ఒకవైపు వాగాడంబరం మరొకవైపు ప్రజావ్యతిరేకత

సాక్షి దినపత్రిక కోసం

అర్థశాస్త్రవేత్తలు ఒకేవాక్యంలో ఒకవంక అని ఒక విషయం, మరొకవంక అని మరొక విషయం చెపుతారని అర్థశాస్త్రం మీద ఒక ప్రఖ్యాత పరిహాసం ఉంది. భారత ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీకి అర్థశాస్త్రం తెలుసునో లేదో గాని ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఒకవంక వాగాడంబరమూ, మరొకవంక ప్రజావ్యతిరేకతా నిండా ఉన్నాయి.

శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2012-13 బడ్జెట్ యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్ విధానాల అచ్చమైన కొనసాగింపుగా ఉంది. ఆమాటకొస్తే 1991-92 బడ్జెట్ నాటినుంచీ ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ శక్తుల మద్దతుతో సాగుతున్న ప్రజావ్యతిరేక బడ్జెట్ల పరంపరలో భాగంగానే ఉంది. నిజానికి యుపిఎ మాత్రమే కాదు, ఈ ఇరవై సంవత్సరాలలో కేంద్రంలో అధికారం చలాయించిన ఇప్పటి ప్రతిపక్షాల కూటమి నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ అయినా, ఇవాళ మూడో ప్రత్యామ్నాయం గురించి కలలుగంటున్న రాజకీయ పక్షాలయినా, రాష్ట్రాలలో గద్దెనెక్కిన అన్ని రంగుల రాజకీయ పక్షాలయినా స్వల్పమైన అక్షరాల, అంకెల, వాగ్దానాల మార్పులతో ఇటువంటి బడ్జెట్లనే ప్రవేశపెట్టాయి. ప్రపంచీకరణ విధానాల తర్వాత ఈ దేశ పాలకవర్గాలకు అంతకుముందరి నామమాత్రపు ప్రజాసంక్షేమ, ప్రజానుకూల విధానాలను ప్రకటించాలనే ఒత్తిడి కూడ లేకుండాపోయింది. అందులోనూ ఎన్నికల సంవత్సరం కాకపోతే ప్రజల ఊసే అవసరం లేదని భావిస్తున్నారని ప్రతి బడ్జెటూ చూపుతూనే ఉంది.

కొత్త బడ్జెట్ గురించి తక్షణ స్పందనగా ముఖ్యంగా చెప్పవలసిన అంశాలు నాలుగైదు ఉన్నాయి.

మొట్టమొదటిది ఈ సంవత్సరం తమ ప్రభుత్వం ఐదు లక్ష్యాలు పెట్టుకున్నదని ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రకటన శుష్క వాగాడంబరం. వాటిలో కొన్ని లక్ష్యాలు అర్థరహితమైనవి. ఆ లక్ష్యాలలో నిజంగా ప్రజానుకూలమైన వాటిని అమలు చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదు. వాటిలో ప్రజావ్యతిరేకమైనవి మాత్రం వెంటనే అమలులోకి వస్తాయి.

ఉదాహరణకు మొదటి లక్ష్యంగా స్థానిక, దేశీయ డిమాండ్ ను పెంచి తద్వారా ఆర్థికవ్యవస్థను వృద్ధి చేసి, పునరుద్ధరణ సాధిస్తానని ఆర్థిక మంత్రి అన్నారు. కాని స్థానిక, దేశీయ డిమాండ్ పెంచాలంటే ఉపాధి సౌకర్యాలు పెంచాలి, ప్రజల ఆర్థిక ఆదాయం పెంచే చర్యలు చేపట్టాలి. లేదా, దేశీయ, స్థానిక మార్కెట్ సరుకుల, సేవల ధరలు తగ్గించి వాటి డిమాండ్ పెరగడానికి తోడ్పడాలి. ఆ సరుకుల, సేవల ఉత్పత్తి కారకాల ధరలు తగ్గించే చర్యలు తీసుకోవాలి. ఈ నాలుగు మార్గాలు తప్ప దేశీయ డిమాండ్ పెంచగల మరొక మార్గమేదీ లేదు. కాని ఉపాధి సౌకర్యాల పెంపుదలకూ, కొత్త ఉద్యోగకల్పనకూ సంబంధించిన చర్యలేవీ ఈ బడ్జెట్ లో లేవు. ప్రజల ఆదాయం పెంచే చర్యలు లేవు సరిగదా, సబ్సిడీలలో భారీ కోత, ఇంకా కోత విధిస్తామనే హెచ్చరిక, పరోక్ష పన్నులను పెంచడం వంటి నిజ ఆదాయాలను తగ్గించే చర్యలెన్నో ఉన్నాయి. ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తామనే శుష్క వాగ్దానాలు తప్ప నిజంగా సరుకుల, సేవల ధరలు తగ్గించే, నియంత్రించే ఉద్దేశం కూడ ప్రభుత్వానికి ఉన్నట్టు లేదు. కనుక మొత్తంగా మొదటి లక్ష్యం కాగితం మీద మిగిలిపోతుంది గాని ఆచరణలోకి రాదు.

ప్రైవేటు పెట్టుబడులు విపరీతంగా త్వరితగతిన పెరిగేలా చూడడం, కొన్నిరంగాలలో ప్రైవేటీకరణకు ఉన్న అవరోధాలను తొలగించడం రెండో లక్ష్యమని ఈ బడ్జెట్ ప్రకటించింది. ఇది మాత్రం తక్షణమే అమలు లోకి వచ్చే లక్ష్యం. నిజంగానే ఈ బడ్జెట్ లోనే కార్పొరేట్ పన్ను పెంచకుండా ఉండడం, ప్రభుత్వరంగం నుంచి ఈ సంవత్సరం ముప్పైవేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఉపసంహరిస్తామని ప్రకటించడం ఈ బడ్జెట్ లో ఉన్నాయి. విద్యుదుత్పత్తి, రహదారులు, విమానాల మరమ్మత్తు, గృహనిర్మాణం, నీటిపారుదల పథకాలు వంటి రంగాలలో విదేశీ వాణిజ్య రుణాలను, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యాన్ని అనుమతించ బోతున్నామని కూడ బడ్జెట్ ప్రకటించింది. రక్షణ రంగంలో కూడ ప్రైవేట్ రంగాన్ని అనుమతించబోతున్నారు. అంటే తమకు కావలసిన లక్ష్యాలనేమో వెంటనే అమలులోకి తేవడం, ప్రజానుకూల లక్ష్యాలుగా కనబడేవాటిని ఊరికే ప్రకటించి, ఆచరణ కార్యక్రమాన్ని ప్రకటించకపోవడం మరొకసారి వ్యక్తమయింది.

పోషకాహార లోపాన్ని తగ్గించడాన్ని మూడో లక్ష్యంగా ప్రకటించారు గాని దాని వివరాలలోకి వెళితే ప్రకటించిన నిధులు, లబ్ధి పొందే ప్రాంతాలు అన్నీ చూస్తే ఇది హళ్లికి హళ్లి సున్నకు సున్న అని తేలుతుంది. ఇక పాలన, పారదర్శకత, అక్రమ సంపద, ప్రజాజీవితంలో అవినీతి వంటి లక్ష్యాలు గాలి మాటలేనని కొత్తగా చెప్పనక్కరలేదు.

కళ్లు తిరిగిపోయే భారీ అంకెలు ప్రకటించడం, అంత భారీ నిధులు ప్రభుత్వం దగ్గర లేవు గనుక ప్రైవేటు రంగాన్ని అహ్వానిస్తున్నామని అనడం బడ్జెట్లలోనూ, ఈ రెండు దశాబ్దాల విధానాలలోనూ ప్రభుత్వాలకు అలవాటు అయిపోయింది. సరిగ్గా అలాగే ఈ బడ్జెట్ లో కూడ పన్నెండో ప్రణాళికలో మౌలిక సాధనా సంపత్తికి రు. యాభై లక్షల కోట్లు కావాలని, దానిలో సగం ప్రైవేటు రంగానికి అప్పగిస్తున్నామని ప్రకటించారు. ప్రైవేటు రంగం పునాది లాభాపేక్ష అని, లాభాలు రాని రంగాలలోకి అవి రావని, వచ్చిన రంగాలలో కూడ ప్రజావసరాల పునాదిపై గాక లాభాపేక్ష పునాదిపై పనిచేసి ప్రజాజీవితాన్ని అస్తవ్యస్తం చేస్తాయని, అందువల్ల ప్రభుత్వరంగం కావాలని తొలిదశాబ్దాలలో చెప్పుకున్న ఆదర్శాలను మన్మోహనార్థశాస్త్రం తారుమారు చేస్తున్నది.

ఈ బడ్జెట్ లో మరొక అంశం ప్రత్యక్ష పన్నుల భారాన్ని తగ్గిస్తూ, పరోక్ష పన్నుల భారాన్ని పెంచడం, మరిన్ని సేవారంగాలను పన్నుల పరిధిలోకి తేవడం. ఇవన్నీ అర్థశాస్త్ర సిద్ధాంతాలకు తలకిందుల వ్యవహారం మాత్రమే గాక ద్రవ్యోల్బణాన్ని మరింతగా పెంచేవి. ప్రత్యక్ష పన్నులు విధించగలిగిన అధికాదాయ వర్గాలను, కార్పొరేట్ రంగాన్ని వదిలేసి, ప్రతి సరుకులోనూ కలిసే పరోక్ష పన్నులను పెంచుతూ పేద, మధ్యతరగతి వర్గాలకు తెలియకుండానే వారి గోళ్లూడగొట్టి పన్నులు వసూలు చేసే విధానం ఇది.

కంటి తుడుపు చర్యగా ఆహారభద్రతా చట్టం కిందికి వచ్చే సబ్సిడీని మాత్రం యథాతథంగా ఉంచుతామని అంటూనే, “మిగిలిన అన్ని సబ్సిడీలను ప్రతికూల ఫలితాలు లేకుండా ఆర్థిక వ్యవస్థ భరించగలిగిన స్థాయికి తగ్గిస్తామ”ని సన్నాయి నొక్కారు. నిజానికి ఇవాళ పేద, మధ్యతరగతి వర్గాలకు అందే మొత్తం సబ్సిడీలు ధనిక, పారిశ్రామిక, వ్యాపార వర్గాలకు అందుతున్న రాయితీలలో సగం కూడ కాదు. అలాగే కార్పొరేట్, ప్రైవేట్, సంపన్న వర్గాలు ఎగ్గొడుతున్న పన్నులన్నీ సక్రమంగా వసూలు చేయగలిగితే పేద, మధ్యతరగతి వర్గాల సబ్సిడీలు సమస్యే కాదు. కాని నూతన ఆర్థిక విధానాలు మొదలయిన నాటినుంచీ పాలకవర్గాలన్నీ పేద, మధ్యతరగతి వర్గాలకు అందే సబ్సిడీలను కత్తిరించాలనే ఉత్సాహపడుతున్నాయి.

ఇక కొన్ని అంకెలు ఎంత మాయ చేస్తాయంటే పోషకాహార విలువలు పెంచే ప్రయత్నంలో భాగంగా మధ్యాహ్న భోజన పథకానికి రు. 11,937 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు ఆర్థిక మంత్రి చేసిన ప్రకటన పొట్టవిప్పి చూస్తే అసలు రంగు బయటపడుతుంది. దేశ6లోని విద్యార్థుల సంఖ్యతో, పాఠశాలల సంఖ్యతో, మధ్యాహ్న భోజనం అవసరమైన బాలబాలికల సంఖ్యతో పోల్చిచూస్తే పోషకాహారం కాదుగదా, పిడికెడు మెతుకులు దొరికే పరిస్థితి ఉండదు.

About ఎన్.వేణుగోపాల్ N Venugopal

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues.
This entry was posted in వ్యాసాలు, Sakshi. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s