పెద్దకూర పండుగ రాజకీయాలు

ఆహార రాజకీయాల గురించి మాట్లాడవలసిన సమయం ఇది. ఒక వ్యక్తి తనకు ఇష్టమైన ఆహారాన్ని స్వేచ్ఛగా తినవచ్చునా లేదా అనేది రాజకీయంగా మారిపోయి, ఆధిపత్యానికీ, నిరంకుశత్వానికీ, దాడికీ, హింసకూ దారితీసిన కాలం ఇది. వ్యక్తిగత అభిరుచులను, సాంస్కృతిక సంప్రదాయాలను, తరతరాల ఆహారపుటలవాట్లను, స్వాభిమాన ప్రకటనను శాసించదలచిన గుత్తాధిపత్య, అగ్రవర్ణ, మతోన్మాద, హింసా రాజకీయ భావజాలపు సందర్భం ఇది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పెద్దకూర పండుగ సందర్భంగా ఇతరుల ఆహార హక్కు పట్ల హిందూత్వ వాదులు ప్రదర్శించిన అసహనాన్ని, చేసిన హింసాత్మకమైన దాడిని, ఆ అసహనం వెనుక రాజకీయాలను నిశితంగా పరిశీలించవలసిన సమయం ఇది.

అసలు ఒకరు తినే ఆహారాన్ని, కట్టుబొట్టు తీరును, ఆలోచనలను, ఆచరణలను, ఒక్కమాటలో ఒకరి సంస్కృతిని మరొకరు చిన్నచూపు చూసే, అడ్డుకునే వైఖరి నిరంకుశ, నియంతృత్వ వైఖరి. ప్రజాస్వామ్య వ్యతిరేక వైఖరి. ఈ దేశ పాలకవర్గాలకు, హిందూ బ్రాహ్మణీయ అగ్రవర్ణ రాజకీయాలకు అలవాటయిన వైఖరి ఇది. ఇతరులను బానిసలుగా, అస్పృశ్యులుగా, పనివాళ్లుగా, తక్కువవాళ్లుగా చూడాలంటే వారిని తొడలనుంచో, పాదాలనుంచో పుట్టినవాళ్లుగా భగవానువాచ చెప్పించాలి. వారి తిండినీ, ప్రవర్తననూ, భాషనూ, ఆలోచనలనూ, సంస్కృతినీ, అస్తిత్వాన్నీ అవమానించాలి. ఈ వైఖరిలో భాగమే ఇవాళ్టి ఆహార దౌర్జన్యం.

నిజానికి ప్రతి మనిషీ, ప్రతి సమూహమూ తన వీలును బట్టి, ఆర్థిక నైసర్గిక స్థితిని బట్టి ఒక ఆహారానికి అలవాటు పడుతుంది. చారిత్రక క్రమంలో అది వారి సంస్కృతీ చిహ్నం అవుతుంది. ఆ విభిన్నమైన ఆహారాలలో ఒకటి ఎక్కువా కాదు, ఒకటి తక్కువా కాదు. ఆ వైవిధ్యాన్ని గుర్తించి, ప్రతి ఒక్కరి ఆహార హక్కును గౌరవించడం, దాన్ని ఇతరులు శాసించకుండా, చిన్నచూపు చూడకుండా ఉండడం ఆహార ప్రజాస్వామ్యం. అది విషం అయితేనో, ఇతరులను అవమానించేదైతేనో ఆ మాట చెప్పవచ్చు. చర్చించవచ్చు. కాని దౌర్జన్యంతో దాన్ని అడ్డుకోవడం హిందుత్వ రాజకీయాలకు మాత్రమే తెలిసిన పద్ధతి. పెద్దకూర విషం కాదు. అది తినడం ఇతరులకు అవమానకరమనే పేరు మీద సంఘపరివార్ శక్తులు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో దౌర్జన్యానికి దిగాయి.

కాని పెద్దకూర ఎవరికీ అవమానం కూడ కాదు. ఈ దేశంలో గణనీయమైన సంఖ్యలో ప్రజలు ఇష్టంగా తినే ఆహారం అది. హిందూత్వ బ్రాహ్మణ్యం మేకుబందీ వ్యవస్థగా మారకముందు అది బ్రాహ్మణులు కూడ తిన్న ఆహారం అని అనేక పౌరాణిక, చారిత్రక ఆధారాలు ఉన్నాయి. మరి అది హిందూ జాతికి అవమానం అనే మాట కేవలం ఇతర జాతులను చిన్నచూపు చూడదలచిన అగ్రవర్ణ మత రాజకీయాల పర్యవసానం మాత్రమే.

పోనీ, ఈ గోవధ నిషేధవాదులు ప్రకటిస్తున్న గోమాత ఆరాధన నిజమైనదేనా? నిజాయితీతో కూడినదేనా? ఇతర వర్గాల ప్రజలను, ముఖ్యంగా దళితులను, మైనారిటీలను దెబ్బతీయడానికి, అవమానించడానికి హిందుత్వవాదుల చేతిలో అమాయకమైన గోవు ఒక  ఆయుధమూ సాధనమూ అయింది గాని, నిజంగా గోవుల మీద, పశు సంతతి మీద వాళ్లకూ ఏమీ ప్రేమ లేదు. అంత ఆరాధించే గోవు చచ్చిపోతే దగ్గరికి కూడ పోకుండా, దాన్ని లాక్కుపోయే పని దళితులకు అప్పజెప్పే అగ్రవర్ణాలివి. ఆ గోవులు పనిచేయ గలిగినంతకాలం, పాలు ఇస్తూ, సంతానాన్ని కంటూ తమకు ఉపయోగపడేంతకాలం వాటి ఆలనాపాలనా చూసి, వట్టిపోయినాక నిష్పూచీగా వదిలేసే అగ్రవర్ణాలివి. గోవును పూజించే ఈ రాజకీయ వాదులు గత ఆరు దశాబ్దాలలో ఎన్ని లక్షలమంది మనుషులను ఊచకోత కోశారో చరిత్రలోకి వెళ్లకపోయినా, మన కళ్ల ముందర గుజరాత్ లో మూడువేల మందిని బలిగొన్న రక్తపు చేతులు ఇంకా ఆరలేదు. నాలుగు శతాబ్దాల చారిత్రక కట్టడాన్ని కూల్చిన దుర్మార్గం ఇంకా మాసిపోలేదు. అలా చరిత్రను తుడిచేసేవాళ్లు, మనిషిని సంహరించేవాళ్లు పశువును మాత్రం పూజిస్తారట! ఆ పశువును తినేవాళ్ల మీద కత్తి కడతారట! ‘జీవహింసే కూడదు’ అంటే వేరే చర్చ. కాని అనేక ఇతర జంతువులను ఇష్టంగా ఆహారం చేసుకున్న వాళ్లే ఒకానొక జంతువు మీద ఇంత ప్రేమ చూపడం అసంగతం మాత్రమే కాదు, అది నిజానికి ఒక కుటిల రాజకీయం. ఆ ఒకానొక జంతువును తినే ప్రజాసమూహం మీద దాడికి మార్గం.

ఇక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గోహత్య, ఎద్దుకూర వండడం, బహిరంగంగా తినడం తప్పు అనే వాదనలు చూస్తే, ఈ హిందుత్వ వాదులు వారి పండుగలు, వారి విందులు ఈ ప్రాంగణంలో జరుపుకోవడం లేదా? విశ్వవిద్యాలయ ప్రాంగణంలో వినాయక చవితి ఉత్సవాలలో, ఇతర హిందూ పండుగలలో వీరంగాలు ఎలా జరుగుతున్నాయి? ఒకప్పుడు లైబ్రరీకి వెళ్లేదారిలో మూడు పక్కలా నాపరాతి బండలతో ఒక విగ్రహం మాత్రం ఉన్న హిందుత్వ దేవతలకు ఇవాళ పెద్ద పెద్ద గుళ్లు ఎలా వచ్చాయి? విశ్వవిద్యాలయం హిందూ అగ్రవర్ణ గ్రామమేనా? అందులో ప్రవేశించి తమ పండుగలు జరుపుకునే, తమ సాంస్కృతిక ప్రత్యేకతలు చూపుకునే హక్కు దళిత బహుజనులకు లేదా? ఇంకా వారు ఊరి చివర ఉండవలసిందేనా?

ప్రశ్న ఎద్దుకూర ఇష్టమా కాదా, ఎద్దుకూర తింటారా తినరా అనేదానికన్న ముఖ్యమైనది. ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష పట్ల, ఒక సాంస్కృతిక అస్తిత్వ ప్రకటన పట్ల ఇతరులు ఎలా వ్యవహరిస్తారనేది ప్రశ్న. తిననివాళ్లు, ఇష్టం లేనివాళ్లు కూడ సమర్థించవలసిన పండుగ ఇది. ఈ దేశ జనాభాలో గణనీయమైన భాగానికి, ప్రధానంగా ఈ దేశ సంపదకు సృష్టికర్తలయిన భాగానికి ఆచారం అది, ఆహారం అది, సంస్కృతి అది. తమ ఆహార సంస్కృతి చిన్నచూపుకు గురవుతున్నదని, దాన్ని ఇతరుల ఆహారంతో సమానంగా చూడకపోవడమంటే తమను అవమానించడమేనని ఒక వర్గం భావించింది. అ అవమానాన్ని ప్రతిఘటించాలని నిర్ణయించుకుంది. అప్పుడు సమానత్వాన్ని కోరేవాళ్లందరూ ఆ ప్రతిఘటనను సమర్థించవలసి ఉంటుంది. ప్రతిఘటించేవాళ్ల రాజకీయాలు, ఉద్దేశాలు, వ్యక్తిగత అభిరుచులు నచ్చినా నచ్చకపోయినా దానికన్న ముఖ్యంగా గుర్తించవలసినది అది ధిక్కార ప్రకటన, అది స్వాభిమాన ప్రకటన. అది నిరంకుశత్వం మీద సవాల్. దాన్ని సమర్థించడం ప్రతిఒక్కరి బాధ్యత. “నీ అభిప్రాయాలతో నాకు ఏకీభావం లేకపోవచ్చు. కాని నీ అభిప్రాయాలు చెప్పుకునే హక్కును కాపాడడానికి నా ప్రాణాలైనా ఇస్తాను” అన్న వోల్టేర్ మాట ప్రజాస్వామ్య స్ఫూర్తికి చిహ్నం. ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆ స్ఫూర్తిని ప్రకటించవలసి ఉంది. కొందరి అభిప్రాయాలను, సంస్కృతిని, ఆహారపుటలవాట్లను తొక్కివేయడానికి ప్రయత్నం జరుగుతున్నప్పుడు స్వేచ్ఛాప్రియులందరూ ఆ అభిప్రాయాలను, సంస్కృతిని, ఆహారపుటలవాట్లను ఎత్తిపట్టవలసి ఉంది. సంఘపరివార్ తప్పుడు ప్రచారానికి బలి అయి, ఆ చాణక్య దమననీతిలో పాలు పంచుకుంటున్న వారు ఏ వర్గాలవారయినా, వారి వారి అభిరుచులేవయినా ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తిని గుర్తుంచుకోవాలి.

‘ఎదిరించినోని పీకనొక్కు సిద్ధాంతం ఫాసిజం’ అన్నాడు కాళోజీ. సంఘపరివారానికి తెలిసినది ఫాసిజం మాత్రమే. కాని ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రజాస్వామిక స్ఫూర్తివల్ల, వీరోచితమైన విద్యార్థి ఉద్యమాల వల్ల ఆ ఫాసిస్టు ప్రమాదం కొన్ని దశాబ్దాలుగా కోరలు దాచుకుని ఉంది. తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నామనే పేరుతో ఇటీవల సంఘపరివార్ మరొకసారి బలం పుంజుకుని కోరలు విప్పుతున్నదనడానికి ఈ ఎద్దుకూర పండుగ మీద దాడి ఒక సూచన. “ప్రత్యేక తెలంగాణ న్యాయమైన ఆకాంక్షలకు మద్దతు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు, కాని మీ మనువాద, హింసావాద, హిందుత్వ దుర్మార్గం ఇక్కడ చెల్లదు. దళితుల పట్ల, సబ్బండవర్ణాల పట్ల, మైనారిటీల పట్ల, మహిళల పట్ల విషాన్ని, ద్వేషాన్ని చిమ్మే మీ మనువాద రాజకీయాలు ఇక్కడ చెల్లవు” అని తెలంగాణ వాదులు ప్రకటించవలసిన సమయం ఆసన్నమైందని ఉస్మానియా ఘటనలు హెచ్చరిస్తున్నాయి.

పెద్దకూర పండుగ గురించి ఆలోచించిందీ నిర్వహించిందీ ఆజాద్, స్టాలిన్, రాజేష్, సుదర్శన్ వంటి తెలంగాణ బిడ్డలే. ప్రత్యేక తెలంగాణ వాదులే. “బీఫ్ ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ, నాలెడ్జ్” అనే అద్భుతమైన ఇంగ్లిషు పాటను రాసి పాడిందీ శరత్ అనే తెలంగాణ బిడ్డే. మరి సంఘ పరివారం ఎందుకు వ్యతిరేకించినట్టు?  నిజానికి సంఘ పరివారం తన మతోన్మాద, అగ్రవర్ణ భావజాల ఎజెండా కోసం తెలంగాణను పక్కన పెడుతుందని మొన్న మహబూబ్ నగర్ రుజువు చేసింది, నిన్న పెద్దకూర పండుగ రుజువు చేసింది.

అలాగే, ఎద్దుకూర పండుగ ఎంత ఆహ్వానించదగిన సాంస్కృతిక అస్తిత్వ ప్రకటన అయినా, ప్రజాస్వామిక వ్యక్తీకరణ అయినా దానికదిగా దళితుల పురోగతిని సాధించజాలదని కూడ విద్యార్థి సోదరులు తెలుసుకోవాలి. రాజ్యాధికారం ఎవరి చేతుల్లో ఉంటే వారి భాష, ఆహారం, కట్టుబొట్టు, సంస్కృతి, భావజాలాలు కూడ అధికారంలో ఉంటాయి. పాలకవర్గాలు ప్రజలను పాలించడం మాత్రమే కాదు, ప్రజల భావాలను కూడ పాలిస్తాయి. కనుక భావాలలో మార్పు, సాంస్కృతిక సమానత్వం రావాలంటే రాజ్యాధికారం ఈ పాలకవర్గాల చేతుల్లోనుంచి ఇవాళ దోపిడీ పీడనలకు గురవుతున్న అసంఖ్యాక పాలిత ప్రజానీకం చేతుల్లోకి రావాలి. ఆదివాసి, దళిత, బహుజన, మైనారిటీ వర్గాల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించే రాజ్యాధికారం కావాలి. ఆ సుదీర్ఘ ప్రయాణం ప్రారంభించకుండా, చేయకుండా, గెలవకుండా నిజమైన స్వేచ్ఛా ప్రకటనగా, స్వాభిమాన ప్రకటనగా పెద్దకూర పండుగ ప్రాధాన్యత నిలబడదు.

ఎన్. వేణుగోపాల్

About ఎన్.వేణుగోపాల్ N Venugopal

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues.
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

4 Responses to పెద్దకూర పండుగ రాజకీయాలు

  1. siva says:

    చదవటానికి కస్టంగా వుంది అక్షరాలు

  2. బావుంది. మంచి విశ్లేషణ :)

  3. memu ilaa ge untaamu anevaari ni emanagalam alagante vastradhaarana ku kuudaa o sanskruti undi ippatikee aadimategalavaaru konni tandaalallo battalu sarigga kattu kooru kaani vaallu caalegiiki caggagaa guddalu kattuku vastunnaaru mari vaaall hakku lu gurtu ceyadaaniki digambarula panduga ceeyandi inkaa baaguntundi proceed

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s