నమస్తే తెలంగాణ కోసం
రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థి నీలం సంజీవ రెడ్డికి వోటు వెయ్యవద్దని, స్వతంత్ర అభ్యర్థి వి వి గిరికి వేయమని కాంగ్రెస్ శాసనసభ్యులకు, పార్లమెంటు సభ్యులకు కాంగ్రెస్ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1969లో పిలుపునిచ్చారు. పార్టీ ప్రతినిధిని తిరస్కరించి, అంతరాత్మ ప్రబోధానికి అనుకూలంగా వోటు వెయ్యమని సహచర పార్టీ సభ్యులను రెచ్చగొట్టారు. అధికారిక అభ్యర్థిని ఓడించి, తన ప్రతినిధిని గెలిపించుకున్నారు. అంతరాత్మ ప్రబోధం కోసం పార్టీ అదేశాన్ని ధిక్కరించవచ్చునని, పార్టీ చీలినా ఫరవాలేదని ఆమె భారత రాజకీయాలలో అంతరాత్మ ప్రబోధం అనే కొత్త సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. ఆమె కేవలం తన వ్యక్తిగత ఇష్టాయిష్టాల ఆధారంగానే అధికారిక అభ్యర్థిని వ్యతిరేకించారు గాని ప్రస్తుత రాష్ట్రపతి ఎన్నికలలో నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం అధికారిక అభ్యర్థిని వ్యతిరేకించి, అధికార పార్టీని ఇబ్బందిలో పెట్టవలసిన సందర్భం వచ్చింది.
1969నాటి ఆ చరిత్రను పునరావృతం చేయవలసిన బాధ్యత ప్రస్తుత తెలంగాణ శాసనసభ్యుల ముందు, పార్లమెంటు సభ్యుల ముందు ఉంది. తమ పార్టీలేవయినప్పటికీ, ఆ పార్టీల అధిష్టానాలు ఏ ఆదేశాలు ఇచ్చినప్పటికీ తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యమే తమ అంతరాత్మ ప్రబోధంగా వోటు వేస్తామని తెలంగాణ ప్రజాప్రతినిధులు ప్రకటిస్తే, కనీసం ఆ బెదిరింపునయినా తమ అధిష్టానాల ముందు పెడితే రానున్న నాలుగువారాల్లో నాటకీయ రాజకీయ పరిణామాలు సంభవించే అవకాశం ఉంది. నిజానికి ఇది తెలంగాణకు దొరుకుతున్న చరిత్రాత్మక సదవకాశం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకు అతి ఎక్కువగా ఉపకరించగల మహత్తర సందర్భం. తెలంగాణ ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు ఈ అవకాశాన్ని సక్రమంగా, వ్యూహాత్మకంగా, ప్రణాళికాబద్ధంగా ఉపయోగించుకుంటే తెలంగాణ సాధన దిశలో ఒక గుణాత్మకమైన ముందడుగు సాధ్యమవుతుంది.
ఈ అవకాశం మనకు ఎలా వస్తున్నది? రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఇవాళ అన్ని రాజకీయ పక్షాలు తీవ్రమైన గందరగోళంలో, ఆందోళనలో, అనిశ్చితిలో ఉన్నాయి. అధికార యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ కు గాని, ప్రతిపక్ష నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ కు గాని సొంతంగా రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించుకోగల ఆధిక్యత లేదు. రాష్ట్రపతి ఎన్నికల నియోజకవర్గంలో మొత్తం 10,98,882 వోట్లు ఉండగా అభ్యర్థి గెలుపుకు కనీసం 5,49,442 వోట్లు కావాలి. ఈ ఎన్నికలలో మొత్తం పోలయిన వోట్లలో అత్యధికం సాధించిన అభ్యర్థి గెలిచినట్టు కాదు. మొత్తం వోట్లలో సగం కన్న ఎక్కువ రావాలి. అలా రాకపోతే, సంక్లిష్టమైన లెక్కింపు ప్రక్రియ ఉంది గాని అది చావుతప్పి కన్ను లొట్టపోయినట్టే. యుపిఎ భాగస్వామ్య పక్షాలన్నిటికీ కలిపి 4,60,191 వోట్లు మాత్రమే (కావలసిన దానికన్న 89,251 తక్కువ), ఎన్ డి ఎ భాగస్వామ్య పక్షాలన్నిటికీ కలిపి 3,04,785 వోట్లు మాత్రమే (కావలసినదానికన్న 2,44,657 తక్కువ) ఉన్నాయి. ఈ రెండు కూటములలోనూ చేరని రాజకీయ పార్టీలకు 2,62,408 వోట్లు ఉన్నాయి.
యుపిఎ ఇప్పటికే ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించింది గాని అందుకు మమతా బెనర్జీ తన అసమ్మతిని తెలిపింది. తృణమూల్ కాంగ్రెస్ కు 45,925 వోట్లు ఉన్నాయి గనుక ఆ మేరకు యుపిఎ వోట్లు తగ్గి గెలుపు ఇంకా కష్టమవుతుందన్నమాట. అందుకే యుపిఎ సమాజ్ వాది పార్టీ, బహుజన సమాజ్ పార్టీ వంటి ఇతర పార్టీలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నది. కాంగ్రెస్, యుపిఎ తమ అభ్యర్థిని గెలిపించుకోవాలంటే, కొన్ని వందల, వేల వోట్లున్న చిన్నా చితకా పార్టీలన్నిటినీ కూడ బుజ్జగించవలసిన స్థితిలో పడ్డాయి. ఆ పార్టీలలో కొన్ని ఇప్పటికే ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ప్రకటించినప్పటికీ రానున్న రోజులలో సమీకరణాలు ఎలా మారుతాయో, కప్పల తక్కెడ ఏ క్షణం ఎటు మొగ్గుతుందో ఊహించగల స్థితి లేదు. నామినేషన్ వేయడానికి ఇంకా రెండు వారాలు ఉన్నాయి గనుక ఈ లోగా ఎన్ డి ఎ భాగస్వామ్య పక్షాలు గాని, భారతీయ జనతాపార్టీ గాని తమ అభ్యర్థిని నిలబెట్టి, చిన్న పార్టీల సహాయం కోరినట్టయితే పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతుంది. కొనసాగుతున్న అనిశ్చిత, కప్పల తక్కెడ స్థితిలో స్వతంత్ర అభ్యర్థులో, ఇతర పార్టీల అభ్యర్థులో కూడ పోటీ చేయవచ్చు. మొత్తం మీద ఇప్పటినుంచి, నామినేషన్లు ముగిసే జూన్ 30 వరకూ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కుడితిలో ఎలుకలా ఉండబోతుందనడంలో సందేహం లేదు. ‘శత్రువుల ఆర్తనాదములు శ్రవణానందకరముగనున్నవి’ అని ఘటోత్కచుడన్నట్టు పాలకపక్ష వ్యతిరేకులు ఆనందించగల స్థితి ఉంది.
ప్రత్యర్థి గృహచ్ఛిద్రాన్ని, చిక్కులను, సమస్యలను అవకాశంగా ఉపయోగించుకోవడం రాజనీతిలో ముఖ్యమైన అంశం. తెలంగాణకు ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్ – యుపిఎ – కేంద్ర ప్రభుత్వ శిబిరంలో ఇవాళ ఒక గృహచ్ఛిద్రం, గడ్డు సమస్య, తీరని చిక్కు ఏర్పడి ఉన్నది. ఆ సంక్షోభాన్ని వినియోగించుకుని తన ప్రయోజనం సాధించుకోవడం తెలంగాణకు కలిసి రాగల అవకాశం.
తెలంగాణనుంచి ఎన్నికయిన శాసనసభ, లోకసభ, రాజ్యసభ సభ్యులందరికీ కలిపి 36,716 వోట్లున్నాయి. ఇవి జాతీయస్థాయిలో చాల పార్టీల వోట్ల కన్న ఎక్కువ. ఇవి అభ్యర్థి జయాపజయాలపై నిర్ణయాత్మక ప్రభావం వేయగల పెద్దమొత్తపు వోట్లు. ఇందులో సగం కన్న ఎక్కువ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులవే. ఇన్ని వోట్లను పోగొట్టుకోగల స్థితిలో ఇవాళ కాంగ్రెస్ లేదు. ఈ వోట్లను కోల్పోకుండా ఉండాలంటే తెలంగాణ ఇవ్వవలసిందే అని ఒత్తిడి కల్పించడం ఇవాళ్టి కర్తవ్యం. ఇన్నాళ్లుగా తామూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే కృషి చేస్తున్నామని చెప్పుకుంటున్న ప్రజాప్రతినిధులందరూ ఈ పరిస్థితిని వాడుకోవలసి ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటిస్తేనే, 2009 డిసెంబర్ 9 ప్రకటనను అమలు చేస్తేనే, 2004 రాష్ట్రపతి ప్రసంగాన్ని ఆచరణలోకి తెస్తేనే 2012 రాష్ట్రపతి ఎన్నికలలో అధికార అభ్యర్థికి వోటు వేస్తామని తమ అధిష్టానం ముందర బలమైన డిమాండ్ పెట్టవలసి ఉన్నది. అధికారిక రాష్ట్రపతి అభ్యర్థి ఓటమి అయినా, చిక్కులలో పడడమయినా అంతర్జాతీయ, జాతీయ స్థాయి సంచలనం అవుతుంది గనుక కాంగ్రెస్ దిగిరాక తప్పని స్థితి ఏర్పడుతుంది.
అట్లాగే ప్రత్యేకించి ఇవాళ్టి రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ తనకు తానుగా కూడ తెలంగాణకు ద్రోహం చేసిన వ్యక్తి. 2004 ఎన్నికల వాగ్దానాన్ని, కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని, రాష్ట్రపతి ప్రసంగాన్ని పక్కదారి పట్టించడానికి ఏకాభిప్రాయ సాధన కమిటీ వేసినప్పుడు ఆ కమిటీకి సారథ్యం వహించినది ఈ కాంగ్రెస్ పార్టీ చాణక్యుడే. ఆ కమిటీకి శల్య సారథ్యం వహించినదీ కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులనుంచి గట్టెక్కించే ఈ వ్యూహకర్తే. ఆ తర్వాత గడిచిన ఏడు సంవత్సరాలలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి వ్యతిరేకంగా ఎన్నోసార్లు అలవోక ప్రకటనలు చేసిందీ ఈ దాదానే. అందువల్ల ఈ కాంగ్రెస్ వృద్ధ జంబుకానికి వోటు వేయకుండా ఉండడం తెలంగాణ వాదుల కర్తవ్యం అవుతుంది.
ఇది కేవలం రాజకీయ పార్టీల, నాయకుల, అంకెల గారడీ మాత్రమే కూడ కాదు. శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు తమను ఎన్నుకున్న ప్రజల ప్రతినిధులుగానే రాష్ట్రపతికి వోటు వేస్తున్నారు. అంటే రాష్ట్రపతి ఎన్నికలలో వాళ్లు వేసే వోట్లు ప్రజల అభిమతానికి పరోక్ష రూపమే అవుతాయి. మరి తెలంగాణ సమాజపు అభిమతం ప్రత్యేక రాష్ట్ర సాధన అయినప్పుడు, ఆ అభిమతాన్ని అడ్డుకున్న ప్రణబ్ ముఖర్జీకి, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధికి, యుపిఎ అభ్యర్థికి వోటు వేయడం తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయడమే అవుతుంది. ఈ ప్రజాద్రోహానికి ఒడిగట్టకుండా తమ తమ శాసనసభ్యులను, పార్లమెంటు సభ్యులను అడ్డుకునే, నిలదీసే పోరాటరూపాలను ఎంచుకుని రాష్ట్రపతి ఎన్నిక జరగనున్న రానున్న నాలుగువారాలు సమరశీలమైన ఉద్యమం నిర్వహించవలసిన బాధ్యత తెలంగాణ సమాజం మీద ఉన్నది.
ఎన్ వేణుగోపాల్
జూన్ 16, 2012