యాన్ మిర్డాల్ తో ఇష్టాగోష్ఠి

వీక్షణం ఏప్రిల్ 2012 సంచికకోసం

 యాన్ (ఇంగ్లిష్ లో జె ఎ ఎన్ అని రాస్తారు గాని స్వీడిష్ లో యాన్ అని ఉచ్చరిస్తారు) మిర్డాల్ భారత ప్రజలకు చిరకాల మిత్రుడు. స్వీడన్ లోని స్టాక్ హోం లో 1927లో పుట్టిన యాన్ మిర్డాల్ యువకుడిగా నాజీ వ్యతిరేక యువజన సంఘాల సభ్యుడిగా, మార్క్సిస్టుగా మారి అరవై సంవత్సరాలకు పైగా రచయితగా, పత్రికారచయితగా ఉన్నారు. భారతదేశం, చైనా, అఫ్ఘనిస్తాన్, ఇరాన్, క్యూబా, అమెరికా వంటి అనేక దేశాలు పర్యటించారు, చాల పుస్తకాలు రాశారు. చైనా గ్రామాన్ని అధ్యయనం చేసి 1962లో రిపోర్ట్ ఫ్రమ్ ఎ చైనీస్ విలేజ్, 1982లో ఆ గ్రామానికే వెళ్లి రిటర్న్ టు ఎ చైనీస్ విలేజ్ రాశారు. కన్ఫెషన్స్ ఆఫ్ ఎ డిస్ లాయల్ యూరపియన్ అనే నవల రాశారు. భారతదేశంలో ఢిల్లీలో 1950లలో కొన్ని సంవత్సరాలు నివసించారు. 1980లలో నక్సలైట్ ఉద్యమాన్ని పరిశీలిస్తూ దేశవ్యాప్తంగా పర్యటించారు. గోదావరిలోయ అడవులలో సాయుధదళాలతో పాటు తిరిగారు. ఆ అనుభవాలన్నిటినీ 1984లో వెలువడిన ఇండియా వెయిట్స్ పుస్తకంలో రాశారు. మళ్లీ మావోయిస్టు ఉద్యమాన్ని పరిశీలించడానికి 2010లో దండకారణ్యంలో రెండు వారాలకు పైగా ఉన్నారు. ఆ నేపథ్యంలో రాసిన రెడ్ స్టార్ ఓవర్ ఇండియా పుస్తక ఆవిష్కరణ కోసం 2012 ఫిబ్రవరి మొదటివారంలో హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చిన ప్రముఖులతో వీక్షణం కార్యాలయంలో ఏర్పాటు చేసే ఇష్టాగోష్ఠుల పరంపరలో భాగంగా యాన్ మిర్డాల్ కూడ రెండు గంటల పాటు అనేక విషయాల మీద మాట్లాడారు, ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఆ సంభాషణలోంచి ముఖ్యమైన భాగాలు:

భారత దేశంలో ఏం జరుగుతున్నదో చాలకాలంగా చూస్తూనే, తెలుసుకుంటూనే ఉన్నాను. 2010 సంవత్సరాది సమయంలో నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) అగ్రనాయకత్వం నన్ను దండకారణ్యంలో, తూర్పు కనుమలలో కలుసుకోదలచుకున్నదని సందేశం. పన్నెండు రోజుల్లో వాళ్లను కలవవలసి ఉంది. అదృష్టవశాత్తూ నాకు స్వీడిష్ సాహిత్యం మీద, ప్రత్యేకించి ఆగస్ట్ స్ట్రిండ్ బర్గ్ మీద భారతదేశంలో ప్రసంగాలు ఇవ్వడానికి ఒక ఫెలోషిప్ ఉంది. వెంటనే ఢిల్లీకి విమానంలో వచ్చాను. అక్కడి నుంచి మావోయిస్టు పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు నన్ను దండకారణ్యంలోకి తీసుకువెళ్లారు. నా మోకాళ్లనొప్పుల వల్ల అది కష్టమే అయింది. మావోయిస్టు గెరిల్లాలు కొన్నిసార్లు నన్ను మోసుకుని వెళ్లవలసి వచ్చింది కూడ. చివరికి మేం క్యాంపుకు చేరాక పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా అర్మీ సైనికులు, ఆదివాసులు నాకు స్వాగతం చెప్పారు. నాకు టీ ఇచ్చారు.

కాసేపటికి అడవుల్లోనుంచి కొందరు వచ్చారు. వారితో మాట్లాడుతుండగా నాకు అర్థమయింది, ఆ వచ్చినవారిలో ఒకరు మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి గణపతి అని. ఇండియాలో సాధారణంగా పొడి అక్షరాలతో పిలుస్తుంటారు. ఆయన జి ఎస్ అంటే జనరల్ సెక్రటరీ.

మేం ప్రధానంగా రెండు విషయాలు మాట్లాడుకున్నాం. యూరప్ లో ఉన్న సాధారణ స్థితి గురించి నేను చెప్పాను. భారత విప్లవోద్యమంలో అభివృద్ధి భావన గురించి జి ఎస్ చెప్పాడు. పరిశ్రమలు ఎలా అభివృద్ధి చేయాలో, సోవియట్ యూనియన్ లో పైనుంచి పరిశ్రమల అభివృద్ధి ఎలా జరిగిందో, చైనా సాంస్కృతిక విప్లవ అనుభవాలు ఏమిటో మాట్లాడుకున్నాం. సోవియట్ యూనియన్ లో పరిశ్రమలను ఫోర్డిస్టు పద్ధతిలో అభివృద్ధి చేయడం వల్ల ఆ పరిశ్రమలు కార్లను మాత్రమే తయారు చేయలేదు, బూర్జువా భావజాలాన్ని కూడ తయారు చేశాయి. అదే ఏకైక అభివృద్ధి నమూనా కాదు. ప్రజల వైపు నుంచి ప్రత్యామ్నాయ అభివృద్ధి ఆలోచనలు సైద్ధాంతికంగా పారిస్ కమ్యూన్ నాటినుంచీ ఉన్నాయి. చైనాలో ఆచరణాత్మక అనుభవంగా ఉన్నాయి. అదంతా చాల ఆసక్తిదాయకంగా, స్వేచ్ఛగా జరిగిన సంభాషణ. ఇతర దేశాలలో నేను చేసిన చర్చలతో పోలిస్తే ఇది చాల సాఫీగా, సూటిగా జరిగిన సంభాషణ.

తర్వాత మేం వాళ్లతో పదహారు రోజులు గడిపాం. నా మోకాళ్లనొప్పులవల్ల నేను కొన్ని ప్రాంతాలకు వెళ్లలేకపోయాను గాని నాతోపాటు వచ్చిన గౌతమ్ నవ్లాఖా వాళ్లతో మాడ్ ప్రాంతానికి వెళ్లాడు. నేను క్యాంపులోనే ఉండిపోయాను. సుదీర్ఘమైన చర్చలలో పాల్గొన్నాను. పార్టీ డాక్యుమెంట్లు, సాహిత్యం చదివాను.

ఈ ప్రయాణంలో నాకు గుర్తుండిపోయే అనుభవాలు ఎన్నో ఉన్నాయి. మేం సాధారణ రాజకీయ చర్చలూ చేశాం. నిర్దిష్ట అంశాల మీదా వేరువేరు స్థాయిలలో చర్చించాం. మొత్తం మీద వారు నాకు చాల నచ్చారు.

ఒక అతి మామూలు ఉదాహరణ ఇవ్వాలంటే ప్రజల మధ్య వైరుధ్యాలతో వ్యవహరించడంలో పార్టీ ఎలా ప్రవర్తించిందో చెప్పాలి. రుతుస్రావ సమయంలో స్త్రీలు ఊరి బయట ఉండాలనేది అక్కడి ఆదివాసుల ఆచారం. అక్కడ మహిళా ఉద్యమం బలపడుతున్న సందర్భంలో ఇది సరైన ఆచారం కాదని, మార్చాలని ఆలోచించారు. ఆ సమయంలో కూడ స్త్రీలు ఊరిలోనే ఉండేలా చూడాలని ఆలోచించారు. కాని ప్రజలు అందుకు అంగీకరించలేదు. చాల లోతయిన, దీర్ఘకాలంగా అమలులో ఉన్న ఆ ఆచారాన్ని మార్చడానికి వీల్లేదని ప్రజలు అన్నారు. అప్పుడు పార్టీగాని, మహిళా ఉద్యమ కార్యకర్తలు గాని ‘’ఇది పార్టీ ఆదేశం. కచ్చితంగా పాటించాల్సిందే’’ అని పట్టుపట్టలేదు. ఈ విషయంలో మార్పు మెల్లమెల్లగా తేవాలని ఆలోచించారు. ప్రజల మధ్య వైరుధ్యాలతో సున్నితంగా వ్యవహరించడం ఎట్లా అనే దానికి ఇది ఉదాహరణ.

మరొక ఉదాహరణ కూడ వాళ్లు నాకు చెప్పారు. మీకు తెలుసు, దేశంలో చాల ప్రాంతాలలో ఒకే ఇంటి పేరుగలవాళ్లను ఒకే కుదురుకు, కుటుంబానికి చెందినవాళ్లుగా గుర్తిస్తారు. ఒకే ఇంటిపేరుగల వాళ్ల మధ్య వివాహం నిషేధం. అది రక్తబంధువులను పెళ్లి చేసుకున్నట్టు లెక్క. పార్టీలో ఒక సమస్య వచ్చింది. అది పైకి చూడడానికి చిన్న సమస్యే. ఇద్దరు పార్టీ కార్యకర్తలు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోదలచారు. కాని ఆ ఇద్దరు ఆదివాసుల ఇంటిపేరూ ఒకటే. ఈ సమస్య ప్రగాఢమైన వ్యక్తిగత అనుభవానికి సంబంధించినది. కాని అదే సమయంలో రాజకీయమైనది కూడ. కనుక కిందినుంచి పైదాకా చాల చర్చకు దారి తీసింది. ఇతర దేశాల అనుభవాలను, చైనా అనుభవాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. ఈ సమస్యపై తీసుకునే నిర్ణయానికి దీర్ఘకాలిక ప్రభావం ఉంటుంది. ఆ మార్పు దీర్ఘకాలికంగా జరగవలసిందే గాని హఠాత్తు నిర్ణయంతో జరిగేది కాదు. చివరికి ఆ కార్యకర్తలు వివాహం చేసుకోగూడదని పార్టీ నిర్ణయించింది. నేను ఈ సమస్యలు మీ దృష్టికి ఎందుకు తెస్తున్నానంటే ఇవి వ్యక్తిగత, చిన్న ఉదాహరణలు అయినప్పటికీ పార్టీ ఎటువంటి దూరదృష్టితో, సమన్వయంతో సమస్యలు పరిష్కరిస్తుందనేది, ప్రజల మధ్య వైరుధ్యాలను పెంచే దిశగా కాక తగ్గించే దిశగా పనిచేస్తుందనేది అర్థమవుతుంది.

అలాగే నేను వాళ్ల డాక్యుమెంట్లలో చదివినదీ, వారితో చర్చల్లో ప్రస్తావనకు వచ్చినదీ కులం వంటి విషయాలలో వాళ్ల అవగాహన. నేను 1940లలో యువజన సంఘంలో పనిచేసినప్పటినుంచీ ఇటువంటి చర్చలు ఉన్నాయి. మన మెదళ్లలో పాత భావాలు ఉంటాయి. మనం హఠాత్తుగా కొత్త మనుషులుగా పుట్టుకురాలేదు. పాత సమాజపు దురలవాట్లు, తప్పుడు అభిప్రాయాలు, ఆధిక్యత -న్యూనత భావాలు చాల లోతుగా మన మీద ప్రభావాలు వేస్తుంటాయి.

పాలకవర్గాలు కొత్త కొత్త పద్ధతులు నేర్చుకున్నాయనే గుర్తింపు కూడ అవసరం. వంద సంవత్సరాల కింద, యాభై సంవత్సరాల కింద ఎటువంటి పద్ధతులలో పోరాడామో అవే పద్ధతులు ఇప్పుడు ఉపయోగపడవు. ఈ విషయాలలో పార్టీ పత్రాలు, పార్టీ నాయకుల ఆలోచనలు చాల రాజకీయంగా, చైతన్యవంతంగా ఉన్నాయని నాకనిపించింది. నాకు తెలిసిన యూరపియన్ కమ్యూనిస్టు ఉద్యమాలతో పోలిస్తే వీళ్లు ఉన్నతస్థాయి రాజకీయ చైతన్యంతో ఉన్నారని నాకనిపించింది.

పార్టీ గురించి నాకు ప్రశంసనీయంగా కనిపించిన మరొక అంశం స్త్రీపురుష సమానత్వం. బహుశా ఇక్కడి పత్రికలలో మావోయిస్టు పార్టీలో స్త్రీల మీద అత్యాచారాల గురించీ, స్త్రీపురుష అసమానత గురించీ, వివక్ష గురించీ వార్తలు చదివిఉంటారు. అదంతా ప్రభుత్వ ప్రచారం. నేను స్వయంగా చూసినది అందుకు పూర్తిగా భిన్నం. స్త్రీపురుషుల మధ్య కామ్రేడ్లీ సంబంధాలు, సదవగాహన ఉన్నాయని నాకు కలిగిన సాధారణ అభిప్రాయం.

వాళ్లు సాధారణ మానవ సమస్యలనూ, ఇంకా విస్తృతమైన అభివృద్ధి సమస్యనూ, జీవనోపాధి, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, నీటిపారుదల వగైరా సమస్యలనూ పట్టించుకుంటున్నారు. ప్రస్తుతం వారొక చక్రబంధంలో ఉన్నారు. ప్రభుత్వం వారికి ఉప్పు కూడ అందకుండా ఆంక్షలు విధిస్తోంది. కష్టతరమైన పరిస్థితులలో వారు పోరాటం సాగిస్తున్నారు.

**

నేను 1980లో భారతదేశానికి వచ్చాను. మొదట దేశవ్యాప్తంగా చాల మంది మావోయిస్టులను, సాంస్కృతిక కార్యకర్తలను కలిశాను. ఆ తర్వాత బొంబాయిలో చండ్ర పుల్లారెడ్డిని కలిశాను. నేను అజ్ఞాతంగా ఆంధ్రప్రదేశ్ కు తిరిగివెళ్లాలని, సాయుధ దళాలను కలవాలని ఆయన సూచించారు. నేనూ నా భార్య గన్ కెసిల్ నా కూతురు ఇవా అలా అడవుల్లోకి వెళ్లాం. అప్పటి నా అనుభవాలన్నీ ‘ఇండియా వెయిట్స్’ పుస్తకంలో రాశాను. అప్పటికి భారత నక్సలైట్ ఉద్యమాన్ని గురించి బైటివాళ్లు ఎవరూ రాయలేదు. బహుశా నేనే తొలి యూరపియన్ రచయితను అయి ఉంటాను. నేను ఆ ఉద్యమాన్ని అర్థం చేసుకోవడానికి, వివరించడానికి ప్రయత్నించాను. అప్పుడు నక్సలైట్ ఉద్యమం అనేక పాయలుగా ఉండేది. ఆ విషయం పుల్లారెడ్డి నాతో చర్చించారు కూడ. అప్పటికి ఒక జాతీయస్థాయి పార్టీ గాని, దేశవ్యాప్తంగా ఆమోదయోగ్యమైన నాయకుడు గాని లేరు. అదంతా స్థానిక ఉద్యమాల నుంచి రూపొందిన చిన్న చిన్న బృందాలుగా ఉండేది. ఇవాళ ఒక దేశవ్యాప్తమైన, సంఘటితమైన నిర్మాణం ఉంది. ఇప్పటికీ అక్కడక్కడ చిన్న చిన్న బృందాలు ఉన్న మాట నిజమే. ఐతే అప్పుడు ఉన్నంత పరస్పర వ్యతిరేకత లేదు. తప్పనిసరిగా అప్పటికీ ఇప్పటికీ భారత విప్లవోద్యమం గణనీయమైన అభివృద్ధి సాధించింది, విస్తరించింది.

ఇక చైనా విషయానికి వస్తే, నేను మొదట 1962లో వెళ్లాను. అది మూడు సంవత్సరాలు వరుస కరువు తర్వాత. చైనా అప్పటికి చాల ఇబ్బందులను, ఆహార కొరతను, ఆకలిచావులను ఎదుర్కొంటోంది. నేనప్పుడు చైనాకు భారతదేశం నుంచే వెళ్లాను. భారత్ తో పోలిస్తే చైనా పరిస్థితి మెరుగనే చెప్పాలి. భారతదేశంతో పోలిస్తే చైనా సమాజం హేతుబద్ధ సమాజంగా ఉండింది. నేనూ నా భార్యా చైనాలో ఒక గ్రామానికి వెళ్లాలనుకున్నాం. అప్పటికి చైనాను పర్యటిస్తున్న రచయితలు, విదేశీయులు బీజింగ్ కో , షాంఘైకో, ఇతర నగరాలకో వెళ్లి అక్కడి రాజకీయాలను, ప్రజా జీవితాన్ని పరిశీలిస్తున్నారు. మేం మాత్రం గ్రామానికి వెళ్లాలనుకున్నాం. అందుకు కారణాలున్నాయి. ఎప్పుడైనా కిందికి వెళ్లి పరిశీలించాలని, అక్కడ విస్తృతంగా చూసి వివరించాలని గోర్కీ అన్నాడు. అక్కడ పాత కొండ గుహల నివాసాలకు కొనసాగింపుగా ప్రజలు ఇళ్లు కట్టుకున్నారు. మాకంటె ముందు విదేశీయులు ఈ ఇళ్లను పరిశీలించారు. కాని ఆశ్చర్యకరంగా మేం మాత్రమే ఆ ప్రజల దగ్గరికి వెళ్లి ఆ ఇళ్లు వారెలా కట్టుకున్నారు, ఏ పదార్థాలు వాడారు, వగైరా వివరాలు తెలుసుకున్నాం. మేం సేకరించిన ఈ వివరాలు జోసెఫ్ నీథమ్ వంటి శాస్త్రవేత్త కూడ ఉపయోగించుకున్నాడంటే అది మాకు గర్వకారణం. మేం గ్రామస్తులను కలిసి వివరంగా మాట్లాడాం. ఆ సంభాషణలన్నిటినీ, వారి పేర్లతో సహా రాశాం. మా కృషికి అందుకే ప్రాచుర్యం వచ్చింది. మామీద విమర్శలు కూడ వచ్చాయనుకోండి. అభివృద్ధి నిరోధక పత్రికలు ‘ఒక్క గ్రామమే మొత్తం చైనా కాదు’ అని విమర్శించాయి. అవును. నిజమే. ఒక్క గ్రామాన్ని పరిశీలించి చైనా అంతా అలాగే ఉందని చెప్పలేం. ఒక్కగ్రామాన్ని పరిశీలించి ఆంధ్రప్రదేశ్ అంతా ఇంతే అని చెప్పలేం. కాని మా పుస్తకం ఒక ముఖ్యమైన విషయాన్ని వివరించింది. ఒకవైపు పాశ్చాత్య పత్రికలలో చైనాలోని నగరాలలో జరుగుతున్న సంచలనాత్మక సంఘటనల గురించి వార్తాకథనాలు వస్తున్నప్పుడు మా పుస్తకం సోషలిస్టు చైనాలో ఒక గ్రామంలో సాధారణ పరిస్థితులు ఎలా ఉన్నాయో వివరించింది.

సాంస్కృతిక విప్లవ కాలంలో మేం మళ్లీ చైనా వెళ్లాం. మళ్లీ ఆ గ్రామానికే వెళ్లదలచుకున్నాం. సాంస్కృతిక విప్లవం గురించి మా అవగాహన, అది సైద్ధాంతికంగా సరైనదే అని. ఆచరణాత్మకంగా కూడ సరైనదని రుజువు కావలసిందే అని. నిజంగానే అది ఆరోగ్య సేవలలో, వ్యవసాయంలో, విద్యలో చాల సానుకూలమైన ఫలితాలు సాధించింది. వారు రెడ్ బుక్ పట్టుకుని అందులోంచి కొటేషన్లు చదువుతూ ఆయా రంగాలలో ఎలా పనిచేయాలో చర్చించుకున్నారు. మేం అదంతా వాస్తవికంగా నమోదు చేశాం.

ప్రస్తుత చైనా నాయకత్వానిది ఈ విషయంలో ద్వంద్వ వైఖరి. ఇవాళ వాళ్లు సాంస్కృతిక విప్లవకాలం గురించి అదంతా చీకటి కాలమని వ్యాఖ్యానిస్తారు. అందువల్ల నా రెండో నివేదికను వాళ్లు గుర్తించకలేదు. మొదటి నివేదికను మాత్రం గౌరవంగా చూస్తారు. నాకు ఇప్పుడు ఆ పుస్తకానికిగాను గౌరవ డాక్టరేట్ ఇచ్చారు. ఇది కూడ ద్వంద్వ వైఖరికి నిదర్శనమే.

సాంస్కృతిక విప్లవ తుదిదశలో మేం మళ్లీ అక్కడికి వెళ్లాం. చాలకాలమే ఉన్నాం. అప్పుడు చాల తీవ్రమైన పరిణామాలు జరుగుతున్నాయి. రెండు పంథాలకు చెందినవారి మధ్య బీజింగ్ లో తుపాకి కాల్పులు కూడ జరిగాయి. దేశం అల్లకల్లోలంగా ఉండింది. అప్పుడు మావో, చౌ ఎన్ లై లు పార్టీ కార్యకర్తలను గ్రామసీమల్లోకి వెళ్లి అధ్యయనం చేయమని ఎందుకు సూచించారో నాకు అర్థమయింది. గ్రామసీమల్లోనే నిజమైన చైనా ఉంది. సాంస్కృతిక విప్లవపు చివరి సంవత్సరంలో చాల రోజుల పాటు మేం చెంగ్ టు లో ఉన్నాం. ఆ సమయంలో ఆ పట్టణ పార్టీ నాయకురాలిగా ఒక వీథులు ఊడ్చే స్త్రీ ఉండేది. ఆ పట్టణంలోని పరిస్థితుల గురించి నా భార్య ఒక నివేదిక రాసింది. అక్కడ రాజకీయ కృషి ఎలా సాగిందో, శ్రామికవర్గ నియంతృత్వం ఎలా సాగిందో, అక్కడ సమస్యలు ఎలా పరిష్కరించేవారో, పాఠశాలలో ఎలా పనిచేసేవారో, పాఠశాలలో వికలాంగులైన పిల్లల అవసరాలు ఎలా చూసేవారో, కింది నుంచి ఒక పరిశ్రమను ఎలా అభివృద్ధి చేసేవారో ఈ విషయాలన్నీ వర్ణించింది. మాకు చాల సంతృప్తినిచ్చిన నివేదిక అది. మేం దానిమీద చాలరోజులు పనిచేశాం. ఆ తర్వాత పరిస్థితులన్నీ తారుమారు అయ్యాయి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఒకటుంది. సాంస్కృతిక విప్లవంలోని మంచి అంశాలకు గ్యాంగ్ ఆఫ్ ఫోర్ ప్రతినిధి కాదు. నిజంగానే సాంస్కృతిక విప్లవకాలంలో రెండు పంథాల మధ్య పోరాటం జరిగింది. పెట్టుబడిదారీ మార్గావలంబకులు వంటి మాటలు పాశ్చాత్య పరిశీలకులకు అర్థమయ్యేవి కాదు. కాని అప్పుడు ఎవరు ఏ పంథా తీసుకుంటున్నారో స్పష్టంగానే ఉండేది. పార్టీ నాయకత్వ శ్రేణుల్లో ఉన్నతస్థానాల్లో, మధ్యంతర స్థాయిలో ఉన్నవారిలో చాలమంది పెట్టుబడిదారీ పంథా తీసుకున్నారు. కారణాలు పెద్ద కష్టమైనవేమీ కావు. యేనాన్ నాటినుంచీ, రైతాంగ పోరాట నాయకులుగా ఉన్న కామ్రేడ్స్ ను నేను ఇంటర్వ్యూ చేశాను. వారు 1930లనుంచీ పార్టీతో ఉన్నారు. చాల అద్భుతమైన మనుషులు. తెలివైన వారు. కాని నిరక్షరాస్యులు, చదువుకున్నవారు కాదు. వారు పైస్థాయి రాజకీయ, సిద్ధాంత విషయాలు అర్థం చేసుకోగలిగిన వారు కారు. ఇక మరొక రకం పార్టీ శ్రేణులు విప్లవానంతరం ప్రభుత్వోద్యోగాలలో చేరి పార్టీ సభ్యులైన యువకులు. శ్రేణుల మధ్య విభజన అది. అంతే కాకుండా మరెన్నో సంక్లిష్టతలున్నాయి. కాని మౌలికంగా గ్రామాలను, పునాదిని అర్థం చేసుకుంటే చైనా విప్లవపు సానుకూలతలు తెలుస్తాయి.

ఇక్కడొక ఆసక్తికరమైన ఉదంతం చెప్పాలి. నా భార్య గన్ కెసిల్ మంచి ఫొటోగ్రాఫర్. తను ఆ కాలంలో సాధారణ ప్రజాజీవితాన్ని ఫొటోలు తీసింది. వాళ్లు పొలంపని ఎట్లా పనిచేస్తారు, కాంగ్ మీద కూచున్నప్పుడు ఎలా ఉంటారు, వంటపని ఎలా సాగుతుంది, తినడం ఎలా ఉంటుంది, పిల్లలతో ఎలా ఉంటారు, పాఠశాలలో ఎలా ఉంటారు వగైరా సాధారణ జీవితానికి సంబంధించిన ఫొటోలు. అప్పుడు కాస్త సంకుచిత దృక్పథం ఉన్న ఒక కామ్రేడ్ మేం అటువంటి ఫోటోలు తీయడం మంచిది కాదన్నాడు. మనుషులు మురికిగా, బురదలో, బట్టలు లేకుండా కనబడితే మెరుగైన జీవితం కనబడదన్నాడు. కాని వ్యవసాయ పనులు చేసే మనిషి బురద అంటకుండా, చలువచేసిన చొక్కాతో చేస్తాడా? మరి ఇప్పుడేమైందో తెలుసా? చైనా ప్రభుత్వం మాకు కబురుపెట్టింది. సాంస్కృతిక విప్లవ రోజులకు సంబంధించి వారి దగ్గర మనుషులు నినాదాలు ఇస్తున్నవీ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నవీ, విప్లవకరంగా కనబడుతున్నవీ తప్ప, మామూలు రోజువారీ జీవితంలో ఉన్న చిత్రాలు లేవట. గన్ కెసిల్ తీసిన ఫొటోలు ఇవ్వగలరా అని చైనావాళ్లు అడిగారు. మేం అవన్నీ ఇచ్చేశాం. చైనా ప్రభుత్వానికి కాదు, స్వీడిష్ మంత్రిత్వశాఖకు ఇచ్చాం. వాళ్లు చైనా ప్రభుత్వంతో సంబంధంలో ఉన్నారు. ఇది ఎందుకు చెపుతున్నానంటే చైనీయులైనా, భారతీయులైనా, విప్లవకారులైనా వారేమీ అతీతమానవులు కారు, ఎక్కడినుంచో ఊడిపడలేదు. వారు చాల మామూలు, కష్టజీవులు, శ్రామికులు. రైతులు, కూలీలు, ఇతరులు. మేం వారిని ఆ స్థాయిలోనే చూశాం.

ఇవాళ చైనా అపారమైన అభివృద్ధి సాధిస్తోంది. కాని ఈ అభివృద్ధి అంతా తొలి దశాబ్దాలలో సాధించిన అభివృద్ధి మీద ఆధారపడి జరుగుతున్నదే. 1953 నుంచి మావో మరణం వరకూ సాగిన క్రమబద్ధమైన అభివృద్ధిని పునాదిగా చేసుకుని డెంగ్ సియావో పింగ్ గాని ఇతరులు గాని ఇవాళ్టి పరిణామాలు సాధిస్తున్నారు.

దీన్ని తాత్వికంగా చూడవలసి ఉంది. మావో అలా చూశాడు. మార్క్స్ నాటినుంచీ ఈ తాత్వికత ఉంది. ఎంగెల్స్ చెప్పినట్టుగా మార్క్స్ ఎప్పుడూ ఏదీ కచ్చితంగా ‘ఇది ఇంతే, ఇంకొకలా ఉండదు’ అని నిర్వచించలేదు. ఆయన ఎపుడైనా ‘ఇది ఇలా ప్రయాణించవచ్చు, ఇలా మారవచ్చు’ అని చెప్పాడు. మావో కూడ అంతే. వారు చెప్పినవాటిలో ముఖ్యమైనది చరిత్ర సోషలిస్టు విప్లవంతో అంతం కాదు అనేది. వర్గపోరాటం సోషలిస్టు విప్లవంతో అంతం కాదు. భవిష్యత్తులో కూడ అంతం కాదు. అది కేవలం రూపం మార్చుకుంటుంది. ఘర్షణలు, వైరుధ్యాలు ఎల్లప్పుడూ ఉంటాయి. పదివేల ఏళ్లయినా సరే అని మావో అన్నాడు. సోషలిస్టు విప్లవమనేది రాగానే అక్కడితో మన పని అయిపోతుంది అని యూరప్ కమ్యూనిస్టులం అనుకున్నాం. మావో ఎప్పుడూ అలా అనుకోలేదు. సాంస్కృతిక విప్లవంతో కూడ పని అయిపోతుందనుకోలేదు. కొత్త తరాలు వస్తాయని, కొత్త వైరుధ్యాలను పరిష్కరిస్తాయని అనుకున్నాడు. అలా ఆయన అన్నిటినీ స్వీకరించేలా ఉన్నాడు. మరొకరకంగా సాంప్రదాయిక మార్క్సిస్టుగా ఉన్నాడు.

మార్క్సిస్టుల గురించి దురభిప్రాయాలుండే చాలమంది వాళ్లేవో వంటకాల పుస్తకాలు రాశారనీ, ఇది చేస్తే, ఇది కలిపితే, ఇది తయారవుతుంది అన్నారని అనుకుంటారు. అది నిజం కాదు. అసలు ‘ఇంతవరకూ జరిగిన చరిత్ర అంతా వర్గపోరాటాల చరిత్రే’ అనే కమ్యూనిస్టు మానిఫెస్టో మొదటి వాక్యానికే కొంతకాలం తర్వాత ఎంగెల్స్ ఒక పాదసూచిక చేర్చాడు. ఆ వాక్యం అప్పటివరకు తెలిసిన చరిత్ర మీద ఆధారపడి రాశాం. ఆ తర్వాత పూర్వ చరిత్ర గురించి అదనపు సమాచారం తెలిసింది. అందువల్ల ఇది లిఖిత చరిత్రకు, వర్గ సమాజానికి సంబంధించిన నిర్ధారణ మాత్రమే అని సవరించాడు. మార్క్స్, ఎంగెల్స్ లు ప్రవక్తలు కారు, వారు చెప్పినవి శిలాశాసనాలు కావు.  వాళ్లు ఒక ప్రత్యేక సంవిధానం అవలంబించి తమకాలపు వాస్తవికతను చూశారు. మావో ఈ విషయాన్ని బాగా గుర్తించాడు. ఆయన మహా మేధావి. ఇవాళ చైనా నుంచి మావో కనుమరుగు కాలేదని గుర్తు పెట్టుకోవాలి. ఇప్పటికీ సాంస్కృతిక విప్లవం గురించీ, మావో గురించీ అక్కడ చాల ఎక్కువగా చర్చిస్తున్నారు. అధికారిక పత్రికలలో కాదు, విశ్వవిద్యాలయాలలో, వ్యక్తిగత సంభాషణల్లో నేను చాల చోట్ల గమనించాను. పార్టీ, ప్రభుత్వం పూర్తిగా పెట్టుబడిదారీ మార్గంలో ఉన్నప్పటికీ ప్రజల్లో ఈ చర్చ జరుగుతోంది. అందువల్లనే నేను ఆశతో ఉన్నాను.

**

భారత విప్లవోద్యమానికి సంబంధించి నేను చెప్పగలదేమంటే ఇవాళ ఈ విప్లవోద్యమానికి విస్తృత ప్రజా మద్దతును, సంఘీభావాన్ని కూడగట్టడం చాల ముఖ్యం. ముఖ్యంగా మధ్యతరగతి వర్గంలో, పట్టణ మేధావి వర్గం వగైరాలలో. దండకారణ్యంలో సాగుతున్న ఆర్థిక పోరాటాలు కేవలం అటవీ ఉత్పత్తులకు సంబంధించినవి మాత్రమే కాదు. అది గతంలో వలసవాద కాలంలో జరిగింది. ప్రస్తుతం ఇది ఇంకా లోతయినది. ఇది భూగర్భంలోని ఖనిజ వనరులకోసం, ఆ ప్రాంతం నుంచి రాబట్టగలిగిన జల విద్యుత్ కోసం, కలపకోసం జరుగుతోంది. భారత ప్రభుత్వం బహుళజాతి, సామ్రాజ్యవాద, బడా గుత్త పెట్టుబడితో ఒప్పందాలు చేసుకుంది. అది సజావుగా సాగాలంటే అక్కడి ప్రజలలో కొందర్నయినా ఉద్యోగాల ఆశ చూపి ఆకట్టుకోవాలి. మిగిలిన లక్షలాది ప్రజలు పట్టణాలకు వలస వచ్చి మురికివాడల వాసులుగా మారిపోతారు. లేదా అంతరించి పోతారు. ఈ అభివృద్ధి క్రమం కిందిదాకా ప్రవహిస్తుందని ప్రభుత్వం చెప్పేది అబద్ధం. అభివృద్ధి అంటే ఇది ఒక్కటే నమూనా కాదు, ఇతర నమూనాలు ఉన్నాయి. మావోయిస్టు పార్టీ అభివృద్ధికి వ్యతిరేకం కాదు. అది కూడ నీటిపారుదల సౌకర్యాలు కలిగిస్తోంది. ప్రజలను విధ్వంసం పాలు చేసే, నిర్వాసితులను చేసే అభివృద్ధి నమూనాను మాత్రమే మేం వ్యతిరేకిస్తున్నాం అని పెద్దఎత్తున ప్రచారం చేస్తే సంఘీభావాన్ని కూడగట్టవచ్చు. బహుళజాతి కంపెనీలు తమకు లాభసాటిగా ఉన్నంతవరకే ఏపని అయినా చేస్తాయి. వారికి లాభసాటిగా లేకపోతే, ప్రతిఘటన ఉంటే ఆ పని చేయవు. పెద్దఎత్తున సంఘీభావాన్ని కూడగట్టి ప్రతిఘటనోద్యమాన్ని నిర్మిస్తే బహుళజాతి కంపెనీలు వెనక్కి తగ్గుతాయి. ప్రభుత్వం వాటిని తీసుకురాజాలదు. ఇది ఒక అవకాశం. ఒకటే అనివార్య పరిణామం లేదని మాత్రమే నేను చెపుతున్నాను. అనేక అవకాశాలున్నాయి. బహుళజాతి కంపెనీలు వచ్చి భూములను, ఖనిజాలను ఆక్రమించడం తప్ప మరొక ప్రత్యామ్నాయం లేదనేది నిజం కాదు. ఇది ప్రచారం చేయాలి. మధ్యతరగతిని ఒప్పించాలి. మావోయిస్టుల అభివృద్ధి నమూనా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, ప్రజల కొసం, ప్రజల చైతన్యం మీద ఆధారపడి ఉంటుందని చెప్పి ఒప్పించాలి. ఇవాళ దేశంలో విప్లవోద్యమం ముందున్న సమస్యలలో ఇదే ప్రధానమైనదని నేననుకుంటున్నాను. పెద్దఎత్తున మృత్యువునూ, విధ్వంసాన్నీ, భయంకరమైన అసమానతలనూ తెచ్చే అభివృద్ధిని మధ్యతరగతిలో ఎక్కువమంది సమర్థించరు. తప్పకుండా ఎదిరిస్తారు. అలాగే ఈ అభివృద్ధి నమూనాను ఎదిరించడంలో కలిసి వచ్చే మిత్రులు మరెంతో మంది ఉంటారు. ఈ మిత్రులలో రాజకీయవాదులూ ఉండవచ్చు. గాంధీ అనుయాయులలో చాలమంది ఇటువంటి అభివృద్ధి నమూనాను వ్యతిరేకించవచ్చు. అంటే ఇవాళ్టి సందర్భంలో మావోయిస్టులకు విశాల స్థాయిలో మిత్రులు వచ్చే అవకాశం ఉందని నేను ఊహిస్తున్నాను.

అలాగే ప్రభుత్వం అన్నప్పుడు కూడ అది ఒక ముద్ద కాదు. వేరువేరు స్థాయిల వేరువేరు శక్తులు ఉన్నాయి. మావోయిస్టులకు కూడ ఈ స్పష్టత ఉంది. పాలకవర్గ శక్తులమధ్య ఉన్న వైరుధ్యాలను వాడుకుని వాటిని ఒకదానికొకటి ఎదురుగా పెట్టడం సాధ్యమే. నేను కలకత్తాలో దిగినరోజే ప్రభుత్వం ఎన్ కౌంటర్ల పేరిట ప్రజలను చంపడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టిందని చదివాను. అంటే రాజ్యంలో ఒక అంగం మరొక అంగాన్ని విమర్శిస్తున్నదన్నమాట. ఒకభాగం భయంకరమైన, హత్యాకాండ సాగిస్తుండగా మరొకభాగం తప్పుపడుతున్నదన్నమాట. అంటే పాలకవర్గాలలోనే వైరుధ్యాలు ఉన్నాయన్నమాట. అలాగే భారత పాలనా వ్యవస్థ  పినోషె నియంతృత్వంకింద చిలీ పాలన లాగ కరడుగట్టినది కాదు. అందువల్ల మీదగ్గర ఎన్నో అవకాశాలుంటాయి. మీ దగ్గర ఒకటో రెండో మూడో అవకాశాలు మాత్రమే కాదు ఎన్నెన్నో అవకాశాల వరుస ఉంది. ఆయా వర్గశక్తులను బట్టి, వర్గపోరాట స్థాయిని బట్టి ఆయా అవకాశాలు వస్తాయి.

మొత్తం మీద మావోయిస్టుల పనితీరు నాకు నచ్చింది. వారి ఆలోచనలు, చర్చాసరళి నాకు నచ్చాయి. వారు ఒక కష్టతరమైన పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వం, లేదా ప్రభుత్వంలోని కొన్ని అంగాలు వారి నాయకత్వాన్ని మట్టుపెట్టడానికి చూస్తున్నాయి. మావోయిస్టులు ఇప్పుడున్నదానికంటె ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకు, ఎంతోమంది విదేశీ, స్వదేశీ పాత్రికేయులను దండకారణ్యానికి రమ్మని పిలవడం గురించి చర్చ వచ్చింది. నేను అలా పిలవడమే మంచిదన్నాను. వారు ఏమిరాసినా ఉద్యమానికి ప్రచారం దొరుకుతుందన్నాను. కాని తర్వాత నా అభిప్రాయం కొంత మారింది. ఉదాహరణకు పార్టీ వారు నన్ను సోదా చేయకుండానే అనుమతించారు. నన్ను సోదా చేసి ఉండవలసింది. నా దగ్గర మొబైల్ ఫోన్ ఉండి ఉంటే ఎక్కడికి వెళుతున్నానో తెలుసుకోవడం, వాళ్లను కలవగానే మానవ రహిత విమానం సహాయంతో బాంబుదాడి చేయడం సాధ్యమే. అంటే ప్రమాదాలు, నిజమైన ప్రమాద అవకాశాలు ఉన్నాయి. విదేశీ పాత్రికేయులు రావడం వల్ల ప్రయోజనాలూ ఉన్నాయి. జాగ్రత్త తీసుకోవలసిన ఇటువంటి ప్రమాదాలూ ఉన్నాయి. ఆజాద్ ను ఎలా చంపివేశారో, చర్చల పేరుతో నడిచిన ఉత్తరాల ద్వారా ఆయన ఆచూకీ ఎలా కనిపెట్టారో మీకు తెలుసు. ఎప్పుడో ఒకసారి చర్చలు అవసరమే. కాని ఆజాద్ ను చంపడానికి దారితీసిన పరిస్థితులు కోడిని చంపడానికి ముందు దానికి గింజలు చల్లుతూ ఆకర్షించినట్టుగా జరిగాయి.

**

జనతన సర్కార్ జెండాలో రెండు నక్షత్రాలు, విల్లమ్ములు చిత్రించి ఉండడం చాల ఆసక్తికరం. రెండు నక్షత్రాలు ఆదివాసులకు, దళితులకు చిహ్నాలు. విల్లమ్ములు చాల మంచి ఆయుధం. అది శబ్దం లేకుండా ప్రయోగించగల ఆయుధం. మెటల్ డిటెక్టర్లకు దొరకని ఆయుధం. ఆ జెండా జాతీయ, స్థానిక సంప్రదాయాలను గౌరవిస్తున్నారనడానికి నిదర్శనం. అది వాస్తవిక దృక్పథానికి సూచిక.

**

భారతదేశపు కుల వ్యవస్థ గురించి నాకంటె మీకే ఎక్కువ తెలుసు. దాన్ని చారిత్రకంగా అర్థం చేసుకోవచ్చు. కుల వ్యవస్థకు మూలం కుటుంబం, ఆస్తి, స్త్రీల పట్ల భయంకరమైన వివక్ష. ఇప్పుడది పరువు హత్యల రూపంలో జరుగుతోంది. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయం చూడాలి. గాంధీ, మావో ఇద్దరూ కూడ తమ కార్యకర్తలను మరుగుదొడ్లు కడగమనీ, మలమూత్రాలు ఎత్తుకుపొమ్మనీ ఆదేశించారు. మరుగుదొడ్డిని కడిగే బ్రాహ్మణుడు, మలమూత్రాలు ఎత్తుకుపోయే ఉన్నతవర్గ చైనీస్ మేధావి తమ కుల, ఉన్నతవర్గ ఆభిజాత్యాన్ని వదులుకోవలసి ఉంటుంది. భారతదేశంలో విప్లవకారుడు కావడమంటే వదులుకోవలసినవి చాల ఉన్నాయి. జంధ్యం గురించి గర్వంగా భావిస్తూ, సాంప్రదాయిక బ్రాహ్మణుడిగా ఉంటూ  విప్లవకారుడుగా పురోగమించడం సాధ్యం కాదు. చాల సంస్కృతులలో కులానికి సమానమైన ఆభిజాత్యాలు ఉన్నాయి. స్వీడన్ లో ఎల్లప్పుడూ రెండు రకాల బృందాలు ఉన్నాయి. అవి దాదాపు కుల విభజన లాగానే ఉన్నాయి. ఒకటి యూదు జనాభా. వాళ్లు వ్యాపారస్తులు. మీదగ్గర మార్వాడీల లాంటి వాళ్లనుకోండి. మరొక బృందం జిప్సీలు. సంచార జాతులు. ఈ రెండు బృందాలు కూడ పూర్తిగా అంతర్వివాహం మీద ఆధారపడినవే. అయితే మా దగ్గర ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన కుర్దులు, సోమాలీలు వంటి అనేక సమూహాలు ఉన్నాయి. ఈ సమూహాలు ఇతర సమూహాలతో సంబంధం లేకుండా తమకు తాముగా జీవిస్తుంటాయి. వీరిలో పరువుహత్యలు కూడ ఉన్నాయి. స్వీడన్ లో పరువు హత్యలు, కూతురు మరొక సమూహపు మనిషిని పెళ్లి చేసుకుంటే, చేసుకుంటానంటే చంపివేయడం గతంలో లేదు. ఈ సమూహాలతో మొదలయింది. అయితే భారత కుల వ్యవస్థకు, ఇతర అసమానతలకు తేడా ఏమంటే, భారత్ లో అది ప్రధానమైన సమస్య. అది చాల సున్నితమైనది కూడ. దాని మీద భావోద్వేగాలు హెచ్చు.

**

భారత విప్లవానికి అంతర్జాతీయ సంఘీభావాన్ని సాధించవలసి ఉంది. అది ఒక ఉద్యమంగా ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. రెండు సమస్యలు ఉన్నాయి. ఒకటి సమాచార కొరత. నిజానికి సమాచార కొరత ఉండడం ఆశ్చర్యకరమైన విషయం. భారతదేశంలో మీకు చాల పత్రికలున్నాయి. హిందూ, తెహెల్కా వంటి పత్రికలు విప్లవోద్యమం మెద వార్తలు, వ్యాఖ్యలు అచ్చువేస్తాయి. అందువల్ల సూత్రరీత్యా చూస్తే భారత మధ్యతరగతికి ఈ విషయాలు తెలిసి ఉండడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆజాద్ హత్య గురించి చాల వివరాలు వచ్చాయి. కాని ఈ వార్తలు బయటికి వెళ్లవు. అంతర్జాతీయ సమాజానికి ఈ విషయాలు తెలియవు. అదేమీ భారత ప్రభుత్వ ఆంక్షల వల్ల కాదు. భారత్ లో ఉండే విలేకరులు మంచివాళ్లా చెడ్డవాళ్లా అనేది కూడ సమస్య కాదు. వాళ్లు ఈ వార్తలు పంపినా, మా దేశాలలో వార్తాపత్రికలకు ఉండే కాపలాదార్లు, ఎడిటర్లు ఈ వార్తలు వేయరు. కత్తిరించేస్తారు. అలా ఎందుకు చేస్తారు? పత్రికా స్వేచ్ఛ అనే మాట విన్నప్పుడల్లా అడగవలసిన ప్రశ్న పత్రికల యజమానులెవరు అని. అది చాల చిన్న ప్రశ్నే. స్వీడన్ విషయమే చూసుకుంటే అక్కడి ప్రధానమైన సోషల్ డెమొక్రటిక్ అని చెప్పుకునే పత్రిక యజమానీ, ప్రధాన అభివృద్ధి నిరోధక పత్రిక యజమానీ ఒకరే. ఆస్లో లో ఉండే ఒక కోటీశ్వరుడు. అక్కడక్కడా స్వేచ్ఛ కనబడవచ్చు గాని మొత్తం స్థితి ఇది. ఇక నేను ప్రారంభించిన పత్రిక లాంటి చిన్న పత్రికలు ఉన్నాయి గాని అవి చాల చిన్నవి. ఈ పరిస్థితిలో ఎలాగో ఒకలాగ భారత సమాచారాన్ని అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకురావాలి. ఇంటర్నెట్ వాడుకోవచ్చు. చిన్న పత్రికలకు పంపవచ్చు. క్రమంగా పెద్ద పత్రికల అడ్డుగోడలను ఛేదించవచ్చు. యూరప్ లోని సాధారణ కార్మికవర్గ పాఠకులకు ఈ సమాచారం అందించడానికి ప్రయత్నాలు చేయాలి. రెండవ సమస్య ఏమంటే ఇటీవల లండన్ లో నేనూ, అరుంధతీ రాయ్ భారత విప్లవోద్యమం మీద మాట్లాడాం. ఆ సభకు చాల మందే వచ్చారు. కాని వారిలో అత్యధికులు భారత ఉపఖండం నుంచి వచ్చి అక్కడ ఉన్నవారే తప్ప బ్రిటిష్, యూరపియన్ పౌరులు లేరు. వారికి చేరడం గురించి ఆలోచించాలి.

సంఘీభావ ఉద్యమానికి రెండు స్థాయిలు ఉన్నాయి. ఒకటి భారత ప్రజలకు సంఘీభావం తెలిపే ఉద్యమం. మేం స్వీడన్ లో అది ప్రారంభించాం. దీనిలో అన్నిరకాల వాళ్లు చేరారు. పాత కామ్రేడ్స్ ఉన్నారు. ప్రధానంగా ఇది “వామపక్ష” ఉద్యమం. ఇక్కడ మీకొక సంగతి చెప్పాలి. యూరప్ లో కమ్యూనిస్టు ఉద్యమం వామపక్ష ఉద్యమంగా దిగజారి పోయి6ది. అది వామపక్షమే గాని కమ్యూనిజం కాదు. అందులో అన్నిరకాల వాళ్లు ఉంటారు. దాన్ని పార్టీ లేని ఐక్య సంఘటన అనవచ్చు. వాళ్లు బలమైన సామ్రాజ్యవాద యుద్ధ వ్యతిరేక ఉద్యమాన్ని నిర్మించినవారే. మా ఉద్దేశం భారత ప్రజల న్యాయమైన పోరాటంలో వారికి సంఘీభావం ప్రకటించేందుకు ఎంతమంది వీలయితే అంతమందిని కూడగట్టడమే. మాకు చాల మద్దతు ఉంది. ఫోర్త్ వరల్డ్ మూవ్ మెంట్ అనే ఆదివాసుల ఉద్యమం మాతో కలిసింది. అంబేద్కర్ ను అనుసరించే దళిత ఉద్యమం మాతో కలిసింది. ఉదారవాదులు, చర్చ్ వారు కూడ చేరారు. ప్రజల న్యాయమైన పోరాటాన్ని సమర్థించడం, గ్రీన్ హంట్ వంటి ప్రభుత్వ పాశవిక దాడులను ఖండించడం అనే సూత్రబద్ధ వైఖరి మీద మేం ఈ ఐక్యత సాధించాం. ఐనా మా నిర్మాణం చాల చిన్నదే. నిరసనలు, భారత రాయబార కార్యాలయం ముందు ప్రదర్శనలు లాంటి పనులు చేశాం. ఇప్పుడు మా కార్యకర్తలకు అధ్యయన తరగతులు ఏర్పాటు చేస్తున్నాం. ఐక్య సంఘటన అనేది విప్పుకునే విసనకర్ర లాంటిది. ఒకవైపు అది ఎంత విశాలంగానైనా విప్పుకుంటుంది. మరొకవైపు దానికి అటు చివరా ఇటు చివరా కచ్చితమైన సరిహద్దులూ ఉంటాయి.

రెండో దృక్పథంగా ఇటాలియన్ కామ్రేడ్స్ ఏమంటున్నారంటే అంతర్జాతీయ సంఘీభావ ఉద్యమ లక్ష్యం భారత దేశంలో నూతన ప్రజాస్వామ్యాన్ని సమర్థించడంగా ఉండాలని. ఈ పని జరగాలంటే నూతన ప్రజాస్వామ్యం అంటే ఏమిటో అర్థం చేసుకుని, దాన్ని సమర్థించవలసి ఉంటుంది. అంటే ఇది కేవలం మార్క్సిస్టులకు, మావోయిస్టులకు పరిమితమవుతుంది. విశాలత్వం సంతరించుకోదు అని మేం వాదిస్తున్నాం. మా మధ్య విభేదమేమీ లేదు. సంఘీభావాన్ని కూడగట్టడానికి వేరు వేరు మార్గాలలో మేం ప్రయత్నిస్తున్నాం. అంతే. ఇది ఐక్యసంఘటన గురించి చాల కాలంగా ఉన్న చర్చే.

**

’భారత్ పై అరుణతార’ అనడంలో నేను ‘చైనాపై అరుణతార’ అన్న ఎడ్గార్ స్నోను అనుసరించాను. కాని ఎడ్గార్ స్నో చైనాలో నాలుగు నెలలు ఉన్నాడు. నేను పదహారు రోజులే ఉన్నాను. ఎడ్గార్ స్నో చైనా ప్రజా సైన్యాన్ని 1936లో చూశాడు, చైనాలో విప్లవ విజయం చాల కాలం తర్వాత 1949లో జరిగింది. అలాగే చైనాకూ భారత్ కూ మధ్య తేడాలున్నాయి. చైనాలో విముక్తి ప్రాంతాలు చాలకాలం ఉన్నాయి. మొదటి విముక్తి ప్రాంతం 1927లోనే ఏర్పడింది. దాని మీద పెద్ద ఎత్తున దాడి జరిగినందువల్ల లాంగ్ మార్చ్ చేయవలసి వచ్చింది. చివరికి ఏనాన్ విముక్తి ప్రాంతం ఏర్పడింది. ఇతర ప్రాంతాలు విముక్తమయ్యాయి. ఈలోగా చాంగ్ కైషేక్ ను బందీగా పట్టుకుని ఐక్యసంఘటనకు ఒప్పించడం జరిగింది. విముక్తి ప్రాంతాల మీద ప్రభుత్వ బలగాల దాడులు జరుగుతున్నప్పుడు ఏనాన్ ను రక్షించుకోవడం ఎట్లా అనే సమస్య వచ్చినప్పుడు, ‘ఏనాన్ ను రక్షించుకోవడమంటే పోగొట్టుకోవడమే, ఏనాన్ ను వదిలి పోవడమే అంతిమంగా ఏనాన్ ను రక్షించుకోవడం’ అని మావో అన్నాడు. అలా అక్కడ ఒక సంక్లిష్ట క్రమం సాగింది. భారత్ లో కూడ అదే విధంగా విముక్తి ప్రాంతాలు ఏర్పడుతూ పోవడం జరగదు. ఇది మరింత సంక్లిష్ట క్రమం. 1930 ల చైనాకూ, 2010ల భారత్ కూ తేడాలున్నాయి. భారత్ లో ఒక గెరిల్లా జోన్ ఉంది. అది విస్తరించి బలపడి, స్థలకాల పరిస్థితులకు లోబడి విముక్తి ప్రాంతంగా మారవచ్చు. అది అలాగే జరగాలనీ లేదు. ఎన్నెన్నో అవకాశాలు, సంభావ్యతలు ఉన్నాయి. ఇవాళ భారత్ ఉన్న స్థితిలో చైనా ఒకానొక సమయంలో ఉండింది. అక్కడ కూడ ఏనాన్ వదిలేశారు, కియాంగ్సీ వదిలేశారు. ఇదేమీ అంకగణిత సమీకరణం కాదు. ఇది చాల సంక్లిష్ట సామాజిక ప్రయాణం.

About ఎన్.వేణుగోపాల్ N Venugopal

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues.
This entry was posted in వ్యాసాలు, Veekshanam. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s