ప్రపంచానికి మేడేనిచ్చిన నేల…

For Namasthe Telangana

నూట ఇరవై ఆరు సంవత్సరాల కింద మొట్టమొదటిసారి ఎనిమిది గంటల పని దినం కోరుతూ పోలీసు కాల్పులలో మరణించిన కార్మికుల నెత్తుటితో తడిసిన నేల.

ఒరిగిపోయిన వీరుడి చొక్కానే ధిక్కార పతాకగా ఎగరేసి ఎర్రజెండాను మరింత ఎరుపెక్కించిన నేల.

వాక్సభాస్వాతంత్ర్యాలను అణచదలచిన అధికారవర్గాల మీద బాంబులతో సవాల్ విసిరిన నేల.

పత్రికా సంపాదకుడే కార్మికోద్యమానికీ, ప్రదర్శనకూ నాయకుడై, బూటకపు విచారణలో మరణశిక్షకు గురై కార్మిక మేధావి ఐక్యతను చాటిన నేల.

కాల్పులు జరిపి కార్మికులను బలిగొన్న పోలీసులకే స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేస్తే ఒకటికి నాలుగుసార్లు విగ్రహ విధ్వంసం చేసి, అమర కార్మికుల విగ్రహాలు నిలిపిన నేల.

ఇవాళ్టికీ ఉజ్వల ప్రేరణగా, గతవర్తమానాల వారధిగా నిలిచే నేల.

అమెరికాలో షికాగో నగరంలో హే మార్కెట్.

మేడే చరిత్ర చదివినప్పటినుంచీ, ఎన్నో ఏళ్లుగా మేడే సభల్లో ఆ విషయాలు మాట్లాడుతున్నప్పటినుంచీ చూడాలని అనుకుంటున్న ఆ నేలను చూసినప్పుడు మనసు ఉప్పొంగిపోయింది. నాలుగు సంవత్సరాల కింద ఒక మిట్ట మధ్యాహ్నం ఆ నేలను వెతుక్కుంటూ వెళ్ళి అక్కడి మట్టిని, అక్కడి స్మారక విగ్రహాన్ని స్పృశించి, అక్కడ పొందిన రెండు మూడు వింత అనుభవాల స్మృతి ఇది.

సహచరి వనజకు బర్కిలీ విశ్వవిద్యాలయంలో పదినెలల ఫెలోషిప్ వచ్చినప్పుడు, నాకూ చివరి పది వారాల పాటు అమెరికాలో ఉండే అవకాశం వచ్చింది. తొలి ఎనిమిది వారాలు పశ్చిమ తీరంలోనే ఉండిపోయినా, మిగిలిన రెండు వారాలు తూర్పు, మధ్య భాగాలలో కొన్ని ప్రాంతాలైనా చూడాలని అనుకున్నప్పుడు షికాగో, హేమార్కెట్ మేడే జన్మస్థలం ఆ జాబితాలో అగ్రభాగాన నిలిచింది. జూన్ 15న తిరుగు ప్రయాణం కాగా, జూన్ 8న డెట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ సమావేశంలో మాట్లాడవలసి ఉండింది. ఈ రెండు తేదీలకూ మధ్య షికాగో ప్రయాణం పెట్టుకున్నాం. జూన్ 11 పొద్దున మిత్రుడు ఆనంద్ ముసునూరు కారులో డెట్రాయిట్ నుంచి షికాగో బయల్దేరాం. అది మూడు వందల మైళ్ల, నాలుగు గంటల ప్రయాణం.

షికాగో వెళ్లాక అక్కడ చాలకాలంగా ఉంటున్న హరినాథ్ ఏపూరి కూడ మాతో కలిశారు. హేమార్కెట్  ఎక్కడ ఉందో, ఎలా వెళ్లాలో షికాగో మాప్ లు వెతికాం. ఇప్పుడా స్థలానికి హేమార్కెట్ అనే పేరు లేదు. ఆ స్థలం అంతా మారిపోయింది. హేమార్కెట్ అని ఎంత మందిని అడిగినా ఎవరూ చెప్పలేకపోయారు. మళ్లీ మాప్ లు వెతికి హేమార్కెట్ స్మారక స్థూపం నార్త్ డెస్ ప్లెయిన్స్ స్ట్రీట్ మీద ఉందని గుర్తించాం. మొత్తానికి అరగంట వెతికి ఆ స్థలానికి వెళితే రోడ్డు పక్కన భారీ కాంస్య విగ్రహాల సముదాయం. మన ఎడ్లబండి లాంటి బండి. చక్రాలు విరిగి పడి ఉన్నాయి. దాని కింద మృతదేహాలో, క్షతగాత్రులో ఐదారుగురు మనుషుల విగ్రహాలు. బండి మీద ఒక ఉపన్యాసకుడు. అతని పక్కన నిలబడి ఇద్దరు మనుషులు. ఒక పడిపోయిన మనిషి. అక్కడ ఒక శిలాఫలకం తప్ప మరే సమాచారమూ లేదు. నిజానికి అమెరికాలో ప్రతి చూడదగిన ప్రదేశం దగ్గరా కుప్పలు కుప్పలుగా సమాచారం, పుస్తకాలు, జ్ఞాపికల అమ్మకాల దుకాణాలు ఉంటాయి గాని ఈ స్మారక చిహ్నం దగ్గర మాత్రం ఏమీ లేవు. ఆ శిలాఫలకం మీద, విగ్రహాల మీద ఆయా కాలాలలో అక్కడికి వచ్చిన కమ్యూనిస్టులు, అనార్కిస్టులు, ఇతరులు రాసిన నినాదాలు, బొమ్మలు, గ్రాఫిటి ఎన్నో ఉన్నాయి.

ఒక నినాదం “మొదట వాళ్లు మీ ప్రాణాలు తీశారు, ఇప్పుడు వాళ్లు మీ జ్ఞాపకాన్నీ దోపిడీ చేస్తున్నారు” అని. మరొకటి ఒక వృత్తంలో ఎ అనే ఇంగ్లిష్ అక్షరం, అనార్కిస్టుల చిహ్నం. అలాగే అమెరికన్ పతాకను తలకిందులుగా చిత్రించిన బొమ్మలు.

ఆ స్మృతి చిహ్నం వెనుక చాల కథ ఉంది.

ఎనిమిది గంటల పనిదినాన్ని కోరుతూ 1886 మే 4న అక్కడ జరిగిన ప్రదర్శనలో పోలీసు కాల్పులు మాత్రమే కాక బాంబు పేలుళ్లు కూడ జరిగాయి. బాంబు పేలుళ్లలో ఏడుగురు పోలీసు అధికారులు, నలుగురు పౌరులు మరణించారు. ఆ తర్వాత జరిగిన విచారణలో బాంబు ఎవరు విసిరారో చెప్పలేమని ప్రాసిక్యూషనే స్వయంగా ఒప్పుకుంది గాని ఆ మరణాలకు బాధ్యులుగా కార్మిక నాయకుల మీద కేసు నడిపింది. ఎనిమిది గంటల పని దినానికి అనుకూలంగా ప్రచారం చేసిన, ఆ బూటకపు విచారణలో ఆ రోజు ప్రదర్శనలో ప్రధాన ఉపన్యాసకుడైన పత్రికా సంపాదకుడు ఆగస్ట్ స్పీస్ తో సహా ఎనిమిది మందికి మరణ శిక్ష విధించారు. ఇద్దరికి దాన్ని యావజ్జీవ శిక్షగా మార్చినా స్పీస్ ను, మరి ఐదుగురిని 1887 నవంబర్ 11న ఉరికంబం ఎక్కించారు. ఆ ఉరికంబం మీద నిలిచి ఆగస్ట్ స్పీస్ చేసిన ఊహాగానం కనీసం స్మృతి చిహ్నం విషయంలోనైనా నిజమయింది. “మా మౌనం ఇవాళ మీరు నులిమేస్తున్న ఈ కంఠాల కన్న శక్తివంతమైనదని రుజువయ్యే రోజొకటి వస్తుంది” అని స్పీస్ చివరి మాటగా అన్నాడట.

నిజంగానే ఆ హేమార్కెట్ ప్రదర్శన స్మృతి ప్రపంచానికి మేడేను ఇచ్చింది. ఫ్రెంచి విప్లవ శతజయంతి సందర్భంగా 1889లో పారిస్ లో జరిగిన రెండవ ఇంటర్నేషనల్ సమావేశం షికాగో అమరుల స్మృతిలో ప్రపంచ వ్యాప్తంగా మేడేను కార్మిక దినంగా జరపాలని పిలుపు ఇచ్చింది. ఆ తర్వాతి సంవత్సరం నుంచీ మేడే కార్మిక పోరాట దీక్షాదినంగా ప్రపంచంలో వందకు పైగా దేశాలలో అధికారికంగా సాగుతూనే ఉంది. అమెరికా పాలకులు మేడే జరపకుండా ఉండడానికి సెప్టెంబర్ మొదటి సోమవారాన్ని కార్మిక దినంగా ప్రకటించారు గాని, ప్రజలు, కార్మికులు, కమ్యూనిస్టులు మేడేనే జరుపుకుంటారు.

ఇక హేమార్కెట్ లో మరణించిన పోలీసుల స్మృతి చిహ్నంగా ఒక పోలీసు అధికారి కాంస్య విగ్రహాన్ని తయారు చేసి హేమార్కెట్ చౌరస్తాలో ఆ 1889లోనే ప్రతిష్టించారు. కాని 1927 మే 4 న ఒక ఆ దారిన పోయే వాహనం ఒకటి దాన్ని గుద్దేసి పడగొట్టింది. “మనుషులను చంపిన పొలీసు విగ్రహాన్ని ప్రతి రోజూ చూసి కడుపు రగిలిపోయింది” అని ఆ వాహన డ్రైవర్ అన్నాడు. అలా ధ్వంసమైన విగ్రహాన్ని ఏడాది తిరగకుండానే తిరిగి నెలకొల్పి, మరొక చోటికి మార్చారు. ఆ తర్వాత 1950లలో రహదారి నిర్మాణంలో దాన్ని రహదారికి కనబడేలా ప్రస్తుత స్మృతి చిహ్నం ఉన్నచోట ఒక పెద్ద గద్దె మీద నెలకొల్పారు. కాని 1968 మే 4న వియత్నాం యుద్ధ వ్యతిరేక ప్రదర్శకులు ఆ విగ్రహానికి తారు పూశారు. తర్వాత 1969 అక్టోబర్ లో వెదర్ మాన్ బృందం శక్తివంతమైన బాంబు పెట్టి విగ్రహాన్ని పేల్చివేసింది. దాని స్థానంలో 1970 మేలో మళ్లీ విగ్రహాన్ని నెలకొల్పితే, దాన్ని కూడ వాళ్లే అక్టోబర్ లో పేల్చివేశారు. అప్పుడు దాన్ని పునర్నిర్మించి ఇరవై నాలుగు గంటల పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా దాన్ని ధ్వంసం చేసే ప్రయత్నాలు ఆగకపోవడంతో చివరికి 1972లో ఆ విగ్రహాన్ని పోలీసు కార్యాలయ ప్రాంగణంలోకి మార్చారు. అక్కడినించి కూడ 1976లో మరింత రక్షణ ఉండే పోలీసు అకాడమీ భవనంలోకి మార్చారు. తర్వాత మూడు దశాబ్దాల పాటు ఆ గద్దె ఏ విగ్రహమూ చిహ్నమూ లేకుండానే ఉండిపోయింది. ఈ లోగా 1992లో షికాగో పురపాలక సంస్థ ఆ స్థలాన్ని స్మారకచిహ్నంగా ప్రకటించి, అక్కడ శిలాఫలకాన్ని ఏర్పాటు చేసింది. “కార్మికులకూ యజమానులకూ మధ్య ఒక దశాబ్దం పాటు సాగిన తగాదా మరింత ముదిరి ఇక్కడ ఘర్షణగా మారి కార్మికుల, పోలీసుల విషాదకర మరణాలకు దారితీసింది. ఇక్కడ క్రేన్స్ అల్లీ ముందు 1886 మే 4న కార్మిక ప్రదర్శన జరుగుతుండగా, డెస్ ప్లెయిన్స్ వీథి నుంచి వస్తున్న పోలీసు బృందంపై బాంబు విసరబడింది. ఆ తర్వాత ఎనిమిది మంది కార్మిక కార్యకర్తలపై జరిగిన విచారణ ప్రపంచ వ్యాపిత కార్మికోద్యమాన్ని ఆకర్షించి, అనేక నగరాలలో మేడే ప్రదర్శనల సంప్రదాయాన్ని ప్రారంభించింది” అని ఆ ఫలకం చెపుతుంది.

పురపాలక సంస్థ, కార్మిక సంఘాలు, పోలీస్ యూనియన్ కూడ కలిసి 2004లో ప్రస్తుతం ఉన్న పదిహేను అడుగుల ఎత్తయిన స్మృతి చిహ్నాన్ని నిర్మించి ఆవిష్కరించాయి. ఈ సారి పోలీసులు స్మృతి చిహ్నంలో లేరు. ఇది కార్మిక నాయకులు బండి మీద నిలబడి ఉపన్యసిస్తున్న దృశ్యానికి కళాకారిణి, శిల్పి మేరీ బ్రాగర్ చేసిన రూపకల్పన.

మేం ముగ్గురం ఆ స్మృతి చిహ్నం చుట్టూ తిరుగుతూ, అది ఎక్కి చూస్తూ, ఫొటోలు తీసుకుంటూ కాసేపు గడిపాం. అలా మేం అక్కడ ఉండగా ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల వృద్ధుడు, సరిగ్గా నడలేకపోతున్నాడు. ఎండ భరించలేనట్టు టోపీ పెట్టుకున్నాడు. ఇంగ్లిష్ కూడ రాదు. ఆ స్మృతి చిహ్నం దగ్గరికి వచ్చి, దాన్ని ఆప్యాయంగా తడుముతూ, కళ్లనీళ్లు పెట్టుకుంటూ దానిచుట్టూ కాసేపు పిచ్చివాడిలా తిరిగి వెళ్లిపోయాడు.

మరి కాసేపటికి ఒక ముప్పై సంవత్సరాల యువతి, తన చిన్నారి, రెండేళ్లు నిండని పాపను ప్రామ్ లో కూచోబెట్టుకుని నడిపిస్తూ అక్కడికి వచ్చింది. ఆ పాపకు తమ భాషలో షికాగో అమరవీరుల కథ, మేడే కథ చెపుతోంది. పలకరిస్తే, ఆమె చెరూకీ అనే స్థానిక ఆదివాసి తెగకు చెందిన యువతి. అటువంటి వందలాది ఆదివాసి జాతులను ఊచకోత కోసి, జాతి హననకాండ జరిపి నిర్మూలించి యూరపియన్ వలసవాదులు అమెరికాను ఆక్రమించుకున్న కథ అందరికీ తెలిసిందే. ఆమె పేరు కాథీ మల్లారె. ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. హేమార్కెట్ ప్రదర్శన గురించీ, స్మారక చిహ్నం గురించీ కథంతా ఆమె చెప్పిందే. ఆమెనూ, పాపనూ కూడ ఫొటోలు తీసి ఆ ఫొటోలు పంపితే ఆమె మంచి జవాబు రాసింది.

“అంతమందిని అడిగినా స్మృతి చిహ్నం చిరునామా దొరకలేదంటే మీరు అడిగినవాళ్లు మీలాగే యాత్రికులో, షికాగో తెలియనివాళ్లో అయిఉంటారు. కాని షికాగోలో ప్రతి మూడో తరగతి విద్యార్థికీ నగర చరిత్ర చెపుతారు… దురదృష్టవశాత్తూ 1886లో ఉన్నటువంటి దుర్మార్గ రాజకీయాలే ఇవాళ కూడ ఉన్నాయి. ఉపాధ్యాయ సంఘం నాయకురాలి మీద తప్పుడు విచారణ జరుగుతోంది. ఎల్లప్పుడూ పచ్చగా ఉండవలసిన ఒక ఉద్యానవనాన్ని తీసేసి అక్కడ భవనాలు నిర్మించడానికి నగర మేయర్ పర్యావరణ వ్యతిరేక నిర్ణయం తీసుకున్నాడు. మా నగరానికి ఒకప్పుడు తోటల నగరం అని పేరుండేది. ఇప్పుడు బహుశా ఆరు అంతస్తుల కారు పార్కింగ్ గారేజిల పైన మా తోటలు ఉండేట్టుంది…. సరుకుల కొనుగోళ్ల యావ నుంచీ, టెలివిజన్ కు అతుక్కుపోయిన జీవితాల నుంచీ, మైమరపించే వీడియో ఆటల నుంచీ నా సహచర పౌరులు ఏదో ఒకరోజు మేల్కొంటారని ఆశిస్తున్నాను. ప్రపంచాన్ని సంక్షోభం ఆవరించి ఉన్నదనీ, అమెరికన్ బాస్కెట్ బాల్ ఆటగాళ్లూ ఫుట్ బాల్ ఆటగాళ్లూ ఆ సంక్షోభం నుంచి తమను రక్షించలేరనీ మా ప్రజలు తెలుసుకుంటారనే నా ఆశ” అని ఆమె 2008 జూన్ 18న నాకు రాసింది.

నాలుగు సంవత్సరాల తర్వాత ఆక్యుపై వాల్ స్ట్రీట్ తో మొదలై అమెరికా వ్యాప్తంగా డజన్లకొద్దీ నగరాలలో, షికాగో లో కూడ జరిగిన ప్రజా ఉద్యమాల భవిష్యవాణి అది. మేడే చిరంజీవి.

http://www.namasthetelangaana.com/sunday/article.asp?category=10&subCategory=17&ContentId=99902

About ఎన్.వేణుగోపాల్ N Venugopal

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues.
This entry was posted in వ్యాసాలు, Namasthe Telangana. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s