సామాజిక సంచలనాలు సాహిత్యానికి ముడిసరుకును అందించడం, సాహిత్యంలో వస్తుశిల్పాల విస్తరణకూ అభివృద్ధికీ దోహదం చేయడం, తిరిగి ఆ సాహిత్యరచనలు సామాజిక సంచలనాలకు ప్రేరణగా నిలవడం, ఈ పరస్పర ప్రభావాల, అన్యోన్య చర్య-ప్రతిచర్యల పరిణామం సామాజిక సాహిత్య చరిత్రలో సాధారణమైన విషయమే. ఈ సాధారణ నిర్ధారణకు ఒక ప్రతిఫలనంగా తెలంగాణలో సాగిన విప్లవోద్యమానికీ, తెలంగాణ నవలకూ మధ్యగల అంతస్సంబంధాన్ని పరిశీలించడం ఈ వ్యాస లక్ష్యం.
తెలంగాణలో తరతరాలుగా ఎన్నో ప్రజా ఉద్యమాలు ఉన్నప్పటికీ విప్లవోద్యమం అనే మాటకు నక్సల్బరీ పంథాలో, నక్సలైటు పార్టీల నాయకత్వంలో సాగిన వివిధ సామాజిక ఉద్యమాల సమాహారం అనే నిర్దిష్టమైన అర్థం చెప్పుకోవాలి. ఇందులో విద్యార్థి, యువజన, రైతాంగ, కార్మిక, మహిళా, దళిత, ఆదివాసి సమస్యల మీద సాగిన వివిధ ఉద్యమాలు, ప్రయత్నాలు, ఆలోచనలు ఉన్నాయి. ఈ అన్ని వర్గాలకు విడివిడిగా సమస్యలు ఉన్నప్పటికీ, ఆ సమస్యల మీద విడివిడి పోరాటాలు జరిగినప్పటికీ, ఆ సమస్యల అంతిమ పరిష్కారం సాయుధ పోరాటం ద్వారా, వ్యవస్థ మార్పు ద్వారా మాత్రమే సాధ్యమవుతుందనే రాజకీయ దృక్పథమే విప్లవోద్యమం. విభిన్న వర్గాల ఉద్యమాలన్నిటికీ నక్సలైటు పార్టీలు ఆ విప్లవోద్యమ దృక్పథాన్ని ఇచ్చాయి.
భారత సామాజిక ఉద్యమాల చరిత్రలో నక్సలైట్ పంథా నక్సల్బరీ అనే గ్రామం నుంచి మొదలయింది. అది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని డార్జిలింగ్ జిల్లాలో, సిలిగురి డివిజన్ లో ఒక చిన్న ఆదివాసి గ్రామం. భారత రాజకీయార్థిక, సామాజిక వ్యవస్థ అసంఖ్యాక పీడిత ప్రజల మీద దోపిడీ, పీడనలను అమలు చేస్తున్నదనీ, ఈ వ్యవస్థను మార్చే విప్లవం తప్ప ప్రజల విముక్తికి మరో మార్గం లేదని, ఆ పనిలో మొదటి మెట్టుగా భూపోరాటాలు సాగాలని 1960ల మధ్య నాటికి భారత కమ్యూనిస్టు ఉద్యమ చర్చలలో భాగంగా డార్జిలింగ్ జిల్లా కార్యకర్తలు, చారు మజుందార్ నాయకత్వాన నిర్ధారణకు వచ్చారు. ఆ ఆలోచనలలో భాగంగానే నక్సల్బరీ గ్రామంలో 1967 మార్చ్ 3న భూస్వాముల అక్రమాధీనంలో ఉన్న భూములలో పంటలను ఆదివాసి రైతుకూలీలు, భూమిలేని నిరుపేదలు, చిన్నరైతులు ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత మే 25న భూస్వాములకు మద్దతుగా వచ్చిన పోలీసులను ప్రతిఘటించారు. ఆ ఘర్షణలో తొమ్మిది మంది ఆదివాసులు – ఏడుగురు స్త్రీలు, ఇద్దరు పిల్లలు – చనిపోయారు. ఇలా భూస్వాములకు, వారికి వత్తాసుగా నిలుస్తున్న రాజ్యానికి, ఆ రాజ్యాన్ని కాపాడుతున్న సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రజలు సాయుధంగా తిరగబడక తప్పదని, ఆ సాయుధ పోరాటం దీర్ఘకాలిక ప్రజాయుద్ధంగా ఉంటుందని ఆలోచనే నక్సల్బరీ పంథాగా ప్రఖ్యాతమయింది. భారత సామాజిక రాజకీయార్థిక వ్యవస్థ అర్ధభూస్వామ్య, అర్ధవలస వ్యవస్థ అని, దాన్ని కూలదోసి ప్రజా ప్రత్యామ్నాయాన్ని స్థాపించడానికి భూస్వామ్య వ్యతిరేక, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం సాగాలని, ఆ పోరాటాన్ని నూతన ప్రజాస్వామిక విప్లవం అంటారని, ఆ పోరాటానికి దున్నేవారికే భూమి నినాదంతో సాగే వ్యవసాయ విప్లవం ఇరుసుగా ఉంటుందని నక్సల్బరీ పంథా చెపుతుంది.
నక్సల్బరీ పంథా విప్లవోద్యమం 1967లో మొదలైతే, అది త్వరలోనే దేశమంతా విస్తరించి, ఎన్నో చర్చల తర్వాత ఒక దేశవ్యాపిత సంఘటిత నిర్మాణంగా 1969 ఏప్రిల్ 22న భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు – లెనినిస్టు) గా ఆవిర్భవించింది. ఆ ఉద్యమం తెలంగాణలో ప్రవేశించడం 1969 నాటికే జరిగింది. నక్సల్బరీ పంథాను తెలంగాణ వెంటనే అందుకోవడానికి కూడ చారిత్రక, రాజకీయ, సామాజిక కారణాలున్నాయి. తెలంగాణలో అంతకుముందరి తరం సాగించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట జ్ఞాపకాలు, ఆ పోరాటాన్ని అర్ధాంతరంగా విరమించిన నాయకత్వ విద్రోహం ప్రజల మనసుల్లో ఇంకా పచ్చిపచ్చిగానే ఉన్నాయి. నిన్న వదిలిన పోరాటం నేడు అందుకొనక తప్పదు అనే ఆలోచనలు సాయుధపోరాటంలో పాల్గొని ప్రస్తుతం నిష్క్రియాపరంగా, తమతమ జీవితాలలోకి వెళ్లిపోయిన గత తరంలోనూ, 1960ల నాటికి ఎదిగివచ్చిన కొత్త కోపోద్రిక్త యువతరంలోనూ విరివిగా ఉన్నాయి. పాత తరం కొనసాగింపుగా దేవులపల్లి వెంకటేశ్వర రావు, చండ్ర పుల్లారెడ్డి, కొండపల్లి సీతారామయ్య, కె జి సత్యమూర్తి వంటి నాయకులు నక్సల్బరీ వైపు చూశారు. వీరిలో మొదటి ఇద్దరూ కాలక్రమంలో నక్సల్బరీ పంథాతో విభేదించినప్పటికీ, మొత్తంగా నక్సల్బరీ అనుకూల వాతావరణం తెలంగాణలో వ్యాపించింది. నక్సల్బరీ పంథా సమర్థకులూ, పాటించేవారూ తెలంగాణలో అన్ని జిల్లాలలోనూ, అన్ని ప్రజారంగాలలోనూ తమ కార్యాచరణ ప్రారంభించారు. ప్రత్యేక తెలంగాణ కోరుతూ 1969లో సాగిన ఉద్యమం విఫలమైనందువల్ల ఆ ఉద్యమకారులు కూడ విప్లవోద్యమం వైపు ప్రయాణించారు. అలా 1969 చివరికల్ల తెలంగాణలో విప్లవోద్యమ నిర్మాణం, విప్లవోద్యమ చర్యలు ప్రారంభమయ్యాయి. అప్పటినుంచి ఎన్ని ఒడిదుడుకులతోనైనా, ఎంత నిర్బంధకాండ అమలయినా, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నా గత నలభై రెండు సంవత్సరాలుగా ఈ విప్లవోద్యమం అవిరామంగా సాగుతూనే ఉంది.
ఈ విప్లవోద్యమం చాల సహజంగానే 1969 మధ్య భాగం నుంచే సాహిత్యం మీద ప్రభావం వేసింది. 1969లోనే వరంగల్ నుంచి వెలువడిన తిరుగబడు కవితా సంకలనం ఈ విప్లవ సాహిత్య తొలి ప్రకంపనలలో ఒకటి. ఈ ప్రభావం అతి త్వరలోనే కథా ప్రక్రియలోకి, ఇతర వచన ప్రక్రియలలోకి కూడ ప్రవహించింది. అలా గడిచిన నాలుగు దశాబ్దాలలో ఈ విప్లవోద్యమాన్ని చిత్రించిన నవలలు తెలంగాణ నుంచి ఇరవైకి పైగానే వచ్చాయి.
ఈ నవలలను ఇతివృత్తాలను బట్టి, రచయితలను బట్టి విశ్లేషించి చూస్తే ఆసక్తికరమైన అంశాలు బయటపడతాయి. వీటిలో ఐదు నవలలు గత చరిత్ర లోని ఘటనల, పరిణామాల ఆధారంతో రాసినవి కాగా, మూడు నవలలు సింగరేణి గనికార్మిక జీవితంపై రాసినవి. డజనుకు పైగా నవలలు రైతాంగ జీవితాన్ని, పోరాటాన్ని చిత్రించినవి. తెలంగాణలో విప్లవ విద్యార్థి ఉద్యమం ఉవ్వెత్తున సాగినప్పటికీ అది కొన్ని నవలల్లో ప్రస్తావనవశాత్తూ చిత్రణ పొందిందే తప్ప పూర్తిగా విద్యార్థి ఉద్యమ నేపథ్యంలో నవల రాలేదు. ఉద్యమం మీద దమనకాండ దాదాపుగా అన్ని నవలల్లోను చిత్రణ పొందింది గాని పూర్తిగా నిర్బంధం వస్తువుగా నవల రాలేదు.
వర్తమాన ఉద్యమాలు ఏవైనా తమ ప్రేరణ కోసం, స్ఫూర్తి కోసం గతంలోకి, చరిత్రలోకి తొంగి చూడడం, తమ ప్రస్తుత పోరాటానికి గత పోరాటంతో నిరంతర సంబంధాల ధారను వెతుక్కోవడం ప్రపంచవ్యాప్తంగా జరిగినదే. అందులో భాగంగానే తెలంగాణ విప్లవోద్యమ నవల కూడ గత కాలపు ఆదివాసి పోరాట యోధుడు కొమురం భీం, సింగరేణి గనికార్మిక పోరాట నాయకుడు శేషగిరిరావు జీవితాల ఇతివృత్తాలను తీసుకుంది. తెలంగాణ పారిశ్రామిక రంగంలో ప్రధానమైనదీ, సమరశీల కార్మికవర్గ పోరాటాలను చూసినదీ గోదావరిలోయలోని నాలుగుజిల్లాలకు వ్యాపించిన సింగరేణి బొగ్గుగనుల వ్యవస్థ. అందువల్ల సహజంగానే బొగ్గుగనుల కార్మిక జీవితం, పోరాటాలు నవలా వస్తువులుగా రూపుదిద్దుకున్నాయి. ఇక విప్లవోద్యమం ప్రధానంగా రైతాంగపోరాటాలమీద కేంద్రీకరించింది గనుక రైతాంగ జీవితం మీద నవలలు రావడంలో ఆశ్చర్యం లేదు.
తెలుగులో, ప్రత్యేకించి తెలంగాణలో నవలా ప్రక్రియ అభివృద్ధి చెందవలసినంతగా చెందలేదు గనుక నవలా రచయితలు తమ పేరు ప్రకటించుకోవడం, నవలారచయితలకు వచ్చే ప్రాధాన్యత వంటి అంశాలకు ప్రాముఖ్యత ఉంటుంది. కాని విప్లవోద్యమ నవలకు ఉండే ప్రత్యేక పరిస్థితి వల్ల ఇరవై నవలల్లో సగానికి పైగా నవలలు కర్తృత్వాన్ని దాచుకొని వెలువడవలసి వచ్చింది. మూడు నవలలు అజ్ఞాత కార్యకర్తలు రాసినందువల్ల వారు రచయితలుగా తమ పేర్లు చెప్పుకోలేకపోయారు. కాగా, ఎనిమిది నవలల రచయితలు నిర్బంధం వల్ల మారు పేర్లతో రాయవలసి వచ్చింది. ఇది తెలంగాణ విప్లవోద్యమ నవల ప్రత్యేకతగా చూడాలి. నవల వంటి ప్రక్రియలో కృషి చేసిన రచయిత పేరు చెప్పుకుని తన నవల ప్రకటించుకునే అవకాశం లేకపోవడం ఒక నిర్దిష్ట స్థల కాల సామాజిక స్థితికి సూచన.
ఈ నవలల గురించి చెప్పుకోవలసిన మరొక అంశం ఇవి తెలంగాణ విప్లవోద్యమంలోని మూడు దశలను చిత్రించాయి, ఆ మూడు దశలకు ప్రతిఫలనంగా నిలిచాయి. వీటిలో కొన్ని ఆ దశ గడిచినాక చాల కాలానికి కూడ వెలువడి ఉండవచ్చు, ఇతివృత్తం ఏదైనా కావచ్చు గాని ఆ ప్రత్యేక దశకు సంబంధించిన ఆలోచనలతో, వాతావరణంతో ఉంటాయి.
తెలంగాణ విప్లవోద్యమంలో తొలిదశ 1969 నుంచి 1975లో ఎమర్జెన్సీ విధింపు దాకా సాగగా, రెండో దశ ఎమర్జెన్సీలో ప్రారంభమై క్రమక్రమంగా ప్రజాఉద్యమాల విస్తృతితో 1980ల మధ్య భాగంలోని నిర్బంధం దాకా, 1992 పార్టీ మీద, ప్రజాసంఘాల మీద నిషేధం దాకా సాగింది. ఇక మూడో దశ నిషేధం తర్వాత, ప్రపంచీకరణ తర్వాత ఇప్పటిదాకా సాగుతున్నది. విప్లవోద్యమానికి సంబంధించినంతవరకు ఈ మూడు దశలకు ప్రత్యేకమైన, నిర్దిష్టమైన పోరాటరూపాలు, వ్యూహాలు, ఆయారంగాలలో పనితీరు ఉన్నాయి. ఇవి ప్రత్యక్షంగా, ఉన్నది ఉన్నట్టుగా కాకపోయినా పరోక్షంగా, ఏదో ఒక మేరకు నవలలలో చిత్రణ పొందాయి.
ఆవిధంగా చెరబండరాజు రాసిన మాపల్లె (1974/78), ప్రస్థానం (1981), నిప్పురాళ్లు (1983), దారిపొడుగునా…(1985) తొలిదశ విప్లవోద్యమానికి చెందినవిగా, అల్లం రాజయ్య రాసిన కొలిమంటుకున్నది (1974-79/79), ఊరు (1982), అగ్నికణం (1983), కొమురం భీం (1983 – సహ రచయిత సాహు), వసంతగీతం (1990), తుమ్మేటి రఘోత్తమరెడ్డి (పవన్ కుమార్) రాసిన నల్లవజ్రం (1989), సాధన రాసిన రాగో (1993), సరిహద్దు (1993), కౌముది రాసిన తెలంగాణ పల్లె (1996) రెండవ దశకు చెందినవిగా, పి. చంద్ రాసిన శేషగిరి (2001), కె. రమాదేవి రాసిన నెత్తుటి ధార (2005), ఉదయగిరి రాసిన విప్లవాగ్ని (2009) రెండో దశకూ మూడో దశకూ మధ్య సాగినవిగా చెప్పవచ్చు. ఇక ఈ వర్గీకరణలోకి లొంగకుండా స్థూలంగా విప్లవోద్యమ నవలలుగా చెప్పగలిగినవి పులుగు శ్రీనివాస్ రాసిన అన్నలు (1999), అడవితల్లి (1999), వసంతరావు దేశపాండే రాసిన అడవి (1996), జ్వాలాముఖి రాసిన వేలాడిన మందారం (1979).
ఇవికాక ప్రస్తావనవశాత్తూ విప్లవోద్యమం గురించి చర్చించిన నవలలు కూడ మరికొన్ని ఉండవచ్చు. నవీన్ రాసిన చీకటిరోజులు, రక్తకాసారం నవలలలో కూడ విప్లవోద్యమ నేపథ్యం ఉంది. ఐతే చీకటిరోజులు విప్లవోద్యమం కన్న ఎక్కువగా ఒక ఉద్యమ సానుభూతిపరుడు ఎమర్జెన్సీలో ఎదుర్కోవలసి వచ్చిన నిర్బంధాన్ని చిత్రించింది. కాగా రక్తకాసారం విప్లవోద్యమాన్ని వ్యతిరేకించడానికి, అది హింసాపూరితమైనదని చెప్పడానికి ఉద్దేశించినది.
అలాగే ఈ నవలలు విప్లవోద్యమంలో భాగమైన మూడు పాయలను చిత్రిస్తాయి. విప్లవోద్యమానికి సహజంగానే మూడు కోణాలు ఉన్నాయి. అవి, ఒకటి ఏ ప్రజాజీవితంలో సమస్యలు ఉన్నాయని గుర్తించి, వాటిని మార్చాలని, మార్చవచ్చునని, మార్చడానికి పోరాడాలని చెప్పే మౌలికమైన ప్రజాజీవిత చిత్రణ. ఆ ప్రజాజీవితాన్ని విప్లవోద్యమం ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తుంది. సాహిత్య రూపాలు కూడ ఆ ప్రజాజీవిత చిత్రణ చేయకతప్పదు. అలాగే ఒకసారి పోరాడాలని నిర్ణయించుకున్నతర్వాత ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులను బట్టి దేశ కాల పాత్ర బద్ధమైన పోరాట వ్యూహాలను రూపొందించి అమలు చేయడం విప్లవోద్యమం చేస్తుంది. ఆ పోరాట గమనాన్ని చిత్రించడం సాహిత్య రూపాలు చేస్తాయి. ఈ క్రమంలో పోరాట శ్రేణులకు, ప్రజలకు ఎప్పటికప్పుడు ప్రేరణ ఇవ్వడానికి, వారు ఒంటరులు కాదని చెప్పడానికి విప్లవోద్యమం చరిత్ర నుంచీ, ఇతర సమాజాల అనుభవాల నుంచీ ప్రేరణలను అందించడానికి ప్రయత్నిస్తుంది. ఆ చారిత్రక ప్రేరణకు కళారూపం ఇవ్వడానికి సాహిత్యకారులు ప్రయత్నిస్తారు. తెలంగాణ విప్లవోద్యమ నవలలో కూడ ఈ మూడు అంశాలూ కనబడతాయి.
ఈ స్థూలమైన సర్వేక్షణ తర్వాత తెలంగాణ విప్లవోద్యమ నవల గురించి చేయదగిన నిర్ధారణలు:
- ఈ నవలలన్నీ సమకాలీనంగా సాగుతున్న సామాజిక సంచలనాలను గాని, ఆ సంచలనాల నేపథ్యంలో గత చరిత్రను గాని విశ్వసనీయంగా చిత్రించాయి.
- తెలంగాణ విప్లవోద్యమం మీద అమలయిన రాజ్య బీభత్సం వల్ల నవలా రచయితలు తమ కర్తృత్వాన్ని బహిరంగంగా చెప్పుకోలేని స్థితి ఉంది.
- స్వయంగా ఉద్యమంలో, అజ్ఞాత జీవితంలో ఉన్న కార్యకర్తలే నవలా రచయితలుగా మారిన అపూర్వ సందర్భం తెలంగాణ విప్లవోద్యమ నవలకు ఉంది.
- విభిన్న జీవన రంగాలలో, పార్శ్వాలలో అన్నిటినీ పట్టుకోవడంలో తెలంగాణ విప్లవోద్యమ నవల సంపూర్ణ విజయం సాధించలేదు.
- సంపూర్ణమైన, సమగ్రమైన తెలంగాణ విప్లవోద్యమ నవల ఇంకా రావలసే ఉన్నది.
అనుబంధం:
తెలంగాణ నుంచి వచ్చిన విప్లవోద్యమ నవలల జాబితా
సం. | నవల పేరు | రచయిత | వెలువడిన సంవత్సరం |
1. | మాపల్లె | చెరబండరాజు | 1978 ( రచన 1974) |
2. | వేలాడిన మందారం | జ్వాలాముఖి | 1979 |
3. | కొలిమంటుకున్నది | అల్లం రాజయ్య | 1979 |
4. | ప్రస్థానం | చెరబండరాజు | 1981 |
5. | ఊరు | అల్లం రాజయ్య | 1982 |
6. | అగ్నికణం | అల్లం రాజయ్య | 1983 |
7. | కొమురం భీం | అల్లం రాజయ్య, సాహు | 1983 |
8. | నిప్పురాళ్లు | చెరబండరాజు | 1983 |
9. | దారిపొడుగునా… | చెరబండరాజు | 1985 |
10. | నల్లవజ్రం | పవన్ కుమార్ | 1989 |
11 | వసంతగీతం | పులి ఆనందమోహన్ | 1990 |
12 | రాగో | సాధన | 1993 |
13 | సరిహద్దు | సాధన | 1993 |
14 | అడవి | వసంతరావు దేశపాండే | 1996 |
15. | తెలంగాణ పల్లె | కౌముది | 1996 |
16. | అన్నలు | పులుగు శ్రీనివాస్ | 1999 |
17. | అడవితల్లి | పులుగు శ్రీనివాస్ | 1999 |
18. | శేషగిరి | పి. చంద్ | 2001 |
19. | నెత్తుటిధార | కె. రమాదేవి | 2005 |
20. | విప్లవాగ్ని | ఉదయగిరి | 2009 |
(కాకతీయ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల, వరంగల్ లో ‘తెలంగాణ తెలుగు నవల’ అంశంపై నిర్వహించిన యుజిసి జాతీయ సదస్సులో 2011 ఫిబ్రవరి 19న సమర్పించిన పత్రం)
Novel kadanukuntaa gaanee
VANAPUTHRIKA
prasthavana kanipincha ledu sir..
Thank you. Vanaja raasina Adaviputrika navala kaadu. Andulo kalpana, ooha levu, adi vaastava jeevitakatha. Narsakka jeevitaanni, aame party perutone aame sahacharudu Patel Sudhakar Reddy raasaadu. Ee vyaasam kevalam navalaa prakriyaku sambandhinchinadi maatrame kanuka aa prastaavana raaledu.
thank you sir