు తెరిపించిందని, తమ కళ్ల ముందర ఒక కొత్త భారత దేశం లేచి నిలిచిందని ఆయనే తన డిస్కవరీ ఆఫ్ ఇండియాలో రాసుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో జాతీయోద్యమంలో వస్తున్న చీలికలలో జయప్రకాశ్ నారాయణ, ఎన్ జి రంగా, సోషలిస్టులు, కమ్యూనిస్టులు అందరూ కూడ గ్రామాల మీద కేంద్రీకరించారు. గ్రామ రాజకీయాలు భారత జాతీయోద్యమ ప్రధాన రంగస్థలంగా మారాయి. అందువల్ల గ్రామాలను అధ్యయనం చేయడం ప్రతి రాజకీయ బృందానికీ అనివార్యమయింది. జాతీయోద్యమ నాయకులలో ప్రధానంగా డా. బి ఆర్ అంబేద్కర్ గ్రామాల గురించిన ఈ వైఖరిని వ్యతిరేకించారు. గ్రామమంటే హిందూ గ్రామమే అని ఆయన భావించారు. “హిందూ సామాజిక ధర్మం సంపూర్ణంగా పనిచేసేది గ్రామంలోనే” అని ఆయన అన్నారు. చివరికి రాజ్యాంగ ముసాయిదా చర్చలలో కొందరు సభ్యులు గ్రామ రాజ్యాలకు (రిపబ్లిక్ లకు) అనుకూలంగా మాట్లాడినప్పుడు, “ఈ గ్రామ రాజ్యాలనేవి భారతదేశ క్షీణతకే దారితీశాయి…గ్రామమంటే ఏమిటి? అది స్థానికతా కూపం, అజ్ఞానం, సంకుచితత్వం, మతోన్మాదం వంటి వాటికి ఆలవాలం” అని జవాబిచ్చారు. గ్రామ పునరుద్ధరణలోగాని, పునర్నిర్మాణంలో గాని, గ్రామాభివృద్ధిలోగాని దళితులకు ఆశాజనకమైనదేమీ లేదని కూడ ఆయన భావించారు. అందువల్ల గ్రామాల అధ్యయనం మీద ఆయన ఆసక్తి కనబరచలేదు.

1947 తర్వాత వచ్చిన కొత్త ప్రభుత్వం తన దేశ పునర్నిర్మాణ లక్ష్యాలలో ఒకటిగా గ్రామీణాభివృద్ధిని ఎంచుకుంది. కనుక గ్రామాలను వాస్తవికంగా అధ్యయనం చేయడానికి, గ్రామాల స్థితిలో మార్పు తేవడానికి అవసరమైన ప్రణాళికలు రచించడానికి ఎక్కువ ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆ సందర్భంలోనే బొంబాయి స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ ప్రొఫెసర్ వి వి శయన 1949లో ‘అగ్రేరియన్ ప్రాబ్లమ్స్ ఆఫ్ మద్రాస్ ప్రావిన్స్’ అనే పేరుతో కోస్తా ప్రాంతాల గ్రామాల అధ్యయనం చేశారు. అర్థ శాస్త్రవేత్త పి సి జోషి ‘చేంజెస్ ఇన్ క్లాస్ స్ట్రక్చర్ ఇన్ రూరల్ ఉత్తరప్రదేశ్’ పరిశోధన కోసం 1952-55 మధ్య ఉత్తరప్రదేశ్ గ్రామాలను అధ్యయనం చేశారు (ఆయన పరిశోధనా అనుభవాలను ‘క్షేత్ర పరిశోధన అనుభవం – పునస్సమీక్ష’ పేరుతో వీక్షణం 2009 సెప్టెంబర, అక్టోబర్ సంచికలలో చూడవచ్చు). సమాజ శాస్త్రవేత్త ఎస్ సి దూబె 1951-52లో హైదరాబాద్ పరిసరాలలోని షామీర్ పేటలో రెండు సంవత్సరాల పాటు అధ్యయనం చేసి ‘ఇండియన్ విలేజ్’ పుస్తకం రాశారు. (తెలుగు అనువాదం భారతీయ గ్రామము తెలుగు అకాడమి ప్రచురణగా వెలువడింది). ఒక భారతీయ గ్రామం గురించి సమగ్రమైన అధ్యయనంగా ఈ రచనకు చాల పేరు వచ్చింది. గ్రామంలోని సామాజిక నిర్మితిని, ఆర్థిక నిర్మితిని, సంస్కార నిర్మితిని, కుటుంబ సంబంధాలను, జీవన స్థాయిలను, కలసిమెలసి జీవించడాన్ని, సామాజిక పరివర్తనను ఈ పుస్తకం విశ్లేషించింది. అప్పటికే సమాజ శాస్త్రవేత్త ఎం ఎన్ శ్రీనివాస్ మైసూరు రాష్ట్రంలో గ్రామాల అధ్యయనాలు చేసి ఉన్నారు. సమాజ శాస్త్రానికి సంబంధించినంతవరకు గ్రామీణ అధ్యయనాలలో 1955ను కీలక సంవత్సరంగా గుర్తిస్తారు. ఆ సంవత్సరమే ఎస్ సి దూబె ‘ఇండియన్ విలేజ్’, డి ఎన్ మజుందార్ సంపాదకత్వంలో ‘రూరల్ ప్రొఫైల్స్’, మెక్ కిమ్ మారియట్ సంపాదకుడిగా ‘విలేజ్ ఇండియా’, ఎం ఎన్ శ్రీనివాస్ సంపాదకుడిగా ‘ఇండియాస్ విలేజెస్’ పుస్తకాలు వెలువడ్డాయి. ఆ తర్వాత 1950లలోనూ 1960లలోనూ అర్థశాస్త్ర, సమాజ శాస్త్ర శాఖలలో భారత గ్రామ అధ్యయనాలు, ప్రచురణలు విరివిగా జరిగాయి. గ్రామాలను అధ్యయనం చేయడానికీ, అర్థం చేసుకోవడానికీ, వివరించడానికీ, విశ్లేషించడానికీ అనేక సిద్ధాంతాలు, పరిశోధనా చట్రాలు, సంవిధానాలు ఉనికిలోకి వచ్చాయి.

ఐతే గ్రామీణ అధ్యయనాలను ఇటు అర్థశాస్త్రవేత్తలు, అటు సమాజశాస్త్రవేత్తలు చెరి ఒకవైపు లాక్కు పోయారని, అవసరమైన సమన్వయం కొరవడిందని సమాజ శాస్త్రవేత్త రామకృష్ణ ముఖర్జీ అంటారు. “సామాజిక శాస్త్రవేత్తలు గ్రామీణ సమాజ ఆర్థిక వ్యవస్థ మీదనే ఎక్కువ దృష్టి పెట్టారు గనుక, అది 1940ల తర్వాత మరింతగా పెరిగిపోయింది గనుక, గ్రామస్తులను సంఘజీవులుగా చూపే బదులు, అంతకంతకూ ఎక్కువ నైపుణ్యంతో వారిని అమూర్త ఆర్థిక, గణాంక ప్రత్యయాలుగా చూపడం మొదలయింది….అందువల్ల మరొక దృక్కోణం నుంచి గ్రామ అధ్యయనాలు జరపవలసిన అవసరం పెరిగింది. అంతకు ముందరి దశలోని అర్థశాస్త్రవేత్తలు తయారు చేసిన దృక్కోణానికి భిన్నమైన దృక్కోణాన్ని సాంస్కృతిక, సామాజిక నర శాస్త్రవేత్తలు, సమాజ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు, వ్యాఖ్యానించారు….ఇలా అటు అర్థశాస్త్ర, ఇటు సామాజిక నరశాస్త్ర, సమాజ శాస్త్ర ముద్ర బలంగా ఉన్న రెండు పాయల గ్రామ అధ్యయనాలు కలవవలసిన అవసరం ఉంది. కనీసం రెండు పాయల మీద వంతెనలు నిర్మించవలసి ఉంది…. ‘అర్థశాస్త్ర’ ‘సమాజశాస్త్ర’ దృక్కోణాలు కీలక స్థలాల దగ్గరనైనా కలుసుకోనంతవరకూ గ్రామ జీవితం గురించి సమగ్ర అవగాహన సాధ్యం కాదు, గ్రామీణ సమాజ చలనసూత్రాల గురించి సమ్యగ్ దృక్పథం సాధ్యం కాదు” అని ఆయన 1963లో రాసిన మాటలు ఇవాళ్టికీ గుర్తుంచుకోవలసినవే.

ఈ అకడమిక్ గ్రామీణ అధ్యయనాలు, చర్చలు ఒకవైపు జరుగుతుండగానే గ్రామ అధ్యయనాలను మరొక దృక్కోణం నుంచి చూడడం మొదలయింది. గ్రామాల అధ్యయనం కేవలం అధ్యయనం కోసమో, విశ్లేషణ కోసమో మాత్రమే కాదని, అది ఆచరణ కోసం, సామాజిక పరివర్తనా వ్యూహ రచన కోసం, సామాజిక చరిత్ర నిర్మాణంలో చోదకశక్తులయిన ప్రజలు గ్రామాలలో ఉన్నారు గనుక వారిని అధ్యయనం చేయాలని భావించే కమూనిస్టు, విప్లవ దృక్పథం అది. అంతకు ముందు నుంచీ కూడ ఈ దృక్పథం ఉన్నప్పటికీ భారత గ్రామ అధ్యయనాలలోకి 1960లలో ఎక్కువగా ప్రవేశించింది. అకడమిక్ ప్రపంచం కూడ దానికి ప్రతిస్పందించవలసి వచ్చింది. విస్తృతంగా చర్చలు జరపవలసి వచ్చింది. అలా ఇరవయో శతాబ్ది మలి అర్ధభాగంలో కమ్యూనిస్టులు, నక్సలైట్ విప్లవకారులు చేసిన గ్రామ అధ్యయనాల చరిత్ర చాల ఆసక్తికరమైనది, ఆలోచనాప్రేరకమైనది, ఆచరణకు మార్గదర్శిగా పనిచేసేది.

(మిగతా వచ్చే సంచికలో))

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Veekshanam. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s