ఆలోచనల గూటికి పుల్లా పుడకా

వీక్షణం జూలై2012 సంచికకోసం

సమాజంలోనూ, పుస్తకాలలోనూ, పత్రికలలోనూ, ఇతర ప్రచార సాధనాలలోనూ ఎన్నెన్నో తెలుసుకోవలసిన, ఆలోచించవలసిన విషయాలు ఉన్నప్పటికీ, వెలువడుతున్నప్పటికీ ప్రత్యేకంగా ఎత్తిచూపకపోవడం వల్ల వెలుగులోకి రాకుండా, ఆలోచనాపరుల దృష్టికి రాకుండా పోతున్నాయి. అటువంటి తెలుసుకోవలసిన విషయాలను మా దృష్టికి వచ్చినంతవరకు సేకరించి అందించడం ఈ శీర్షిక లక్ష్యం. ప్రజల అవగాహనల గూడును సుస్థిరంగా నిర్మించడానికే ఈ పుల్లా పుడకా. 

***

నిరుద్యోగం

ప్రపంచవ్యాప్తంగా యువతరంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతున్నదని, గతంలో ఎన్నడూ లేని స్థాయికి చేరుతున్నదని ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పనిచేసే అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐ ఎల్ ఒ) తాజా నివేదిక ‘గ్లోబల్ ఎంప్లాయిమెంట్ ట్రెండ్స్ ఫర్ యూత్ 2012’ ప్రకటించింది. ప్రపంచ దేశాలన్నిటిలో కలిపి 2012లో ఏడున్నర కోట్ల మంది యువకులు నిరుద్యోగులుగా ఉన్నారని, 15 నుంచి 24 ఏళ్ల వయసు ఉన్న, పనిచేయగల యువతరంలో 12.4 శాతం మందికి పని లేదని ఆ 55 పేజీల నివేదిక తెలియజేసింది. ఈ నిరుద్యోగం ఇంకా పెరిగి 18 శాతానికి చేరవచ్చునని, 2016 దాకా ఈ నిరుద్యోగం పెరుగుదల తగ్గుముఖం పట్టే అవకాశాలు కనబడడం లేదని కూడ ఆ సంస్థ అంది. 2007 గణాంకాలతో పోలిస్తే 40 లక్షల మంది నిరుద్యోగులు పెరిగారని, నిజానికి మరొక 64 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాన్వేషణ మానుకుని, చదువులు కొనసాగించాలని నిర్ణయించుకున్నారని, ఆ అంకెలు కూడ కలిస్తే నిరుద్యోగ సమస్య మరింత జటిలమవుతుందని ఐఎల్ఒ నివేదిక చెప్పింది. ఈ నివేదికకు, గణాంకాలకు ఒక వయో బృందాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం, ఆయాదేశాల ప్రభుత్వాలు తప్పుడు గణాంకాలు సమర్పించడం, ఉద్యోగం, నిరుద్యోగం అనే మాటల నిర్వచనాలు వంటి ఎన్నో పరిమితులున్నాయి. అందువల్ల ఈ గణాంకాలకు కనీసం రెండు మూడు రెట్ల నిరుద్యోగం వాస్తవికంగా ఉందని ఊహించవచ్చు. తాను ప్రకటించిన నిరుద్యోగపు అంకెలే ప్రమాదకర స్థితిలో ఉన్నాయని, ఆ స్థాయి నిరుద్యోగం వల్ల సామాజిక భద్రతకు భంగం వాటిల్లుతుందని ఐఎల్ఒ హెచ్చరించిందంటే, వాస్తవ స్థితి మరెంత తీవ్రమైనదో అంచనా వేయవచ్చు. భారత యువతలో నిరుద్యోగం గురించి ఈ నివేదిక ప్రత్యేకంగా వివరాలు ఇవ్వలేదు. కాని మొత్తంగా భారతదేశంలో నిరుద్యోగం గురించి కచ్చితమైన గణాంకాలు దొరకవని అర్థశాస్త్రవేత్తలు అంటారు. భారతదేశంలో నిరుద్యోగం అదృశ్యంగా ఉంటుందని, కోట్లాది మంది నిరుద్యోగులు వ్యవసాయ రంగంలో సగం పనితోనో, పని లేకుండానో, సేవారంగంలో అరకొర పనులు చేస్తూనో పొట్టపోసుకుంటూ పనిలో ఉన్నట్టు నమోదవుతారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, ఉద్యోగ మంత్రిత్వ శాఖ 2009 నుంచి జరుపుతున్న త్రైమాసిక ఉద్యోగ, నిరుద్యోగ సర్వే ప్రకారం దేశంలో నిరుద్యోగ రేటు 9.4 శాతం అని తెలుస్తోంది గాని ఇది ఎంత విశ్వసనీయమైనదో చెప్పలేం.

పేదరికం అంచనాలు

ఆరు దశాబ్దాలుగా రాజకీయార్థిక వ్యవస్థను నిర్వహిస్తున్న పాలకులకు ఈ దేశంలో అత్యంత ప్రధాన సమస్య అయిన పేదరికం అంటే ఏమిటో, పేదరికం అనుభవిస్తున్న జనాభా ఎంతో కనిపెట్టడం కూడ సాధ్యం కాలేదు. ఇంతకాలం అధికారంలో ఉండి, డజన్లకొద్దీ పేదరికం నిర్మూలన, తగ్గింపు కార్యక్రమాలు అమలు చేసి, లక్షల కోట్ల రూపాయల నిధులు వెచ్చించి ఏం సాధించారు అని ఎవరయినా అడిగితే జవాబు చెప్పడానికి ఎప్పటికప్పుడు పేదరికం నిర్వచనాలు మార్చుకుంటూ వచ్చారు. దారిద్ర్యరేఖ నిర్వచనాన్ని మారుస్తూ, దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న జనాభా తగ్గిపోతున్నదని బుకాయిస్తూ వచ్చారు. ప్రణాళికా సంఘం తాజాగా మార్చ్ లో విడుదల చేసిన గణాంకాల ప్రకారం పట్టణ ప్రాంతాలలో రోజుకు రు. 28.65, గ్రామీణ ప్రాంతాలలో రోజుకు రు. 22.42 ఖర్చు పెట్టగలిగిన వారందరూ దారిద్ర్యరేఖకు ఎగువన ఉన్నట్టేనన్నారు. అంటే పేదలు కారని ప్రకటించారు. ఈ అంచనాల ప్రకారం 2009-10లో దేశవ్యాప్తంగా పట్టణ పేదరికం 20.9 శాతం అని, గ్రామీణ పేదరికం 33.8 శాతం అని, దేశంలో మొత్తం పేదరికం 29.8 శాతం మాత్రమేనని ప్రకటించారు. యుపిఎ పాలన మొదలయిన సంవత్సరం, 2004-05లో పట్టణ పేదరికం 25.5 శాతం, గ్రామీణ పేదరికం 42 శాతం, మొత్తం పేదరికం 37.2 శాతం ఉండేదని, ఐదు సంవత్సరాలలో పేదరికాన్ని గణనీయంగా తగ్గించామని ప్రగల్భాలు పలికారు. దారిద్ర్యరేఖను ఇలా కిందికి లాగుతూపోతే పేదరికం తగ్గిపోయినట్టు కనబడుతుందని పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. ఆ విమర్శల నేపథ్యంలో ఇటీవల రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ సి రంగరాజన్ నేతృత్వంలో పేదరికం అంచనాల కోసం మరొక కమిటీ వేశారు. ఈ పని కోసం గత ఆరు దశాబ్దాలలో పదో పదిహేనో కమిటీలు, అధ్యయన బృందాలు ఏర్పాటయ్యాయి. ఇది మరొకటి. పైగా ప్రపంచీకరణను సామ్రాజ్యవాదులకంటె ఎక్కువగా కోరుకునే రంగరాజన్ కచ్చితంగా ప్రపంచీకరణ వల్ల పేదరికం తగ్గిపోయిందని నివేదిక ఇప్పటికే రాసి ఉంటాడు. ఆయన ఆ నివేదికను తొమ్మిది నెలల తర్వాత కేంద్ర ప్రభుత్వానికి, ప్రణాళికా సంఘానికి సమర్పించవలసి ఉంటుంది. సరిగ్గా ఈ పేదరిక కమిటీని నియమించిన పది రోజులకే మహాఘనత వహించిన మాంటెక్ సింగ్ అహ్లువాలియా నాయకత్వంలోని ప్రణాళికా సంఘం కార్యాలయంలో రెండు మరుగుదొడ్ల మరమ్మత్తుకు అక్షరాలా రు. 35 లక్షలు ఖర్చు పెట్టారని బయటపడింది. దేశంలో పేదరికం లేదని తాము చెపుతున్న మాటను వారు అలా మరుగుదొడ్ల మీద రు. 35 లక్షలు ఖర్చుపెట్టి నిరూపించారన్నమాట. కాగా దాదాపు 1200 మంది పనిచేసే ఈ ప్రణాళికా సంఘపు భవనంలో కేవలం 60 మందికి మాత్రమే ఈ మరుగుదొడ్లకు వెళ్లే అనుమతి ఉంది. ఆ అరవై మంది మాత్రమే ఎలక్ట్రానిక్ ఉపకరణాల ద్వారా ఆ మరుగుదొడ్లకు వెళ్లగలరు. చుట్టూరా భయానకమైన పేదరికం మధ్య బ్రిటిష్ వలసవాదులు ఇటువంటి విలాసాలనే తమకోసం ఏర్పాటు చేసుకుని, తమ మరుగుదొడ్ల మీద ‘తెల్లవారికి, కుక్కలకు మాత్రమే’ అని రాయించేవారు. ఇప్పుడు ఆ బోర్డులు మాత్రమే లేవు.

సిఇవోల జీతాలు, శతకోటీశ్వరుల ఆస్తులు

ఒకవైపు నిరుద్యోగం, పేదరికం స్థితి అలా ఉండగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బిజినెస్ ప్రాసెస్ ఔట్ సోర్సింగ్ (బిపిఒ) రంగంలో బహుళజాతి కంపెనీల, దేశంలోని బడా కంపెనీల ఉన్నతోద్యోగుల జీతభత్యాలు అసహ్యకరంగా పెరిగిపోతున్నాయి. ముఖ్య కార్య నిర్వహణాధికారి (చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ – సిఇఒ) అనే పదవి కార్పొరేట్ సంస్థలలో అత్యున్నతమైనది, కీలకమైనది. ఆ పదవిలో ఉండేవారికి తమ కంపెనీ ఏ సరుకులను తయారు చేస్తున్నదో, సేవలను అందిస్తున్నదో తెలియనక్కరలేదు. తన కింద పనిచేసే వందలాది, వేలాది సిబ్బంది తయారు చేసే సరుకులను, సేవలను అమ్మడం వస్తే చాలు. దేన్నయినా వ్యాపారం చేయగల సామర్థ్యం ఉంటే చాలు. వ్యాపార నిర్వహణ తెలిస్తే చాలు, వ్యాపార దక్షత, అంటే పోటీదారులను అణగదొక్కడం, సామదానభేదదండోపాయాలు ఉపయోగించి వ్యాపారం వృద్ధి చేయడం వస్తే చాలు. ఆ సిఇఒల జీతభత్యాల గురించి ది ఎకనమిక్ టైమ్స్ ఇటీవల ఒక నివేదిక ప్రచురించింది. దాని ప్రకారం జెన్ పాక్ట్ సిఇఒ ఎన్ వి టైగర్ త్యాగరాజన్ వార్షిక జీతం రు. 49 కోట్లు, ఇ ఎక్స్ ఎల్ సర్వీస్ సిఇఒ రోహిత్ కపూర్ జీతం రు. 14.3 కోట్లు, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సిఇఒ చంద్రశేఖరన్ జీతం రు. 8 కోట్లు, ఎచ్ సి ఎల్ టెక్నాలజీస్ సిఇఒ వినీత్ నాయర్ జీతం రు. 7.6 కోట్లు. ఏ పనికి, ఎంత చెమట ఓడిస్తే అంత జీతం ముడుతోంది? అయినా జీవితాంతం కష్టపడినా ఈ జీతాలలో లక్షో వంతు కూడ దక్కని కోట్లాది ప్రజల  దుర్భర దారిద్ర్య సముద్రంలో ఈ అంగరంగ వైభోగాల ద్వీపాలు ఎంతకాలం మనగలుగుతాయి? మరొకపక్క అంతర్జాతీయ వాణిజ్య పత్రిక ఫోర్బిస్ ప్రతి సంవత్సరం ప్రకటించే అగ్రశ్రేణి సంపన్నుల డాలర్ శత కోటీశ్వరుల జాబితాలో ఈ సారి 1226 మంది ఉండగా అందులో 48 మంది భారతీయులు ఉన్నారు. ఆ 48 మంది ఆస్తుల విలువ 194.6 బిలియన్ డాలర్లు (అంటే పది లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల పైన). ఇది దేశ జాతీయోత్పత్తిలో దాదాపు తొమ్మిది శాతం. దేశ సంపదలో పది శాతం యాభై మంది దగ్గర, మరొక నలభై యాభై శాతం మరికొన్ని వందల మంది దగ్గర ఉండి, వంద కోట్ల జనానికి ఇరవై శాతం కూడ దక్కని చోట సామాజిక భద్రతకు అర్థం ఏమిటి?

భారత్ లో అమెరికా సైనిక జోక్యం

భారతదేశంలో తమ సైనిక జోక్యం ఉన్నదని, తీవ్రవాద వ్యతిరేక చర్యలలో తాము భారత ప్రభుత్వానికి సహాయం చేసున్నామని స్వయంగా అమెరికా అత్యున్నత సైనికాధికారి అన్నాడు. దక్షిణాసియాలో భారత్ తో సహా ఐదు దేశాలలో అమెరికా ప్రత్యేక బలగాలు ఉన్నాయని ఒక అమెరికన్ కాంగ్రెస్ విచారణలో పసిఫిక్ కమాండర్ అడ్మిరల్ రాబర్ట్ విల్లార్డ్ అన్నాడు. అలా బైటికి చెప్పడం పొరపాటు అని గ్రహించి, నాలిక కరుచుకుని, తానలా అనలేదని, పత్రికలు పొరపాటుగా రాశాయని వివరణ ఇచ్చుకున్నాడు.

సిపిఎం రాజకీయాలు

దేశంలో తానే నిజమైన, పెద్ద వామపక్ష పార్టీనని చెప్పుకునే భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) లో ఇటీవలి అంతర్గత సమస్యలు దాని నిర్మాణ, రాజకీయ, సైద్ధాంతిక బలహీనతలకు అద్దం పడుతున్నాయి. ఈ నిర్మాణ, రాజకీయ, సైద్ధాంతిక బలహీనతలు ఆ పార్టీ ప్రజాసంఘాల సభ్యులనుంచో, పార్టీలోని సాధారణ శ్రేణులనుంచో కాక అగ్రనాయకత్వం నుంచీ, పార్టీ అధికార ప్రతినిధి వంటి అగ్రశ్రేణి మేధావి నుంచీ రావడం గమనార్హం.

ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర ప్రొఫెసర్ గా పనిచేసిన ప్రభాత్ పట్నాయక్ నాలుగు దశాబ్దాలుగా సిపిఎం మేధావిగా సుప్రసిద్ధుడు. ఆయన ఇటీవల కేరళలోని కాలికట్ లో ఒక స్మారకోపన్యాసం ఇవ్వవలసి ఉండింది. కొన్ని నెలల కింద సిపిఎం కార్యకర్తలు అక్కడ ఒక మాజీ సిపిఎం నాయకుడిని హత్య చేశారు. ఆ హత్య విషయం ప్రస్తావిసూ, అటువంటి “హంతక పార్టీ” సదస్సుకు రావడం న్యాయమేనా అని పట్నాయక్ కు కొట్టాయం మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో సామాజికశాస్త్రవేత్త కె టి రాంమోహన్ ఒక బహిరంగలేఖ రాశారు. దానికి జవాబుగా పట్నాయక్ “ఇవాళ దేశంలో కమ్యూనిజం రెండు సవాళ్లను ఎదుర్కొంటోంది. ఒకటి బూర్జువా ఉదారవాదానిది పైచేయి కావడం, రెండు భూస్వామిక స్టాలినిజానికి బలి అయిపోవడం… ప్రత్యామ్నాయంగా స్టాలిన్ ను తొలగించిన (డిస్టాలినైజ్డ్) మార్క్సిజాన్ని ఆచరించవలసి ఉంది” అని రాశారు. ఈ వివాదం మీద హిందూ దినపత్రిక అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ “కేరళ సమాజం మౌలికంగా భూస్వామ్య సమాజం. పార్టీలోని ధోరణులు సమాజంలోని ధోరణులకు ప్రతిఫలనంగానే ఉంటాయి, వేరుగా ఉండవు” అన్నారు. స్టాలినిజం అనే నిందాపూర్వక మాటను, దేశంలో, అందులోనూ కేరళలో భూస్వామ్యం ఉందని ఒప్పుకోని సిపిఎం ఏమంటుందో చూడాలి.

ఆ వివాదం సమసిపోకముందే ఆ పార్టీ కేంద్రస్థాయిలో ఏర్పాటు చేసిన పరిశోధనా కేంద్రానికి కన్వీనర్, పార్టీలో జూనియర్ కరత్ గా పేరు తెచ్చుకున్న మేధావి, మావోయిజం – ఎ క్రిటిక్ ఫ్రం ది లెఫ్ట్ పుస్తకం సంపాదకుడు ప్రసేన్ జిత్ బోస్ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్ ముఖర్జీని సమర్థించడాన్ని తప్పు పడుతూ, ఆ చర్య పార్టీ కార్యక్రమాన్ని ఎలా ఉల్లంఘిస్తున్నదో చెపుతూ సుదీర్ఘ బహిరంగ లేఖ రాశారు. అందులో పశ్చిమ బెంగాల్ లో బలవంతపు భూసేకరణలు, నందిగ్రాంలో పోలీసు కాల్పులు వంటి పొరపాట్లను కూడ ప్రస్తావించారు. పార్టీలో తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ ఆయన లేవనెత్తిన సమస్యలకు జవాబు ఇవ్వకుండా రాజీనామాను తిరస్కరిస్తూ, ఆయనను బహిష్కరించింది.

ఆ తర్వాత రెండురోజులకు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్ తాము ప్రణబ్ ముఖర్జీని ఎందుకు సమర్థిస్తున్నామో వివరిస్తూ ఒక వ్యాసం రశారు. అందులో ‘కనీసం సిపిఐ, ఆర్ ఎస్ పి వంటి వామపక్ష పార్టీల లాగ రాష్ట్రపతి ఎన్నికలో వోటు వేయకుండా ఉండే నిర్ణయమైనా తీసుకోవచ్చుగదా’ అని ప్రసేన్ జిత్ బోస్ అడిగిన ప్రశ్నకు జవాబుగా ‘మమతా బెనర్జీ ఏ అభ్యర్థికీ వోటు వేయవద్దని నిర్ణయం తీసుకున్నారు గనుక, అటువంటి నిర్ణయం తీసుకుంటే ఆమెతో కలిసిపోయినట్టు అవుతుంది గనుక, భిన్నమైన నిర్ణయం తీసుకున్నామ’ని కరత్ వివరించారు. బహుశా మమతా బెనర్జీ సూర్యుడు తూర్పున ఉదయిస్తాడని అంటే, ఆమెతో కలిసిపోకుండా ఉండడానికి సిపిఎం సూర్యుడి దిశ మారుస్తుందేమో!

About ఎన్.వేణుగోపాల్ N Venugopal

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues.
This entry was posted in వ్యాసాలు, Veekshanam. Bookmark the permalink.

1 Response to ఆలోచనల గూటికి పుల్లా పుడకా

 1. Ravi says:

  The articles you wrote were insightful and some are fact based.
  But the analysis on the packages of CEOs is biased against the business leaders of the country.
  CEO is the leader whose caliber and foresight decides the future of an organization where thousands work.
  His vision, work, motivation, and planning can make a company be a star performer-as in the case of Apple (which was under the leadership of legendary Steve Jobs) or break it-as in the case of Kodak (which was certainly a leadership failure not anticipate the changing aspirations of people).

  Hence the higher salaries are justified. Its not fair to criticize the methods of meritocracy when we are reaping its benefits in this 21st century.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s